పంచాయితీ! – దినవహి సత్యవతి

ఉత్తరాంధ్ర శివార్లలోని, ఒక గ్రామం అచ్చాపురం. ఆ గ్రామంలోని, పంచాయితీ ప్రధాన కార్యాలయం బయట పెద్ద రచ్చబండపై ఐదుగురిలో నలుగురు పంచాయితీ పెద్దలు అప్పటికే అసీనులై ఉన్నారు. అందరూ సర్పంచ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

ఆ రోజు, దగ్గర గ్రామంలోని శివయ్య అనే వ్యక్తి, భార్య గౌరి తనని ఇంట్లోంచి గెంటి వేసిందని, చేసిన ఫిర్యాదుపై చర్చ, అనంతరం పంచాయితీ తీర్పు జరగనున్నాయి.
గౌరి, తన పిల్లలు జ్యోతి, దీపలను తోడ్కొని, తల్లీ, శ్రేయోభిలాషులతో కలిసి వచ్చింది. శివయ్య తన అన్నా వదినలతో, బంధుబలగంతో వచ్చాడు. ఇరు వర్గాల వారూ ఎదురెదురుగా రచ్చబండ వద్ద కూర్చుని ఉన్నారు. అనాదిగా ఆడవాళ్ళపై మగవాడి దాష్టీకమే చూసి, విని ఉన్నారు అచ్చాపురం జనం. వాళ్ళే కాకుండా ఈ విచిత్రమైన ఫిర్యాదు గురించి, ఆనోట ఈనోటా విని, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో, చుట్టు ప్రక్కల గ్రామాల నుండి కూడా పెద్ద సంఖ్యలో రచ్చబండ వద్ద చేరడంతో, పరిసరమంతా కోలాహలంగా ఉంది.
‘చూడు రత్తమ్మత్తా మొగుణ్ణి ఇంట్లోంచి వెళ్ళగొట్టి నిబ్బరంగా ఎలా నిద్ర పోతోందో నంగనాచి’
‘పిదప కాలం పిదప బుధ్దులూ! ఏదో గుట్టుగా సంసారం చేసుకోక ఇలా రచ్చ చేసుకుంటారా ఎవరైనా?’ ‘అయినా కట్టుకున్న మొగుడ్ని ఇంట్లోంచి తరిమేయడమేమిటీ? ఎక్కడైనా విన్నామా అసలు? అన్నీ భరిస్తూ మనమంతా కాపరాలు చేయడం లేదా వదినా’… ఇలా అక్కడ గుమిగూడిన గ్రామస్థుల నిందా వాక్యాలు, దగ్గర్లోనే చెట్టుకి తల ఆన్చి కళ్ళు మూసుకుని కూర్చున్న గౌరి చెవిని పడుతూనే ఉన్నాయి. అవన్నీ వింటుంటే తనని పంచాయితీ దాకా లాక్కొచ్చిన సంఘటనల వైపు పరుగుతీసింది గౌరి మనసు…
… … …
రమణమ్మ, గౌరి తల్లి, భర్త అకాలమరణంతో పుట్టింటికి, అచ్చాపురం చేరింది. ఆపనీ ఈ పనీ చేసుకుంటూ, ఒక్కగానొక్క కూతురు గౌరిని ఐదో క్లాసు దాకా చదివించింది. ఆపై స్తోమతు లేక, పనీపాటా నేర్పించి, గౌరికి యుక్త వయసు రాగానే, తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం వస్తే, ఖాయ పరుచుకుంది. ఆ కుర్రవాడే శివయ్య. అయితే నిశ్చితార్థం జరిగాక, శివయ్యకి తాగుడు అలవాటు ఉందనీనూ, పరమ బద్ధకస్తుడనీనూ, అన్నా వదినల గారంతో జులాయిగా తయారయ్యాడనీ తెలిసి గుండె గుభేలంది రమణమ్మకి! ఈ సంబంధం తెచ్చిన వాళ్ళని పట్టుకుని నాలుగు దులుపుదామని వెళ్ళిన రమణమ్మ, ‘‘ఏంటీ మామీద లేస్తన్నావు? మొగుడు పోయి బాధలో ఉన్నావు కదా పాపమని సాయం చేస్తే మమ్మల్నే తిడతన్నావే? అయినా మనూళ్ళో తాగని వాడెవడూ? మేమంతా కాపరాలు సెయ్యడం లేదా? నీ మొగుడు మాత్రం తాగేటోడు కాదా?’’ అని వాళ్ళు ఎదురు తననే దబాయించడంతో నిర్ఘాంతపోయింది. ‘‘అదే కదా నా భయం. నా బతుకులానే దాని బతుకూ బుగ్గౌతుందనే. చూస్తూ చూస్తూ అట్టాటి కుర్రాడికి పిల్లనివ్వడమంటే దాని గొంతు కొయ్యడమే కదా?’’ మెల్లగా నసిగింది.
‘‘పిల్లాడా సూట్టానికి బాగున్నడు. ఇక తాగుడంటావా ఏదో కుర్ర వయసు, మనువైతే సరి ఆడే దారికొస్తాడు. అంతా నీ కూతురి సేతిలోనే ఉంది. నిశ్చయమైన సంబంధం వదులుకుంటే, గౌరి బతుకేమౌతుందో ఆలోచించావా?నువ్వా మగ దిక్కు లేనిదానివి. పిల్లా వయసుకొచ్చింది. ఊరికే గొడవ చేసుకోక పిల్ల పెళ్ళి సేసి నీ బరువు దించుకో’’. బంధువుల మాటలు రమణమ్మని ఆలోచింపజేసాయి ‘ఈ చాదస్తపు అచ్చాపురంలో ఇప్పటికీ మగాళ్ళ మాటే చెల్లుతుంది. ఆడదంటే సిన్న సూపు. రాత బాగోక నా తలచెడి మళ్ళీ ఈడకే రావాల్సి వచ్చింది. గట్టిగా ఏదైనా సేద్దామంటే ఈడ నాకెవరూ వత్తాసివ్వరు. ఆళ్ళు సెప్పినట్లు ఈ పల్లె కట్టుబాట్ల ప్రకారం కుదిరిన సంబంధం తప్పిపోతే, పిల్లకి మళ్ళీ సంబంధం కుదురుద్దా? ఆకెల్లి ముల్లు మీద పడ్డా ముల్లొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే నట్టమనీ, ఎటొచ్చి ఎటోయినా నా పిల్లకేనట్టం’ ఇలా పరిపరి విధాల ఆలోచించి ముందుకి వెళ్ళడానికే నిశ్చయించుకుంది రమణమ్మ.
గౌరీ, శివయ్యల పెళ్ళి జరిగిపోయింది. కూతుర్నీ అల్లుడినీ తీసుకుని, మరలి, ఒకప్పుడు భర్తతో కలిసి బ్రతికిన ఊరికి వచ్చేసి, కూతురికి చేదోడు వాదోడుగా ఉంటూ, ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ బ్రతుకు వెళ్ళదీస్తోంది రమణమ్మ. ఇటు పెళ్ళై బాధ్యతలు మీద పడినా శివయ్య ప్రవర్తనలో ఇసుమంతైనా మార్పు రాలేదు. గౌరీ, శివయ్యలకు తొలిచూలు ఆడపిల్ల పుట్టింది. మగపిల్లాడిని కనలేకపోవడం గౌరి తప్పైనట్లు నిందించాడు శివయ్య. అన్నిటికీ గౌరి నుంచి మౌనమే సమాధానమైంది శివయ్యకి.
డ్వాక్రా సంఘంలో చేరి, లోను తీసుకుని కుట్టు మిషన్‌ కొనుక్కుంది. బట్టలు కుట్టడంతో పాటు, ఒక వృధ్ద దంపతుల ఇంట్లో పనికి కుదిరి, సంసారం గడుపుకొస్తోంది గౌరి. తన సిగరెట్లకి, విలాసాలకి డబ్బు అవసరమైనప్పుడల్లా తాపీ పనికి వెళ్ళడం, వచ్చిన కూలీలో పదో పరకో మాత్రమే, కన్నీటి తుడుపుగా, గౌరి చేతిలో పెట్టడం చేస్తుంటాడు శివయ్య. సంపాదించి సంసారం పోషించక పోగా, బడాయి బసవయ్యలా తిరిగే మొగుడిని చూస్తుంటే చిరాకు కలుగుతోంది గౌరికి. చూసీ చూసీ విసుగొచ్చి ఒకరోజు, ‘‘నువ్వు పన్జేసి నెలకింతని సంపాయించకపోతే ఇల్లెట్టా గడుస్తుందయ్యా?’’ అనడిగింది. ‘‘నేను మగాడిని. ఇష్టమైతే పన్లోకెళతా లేదంటే పోను. నీ ఏడుపేదో నువ్వేడు’’ అంటూ పెడసరంగా బదులిచ్చిన మొగుడ్ని చూసి అవాక్కైంది. మగ పిల్లవాడు కావాలంటూ అత్తవారు చేసిన ఒత్తిడికి లొంగి రెండో కాన్పుకి వెళ్ళిన గౌరికి, మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. ఉన్న కష్టాలు చాలనట్లు, కొడుకునివ్వలేదని, శివయ్య నుంచీ, మగ నలుసును కనలేకపోయిందని అత్తవారి నుంచి ఈసడిరపులు ఎక్కువయ్యాయి. అన్నీ భరిస్తూ, ఎదుగుతున్న ఆడ పిల్లల్ని జాగ్రత్త పెంచుకొస్తూ, కష్టపడి చదివించుకొస్తోంది గౌరి. అయితే గత కొన్నాళ్ళుగా, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారనే ఇంగిత జ్ఞానమైనా లేకుండా, శివయ్య ప్రవర్తిస్తున్న తీరు భరించలేక ఎదురు తిరిగింది గౌరి. దాంతో పౌరుషం పొడుచుకొచ్చి, ‘‘మగాణ్ణి నా ఇష్టం వచ్చినట్టుంటాను. నన్నే ఎదిరిస్తావా నీ సంగతి తేలుస్తాను’’ అని బెదిరించి, అప్పటికప్పుడే అచ్చాపురంకి వచ్చి, అన్నా వదినలకి గౌరి పైన లేని పోనివన్నీ కల్పించి చెప్పి, తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టిందని గౌరి పైన పంచాయితీలో ఫిర్యాదు చేసాడు శివయ్య. ఆ ఫిర్యాదుని అనుసరించి, తరువాత కొద్ది రోజులకి, పంచాయితీకి హాజరవ్వాల్సినదిగా గౌరికి నోటిసు వచ్చింది.
… … …
చుట్టు ప్రక్కల కలకలం వినవచ్చి, ఆలోచనలలోంచి తేరుకుని, యాథాలాపంగా శివయ్య వైపు చూసింది గౌరి. భార్య తనవైపు చూడడం గమనించి, ‘ఈ దెబ్బతో నీ పొగరు దిగుతుందిలే’ అన్నట్లుగా మీసం మెలేశాడు శివయ్య. ‘‘ఈ విషయమై ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు, ఏమైనా చెప్పదలుచుకుంటే, గౌరి, శివయ్యలకు మరొక్క అవకాశం ఇస్తున్నాము’’ అన్నారు సర్పంచ్‌. వెంటనే శివయ్య లేచి, ‘‘దీనికి నీతి లేదు. అసలు వాళ్ళు నా పిల్లలే కాదని నా అనుమానం. అదే మాట అడిగానని, నన్ను ఇంట్లోంచి గెంటింది. ఇంక ఎవరూ దాని మాట వినాల్సిన పనే లేదు’’ గట్టిగా అరిచాడు. ఆ మాటలు శూలాల్లా గౌరి గుండెని తూట్లు పొడిచాయి. కూతురు మౌనంగా రోదించడం చూసిన రమణమ్మ హృదయం ద్రవించింది. శివయ్య అభియోగం విని అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. అంతలో ఎవరూ ఊహించని విధంగా గౌరి పెద్ద కూతురు, జ్యోతి దిగ్గున లేచి, ‘‘నాన్నా! ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అమ్మ గురించి? మమ్మల్నెందుకు నీ పిల్లలు కాదంటున్నావు? మేము నీకు అక్కర్లేదా? ’’వెనకనుంచి గౌరి నోరు మూసుకుని కూర్చోమని సైగ చేస్తున్నా, పట్టించుకోకుండా గదమాయించి అడిగింది. ‘‘చూసారా అయ్యా! ఆ గౌరి ఆఖరికి పిల్లలని కూడా నా మీదకి ఉసిగొల్పింది. మీరసలు పిల్ల మాటలు పట్టించుకోవద్దయ్యా’’ పెద్దలతో అరిచి చెప్పాడు శివయ్య.
‘‘ఎవరి మాట వినాలీ ఎవరిది వినకూడదూ అని నువ్వు మాకు చెప్పనవసరం లేదు. మరొక్కసారి ఈ విధంగా మాట్లాడితే నీపై చర్య తీసుకోవలసి వస్తుంది’’ శివయ్యని హెచ్చరించారు పంచాయితీ పెద్దలు. గౌరిని తినేసేలా చూసి రుసరుసలాడుతూ కూర్చున్నాడు శివయ్య. తమ్ముడిని ఆవేశపడద్దని చెప్పి, శివయ్య అన్న లేచి ‘‘అయ్యా మీరొప్పుకుంటే నేను మాట్టాడతాను’’ అన్నాడు. ‘‘సరే! చెప్పు’’ పెద్దలలో ఒకరన్నారు. ‘‘అయ్యా! పని దొరికినప్పుడల్లా పదో పరకో శివయ్య ఇంట్లో ఇస్తానే ఉంటాడు. అయినా ఇన్నేళ్ళూ మాటాడనోడు ఇప్పుడు మీకాడకి వచ్చాడంటేనూ, ఆ పిల్లల్ని తన పిల్లలు కాదంటన్నాడంటేనూ… నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు ఆడు సెప్పేదాన్లో కొంతైనా నిజముంటాదేమో చూడండయ్యా’’ అన్నాడు. పంచాయితీ పెద్దలు ముఖాముఖాలు చూసుకుంటే, కొందరు గ్రామస్థులు అవున్నన్నట్లు తలాడిరచడం చూసిన శివయ్య ముఖం మతాబులా వెలిగింది. భర్త, అత్తింటి వాళ్ళూ తన పైన అన్ని అభాండాలు వేస్తున్నా వింటూ, మౌనంగా చూస్తూ రోదిస్తున్న గౌరిని సర్పంచ్‌ కళ్ళు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
‘‘ఈ విషయమై గౌరి అభిప్రాయం కూడా విన్నాకనే ఒక నిర్ణయానికి రాగలము కనుక గౌరీ! నువ్వు చెప్పు’’ అన్నారు సర్పంచ్‌. తను కూర్చున్న చోటునే, నెమ్మదిగా లేచి నిలబడి, అందరికీ నమస్కరించి, ‘‘నాన్న లేని నన్ను అమ్మ కష్టపడి పెంచి పెద్ద చేసి, పెళ్ళి చేసింది. నా గురించి అమ్మ బాధ పడరాదనే ఇన్నేళ్ళూ అన్నీ భరించాను. కాని ఇప్పుడు…’’ సందేహిస్తూ ఆగిపోయింది. ‘‘చెప్పు గౌరీ వింటున్నాము’’.
‘‘గత కొద్ది కాలం నుంచీ నా మొగుడు, ఈ శివయ్య, మరో ఆడదాన్ని ఇంటికి తెచ్చి నానా రభసా చేస్తున్నాడు. అదేమని అడిగితే కొడుతున్నాడు. కష్టంగా ఉన్నా ఇప్పటిదాకా అన్నీ భరించాను. కానీ ఇప్పుడు నా పిల్లలు పెద్దౌతున్నారు. ఆవేళకి వాళ్ళు నిద్దరోతుంటారు కాబట్టి ఇయ్యేమీ చూడరు. కానీ ఏదో రోజు ఇదంతా వాళ్ళకి తెలుస్తాది. అప్పుడు వాళ్ళ బ్రతుకేమౌతుందనే భయంతో పాటు, ఇది చూసి వాళ్ళూ దారి తప్పితేనో అనే భయం కూడా నన్ను నిద్దరోనియ్యట్లేదు. అందుకే ఆణ్ణి ఇంట్లోంచి తరిమేసాను’’ ఉబికి వస్తున్న దుఃఖంతో ఆపై మాట్లాడలేక ముఖం చేతుల్లో దాచుకుని ఘొల్లుమంది గౌరి. గౌరి చెప్పినది విన్నాక, అప్పటి వరకూ ఇటు ఏక పక్షంగా ఆలోచిస్తున్న అమ్మలక్కలలో, అటు అక్కడున్న గ్రామస్థులలో అలజడి మొదలైంది. ‘‘నిప్పు లేనిదే పొగరాదంటూ ఇందాకా నీ తమ్ముడిని వెనకేసుకొచ్చావుగా ఇప్పుడేమంటావు? ’’శివయ్య అన్నకి చీవాట్లు వేసారు సర్పంచ్‌. తనవైపు కోపంగా చూస్తున్న అన్న చూపులని ఎదుర్కోలేక తల దించుకున్నాడు శివయ్య. ‘‘భర్తని దైవంగా భావించి సంసారం సాగించడం మన దేశపు ఆడవాళ్ళ గొప్పతనం. ఒక స్త్రీ, భార్యగా, కట్టుకున్న వాడు ఎలాంటి వాడైనా, ఏం చేసినా భరించగలదు. అదే స్త్రీ తల్లిగా మాత్రం తన పిల్లలకి ఏమాత్రం కష్టం కలిగినా, వాళ్ళ భవిష్యత్తుకి హాని కలుగుతుందని తెలిసినా చూస్తూ ఊరుకోదు. ఆ కష్టం కలిగించేవాడు వాడు ఎవరైనా, చివరికి కట్టుకున్న వాడైనా సరే, ఒక కవచంలా మారి, వాళ్ళనుంచి తన పిల్లల్ని కాచుకుంటుంది. మీరే విన్నారుగా శివయ్య నిర్వాకం. ఈ విషయమై, మీ అభిప్రాయం కూడా వినాలనుకుంటున్నాను’’ అన్నారు సర్పంచ్‌.
‘‘గౌరికి న్యాయం జరగాలి… గౌరికి న్యాయం జరగాలి’’ ముక్త కంఠంతో నినదించారు గ్రామస్థులు. తదుపరి కొంత సేపు, పంచాయితీ పెద్దలందరూ కలిసి తమలో తాము చర్చలు జరిపారు. రమణమ్మ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. సర్పంచ్‌, గౌరి పిల్లలను కూడా పిలిపించి, వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఆడపిల్లలు చెప్పినదేమంటే… ఒకరోజు రాత్రి దాహం వేసి మంచి నీళ్ళు త్రాగుదామని లేచినప్పుడు, తండ్రితో పాటు వేరెవరో ఆడవాళ్ళు ఉండడం, తల్లి ఏడుస్తూ గొడవ పడడం తాను చూసానని పెద్ద కూతురు జ్యోతి చెప్తే, నాన్న స్నానం చేసి తన ఎదురుకుండానే తువ్వాలూడదీసి బట్టలు కట్టుకుంటాడని, అలా చెయ్యొద్దని చెప్తే అమ్మని కొట్టాడనీ, చిన్నదైన దీప చెప్పింది. పిల్లలు చెప్పినది విని గ్రామ సర్పంచ్‌ కు విపరీతమైన కోపం వచ్చింది. పెద్దల నిర్ణయం వెల్లడిరచే ముందు, కొద్దిసేపూ, ఆ పరిసరాలలో సూది పడినా వినపడేంత నిశ్శబ్దం అలుముకుంది. ‘‘ఇరు పక్షాలు చెప్పినదీ, గౌరి పిల్లలు చెప్పినదీ విని, ఫిర్యాదులోని నిజానిజాలను నిర్థారణ చేసుకున్నాక, పంచాయితీ ఒక నిర్ణయానికి వచ్చింది. అదేమంటే… ఇంట్లో ఆడపిల్లలున్నారని కూడా మరచి, అనుచితంగా ప్రవర్తిస్తున్న శివయ్యతో, ఇకపై కలిసి బ్రతకాలా వద్దా అనే నిర్ణయం గౌరికే వదిలేస్తున్నాము. గౌరి పైన అకారణంగా నింద మోపి ఆమెను రచ్చకీడ్చినందుకు శిక్షగా శివయ్యకి పదివేల రూపాయలు జరిమాన విధిస్తున్నాము. గౌరి, ఆమె పిల్లల పోషణార్థం, న్యాయప్రకారంగా వారికి చెందాల్సిన ఆస్తినంతా వెంటనే ఇవ్వాల్సిందిగా శివయ్యను ఆదేశిస్తున్నాము. గౌరికి న్యాయం జరగాలని భావించిన వారందరినీ అభినందిస్తున్నాను.’’ ధృఢంగా పలికింది సర్పంచ్‌ ఇంద్రాణి స్వరం. పంచాయితీ నిర్ణయం విని చేతులెత్తి నమస్కరించింది గౌరి. రమణమ్మ ఆనందానికి అవధులు లేవు. శివయ్య ముఖంలో కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు.
పంచాయితీ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నట్లుగా, పల్లె ప్రజల హర్షధ్వానాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.