అనువాదం : ప్రభాకర్ మందార
1960ల మధ్య తారకం తన తండ్రి చాటు నుంచి బయటపడ్డారు. తన భార్య విజయభారతి లెక్చరర్‌గా పనిచేసే నిజామాబాద్‌లో న్యాయవాదిగా పేద ప్రజల కేసులను వాదించడం, దళితులపై, గ్రామీణ పేదలపై అత్యాచారాలు జరిగినప్పుడు నిజనిర్ధారణ కమిటీలు నిర్వహించడం వంటి పనులను మొదలుపెట్టారు.
అంబేడ్కర్ యువజన సంఘం ఏర్పాటుకు చేయూతనిచ్చి దాని ద్వారా నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనానికీ, కులపరమైన దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. ఈ పనులన్నింటి వల్లనే ఆయన అత్యవసర పరిస్థితి సమయంలో రెండేళ్లపాటు జైలు నిర్బంధానికి గురికావలసి వచ్చింది. 1978లో విజయ భారతి తెలుగు అకాడమీలో అధికారిగా నియమితులవడంతో వారి మకాం నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు మారింది. విజయ భారతి ఆ తదనంతరం తెలుగు అకాడమీ డైరెక్టర్ అయ్యారు. తారకం ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దానితోపాటు దళితులు, పేదప్రజలు చిత్రహింసలకు, వేధింపులకు, జైలు శిక్షలకు గురైనప్పుడు వందలాది గ్రామాల్లో, పట్టణాల్లో నిజనిర్ధారణ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహించారు. తరువాత కొంతకాలం ప్రభుత్వ ప్లీడర్‌గా కూడా పనిచేశారు. కారంచేడులో జరిగిన దళితుల ఊచకోత సంఘటనకు నిరసనగా 1984లో ఆ ప్రభుత్వ పదవికి రాజినామా చేశారు. అప్పుడు చాలామంది మిత్రులు జడ్జి అయ్యే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నావంటూ ఆయనను విమర్శించారు కూడా.
బొజ్జా తారకం కారంచేడు ఊచకోత సంఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబాల పునరావాసానికీ, వారి కోర్టు కేసుల నిర్వహణకూ, వారు తమకు తాముగా సంఘటితం అయ్యేందుకూ ఎంతో పాటుపడ్డారు. అదే ఆ తదనంతరం దళిత మహాసభ ఏర్పాటుకు దారితీసింది. 1989లో ఆయన బహుజన సమాజ్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ విభాగం ఏర్పాటులో భాగస్వాములయ్యారు. అయితే 1994లో ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడాన్ని నిరసిస్తూ బీఎస్‌పీకి రాజీనామా చేశారు. 1995లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. 2011లో రామ్‌దాస్ అథవాలే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంతో విభేదించి దాని నుంచి కూడా బయటికి వచ్చారు. ఆర్‌పీఐ స్వతంత్ర రాష్ట్ర శాఖలో 2016లో చేరి తను చనిపోయేనాటివరకూ కొనసాగారు. న్యాయస్థానాల లోపలా, బయటా అసమానంగా పోరాడిన యోధుడు ఆయన. చేపట్టడానికి ఎవరూ ముందుకు రాని కేసుల తరపున ఆయన వాదించేవారు. కారంచేడు (1984), చుండూరు (1991), లక్ష్మీపేట (2012) మూడు చోట్లా జరిగిన ఊచకోత కేసుల భారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. ‘ఎన్‌కౌంటర్’ హత్యలు జరిగినప్పుడు తప్పనిసరిగా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తారకం చేసిన పోరాటం ఫలితంగానే వచ్చిందన్న సంగతి కొద్దిమందికే తెలుసు. ఆయన రాసిన ‘పోలీసులు అరెస్టు చేస్తే’ అన్న చిన్న పుస్తకం అతిపెద్ద సంచలనాన్ని సృష్టించింది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఆ పుస్తకం లక్షలాది కాపీలు అమ్ముడయి అసంఖ్యాక యువతీ యువకుల జీవితాలనూ, శరీరాలనూ కాపాడిరది.
పద్మనాభ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో అగ్రశ్రేణి క్రిమినల్ లాయర్. ఆయనను అందరూ పేద ప్రజల న్యాయవాది అనేవారు. చాలా సౌమ్యంగా మాట్లాడేవారు. ఇతర కేసుల విషయంలో తన శక్తియుక్తులను ఎంతగా వినియోగించేవారో పేద ప్రజల కేసుల విషయంలోనూ అలాగే వాదించేవారు. ఆయన ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. బీఎస్‌ఏ స్వామి ఒక గొప్ప స్నేహశీలి, చైతన్యవంతులైన న్యాయవాది. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పాటుపడేవ్యక్తి. ఇలాంటి ఉత్తేజకర స్నేహితుల మధ్య నేను మళ్లీ సొంతంగా ఏదైనా చేయాలనుకోవడంలో ఆశ్యర్యం ఏమీ లేదు. హెచ్‌బీటీ పని పట్ల నాలోని అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు సీకే, సిరిల్ ఇద్దరూ నన్ను ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించుకొమ్మని ప్రోత్సహించారు. నేను వెళ్లిపోతే హెచ్‌బీటీ నిర్వహణ బాధ్యత పూర్తిగా తమ భుజాలపైనే పడుతుందని తెలిసినప్పటికీ వాళ్లు నన్ను ప్రోత్సహించారు.
మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీతో సంబంధం లేకుండా, హింసతో నిమిత్తం లేకుండా ఒక మిలిటెంట్ ఉద్యమాన్ని నిర్మించడం సాధ్యమేనా? ఒక ప్రజా ఉద్యమంలో మానవతనూ, ప్రజాస్వామిక ఆచరణనూ మిళితం చేయడానికి వీలవుతుందా? ఇబ్రహీంపట్నం వెళ్లినప్పుడు నా మనసులో ఒక నిర్దిష్ట కార్యక్రమం వుండేదన్న విషయాన్ని ఒప్పుకోకతప్పదు. గ్రామీణ పేదలకోసం తనకు తానుగా నిలదొక్కుకోగలిగే ఒక బలమైన సంస్థను ఏర్పాటు చేయడం సాధ్యమేనా ప్రయత్నించాలనుకున్నాను. వామపక్షాలకు చెందిన చాలా రైతు సంఘాల్లో, సీపీఐ, సీపీఎంలకు అనుబంధమైన వాటిలో మధ్యతరగతి, సంపన్న రైతులే నాయకత్వ పాత్రను పోషించడం మనం చూశాం. వాళ్ల డిమాండ్లే ఆ సంఘ కార్యక్రమాన్ని నిర్దేశించేవి. వివిధ వ్యవస్థలతో, చట్టం మొదలైన వాటితో, ప్రభుత్వ కార్యాలయాలతో, మీడియాతో సంబంధాలున్న విద్యావంతులైన వ్యక్తులు ఎవరైనా బడుగు జనాలకు సహాయం చేస్తారని నేను అనుకున్నాను. నేను నేర్చుకున్న వాటన్నింటి సారాంశాన్ని జనానికి అందించాలనీ, అందులో తమకు పనికొచ్చేవాటిని వారు ఉపయోగించుకుంటారనీ భావించాను. అదంతా నా గందరగోళపు ఆలోచన. అది సక్రమంగా ఎలా జరుగుతుందనే విషయంలో నాకు స్పష్టతలేదు. వర్గం అన్నదే గ్రామీణ పేదల్లో కీలకమని నేను అనుకున్నాను.
1984 తొలినాళ్లలో ‘సవాలక్ష సందేహాలు: స్త్రీలు`ఆరోగ్యం, సంస్కృతి, రాజకీయాలు’ పుస్తకంపై స్త్రీ శక్తి సంఘటన అనే స్త్రీవాద బృందంతో కలసి పనిచేస్తుండేదాన్ని. ఆ బృందం 1970ల చివర్లో ఏర్పడిరది. అది స్త్రీవాద కార్యశీలత, విద్య ఈ రెండిరటి మీదా దృష్టిని కేంద్రీకరించేది. ‘వియ్ వర్ మేకింగ్ హిస్టరీ’ అనే మార్గదర్శక పుస్తకం స్త్రీ శక్తి సంఘటన నుంచే వెలువడిరది. 1980లలో ఒక తరం స్త్రీలను ఎంతగానో ప్రభావితం చేసిన, ఒక అమెరికన్ ఫెమినిస్ట్ బృందం రూపొందించిన ‘అవర్ బాడీస్, అవర్‌సెల్స్’ అన్న పుస్తకానికి అనుసరణే ‘సవాలక్ష సందేహాలు’. మేం ఆ పుస్తకం మీద పనిచేయడం మొదలుపెట్టినప్పుడు దానిని భారతీయ నేపథ్యంతో, స్త్రీవాద దృక్పథంతో తిరగరాయాలనుకున్నాం. అనేక అధ్యాయాలపై పనిచేసిన ఒక ప్రధాన బృందంలో నేను పాలుపంచుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను ఇతర సమస్యలను పరిశోధించమనీ, వారిని ఇంటర్య్యూ చేయమనీ నాకు చెప్పారు. ఆ పనుల వల్ల క్రమంగా గ్రామాల్లో వుండటం, పనిచేయడం అలవాటవుతుందని నేను ఆశించాను.
అప్పటికే నాకూ, సిరిల్‌కూ ఆంధ్ర ప్రదేశ్‌లోని దళిత సంఘాలతో సాన్నిహిత్యం పెరిగింది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అంతకుముందే బాబూరావు బాగుల్ మరాఠీ కథలను ‘దళిత కథలు’ పేరిట తెలుగులో ప్రచురించింది. ఆ వెంటనే బి. విజయభారతి రాసిన ‘అంబేడ్కర్ జీవిత చరిత్ర’ను ప్రచురించాం. 1982లో హైదరాబాద్‌లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆ పుస్తకాన్ని కత్తి పద్మారావు ఆవిష్కరించారు. అప్పటి నుంచీ నేను దళిత సభలకు హాజరుకావడం మొదలుపెట్టాను.1980ల తొలినాళ్లలో ఆ సభలను అంబేడ్కర్ యువజన సంఘం, షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్వహిస్తుండేవి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేడ్కర్ పుట్టిన రోజు సందర్భంగా లిబర్టీ సర్కిల్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించేవారు. అక్కడ నేను పుస్తకాలను అమ్ముతూ కూర్చుని ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో వినేదాన్ని. ఆ సభలు వామపక్షాల సభల కంటే విభిన్నంగా వుండేవి. మార్క్స్, లెనిన్ లేదా మావో ఫొటోల స్థానంలో అంబేడ్కర్ ఫొటో ఉండేది. ఆ జనసందోహం, వారి మాటలు, వారి నినాదాలు అన్నీ నాకు కొత్తే. వామపక్ష మీటింగుల్లో కనిపించే సవర్ణ జనంతో పోలిస్తే వీళ్లంతా మరీ నల్లనివాళ్లు. అలాగే వీళ్లు తెల్ల రంగు దుస్తులు ధరిస్తే వామపక్షవాదులు అన్ని రంగుల దుస్తులు ధరించేవారు, (వారిలో తెల్ల రంగు దుస్తులు వేసుకునేవాళ్లు చాలా తక్కువ). దళిత ఉపన్యాసకులు తమ ప్రసంగాల్లో పాలక వర్గం గురించీ, పెట్టుబడిదార్ల గురించీ, సామ్రాజ్యవాదం… భూస్వామ్యం… దళారీ బూర్జువాలు అనబడే మూడు మేరు పర్వతాల గురించీ ప్రస్తావించేవారు కాదు. దానికి బదులు ఎక్కువగా తమ వర్గంవారి బతుకుల గురించే వివరించేవారు. నిజానికి వామపక్షాలు ఇలాంటి వారిని మొదటినుంచీ పట్టించుకుని వుండాల్సింది. తమ కులం కారణంగా పట్టణాల్లో తమకు మంచి ఇండ్లు, ఉద్యోగాలు దొరకకుండా ఎలా చేస్తున్నారో, తమను అంటరానివాళ్లుగా ఎలా పరిగణిస్తున్నారో, గ్రామాల్లో తమను ఊరి చివరకు ఎలా తరుముతున్నారో దళిత ఉపన్యాసకులు వివరించేవారు. తమపై జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్పేవారు. దుర్భర దోపిడీ పరిస్థితుల మధ్య తమ పిల్లలు ఎలా పెరుగుతున్నారో అభివర్ణించేవారు.
చిక్కడపల్లిలో మేముండే ఇంటికి బొజ్జా తారకం వాళ్ల ఇల్లు చాలా దగ్గరగా వుండేది. అందువల్ల మేం తరచుగా వాళ్లింటికి
వెళ్తుండేవాళ్లం. అక్కడే నాకు చాలామంది దళితులతో పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా నేను అంబేడ్కర్ రాజకీయాలలో మునిగిపోయాను. విజయభారతి నన్ను అక్కున చేర్చుకున్నారు. వాళ్లు నాకు మరో కుటుంబంలా మారిపోయారు.
సిరిల్‌కు తన న్యాయశాస్త్ర అనుబంధ పనుల మూలంగా పాల్ దివాకర్ పరిచయమయ్యారు. పాల్ దివాకర్, ఆయన భార్య అన్నీ నామాల, వాళ్ల పెద్ద కొడుకు ఆనంద్ (అప్పటికి చిన్నపిల్లవాడు) హైదరాబాద్‌కు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో, ఇబ్రహీంపట్నం తాలూకా లోని జలాల్‌మియా పల్లె అనే గ్రామంలో వుండేవాళ్లు. 1998లో నేషనల్ కాంపేన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ స్థాపన వెనక పాల్ దివాకర్ వున్నారు. వాటర్ డెవలప్‌మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థతో పనిచేసేవారు. ఆయనే నాకు ఇబ్రహీంపట్నంలో ఆశ్రయమిచ్చారు. తమ ఇంట్లో వసతి కల్పించడమే కాక ఆ ప్రాంతంలో తనకున్న విస్తృత సంబంధాలను నాకు పరిచయం చేశారు. ఆ సమయంలో ఆయన చిత్తూరుకు తిరిగి వెళ్లిపోయి అక్కడ సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాలనే ఆలోచనలో వున్నారు.
నేను ఇబ్రహీంపట్నం వచ్చి ‘సవాలక్ష సందేహాలు’ పుస్తకం పనిని మొదలుపెట్టిననాటి నేపథ్యమిది. ఇక్కడే నా జీవితంలో అత్యంత కీలకమైన మార్పు చోటుచేసుకుంటుంది.
8. అడకత్తెరలో పోకచెక్కలా అట్టడుగు జనం
నేను మొట్టమొదటి సారి ఇబ్రహీంపట్నం వెళ్లినప్పుడు నా వయసు ముప్ఫై సంవత్సరాలు. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్‌కు ఆగ్నేయంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో వుంటుంది ఇబ్రహీంపట్నం. స్థానికులు ఆ ఊరును ఈరపట్నం అంటారు. నేను కూడా అలాగే అనేదాన్ని. అక్కడికి వెళ్లేందుకు నేను ఇమ్లిబన్ బస్‌స్టాండ్‌లో బస్సెక్కేదాన్ని. ఇమ్లిబన్ ప్రాంతం చుట్టూ చింత చెట్ల వనం వుండేది కాబట్టి దానికా పేరు వచ్చింది. ఒకప్పుడది నిర్మానుష్యంగా వుండేది. అంతకు ముందు రోడ్డు పక్కనున్న పాత (గౌలిగూడ) బస్‌స్టాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం 2018లో ఒక భారీ ఆధునిక బస్ స్టేషన్‌ను నిర్మించడానికి నేలమట్టం చేసింది. నేను ఎప్పుడూ ఎక్కే బస్సు ఇమ్లిబన్ నుంచి నాగార్జున సాగర్‌కు వెళ్లే రోడ్డుమీదుగా ఐదు కిలోమీటర్లు పయనించి హైదరాబాద్ నగర శివారుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి విజయవాడ జాతీయ రహదారికి దూరంగా ఎగుడుదిగుళ్ల దారిలో సాగుతుంది.
జూన్ నుంచి అక్టోబర్ వరకు రోడ్డుకు ఇరువైపులా జొన్న, ఆముదాల పంటలు కనిపిస్తాయి. చెరువులు, బావులు వున్న చోట అక్కడక్కడా చిలకపచ్చని వరి పొలాలు కనువిందు చేస్తాయి. చాలా ప్రాంతాల్లో సీతాఫలం చెట్లు విస్తారంగా పెరుగుతాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఆ చెట్లు సీతాఫలాలతో నిండిపోయి వుంటాయి. సీతాఫలాలను కొనడానికి వచ్చే బాటసారులతో మీరే చెట్ల నుంచి తెంపుకోండి అంటుంటారు. దారిలో అక్కడక్కడా తుమ్మ, వేప, చింత చెట్లు, ఎక్కడో ఒక చోట మర్రి చెట్లు కనిపిస్తాయి. సంవత్సరం పొడవునా గొర్రెలకాపర్లు తమ గొర్రెల్ని, మేకల్ని మేతకు తీసుకుని వెళ్తుండటం కనిపిస్తుంటుంది. నెత్తిమీద వేసుకునే గొంగళ్లను బట్టి వాళ్లని చాలా దూరం నుంచే గుర్తించవచ్చు. సాధారణంగా ఆ గొంగళ్లు ఎర్ర అంచుతో నల్లని రంగులో వుంటాయి. గొర్రెలకాపర్ల భుజాల మీద ఓ కర్ర, చంకలో చద్దిమూట, నీళ్లు వున్న సంచీ వుంటాయి. దారిన వెళ్లే బాటసారులను వాళ్లు చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. మీరు గనక ఆగితే చప్పున దగ్గరకు వచ్చి మీతో మాటలు కలుపుతారు.
రోడ్డుకు మరింత దిగువన రకరకాల ఆకారాల్లో రకరకాల సైజుల్లో గ్రానైట్ రాళ్లు కనిపిస్తాయి. కదులుతున్న బస్సు కిటికీలోంచి చూస్తున్నప్పుడు పేర్చివున్న ఆ గ్రానైట్ బండలు చిత్రవిచిత్రమైన రూపాల్లో… నిద్రిస్తున్న మనిషి, బిడ్డను ఎత్తుకున్న తల్లి, ట్రేలో పేర్చిన గుడ్లు, కడవను మోస్తున్న స్త్రీ, గర్జిస్తున్న సింహం తల వంటి ఆకారాల్లో వున్నట్టు నాకు అనిపించేది. నేను బస్సులో వెళ్తున్నప్పుడల్లా పేర్చిన ఆ గ్రానైట్ రాళ్లు అంతకు ముందురోజులాటి ఆకారాల్లోనే వున్నాయా లేక వాటి రూపంలో ఏమైనా మార్పు వచ్చిందా అని గమనిస్తుండేదాన్ని. అవి అలనాటి నాగరికతకు చెందిన భారీ మనుషులు ఆడుకుని వదిలేసిపోయిన ఆటవస్తువులు గానీ కాదుకదా! అందులో నాకు నచ్చిన రూపంలో వున్న వాటిపై దృష్టి సారిస్తుండేదాన్ని. ఆ తర్వాత నా ఇల్లే గ్రానైట్ రాళ్లతో నిండిన ఓ ప్రకృతి దృశ్యంగా మారిపోయేది. కోస్తా ఆంధ్రప్రాంతానికి వెళ్లినప్పుడు ఆ రాళ్లే నాకు గుర్తుకొస్తుండేవి. దిల్లీకి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ట్రైన్ హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ సమీపించగానే ఇంటికి తిరిగి వస్తున్నానన్న ఆనందంలో ఆ రాళ్ల రూపాలు మదిలో మెదిలి ఉద్వేగంతో నా కళ్లు చెమరుస్తుండేవి.
ఇబ్రహీంపట్నం గ్రామం లోపలికి వెళ్లే రోడ్ల మీద ఒక్కో సమయంలో ఒక్కో రకం జనాలు కనిపించేవారు. తెల్లవారు జామునైతే కుర్రవాళ్లు తమ గొర్రెల్నీ, మేకల్నీ, పశువులనీ మేపడానికి తీసుకెళ్తూండేవారు. పురుషులు భుజాల మీద నాగళ్లను వేసుకుని, జోడెడ్లతో పొలాలకు వెళ్తూండేవారు. స్త్రీలు నీళ్ల కుండల్ని మోసుకుంటూ నడుస్తుంటే, బాలికలు చంటిపిల్లల్ని చంకనేసుకుని వాళ్లని అనుసరిస్తూ కనిపిస్తారు. కొందరు రైతులు టీషాపుల బయట పలచని చెక్క బెంచీలపై కూర్చుని చాయ్ తాగుతూంటారు. ఆసక్తి వున్న కొంతమంది చెట్ల కింద కూర్చుని రాజకీయాల గురించి చర్చించుకుంటుంటారు. ఇక మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సరికి వీధులు, గ్రామ కూడళ్లు అన్నీ నిర్మానుష్యంగా మారిపోయేవి. అక్కడక్కడా ఎవరో కొందరు తాగుబోతులు మాత్రం తమలో తాము పాటలు పాడుకుంటూ కనిపించేవారు. ఆ తరువాత సాయంత్రం వేళ ఉదయం కనిపించిన దృశ్యాలే మళ్లీ తిరుగు వరుస క్రమంలో కనిపించేవి. కుర్రాళ్లు గొర్రెల్నీ, మేకల్నీ, పశువుల్నీ తోలుకుంటూ ఇళ్లకు తిరిగి వస్తుంటారు. సాయంత్రం వాడకానికి స్త్రీలు మళ్లీ మంచినీళ్ల కుండలతో వెళ్తూంటే, చంటి పిల్లల్ని చంకనేసుకుని బాలికలు వారిని అనుసరిస్తూంటారు. బాగా చీకటిపడిన తర్వాత తాగుబోతులు మెల్లిగా కల్లు దుకాణాల నుంచి ఇళ్లకు బయలుదేరుతారు. కుక్కలు తమ ఇలాకాలోకి కొత్త మనుషులు గానీ, పరాయి వీధి కుక్కలు గానీ అడుగుపెట్టినప్పుడల్లా మొరుగుతుంటాయి.
ఇబ్రహీంపట్నం సామాజిక స్థితిగతులు దక్షిణ తెలంగాణాలోని ఇతర ప్రాంతాలకంటే భిన్నమైనవేం కావు. స్వాతంత్య్రానికి పూర్వం ఈ ప్రదేశమంతా నిజాం నవాబుల ఏలుబడిలో వుండేది. ఆ నవాబుల కింద ఒక పెద్ద భూస్వాముల గుంపు వుండేది. ఇక్కడి భూములన్నీ వాళ్ల గుప్పిట్లోనే వుండేవి. వాళ్లని ‘దొరలు’ అనేవాళ్లు. ఆ దొరలంతా చాలావరకు రెడ్డి కులానికి చెందినవారు. అయితే అక్కడక్కడా కొందరు వెలమ దొరలు కూడా వుండేవారు. బ్రాహ్మణ కుల వ్యవస్థలో రెడ్లనూ, వెలమలనూ కూడా శూద్రులుగానే పరిగణిస్తారు. అయినప్పటికీ చాలాకాలం తెలంగాణా అంతటా రెడ్ల, వెలమల పెత్తనమే కొసాగేది. నిజాం రాజ్యమంతటా ప్రజల్లో తీవ్రమైన ఆర్థిక వ్యత్యాసాలుండేవి. ఒక పక్క హిందూ, ముస్లిం మతాలకు చెందిన నగర సంపన్నులూ, గ్రామీణ ప్రాంత భూస్వాములూ తమ గడీల్లో, భవనాల్లో రాజభోగాలను అనుభవిస్తుంటే… మరో పక్క పేదలు ఆకలి దప్పులతో, రోగాలతో, దుర్భరమైన చాకిరీతో అలమటించిపోతుండేవారు.
1948కి ముందు దొరలు రైతుల నుంచి అధిక కౌలును, నిజాం కోసం భూమి శిస్తును జుట్టుపట్టి మరీ వసూలు చేస్తుండేవారు. వాళ్లకు ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యం కూడా వుండేది. గ్రామాల్లో దొరలు చెప్పిందే చట్టం, వాళ్లు చేసిందే న్యాయం. చేతివృత్తుల కులాలవారి నుంచి, సేవక కులాలైన మాల మాదిగల నుంచి వాళ్లు బలవంతంగా ఉచిత సేవలను పొందేవారు. వారితో వెట్టి చాకిరీ చేయించుకునేవారు. ఇలాంటి పరిస్థితుల మధ్యనే తెలంగాణాలో సాయుధ పోరాటం పెల్లుబికింది. ఆ పోరాటం నిజాం రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాలను ఒక ఊపు ఊపింది. తెలంగాణా రైతాంగ పోరాటం లేదా కమ్యూనిస్టులు పేర్కొంటున్నట్టు తెలంగాణా సాయుధ పోరాటం ఈ రాష్ట్ర ఆధునిక చరిత్రలో ఒక అత్యంత నిర్ణయాత్మకమైన ఘట్టం. ఆనాడు భూ యాజమాన్య హక్కులు పూర్తిగా దోపిడీ పద్ధతిలో వుండేవి. నలభై శాతం భూములు ప్రత్యక్షంగా నిజాం అధీనంలో (సర్ఫ్`ఎ`ఖాస్) లేదా నిజాం సంపన్నులకు ఇచ్చిన జాగీర్ల రూపంలో (ప్రత్యేక యాజమాన్య హక్కులతో) వుంటే మిగిలిన అరవై శాతం భూములు ప్రభుత్వ భూ రెవెన్యూ వ్యవస్థ కింద వుండేవి. వాటికి ఎలాంటి చట్టపరమైన హక్కులూ వుండేవి కావు, వాటిని సాగుచేసుకుంటున్న రైతులను ఆ భూముల్లోంచి వెళ్లగొట్టకుండా పలాంటి భద్రతా వుండేది కాదు. వెట్టి చాకిరీ విధానం వంటి దుర్మార్గమైన దోపిడీ పద్ధతులు నిజాం రాష్ట్ర మంతటా విస్తృతంగా కొనసాగేవి.
మొదటి ప్రపంచ యుద్ధం రైతుల పరిస్థితిని మరింత దారుణంగా దిగజార్చింది. వాళ్ల అప్పుల భారాన్ని విపరీతంగా పెంచింది. 1930లలో బడా భూస్వాములు సామాన్య రైతుల భూముల్ని బలవంతంగానో, తమ బాకీల కిందనో పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నారు. ఆరోజుల్లో కొందరు భూస్వాములవద్ద 30,000 నుంచి లక్ష ఎకరాల వరకు భూములుండేవి. వ్యవసాయయోగ్యమైన భూముల్లో 60 నుంచి 70 శాతం భూములు కేవలం 550 మంది భూస్వాముల గుప్పిట్లోనే వుండేవి. ఈ దశలో హైదరాబాద్ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ‘ఆంధ్ర మహాసభ’ అన్న బ్యానర్ కింద పనిచేయడం ప్రారంభించి అనతికాలంలోనే అపూర్వ విజయాలు సాధించారు. 1940ల తొలినాళ్లనాటికే తెలంగాణా ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని అన్ని గ్రామాలూ కమ్యూనిస్టుల నియంత్రణ కిందకు వచ్చాయి.
గ్రామీణ ప్రాంతాలలోని జాగీర్దార్లకు నిజాం ప్రభుత్వమూ, ముస్లిం సంపన్న వర్గమూ అందించే సహాయ సహకారాలకు ముస్లిం వేర్పాటువాద సంస్థ ఇత్తెహద్`ఉల్`ముస్లిమీన్ మరింత తోడయ్యింది. హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో కలవకుండా స్వతంత్ర రాజ్యంగా కొనసాగేందుకు నిజాం నవాబు లోపాయికారీ మద్దతుతో ఆ సంస్థ పనిచేస్తుండేది. 1946లో తెలంగాణా రైతాంగం కమ్యూనిస్టుల నాయకత్వంలో బహిరంగ తిరుగుబాటును మొదలుపెట్టింది. వారి మీదకు నిజాం తన పోలీసుబలగాలను పంపించాడు. వాటికి రజాకార్లు (నిజాం ప్రైవేటు సైన్యం) వెన్నుదన్నుగా వుండేవారు. భూస్వాములను కూడా వాళ్లే కాపాడేవారు. కమ్యూనిస్టులు ఆ పోలీసు బలగాలకూ, రజాకార్లకూ దీటుగా సొంత సాయుధ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. 1948 కల్లా కమ్యూనిస్టులు నాలుగు వేల గ్రామాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే అదే సంవత్సరం భారతదేశ సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించడం, నిజాం లొంగిపోవడం వల్ల కమ్యూనిస్టులకు భారత ప్రభుత్వంతో ప్రత్యక్ష ఘర్షణ అనివార్యమయింది. చివరికి 1951లో తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని అధికారికంగా విరమించాల్సి వచ్చింది.
అయితే ఆ పోరాటం వేలాది ఎకరాలున్న జాగిర్దార్ల వెన్నెముకను విరిచేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని అధికార వ్యవస్థ మాత్రం చాలావరకు ఎప్పటిలాగే మార్పులేకుండా వుండిపోయింది. నిజాం తన అధికారాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న రైతాంగ పోరాటం కారణంగా కేంద్రం తనకు ఇష్టంలేకపోయినా అరకొర భూసంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చింది. రెడ్డి దొరలంతా ఇతర అన్ని కులాలపై గతంలోలాగే తమ పెత్తనాన్ని కొనసాగించారు. ఈ ప్రాంత రాజకీయాలలో మళ్లీ వాళ్లే కీలక పాత్రను పోషించసాగారు. అయితే అందరు రెడ్లూ దొరలు కాదు. వారిని చాలామంది ‘పటేలా’ అని సంబోధించేవారు. వాళ్లు సాంప్రదాయికంగా నిర్వహించే హోదాల్లోంచి అంటే మాలీ పటేల్ (గ్రామ అధికారి), పోలీస్ పటేల్ లోంచి ఆ పదం వచ్చింది. రెడ్లల్లో కూడా వ్యవసాయ కూలీలుగా పనిచేసే బీదవాళ్లు వేల సంఖ్యలో వున్నారు. అయితే, అలాంటి బీద స్థితిలో వున్న రెడ్లను కూడా జనం పటేలా అని గౌరవప్రదంగా సంబోధించేవారు. పొలం పనుల సమయంలో ఒక మాల కులానికి చెందిన భూయజమాని, రెడ్డి కులానికి చెందిన ఒక వ్యవసాయ కూలీ గుడిసె ముందు నిలబడి ‘పటేలా నా దగ్గర పనికి వస్తవా’ అని అడగడం నేను స్వయంగా విన్నాను. అంటరానితనం, కుల వ్యవస్థ బలంగా వున్న చోట ఒక దళిత వయో వృద్ధుడిని రెడ్డి కులానికి చెందిన చిన్న పిల్లవాడు కూడా అగౌరవంగా సంబోధించేవాడు. అక్కడ ఎల్లమ్మ అనే పేరున్న స్త్రీ ‘ఎల్లి’ గా మారిపోయేది.
ఇబ్రహీంపట్నంలో నా పనిని ప్రారంభించినప్పుడు నాకు అడుగడుగునా కనిపించింది కులమే. గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ఎవరైనా అడిగే మొట్టమొదటి ప్రశ్న ‘మీ పేరేమిటి?’ కాదు, ‘మీది ఏ కులం?’ అని. వాళ్ల మాటల్లో చెప్పాలంటే ‘మీరు ఏమిటోళ్లు?’ అని. వాస్తవానికి అది కులం గురించిన ప్రశ్న మాత్రమే కాదు. ‘కుల వ్యవస్థలో మీ స్థానం ఏమిటి’ (అంటే మీరు అంటరానివాళ్లా, శూద్రులా, అగ్రకులాలకు చెందినవాళా)్ల అనేది తెలుసుకోవాలని. మీ స్థానం తెలుసుకున్న తరువాతనే మిగతా మాటామంతీ మొదలవుతాయి. ఇక్కడ కులాలు లోతుగా పాతుకుపోయి వున్నాయి, పటిష్టమైన కుల సమూహాలు మీకు సంబంధించిన ప్రతిదాన్నీ నిర్దేశిస్తుంటాయి. మీరు ఏం చేయాలి, ఎవరితో కలసి పని చేయాలి, మీ స్నేహితులెవరు, మీ విద్య స్థాయి ఏమిటి, ఎక్కడ నివసిస్తున్నారు, ఎలాంటి ఇంట్లో వుంటున్నారు, ఊళ్లో మీ ఇల్లు ఎక్కడ వుంది, మీ కుటుంబ ఆరోగ్యపరిస్థితి ఏమిటి, ఏం తింటారు, మీ సాంస్కృతిక అభిరుచి, మీకు ఏ పాటలు ఇష్టం, ఒక సమస్యను ఎదుర్కొనేందుకు ఎంత కాలం పడుతుంది, ఏ దేవుణ్ని పూజిస్తారు, ఎప్పుడు చనిపోతారు వంటి వన్నీ ఆ కుల సంఘాలే నియంత్రిస్తుంటాయి.
తెలంగాణాలో శ్రామిక వర్గాలన్నీ ఖచ్చితంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారివే. వారిలో మాల, మాదిగలూ వున్నారు. (మాలలు చెరువుల బాగోగులు చూడడం, శవాలను దహనం చేయడం లేదా బొంద పెట్టడం వంటివాటిపాటు, వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేస్తుంటారు. ఇక మాదిగలు చెప్పులు కుడతారు, జీతగాళ్లుగా, పొలాల్లో కూలీలుగా, రెడ్డి భూస్వాములకు అంగరక్షకులుగా సేవలుచేస్తారు). అలాగే ఆ శ్రామిక వర్గాల్లో వెనుక బడిన తరగతులకు చెందినవాళ్లు అంటే ఓబీసీ కులాలవారు కూడా వుంటారు. అందులో మంగలివాళ్లు క్షౌర వృత్తీ, మంత్రసాని పనులూ చేస్తారు. చాకలి, కుమ్మరి, కమ్మరి, వడ్ల, గొల్లకుర్మ, తెలగ, బెస్త, గౌడ తదితర కులాల వాళ్లు రకరకాల శ్రమలు చేస్తారు. వీరి జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వుంటుంది. కానీ దక్షిణ తెలంగాణాలో మాలల కంటే మాదిగల సంఖ్యే ఎక్కువ. మాల, మాదిగల్లో మళ్లీ అనేక ఉప కులాలు వున్నాయి. బైండ్ల, బేగారి, దొమ్మరి, డక్కలి వంటి ఉపకులాల వారు ఇబ్రహీంపట్నంలో చెదురుమదురుగా కనిపిస్తారు. ఇక్కడ అంటరానితనం విపరీతంగా వుంది. దళితులు గ్రామ శివారు ప్రాంతాల్లో చిన్న చిన్న కాలనీల్లో మిగతా కులాలవారికి దూరంగా నివసిస్తుంటారు. పెళ్లిళ్ల వంటి వేడుకల్లో, విందుల్లో తప్పనిసరిగా దళితులకు భోజనం పెట్టాల్సి వస్తే వారిని వేరేగా కూచోబెట్టి విడిగా వడ్డించేవారు. ఒకవేళ ఇతర కులాలవారు దళితుల పెళ్లిళ్లకు వచ్చినా అక్కడ భోజనం చేయకుండానే వెళ్లిపోయేవారు. వాళ్లు దళితేతరులు వండిన వంటలనే తింటారు. చాలా గ్రామాల్లోని టీ షాపుల్లో అన్ని కులాల వారికీ ఒకే రకం గ్లాసుల్లో టీ ఇచ్చినా, టీ తాగిన తర్వాత మాల, మాదిగలు మాత్రం తమ గ్లాసులను తామే కడిగి కౌంటర్‌లో పెట్టి వెళ్లాల్సి వుండేది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పొరుగు గ్రామాల్లో అయితే దళితులకు విడిగా వేరే గ్లాసుల్లో టీ ఇచ్చేవారు. ఇక్కడి పాఠశాలల్లో అంటరానితనం తక్కువగా వున్నట్టు పైకి అనిపిస్తుంది, నిజానికి ఇక్కడ దళితులు తమ పిల్లల్ని అసలు బడకేిే పంపేవారు కాదు. పసితనం నుంచే పిల్లల్ని పశువులను కాయడం వంటి పనుల్లో పెట్టేవారు. అందువల్లనే ఇక్కడి పాఠశాలల్లో అంటరానితనం అంతగా లేదనే భావన కలిగేది.
చాలా గ్రామాలకు వాటి శివారును ఆనుకుని చిన్న అనుబంధ పల్లెలు వుండేవి. అవి ప్రత్యేకించి ఏదో ఒకే ఒక్క కులానికి చెందినవి. ఉదాహరణకి మాలపల్లె, లంబాడి తండా వంటివి. (నిజానికి లంబాడీలు సంచార జాతికి చెందినవారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే వాళ్లని షెడ్యూల్డ్ తెగ కింద పరిగణిస్తున్నారు). ఈ అనుబంధ పల్లెలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించేందుకు వీలుండదు. ఆ పల్లెలకు సాధారణంగా ఎన్నుకో బడ్డ సంస్థలంటూ ఏవీ వుండవు. అవి నిధుల కోసం, అంగన్‌వాడీలూ, పాఠశాలలూ, రేషన్ దుకాణాలూ, తదితర ప్రజావసరాల కోసం ప్రధాన గ్రామాల మీదనే ఆధారపడతాయి.
నేను ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్నప్పుడు తెలంగాణాలోని ప్రతి రెడ్డీ నేరస్తుడే అనే అనుమానం వుండేది. వెట్టి చాకిరీ చేయించుకోవడం, తక్కువ వేతనాలు ఇవ్వడం, ఇతర్ల భూముల్ని ఆక్రమించుకోవడం, పేదలపై దౌర్జన్యాలు చేయడం, బడుగు స్త్రీలపై లైంగిక వేధింపులు వంటి నేరాలకు ఎక్కువగా పాల్పడడం, నేను ఎక్కడికి వెళ్లినా చాలామంది పేదలు తమ ప్రాంత రెడ్డి భూస్వాములు చేసే ఇలాంటి ఆగడాల గురించి చెప్తుండటం వల్ల నాకు ఆ అభిప్రాయం కలిగింది. (బహుశా నాలో ఇప్పటికీ అదే భావన వుందేమో). ఒక భూస్వామి నగరంలో ఎంతో ఉదారవాదిగా, మంచి కార్యకర్తగా, రాడికల్‌గానైనా వుండొచ్చునేమో గానీ, ఊళ్లో మాత్రం అతను ఎప్పుడూ నిరంకుశుడే.
ఇబ్రహీంపట్నంకు దక్షిణాన నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోని మర్రిగూడెం మండలానికి వెళ్లినప్పుడు పర్యావరణవేత్త, యూనివర్సిటీ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి స్వయంగా భూసంస్కరణల చట్టాన్ని పలా ఉల్లంఘించారో తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఒకప్పటి పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ మధుసూదన్ రెడ్డి కుటుంబం కూడా భూసంస్కరణల చట్టాన్ని పలా ఉల్లంఘించిందో మొత్తం ఊళ్లో వాళ్లందరికీ తెలుసు. పైగా ఆయన యూనివర్సిటీలో ఉదారవాదులకు నాయకుడిగా వుండేవారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తిప్పారెడ్డిని ఒక సమావేశానికి రమ్మని ఆహ్వానించేందుకు మేం వెళ్లినప్పుడు ఆయన తన భార్య పులిమామిడి దొరల కుటుంబం నుంచి వచ్చిందనీ, సమావేశానికి వస్తే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి రాలేనని సున్నితంగా తిరస్కరించారు. ప్రభుత్వ స్పెషల్ అడ్వొకేట్‌గా వున్న మోహన్ రావు జబ్బార్‌గూడెంలో ఒక మాదిగ వ్యక్తి రెడ్డి భూస్వాముల చేతుల్లో హత్యకు గురైన సంఘటన జరిగినప్పటికీ అదే ఊరుకు చెందిన ఓ భూ తగాదా కేసులో మా తరపున ప్రాతినిధ్యం వహించారు. కానీ తాండూరులో ఆయన కూడా ఒక కౌలు కేసులో స్వయంగా చట్ట వ్యతిరేక పక్షం వైపు నిలబడ్డారు. మంచి రెడ్ల కంటే చెడ్డ రెడ్ల సంఖ్యే ఎక్కువ. తరచూ చెడ్డ రెడ్డి`మంచి రెడ్డి అనే ముసుగు వెనకాల దాక్కుని వుంటాడు.
తెలంగాణాలో భూసంస్కరణల చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘించారు. ఇబ్రహీంపట్నంలో మేం ప్రారంభించిన భూపోరాటానికి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చొక్కారావు మద్దతిచ్చేవారు. 1971లో రెండవ భూసంస్కరణల చట్టం వచ్చినప్పుడు జగిత్యాలలోని వెలమ దొరలు సుశిక్షిత సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల లాండ్ రికార్డులను ఎక్కువగా తారుమారు చేయలేకపోయారని ఆయన నాకు చెప్పారు. అయితే కొందరు వెలమలు అనేక సంవత్సరాల లాండ్ రికార్డులనన్నింటినీ మూటగట్టి లారీల్లో, బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించి, పదవీ విరమణ చేసిన తాశీల్దార్లను, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లను ప్రైవేటుగా నియమించుకుని ఆ డాక్యుమెంట్లను తమకు అనుకూలమైన రీతిలో మార్పించుకున్నారని, ఆ తరువాత రికార్డులను తిరిగి జగిత్యాలకు తీసుకెళ్లి రెవెన్యూ ఆఫీసుల్లో ఎప్పటిలా పెట్టించారని కూడా ఆయన చెప్పారు. అలాంటప్పుడు రెడ్లు క్యాంపస్‌లో, నిరసన కూడళ్లలో ప్రదర్శించే ఉదారవాదాన్నీ` గ్రామాల్లో వారు చేసిన పనులనూ ఎవరైనా ఎలా సమన్వయం చేసి సమర్థించగలరు? తెలంగాణాలో అమలైన భూస్వామ్య విధానాన్ని ఉదారవాద రెడ్లు ఎలా ఖండిరచగలరు?
