స్వేచ్ఛ రెక్కలున్న పక్షి లాంటిది. చెంగు చెంగున చలాకీగా తిరగాడే లేడిపిల్ల లాంటిది. అమాయకంగా కనిపించే ముఖ వర్చస్సులో నవ్వుతూ పలుకరించే కళ్ళు ఆమె అందానికి మరింత ఆకర్షణీయతనిస్తాయి. అందరినీ ఎంతో ఆప్యాయంతో కూడిన ప్రేమతో పలకరించే ఆమె స్వభావం ఎందరికో ప్రీతిపాత్రం. స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి నా కళ్ళముందే పెరిగి పెద్దదైంది.
బావుకత గల పిల్ల. మంచి చిత్రకారిణి. తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన రాజకీయ నేపధ్యం ఆమెను సమాజంలో చురుగ్గా పాల్గొనే సామాజిక కార్యకర్తగా మలిచింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా తన గళాన్ని విప్పి తన నిరసనతో పోరాటం చేసిన మలిదశ ఉద్యమకారిణి. అన్నింటిని మించి ఎంతో తెలివితేటలతో పాటు గొప్ప నేర్పు, ప్రతిభ, పాటవాలు మెండుగా వున్న మంచి జర్నలిస్టు. ఆ పిల్ల న్యూసు చదివినా, మరే కార్యక్రమం నిర్వహించినా తన మృధు స్వరంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటుంది. బాధ్యత గల పోస్టులను ఆత్మవిశ్వాసంతో నిర్వహిస్తూ తక్కువ కాలంలోనే ఎదిగిన సీనియర్ జర్నలిస్టు. తన చుట్టూ వున్న మహిళల సమస్యల పట్ల సహానుభూతితో స్పందించి వారికి తన పూర్తి సహకారాన్ని అందించిన మంచి కౌన్సిలర్.
స్వేచ్ఛకు అడవి అన్నా, ప్రకృతి అన్నా అత్యంత ప్రేమను కురిపిస్తుంది. ఆమె ఒక సహజసిద్దమైన ప్రకృతి ప్రేమిక. మనుషులతో పాటు, చెట్లు, పుట్టలు, గుట్టలు పూల తోటలు ఇలా ఒకటేంటి, ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమతో ఆదరించగల మృధు స్వభావిని, గొప్ప మానవీయత కల్గిన సహృదయిని. అందుకే తన ‘మట్టిపూల గాలి’ వాసనను కవిత్వం ద్వారా సమాజానికి అందించింది.
జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న పిల్ల ఇలా హఠాత్తుగా కనబడకుండా పోవడం శోచనీయం. చిన్నప్పటి నుంచి తనలో వున్న భావుకతకు ప్రేరణగా తన కూతురుకు సేన అరణ్య అని పేరు పెట్టుకుంది. తల్లిదండ్రులకు బిడ్డగా, ఒక బిడ్డకు తల్లిగా, కవయిత్రి, జర్నలిస్టు, ఉద్యమకారిణి, స్త్రీల సమస్యల పట్ల స్పందించే ఒక కౌన్సిలర్‌గా ఆమె ప్రయాణం అద్భుతం. ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ పాత్రలను పోషించి, అందరి మన్నలను పొందిన ధైర్యవంతురాలు. కొన్ని బలహీనమైన క్షణాలకు లొంగిపోయి శాశ్వతంగా తను ప్రేమించే వారిని, తనను అభిమానిస్తున్న వారిని, కన్నతల్లిదండ్రులను, పెంచిన వారిని, చివరికి కన్నకూతురును కూడా ఒంటరిగా వదిలేసి మరణానికి దగ్గరవడం చాలా బాధాకరం. స్వేచ్ఛ గళం నుండే కాదూ కలం నుండి కూడా ఎంతో సృజనాత్మక సాహిత్యం వస్తుందని ఎదురుచూస్తున్న మాలాంటి సన్నిహితులను, మిత్రులను, బంధువులను నిరుత్సాహపరుస్తూ తన పదునైన గొంతును ఇక వినిపించబోనని, అర్ధంతరంగా తనువు చాలించడం అత్యంత దుఃఖదాయకం.
ఆమె సృజనాత్మక కవిత్వం మచ్చుకకు.. ఆమె సాహిత్యంలో ‘‘నేను’’ నుండి పుట్టి ‘‘నిశ్శబ్దం’’గా పెరిగి, ‘‘నడక’’ను నేర్చుకుంది. తన ‘‘లోపలి దుఃఖం’’ ఎవరికీ కనబడనీయ కుండా ‘‘గట్టు చివర’’ దాచుకుని, ‘‘కన్నీటి సముద్రం’’ అయిన మనసును ‘‘మౌన దుఃఖం’’గా మార్చుకుంది. ‘‘జీవితపు అలికిడి’’ అనే ‘‘స్పందన’’లో ‘‘మేఘపు అడుగులు’’ వేస్తూ ‘మరణం కోసం’’ వెతుక్కుంది. ‘‘అలల ఒడ్డున’’..’’ఓ జ్ఞాపకం’’గా అందరి మనస్సుల్లో నిలిచిపోవాలని, ‘‘దుఃఖిత’’గా తన ‘‘పగిలిన జీవితం’’ను తోసుకుంటూ ఇంకా ఇక్కడికి కాకపోతే మరి ‘‘ఎక్కడికి పోతాను’’ అని పురుష సమాజాన్ని ప్రశ్నిస్తూ… నాకు ‘‘ఇంకాస్త మరణం కావాలి’’ అని నిర్ణయించుకుంది. తరగని ఆలోచనల వేటలో గమ్యం దొరకని బాటసారిలా నిండు జీవితాన్ని మరణ ‘‘ప్రవాహం’’లో వేసి మరణశాసనం విధించుకుంది.
ఆమె మరణవార్తకు దుఃఖించని హృదయం లేదు. జ్ఞాపకాలను తలచుకొనని మిత్రులు లేరు. ఆమె లేని లోటు శ్రీదేవి శంకరన్నలకే కాదూ.. చిన్నారి సేన అరణ్యకు ఎవరూ పూడ్చలేనిది.
కలలా వచ్చి అలలా అందరినీ పెనవేసి, అనంతమైన దుఃఖ సంద్రాన్ని ఈదలేక నింగికెగిసిన కెరటమై తిరిగి ఆ అనంత సంద్రంలోనే ఒదిగిపోయింది. స్వేచ్ఛకు నివాళులుగా ఈ ‘‘మట్టిపూల గాలి’’ పరిమళాలను బంధు, మిత్రులందరికీ పంచాలన్న సంకల్పంతో ఈ కవిత్వ సంపుటి రెండవ ముద్రణకు కొందరు మహిళా రచయితలు పూనుకోవడమే ‘‘స్వేచ్ఛ’’కు వారిచ్చే నిజమైన నివాళులు..
