అప్పుడెప్పుడో చిన్ననాట కలిసిన మనం
ఎన్నో రోజులు కలిసి ప్రయాణించాం కదా!
ఒకరికొకరమై కష్ట, నష్టాలను ఎన్నని పంచుకోలేదూ..
సొంత రక్త సంబధీకులమై ఈ దేశమంతా ఎన్నిసార్లు చుట్టి రాలేదూ..
హేతువాదం నుండి ప్రజాస్వామ్యం వరకు
ఒకే దారిలో కలిసి పయనించాం కదా!
చీకటి తెరలు కప్పుకున్న ఆకాశంలా
భూపొరలను చుట్టేసిన ప్రవాహంలా
ఇద్దరం రెండు ఇరుసులుగా అసలెలా
విరిగిపోయామో ఆశ్చర్యంగా వుంది మిత్రమా!
కోపం వచ్చినప్పుడు ఇరువురం ఎన్నోసార్లు తిట్టుకున్నాంగా ..
మళ్లీ కలిసినప్పుడు మరెన్నోసార్లు కౌగిలించుకున్నాంగా…
వాదాల వేదనలు నేర్చుకుంటు మెదిలాంగా
వేదాలను కాదని కదిలి కలిసి నడిచాంగా
ఒంటరి జీవితాలకు ఆలంబనగా నిలబడ్డాంగా…
వరకట్నం నుంచి నిర్భయ వరకు
గుజరాత్ నుండి ముజఫర్‌నగర్ వరకు
ఎన్నో నిజనిర్దారణలను చేసి వచ్చాంగా
పోలవర ముంపు ప్రజల దీనగాధలు
విని కన్నీరై ప్రవహించాంగా
నదీమ తల్లుల గర్భంలో స్వప్నించాంగా
సముద్రాలతో పోరాడి కలిసి గెలిచాంగా
ప్రకృతిని ఆరాదిస్తూ ఒకరికోసం ఒకరం కదిలాంగా
మనుషులను ప్రేమిస్తూనే స్నేహించాంగా
మనం ముచ్చట్లు చెప్పుకోని రోజు
అసలు ఎప్పుడైనా ఉందా?
అప్పుడప్పుడు అలిగే నిన్ను నేను
ఎన్నిసార్లు కోప్పడ్డానో మరచిపోయావ్
మరెన్ని సార్లు అర్ధం చేసుకుని అక్కున చేర్చున్నానో గుర్తుకురాలేదా?
ఎవరికీ హాని చేయనివి నీ చేతులు మాత్రమేనా!
నీ మనసు శరీరం అని నాకు తెలియదా?
నువ్వు చెప్పినవన్నీ వినడం వెనుక
నీ మీద గౌరవం కన్నా ప్రేమ ఉందని ఎందుకు మరిచిపోయావ్?
జిత్తులమారి నక్కల్లాంటి మనుషుల
ప్రగల్బాలను తలచి మనం ఎన్నిసార్లని నవ్వుకోలేదూ…
సాహిత్యమే కాదు రాజకీయమూ అవసరమేనని
నాకు చెప్పింది నువ్వు కాదూ..
ముఠా రాజకీయాలున్నట్లుగా
సాహిత్య ముఠాలను సైతం
మనం ఎన్ని ఎదుర్కొలేదు చెప్పు?
అర్ధంతరంగా ఆగిన నా కలానికి
సాన పెట్టిన నా రెండవ గురువువి నీవే కదూ..
నన్ను ఈతి బాధల నుండి బయటకు
రమ్మని ధైర్యాన్ని ఇచ్చింది కూడా నువ్వేగా..
వాసిరెడ్డి నుండి యశోదమ్మ దాకా
సరోజినీ అక్క నుండి శారదక్క, అమృత ధార వరకు
కలిసి స్నేహించింది మనమే కదా!
పుట్ల ప్రేమకు నేను కరిగిపోతున్న రోజు
మరో ఆణిముత్యం బుద్ధ స్వరూప వరకు
ఎన్ని కబుర్లు కలిసి పంచుకున్నామో కదూ!
ప్రకృతిలో ప్రాణం దొరుకుతున్నదని
నాకోసం నువ్వు, నీ కోసం నేనూ
ఎన్నిసార్లని నూనె మసాజుల్లో తడిశామో మరిచావా?
కాకతీయ నుండి కాశీ యాత్రల వరకు
అంతర్వేది నుండి త్రివేణి సంగమం వరకు
జంట కవులమై కాలంతో కలిసి
నడిచింది మనమే కదూ…
తెలంగాణ పోరుబాటలో కదం తొక్కింది
నువ్వు… నేనే కదా!
నిన్ను ముద్దుగా మా మాయావతి అని
మా లేడీ గద్దర్ అని పిలిచింది మరిచావా?
ఏమో ఏ చెద పురుగులు మనల్ని కుట్టాయో!
ఏ విష దోమలు మనల్ని కరిచాయో మిత్రమా!
దారులు వేరైనా మన గమ్యాలు ఒక్కటే అయ్యాయి కదా!
ఎక్కడున్నా క్షేమంగా వున్నావనే తలంపు
నువ్వేం చేస్తున్నా నా కనుచూపు మేరలో
వున్నావున్న ఒక ఎరుక ఇన్నాళ్లు
నా గుండెను పదిలంగా నింపి కాపాడేది!
నా శరీరలో ఇప్పుడొక అవయవం తెగిపోయినట్లుగా
నా హృదయ ఘోషలో నన్ను ఒక్కదాన్నే నిర్దాక్షిణ్యంగా వదిలేసి
అర్ధంతరంగా అలా నాతో ఒక్కమాట కూడా చెప్పకుండానే వెళ్ళిపోయావ్
నల్ల మబ్బువయ్యావై పోయావేంటి నేస్తమా?
నా దీపిక ను వెలిగించి నేనప్పుడు
తప్పు చేసానా?
నాకిలా తడి ఆరని దుఖాన్ని మిగిల్చి
అసలెలా అలా వెళ్లిపోతావ్ మిత్రమా!
దుఃఖంతో
నా నేస్తానికి
భండారు విజయ
