Jharkhandలో, ఒక ముండా ఆదివాసీ ఉపాధ్యాయురాలు రూపొందించిన పాఠ్యాంశాల వల్ల, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఎంతోమంది పిల్లలు తరగతి గదులకు వస్తున్నారు.
చుట్టూ చీకట్లు ఆవరించే సాయంత్రం పేరే నాకు పెట్టారు. అయితే, ‘సంధ్య’ (సాయంత్రం) అనేది నల్లని నా ఒంటి రంగుకు తగిన పేరని నా కుటుంబం భావించింది.
నేను నల్లగా పుట్టడంతో, నా కుటుంబం నాపై ఏమంత ప్రేమ కురిపించలేదు. ఇది నా చిన్నప్పటి అనుభవం. దీని వల్ల చర్మం రంగు కారణంగా ఎలాంటి వివక్ష ఎదుర్కొంటామనే విషయంపై నాకు అవగాహన కలిగిందిÑ అది అలా నాతో నిలిచిపోయింది.
నేను 1996లో, Jharkhandలోని సంఘరీ గ్రామంలో నివసించే ఒక ముండా ఆదివాసీ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ నిర్మల కెర్కెట్టా, మా నాన్న సుమన్ లక్రా. రaార్ఖండ్-బీహార్ సరిహద్దు ప్రాంతంలోని చత్రా జిల్లాలో ఉండే మా ఇంటి చుట్టూ అడవులు, నదులు, వాగులు ఆవరించి ఉన్నాయి.
నా తల్లిదండ్రులు రైతులు. మాకు రెండెకరాల భూమి ఉంది. అందులో, సీజన్‌ను బట్టి బెండకాయలు, చిక్కుళ్ళు, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, క్యారెట్ల వంటి కూరగాయలను పండిస్తాం. వరిని కూడా పండిస్తాం. కానీ, వీటి నుండి మాకు పెద్దగా ఆదాయమేమీ రాదు. వీటితో పాటు మా నాన్న రోజువారీ వ్యవసాయ కూలీగా, రోడ్ల నిర్మాణం, గొట్టపు బావులు తవ్వడం లాంటి పనులు చేసి సంపాదించే ఆదాయాన్ని కూడా కలుపుకుంటే, మా వార్షిక ఆదాయం సుమారు రూ.30,000 ఉంటుంది.
మా తల్లిదండ్రులు మహువా (మధుకా లాంగిఫోలియా లేదా లాటిఫోలియా – ఇప్ప) పూలతో తయారుచేసిన మద్యాన్ని అమ్ముతారు. అలా వచ్చిన డబ్బు ఆరుగురు సభ్యులున్న మా కుటుంబాన్ని పోషించటంలో సహాయపడుతుంది. నాకు ఇద్దరు అక్కలు, ఒక సోదరుడు
ఉన్నారు. మా చదువులకు సహాయంగా ఉంటుందని గ్రామంలో ఒక చిన్న మిఠాయి దుకాణాన్ని కూడా వాళ్ళు నడుపుతున్నారు.
దాదాపు 15 మంది సభ్యలుండే పెద్ద కుటుంబంలో బతకడం అంటే, ఎప్పుడూ బండెడు చాకిరీ ఉంటుంది. నేను ఎదుగుతున్న క్రమంలో, నా సొంత ఇంట్లోనే నేనొక పనిపనిషిలా పనిచేయాల్సి వచ్చేది. 2వ తరగతిలో ఉన్నప్పటికే, సుమారు ఏడేళ్ళ వయసులో, నేను ఇంటి పనులన్నీ – మొత్తం కుటుంబానికి వంట చేయడం, గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం, గోశాలను శుభ్రం చేయడం, ఆవులను, మేకలను మేతకు తీసుకువెళ్ళడం, అడవి నుంచి కట్టెలు సేకరించడం… ఇలా ఇంకెన్నో – చేసేదాన్ని.
నేను 12వ తరగతి 2015లో పూర్తి చేశాను, ఇంకా పైకి చదవాలని కోరుకున్నాను. దాంతో, మా ఇంటికి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంచీలోని ఒక హాస్టల్లో నన్ను చేర్పించాలని మా నాన్న నిర్ణయించుకున్నాడు. అలా, రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్య కోసం నేను రాంచీలోని సెయింట్ జేవియర్ కళాశాలకి వెళ్ళాను.
కళాశాలలో తరగతులన్నీ హిందీలో ఉండేవి. కానీ, నేను ఇంట్లో సాదిరీ, ముండా భాషలు మాత్రమే మాట్లాడినదాన్ని. దాంతో, వాళ్ళు ఏం చెబుతున్నారో నాకు తరచూ అర్థమయ్యేది కాదు. ఇది చాలదన్నట్లు, నేను నివసించిన ప్రాంతం తప్ప నాకు బయటి ప్రపంచం ఎలా ఉంటుందో ఏమీ తెలియదు. దాంతో, నా జీవితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమనేది ఒక పెద్ద సవాలుగా మారింది. పైగా, ఇంటి నుండి, కుటుంబం నుండి దూరంగా నివసిస్తుండడంతో, చదవడం కష్టమనిపించేది. కానీ, 2018లో నేను విజయవంతంగా పట్టభద్రురాలినయ్యాను. ఆ తరువాత, నేను ఇంకా చదువుకోవాలనుకున్నాను. చోటా నాగ్‌పూర్‌లోని లా కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను కూడా. కానీ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, మా తల్లిదండ్రులు నాకు సహాయం చేయలేకపోయారు. దాంతో, నేను ఇంటికి తిరిగి వచ్చి, ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నాకు ఉద్యోగమూ రాలేదు, ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణురాలినీ కాలేకపోయాను. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.
అయితే, నా సముదాయం ఎదుర్కొంటోన్న క్లిష్ట సమస్యలను పరిష్కరించాలని నాకు చిన్నప్పటి నుండే ఉండేది. బాల్య వివాహాలు, స్త్రీలను మంత్రగత్తెలుగా పరిగణించే డాయన్ ప్రథ (మంత్రవిద్య), పేదరికం, పోషకాహార లోపం, అడవి జంతువులను హింసించటం, వాటిని వేటాడటం, విస్థాపన, పెరిగిపోతున్న అటవీ విధ్వంసం వంటి సమస్యలపై పనిచేయాలనుకున్నాను.
కళాశాలలో ఉన్నప్పుడు, నేను నెహ్రూ యువ కేంద్రం (నెహ్రూ యువ కేంద్ర సంఘటన్)లో స్వచ్ఛందంగా పనిచేశాను. అక్కడ, క్రీడలతో పాటు యువత కోసం ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు. దీనికన్నా ముందు, అంటే 2015లో, అటవీ పరిరక్షణ విద్య-సమాజ సమీకరణలో భాగంగా తమతో కలిసి పనిచేయమని అటవీ శాఖ నన్ను కోరింది. అందుకు జీతమివ్వకపోయినా, అందులో పనిచేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉండేది..
నేను 2022-2023లో గ్రీన్ హబ్ ఫెలోషిప్ గెలుచుకున్నాను. అది నా జీవితంలోనే ఒక పెద్ద మలుపు. నా సముదాయం గురించి ప్రపంచానికి తెలియజేయడానికి, ఫ్లైట్స్ ఆఫ్ హోప్ అనే డాక్యుమెంటరీని తీశాను. అది చాలా కష్టంగా ఉండేది… మొదట్లో, ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో నాకు నైపుణ్యాలు లేవని నేను భావించేదాన్ని, కానీ నా మార్గదర్శకులు నాకు మంచి ప్రేరణనిచ్చేవారు.
నా డాక్యుమెంటరీ చిత్రం ద్వారా, మా ప్రాంతాన్ని గురించి ఎన్నో వాస్తవాలను నా ప్రజలతో పంచుకోవాలనుకున్నాను. మా ఆదివాసీ సముదాయపు భాష, సంస్కృతి వేగంగా కనుమరుగవుతున్న క్రమంలో, మా వారసత్వాన్ని కాపాడుకుంటూ దాన్ని ముందు తరాలకు అందిద్దామనుకున్నాను.
అదే సమయంలో, మా సముదాయానికి చెందిన చిన్న పిల్లలు సమీపంలోని జలపాతాన్ని చూడటానికి వచ్చిన పర్యాటకుల దగ్గర అడుక్కోవడాన్ని గమనించాను. అది నన్నెంతో నిస్సహాయంగా భావించేలా చేసింది. నా కోసం, నా సముదాయం కోసం ఏదో ఒకటి చేసి మార్పు తీసుకురాగలనని నేనెప్పుడూ అనుకునేదాన్ని. కానీ చదువు, నైపుణ్యాలున్నా కూడా పెద్దగా ఏమీ చేయలేకపోయాను.
విద్యా వ్యవస్థ సరిగ్గా పని చేయకపోవడంతో, పిల్లలు బాగా చదవడం లేదు. ఎంతో మంది పిల్లలు తమ చదువు పూర్తి చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే, చదువు మానేసి కూలి పనులు చేయడానికి వేరే జిల్లాలకు, రాష్ట్రాలకు వలసపోతున్నారు. మా ప్రాంతంలో ఉద్యోగాలు దొరక్కపోవడంతో, తరతరాలుగా ఇదే నడుస్తోంది.
పిల్లలు అడుక్కొంటున్న దృశ్యం నాలో నిలిచిపోయింది. దాంతో నేను చత్రా జిల్లాలోని జలేద్ గ్రామంలో పనిచేసే అంగన్వాడీ కార్యకర్తను కలవడానికి వెళ్ళాను. జలేద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 1-8 తరగతులకు కలిపి కేవలం ఒక ఉపాధ్యాయులే ఉన్నారని తెలిసింది. తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం వలన పిల్లలను ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు రోజంతా వారి ఇష్టానికి వదిలేయటంతో, వాళ్ళకు వాళ్ళే చదువు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. వాళ్ళు అక్కడా ఇక్కడా తిరుగుతూ, ఏదో ఒకటి తిని ఇంటికి చేరుకునేవాళ్ళు. అక్కడి ఏడవ తరగతి విద్యార్థులు అ, ఆ, క, ఖ, గ, ఎ, బి, సి, డిలు కూడా తెలియని దుర్భర పరిస్థితిలోఉన్నారు!
నా చిన్నతనంలో నేను ఎదుర్కొన్నట్లుగా, ఈ పిల్లలు కూడా ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బంది పడకూడదని నేననుకున్నాను. వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాను. పాఠశాల మా ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా, రహదారి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అక్కడికి చేరుకోవడానికి మేం సాల్ (షోరియా రోబస్టా – గుగ్గిలం), మహువా (ఇప్ప), కెందూ (డయోస్పిరాస్ మెలనాక్సిలాన్ – తునికి), వెదురు, పలాశ్ (బుటియా మోనోస్పెర్మా – మోదుగ), ఖైర్ (శెనెగాలియా కెటాచు – సండ్ర) లాంటి చెట్లు దట్టంగా పెరిగిన అడవి గుండా నడుచుకుంటూ వెళ్ళాలి.
ఇంతలో, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుండటంతో 2022లో నేను అటవీశాఖ నిర్వహించే అవగాహనా కార్యక్రమాలలో – అడవికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది, కట్టెలను తెలివిగా ఎలా ఉపయోగించాలి, జీవవైవిధ్యం గురించి మా సముదాయంలో అవగాహన కల్పించటం-పనిచేయడం మొదలుపెట్టాను. ఇది కాంట్రాక్టు పని. నెలకు సుమారు రూ.20,000 ఇచ్చేవాళ్ళు.
ఇదిలా ఉంటే, సమాజంలో మార్పు రావాలంటే, పిల్లలకు విద్య ఎంత ముఖ్యమో అందరిలో అవగాహన కలిగించాలనుకున్నాను. నేను కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలిగితే, నా పనిని ఒక ముఖ్యమైన దోహదంగా భావిస్తాను. కేవలం విద్య మాత్రమే మా గ్రామ పరిస్థితిని మెరుగుపరచగలనని నేను బలంగా నమ్ముతున్నాను..
చిన్న తరగతుల విద్యార్థులకు చదువు చెబుతూ, ఉపాధ్యాయురాలిగా నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. వాళ్ళకి క్రమంగా హిందీలో చదవడం, రాయడం, మాట్లాడడం లాంటి ప్రాథమిక నైపుణ్యాలను నేర్పించాను. కానీ, ఒకేసారి 70 మంది పిల్లలకు చదువు చెప్పడం కష్టమనిపించింది. మొదట్లో, పిల్లలు కూడా చదువుపై ఆసక్తి చూపించలేదు.
ఆటలు, సరదా కార్యకలాపాల ద్వారా వాళ్ళకి అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ లాంటి ఎన్నో విషయాల గురించి చెప్పడం మొదలుపెట్టాను. పండ్లు, పూలు, ఆకులు, జంతువులు, పక్షులు – వీటిని ఎలా గుర్తించాలో నేర్పించాను. మేమందరం కలిసి జంగ్లీ ప్యాజ్ (ఉర్జీనియా ఇండికా-అడవి ఉల్లిగడ్డ), హడ్జోడ్ (సిస్సస్ క్వాడ్రాంగ్యులారిస్-నల్లేరు), ముస్లీ (క్లోరోఫైటమ్ బోరివిలియనం-నేలతాడి), ధతూరా (దతూరా స్ట్రామోనియం-ఉమ్మెత్త), చిరోంజి (బుచనానియా లాంజాన్-సారపప్పు), భేల్వా (సెమెకార్పస్ అనకార్డియం-మారేడు) లాంటి మొక్కలను వెతికేవాళ్ళం. ఈ సమాచారాన్ని వాళ్ళు సులభంగా గుర్తుంచుకోవడానికి వీలుగా, అడవులలో దొరికే ఔషధ మొక్కల, ఆకుల బొమ్మలను వారితో గీయించాను.
అలాగే, వాళ్ళను ప్రకృతి విద్యా విహారయాత్రలకు తీసుకువెళ్ళాను. అక్కడ, అడవులలోని జీవవైవిధ్యం గురించి అందరం నేర్చుకున్నాం. ఇలా నేర్పిస్తూ, నేను వాళ్ళతో ఆడుకునేదాన్ని కూడా. మేమందరం కలిసి కవిత్వం, సంగీతం నేర్చుకున్నాం. వాళ్ళ ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోమని ప్రోత్సహించాను.
పిల్లలు నాతో అనుబంధం ఏర్పరచుకోవడానికి ఇది సహాయపడిరది, బడి పట్ల వాళ్ళలో ఆసక్తి పెరిగింది. హాజరు మెరుగుపడిరది. అంతకుముందు బడిలో నమోదు కాని పిల్లలు కూడా రావడం మొదలుపెట్టారు.
ఏడవ తరగతి చదివే 13 ఏళ్ళ ఖుష్బూ కుమారి బడికి ఎప్పుడూ క్రమంగా వచ్చేది కాదు. ఖుష్బూ తల్లి ఆమెను ఇంట్లోనే ఉంచి, ఇంటి పనంతా చేయించేది. అయితే, ఖుష్బూ క్రమం తప్పకుండా సాయంత్రం పూట తరగతులకు హాజరవుతుండడంతో, ఆమె తల్లి నా ప్రయత్నాలను గుర్తించింది. ఖుష్బూను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడం మొదలుపెట్టిందిÑ ఆమెకు ఇంటి పనిభారం కూడా తగ్గిపోయింది.
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకొమ్మని ప్రోత్సహించటం మొదలెట్టారు. ఇంతకుముందు బడిలో మొత్తం 86 మంది పిల్లలకు 16 మంది హాజరయ్యేవాళ్ళు. మూడు నెలల్లో ఈ సంఖ్య 72కి పెరిగింది.
స్థానిక యువకులు కొందరు నాతో పాటు పిల్లలకు చదువు చెప్పటానికి ముందుకొచ్చారు. అదే బడిలో చదివిన అమ్మాయిలు కొందరు నేను పిల్లలకు బోధించేటప్పుడు కిటికీలలోంచి తొంగి చూసేవాళ్ళు. చివరకు, చిన్న పిల్లలకు బోధించడంలో వాళ్ళు నాకు సహాయం చేయడం మొదలుపెట్టారు.
ఇప్పుడైతే, నేను ఒక్కరోజు బడికి వెళ్ళకపోయినా పిల్లలు నిరుత్సాహపడి నా రాక కోసం ఎదురు చూస్తుంటారు!
మార్పు వస్తోంది: ఆర్థిక స్థోమత ఉన్న కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను మెరుగైన విద్య కోసం పట్టణాలకు పంపిస్తున్నారు. మొదట్లో, అసలెందుకు చదువుకోవాలో వీరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు పోలీసు అధికారులుగా, ఉపాధ్యాయులుగా, వైద్యులుగా స్థిరపడాలని పిల్లలు కలలు కంటున్నారు.
నా జీవితంలోకి ఒక విధమైన ప్రేరణ వస్తున్నట్లు నాకనిపిస్తోంది. బాగా చదువుకోవాలని, మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని పిల్లలు కలలు కంటున్నారు. అది నాలో ఆశను రేకెత్తిస్తోంది.
ఈ కథనాన్ని మొదట హిందీలో నివేదించారు.
