ఆమె ఒక నిశ్శబ్ద యుద్ధ నౌక – గిరిజ పైడిమర్రి

‘‘అట్టడుగున పడి కాన్పించని కథలెన్నో కావాలిప్పుడు’’ అన్నాడు శ్రీశ్రీ. అలాంటి కథనమే యిది. కోట్లాది ప్రజల గుండెల్లో తన స్థానాన్ని పదిల పరచుకున్న ప్రజాయుద్ధ నౌక గద్దర్‌. ప్రజాగాయకుడుగా, కవిగా, విప్లవ రాజకీయ కార్యకర్తగా ఆయన గురించి తెలియని వారుండరు. ఆ యిల్లు నిత్యం వచ్చిపోయే జనానికి, ప్రజా రాజకీయాల చర్చలకు నెలవు.

ప్రతినిత్యం ప్రజాసంక్షేమం కార్యక్రమాలలో తలమునకలైన సహచరుని నుంచి ఏమీ ఆశించకుండా ముగ్గురు పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా నావకు చుక్కానిలా, కంటికి రెప్పలా ఆయనను కాపాడుకున్న యోధ. తన కళ్ళ ముందే సహచరునిపై కాల్పులు జరుపుతున్న పోలీసు అధికారి, అజ్ఞాత వ్యక్తుల పైకి సివంగిలా దూసుకు పోయిన ధీర వనిత. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ధీశాలి. నేటి ఆడపిల్లలకు స్ఫూర్తి ప్రదాత. ఆమె ఎవరో కాదు, గద్దర్‌ సహచరి విమల. ఆమె ఒక నిశ్శబ్ద యుద్ధనౌక. ఆ నిశ్శబ్ద యుద్ధాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే అక్కా! బాగున్నారా? ఆరోగ్యం బాగుందా?
జ. రా బిడ్డా! బాగున్న. ఆరోగ్యం కొంచం మంచిగనే వుంది.
ప్ర. మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. అమ్మ పేరు లక్ష్మమ్మ. నాయిన పేరు రాజలింగం. ఉప్పరిపని చేసేటోడు. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరన్నలు. నేను చిన్నదాన్ని. మేం మొత్తం ఆరుగురం.
ప్ర. మీ పుట్టుక విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నేను 1950లో పుట్టిన. తేది గుర్తులేదు. చాదర్ఘాట్‌ దగ్గర గౌతం స్కూల్లో చదువుకున్న. పదోతరగతి మధ్యలనే ఆపేసిన. తరువాత ఉద్యోగం చేసిన.
ప్ర. మధ్యలోనే చదువు ఎందుకు మానేసారు?
జ. మాది చాలా బీద కుటుంబం. మా అన్నలు, అక్కలు పెళ్లి చేసుకొని వెళ్ళి పోయిన్రు. మాకు తిండికి కూడా కష్టమయ్యేది. అందుకే చదువు మానేసి 16 ఏండ్లకే ఉద్యోగానికి పోయిన.
ప్ర. మీరు చేసిన ఉద్యోగం గురించి చెప్పండి.
జ. కరెంటు మీటర్లు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసేదాన్ని. అది పిజేఆర్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీ. పొద్దున 6.30 నుంచి సాయంత్రం ఆరుగంటల దాకా.. ఒక గంట ఎక్కువ పనిచేస్తే 75 పైసలు ఇచ్చేటోళ్ళు. నేను రోజుకు రెండు గంటలు ఎక్కువ పని చేసేదాన్ని. అందుకే ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 8.30 అయ్యేది. ఇట్ల నాకు పొద్దంతా పనితోనే సరి పొయ్యేది.
ప్ర. మీకు గద్దరన్న ఎలా పరిచయం?
జ. మేము మా రెండో అక్క సరస్వతి ఇంటి పక్కన కాచిగూడలో ఉండేటోళ్ళం. వాళ్ళ మామ రామస్వామి. ఆయన సోషల్‌ వర్కర్‌. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త. పార్టీ ప్రచారం, ప్రభుత్వ పథకాల ప్రచారం కొరకు యువకులతోటి బుర్రకథలు చెప్పిస్తుండేటోడు. అట్ల ఒకసారి ముగ్గురిని తీసుకొచ్చిండు. అందులో ఒకరు గద్దర్‌, రెండోవాడు మా అక్క మరిది.(అంటే రామస్వామి కొడుకు) మూడో అతణ్ణి తూప్రాన్‌ నుంచి తీసుకొచ్చిండు. అట్ల గద్దర్‌ ప్రాక్టీసు కొరకు అక్కడికి వచ్చేటోడు. ఆయనప్పుడు యూనివర్శిటీల బి టెక్‌ చదువుతుండే. మోజంజాహి మార్కెట్‌ దగ్గర హాస్టల్ల ఉంటుండే. ఒకసారి గద్దర్‌ బుర్రకథ చూసిన బి.నర్సింగరావు (సినిమా దర్శకుడు) భగత్‌ సింగ్‌ జయంతి రోజున గద్దర్‌ ప్రదర్శన ఏర్పాటు చేసిండు. ఆయన ప్రోత్సాహంతోనే 1971లో ‘ఆపర రిక్షా!’ మొదటి పాట రాసిండు. కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యల మీద పాటలు రాసి ప్రదర్శనలు ఇచ్చేటోడు. అందుకొరకే 1972 లో ‘జననాట్య మండలి’ని స్థాపించిండు. ఇవన్నీ నాకు ముందు తెల్వదు. పెళ్లి అయినాకనే తెలిసింది.
ప్ర. మీ పెళ్ళి ఎప్పుడు? ఎక్కడ? ఎలా జరిగింది?
జ. నేను పెళ్ళి చేసుకుంటే మా అమ్మను ఎవరు చూసుకుంటారు? అందుకని నాకు పెళ్ళి ఆలోచననే ఉండక పోయేది. మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకోలేదు. నేను ఇంట్లనే ఉండక పోయేది కదా.. ఆయననే నన్ను చూసిండు కావొచ్చు. ఒకరోజు నేను ఫ్యాక్టరీకి పనికి పోతుంటే నా చేతిలో చిట్టి పెట్టిండు. అందులో ‘‘నన్ను పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమేనా?’’ అని రాసుంది. అది తెచ్చి మా అక్కకిచ్చిన. రామస్వామి, అమ్మ, అక్క అందరూ ఆలోచించి, ‘‘పిల్లగాడు కట్నం లేకుండా సింపుల్‌గా పెండ్లి చేసుకుంటా అంటుండు. పెండ్లి అయినాక కూడా ఉద్యోగం చేసుకుంటూ మీ అమ్మను చూసుకోవచ్చు. పెండ్లి లేకుండా (చేసుకోకుండా) ఉండడం కష్టం.’’ అని నాకు చెప్పి నన్ను ఒప్పించిన్రు. నాకు అదే కరెక్ట్‌ అనిపించింది. రామస్వామే ముందుండి అన్నీ చేసిండు. ఒకరోజు ఇంటి దగ్గర గుళ్ళో దండలు మార్చుకున్నం. పుస్తెమట్టెలు ఏం లేవు. గద్దర్‌ ఇంటోళ్ళు, మా యింటోళ్ళు మాత్రమే ఉన్నరు. భోజనాలు కూడా లేవు. ఛాయ్‌, చిన్న లడ్డు, మిక్చర్‌ అందరికి ఇచ్చిన్రు. ఇట్ల సింపుల్‌గా మా పెండ్లి 9/11/1975 నాడు జరిగింది. మా పెండ్లికి మూడు రోజుల ముందే గద్దర్‌కు ఇ సి ఐ ఎల్‌ లో, కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆయన కెనరా బ్యాంకు ఉద్యోగంల చేరిండు. నేను కూడా నా ఉద్యోగం కంటిన్యూ చేసిన.
ప్ర. మీ అత్తగారింటి గురించి చెప్పండి.
జ. మా అత్తగారి ఊరు మెదక్‌ జిల్లాలో తూప్రాన్‌ అనే గ్రామం. వాళ్ళది కూడా పెద్ద కుటుంబం. చాలా బీదవారు. నాకు ముగ్గురు ఆడబిడ్డలు, ఒక బావ. మా పెండ్లి నాటికే మామ చనిపోయిండు. మా అత్త లక్ష్మమ్మ కష్టపడి పిల్లల్ని సాకి, పెద్ద చేసింది. మా బావ అత్త తూప్రాన్‌లోనే ఉండేటోళ్లు. మా పెద్దాడబిడ్డ ఔరంగాబాద్‌లో, రెండో ఆడబిడ్డ వెంకటాపురంలో, మూడో ఆడబిడ్డ మేడ్చల్‌లో ఉండేటోళ్లు . ఇప్పుడు ఒక్క చిన్నాడబిడ్డ మాత్రమే బతికుంది. రెండో ఆడబిడ్డ సరోజనమ్మ ఇంటి పక్కనే వెంకటాపురంలో మేం కూడా ఉండేటోళ్ళం.
ప్ర. మీ పిల్లలగురించి చెప్పండి.
జ. నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. పెద్దకొడుకు సూర్య కిరణ్‌కు ఇద్దరు పిల్లలు. ఒక బిడ్డ, ఒక కొడుకు. మనమరాలు ఎం బి బి యస్‌ పూర్తి చేసి పీజీ కొరకు చదువుకుంటుంది. మనమడు ఎం బి ఏ చదువుతున్నడు. నా రెండో కొడుకు చంద్రకిరణ్‌ ఎం బి బి యస్‌ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఆరోగ్యం బాగలేక చనిపోయిండు. మా బిడ్డ వెన్నెల పి హెచ్‌ డి చేసింది. మహాబోధి విద్యాలయాన్ని గత పధ్నాలుగు ఏండ్ల నుంచి చూసుకుంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. వెన్నెల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో సాంస్కృతిక, సాహిత్య ఛైర్‌ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంది.
ప్ర. గద్దరన్నను మొదటిసారి పోలీసులు ఎప్పుడు అరెస్టు చేసారు? అప్పుడు ఏం జరిగింది?
జ. ఆయన మారేడుపల్లి కెనరా బ్యాంకులో పని చేసేటోడు. ఆయనకు దగ్గరగా ఉంటదని మారేడుపల్లిలో ఒక చిన్న రూం కిరాయికి తీసుకొని ఉండేటోళ్ళం. మా దగ్గర సామాను కూడా ఏం లేకుండే. ఇల్లుగల్లామెనే ఒక ప్లేటు చిన్న బిందె, ఒక చాప యిచ్చింది. ఆయన బ్యాంకు టైం పొద్దున 7-12 సాయంత్రం 5-7ల. వరకు ఉండే. మధ్యాహ్నం తన ప్రోగ్రాం కొరకు ప్రాక్టీస్‌ చేసుకుంటుండే. నాకు నెల తప్పింది. అందుకని అదే ఏరియాలో ఇంకొంచెం పెద్ద రూం కిరాయికి తీసుకొని అమ్మను నా దగ్గరనే ఉంచుకున్న.
ఒకరోజు రాత్రి పదకొండు గంటలప్పుడు జంగయ్యనని (దోస్త్‌) దబదబమని తలుపు కొడితే తీసిండు. గభాల్న పోలీసులు లోపలికొచ్చి ఆయనను పట్టుకపోయిన్రు. అప్పుడు నేను తొమ్మిది నెలల గర్భవతిని. ఆ రాత్రి వెంకటాపురంలో ఉండే వాళ్ళ రెండో అక్క సరోజనమ్మ యింటికి పోయిన. అప్పుడు అక్కడ వాళ్ళ పెద్దక్క కుటుంబం కూడా వుండే. విషయం చెప్పిన. ముందు అందరూ నన్ను తిట్టిన్రు. తర్వాత నేను సరోజనమ్మ కలిసి ఆఖరి బస్సుకు అల్వాల్‌ నుంచి మారేడుపల్లికి వచ్చినం. ఆయనతో పాటు జంగయ్య మాస్టరును కూడా పోలీసులు తీసుక పోయిన్రు. అప్పుడు ఆయన భార్య బాలింత. ఆ టైంల నేను అందరు పార్టీవాళ్ళ ఇళ్ళకు తిరిగిన అందరూ నన్ను తిట్టినోళ్ళే కానీ ఎవ్వరూ సాయం చేయలేదు.
ప్ర. తరువాత ఏం జరిగిందో చెప్పండి.
జ. రోజూ ఖైరతాబాద్‌ పి ఎస్‌కు పోయి టిఫిన్‌ ఇచ్చి వచ్చేదాన్ని. పోలీసులు రావద్దని చెప్పినా మొండికి పోయేదాన్ని. నాకు డెలివరీ టైం కనుక అక్కడే నాకు డెలివరీ అయితే వాళ్ళకు రిమార్క్‌ వస్తదని భయపడేటోళ్ళు. ఒకరోజు ఆయనతోని కూడా చెప్పించ్చిన్రు. ఇంకొక రోజు నన్ను బలిమికి బయటకు వెళ్లగొట్టిన్రు. మస్తు ఏడుపొచ్చింది. పక్కనే వున్న మరియమ్మ చర్చి దగ్గర చెట్టు కింద కూచున్న. కొంచెం సేపటికి నాకు నొప్పులు షురూ అయినయి. వెంటనే ఆటోల కాచిగూడ పోయి, అమ్మను, అక్కను తీస్కొని అదే ఆటోల జజ్జిర్ఖాన (గవర్నమెంట్‌ మెటర్నిటి హాస్పిటల్‌, ఓల్డ్‌ సిటి)కు పోయిన. పోయినాక పది నిమిషాలకే నాకు కాన్పయింది. బాబు పుట్టిండు. దవాఖానల ఐదు రోజులున్న. నా దగ్గర మా అమ్మ ఉండేది. దవాఖానల ఒక ఛాయి మూడు బ్రెడ్‌ ముక్కలు ఇచ్చేటోళ్ళు. వాటిని అమ్మ, నేను తినేటోళ్ళం. డిశ్చార్జి చేసినాక మా రెండో అక్క ఇంటికి కాచిగూడకు పోయిన. నేను డెలివరీ అయినాక ఏడు రోజులకు పోలీసులు గద్దర్‌ను బాబును చూపెట్టటానికి తీసుకొచ్చి వదిలేసి పోయిన్రు. తర్వాత వాళ్ళ రెండో అక్క సరోజనమ్మ వచ్చి వాళ్ళింటికి తీసుకపోయింది. తర్వాత లోతుకుంటకు ఇల్లు మారినం. మూడు నెలల తర్వాత డ్యూటీకి పోయిన. తర్వాత రెండేళ్ళకు రెండో బాబు ఇంట్లనే పుట్టిండు. అపుడు గద్దర్‌ బి హెచ్‌ ఇ ఎల్‌ లో ప్రోగ్రాంలో ఉన్నడు. మరుసటి యేడాదికి బిడ్డ వెన్నెల పుట్టింది.
ప్ర. మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులేమిటి?
జ. మొదటి నుంచీ మాది చాలా బీద కుటుంబమే.. మొదటి బాబు పుట్టినప్పుడు ఛాయి తాగనీకి కూడా పైసలు లేకుండే. దవాఖానల హెడ్‌ నర్సు మా రెండో అక్క దోస్తు. ఆమెనే పైసలిచ్చి ఛాయి తెప్పించింది. తర్వాత నా చెవుల కమ్మలిస్తే మా రెండో అక్క వాటిని గిరివి పెట్టి 150.00 రూపాయలు తెచ్చి యిచ్చింది. తర్వాత పార్టీ పనుల్లో బిజీ అయిపోయి మా ఆయన బ్యాంకు ఉద్యోగం మానేసిండు. నేను పని చేసే కంపెనీని బంద్‌ వెట్టిన్రు (లాక్‌ డౌన్‌). వచ్చీరాని జీతమే ఆధారమైంది. దాంతో ఏడు మందిమి బతకాలి. ఇద్దరు కొడుకులను హాస్టల్ల యేసినం. ముగ్గురు పిల్లలకు పుస్తకాలు, బూట్లు, బ్యాగులు ఇతర ఖర్చులు చాలా కష్టమయ్యేది. ఉన్ననాడు తిన్నం. లేనినాడు ఉపాసమున్నం. కానీ ఎవ్వరినీ సాయం అడగలేదు. ఎప్పుడూ బట్టలో, తిండిలో సాధారణం జీవితమే గడిపినం. ఇప్పుడు కూడా గట్లనే ఉన్నం.
ప్ర. మీ మీద కూడా దాడి జరిగిందని విన్నాము. దాని గురించి చెప్పండి.
జ. అప్పుడు మేము బాలానగర్‌లో కిరాయికి ఉండేటోళ్ళం. అంజన్న, గద్దర్‌, ఇంకా కొందరు కలిసి పేదోళ్ళకు గుడిసెలు ఏపించిన్రు. ఆ బస్తీల బడి పెట్టాలని కొంత జాగా ఆయన పక్కకు పెట్టించిండు. అదే రోజు అర్ధరాత్రి బయట నుంచి ఎవరో రౌడీలు వచ్చి ఆ బడి స్థలంల కూడా గుడిసె యేసిన్రు. అది గద్దరన్న బడి కోసం పెట్టిన జాగా. అక్కడ గుడిసలు వేయొద్దని ఆ బస్తీ యువకులు ఎంత చెప్పినా వాళ్ళు వినలేదట. అట్లా వాళ్ళ మధ్య పెద్ద లొల్లి జరిగి కొట్టుకున్నరంట. ఆ గొడవ తర్వాత ఒకరోజు రాత్రి ఎవరో మాయింటికొచ్చి, నన్ను జుట్టుపట్టి బయటకు లాగి కొట్టిండ్రు. అప్పుడు గద్దర్‌ ఇంట్ల లేకుండే. నేను అమ్మ పిల్లలే ఉంటిమి. తర్వాత అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెంకటాపురం వచ్చినం.
ప్ర. మీరు ‘మహా బోధి విద్యాలయ’ పేరుతో బడి కూడా పెట్టారు కదా.. దాని గురించి చెప్పండి.
జ. అవును, బాలానగర్‌ బస్తీలో బడి కోసం ఉంచిన స్థలాన్ని రౌడీలు ఆక్రమించుకున్నరని చెప్పిన కదా.. తర్వాత వెంకటాపురంలోనే బడి కొరకు జాగా ఇచ్చిన్రు. బస్తీల ఒక కమిటీ ఏసిన్రు. అందులో నేను ఇంకా ఇద్దరు ఉన్నరు. ఇటుక, ఇసుక, రాయి అన్నీ ఎవరు ఏది ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చిన్రు. ఇట్లా తీసుకొచ్చినం. ప్రజలే కట్టిన్రు. ‘ఉన్నత పాఠశాల’ రిజిస్టరైంది. అంబేద్కర్‌ విద్యానికేతన్‌ ట్రస్టు ఏర్పాటు చేసిన్రు. ఆ ట్రస్టు ఆధ్వర్యంలో బడి నడుస్తుంది. బడికి సంబందించి నేను చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాను. ధైర్నంగా స్కూలును కాపాడి, అన్నీ నేనే చూసుకున్న’’ నీ వల్లనే బడి నిలబడ్డది. నువ్వు పోతే నిన్ను అండ్లనే పెడత అనేటోడు గద్దర్‌. ‘‘నేనే ముందు పోతా అనుకున్న. అట్లాంటిది ఆయననే బడిల పెట్టాల్సి వచ్చింది.’’ (అంటూ కంటతడి పెట్టుకున్నారు విమల.) ఇప్పుడు బడి బాధ్యత నా బిడ్డ వెన్నెల చూసుకుంటుంది.
ప్ర. గద్దరన్న మీద కాల్పులు జరిగినప్పుడు మీరు ఇంట్లోనే వున్నారా?
జ. ఎప్పుడూ మా యింట్ల ఎవరో ఒకళ్ళు ఉంటరు. అపుడు ఒక బీహార్‌ పిల్లోడు ఉండే. ఆ పిల్లాడిని తీసుకొని నేను కూరలు తేవడానికి అల్వాల్‌ మార్కెట్‌కు పోయిన. దారిల ఒక వద్ద బండరాయి మీద ముగ్గురు కూచోని వుండడం చూసిన. వాళ్ళు కొత్త వాళ్ళు. అంతకు ముందెప్పుడు ఆ ఏరియాల కనిపించలేదు. నేను తిరిగొచ్చేటప్పుడు కూడ వాళ్ళు ఆడనే వున్నరు. ఆ రోజు 6/4/1997. కూరలు సర్ది పెట్టి వంట నూనె తేవడానికి డబ్బా తీసుకొని గేటు దాకా వచ్చే సరికి నేను చూసిన ఆ ముగ్గురు కారులో నుంచి ఇంటి ముందర దిగిన్రు. నేను గద్దర్‌ లేడని చెప్తున్నా వినకుండా గద్దరన్న దోస్తులమని లోపలికి వచ్చిన్రు. నాకు అనుమానమోచ్చి ఇంట్లకు వచ్చిన. వాళ్ళ మాటలు విని లోపల్నుంచి ఆయన ముందరి రూంలకు వచ్చి కూచున్నడు. వచ్చిన వాళ్ళలో ఒకాయన ఇన్‌ షర్ట్‌ చేసుకొని ఆయన ఎదురుగా కూచున్నడు. మిగతా ఇద్దరు బయట నిలబడి అన్నీ గమనిస్తున్నరు. నేను ఆయన ఎనక నిలబడ్డ. నన్ను ఛాయి చేసి తీసుకురమ్మని గద్దర్‌ చెప్పిండు. అయినా నాకు అనుమానముండి అక్కడి నుంచి పోలేదు. ఇంతలో షర్ట్‌ లోపల్నుంచి గన్‌ తీసి కాల్చడం షురూ చేసిండు. గద్దరన్న గుండెకు చెయ్యి అడ్డం పెట్టిండు. రెండో బుల్లెట్‌కు కింద పడిపోయిండు. ‘‘నేను ఎవడ్రా! నువ్వు? అని గభాల్న వాడి మీదికి ఊరికిన. నాకు దొరకుండా వెనకకు వెనకకు తిరిగి ఫైరింగ్‌ చేసుకుంటూ పారిపోయిండు.
ఏడు రౌండ్లు కాల్చిండు. నేను అడ్డముండడం వల్ల వాడికి పొజిషన్‌ దొరకలేదు. అప్పుడు నా బిడ్డ, కొడుకు ఇంట్లనే ఉన్నరు. నా బిడ్డ ఆ కార్‌ నంబర్‌ నోట్‌ చేసుకుంది. నేను మా ఇంట్ల వున్న పిల్లాడి సాయంతో ఆయనను లోతుకుంట దవాఖానకు తీసుకపోయిన. గాంధీకి తీసుక పొమ్మని ఆ డాక్టర్‌ చెప్పిండు. ఆటోల నా ఒడిల పండుకో పెట్టుకున్న.
‘‘దవాఖానకు పోయినక గద్దర్‌ మీద కాల్పులు జరిగినయని చెప్పు. లేకపోతే ఎవ్వరు పట్టించుకోరు. ‘‘అని ఆయన తెలివిల
ఉండి నాతోని మాట్లాడతనే ఉన్నడు. దవాఖానకు పోయినాక బేవోష్‌ అయిండు. కట్టుకట్టి నిమ్స్‌ దవాఖానకు పంపిన్రు. నేను నెల రోజులు ఆయనతోని అక్కడనే వున్న. నెల రోజులకు మంచిగై యింటికి వచ్చినం.
ప్ర. గద్దరన్నతో మీరు ఎక్కడికైనా ప్రయాణించారా?
జ. వరంగల్‌, ఢల్లీి, కలకత్తాకు పోయిన. 2000 సంవత్సరంల అనుకుంట.. ఢల్లీికి ట్రైన్‌ల పోయినం. అక్కడ ఒక్కరోజున్నం. ఆడనుంచి విమానంల కలకత్తా పోయినం. అక్కడ ఒక్కరోజు వుండి ఇంకొకాయనతో కలిసి నెల రోజులు ఎక్కడికో పోయిండు. ఆ యింట్ల ఇద్దరు ముసలోళ్ళతోని కలిసి ఉన్న. వాళ్ళు ఆలుమగలు. వాళ్ళకు తెలుగు రాదు. హిందీ కూడా రాదు. నాకు వాళ్ళ భాష రాదు. సైగలతోని మాట్లాడుకునేటోళ్ళం. వాళ్ళు చాలా మంచోళ్ళు. నాకు కలకత్తాలో చూడాల్సినవి తిప్పి చూపించిన్రు. గద్దర్‌ తిరిగి వచ్చినాక ఒకరోజు ఉండి మేం హైద్రాబాద్‌కు వచ్చినం.
ప్ర. తెలంగాణ ఉద్యమం గురించి చెప్పండి.
జ. మూడు నెలలలు నడుచుకుంట పల్లె పల్లె తిరిగి తెలంగాణ ఎందుకు కావాలో ప్రజలకు చెప్పిండు. అందుకే తెలంగాణ కావాలని ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నరు. ఆ టైంల ఆయన ఆరోగ్యం కూడా లెక్కచెయ్యలేదు. అప్పుడు ఆక్సిడెంట్‌ అయ్యి వరంగల్ల ఉంటే నేను పోయి చూసుకున్న.
ప్ర. గద్దరన్న మిమ్మల్ని, పిల్లల్ని పట్టించుకోలేదని మీ కెప్పుడైనా కోపం, బాధ అనిపించిందా?
జ. నేను పెండ్లి చేసుకునే నాటికే ఆయన ప్రోగ్రామ్స్‌ ఇచ్చుకుంటు తిరుగుతుండే. చిన్న ఫ్యాక్టరీల చిన్న ఉద్యోగం చేసుకుంటున్న నన్ను పైసా తీసుకోకుండ పెండ్లి చేసుకున్నడు. ఏనాడు ఒక్క మాట అనలేదు. తన గురించి తానే పట్టించుకోలేదు. ఆయనకు కావల్సిన బట్టలు, చెప్పులు లాంటి వస్తువులు నేనే తెచ్చేదాన్ని. ఏది తెస్తే అది కట్టిండు. ఏది పెడితే అది తిన్నడు. ఆయనకు ప్రజలు, పాటలు తప్ప ఇంకో లోకం లేదు. ఈనాడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నవంటే ఆ గొప్ప మనిషికి భార్యను అయినందుకే కదా.. లేకపోతే నేను ఎవరికి తెలిసే దాన్ని? ఎప్పుడన్న టైం దొరికితే ఏ కష్టమొచ్చినా ఎట్ల ధైర్నంగ ఉండాలో చెప్పేటోడు.
ప్ర. ప్రభుత్వం గద్దరన్న పేరుతో అవార్డులు ఇస్తోంది కదా:. మీరు ఎలా ఫీల్‌ అవుతున్నారు?
జ. గద్దరన్నను ముందు నుంచి ప్రజలు గుండెల్ల పెట్టుకున్నరు. ఇప్పుడు ప్రభుత్వం కూడా గుండెల్ల పెట్టుకున్నది.
ప్ర. నేటి యువతకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. ఈ కాలం పిల్లలు చిన్న కష్టం వచ్చినా ఓర్చుకుంటలేరు. బతుకు మధ్యల అట్ల ఆగం చేసుకునుడు మంచిది కాదు. ఏ కష్టమొచ్చినా ధైర్నంగా ఎదుర్కోవాలి. ఉన్నంతల బీదోళ్ళను అరుసుకోవాలి. మనం సమాజంల ఉన్నం కదా.. సమాజం కొరకు చేతనైనంత ఏమన్న చెయ్యాలి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.