జపనీస్ రచయిత సతోషి యాగిసావా రాసిన ఈ పుస్తకం 151 పేజీల చిన్న నవల. ఇంగ్లీష్‌లోకి అనువాదం ఎరిక్ ఓజవా చేసారు. ‘‘డేస్ ఎట్ ది మోరిసాకి బుక్‌షాప్’’ హాయి గొలిపే నవల, ఇది జపాన్‌లోని టోక్యో ప్రాంతంలో జింబోచోలో ఉన్న ఒక పాత పుస్తకాల దుకాణం చుట్టూ తిరుగుతుంది.
కథానాయిక తకాకో, ప్రేమలో విఫలమైన తర్వాత, తన మామయ్య సతోరు నడిపే మోరిసాకి బుక్‌షాప్‌కి వస్తుంది. తకాకో ఉద్యోగం కూడా వదిలేసి చాలా నైరాశ్యంలో కూరుకుపోయినప్పుడు ఆమె తల్లి తన సోదరుడు సతోరుకి ఫోన్ చేసి తకాకోని తన దగ్గరికి పిలవమని కోరుతుంది. అలా తకాకో మేనమామ నడిపే సెకెండ్ హాండ్ పుస్తకాలమ్మే షాపుకి వస్తుంది. దుమ్ము కొట్టుకుపోయిన పుస్తకాల మధ్య రెండో అంతస్థులో తన కొత్త జీవితం మొదలు పెడుతుంది.
మేనమామ లేనప్పుడు షాప్ కౌంటర్‌లో కూర్చోవడం, మిగిలిన సమయమంతా నిద్రపోవడం దినచర్యగా బతుకుతూ ఉంటుంది. ఈ పుస్తకం తకాకో స్వీయ ఆవిష్కరణ ప్రయాణాన్ని, పుస్తకాలతో ఆమె అనుబంధాన్ని, తన మామయ్యతో ఆమె అనుబంధాన్ని చిత్రిస్తుంది. కథలోని బలమైన అంశం ఏమిటంటే, జపనీస్ సంస్కృతి మరియు జింబోచోలో పుస్తకాల దుకాణాల వాతావరణం గురించి రచయిత హృద్యంగా వర్ణించాడు.
బుక్‌షాప్‌లోని నిశ్శబ్దం, పుస్తకాల వాసన, షాప్‌కి వచ్చేపోయే వారితో కబుర్లు, మేనమామతో చిన్న చిన్న సంభాషణలు తప్ప బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడూ నిద్రపోతుండే తకాకో మెల్ల మెల్లగా మామతో బయటకెళ్ళడం, ఇతర పుస్తకాల షాపులకు వెళ్ళడంతో ఆమె ప్రపంచం క్రమంగా విస్తరించడం మొదలౌతుంది. తన బోయ్ ఫ్రెండ్ కలిగించిన మానసిక వేదనలో ఉన్న తకాకోలో మారిన తన జీవన విధానం వల్ల వచ్చిన మార్పు స్పష్టంగా చూడొచ్చు. కాఫీ షాప్‌లో స్నేహాలు తనని సేదతీరుస్తాయి. ముఖ్యంగా తాను నివాసం ఉంటున్న సెకండ్ హాండ్ పుస్తకాల షాపులోని పుస్తకాలను ఎంతో ఇష్టంగా చదవడం, జపనీస్ సాహిత్యంలోని ముఖ్యమైన రచయితలందరినీ చదవడంతో తకాకో జీవితం ఒక విశాలమైన పధంలోకి ప్రవేసిస్తుంది. తన దుఖం నుండి బయటపడగలుగుతుంది.
కథ చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. తీవ్రమైన మానసిక కల్లోలంలో ఉన్న తకాకో ఎలా దాన్నుండి బయటపడిరది, తాను బయట పడడమే కాకుండా మామ, అతని భార్యల సమస్య పరిష్కారంలో తన పాత్రని ఎలా పోషించిందో చూసినప్పుడు తకాకోలో వచ్చిన మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ మార్పుకి ముఖ్యంగా ఆమె ఆ పుస్తకాల షాప్‌లో చదివిన పుస్తకాల ప్రభావం, తనకు తాను విధించుకున్న ఒంటరితనం నుండి బయటపడడం ముఖ్యమైనవి. ఆమె కోలుకోవడంలో మేనమామ చాలా సపోర్ట్ చాలా ఉంటుంది. ఐదు సంవత్సరాల తర్వాత హఠాత్తుగా ఇంటికొచ్చిన మేనమామ భార్య మొమొకోతో ఏర్పడిన అనుబంధం ఇవన్నీ కలగలిసి తకాకో బలమైన వ్యక్తిత్వాన్ని ఎలా రూపొందించుకోగలిగగిందో చదవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది.
రచయిత సతోషి శైలి చాలా సరళగా ఉండి ఎలాంటి ట్విష్ట్‌లు లేకుండా నవల చాలా మెల్లగా సాగుతుంది. ఎంతటి ఉద్వేగ భరితమైన సన్నివేశమైనా నిదానంగా, నెమ్మదిగా నడుస్తుంది. కిండిల్ లో రెండు రోజుల్లో చదవడం పూర్తి చేసాను. పాత పుస్తకాల షాపు నిండా ఉన్న పుస్తకాల గురించి కానీ జపాన్ సాహిత్యం, రచయితల గురించీ ఎలాంటి అవగాహన లేకపోవడంవల్ల కొంత నిరాశ అనిపించింది.
వ్యక్తిగత జీవితంలోని సంక్షోభంవల్ల డిప్రెషన్‌లోకి జారిపోయిన తకాకో దాని నుండి బయటపడిన వైనం చాలా అసక్తికరంగా ఉంటుంది. చివరికీ కాఫీ షాప్‌లో పరిచయమైన వాదా అనే కుర్రాడినతో మళ్ళీ జత కట్టి బోయ్ ఫ్రెండ్‌గా తన జీవితంలోకి ఆనందంగా ఆహ్వానించచడంతో నవల సుఖాంతమైంది.
ఈ పుస్తకం చదవమని చెప్పిన ఉమా నూతక్కికి థాంక్స్.
