డ్రెస్సింగ్. బట్టలు. వస్త్రాలు. అలం కరణ. గౌరవం. హుందాతనం. సాంప్ర దాయం. సంస్కృతి. అసభ్యం. వెకిలితనం. ఒంపుసొంపుల ప్రదర్శన.
మగవారిని ఆకర్షించుట. కులుకులాడి, కులట.
… … …
ఎన్నడైనా గాలి తగలక ఒరుసుకు పోయిన తొడల గురించి విన్నారా? తడి ఆరని ముట్టు బట్టల వలన చర్మాన్ని గీసుకుపోతున్నా లెక్కజేయ్యాక పనిచేసే ఆడవారి కష్టం చెప్పారా?
పోనీ బిర్రుగా లాగిన ఆ లంగా బొందు ఏళ్లకేళ్లు చర్మంలోకి కోసుకుపోయి మిగిల్చిన నల్లని చారలని? గట్టిగట్టిగా లాగి వేసుకున్న ఆ రవిక ఊపిరి గట్టిగ తీసుకోనియ్యక …
వేసవి మధ్యాహ్నాలలో ముస్లిం ఇళ్ల వాకిళ్ళ మధ్యన ఫీల్డ్ మీటింగ్‌కి వెళ్తే, అక్కడంతా ముసుగులలో మాడుతున్న మహిళలు. ‘ఇక్కడంతా మహిళలే, నఖాబ్ వరకు తీసేయండి’ అని వారి నాయకురాలు చెబితే, ఆ నఖాబ్ తీసి ముందుగా గట్టిగా గాలిని పీల్చి వదిలేవారు. ఊపిరిని కూడా లాగేసుకున్న సంస్కృతిని గౌరవించే స్త్రీలు.
… … …
స్వేచ్ఛ పెరిగింది, సమానత్వం వచ్చింది అనుకుంటాం. కానీ వైర్ మెష్ బ్రాలు, టమ్మీ-థై టక్కర్లు, బూటీ ఎన్హాన్సర్లు- కొలతలు, మచ్చలు, స్ట్రెచ్ మార్కులను పోగొట్టే నునుపు క్రీములు, లేజర్ ట్రీట్మెంట్లు.
ఎండలో పనిచేసే ట్రాఫిక్ గార్డుకి, కండక్టరమ్మకి, ఏ.ఎన్.ఎమ్ములకు, సఫాయి కర్మచారులకు పైవన్నీ తెలుసునా? తెలియకపోయినా తెల్లని తెలుపుకు నల్లని నలుపుకు మధ్యన పెరిగే కట్నం కథలు తెలుసు, రంగు మారితే ఎదురయ్యే అవమానం తెలుసు.
… … …
టైట్ బట్టలు, ఇబ్బంది పెట్టె పూసలు, చమ్కీల చీరలు. వేసవి కాలంలో పెళ్లిళ్లు, పట్టుబట్టలు. ఏసీ లేని ఫంక్షన్ హాళ్లలో తిరునాళ్లలో- చిటపటమంటూ పిల్లల నెత్తుకుని చెమటలు కారుతున్న స్త్రీలు.
‘సంస్కృతిని కాపాడండి, ఒళ్ళంతా బట్టలు కప్పుకోండి, మగవారిని తరించండి’, అని అక్కడ అరుస్తున్నారు. ‘ఊపిరి తీయకండి, దురదలు పట్టించుకోకండి, గాలి తగలనివ్వకండి, రోగాలని పట్టించుకోకండి’ అని వినిపిస్తోందేంటో.
మా బట్టలు మా ఇష్టం, నువ్వెవడివి చెప్పడానికి అని – కూర్చోవడానికి, వంగడానికి, నడవడానికి భయపడే మోడరన్ అప్పారెల్స్! మీకు, ఆ దుప్పటి చీర కట్టుకున్న వారికి తేడా ఏంటమ్మా? ఇద్దరిదీ ఇబ్బందే.
మగపిల్లలను ఆకర్షించే పొట్టి బట్టలు వద్దని, సాంప్రదాయపు చీరలే ముద్దని చెప్పినప్పుడు మళ్ళీ ఆ చీరలు కూడా ఇష్టమైన పద్ధతిలోనే కట్టి జుట్లకు సవరాలు, పూలు, కుప్పెలు, మొహానికి బొట్లు అద్ది, నిగనిగ నిగారించుకున్న మొహాలతో ఉన్నప్పుడు మగవారుండరా? ఆ అలంకరణ మగవారి కోసం కాదా?
సాంప్రదాయంగా ఉండడం అంటే మగవారిని ఆకర్షించడమేనా? లేక కాదా?
… … …
చీరకడితేనే స్త్రీత్వమనే ఇంతటి సాంప్ర దాయ వాదులూ ట్రాన్స్ మహిళలను మెచ్చుకోరు. వారి కట్టు బొట్టు నచ్చదు. వారంటే వెక్కిరంత. వారి మాట తీస్తే అవమానం.
పోనీ శ్రమజీవుల జోలికి పోతారా? వాళ్ళసలు వీళ్ళ లెక్కల్లోకే రారు. విపరీతంగా శ్రమచేసే ఆడవారికి వద్దా సాంప్రదాయం?
సాంప్రదాయపు లెక్కలేవో సాంప్రదా యవాదులకే తెలీదేమో.
… … …
ఒకసారి ట్రైనింగ్ క్లాసులో ఒకడు ‘అమ్మాయిలు బట్టలు వేసుకునేది మేము చూడడానికే కదా, మరి మేమేమీ అనకూడదు అంటారెందుకు?’ అన్నాడండి. ఈ లెక్కన మహిళా కళాశాలలో అమ్మాయిలంతా జుత్తులు చెదిరిపోయి, చినిగిపోయి నలిగిపోయిన బట్టలేసుకుని రావాలి మరి. కానీ ఎందుకో మగవారు లేని చోట ఆడవారు మాత్రమే ఉన్నచోట, ఆడవారు చాలా స్వేచ్ఛగా ఉండే బట్టలే వేసుకుంటారు. ఇంకా అందంగా తయారవుతారు కూడా. భద్రత ఉన్న చోట భయం ఉండదుగా.
ఈ కాలంలో కూడా ఇంకా జేబులు లేని, హాయిగా నడవడానికి వీలులేని బట్టలు వేసుకునేవారు కోకొల్లలుగా ఉన్నారు. గాలి తగిలే, అటుఇటు కదిలినా అడ్డురాని బట్టలు పూర్తిగా వేసుకోగలిగే పరిస్థితి అందరికీ రాలేదు. ఇప్పటికి సానిటరీ పాడ్స్ లేక బాధపడుతున్నవారు, సరైన బట్టలు లేక ఇబ్బంది పడుతున్న ఆడవారు ఉన్నారు.
ఈ విషయాలు పట్టించుకునే దిక్కులేదు కానీ సాంప్రదాయం కావాలంట సాంప్ర దాయం!
జేబులు లేకపోవడం
హాయిగా నడవలేకపోవడం
గాలి తగిలేలా వదులైన బట్టలు, ఏటంటే అటు కదిలేలా అడ్డురాని బట్టలు వద్దా మనకు.
