అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి
తమిళనాడులోని విరుదాచలంలో ఉండే బంకమన్ను కళాకారులు పింగాణీ బొమ్మలను, మట్టి దీపాలను తయారుచేస్తారు. అయితే, అంతకుముందులా ఈ పని వాళ్ళకు స్థిరమైన ఆదాయాన్నీ, తగిన గుర్తింపునూ తీసుకురావడం లేదు. అయినప్పటికీ, ఇక్కడి కళాకారులు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. వాళ్ళ చేతులు మట్టి నుండి కళాత్మక వస్తువులను సృష్టిస్తూనే ఉన్నాయి.
మట్టి బొమ్మల గురించి ఆలోచించినప్పుడు, నేను తిరిగి నా బాల్యంలోకి వెళ్ళిపోతుంటాను. నది ఒడ్డున తిరుగుతూ, చెరువులో చేపలు పడుతూ, నీటి అంచుల వెంబడి ఉండే బంకమట్టితో సొంతంగా మా బొమ్మలు తయారు చేసుకున్న రోజుల్లోకి. ఆ బొమ్మల్లో ఎక్కువగా మన చుట్టూ వ్యవసాయ రంగంలో కనిపించే ఎద్దులు, ట్రాక్టర్ల వంటివే ఉండేవి. మట్టితో నా అనుబంధం అలా మొదలైంది.
తరువాత, నేను ఎళిల్ అన్నతో కలిసి ప్రయాణం చేయడం మొదలు పెట్టినప్పుడు, ఆ బంధం మరింత బలపడిరది. అతను లెక్కలేనన్ని మట్టి బొమ్మలు, ముఖానికి పెట్టుకునే మాస్కులు తయారుచేసేవారు. పిల్లలకు నేర్పించేటప్పుడు, అన్ని రకాల ఆకృతులను రూపొందించేవారు. ఆయన పనితనాన్ని చూస్తూ, నిజంగా బంకమట్టితో ఇవన్నీ తయారు చేయవచ్చా అని నేను ఆశ్చర్యపోయేవాడిని.
అయితే, మేమందరం ఒక బృందంగా ఏర్పడి, కళిమన్ విరళ్గల్ (తమిళంలో, బంకమట్టి అలుముకున్న చేతివేళ్ళు) అనే సంస్థను స్థాపించినప్పుడు, నేను మరింత ఆశ్చర్యానికి లోనయ్యాను. పిల్లల కోసం కార్యశాలలు నిర్వహించడానికి మేం ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ గ్రామంలో స్థానికంగా దొరికే బంకమట్టినే బొమ్మల తయారీకి ఉపయోగించేవాళ్ళం. అప్పుడే, నా నిజమైన అన్వేషణ మొదలైంది. బంకమట్టి కోసం, దానిలో దాగిన కథల కోసం.
కొన్నేళ్ళ క్రితం, విరుదాచలంలో నిర్వహించిన పింగాణీ కార్యశాలలో, సుగుణ అక్క పరిచయమైందని ఎళిల్ అన్న నాకు చెప్పారు. కొంతమంది మహిళలు కలిసి ఆ ప్రాంతంలో ఒక పింగాణీ కర్మాగారాన్ని నడుపుతున్నారు. వాళ్ళ కథ విన్న తరువాత, ఆ మహిళల్ని కలవాలని, వాళ్ళు తయారుచేసిన బొమ్మల్ని చూడాలని, అలాగే వాళ్ళ ప్రపంచాన్ని నా కెమెరాలో బంధించాలని నిర్ణయించుకున్నాను.
పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో చేరిన తరువాత, ఇది నేను అందరికీ చెప్పాల్సిన కథ అని అర్థమైంది. చీజుజు తరువాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత పేరు మీద అరియలూర్‌లో స్థాపించబడిన అనిత గ్రంధాలయంలో నేను కార్యశాల నిర్వహించడానికి వెళ్ళినప్పుడు మొత్తానికి నేను సుగుణను కలిశాను. ఆ తరువాత మేం చాలాసార్లు కలిశాం. చివరికి, ఆమె పనిని డాక్యుమెంట్ చేయడానికి నేను తన గ్రామానికి వెళ్ళాను.
ఈ ప్రాంతం పింగాణీ వస్తువులకు ప్రసిద్ధి చెందింది. గతంలో ప్రభుత్వ మద్దతుతో కళాకారులు ఈ పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడదంతా గతం. నేను అలా అడుగు పెట్టగానే, పింగాణీ బొమ్మల్ని ప్రదర్శనకు పెట్టి అమ్మేవాళ్ళ ఇళ్ళ వరసలు కనిపించాయి. పరిశ్రమ మూతపడడంతో, ఇప్పుడు ఎక్కడ చూసినా మట్టి దీపాలే ఉన్నాయి ు తాజాగా తయారు చేసినవి కొన్ని, ఆరబెట్టడానికి పక్కన పెట్టినవి మరికొన్ని. విరుదాచలం, అలాగే దాని చుట్టుపక్కల గ్రామాలలోని దాదాపు ప్రతీ వీధి పింగాణీ శిల్పాలతో, దీపాలతో నిండివుంటాయి.
వస్తువులను మోసుకెళ్ళడం, లారీలలో ఎక్కించడం, ఇతర పట్టణాలకు పంపడం వంటి పనులతో ఆ గ్రామం మొత్తం కోలాహలంగా కనిపించింది. టోకున బొమ్మలు కొనడానికి దూర ప్రాంతాల నుండి వ్యాపారులు వచ్చారు. నేను వెళ్ళగానే నన్ను పలకరించిన దృశ్యం ఇదే. ఒక చిన్న సాలలో సుగుణ అక్క, ఆమె భర్త బొమ్మలు తయారుచేస్తున్నారు. ఆమే ఉల్లాసంగా ఉండే మాటకారి మహిళ – ఆమె చెప్పే కథలు ఒక చోట మొదలై మరొక చోట ముగుస్తాయి. కానీ, ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆమె జీవితం ఎంత గొప్పదో, ఆమె చెప్పే కథలు ఎంత నిండుతనంతో ఉంటాయో మనం గ్రహించవచ్చు.
సుగుణ కథ: వణక్కమ్ (నమస్కారం)! నా పేరు సుగుణ. నేను 2008 నుండి ఈ పని చేస్తున్నాను. చాలా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులను కోల్పోయాను. నాన్న చనిపోయిన తరువాత, మా అమ్మ దగ్గర్లోని బొమ్మల కార్మాగారంలో పనిచేయడం మొదలుపెట్టింది. అమ్మ ఇంటికి బొమ్మలు తీసుకు వచ్చేది. అప్పుడే, నాకు వాటి పట్ల ఇష్టం మొదలైంది. నాకు నాలుగేళ్ళ వయసున్నప్పటి నుండి, నేను బడి కంటే బొమ్మల పట్లే ఎక్కువగా ఆకర్షితురాలినయ్యాను. వీటిని ఎలా తయారుచేస్తారు? దేనితో తయారుచేస్తారు అని ఆశ్చర్యపోయేదాన్ని.
అమ్మ చనిపోయినప్పుడు మా అవ్వ, ‘ఇక నువ్వు బడికి వెళ్ళడం కుదరదు. నేను నిన్ను పోషించలేను,’ అని చెప్పింది. అక్కతో పాటు నన్నూ అదే కర్మాగారంలో పనికి పంపేది. అప్పుడు నాకు పదేళ్ళు.
మొదట్లో, మట్టిని కలిపి జల్లెడ పట్టడానికి మాత్రమే నాకు అనుమతి ఉండేది. బొమ్మలను ముట్టుకోనిచ్చేవారు కాదు. రెండేళ్ళ తరువాత, అచ్చుల్లో మట్టిని పోయటం మొదలుపెట్టాను. నెమ్మదిగా నేను కూడా పోతపని నేర్చుకున్నాను. కొంతకాలం తరువాత, ఇందులో మరింత రాణించాలనిపించింది. అప్పుడే నేను ఈ కళను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఇది నేర్చుకోవడానికి నాకు నాలుగేళ్ళు పట్టింది. నాకు 14 ఏళ్ళ వయసప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టి, రోజుకు రూ. 75 సంపాదించేదాన్ని. కళాకారులు రూ.100 సంపాదించేవారు. నేనూ అంత ఇవ్వమని అడిగినప్పుడు, ‘నువ్వింకా చిన్నదానివి,’ అనేవారు. దాంతో, నేను అక్కడ పని మానేశాను.
తరువాత, నేను కాంట్రాక్ట్ పనులు చేపట్టాను. కళాకృతుల కోసం ఒక 10 కంపెనీల నుంచి నాకు ఆర్డర్లు వచ్చాయి. అప్పుడే, మనం ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే, మన పనే మన ఎదుగుదలకి కారణమవుతుందని గ్రహించాను.
నెమ్మదిగా జనం నన్ను గౌరవించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో కళాకారులు మాత్రమే మేజాల వద్ద కూర్చునేవారు. మిగతావాళ్ళు నేల మీద. ఒకప్పుడు నన్ను తోసేసిన వ్యక్తులే నన్ను తిరిగి పనిలో చేరమని అడగడం మొదలుపెట్టారు. బొమ్మల తయారీలో కళ్ళను, పెదవులను, కొన్ని చిన్న చిన్న వివరాలను తీర్చిదిద్దటమే నా పనిని ప్రత్యేకంగా నిలబెట్టింది.
కానీ కొన్ని ప్రదేశాలు భరించరానివిగా ఉంటాయి. వాళ్ళు స్త్రీలను చూసే విధానం, మమ్మల్ని ఎగతాళి చేసే విధానం – ఇచ్చే జీతం ఎంతైనా సరే, నేను తిరిగి అక్కడకు పనికి వెళ్ళడానికి నిరాకరించేదాన్ని. అలాంటి ఒక కర్మాగారంలోనే నేను నా భర్తను కలిశాను. అతను విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు, కానీ ‘మనం పెళ్ళి చేసుకుంటే, నువ్వు ఇక్కడే ఉండి నాతో కలిసి ఈ కంపెనీని నడపాలి,’ అని అతనితో అన్నాను. అదే నేను పెట్టిన ఏకైక షరతు. నాకు ఈ పని అంటే ఎందుకంత ఇష్టం? బహుశా, అది మట్టి కావటం వల్ల కావచ్చు. నేను దానికి ఒక ఆకృతినిస్తాను, ప్రాణం పోస్తాను, ప్రజలు దాన్ని ఆరాధిస్తారు. ఇందులో ఉండే సంతోషమే నన్ను ముందుకు నడిపిస్తోంది.
ఈ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు మహిళలు మాత్రమే మట్టి పని చేస్తారు. అయితే, మొత్తం కళాకృతులను సృష్టించే ఏకైక వ్యక్తిని, మొట్టమొదటి మట్టిబొమ్మల కళాకారిణిని మాత్రం నేనే. నా సొంత ముద్రను – ఒక ప్రత్యేక శైలి కలిగిన బొమ్మల్ని తయారుచేయడం – ఏర్పరచుకోవటం నా కల. ఒకసారి ఒక ప్రసిద్ధ కళాకారుడు నాతో ఇలా అన్నాడు: ‘ఇది స్త్రీలు చేయాల్సిన పని కాదు. మీ వాహనం చెడిపోతే మీరేం చేస్తారు? దాన్ని ఎవరు తోస్తారు?’ అందుకే, నేను నా సొంత వాహనం కొనుక్కున్నాను, ఒంటరిగా ప్రయాణించాను, ఆర్డర్లు తీసుకున్నాను, నేనే బొమ్మల్ని డెలివరీ చేశాను కూడా. అప్పుడు నాకు కేవలం 16, 17 ఏళ్ళు ఉండవచ్చు.
‘నువ్వొక అమ్మాయివి, నిజంగా ఎల్లకాలం నువ్వీ పనిని చేయగలననుకుంటున్నావా?’ అని జనాలు నన్ను ఎగతాళి చేశారు కూడా. అయితే, అదె నన్ను బలంగా చేసింది. మహిళలు చేయలేరు అని జనం చెప్పుకునే పెద్ద పెద్ద బొమ్మలు తయారుచేయడం మొదలుపెట్టాను. వాళ్ళు నన్ను అహంకారి అన్నారు, నాకు పొగరు అన్నారు. కానీ వారికున్న ఆ అభిప్రాయమే నన్ను కాపాడిరది. ఆ తరువాత, నా గురించి ఎవరూ చెడుగా మాట్లాడే ధైర్యం చేయలేదు. మేం ప్రారంభించినప్పుడు, ఈ కళ తరతరాలకు నిలిచిపోతుందని నమ్మాం. ఇప్పుడు, మనుగడే కష్టంగా మారింది. గుజరాత్, కరైకల్ లాంటి ప్రదేశాలలో ప్రస్తుతం యంత్రాలే బొమ్మల్ని తయారుచేస్తున్నాయి. మా లాంటి చిన్న తయారీదారులం ఎప్పటికీ వాటితో పోటీ పడలేం.
స్థానికంగా కూడా మాకు మద్దతు లేదు. ‘ఈ కురవర్లు (కుమ్మరులు) తయారుచేసే బొమ్మల్ని ఇప్పుడిరకా ఎవరు కొంటారు?’ అంటున్నారు. అలా నెమ్మదిగా, వాళ్ళు తమ సొంత కళకు దూరం జరిగారు. ప్రస్తుతం, త్వరత్వరగా అచ్చు పోసి, ఎండబెట్టి, చౌక రంగులు వేసే మాములు మట్టి బొమ్మలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. అయితే, నిజమైన పింగాణీ పని ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. దీనికి సమయం, శ్రద్ధ, నైపుణ్యం చాలా అవసరం. ఇంత కష్టపడ్డా కూడా, కొనుగోలుదారులు దొరుకటం కష్టమవుతోంది.
కొందరు చేసిన నాణ్యత లేని పని వల్ల, కళకు ఉన్న మంచి పేరు పోయింది. ఇది పూర్తిగా కనుమరుగైపోతుందేమోనని కొన్నిసార్లు నాకు భయమేస్తుంటుంది. ఇప్పుడు మాకు మంచి బంకమట్టి పణ్రుతి బంకమట్టి లా అరుదుగా దొరుకుతోంది. ఉత్తమ నాణ్యత గల బంకమట్టిని ఎగుమతి చేస్తుండటంతో, మిగిలిపోయింది మాకు దొరుకుతోంది. ఒక టన్ను బంకమట్టి ధర 3,000 నుండి 4,000 రూపాయలుబీ మిశ్రమం చేయటానికి మాకు అవసరమైన రకం ధర రూ.10,000. 200 బొమ్మల మీద మాకు వచ్చే 5,000 రూపాయల్లో, ఖర్చులకు పోను మాకు మిగిలే ఆదాయం కేవలం రూ.1,000 మాత్రమే!
మేం ముడి బంకమట్టిని కొని, దాన్ని బెంటోనైట్, సోడా సిలికేట్, సిలికాతో కలుపుతాం. ఇలా చేస్తే, అది దృఢత్వాన్ని, మెరుపును మెరుగుపరుస్తుంది. కేవలం సాదా బంకమట్టి నిలబడదు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను. దాంతో, మా అవ్వ నన్ను పెంచింది. కానీ, ఎండలో కష్టపడుతూ కూలి పనిచేయడం కంటే, ఈ పనే నాకు ఆశ్రయాన్ని, నీడనూ ఇచ్చిందని ఆమె అన్నారు. నా సొంత కంపెనీని ప్రారంభించటానికి మాకు దగ్గర్లో ఉన్న సంబంధమే చేసుకున్నాను. మా పెళ్ళయ్యి ఇప్పటికి మూడేళ్ళు. నాకు మూడేళ్ళ వయసున్నప్పుడు నాన్న, ఆరేళ్ళ వయసున్నప్పుడు అమ్మ చనిపోయారు. నా తోబుట్టువులు వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారు, కానీ నేను ఉండిపోయాను. ఎందుకంటే, నాకు పింగాణీ కళాకృతులంటే చాలా ఇష్టం. నేను నేనుగా ఉండటానికి అవే కారణం.
కానీ, కాలం మారింది. ముడి పదార్థాల ధరలు బాగా పెరిగాయి, లాభాలు తగ్గాయి. ధనవంతులు మాత్రమే మంచి బంకమట్టిని టోకున కొనగలరు. మహిళలు ఇంటిపట్టునే ఉండాలని సమాజం ఇప్పటికీ భావిస్తోంది. నా డిజైన్లు బాగా అమ్ముడుపోతే, అది కేవలం నా అదృష్టం అని వాళ్ళంటారు. అవి బాగా అమ్ముడుపోకపోతే, అందుకు నా దురదృష్టమే కారణమని నిందిస్తారు. అందుకే, ప్రస్తుతానికి నేను నా నమూనాలను నా దగ్గరే అట్టిపెట్టుకున్నాను. మేం తయారు చేసే 40 నమూనాలన్నీ నా డిజైన్లే. బయటైతే వాటి ధర రూ.5,000 వరకు ఉంటుంది. ఇక్కడ మేం తక్కువ ధరకే అమ్ముతాం. కానీ జనం మాత్రం ‘స్థానికంగా దొరికేవన్నీ తప్పకుండా నాసిరకమైనవే,’ అనుకుంటారు. బొమ్మలన్నిటిలోకి నాకు మురుగర్ విగ్రహాలు తయారుచేయడమంటే చాలా ఇష్టం. ఆభరణాలు, కిరీటం, తోరణం – ఇవన్నీ చేయటాన్ని చాలా ఇష్టపడతాను.
దగ్గర్లో ఉన్న ప్రభుత్వ బట్టీ తెరవకపోవటంతో, కిలోకు రూ.20-25 వసూలు చేసే ప్రైవేట్ బట్టీలనే మేం ఉపయోగిస్తాం. ప్రభుత్వ బట్టీల్లో రేటు రూ.17-18 ఉంటుంది. బహుశా, మేమందరం కలిసి ఒకసారి అధికారులను సంప్రదిస్తే ఈ పరిస్థితుల్లో ఏమైనా మార్పు రావచ్చు. కానీ ఇక్కడి జనం సహకరించరు. తంజావూరులో పరిస్థితి భిన్నంగా ఉంటుంది – అక్కడ ఐక్యత ఉంది, ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తోంది.
మాకు కావలసిన సామాగ్రి తెల్ల బెంటోనైట్, ఫైర్ క్లే ఇతర రాష్ట్రాల నుండి వస్తుంది. ఒక టన్ను మంచి బంకమట్టి ధర రూ.15,000 ఉంటుంది, కానీ మా బొమ్మలు ఒక్కొక్కటి కేవలం రూ.30కి మాత్రమే అమ్ముడుపోతాయి. అలాగే, 100 గ్రాముల రంగులకు రూ.200-300 ఖర్చవుతుంది. ఇందంతా మేమెలా భరించగలం? ఐదేళ్ళ క్రితం మేమొక సంఘాన్ని ప్రారంభించాం, కానీ మాకు నిజమైన మద్దతు మాత్రం రాలేదు. ప్రభుత్వం ముడి పదార్థాలపై సబ్సిడీ ఇవ్వడం, తక్కువ ధరకు యంత్రాలను అందించడం లాంటివి చేస్తే, ఈ కళ మనుగడ సాగించగలదు. ప్రస్తుతానికి, పెద్ద పరిశ్రమలే లాభపడుతున్నాయిబీ చిన్న కార్మికులు మాత్రం ఎలాగోలా సాగుతున్నారు. ఇన్నేళ్ళ తరువాత కూడా జనం ఇప్పటికీ ‘‘ఆమె ఏం సాధించింది?’’ అనడుగుతారు. ఆ మాట నన్ను బాధిస్తుంది.
మేం మొదలుపెట్టినప్పుడు, మా బొమ్మలను కొనడానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నుండి వ్యాపారులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయుధ పూజ, నవరాత్రి కొళు (కొలువు) పండుగల సమయంలో మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. మిగిలిన సంవత్సరమంతా అమ్మకాలే ఉండవు. అగళ్ విళక్కులు (మట్టి దీపాలు) మాత్రమే స్థిరంగా అమ్ముడవుతాయి. వాటిని ఒక్కొక్కటీ రూపాయికి అమ్ముతాం. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలోని దేవాలయాలకు, పండుగ సమయాల్లో ఎగుమతి అవుతుంటాయి. నిల్వ చేసుకునే స్థోమత లేకపోవడంతో, మా సరుకునంతా గోదాములకు పంపిస్తాం. ఇందువల్ల మధ్యవర్తులు లాభపడతారు, కానీ మాకు అరకొర ఆదాయమే వస్తోంది. అదే మా దగ్గర మూలధనం ఉంటే, పండుగ సీజన్ వరకూ మా ఉత్పత్తులను నిల్వ చేసుకొని నేరుగా అమ్ముకోవచ్చు.
ఇక్కడ వంద మీటర్ల పరిధిలోనే కనీసం 10 కార్యశాలలు ఉన్నాయి. చాలామంది వివిధ రకాల బొమ్మలు తయారుచేస్తారు, మిగిలినవారు దీపాలు తయారుచేస్తారు. అనేకమంది కళాకారులు అగళ్ పనికి మారిపోయారు. ఒక చిన్న తప్పు జరిగినా పూర్తి నష్టం జరిగే బొమ్మల్లా కాకుండా, అది స్థిరంగానూ సురక్షితంగానూ ఉంటుంది. అందుకే, వచ్చే ఏడాది మేం కూడా మారిపోదామనుకుంటున్నాం.
సుమతి కథ: నా పేరు సుమతి. నేను 15 ఏళ్ళుగా ఒక చిన్న పింగాణీ బొమ్మల కంపెనీని నడుపుతున్నాను. కొన్నిసార్లు బొమ్మలు అమ్ముడుపోతాయి, కొన్నిసార్లు అమ్ముడుపోవు. వర్షాకాలంలో ఏదీ ఎండదు. దాంతో పని ఆగిపోతుంది. ఈ పని మానేసి వేరే ఏదైనా పనికి పోతే మంచిదేమోనని ఎన్నోసార్లు ఆలోచించాను. నా పెళ్ళి ముంబైలో జరిగింది, కొంతకాలం సూరత్‌లో నివసించాను. నా భర్త పచ్చి తాగుబోతు. అందుకే, 2005లో నేను పుట్టింటికి తిరిగి వచ్చాను. పింగాణీ వస్తువుల తయారీ నేర్చుకోవడం మొదలుపెట్టి, కొద్ది రోజుల్లోనే ఒక చిన్న కార్యశాలను ఏర్పాటు చేశాను. ఈ పని చేస్తూనే నా కొడుకును పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు వాడు కాలేజీకి వెళ్తున్నాడు.
మేం బొమ్మలను రూ.25కి అమ్మితే, మా దగ్గర కొన్నవారు వాటిని తిరిగి రూ.100కి అమ్ముతారు. అద్దె, రంగులు, జీతాలు చెల్లించిన తరువాత మాకు మిగలేదేమీ ఉండదు. అయినా నేనీ పనిని వదిలేద్దామనుకోవడం లేదు నాకు తెలిసింది ఇదొక్కటే. మాకు నేర్పేవాళ్ళెవరూ లేరు. నేను నేర్చుకున్నదంతా ఇతరులను చూసి, సొంతంగా ప్రయోగాలు చేయడం ద్వారానే నేర్చుకున్నాను. బస్సుకు రెండు రూపాయలు కూడా ఖర్చుపెట్టే పరిస్థితి లేకపోవడంతో, మూడు కిలోమీటర్లు నడిచి మరీ పనికి వెళ్ళేదాన్ని. మొదట్లో రోజుకు ఒక బొమ్మను చేసేదాన్ని. ఇప్పుడు, ఒక బొమ్మను గంటలో పూర్తి చేసేస్తాను. ఖాళీ చేతులతో నడుచుకుంటూ పనికి వెళ్ళడం దగ్గర నుండి నా సొంత కాళ్ళ మీద నిలబడటం వరకు నేను చాలా దూరమే ప్రయాణించాను.
వ్యాపారం నెమ్మదిగా సాగుతున్నప్పటికీ, జీవితం ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉంది. ధరలు పెరిగాయి, కానీ ఇప్పటికీ కొనుగోలుదారులు బేరాలు చేస్తుంటారు. ఒక రోజు వ్యాపారం బాగుంటే, మేం కడుపు నిండా తింటాం. బాగా లేకపోతే, మరుసటి రోజుకు అవసరమైన మట్టి గురించో, కట్టాల్సిన విద్యుత్ బిల్లు గురించో చింతిస్తూ రాత్రంతా గడుపుతాను. అయితే, నా కొడుకే నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు, నేనెందుకు పెళ్ళి చేసుకున్నాను? ఎందుకు బిడ్డను కన్నాను? అని నన్ను నేను ప్రశ్నించుకుంటుంటాను. తనను ఇంకా మంచి బడికి ఎందుకు పంపలేదని వాడు నన్ను అడిగినప్పుడు, నాకు బాధ కలుగుతుంది. అయినా కూడా, ఈ పని వల్లే మేం ఇలా బతకగలుగుతున్నాం. నేను 17 ఏళ్ళుగా ఇందులోనే ఉన్నాను. మట్టిని సేకరించడం నుండి అచ్చు పోయడం వరకు, ప్రతీ దశ నాకు సుపరిచితమే. ‘‘ఒక మహిళవై ఉండి కూడా నువ్వు చాలా బాగా చేశావు,’’ అని జనం చెప్పినప్పుడు నాకు గర్వంగా ఉంటుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. వ్యాపారం స్థిరంగా ఉండనప్పటికీ, ఈ పనిలో గౌరవం ఉంది.
కె. గుణశేఖరన్ కథ: నేను ఈ రంగంలో పాతికేళ్ళుగా ఉన్నాను. కోవిడ్ వచ్చే వరకు, వ్యాపారం బాగానే సాగింది. కానీ ఆ తరువాత మొత్తం ఆగిపోయింది. ఒకప్పుడు నేను ఎనిమిది మంది కార్మికులతో ఒక కంపెనీని నడిపానుబీ ఇప్పుడు ఒక్కడినే పనిచేస్తున్నాను. అవసరమైన సామగ్రి ఖర్చులు ఎక్కువ, లాభాలు తక్కువ. 300 బొమ్మలకు నేను దాదాపు రూ.9,000 ఖర్చు పెడతాను. అంతా బాగుంటే, రూ.1,000 నుండి 1,500 వరకు లాభం వస్తుంది. మట్టి కానీ, రంగు కానీ తేడా వస్తే మాత్రం పూర్తిగా నష్టపోతాం. మార్కెట్ కూడా మారిపోయింది, ఇప్పుడెవరూ అలంకార వస్తువులు కొనడం లేదు. ఎల్‌ఇడి టీవీలు వచ్చాక షోకేసులు తక్కువైపోవటంతో జనం వాటిని పాతకాలపు బొమ్మలు అంటున్నారు.
ఇటీవల నా భార్య ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో చనిపోయింది. ఈ పని చేస్తున్నప్పుడు వచ్చే దుమ్ము వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. నాకు ఇద్దరు కొడుకులు. ఇకపై వాళ్ళను ప్రైవేట్ బడిలో చదివించలేను. వ్యాపారాన్ని, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. మాలో డస్ట్ ఎలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు సర్వసాధారణం. ప్రభుత్వం ఒకప్పుడు అగళ్ దీపాలను ప్రోత్సహించినట్లే, ఇప్పుడు పింగాణీ బొమ్మలను కూడా ‘విరుదాచలంలో తయారుచేసిన మట్టి బొమ్మలను కొనండి,’ అని ప్రోత్సహిస్తే బహుశా పరిస్థితులు తిరిగి చక్కబడవచ్చు. మేం ప్రభుత్వ పథకాల కోసం, బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు పెట్టుకున్నాం, కానీ ఆస్తి లేదా పూచీకత్తు లేకుండా ఎవరూ మాకు సహాయం చేయరు. ఈ కళ అవశేషాలను పదిలంగా పట్టుకొని మేం మా చేతులతో ఈ పనిని కొనసాగిస్తున్నాం.
ఈ స్త్రీ పురుషులకు మట్టి అంటే కళకు మాత్రమే పరిమితమైనది కాదు. అది వీరి మనుగడ. ఒక జ్ఞాపకం, ఒక ధిక్కారం. ఈ పని ఒక స్థిరమైన ఆదాయాన్ని, పనికి తగిన గుర్తింపును ఇంకెంతమాత్రం తీసుకురాదు, అయినా తయారీదారులు పట్టు విడవటంలేదు. పరిశ్రమలు యంత్రాల వైపు తిరుగుతూ, మార్కెట్ ముందుకు సాగుతున్నప్పటికీ ఈ చేతులు మట్టిలోంచి పుట్టిన ఈ కళ గౌరవాన్నీ, మొండి అందాన్నీ తాలిమితో రూపొందించటాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ కథనాన్ని మొదట తమిళంలో రాశారు.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/te/article/in-virudhachalam-art-from-the-earth-te) నవంబర్ 22, 2025 లో మొదట ప్రచురితమైనది.)
