శీలా సుభద్రాదేవి – పరిశోధన – గిరిజ పైడిమర్రి

‘‘నా సాహితీ వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. నేను రాస్తూ రాస్తూనే ఉంటాను. నేను అలసిపోలేదు. నా కలం ఇంకిపోలేదు. కవిత్వం నా శ్వాస. నిరంతర అధ్యయనం నా ఊపిరి’’ అంటూ తన డెబ్బై అయిదేళ్ళ వయసులో సాహిత్య సేవ చేస్తున్న.. మృదు స్వభావి శీలా సుభద్రగారు నేటి రచయితలకే కాదు, యువతరానికి స్ఫూర్తి ప్రదాత. ఆమె జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే కొనసాగిస్తున్న తన జీవన, సాహితీ ప్రస్థానాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

ప్ర. నమస్తే! సుభద్రాదేవిగారు. భూమిక పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయాలని వచ్చానండీ..
జ. చాలా సంతోషం గిరిజా! రండి, కూర్చోండి.
ప్ర. ముందుగా మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. అమ్మ పేరు రాజేశ్వరమ్మ గృహిణి. నాన్న కొడవంటి మల్లిఖార్జునస్వామి. కలెక్టర్‌ ఆఫీసులో క్లర్క్‌గా పనిచేసేవారు. ఆరోగ్యం బాగాలేనందువల్ల నా పదేళ్ల వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. నాకు ఇద్దరు అక్కలు. ఇద్దరు అన్నలు. నేనే చిన్నదాన్ని. నాకు ఊహ తెలిసే సరికే మా నాన్నగారి గుండె జబ్బుకి అమ్మ మెడలో నగలతో సహా కరిగిపోయి కుటుంబ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిరది. సంతకం మాత్రమే చేయగలిగిన వానాకాలపు చదువు ఆమెది. అయినప్పటికీ ఆత్మ స్థైర్యంతో.. నలుగురు పిల్లలతో.. ఒకరి మీద ఆధారపడకూడదనే భావనతో గుట్టుగా సంసారాన్ని నడిపేది అమ్మ. మమ్మల్ని కూడా ఒకరి కింద చేయి చాపకుండా బతకడం నేర్పింది. నాకు ఊహ తెలియకముందే మా మేనమామతో మా పెద్దక్కయ్య పెళ్ళి జరిగింది.
ప్ర. మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నా బాల్యం చెప్పుకునేటంత అందమైంది కాదు. గురజాడ అడుగుజాడల్ని అద్దుకున్న విజయనగరంలో 19/12/1949లో పుట్టాను. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాన్నగారు పోయారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయినా అమ్మకు పెన్షన్‌ రాలేదు. అప్పుడు మా పెదనాన్న మగపిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. అక్కడ నా చదువు ఆరో తరగతిలోనే ఆగిపోయింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు ముందుగా ఆగిపోయేది ఆడపిల్లల చదువే కదా.. చిన్నప్పటి నుంచీ నేను బొమ్మలు వేసేదాన్ని. మా పెద్దన్నయ్యకు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి అనే గ్రామంలో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. సంవత్సరం తర్వాత అక్కడ ఏడో తరగతి చదివాను. కుటుంబ కారణాల వల్ల మళ్ళీ ఎనిమిదో తరగతిలో నా చదువుకు అంతరాయం కలిగింది. ఏలూరు దగ్గర గోపన్న పాలెంలో ఉన్న అక్కయ్య దగ్గరుండి ఎనిమిదో తరగతి పూర్తిచేసాను. ఆ తర్వాత ఏడాదికి విజయనగరంలో తొమ్మిదో తరగతిలో చేరాను. అంతరాయంతో చదివినా ఎస్‌ఎస్‌ఎల్‌సి పాఠశాల స్థాయిలో రెండో టాపర్‌గా పాసయ్యాను. ఎంపిసి గ్రూప్‌తో అక్కడే పియుసిలో చేరాను. ఆ తర్వాత గణిత శాస్త్రం ప్రధానాంశంగా డిగ్రీకూడా (బిఎస్‌సి) పూర్తి చేశాను.
ప్ర. గణిత శాస్త్రం చదువుకున్న మీరు సాహిత్య రంగంలోకి ఎలా వచ్చారు?
జ. సాహిత్యంతో నా అడుగుల గురించి చెప్పాలంటే.. అక్షరాల వెంట నా తొలి అడుగులు వేయించిన మా పెద్దక్కయ్య పి. సరళాదేవి గురించి తప్పక చెప్పాలి. నా పాఠశాల చదువులో అవాంతరం వచ్చిన తొలి యేడాది నేను అక్కయ్య దగ్గర వున్నాను. ఆ ఏడాది కాలం పాఠశాల చదువు లేకపోయినా నా చేతుల్లో నిరంతరం సాహిత్య పుస్తకం ఉండేది. నేను రచయితను కావడానికి అక్కయ్య దగ్గర నేనున్న ఆ ఏడాది కాలమే దోహదకారి అని నమ్ముతాను. వాళ్ళింట్లో మంచి గ్రంథాలయం ఉండేది. ఆమె మిత్రులు మధురాంతకం రాజారాం గారు, ఎమ్‌.రాజేంద్ర, ఆవంత్స సోమసుందర్‌ లాంటి మిత్రులు సభలు, సమావేశాల కొరకు వచ్చినప్పుడు వాళ్ళంతా సాహిత్యం గురించి మాట్లాడుతుంటే వినడం నాకు చాలా బాగుండేది. పాఠశాల చదువు లేకపోవడంతో నా ప్రపంచమంతా కథల పుస్తకాలే.. నా స్నేహితులూ పుస్తకాలే అయ్యాయి. కొకు, శ్రీపాద, బుచ్చిబాబు, మల్లాది, శరత్‌, రాహుల్‌ సాంకృత్యాయన్‌ లాంటి మహామహుల పుస్తకాలు అర్థం కాకపోయినా చదువుతూ ఉండేదాన్ని. అంతేకాదు, నా చిన్నప్పుడు ఆమె ఎప్పుడు విజయనగరం వచ్చినా ఆరోజుల్లో వచ్చే సోవియట్‌ రష్యన్‌ పిల్లల బొమ్మల అనువాద కథల పుస్తకాలు నా కోసం తెచ్చేది. ఆకర్షణీయమైన బొమ్మలతో అందంగా ఉండే ఆ పుస్తకాల్ని అక్షరాలు కూడబలుక్కొని చదివే దాన్ని. ఆ బొమ్మలన్నీ పుస్తకంలో తిరిగి వేసేదాన్ని. బొమ్మల కథగా ఉన్న పుస్తకంలో కథను ఊహించటం నేర్చుకున్నాను. తర్వాత్తర్వాత నా వయసును బట్టి ఎం- రాజేంద్ర, కె. సభా మొదలైన వాళ్ళు రాసిన పిల్లల పుస్తకాలు తెచ్చి ఇస్తుంటే చదివేదాన్ని. ఇలా చాలా చిన్నప్పటి నుంచే నన్ను మా అక్కయ్య అక్షర లోకంలోకి, తద్వారా సాహితీ ప్రపంచంలోకి తీసుకవెళ్ళింది.
ప్ర. ఇంతలా మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ అక్కయ్య గురించి మరిన్ని వివరాలు చెప్పండి.
జ. మా పెద్దక్కయ్య పేరు పి. సరళాదేవి. భర్తతో ఏ ఊరు వెళ్ళినా ఆ ఊళ్ళో చుట్టుపక్కల పిల్లలను చేరదీసి బాలానందం నడిపేది. ఆటలు, పాటలు నేర్పించేది. వేసవికి వెళ్ళినప్పుడు నాకు కూడా మంచి కాలక్షేపంగా ఉండేది. ఆ తర్వాత 1955 నుండి తెలుగుస్వతంత్ర, ఆంధ్రప్రభలలో విరివిగా కథలు రాసేది. డా. పి. శ్రీదేవి, మాలతీ చందూర్‌ ఆమెకు మంచి స్నేహితులు.
ప్ర. మీకు కవిత్వం రాయడం పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
జ. ఒకసారి ఏలూరులో ఆవంత్ససోమసుందర్‌ గారి సన్మాన సభకు అక్కయ్య వాళ్ళతో కలిసి వెళ్ళాను. సభ అనంతరం ఏలూరులోని ఒక సాహితీ మిత్రుని ఇంట్లో, డాబా మీద వెన్నెట్లో కవి సమ్మేళనం జరిగింది. కవులంతా కవిత్వం చదువుతుంటే అద్భుతంగా అనిపించి ఎంతో ఆసక్తిగా విన్నాను. తర్వాత అక్కయ్యను కవిత్వ పుస్తకాలు అడిగితే శ్రీశ్రీ మహా ప్రస్థానం, కృష్ణశాస్త్రి గారి కృష్ణ పక్షం ఇచ్చింది. వాటిలోని నన్ను ప్రభావితం చేసిన కొన్ని కవితల్ని నా డైరీలో రాసుకున్నాను. అది ఇప్పటికీ నా దగ్గరుంది. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టారు గారు లిఖిత పత్రిక నడిపేవారు. ఆయన చెప్పిన ఛందస్సు ప్రభావంతో అప్పుడు నేను రెండు ఆటవెలది పద్యాలు రాసాను. ఒకటి మా మాస్టారు మీద, రెండోది పాకిస్తాన్‌ యుద్ధం మీద.. అది నా మొదటి రచన. ‘‘నా బొమ్మే నా చెల్లి’’ పేరుతో పన్నెండు ద్విపద పద్యాలలో ఒక దీర్ఘ కావ్యం లాంటిది రాసాను. నా యిష్టమైన బొమ్మ విరిగి పోయినప్పుడు ఆ బాధతో రాసిన పద్యాలు అవి.. ఆ పత్రికకు కవితలు, గేయాలు కూడా రాసే దాన్ని.
ప్ర. మీ పెళ్ళికి ముందే మీకు అభ్యుదయ ఆలోచనా దృక్పథం ఏర్పడిరదా?
జ. అవును, మా చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావు 1965 నుండి ఆనాటి పత్రికలన్నింటిలో విరివిగా కథలు రాసేవాడు. ఆయన రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడు. రావిశాస్త్రి రచనలతోపాటు బీనా దేవి, కాళీపట్నం రామారావు, చాగంటి సోమయాజులు లాంటి ప్రముఖుల రచనలు సేకరించాడు. ఆ పుస్తకాలన్నింటినీ చదవడం వలన నా ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చింది. సాహిత్యం సమాజ లోతులను, సామాజిక జీవితాన్ని ప్రతిబింబించాలి అనే నమ్మకం నాలో ఏర్పడిరది.
ప్ర. శీలావీర్రాజు గారు ఎలా పరిచయం? మీది అభ్యుదయ వివాహం అని విన్నాను. ఆ వివరాలు చెప్పండి.
జ. ఆ రోజుల్లో ఇంటింటి గ్రంథాలయాలు ఉండేవి. మా స్నేహితురాలి ఇంట్లో కూడా అలాంటి గ్రంథాలయం ఉండేది. చాలా పుస్తకాలు తెప్పించేవారు. అందులో ఒకసారి వీర్రాజు గారి కాంతి పూలు నవల, వీర్రాజుగారి కథల పుస్తకం వచ్చాయి. అవి రెండూ నేను తీసుకొని చదివాను. అంతకు ముందు అక్కయ్య వాళ్ళింట్లో కూడా ఆయన పుస్తకాలు నేను చదివాను. ఏది చదివినా అందులోని ముఖ్యాంశాలు రాసిపెట్టుకోవడం నాకు బాగా అలవాటు. అలా ఆయన కథల్లోని కొన్ని సందేహాలు ఆయనను ముఖతః ఆడుగాలని అనుకున్నాను. అప్పట్లో అడ్రస్‌ లభించలేదు. నేను డిగ్రీ రెండో సంవత్సరంలో వున్నప్పుడు 1970 జూన్‌లో స్వాతి మొదటి మాసపత్రిక వచ్చింది. అందులో గౌరవ సంపాదకులుగా వీర్రాజుగారి చిరునామా వచ్చింది. అంతే నా సందేహాలను ప్రస్తావిస్తూ కె.ఎస్‌. దేవి పేరుతో ఉత్తరం రాస్తూ నా స్నేహితురాలి చిరునామా ఇచ్చాను. వెంటనే ప్రత్యుత్తరం వచ్చింది. అలా మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాయి. ఆయన రచనల మీద, సాహిత్యం మీద నా అభిప్రాయాలు నిస్సంకోచంగా వెల్లడిరచే
దాన్ని. నాలో రచయిత్రిని ఆయన గుర్తించాడు. ఒకసారి పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చారు. ఆయన నా మేనబావ అని నాకు తెలుసు కానీ ఆయనకు తెలియదు. కుటుంబ కారణాల వల్ల మా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు ఉండేవి కాదు. వాళ్ళు ఎక్కడ? ఎలా? ఉన్నారో తెలిసేది కాదు. నేను ఫలానా అని తెలిసేసరికి.. ఇద్దరమ్మాయిలే ఉన్నట్లు తనకు తెలుసని, మూడో అమ్మాయిని నేనున్నట్లు తెలియదని ఆశ్చర్యపోయారు. మా యింట్లో ఆయన పెళ్ళి ప్రతిపాదన చెప్పాను. ఉమ్మడి కుటుంబమని, చాలా బాధ్యతలుంటాయని, హైదరాబాదులో ఉండవలిసి వస్తుందని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. డిగ్రీ పూర్తి చేశాకే హైదరాబాదుకు కాపురానికి వస్తాననే కండిషన్‌ మీద డిగ్రీ రెండో సంవత్సరంలో పెళ్ళికి అంగీకరించాను. రోణంకి అప్పలస్వామిగారి ఆధ్వర్యంలో తేది 14/02/1971న స్టేజి మ్యారేజ్‌ చేసుకున్నాం. (నవ్వుతూ .. ప్రేమికుల రోజు. అఫ్‌ కోర్స్‌ ..అప్పుడు ఇంతలా లేదనుకోండి.)
ప్ర. మీ అత్తగారివంటి వివరాలు చెప్పండి.
జ. మా పెళ్ళినాటికే మా అత్తమామలు మరణించారు. వీర్రాజుగారు పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసేవారు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. మా పెళ్ళికి ముందే తన పెద్ద చెల్లెలి పెళ్ళి జరిగింది. నేను ఇంటికి పెద్దకోడలిని కానీ వాళ్ళందరూ వయసులో నా కంటే పెద్దవారే..
ప్ర. మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులేమైనా వున్నాయా?
జ. చెప్పాను కదా.. బాల్యమంతా ఆర్థిక ఇబ్బందులతోనే గడిచింది. అందువల్లనే నా చదువు మధ్య మధ్యలో ఆగిపోయింది. పెళ్ళి అయ్యాక కూడా ఉమ్మడి కుటుంబం. మేమే ఇంటికి పెద్ద కాబట్టి మరదుల, ఆడపడుచు పెళ్ళిళ్ళు చాలా కష్టంగా పూర్తిచేశాం. రెండు గదుల యింట్లో అందరం గడిపేవాళ్ళం. దానికి తోడు పౌష్టికాహారం లేక ఆరోగ్యం అంతంత మాత్రమే.. ఇంటికి వచ్చిపోయేవాళ్ళు కూడా చాలామంది వుండేవారు.
ప్ర. మీ పిల్లలు, ఉద్యోగం గురించి చెప్పండి.
జ. 22/ 01/ 1973 లో పెద్దపాప పల్లవి పుట్టింది. పౌష్టికాహార లోపం వల్ల 1975 లో రెండో పాప చాలా నీరసంగా పుట్టి రెండు నెలలే ఉంది. 1977లో బాబు డౌన్‌ సిండ్రోమ్‌తో పుట్టాడు. నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లి పోయాను. దాని నుంచి బయట పడడానికి 1978-80 లలో ఎం.ఏ తెలుగు దూరవిద్యలో చేసాను. ఒక స్నేహితురాలి సూచన మేరకు, అప్పుడు ఇంటికి వచ్చిన నందిని సిధారెడ్డిగారు బి.ఇడి ఎంట్రన్స్‌ ఫాం తెచ్చి యూనివర్శిటీలో సబ్మిట్‌ చేశారు. ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంకు రావడంతో 82 – 83 లో ఆంధ్రమహిళాసభ కాలేజీ నుంచి బి.ఎడ్‌ పూర్తి చేసాను. ప్రోగ్రెసివ్‌ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో పది నెలలు పని చేసాను. తర్వాత ఆర్‌.టి.సి ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో 1984లో చేరాను. భౌతికశాస్త్రం, గణితం బోధించేదాన్ని. 2006లో పదవీ విరమణ పొందాను.
ప్ర. ‘ సఖ్యసాహితి’ సంస్థ గురించి చెపుతారా?
జ. కోలా రాజ్యలక్ష్మి గారు నగరంలోని రచయిత్రులందరిని ఒకచోటుకు తేవాలనే ఉద్దేశంతో తమ యింటికి ఆహ్వానించారు. నేను మొహమాటపడి మొదటి సమావేశానికి వెళ్ళలేదు. వాసిరెడ్డి సీతాదేవిగారి చొరవతో రెండో మీటింగుకు వెళ్ళాను. అది యశోదారెడ్డి గారింట్లో జరిగింది. ఆ మీటింగుకు ఇందిరా ధన్‌రాజ్‌గిరి, కుముద్‌ బెన్‌ జోషి కూడా వచ్చారు. ఆ మీటింగులోనే ‘సంఖ్యసాహితి’ రచయిత్రుల సంస్థ 1994-95లో ఏర్పడిరది. ప్రతి నెలా ఒక్కొక్కరి ఇంట్లో సమావేశమై సమకాలీన సాహిత్యం గురించి చర్చించే వాళ్ళం. సభ్యులందరి సహకారంతో కథల సంకలనం కూడా తీసుకువచ్చాం. మిత్రుల సలహాతో అంతకుముందు వచ్చిన నా మూడు కవితా సంకలనాలలోని స్త్రీ ప్రాధాన్యత ఉన్న కవితల్ని ఎంపిక చేసి, మరిన్ని అటువంటి కవితల్ని కలిపి ‘ఆవిష్కారం’ పేరుతో ప్రచురించి నన్ను రచయిత్రిగా ప్రోత్సహించిన అక్కయ్య పి. సరళాదేవికి అంకితమిచ్చాను.
ప్ర. తొలిసారిగా యుద్ధ కవిత మీరే రాసారని విన్నాను. దాని గురించి చెప్పండి.
జ. 2001లో అమెరికాలో జంట టవర్లు కూల్చిన దుర్ఘటన అనంతరం
అమెరికా ఆఫ్ఘన్‌ యుద్ధ నేపథ్యంలో.. యాభైయారు పుటల దీర్ఘకవిత రాశాను. పేరు ‘యుద్ధం ఒక గుండె కోత’. దానిని కవయిత్రి కలం నుండి వెలువడిన మొదటి దీర్ఘ కవితాకావ్యంగా విమర్శకులు పేర్కొన్నారు. ప్రపంచమంతా కమ్ముకున్న యుద్ధమేఘాలు, బాంబులు కురిపించడంతో కలిగిన యుద్ధ వేదన, అగ్రరాజ్య దురహంకారం పై ఆగ్రహం, జరుగుతున్న అనేకానేక సంఘటనల వెనక నలుగుతున్న స్త్రీల కనిపించని ఆర్తనాదాలు, ఏ యుద్ధమైనా మొట్టమొదట గాయం చేసేది తల్లి గర్భాన్నే అన్న అంతర్గత ఆలోచనలతో మాతృ హృదయ ఆవేదనగా రాసిన కావ్యం అది.
ప్ర. మీరు మళ్ళీ దీర్ఘ కవితలు రాయలేదా?
జ. ఏడేళ్ళ తర్వాత ‘‘బతుకు పాటలో అస్తిత్వ రాగం’’ పేరుతో మరో దీర్ఘ కవిత రాశాను. దానిని సంపూర్ణ స్త్రీ జీవన చిత్రణగా కాత్యాయని విధ్మహే అభివర్ణించారు.
ప్ర. మీ ఇతర రచనల గురించి చెప్పండి.
జ. ఎనిమిది కవితా సంకలనాలు, మూడు కథా సంకలనాలు, నీడల చెట్టు నవలిక, డా.పి. శ్రీ దేవి మోనోగ్రాఫ్‌, ముద్ర వంద మంది కవయిత్రుల సంకలనానికి సహ సంపాదకత్వం, పి. శ్రీదేవి కథలు – సంపాదకత్వం, పి. శ్రీదేవి దీర్ఘకవిత మధుకలశం – సంపాదకత్వం, ‘‘ ఒక చిత్రకారుడు – కొన్ని ఆలోచనలు ‘‘ అనే పేరుతో శీలావీర్రాజు చిత్రాల మీద సంకలనం, నది ప్రయాణం పేరుతో శీలావి సంస్కరణ వ్యాసాల సంకలనం, శీలావి శిల్పరేఖలు పేరుతో ఆయన స్కెచ్‌ బుక్‌, యాభై యేళ్ళ ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ బుక్‌, శ్రీ శ్రీ మొదలు ఇప్పటి వరకు ఐదు తరాల కవుల రెండు వందల యాభై కవితలను శీలావి ఫాంట్‌ శీలాక్షరాలు పేరుతో తీసుకు వచ్చాను.
ప్ర. ఇతర భాషలలోనికి అనువాదమైన మీ రచనల గురించి చెప్పండి.
జ. యుద్ధం ఒక గుండెకోత దీర్ఘకవితను డా. పి. భార్గవి రావు, డా.పి. జయ లక్ష్మి గారలు కలిసి ‘‘ఔaతీ, A నవaత్‌ీం Raఙaస్త్రవు పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. ఇదే కవితను యుద్ధ్‌ ఏక్‌ దిల్‌ కీ వ్యథ పేరుతో నిర్మలానంద వాత్సాయన్‌ గారు హిందీలోకి, ఉళ్ళక్‌ కుమురల్‌ పేరుతో రాజేశ్వరీ కోదండం గారు తమిళంలోకి అనువదించారు. ణaఅషవ శీట నబఅస్త్రవతీ పేరుతో కొన్ని కవితలు ఆంగ్లంలో వచ్చాయి. రెక్కల చూపు కథల సంపుటిలోని కొన్ని కథలు ఆంగ్లంలోకి అనువదించ బడ్డాయి. ఇస్కూలు కతలు.. ఇస్కూల్‌ కి కహానియా పేరుతో హిందీలో వచ్చింది.
ప్ర. మీరు పొందిన అవార్డుల గురించి చెప్పండి.
జ. రెక్కల చూపు కథల సంపుటికి గురజాడ అవార్డు వచ్చింది. తెలుగు యూనివర్శిటీ నుంచి 1997 లో సృజనాత్మక సాహిత్యానికి పట్టాభి రామిరెడ్డి పురస్కారాన్ని, 1999లో ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందుకున్నాను. 2011 లో దీర్ఘకవితకు దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం వచ్చింది. 2018లో అమృతలత పురస్కారం, ఉమ్మడి శెట్టి రాధేయ పురస్కారం, 2021లో సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, 2022లో తెలుగు విశ్వవిద్యాలయం వారి మాతృ పురస్కారం, 2024లో గుత్తికొండ రామ రత్నం చారిటబుల్‌ ట్రస్టువారి జీవన సాఫల్య పురస్కారం, నీడలచెట్టు నవలికకు విశాలాక్షి ప్రతిభా పురస్కారం లాంటివి ఇంతవరకూ నేను అందుకున్న కొన్ని పురస్కారాలు.
ప్ర. మీ రచనల మీద జరిగిన పరిశోధన గురించి వివరించండి.
జ. నా కవిత్వం మీద ముగ్గురు ఎం.ఫిల్‌, ఇద్దరు పి.హెచ్‌.డి పరిశోధన చేసారు. నా రచనల మీద పలువురు రాసిన సమీక్షలు పుస్తకంగా వచ్చింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యాంశంగా ‘మార్పు వెనక మనిషి’ చేర్చబడిరది. ఇస్కూల్‌ కథల్లోని ఒక కథను ఏడోతరగతి పాఠ్యపుస్తకంలో ద్వితీయ భాషగా మహారాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఎం.ఏ లో పడుగూ – పేకాట కవిత కొన్నేళ్లు పాఠ్యాంశంగా వుంది.
ప్ర. స్త్రీవాద సాహిత్యానికి మీరు చెప్పే నిర్వచనం ఏమిటీ?
జ. సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల నుంచి స్త్రీ సమస్యలను చూడడం, పరిశీలిండం, రాయడం. ఎదుటి నుంచీ నా రచనా విధానం ఇలానే కొనసాగుతోంది.
ప్ర. ఉపాధ్యాయురాలిగా మీ పరిశీలనలోకి వచ్చిన అంశాలు ఏమిటి?
జ. ఉపాధ్యాయినిగా పాతికేళ్ళ నా అనుభవంలో అనేక విషయాలు పరిశీలనలోకి వచ్చాయి. పేద, బడుగు వర్గాల ఆడపిల్లలు చదువులకు వచ్చే అవరోధాలు, ప్రభుత్వం విద్యకు కల్పిస్తున్న అనేక పథకాలు పేదవారికి తెలియని పరిస్థితులు, మద్యపానం వల్ల చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోతున్న విద్యార్థులు, పాఠశాలలో జరిగే అనేక అవక తవకలు మొదలైనవి నా పరిశీలనలోకి వచ్చి మనసును కదిలించాయి. నేను పాల్గొన్న సర్వేలు నాకొక కొత్త చూపునిచ్చాయి. ఫలితంగా నేను పదవీ విరమణ చేసిన తర్వాత తెలుగు విద్యార్థి మాసపత్రికలో రెండున్నర సంవత్సరాల పాటు నా అనుభవాన్ని ఇస్కూలు కతల పేరిట రాసాను. అది పుస్తకంగా వచ్చింది.
ప్ర. ప్రస్తుతం మీరు చేస్తున్న పనుల గురించి చెప్పండి
జ. కుందుర్తిగారు ప్రారంభించిన ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ సంస్థను అతని మనమరాలు కవితతో కలిసి కొనసాగిస్తున్నాను. మాడభూషి రంగాబారి స్మారక సంస్థను ఆయన సహచరి లలితాదేవితో కలిసి ముందుకు తీసుకు వెళుతున్నాను. విస్మృత స్త్రీ రచయితల రచనల మీద నా పరిశోధన కొనసాగిస్తున్నాను. ప్రతి యేడాది దీర్ఘ కవితకు, చిత్రకారుడికి శీలావి పేరుతో పురస్కారాలు అందజేస్తున్నాం.
ప్ర. సాహిత్యానికి మీకూ వున్న అవినాభావ సంబంధం ఏమిటి?
జ. 1975 లో నా మొదటి కథ ప్రచురణతో మొదలైన యాభైjైుదు ఏళ్ళ నా సాహితీ ప్రస్థానంలో.. జీవితంలో నేను ఎదుర్కొన్న అనేక సంక్షోభాలను ఎదుర్కొని నిలదొక్కుకునే ధైర్యాన్ని యిబ్బంది సాహిత్యమే.. అందుకే నా సాహితీ వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. నేను రాస్తూ రాస్తూనే ఉంటాను. నా కలం ఇంకిపోలేదు. నేను అలసిపోలేదు. కవిత్వం నా శ్వాస. నిరంతర అధ్యయనం నా ఊపిరి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.