ఇటీవల కాలంలో ట్రాన్స్‌జెండర్ అనే పదం టీవీలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. సాధారణంగా వాడుకలో వీరిని హిజ్రా, కొజ్జా, చెక్కా, మాడ, తేడా, పాయింట్ ఫైవ్, వన్ బై టూ, నపుంసకులు వంటి పదాలతో సంబోధిస్తూ ఉంటాం. ఇది, సమాజంలో అంగీకారం లేకపోవడం, మీడియా-సినిమాల్లో వీరిని ఎక్కువగా కామెడీ లేదా విలన్ పాత్రలుగా చూపించడం వల్ల ఏర్పడిన అపోహలే. ఒకప్పుడు ఈ సముదాయానికి చెందిన వ్యక్తులు సంవత్సరానికి ఒకటి-రెండు సార్లు మాత్రమే కనిపించేవారు.
కానీ, ఇప్పుడు వేలమంది బహిరంగంగా కనిపిస్తున్నారు. రైళ్లలో, మాల్స్‌లో, దుకాణాల బయట, పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, శుభకార్యాలప్పుడు, పండగలకి గుంపులుగా వస్తూ వుంటారు.
వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు? అని అనేక మందికి సందేహం. వీటన్నిటి కంటే ముందుగా మనం తెలుసుకోవలసింది ఏంటంటే, వీరిని ట్రాన్స్‌జెండర్ అనకూడదు. ట్రాన్స్‌జెండర్/ట్రాన్స్ వ్యక్తులు, లేదా ట్రాన్స్‌జెండర్ సముదాయం అనాలి. ప్రత్యేకించి ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు, ట్రాన్స్‌జెండర్/ట్రాన్స్ వ్యక్తి/మహిళ/పురుషుడు అనాలి.
భారతీయ సాహిత్యం, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ట్రాన్స్‌జెండర్, స్వలింగ సంపర్కుల ఉనికి ప్రాచీన కాలం నుంచీ ఉంది. మధ్యయుగ, మొఘల్ యుగాల్లో (13-17 శతాబ్దాలు) హిజ్రాలు రాజసభల్లో, రాజ భవనాల్లో గౌరవప్రదమైన స్థానాలు పొందారు. కానీ, 1861లో బ్రిటిష్ వారు తెచ్చిన IPC సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని, ట్రాన్స్ వ్యక్తుల గుర్తింపును నేరంగా పరిగణించింది. దాంతో భయం, అవమానం, సిగ్గు కారణంగా ఆ సముదాయం దాచి పెట్టబడిరది. బహిరంగంగా కనిపించేవారు చాలా తక్కువ. కనిపిస్తే ఆటపట్టించడం, వేధింపులు, హింస సర్వసాధారణంగా మారింది.
ట్రాన్స్‌జెండర్ అనే పరిభాషలోనే వైవిధ్యం ఉంది. హిజ్రా ఒక సాంస్కృతిక గుర్తింపు, కానీ, అందరు హిజ్రాలు ట్రాన్స్‌జెండర్ కాదుబీ అలాగే, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులందరూ హిజ్రాలు కారు. పుట్టినప్పుడు మగవారిగా ఉండి ఆడవారిగా గుర్తించేవారు ట్రాన్స్ ఉమెన్ (మహిళలు) ఆడవారిగా పుట్టి మగవారిగా గుర్తించేవారు ట్రాన్స్ మెన్ (పురుషులు).
2000 తర్వాత, HIV వ్యాప్తి ఎక్కువైనప్పుడు, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) సెక్స్ వర్కర్లు, MSM (మెన్ హావింగ్ సెక్స్ విత్ మెన్/ మగవారితో లైంగికంగా కలిసే మగవారు), ట్రాన్స్ వ్యక్తులను మ్యాప్ చేయడం మొదలుపెట్టింది. అప్పటికి ట్రాన్స్ వ్యక్తులు జనాభా లెక్కల్లోనే లేరు, ఒకే చోట ఉండేవారు కాదు. సెక్స్ వర్క్ జరిగే ప్రదేశాల్లో ఒకరిద్దరిని కనిపెట్టి, వారి ద్వారా మరికొందరిని, ఆ తర్వాత వారి ద్వారా మరికొందరిని… ఇలా ‘‘స్నోబాల్’’ పద్ధతిలో దేశవ్యాప్తంగా వేల మందిని గుర్తించారు.
అయితే, వీరు ఎక్కువగా సెక్స్ వర్క్ ద్వారానే కనిపించారు కాబట్టి వారి లైంగిక గుర్తింపు గోప్యంగానే ఉండేది. చాలా మంది కుటుంబాలకు తెలియదు, తెలిసినా, కుటుంబం వదిలేసి బయటకు వచ్చేవారే ఎక్కువ. ఇప్పటికీ కుటుంబంతో ఉండే ట్రాన్స్ వ్యక్తులు చాలా అరుదు. ఈ వలసకు మూల కారణం – ఇంట్లో లైంగిక గుర్తింపు, ప్రవర్తనను అంగీకరించకపోవడం. అక్కడి నుంచి స్టిగ్మా మొదలై, పాఠశాల, కాలేజీ, సమాజంలో కొనసాగుతుంది. చివరికి అన్నీ వదిలేసి తమలాంటి వారిని వెతుక్కుంటూ ఇతర నగరాలకు వలస వెళ్తారు. కొందరు సొంత ఊరిలోనే ఉన్నా బయట ఒకలా, ఇంట్లో ఒకలా నటించాల్సి వస్తుంది – జీవితం నాటకంగా మారుతుంది.
ఈ భయానికి రెండు ప్రధాన కారణాలు:
1. సమాజంలో రెండే లింగాలు (స్త్రీ-పురుషుడు) అన్న ద్విమానసిక ఆలోచన.
భారతీయ కుటుంబాల్లో మగ సంతానం ఇప్పటికీ చాలా కీలక పాత్ర పోషిస్తాడు. పితృస్వామ్య వ్యవస్థ వల్ల మగపిల్లవాడు ‘‘వంశాన్ని కొనసాగించే వారసుడు’’, ‘‘కుటుంబ పరువు కాపాడేవాడు’’ అన్న భారీ బాపనలు మోపబడతాయి. అతను తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి, సంతానం కనాలి, వంశపారంపర్య బాధ్యత నిర్వర్తించాలి .ఇవన్నీ సమాజం నిర్దేశించిన మూస నియమాలు. పెళ్లి కాకపోతే కుటుంబానికే అవమానంగా చూస్తారు. ఈ ఒత్తిడి వల్లే చాలా మంది స్వలింగసంపర్కులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కుటుంబాల్లో తమ గుర్తింపును బయటపెట్టలేకపోతారు. ఒకవేళ తెలిసిపోతే, ‘‘సరిచేయడం’’ పేరుతో బలవంతంగా పెళ్లి చేసేస్తారు. ఫలితం, ఆ వ్యక్తి మానసికంగా నలిగిపోవడం, భార్యాభర్తలిద్దరూ బాధపడటం, కొన్నిసార్లు విడాకులు, ఆత్మహత్యలు, హత్యల వంటి విషాదాంతాలు కూడా జరుగుతున్నాయి.
2. IPC 377 ప్రకారం స్వీయ లింగ సంపర్కాన్ని, ట్రాన్స్ గుర్తింపును నేరంగా చూడటం.
HIV నివారణ కార్యక్రమాల్లో %చీGూ%లు, కమ్యూనిటీ సభ్యుల సహకారంతో పీర్ ఎడ్యుకేటర్లు, అవుట్‌రీచ్ వర్కర్లు, ట్రైనర్లుగా ట్రాన్స్ వ్యక్తులు పనిచేశారు. కొందరు సెక్స్ వర్క్ నుంచి బయటపడి ఉద్యోగాలు చేపట్టారు. మూడో దశలో, NACO కమ్యూనిటీ మొబిలైజేషన్‌ను తప్పనిసరి చేసింది. పోలీసులు, అధికారులతో అడ్వకసీ, మీడియా సెన్సిటైజేషన్ మొదలయ్యాయి. NGOలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడటానికి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ (CBOలు) ఏర్పాటు తప్పనిసరి చేశారు. అప్పుడే, తెలుగు రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ CBOలు వచ్చాయి, వనరుల సమీకరణ, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వచ్చాయి.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా అసాధారణమైన విజయాలు సాధించారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు, కార్పొరేట్ స్థాయిలో ఉన్నత పదవులు అధిరోహించారు. ఎన్నికల్లో పోటీ చేశారు, కొన్ని చోట్ల గెలిచి చరిత్ర సృష్టించారు. సమాజం కోసం, సముదాయం కోసం రోజూ రోడ్డెక్కి పోరాడే ధైర్యవంతమైన యాక్టివిస్టులుగా నిలిచారు. ఇవాళ కూడా ప్రభుత్వంతో, విధానాలతో నిరంతరం అడ్వకేసీ చేస్తూనే ఉన్నారు. కానీ నిజమైన సాధికారత ఇంకా రాలేదు… అది సమాజంలో రావాలి. ఎంత మంచి చట్టాలు, రిజర్వేషన్లు, స్కీమ్‌లు ఉన్నా… వివక్ష, అవమానం, హింస, దూరం చేయడం ఆగనంత వరకు ఈ విజయాలు పూర్తిగా సుస్థిరం కాలేవు. నిజమైన మార్పు అవి ఆగినప్పుడే వస్తుంది. ప్రతి ఒక్కరూ ట్రాన్స్ వ్యక్తులను ‘‘సమానంగా’’ చూసే రోజు వచ్చినప్పుడే. 2014 నుంచి దేశవ్యాప్తంగా LGBTQIA+ కమ్యూనిటీతో పాటు సిబిఓ (కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్), హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు అందరూ ఐక్యంగా సెక్షన్ 377 రద్దు కోసం అలుపడ్డారు. చివరికి 2018 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు ఘనమైన తీర్పుతో పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంబంధాలను డీక్రిమినలైజ్ చేసింది.
అప్పటి వరకు చట్టం భయం కారణంగా లక్షలాది మంది తమ గుర్తింపును దాచుకుని, గుండెల్లో బంధించి జీవించారు. 2018 తర్వాత ఆ భయం పోయింది. ఒక్కసారిగా వేలాది మంది (నిజానికి లక్షలాది మంది) బహిరంగంగా తమను తాము వ్యక్తపరచుకునే స్వేచ్ఛ, గౌరవం లభించింది. అందుకే ఇప్పుడు ‘‘ఎక్కడెక్కడో లేరు, ఒక్కసారిగా ఎంతమందో వచ్చేశారు’’ అనిపిస్తోంది. నిజానికి వాళ్లు ముందే ఉన్నారు. కేవలం పరిస్థితులు, చట్టం, సమాజం వాళ్లను దాచిపెట్టాయి. ఇప్పుడు కనిపిస్తున్నారు అంతే.
తెలంగాణలో ప్రభుత్వం కూడా స్పందించింది – నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు, వ్యాపార ఋణాలు, స్వయం సహాయక బృందాలు, తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, ట్రాన్స్ వ్యక్తుల ఆరోగ్య అవసరాల కోసం మైత్రి క్లీనిక్… ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. ఫలితంగా, రోజూ కొత్తవాళ్లు కమ్యూనిటీలో చేరుతున్నారు.
అయితే, ఇప్పటికీ వివక్ష పూర్తిగా పోలేదు. కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమవుతుందో అనే భయం ఇంకా ఉంది. వివక్షకు మూలం ఇల్లే. తల్లిదండ్రులు, కుటుంబం వీరిని ఆదరించి స్వీకరించినప్పుడే, సమాజంలో నిజమైన మార్పు వస్తుంది. అప్పుడే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు అందరితో కలిసి, మనలో ఒకరిగా పూర్తి గౌరవంతో జీవించగలుగుతారు.
