పాటకి నిర్వచనం ఆమె – రావు బాలసరస్వతిదేవి

ఇంటర్వ్యూ సేకరణ: కొండవీటి సత్యవతి
నమస్కారం బాల సరస్వతి గారూ! మీ గురించి, మీ సినిమాల గురించి, మీ పాటల గురించి వివరంగా చెపుతారా!
ఆ రోజుల్లో ఆడవాళ్లు సినిమాల్లోకి వచ్చేవాళ్లు కారు. చాలా చిన్న ఫ్యామిలీస్‌లోని ఆడవాళ్లు అది డ్రామాలు పనిచేసే వాళ్లు సినిమాల్లోకి వచ్చేవాళ్లు. మంచి ఫ్యామిలీ నుంచైతే అసలు రారు. నేను ఎప్పుడు స్టేజి మీద నటించలేదు. 1934లో అంటే నా నాలుగో ఏట నుండి కపిలవాయి రామనాథ శాస్త్రి గారి పాటలు అవి వినేదాన్ని. ఇంట్లో గ్రామ్‌ ఫోన్‌ ఉండేది. పాటలు పెట్టుకుని విని వెంటనే వాటిని పాడుతుండే దాన్ని. అట్లా పాడటం కూడా మా ఇంట్లో ఎవరికీ రాదు. నేను సంగీతం నేర్చుకోలేదు. వేరేవాళ్లు పాడే పాటలు విని పాడుతున్నప్పుడు మా నాన్న విని తన ఫ్రెండ్‌ కొప్పరపు సుబ్బారావు గారిని ఎచ్‌ ఎం వి రికార్డింగ్‌ మేనేజరు ఆయన నా పాట గురించి అడిగితే గ్రామ్‌ఫోన్లో విని అనుకరించి పడతానని చెప్పారట.

ఆయన నన్ను తీసుకురమ్మని చెప్పి నాతో హార్మోనియం మీద పాట పాడిరచారు. భోగిరాల రామచంద్రారావు గారు ఆ రోజు హార్మోనియం వాయించారు. సుబ్బరంగా శృతిలోనే పాడాను. ఎచ్‌ఎంవి వాళ్లు రికార్డు చేసుకున్నారు. అప్పట్లో సెట్స్‌ వచ్చేవి. భక్తకుచేలా, భక్త ప్రహ్లాద రెండు సెట్స్‌ తీశారు. భక్త ప్రహ్లాదుడుగా నన్ను ఎత్తుకొని మరి పాడిరచారు. ఎందుకంటే నాకు మైక్‌ అందదు. కుచేల పిక్చర్లు కూడా నాలుగు లైన్లు పాడాను. చాలా ధైర్యంగా పాడానని మెచ్చుకొని ఒక సోలో పాట రికార్డు చేశారు. ఆ వయసులో సోలో పార్ట్‌ పాడిన వాళ్ళు తెలుగులో ఎవరూ లేరు. ఫస్ట్‌ రికార్డు వాళ్లు నాతో పాడిరచారు. ఆ ఈ పాట పాడిన తర్వాత సి. పుల్లయ్య గారు కిడ్డిస్‌ పిక్చర్‌ ఒకటి ప్రొడ్యూస్‌ చేశారు. 13 ఏళ్లు లోపు వారితో సతీ అనసూయ 1936లో వచ్చింది. నా పాట మాత్రం 1935లో రికార్డు అయింది. నన్ను అదే సంవత్సరం కలకత్తా తీసుకెళ్లిపోయారు. ఆ పిక్చర్లో గంగగా నటించాను. చిన్నపిల్లనప్పుడు. బోలెడంత మేకప్‌ వేసేవారు. చీర కట్టి కిరీటాలు పెట్టి అంతా సిద్ధం చేశాక నేను అర్జెంటుగా బాత్రూం పోవాలని గొడవ చేసేదాన్ని. అన్ని విప్పి మళ్లీ కట్టేవారు. అప్పుడే ఆకుల నరసింహారావు గారిని చాలా పెద్ద సింగర్‌ ఆయన. ఆయన ట్యూన్‌ చేసి పాట రికార్డు చేయించారు. నాకు అందరి పాటలు వచ్చేసేవి. వాళ్ళు పాడుతుంటే గ్రాస్ప్‌ చేసి పాడేసేదాన్ని. కానీ ఒకళ్ళు నేర్పితే చస్తే నేర్చుకునే దాన్ని కాదు. ఒకచోట కూర్చొని నేర్చుకోమంటే నేర్చుకునే దాన్ని కాదు. బాగా పాడతానని మెచ్చుకునేవారు.
షూటింగ్‌కి వెళితే అక్కడ స్టూడియోలో కె ఎల్‌ సైగల్‌, కె సి డే పహరి సన్యాల్‌ వీళ్లంతా కలకత్తా వాళ్లు కదా. ఆ స్టూడియోలో నటిస్తుండేవాళ్ళు. మేమంతా పిల్లలం కదా. ఒకరు ఇటు, ఒకరు అటు స్టూడియోలో పరిగెత్తుతుండే వాళ్ళం, ఆడుకుంటుండేవాళ్ళం. మాకు ఎవరికీ పిక్చర్‌ తెలీదు. అందరిలోకి చిన్న నేను కదా. నువ్వు పాడతావా అని ఒళ్ళు కూర్చో పెట్టుకున్నాడు. గానా గావో అనగానే నా పాట పాడేశాను. ఎంత ధైర్యం నీకు అని అందరూ మెచ్చుకొని నాకు రసగుల్లాలు పెట్టె వాళ్ళు. అదే టైంలో పక్క ఫ్లోర్లో కె.సుబ్రహ్మణ్యం గారి తమిళ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆయన నన్ను చూసి ఎవరీ తెలుగు పిల్ల ఎంత హుషారుగా ఉంది. ఇంత బాగా చేస్తుందని అడిగి నన్ను పిలిచి తమిళ్‌ తెలుసా అని అడిగారు. మద్రాసు మాటిమాటికీ వస్తా ఉంటాను కదా. మా తాతగారు ఉన్నారు. గుంటూరు నుంచి అక్కడికి వచ్చేదాన్ని. తమిళం తెలుసు అన్నాను. అప్పటికి నేను రెండో క్లాసు చదువుతున్నాను. సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్లో ఈ మధ్య మా స్కూల్‌ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. నేను అన్ని సంవత్సరాల తర్వాత ఆ స్కూల్‌కి వెళితే వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. సుబ్రహ్మణ్యం గారు నన్ను అడిగారు తెలుగులో రాస్తే చదువుకోగలవా అని. చదువుతానని చెప్పాను. పెద్ద బ్లాక్‌ బోర్డు మీద అరవాన్ని తెలుగులో రాశారు. దాన్ని చదవమన్నారు. తేలికగానే చదివాను. చిన్న చిన్న తప్పులుంటే కరెక్ట్‌ చేశారు. అప్పుడు మ్యూజిక్‌ డైరెక్షన్‌ అంటూ ఏమీ లేదు. ఎవరు ట్యూన్‌ చేయడం అంటూ ఉండేది కాదు. మనకు ఏదైనా ట్యూన్‌ వచ్చుంటే దానికి తమిళ పదాలు రాసేసేవారు. ఎంత విధ్వంసుడైన ఇదే పద్ధతి. వాయిద్యాలు వాయించడమే కానీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ట్యూన్‌ చేయడం అంటూ ఏమీ లేదు. ఏదో ఒక పాట మరాఠీదో, ఏదో ఒకటి తీసి దానికి తెలుగు మాటలెయ్యడం చేసేవారు. నాకు కూడా నరసింహారావు గారు అలాంటి పాటలే వేశారు. కుచేలలో పాపనాశం శివన్‌ గారిని మనకు కృష్ణశాస్త్రి గారు ఎలాగో అంత గొప్ప పేరు. ఆయన చేత కుచేలుడు వేయించారు. ఆ వయసులో చాలా తుంటరిగా ఉండేదాన్ని. చాలా తుంటరి పిల్ల అని పేపర్లో కూడా వేయించారు. అలాగే నాతో నాలుగు పాటలు పాడిరచారు. అన్నీ హిందీ పాటలే. దాన్ని తెలుగులో పెట్టి తమిళంలో పాడిరచారు. ఆ తర్వాత తుకారంలో నటించాను. సుబ్రహ్మణ్యం గారే బాలయోగిని అనే సినిమా తీశారు. ఆ సినిమాలో బాలయోగినిగా నటించాను.
తుకారం, బాలయోగిని రెండు బాగా విజయవంతం అయ్యాయి. అప్పట్లోనే 22 లక్షలు లాభం వచ్చింది వాళ్లకి. 50,000 ఖర్చుపెట్టి సినిమా తీశారు. నాకు 1000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ధనవంతులు అయిపోయారు. ఆయన భార్య నేను షూటింగ్‌ నుండి రాగానే కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసింది. అంత ప్రేమగా చూసుకునేవారు. ఆ తర్వాత తుకారం సినిమాలో తుకారం కూతురుగా నటించాను. దీంట్లో నాతో నటించిన వాళ్లంతా పెద్ద సింగర్లు. వాళ్ళు పాడేది అంతా వినేదాన్ని. సైగల్‌ పాటలు విని మొత్తం పాడేదాన్ని. ఆయన ఎలా పాడుతాడో అలాగే పాడుతాను. ఇలా సినిమాలు, పాటలు నడుస్తుండగానే మా నాన్న ఇలాగైతే నీ చదువు కొండెక్కిస్తుంది అని గొడవ పెట్టి మా అమ్మ కూడా చివాట్లు పెట్టి తీసుకొచ్చి స్కూల్లో చేర్పించారు. రెండో క్లాసు మూడో క్లాసు పరీక్షలు పెట్టారు. ఓపెన్‌ ఇసుకలో పరీక్ష పెట్టారు. మొన్న వెళ్లినప్పుడు మా హెడ్‌ మిసెస్‌కి చూపించాను ఆ స్థలాన్ని. నేను ఏమైనా చదివేడిస్తే కదా రాయడానికి. చివరికి వెళ్లిపోయి కూర్చున్నాను. ఇసుకలో బాగా తవ్వి తవ్వి పలకని పూడ్చి పెట్టేసాను. పుస్తకాలని ఇసుకలో పూడ్చేసి నారింజ తొక్కని కళ్ళల్లో పిండుకొని ఒకటే ఏడుపు. సినిమాల్లో యాక్టింగ్‌ అలవాటు అయింది కదా ఇక్కడ చేయటం మొదలు పెట్టాను. అప్పుడు వచ్చింది మా టీచర్‌ మెల్లకన్ను వేసుకొని. ఎందుకు ఏడుస్తున్నావ్‌ అంటే పుస్తకాలు పోయినాయి నేనేం చదవను టీచర్‌ అంటే, ఇట్టా ఎడం చేత్తో పట్టుకొని కుడిచేత్తో గుద్దింది చూడండి. ఒకటే కొట్టడం. వీపు మీద బాధేసింది. అప్పుడు బాగా లావుగా ఉండే దాన్ని లెండి. టీచర్‌ మా ఇంటికి లెటర్‌ రాసి మీ అమ్మాయి ఇక్కడ చదవక్కర్లేదు అందరి పిల్లల్ని పాడు చేస్తుంది. చదవడం లేదు గెటవుట్‌ అని పంపించేసింది. అబ్బా మహా సంతోషం వేసింది. తింటే తిన్నానులే తన్నులు అనుకుని సుబ్బరంగా ఇంటికి వచ్చేసాను. మా అమ్మ చదువు ఏమీ లేకుండా పిల్లను పాడు చేసేసారని చాలా బాధపడిరది. మా అక్క బాగా చదువుకునేది. నేనేమో చదువుకోలేదు. నా మనసు పాట మీద పడిపోయిందని బుద్ధి స్థిరంగా లేదని అర్థం చేసుకొని ట్యూషన్‌ పెట్టించారు. ఆయన చెప్పినంత సేపు ఏం వినకుండా బొమ్మలు గీసుకుంటుండే దాన్ని. అది పడలేక ఆయన మానేశాడు. మా వాళ్ళు అరిచి అరిచి ఇంకా లాభం లేదనుకుని మళ్లీ మద్రాస్‌కు తీసుకొచ్చేశారు. అప్పుడే ఇంకో పిక్చర్‌కి కాంట్రాక్ట్‌ అయింది.
ముసిరి సుబ్రహ్మణ్యం గారిది ఆయన పెద్ద మ్యూజిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కదా అప్పటికి మా నాన్నకి థియేటర్‌ ఇంట్రెస్ట్‌ మాకు గుంటూరులో రత్నహాలని థియేటర్‌ ఉంది. దాంట్లో డ్రామాలు అవి వేయించేవారు. అంత పెద్ద వాళ్లంతా పాటలు పాడేవాళ్లు అవన్నీ విని విని వాళ్ళలాగే పాడేదాన్ని. అప్పుడే జై ఎన్‌ రానడే అని ఒక మరాఠీ ఆయన చాలా పెద్ద సింగర్‌. అతి కష్టమైన పాటలు పాడే వాడైన ఇప్పుడు నాకు ఎనిమిదో ఏడు నన్ను పాడమన్నప్పుడు రానడే పాట పాడుతానన్నాడు. ఏడిసావులే. ఆయన పాట చాలా కష్టమైంది అన్నారు. వాళ్లకు కష్టంగాని నాకేం కష్టం లేదు. జానెడంతా లేవు. దొండకాయంత ఉన్నావ్‌. రానడే పాట పాటలు పాడుతావా అంటే లేదు సార్‌ నాకు వచ్చు, నేను పడతానంటే పాడమన్నారు. చాలా మంచి పాట నేను పాడాను. పర్వాలేదు అని ఆ పాట పెట్టేయమన్నారు. ఆ పాట తుకారంలో పాడాను. నేను తడుముకోకుండా పాడేసరికి వాళ్లంతా అనుకునేవారు ఎంత ఈజీగా పాడుతుంది అని. పిక్చర్‌ రిలీజ్‌ అయింది. 18 కీర్తనలు పాడడాయన. అవన్నీ గాలికిపోయి నా పాట హిట్‌ సాంగ్‌ అయింది ఆ పిక్చర్‌క.ి రోడ్లమీద అందరూ పాడుకునేవారు. అంత ఈజీగా వచ్చింది ఆ పాట. సుబ్రహ్మణ్యం గారు నీ దుంపతెగ నువ్వు ఏం సాధించావే కదా పిల్ల, బలే పాడావు కదా అని చాలా ముద్దు చేసేవాళ్ళు. తర్వాత త్యాగరాజ భాగవతార్‌ ఆయన పెద్ద విద్వాంసుడు మద్రాసులో. ఆయన వస్తే ఇప్పుడు శివాజీ గణేషన్‌, కమలహాసన్‌ వస్తే ట్రాఫిక్‌ ఎలా ఆగిపోతుందో అలా ఆగిపోయేది. అంతా పెద్ద పేరాయనకి. ఆయన పిక్చర్‌లో ఆయన చెల్లెలుగా నటించాను. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయి. ఆయన 20 కీర్తనలు పాడేశాడు. నన్ను పట్టుకుని నువ్వు బాగా పడతావు నీకు దేవుడు మంచి గొంతు ఇచ్చాడు. కానీ బుద్ధి ఇవ్వలేదు అనేసాడు. నీకు నిలకడ లేదు.
కర్ణాటక సంగీతం నేర్చుకుని పాడితే ఎంత బాగుంటుంది అని మా నాన్నని పిలిచి దీన్నిలా వదిలేయకండి బాగా తెలివితేటలున్నాయి. బాగా నేర్పించండి. అలతూరు సుబ్బయ్య గారు చాలా పెద్ద వాళ్ళు, విధ్వంసులు ఆయనకి గురువులు. ఆయన్ని నాకోసం ఏర్పాటు చేశారు. ఆయన తెల్లారగానే మా ఇంటికి కారులో వచ్చి ఓ గంట సంగీతం నేర్పేవాడు. సరళీస్వరాల దగ్గర మొదలు పెట్టాడు ఆయన. నాకు చాలా కష్టమైంది. ఆయన పాడినట్టుగా పాడలేకపోయేదాన్ని. కర్ణాటక సంగీతం వెయిట్‌ పెట్టి పాడాలి అని కోప్పడితే నాకు అవన్నీ వద్దు వర్ణాల దగ్గర నుంచి నేర్చుకుంటానన్నాను. ఆ తర్వాత అది వదిలేసి కీర్తనల్లోకి ఒకే జంపుతో వెళ్ళిపోయాను. ఓపిక పెట్టి 7, 8 కీర్తనలు నేర్చుకున్నాను. త్యాగరాజ భాగవతగారు పిలిచి అడిగారు. ఈ పిల్లకి ఎంతవరకు వచ్చిందని, ఏమి వస్తుంది? రాగానే కీర్తనల దగ్గర నుండి మొదలు పెట్టేది అని చెబితే ‘అయ్యో’ అట్లానా అన్నాడు. ఆయన ఆ టైంలో స్టూడియోలో త్యాగరాజ భాగవతార్‌ తన గురువుగారు ఆలతూరు బ్రదర్స్‌ దగ్గర విజయంబికే అనే కీర్తనని నేర్చుకుంటుండేవారు. విజయ నాగరి భాగంలో కీర్తనది. ఫస్ట్‌ క్లాస్‌ కీర్తనది. ఈ చిన్న పిల్లకి ఎంత పెద్ద కీర్తన ఎందుకులేనని నన్ను తీసి పారేసి ఆ కీర్తన త్యాగరాజ భాగవతార్‌ గారికి నేర్పుతున్నాడు ఆయన. నేను ఆ పాట విని మర్నాడు క్లాస్‌కి వచ్చినప్పుడు నాకు కూడా ఆ పాటని నేర్పమని గొడవ చేశాను. ఆయన అయ్యయ్యో అలా అనకూడదు ఆయన పాడే పాట నువ్వు పాడకూడదు అంటే నేనెందుకు పాడకూడదు పాడుతాను నేర్పించండి నేర్చుకుంటాను అని గొడవ చేశాను. అప్పుడు నాకు నేర్పించారు. ఆ పాట అయితే ఆయనకి చెప్పొద్దన్నారు. ఆ పాటని చాలా శ్రద్ధగా నేర్చుకున్నాను. తర్వాత మా పిక్చర్‌ రిలీజ్‌ అయింది. మాకందరికీ గోల్డ్‌ మెడల్స్‌ ఇచ్చారు. అందులో ఫస్ట్‌ డే స్టేజి ఆపీరియన్స్‌ నేను త్యాగరాజ భాగవతార్‌ గారిని నాకు ఆ పిక్చర్లో చాలా పేరొచ్చింది. ఆయనకి చెల్లెలుగా నటించాను కదా ఆ స్టేజి ప్రోగ్రాంలో ముందు చిన్న బిడ్డ కథ అని నన్ను పాడమన్నారు. రెండు పాటలు పాడాలి అన్నారు. మా గురువుగారు త్యాగరాజ భాగవతార్‌ గారు అక్కడే ఉన్నారు. నాకు సైగల్‌ పాటలు పాడటం ఇష్టం కదా. ఎక్కడైనా ప్రోగ్రాంలో సైగల్‌ పాటలు పాడటం, నేను చాలా బాగా పాడతానని పేరు వచ్చేసింది నాకు. అందుకని ‘దుష్మన్‌’ సినిమాలో సైగల్‌ పాడిన పాటని ముందు పాడాను. అందరూ బాగా మెచ్చుకున్నారు. రెండో పాటగా మా సినిమాలో పాట పాడొచ్చుగా, నేను పాడలేదు ఠక్కున విజయమాంబికే పాడేసాను. త్యాగరాజ భాగవతార్‌ ఆ పాట పాడాలని బాగా ప్రిపేర్‌ అయున్నారు. అయితే నేనా పాట పాడేశాను. ఆయన తెల్లబోయి అలాగే చూస్తుండిపోయారు. అంత పెద్ద పాటను తీసుకొని పాడేసింది నేనేం పాడాలి ఇప్పుడు అంటూ చూశాడు ఆయన. పిక్చర్‌లో పాట పాడొచ్చుగా పాడలేదు. నేనేమో ఆ పాటకి ఎన్ని సంగతులు ఉన్నాయో అన్ని సంగతలు వేసి ఒక్కటి కూడా వదలకుండా, ఆయన ఎన్ని నేర్పించారు అన్ని పాడేసాను. అందరూ భలే పాడిరదని బాగా మెచ్చుకున్నారు. అప్పట్లో అందరూ ఎవరి పాటలు వాళ్లే పడుకోవాలి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ వినపడగానే లేచెల్లి అక్కడ నిలబడుకొని పాడాలి. పాఠం గొప్ప చెప్పినట్టే పాడేసి వచ్చి కూర్చోవాలి. ఒక్క పాటకి నెల రోజులు రిహార్సల్స్‌ చేస్తారు. పాటలు ఇప్పుడు లాగా ఇన్స్టంట్‌ గులాబ్‌ జామ్‌ మాదిరిగా కాదు. నెల రోజులు ప్రాక్టీస్‌ చేయాలి. ఈ నెల రోజులు విని విని నాకు వేరే వాళ్ల పాటలు కూడా వచ్చేవి. అసలు వేరే వాళ్ళ పాటలే ముందు వచ్చేవి నాకు. ఓ రోజు ఆ సినిమాలో కాంచనమాల నటిస్తోంది. నేను రాజేశ్వరరావు గారు కలిసిన నటిస్తున్న ఫస్ట్‌ పిక్చర్‌ కూడాను. రాజేశ్వరరావు గారికి అప్పటికి 16, 17 ఉంటాయి. నాకు 12 ఏళ్ళు ఉంటాయి.
ఆ రోజుల్లో పాటలు పాడటం అంటే తేలిక కాదు. నెల రోజులు రిహార్సల్స్‌ చేసి చేసి పాట కంఠంత వచ్చేసింది. నిద్రలో లేపి అడిగిన పాడేసే వాళ్ళం. అది డ్రామా ఆర్టిస్టులు అయితే అపశృతి వినపడకుండా ఫుల్‌ ఆర్కెస్ట్రా పెట్టేసేవారు. ఆ విషయం నాకు తెలిసిపోయేది. వీళ్ళేదో పప్పులో కాలేశారు. అందుకే ఆర్కెస్ట్రా హోరు అని నవ్వేసేదాన్ని. ఆ పిక్చర్లో సూరిబాబు రఘురామయ్య లాంటి వాళ్ళందరూ నటించేరు. పాట పాడే వాళ్ళం. పై ఇద్దరు నేను రాజేశ్వరరావు గారి మిగతా వాళ్ళకి ఏమీ రాదు. ఆయన అంత శ్రద్ధ తీసుకొని పాడిరచారు ఆ సినిమాలో అన్ని పాటలు పాడాము. చివరికి సినిమా ఇంకో పది రోజుల్లో రిలీజ్‌ అవుతుంది అనగా అయ్యో వీళ్లిద్దరివి రెండే పాటలు ఉన్నాయి. ఇంకా ఉంటే బాగుంటుందని చెప్పి పిక్చర్‌ చివరలో అప్పటికప్పుడు ట్యూన్‌ చేసి రాత్రి పన్నెండు గంటలకి నన్ను లేపి కారులో ఎక్కించకుపోయారు నన్ను రాజేశ్వరరావు గారిని. ఆ అర్ధరాత్రి పాట రికార్డు చేశారు. డైరెక్ట్‌ టేకులో ఆ పాట పాడిరచారు. అప్పటి నుండి రాజేశ్వరరావు గారితో లైట్‌ మ్యూజిక్‌ పాడేదాన్ని. నేను ఎక్కువ అరవ సినిమాలో చేయడం, అరవ వాళ్ళతో తిరగడంతో నన్ను అరవ పిల్ల అనుకునే వారసలు. నేను తెలుగండి అని చెప్పుకునేదాన్ని. క్లాసికల్‌ మ్యూజిక్‌ పాడతా ఉంటే ఎఐఆర్‌్‌ వాళ్ళు వచ్చి మా పాట విన్నారు. వాళ్లకి పాడే వాళ్ళు ఎవరో ఎగ్గోట్టారంట. మాతో పాడిరచుకుంటే బాగుంటుందనుకున్నారు. మేము మేకపులో ఉన్నాం. మమ్మల్ని అలాగే కారులో ఎక్కించకుని వెళ్లిపోయారు. ఆర్కెస్ట్రాన్ని పికప్‌ చేసుకొని ఏఐఆర్‌ స్టూడియోలో డైరెక్ట్‌ బ్రాడ్‌ కాస్ట్‌ చేసేసారు.
ఇది 1940లో జరిగింది. మేము 1940 నుండి రేడియోకి పాడుతూ వచ్చాము. అప్పటికి వాళ్లకి లైట్‌ మ్యూజిక్‌ లేదు. అప్పటి నుండి మాకు కాంట్రాక్ట్‌ రావడం మొదలైంది. రాజేశ్వరరావు గారి కొస్తే నేను, నాకు వస్తే ఆయన పాడేవాళ్ళం. మాకు చాలా పేరొచ్చింది. ఎన్నో కచేరీలు చేయడం జరిగింది. అప్పుడే హెచ్‌ ఎం వి వాళ్లు కూడా లైట్‌ మ్యూజిక్‌ రికార్డులు తీశారు. ఆయనతో కలిసి పాడడం మొదలు పెట్టాక జాతులు డ్యూయెట్‌లు పాడడం మొదలైంది. 1944 వరకు చైల్డ్‌ ఆర్టిస్టుగా నటిస్తూనే వచ్చాను. 1944లో నా మ్యారేజ్‌ సెటిల్‌ అయిపోయింది. అప్పుడు మా నాన్నగారు పార్టనర్‌ షిప్‌లో తీసిన రాధికలో చివరిసారిగా నటించాను. అప్పటికి నాకు 15 ఏళ్లు. చివరి మూడు సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించాను. ఎం.జి.ఆర్‌ తో ఒక పిక్చర్‌ తమిళంలో తర్వాత కె.ఆర్‌ రామస్వామి అని ఆయన కూడా పెద్ద సింగర్‌. ఆయనతో ఒకటి, తర్వాత తెలుగులో రఘురామయ్య గారితో ఒకటి, ఆయన కృష్ణుడు నేను రాధ గాను వేశాను. అదే రాధిక సినిమా. ఆ పిక్చర్‌లో చాలా పాపులర్‌ సాంగ్స్‌ ఉన్నాయి. ‘‘గోపాలకృష్ణుడు నల్లన’’ పాట అందులోనే. 1944లో ఒక జనగణమన పాడేసి మొత్తం అన్ని ఆపేశాను. మొత్తం 12 సినిమాల్లో నటించాను. నా అంతట నేనే మానేయలేదు. మ్యూజిక్‌ ఇష్టం లేదు. అయితే పదిమందిలోకి వెళ్లి వాడడం ఆయనకి నచ్చలేదు. అందులోనూ ఆ రోజుల్లో పాటకి ఎక్కువ పేరు కదా. ఎక్కడైనా పబ్లిక్‌ ప్రోగ్రాంకి వెళ్తే విపరీతంగా జనం వచ్చేసేవారు. ఆంధ్ర సైడ్‌ గాని వెళ్ళాను అంటే చాలా జనం. ఇదంతా చూసి ఇదేంటి ఇలా? ఎక్కడ కనబడడానికి వీల్లేదని అన్ని క్లోజ్‌ చేసేసారు. అప్పటినుండి అప్పటినుండి పాడలేదు. మూడేళ్లు మానేశాను. దుక్కిపాటి మధుసూదన రావు గారు అక్కినేని నాగేశ్వరరావు గంటసాల బలరామయ్య గారు వాళ్ళ ముగ్గురు కలిసి మా ఇంటికి వచ్చారు. స్వప్న సుందరి పిక్చర్‌ తీస్తున్నాము. దాంట్లో పాడిరచమని వచ్చి ఆయన్ని అడిగారు. పాడిరచనున్నారు. ఎన్ని చెప్పినా ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళ అన్నారు అదేమిటండి మీరు రాజులు కదా ఇంత పెద్ద వాళ్ళు సంస్థానాలు ఉన్నాయి ఒక ఆర్టును పైకి తేవలసిన వాళ్లు అలా నొక్కేస్తా ఉంటే తప్పు కదా అని ఆయన్ని కూర్చోబెట్టి బాగా నూరారు. అప్పుడు ఏమైందో ఏమో ఒప్పుకొని ఒక పిక్చర్‌ పాడేసి వచ్చేయ్‌ అన్నారు. అందులో పాటలన్నీ చాలా హిట్‌ సాంగ్స్‌. ‘‘నటనలు తెలుసులే’’ పాట కూడా అందులోదే ఘంటసాల నేను పాడావ్‌ అది పాడుతుండగానే షావుకారు మొదలుపెట్టారు. ఇక్కడికి రిహార్సలస్‌కి వచ్చినట్టే వచ్చి ఆ పాటలు పాడేసి వచ్చేదాన్ని. ఆయనకి తెలియనే తెలియదు ఆ విషయం. నేను ఇక్కడే స్వప్న సుందరికి పాడుతున్నానని ఆయన అనుకునేవారు. నాకు చాలా ధైర్యం అని పేరు. అంత ధైర్యం ఎటు పోయిందో ఆయన దగ్గరికి రాగానే. అన్ని పోయినాయి. ఆయన్ని చూడగానే భయం వచ్చేది. ఎందుకంటే వాళ్లకు అలవాటు లేదు అట్లా. బయటకు రావడం పాడడం ఎవరూ లేరు ఆ ఫ్యామిలీలో. నేను ఒక్కదాన్నే బయటకొచ్చి పాడతానంటే అది ఆయనకి ఆ గౌరవం కదా! బంధువులందరికీ కొంత జలసి కూడా ఉండొచ్చును. పేరు వచ్చేస్తుంటే అది కూడా ఉంది కదా! ఆడవాళ్ళందరూ వాళ్లకి ఏమీ తెలియదు. ఎంతసేపు చీరలు నగలు తప్ప రెండో మాట మాట్లాడి ఎరుగరు వాళ్ళు. ఎంతసేపు దాసీలు పని మనుషులతో తప్ప బయట ప్రపంచం తెలియదు. వాళ్లు చెప్పితేనే వినాలి. అట్లా ఉండే వాళ్లకు నేను బయటకు పోయి పాడుతాను అంటే ఆయనకు కష్టమే. ఆలోచించి ఆలోచించి పోనీలే ఛీ ఎందుకులే ఇవన్నీ కష్టపెట్టడం ఎందుకు పోతే పోనీ పాటే కదా అనుకుని మానేసుకున్నాను. పాడలేదు అట్లా చాలా కాలం పాడకుండా ఉన్నాను. మా ఇద్దరి అబ్బాయిలు పుట్టిన తర్వాత మళ్లీ మామూలుగా పాడుతున్నాను. పిక్చర్స్‌కి కూడా పాడమన్నారు. పాడుతున్నాను కానీ ఆయనకి ఇష్టం లేదు. నేను మద్రాస్‌కి వస్తేనే పాడటం ఆయన ఊర్లో అయితే ఏదీ లేదు. మూడు నెలలకు నాలుగు నెలలకు మద్రాసు వస్తాను. ఆ వచ్చినప్పుడు పాడిరచుకునేవారు. లేకపోతే పాట లేదు ఏమీ లేదు. పబ్లిక్‌ ప్రోగ్రామ్స్‌ అన్ని కూడా మానేశాను. అయితే ఒకసారి బెజవాడలో సంగీత సమ్మేళనం జరిగి పాడమని పిలిచేవాళ్ళు. అయితే ఆయనకు ఐడియా లేదు అది ఎట్లా ఉంటుందని తెలియదు ఆయన కూడా నాతో వచ్చారు. మూడు కార్లు తుపాకులతో మనుషులు నౌకర్లు చాకర్లు అందరూ వచ్చారు. ఆరోజు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేసారు.
నా ప్రోగ్రామ్‌ రాత్రి 12:00కు వచ్చింది. నా ముందు చాలా మంది పాడారు. చాలామంది బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. నన్ను స్పెషల్గా మద్రాస్‌ నుంచి పిలిపించారు ఈ ప్రోగ్రాంకి. నేను ముందు పాడేసి పోతానన్నాను వాళ్లు ఒప్పుకోలేదు. మీరు ముందు పాడి వెళ్ళిపోతే ప్రోగ్రాం ఫీల్‌ అయిపోతుంది. మీరు చివర పాడాలి అన్నారు వాళ్లు. చివరిదాకా ఉండి 11:30కి నా ప్రోగ్రాం మొదలైంది. నడిరేయి దాటింది. నా చేయి వదిలేయ్‌ అనే పాట పాడాను. ఆ పాటకి జనం ఎట్లా గోల చేశారంటే ఈయనకి ఎట్లాగో అయిపోయింది. మండి పోయింది, ఆయనకి వీళ్ళకేమైనా పిచ్చా మ్యూజిక్‌ అంటే ఇంత వెర్రే అని ఆశ్చర్యపోయారు. నిజానికి ఆయనకి ఆ విషయం ఏమీ తెలియదు. ఇప్పటికీ మా వాళ్ళకి ఏమీ తెలియదు. సంగీతం గురించి పాట గురించి పాడడం ఎంత కష్టమో తెలియదు. అందరి కంటే చిన్న నేను మా ఇంట్లో ఆయన దగ్గర ఏమీ మాట్లాడటానికి లేదు. మా సంస్థానం అంటే ఎంత పెద్ద పేరు మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను పాడటం మానేశాను. ఆ మధ్య రమేష్‌ నాయుడు సంగీతంలో ఒక పాట పాడాను. అది ఇంకెవరైనా అయితే పాడేదాన్ని కాదు. రమేష్‌ నాయుడుని కొంచెం సాఫ్ట్‌ మ్యూజిక్‌ బాగుంటుంది. అందువల్ల పాడగలిగాను. పైగా విజయనిర్మల నా కజిన్‌ కదా తను ఫోర్స్‌ చేసి పాడిరచింది. కానీ ఆ తర్వాత ఎమ్మెస్‌ విశ్వనాథం సుసర్ల దక్షిణామూర్తి వాళ్ళందరూ కూడా ఇంకా వచ్చేసాను. అడ్డం వచ్చేవాళ్ళు ఎవరూ లేరని పాడమని అడిగారు. అయితే ఏముంది ధనాధనా రిధం దానిమీద పాట పాడేస్తున్నారు. దీనికి కష్టమేముంది ఎవరు పడితే వాళ్ళు చదవచ్చునే దీనికి పెద్ద సంగీతం రానక్కర్లేదు పాడటానికి వద్దని చెప్పాను పాడలేనని అన్నాను. పైగా చిన్న చిన్న కుర్రాళ్ళు ఏమీ రాని వాళ్ళు కూడా మ్యూజిక్‌ డైరెక్టర్లు. నా లైఫ్‌లో నేను చూసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌లందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళు. అందువల్ల వాళ్లకంటే కూడా నేనే సీనియర్‌ని. వాళ్ళ దగ్గర అయితే అట్లా ఇట్లా కాదని నాచురల్‌ నేనే చూసుకుని పాడుతా వచ్చాను. వీళ్ళతో మార్చేదేముంది పాట లేనప్పుడు ట్యూన్‌ చేసేదేముంది. ఇప్పుడు ఇళయరాజా వచ్చిన తర్వాత కొంచెం బాగా వచ్చింది. అంతే కర్ణాటక మీద బేస్‌ చేసి పాటలు గాని చేస్తే అవి కొంచెం వినగలుగుతాం. అన్నమయ్య, శంకరాభరణం లాంటి వచ్చాయి కదా. మహదేవన్‌ లాంటి వాళ్ళు ఎక్కువగా క్లాసికల్‌ మీద బేస్‌ చేసి సాంగ్స్‌ చేస్తారు. ఇప్పుడొచ్చే వాళ్ళలో అది లేదు కేకలు అరుపులు తప్ప. ఎం ఎస్‌ విశ్వనాదం, సుబ్బరామన్‌, రాజేశ్వరరావు పెండ్యాల వాళ్ళందరూ బాగా శ్రద్ధ తీసుకొని బాగా రిహార్సల్స్‌ చేయించి మనసుకు పట్టిన తర్వాత రికార్డు చేసేవాళ్ళు. అంతేకానీ ఇన్సిడెంట్‌గా పేపర్‌ చూసుకొని పాడేసి వెళ్లిపోవడం కాదు. ఇప్పటి వాళ్ళకి సిచువేషన్‌ తెలీదు. పాట ఎక్కడ వస్తుందో తెలియదు. అప్పట్లో రికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు డైరెక్టర్లు వచ్చి కూర్చొని ఆ స్విచ్యువేషన్‌ మనకి ఎక్స్ప్లెయిన్‌ చేసి ఫలానా దగ్గరకు వస్తుంది. ఈ పాట సందర్భానికి సరిపడా భావంతో పాడాలి అని చెప్పేవారు. అదేం తెలియకుండా పాడితే ఏం బాగుండదు. ఇప్పట్లో పాటల్లో మధ్యలో గావు కేకలు వినిపిస్తాయి. అవి ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. కాబట్టి ఇప్పటి మ్యూజిక్‌లో పాడడానికి నేను అన్ఫిట్‌ నేను పాడలేను అలా గప్చుప్‌గా ఊరుకోవాలి. లేదా గ్రాండ్‌గా రిటైర్‌ అయిపోవాలి. పాత వాళ్ళందరూ పాడి
ఉన్న పేరుని పోగొట్టుకోకూడదు. ఎన్నో అవస్థలు పడి సంపాదించిన పేరు ఇది. ఈ పిచ్చి పాటలు రెండు పాడి ఉన్న పేరు పోగొట్టుకోకూడదు.
(భూమిక మార్చి`ఏప్రిల్‌ 2000)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.