రావు బాలసరస్వతి గారితో ఓ సాయంత్రం
చాలా రోజులుగా బాలసరస్వతి గారిని కలవాలని అనిపిస్తూ ఉంది. ఇటీవలనే తెలిసింది వారు మణికొండకి ఇల్లు మారారని. చాలా తరచుగా గచ్చిబౌలికీ వెళుతూనే ఉంటాను. ఈ సారి కలవాలని అనుకున్నాను. అమృతలతని అడిగితే అడ్రెస్ ఇచ్చింది. కరోనా గురించిన భయం ఇంకా ఉంది కాబట్టి వారి అబ్బాయికి ఫోన్ చేసి బాలసరస్వతి గారిని చూడడానికి రావచ్చా అంటే తప్పకుండా రండి, మాస్క్ పెట్టుకోండి అన్నారు.
మాస్క్ పెట్టుకునే ఉన్నానండి, ఓ గంటలో వస్తానండి అని చెప్పాను. ఆవిడకిష్టమైన రసగుల్లా, అజ్మీరి కళాకన్, కొన్ని సీతాఫలాలు కొనుక్కుని వెళ్ళాను. ఆవిడకు షుగర్, బీపీ లాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నేను వెళ్ళేటప్పటికి బాల సరస్వతి గారు ముందు హాల్లో కూర్చుని ఉన్నారు. నేను మాస్క్ పెట్టుకుని ఉన్నాను. ఎవరు అన్నారు నా వేపు చూస్తూ. కొండవీటి సత్యవతి గారు అని వాళ్ళబ్బాయి సూర్యారావు గారు చెప్పారు. వెంటనే గుర్తు రాలేదు. ఆవిడ విజిల్ వేస్తారు గుర్తొచ్చిందా అన్నారు ఆయనే. నేను ఖయ్యని విజిల్ వేసాను. అమ్మ దొంగా నువ్వా ఇన్నాళ్ళకి వచ్చావా అన్నారు.
నిన్ను కొడతా అన్నారు మళ్ళీ.
కొట్టండి అని దగ్గరికెళ్ళాను.
చెయ్యి గట్టిగా పట్టుకుని ఎన్నళ్ళాకొచ్చావమ్మా అన్నారు.
అప్పటికి బాగా గుర్తుపట్టారు. ఇంక మాటల ప్రవాహం మొదలైంది. ఒక్కో సంఘటనా గుర్తు చేసుకుంటూ వాళ్ళు బావున్నారా, వీళ్ళు బావున్నారా అని అడుగుతున్నారు. అమృతలత మొన్న వచ్చారు కదా అంటే… అమృతలత ఎవరు అన్నారు.
నిజామాబాద్, అపురూప అవార్డ్స్, అక్కినేని నాగేశ్వరరావ్ అంటూ కొన్ని పదాలు చెబితే అన్నీ గుర్తొచ్చాయి. అక్కినేని గురించి సి.నారాయణ రెడ్డి గురించి కొన్ని జోక్స్ చెప్పి పడీపడి నవ్వించారు. ఒకసారి అపురూప అవార్డ్స్ ఫంక్షన్లో అక్కినేని గురించి ఆవిడ పేల్చిన జోక్ గుర్తు చేస్తే భలే నవ్వారు. వి ఏ కే రంగారావు గారు గుర్తున్నారా అంటే ఎందుకు గుర్తులేరు బాగా గుర్తున్నారు. కాసేపు తర్వాత అవును టైం అవుతోంది మెడ్రాస్ వెళ్ళాలి కదా పాటపాడమని పిలిచారు కదా అన్నారు హఠాత్తుగా. సడెన్గా అలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటారు అన్నారు సూర్యారావు గారు. కొంచెం సేపే అలా. ఒకసారి బెజవాడ వెళ్ళినప్పుడు బాలాంత్రపు రజనీ కాంతరావు గారింట్లో నాలుగు రోజులున్నాను. ఆయన కొడుకు పేరేంటి అని అడిగితే హేమచంద్ర అని చెప్పాను. ఆయన, భార్య నన్ను ఎంత బాగా చూసుకున్నారో.
హేమచంద్ర గారు హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయారని చెప్పాను. అయ్యో అవునా. ఎంత బాగా చూసుకున్నారని అంటూ నాకిచ్చిన రూం పక్కన ఓ మల్లెపొద ఉంది. దానిలోంచి పాములొస్తాయని చాలా భయపడ్డాను. పాములు లేవని, రావని హేమచంద్ర చెప్పాకా హాయిగా నిద్రపోయాను.
ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడారు.
డాక్టర్ భార్గవి గుర్తున్నారా అంటే ఎవరు అన్నారు.
మాట్లాడతారా, చూస్తే గుర్తుపడతారు అని భార్గవికి వీడియో కాల్ చేసి మాట్లాడిస్తే చక్కగా మాట్లాడారు. హైదరాబాద్ వచ్చినప్పుడు మేమిద్దరం వస్తాము అంటే తప్పక రండి అని చెప్పారు. దేవదాసులో మీరు పాడిన తానే మారెనా పాట భార్గవి చాలా బాగా పాడతారు అంటే అవునా అన్నారు. ప్రసూన గారి గురించి అడిగినప్పుడు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ ఆవిడ ఆఫీసులో ఉంటారేమో అని చెయ్యలేదు. పద్మప్రియ గారమ్మాయి చైత్ర గురించి చెప్పాను. ఇటీవల చైత్ర పద్మప్రియ గారమ్మాయని ఫేస్ బుక్ ద్వారా తెలిసిందని చెప్పి మీ 89వ పుట్టిన రోజునాడు సురభి హోటల్కి మేమందరం వచ్చాము, అప్పుడు చైత్ర మీ పాట పాడిరది కదా అని గుర్తు చేస్తే నాకెందుకు గుర్తుండదు, చైత్ర నా పాటలన్ని పాడిరది అన్నారు. ఫేస్బుక్లో పద్మప్రియగారి పేజీలోకి వెళ్ళి చైత్రపాడిన ‘‘మీరజాలగలడా నా ఆనతి’’ పాట వినిపించాను. ఉత్సాహంగా ఆ పాట పాడబోయారు. అమ్మ వద్దులే అని చెప్పి, పాడడం మొదలు పెడితే ఆపకుండా రెండు మూడు పాటలు పాడేస్తుంది. తర్వాత మూడు రోజులు బాధపడుతుంది. ఆయాసమొస్తుంది. గొంతులో చాలా ఇబ్బంది అన్నారు సూర్యారావుగారు.
హమ్మో అయితే వద్దులెండి పాట అడగను అన్నాను.
ఈ మధ్య వైజాగ్ నుండి ఎవరో వచ్చారు. నేను చెప్పాను పాట అడక్కండి అని.
వాళ్ళు వినలేదు. అమ్మ పాడి మూడు రోజులు చాలా బాధపడిరది అన్నారు సూర్యారావు గారు.
అయ్యో! చెప్పినప్పుడు వినాలి కదా వాళ్ళు అన్నాన్నేను.
ఆ తర్వాత సంభాషణ తను ఎవరెవరితో కలిసి పాడిరదీ మీద నడిచింది.
మీరు ఎం ఎస్ రామారావు గారితో కలిసి పాడిన ‘‘ఓ మలయ పవనమా’’ పాట నాకు చాలా ఇష్టం. మీ పాటల్ని ప్రయాణాల్లో బాగా వింటుంటాను అంటే ఎం ఎస్ రామారావుతో నేను పాడలేదే అన్నారు. నా ఫోన్లో ఆ పాట వినిపించి ఇదెవరు పాడారు మరి అంటే గట్టిగా నవ్వి నేనే పాడాను. మీరు ఘంటసాల, ఏ ఎం రాజా, రాజేశ్వరరావు గార్లతో డ్యూయెట్లు పాడారు కదా అంటే సి ఆర్ సుబ్బరామంతో కూడా పాడానమ్మా అన్నారు.
‘‘అమ్మ లైన్లోకొచ్చింది’’ అన్నారు సూర్యారావుగారు.
‘‘నట్లు టైట్ అయిపోయాయి ఏంచేద్దాం’’
అంటే అమ్మా నట్లు లూజ్ అయిపోయాయి టైట్ కాదు అని నవ్వారు.
అదేలే లూజ్ అయినట్టుంది.
మీరెక్కడుంటారు?
బాగ్లింగంపల్లి
అదెక్కడుంది.
మీరొకసారి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఒక మీటింగ్ కోసం వచ్చారు.
నేను మిమ్మల్ని స్టేజి మీదకి తీసుకెళ్ళాను.
ఆ పెద్ద హాలు కదా, అక్కడో పార్కు కూడా ఉంది అంటూ గుర్తు తెచ్చుకున్నారు.
తనంతట తనకి గుర్తు రావడం లేదు కానీ దానికి సంబంధించిన ఒక విషయాన్ని చెబితే గుర్తు తెచ్చుకుంటున్నారు.
అలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
మాధవపెద్ది సురేష్, సురేఖ మూర్తి వస్తారు. అందరం కలిసి ఒక రోజు పాటల ప్రోగ్రాం పెట్టుకుందాం.
మీరు పాడతారా అంటే వాళ్ళబ్బాయి ఆవిడ ఈల వేస్తారు అన్నారు.
ఈల అనగానే చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని నవ్వారు.
అవును కిళ్ళీ తినేవారు కదా మానేసారా అన్నాను. ఎప్పుడో మానేసాను.
ఒక సారి రాజమండ్రి వెళ్ళినప్పుడు కిళ్ళీ తింటే గొంతుకు అడ్డం పడిరది. ఉక్కిరిబిక్కిరి అయ్యింది. సొమ్మసిల్లినట్టు అయ్యింది. అప్పటి నుండి మానేసారు అన్నారు పక్కనే కూర్చున్న విజయలక్ష్మిగారు. ఒక సారి రవీంద్రభారతిలో మీకు కిళ్ళీలు తెచ్చి ఇచ్చాను అంటే… గుర్తులేదమ్మా అన్నారు. ఆరోజు నాతో దెబ్బలాడి కిళ్ళీలు తెప్పించుకున్నారు.
ఇదిగో ఇది బక్కమ్మ అసలు పేరు విజయలక్ష్మిలే తనే నన్ను చూసుకుంటుంది.
బక్కమ్మ అని ఎందుకు పిలుస్తారు అంటే గట్టిగా నవ్వి పిలవడం ఈజీ కదా అన్నారు.
ఈ నైటీ బావుందా నిజం చెప్పు అంటే చాలా బావుంది.
చీరల జోలికెళ్ళకుండా నైటీ వేసుకోవడం బావుంది కదా నడవడం తేలిక అన్నాను.
అవునమ్మా హాయిగా ఉంది.
నీ జుట్టు భలే ఉంది నా జుట్టు చూడు తెల్లగా అయిపోయింది అన్నారు.
నాది తెల్ల జుట్టే రంగేసాను అన్నాను.
అవును మీరు నా లాగా హెయిర్ కట్ చేయించుకుంటారా.
కొడుకు వేపు చూసారు నవ్వుతూ.
చేయించుకో అమ్మా బావుంటుంది.
పొద్దున్నే నిద్ర లేచాకా చూస్తే జుట్టు చిక్కులు పడిపోతుంది అన్నారు విజయలక్ష్మి గారు.
మరి జుట్టు కట్ చేయించి నల్ల రంగు వేయిద్దామా అన్నాను.
అలాగే అంటే, నిజమేనా అమ్మా అన్నారు వాళ్ళబ్బాయి.
నిజమేరా చేయించుకుంటాను అన్నారు.
అయితే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ పని చేద్దాం అన్నాన్నేను.
ఈసారి పొద్దున్నే రామ్మా. అందరం కలిసి పాటలు పాడుకుందాం. అందరినీ తీసుకురా. అలాగే ఈ సారి ప్రశాంతి నేను వస్తాం అంటే ప్రశాంతి ఎవరు అన్నారు. మన పాత ఇంటికి వచ్చారులే అన్నారు సూర్యారావు గారు.
నాకు గుర్తులేదమ్మా చూస్తే గుర్తుపడతాను. అలా అలా మూడు గంటలపాటు పాటల్లేకుండా మాటలు, నవ్వులు, నిన్ను కొడతా అనే బెదిరింపులు మధ్య కాలం నల్లేరు మీద బండిలా నడిచింది. ఇలా ఎవరైనా వచ్చి మాట్లాడితే మూడు నాలుగు రోజులపాటు చాలా సంతోషంగా ఉంటుందండి. లేకపోతే విచారంగా కూర్చుని ఉంటుంది. కరోనా భయం లేకపోతే హాయిగా రావొచ్చు.’’ అన్నారు సూర్యారావు గారు.
‘‘ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు.
నేను ధైర్యం చేసి మల్లు స్వరాజ్యం గారిని, శారదా శ్రీనివాసన్ గారిని కలిసానండి.
కానీ లోపలెక్కడో ఒక బెదురు ఉంది.
లేకపోతే చాలామంది వచ్చేవారు.
కాసేపు కబుర్లు చెప్పుకుంటే తనకీ బావుంటుంది.
ఇంక వెళతాను’ అని లేవబోతుంటే ఎక్కడికి వెళతావు అన్నారు.
‘‘మా ఇంటికెళ్ళాలి కదా.
ఎంత దూరం
20 కిలోమీటర్లుంటుందేమో అన్నాను.’’
‘‘హమ్మో అంత దూరమా వెళ్ళమ్మా మళ్ళీ తప్పక అందరినీ తీసుకురావాలి, పాటలు పాడుకుందాం.’’
‘‘తప్పకుండా వస్తానని’’
తన పాట వినకుండానే శెలవు పుచ్చుకుని వచ్చేసాను.
తనని కలిసి బయటకొచ్చాకా గొప్ప ఆనందం నా మనసంతా ఆవరించింది. 94 సంవత్సరాల వయసులో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కబుర్లు చెప్పిన బాలసరస్వతి గారి మాటలు, జోకులు గుర్తు చేసుకుంటూ ట్రాఫిక్ మహా సముద్రాన్ని ఈదుకుంటూ ఇంటికి బయలుదేరాను.
(ఇటీవల మరణించిన బాలసరస్వతి గారికి నివాళి.)
