ఫోన్‌లో మెయిల్ ఇండికేషనొస్తే ఎక్కన్నించని చూస్తే కన్నడ ఫ్రెండ్ స్వరాజ్యం నుంచి. కన్నడ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నా స్వరాజ్యం నాకు ప్రత్యేకం. స్వరాజ్యం బెంగళూరులో స్థిరపడ్డ బళ్ళారి తెలుగోళ్లు. కానీ స్వరాజ్యంకు తెలుగు అర్థం అయితది కానీ ఎక్కువ మాట్లాడరాదు. ఇంగ్లీష్ హిందీ కలిపిన తెలుగు మాట్లాడుతది. వాళ్ల ముత్తాత బళ్లారి నుంచి వచ్చి బెంగళూరులో స్థిరపడిరడు. తండ్రి ఆఫీసర్. బాగా చదువుకున్న కుటుంబం.
స్వరాజ్యం థియేటర్ ఆర్టిస్ట్, యాక్టివిస్ట్, రచయిత్రి కానీ సోషల్ మీడియాకి దూరంగా ఉంటది. ఒక మెయిల్ మాత్రమే వాడుతది. ఫోన్స్ కూడా ఎక్కువ మాట్లాడది. చెవులు నొస్తయి అంటది. తప్పదనుకుంటేనే మాట్లాడుతది.
స్వరాజ్యం నుంచి వచ్చిన మెయిల్ ఏందంటే ‘కర్ణాటక రాజ్య మహిళా దౌర్జన్య విరోధి వొక్కుట’ మీటింగ్ మార్చి 8న బెంగళూరులో ఉంది నువ్వు రావాలి. ప్లీజ్ రానని మాత్రం చెప్పొద్దు. సఫాయి కర్మచారీ సంగం వాళ్ళు ఇంకా ఇతర కార్మిక మహిళా సంఘాలు కూడా ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో’ స్వరాజ్యం పెద్ద చదువులు చదివి ఉద్యోగం వదిలేసి సమాజంలో ఉన్న బాధిత కులాల కోసం, మతాల కోసం, శ్రామిక మహిళల కోసం తన జిందగీని పూర్తిగా అంకితం జేసి పని చేస్తుంది. అట్లా బాధితుల కోసం ముఖ్యంగా శ్రామిక, అట్టడుగు కులాల మహిళల కోసం తన పూర్తి కాలాన్ని వెచ్చించి పంజేస్తున్న స్వరాజ్య మంటే నాకు చానిష్టం. స్వరాజ్యం దోస్తానితో కన్నడ రచయిత్రులు, కవయిత్రులు, కవులు, యాక్టివిస్టులు, ఎన్జీవో సంగాలు, కుల సంఘాలు పరిచయమైనయి. దక్షిణ రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు వాళ్లు నన్ను మీటింగులకు పిలిచింది తక్కువ. కానీ కర్ణాటక వాళ్లు పిలిచింది చాలా ఎక్కువ. నా సొంత తెలుగు రాష్ట్రాల్లో గూడా నేను ఇన్ని ఆహ్వానాలు అందుకోలే.
కర్ణాటక యూనివర్సిటీలు, దళిత సాహిత్యత్సవాలు, ఎన్జీవో సంగాలు, కార్మిక సంగాలు, శ్రామిక మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సఫాయి కర్మచారి సంఘాలు పిలుస్తుంటరు. అట్లా బెల్గాం, గుల్బర్గా, మైసూరు, తుమ్ కూరు, బళ్ళారి, హోస్పేట్, కొప్పల్, కోలార్, బెంగళూరులకు చాలా సార్లు పోయిన.
అట్లా కర్ణాటకలో స్థిరపడిన అనేక రంగాల్లో పంజేస్తున్న తెలుగు కన్నడ, కన్నడ ప్రముఖులతో పరిచయాలైనయి. కొన్ని సంస్థలు అవార్డులు కూడా ఇచ్చినవి. కన్నడ టీవీ చానల్స్ నా కవిత్వాన్ని, కథలను కొనియాడినయి. కొన్ని మ్యాగజీన్స్ సమీక్షలు, విశ్లేషణలు చేసినయి. అట్లా కన్నడ ఫ్రెండ్స్ ఎక్కువైండ్రు. కన్నడ అక్షరాలు గూడా తెలుగును పోలి ఉండుడు ఇంకా దగ్గర చేసింది. కర్ణాటకలో ఎక్కువ మందికి తెలుగొచ్చు. నాకు భాష సమస్య లేకుండే. కర్ణాటకలో మీటింగులు అంటే వేలవేల మందితో జరుగుతుంటయి.
దళిత సాహిత్యోత్సవాలకు చుట్టుపక్కల పల్లెల నుంచి జనం బండ్లు కట్టుకొని వచ్చుడు నాకు ఆశ్చర్యమైంది. ఇక్కడ జిల్లాకో సాహిత్య పరిషత్ ఉంటదని తెలిసి ఎంత మంచి కల్చర్ అనీ చాన సంతోష పడిన. గిట్లాంటి సాహిత్య ఉత్సవాలు జాతర్లు మాదిక్కు కూడా జరిగితే బాగుండనుకున్న. ఆ ఉత్సవాల్లో పుస్తకాలు, కవులు, కవయిత్రులు, కళాకారులు, రాజకీయ నాయకులు, దళిత నాయకులు పట్టు జాలది. అట్లాంటి మీటింగులు చూసి వాటిల్ల పాల్గొనుడు నాకు కొండెక్కినంత సంబరంగుండేది.కళాకారులు అంటే మహిళలే ముందుంటారు. అట్లా ఎల్లమ్మల టీం కళాకారిణే మెయిన్‌గా ఉండి బారు డిక్కీ లాంటి వాయిద్యంతో పాడుతూ కథ నడిపిస్తుంది. ఆ కథలన్నీ పాట రూపాల్లో స్వరాలు మారుస్తూ చెప్పడాన్ని చూసిన. ఇవి ఎక్కువ ఎస్సీ ఉపకులాల మహిళలు ఆ కళా రూపాన్ని నడిపిస్తుంటరు.
ఇది నన్ను బాగా ఆకర్షించింది. బాగా కాయిషు పడేట్టు చేసింది.
స్వరాజ్యం మెయిల్ చూసినంక నిజానికి మా కాడ గూడ మార్చ్ ఎనిమిది ప్రోగ్రాములుంటయి. రెండు ప్రోగ్రాంలకు ముందే చెప్పి పెట్టిండ్రు గాని పక్కా నిర్ణయం గాలే. చలో స్వరాజ్యం పిల్సిన ప్రోగ్రాంకి పోదామనుకొని ‘కర్ణాటక రాజ్య మహిళా దౌర్జన్య విరోధి వోక్కుట’ కు ‘ఓకే’ అని రిప్లై పెట్టిన మెయిల్‌కి. ఇంకా కుద్దుగా మాట్లాడనీకి స్వరాజ్యంకు ఫోన్ చేసిన.
‘ఏయ్ రత్నా ఎట్లున్నావ్, మా ప్రోగ్రాంకి వస్తున్నావా’ ఆత్రంగా అడిగింది
‘వస్తున్న స్వరాజ్యం మెయిల్ పెట్టిన చూసుకో’ అన్న
‘‘ఓ థాంక్యూ రత్నా, థాంక్యూ సో మచ్’
మీ దగ్గర ఎవరు బెడ్తున్నరు మార్చి ఎనిమిదిన రత్నా’
మీ దగ్గర బెట్టినట్లు ఇక్కడ సఫాయికర్మ చారి మహిళలు బెడితే
నేను మీ కాడికి వచ్చుడు కుదరకపోవు మా కాడ మున్సిపల్ వర్కర్స్ వేల మంది ఉన్నా వాళ్లకు సంగమే లేదు. వాళ్లకు బోలెడు బొచ్చెడు సమస్యలున్నయి. ముప్పై ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్‌గనే ఉన్నరు కానీ ఇంకా పర్మనెంట్ కాలే. ఇగ ఔట్ సోర్సింగ్ వాళ్లకైతే ఇచ్చే పన్నెండు వేలకు చానా కోతలు. సబ్బులు, నూనెలు, బూట్లు, గ్లౌజులు ఇయ్యరు. ఎంత గలీజునైనా చేతులతోనే ఎత్తిపోయాలె. కొందరైతే అట్లా ఎత్తిపోసి రోత పుట్టి అన్నం గూడా తినలేమని చెప్తరు’
మా కర్ణాటకలో గూడ ముందు ఇట్లనే ఉండే. తర్వాత సంగం బెట్టిచ్చినం. కొట్లాడితే ఏవో కొన్ని కొన్ని సాదించుకున్నరు గానీ పర్మనెంటు మాత్రం జేస్తలేరు. వాల్ల మీద పూలు జల్లుడు, వాల్ల కాళ్ళు కడుగుడు కన్నా వాల్లను పర్మనెంట్ జేస్తే.., వాల్లకు అంతకు మించిన గౌరవమైన బతుకు ఏముంటది? కానీ రాజకీయ నాయకులు అట్లా చేయరు రత్నా చాలా కోపమొస్తది.
‘మా దగ్గర హైదరాబాద్‌లో గూడ సఫాయి మహిళలకు సంగం ఉంటే చానా దన్నుండేది. వాల్లు కూడకుంటా, సంగం పెట్టుకోకుంట మగ రాజకీయాలు బాగ జేస్తరు. అందికే వాల్లకు ఎన్ని అవస్తలున్నా తీర్చేటోళ్ళు లేరు, ఆర్సే టోళ్ళు లేరు. నిజానికి మార్చ్ jైుతు మీటింగ్‌లు గిట్లాంటి శ్రామిక ఆడవాల్లు, కూలి నాలి ఆడవాల్లు చేసే పరిస్థితి రావాలె. కానీ కార్మిక మహిళలను పర్మనెంట్ చేయని జీతాలు సరిగ్గా ఇవ్వని ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు మార్చ్ jైుతు హంగామా జేస్తుంటాయి.’ అన్నాను ఆవేశంగా. మా కర్ణాటకలో ఇప్పుడిప్పుడే కార్మిక, శ్రామిక మహిళల ఆధ్వర్యంలనే మార్చ్ jైుతు చేస్తున్న సంగతికి సంతోష పడాలే. నీ వొప్పుకున్నందుకు చాలా థాంక్స్. నువ్వు హైదరాబాద్ నుంచి వస్తున్నవని మా సంగాలకు చెప్తా, పేరేయిస్తా బ్యానర్‌లో, పోస్టర్స్‌లో .. బీ రెడీ రత్నా, బాయ్ టేక్ కేర్’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్‌లో బొటా బొటిగా మాట్లాడే స్వరాజ్యం ఈసారి కొంచెం వివరంగా మాట్లాడిరది.
తర్వాత టిక్కెట్స్, నా బస, అడ్రసు, వాలంటీర్ నంబర్ బెట్టింది. మార్చ్ ఏడున అన్నీ సర్దుకొని హైదరాబాద్ నుంచి బెంగుళూర్‌కు బోయిన. ఒక రైలు బండెక్కి, ఒక బస్సెక్కి నా బసకు చేరిన. ఒక వాలంటీర్ అమ్మాయి నాకు గైడ్ చేయనికి బెట్టిండ్రు. పొద్దుగాల పదింటికి మీటింగ్ హాలుకు బోయిన. పెద్ద పెద్ద టెంట్స్ జిబ జిబ జనము, ఎర్ర జెండాలు, నీలి జెండాలు, మహిళా సంగాల జెండాలు, బ్యానర్లు. కాలేజీ యువత, కార్మిక, శ్రామిక యువతులు, నడీడు మహిళలతో మీటింగు ప్రాంగణం కళ కళ లాడుతుంది.
స్వరాజ్యం నాకు ఎదురొచ్చి హగ్ చేస్కొని’ టిఫిన్ చేసినావా, కంఫర్ట్ గున్నావ, అని పలకరించి సాదరంగా హాల్లకు తొడుకొని పోయి ముందటి వరుస కుర్చీలో కూర్చోబెట్టింది. గార్మెంట్ వర్కర్స్, ఆశ వర్కర్స్ సంగాల వాల్లని, సఫాయి కర్మ చారి సంగం, అంగన్‌వాడి సంగం, ఎన్‌జివో సంగాల్ని, యువ సంగాల్ని, కర్ణాటక రాజ్య మహిళా దౌర్జన్య విరోది ఒక్కుట, కొరగ అభివృద్ది సంగం గల ఒక్కుట, మహిళా నాయకులను పేరు పేరునా పరిచయం జేసింది.
స్పీకర్లు, అతిధులంతా వచ్చినంక మీటింగ్ మొదలైంది. మహిళా కళాకారులు పాటలు, ఎల్లమ్మ కళారూపాలు ఎల్లమ్మలోల్లు ప్రదర్శించిండ్రు. శ్రామిక మహిళా నాయకులంతా మహిళా సమస్యల్ని, మార్చ్ ఎనిమిది గురించి చైతన్య స్పూర్తిగా మాట్లాడిరడ్రు. చాలా మంది కన్నడంలో మాట్లాడితే ఒకరిద్దరు కన్నడ తెలుగులో మాట్లాడిరడ్రు. నాకు పూర్తిగా కాకున్నా సూచాయగా ఆర్తమైనయి వాల్ల మాటలు. అయితే కొరగ అబివృద్ది సంఘ గల ఒక్కుట’ నుంచి మాట్లాడిన మహిళా స్పీచ్‌కు చప్పట్లే చప్పట్లు. సభ బాగ స్పందించింది. నా పక్కన కూచున్న ఒక తెలుగు కన్నడ నాయకురాల్ని ‘ ఆమె ఏమి మాట్లాడిరది’ అడిగిన. ఇక్కడ కొరగలు ఎస్సీ ఎస్టీల కంటే కింద లేయర్‌లో వున్న కమ్యూనిటీ. వాల్ల బతుకులు ఎస్సీ ఎస్టీల కంటే దారుణంగా ఉంటాయి. వాల్లని హింస బెట్టే, మనుషులుగా చూడని ‘అజలు పద్దతి’ కంబాల దురాచారాల మీద మాట్లాడిరది. వీటి మీద నిషేదాలు వున్నా ఇంకా కొనసాగుతున్నాయి’ అని చెప్తుంది. మీటింగ్ తర్వాత మల్లా అడిగిన కొరగల గురించి, అజలు పద్దతి, కంబాల నిషేధలేంటి ప్లీజ్ డీటైల్‌గా చెప్పండి’ అని అడిగిన ఆసక్తిగ. ‘వీల్లు ఎస్టీలయినా కూడా అంటరాని తనముంది. కర్నాటకలో మోస్ట్ వల్నరబుల్ ఎస్టీలంటే కొరగలే. అని చెప్తుంటే .. ఇంతలో స్వరాజ్య మొచ్చి ‘రత్నా లంచ్ చేద్దాం రా’ అని నా చెయి బట్టుకున్నది తీస్క పోనీకి.
‘కొరగల గురించి వాల్ల బతుకుల గురించి విని, చూసి మా తోలు మొద్దు బారిందప్పా! నువ్వు వింటే లంచ్ చేయవు. లంచ్ చేసి మాట్లాడుకుందాం రా! అంటే స్వరాజ్యంతో పోయిన లంచ్‌కి. లంచ్ తర్వాత మీటింగ్ కొచ్చి నోల్లంత యెటోల్లటుబోయిండ్రు. కొద్ది మంది మహిళా లీడర్లు నేను, స్వరాజ్యం పుర్సత్‌గా కూచున్నం. హమ్మయ్య యీ ఒక్క రోజు మీటింగ్‌కి నెల నుంచి పంజేస్తే .. ఇంత పెద్ద సక్సెస్. నాకు బలే సంతోషంగుంది’ – ఒక శ్రామిక లీడర్. ‘ఇవ్వాళ్టి మీటింగ్‌లో ‘కొరగ ఒక్కుట’ నుంచి మాట్లాడిన వసంత స్పీచ్ హైలెట్’ ఇంకో మహిళా లీడర్ మెచ్చుకోలుగా అన్నది.
అవును కొరగల ‘అజలు, కంబాల యిక్కడ మామూలు దురాచారమ్ కాదు, దుర్మార్గమైన దురాచారమబ్బా! ఎవరికైనా బాగా లేకుంటే .. కొరగలను పిలిచి విస్తట్ల బోజనం బెట్టి ఆ బాగలేని మనిషి గోర్లు, వెంట్రుకల్ని కలిపి కొరగల చేత తినబెడితే ఆ మనిషి జబ్బు తగ్గుతదనే మూడచారం, మూడ నమ్మకమే ‘అజలు’ ఆ బోజనం వాల్లు తినము అని చెప్పడానికి లే’ మా జబ్బు తగ్గడానికి మీరు తినాల్సిందేనని జబర్దస్తిగా తిన బెడతారు. కొట్టి, తిట్టి తినబెడతారు. తినకుంటే చంపిన కేసులు కూడున్నయి. ‘వామ్మా యేందీ దారుణం’ తిన్నదంతా నీళ్ళయింది నాకు. స్వరాజ్యం చెప్తానే ఉంది ఆగకుంట.
ఈ ‘అజలు’ను బ్యాన్ చేయాలని అంబేద్కర్ సంగాలు, పౌరహక్కుల సంగాలు, కమ్యూనిస్ట్ సంఘాలు మస్తు ఫైట్ చేయంగ, చేయంగ పాతి కేండ్ల కింద (2000) బ్యాన్ చేసింది కర్ణాటక గవర్నమెంట్. అయినా యెక్కడాగింది అక్కడిక్కడే నడుస్తనే ఉంది. అజలు ప్రాక్టీస్ చేసిన వాల్లకు అయిదేండ్ల జైలు కూడుంది. కానీ యిప్పటి దాకా ఎవ్వరూ జైలు కెళ్లింది లేదు’ థూ వీళ్లు మనుషులేనా, గోర్లు, వెంట్రుకలు కలిపిన అన్నం కుక్కలకు కూడా బెట్టరు. కానీ సాటి మనుషులకు పెడ్తరు. ఎంత అరాచకం. బాగ లేకుంటె డాక్టర్‌కు చూపించుకోకుండా కొరగలు ఎక్కడ అని వెతికి వెతికి బలవంతంగా తీసుకొచ్చి అట్లాంటి కూడు ఇప్పటికీ పెడుతున్నరు. ఆ అజలు కూడు తిని బేదులు విరోచనాలై, ఒక్కోసారి తిరగబెట్టి చచ్చి పోతుంటరు. స్వరాజ్యం వచ్చి రాని తెలుగుల ఇంగ్లీష్ హిందీని కలేసి చెప్పుకుంట బోతంది.
ఆ క్రూరత్వాన్ని వింటాంటే మైండు మొద్దు బారి మాటలే వస్తలేవు నాకు.
‘నిజానికి రత్నా, కొరగలు రిచ్ కల్చర్ ఉన్న ఆదివాసులు. గొప్ప నాగరికత ఉన్న వాల్లు. వాల్ల కళా సంపద అద్బుతంగుంటది. అట్లాంటి వాల్లను అడవుల్ని నాశనం జేసి వాల్ల బతుకుల్ని బజారు జేసిండ్రు. యిప్పుడు సమాజంలో వున్న అన్ని కులాలు, ఆఖరికి మన ఎస్సీ ఎస్టీలు కూడా వాల్లను అంటరాని కులంగనే చూస్తయి. ‘అదేందబ్బా అంటరానితనాలు అమానుషం అని పోరాడే మన ఎస్సీలు, కులం పాటించని ఎస్టీలు గూడ కొరగలను అంటరానోల్లుగా చూడడం ఇంకా దారుణం! అన్న బాదగా.
‘అజల’ ఇట్లుంటే ‘కంబాల’ అనేది ఇంకో మరణయాతన. బాగా బలిష్టమైన దున్నపోతుల్ని రెచ్చగొట్టి వాటితోపాటు కొరగ మగవాల్లను ఉరికిస్తుంటారు. అట్లా ఉరికిచ్చి బూస్వామ్య కులాలు వినోదిస్తుంటాయి. కొందరు వాటితో వురక లేక, శ్వాసాడక, గుండె ఆగి చచ్చి పోతుంటరు. ఒక్కోసారి దున్నపోతుల కాళ్ళకింద పడితే, పొడిచి, తొక్కి చంపేస్తుంటయి. అట్లా ఉరికినందుకు, చచ్చినందుకు వాల్లకొచ్చే ప్రతిఫలమేమి ఉండది. యెట్టి ఆట, యెట్టి వినోదం కామందులకు. వాల్లకు చదువుల్లేవు,
ఉద్యోగాల్లేవు. వాల్ల కోసం ఒకటి రెండు ఎన్జీవోలు పంజేస్తన్నయి. కొరగ ఆడవాల్లు బుట్టలు, తట్టలు, చాపలు అల్లుతరు. సఫాయి పనిలో, ఇంకా రకాల కూలి పనుల్లో ఉన్నరు. మగవాల్లు డ్రైనేజి క్లీనర్స్‌గా, అడ్డా కూలీలుగా ఉన్నరు. కానీ ‘అజలు’ ‘కంబాల’ కొరగలను ఇడువని అమానుషం మీదా కొట్లాడుతానే ఉన్నాం. ఇట్లా వారి గురించి చాలా చెప్పింది మీటింగ్‌లో ‘కొరగ ఒక్కుట ‘లీడర్’.
అవన్నీ వినీ కడుపుల పేగులు కమిలి పోయినయి. ఏందిరా! ఈ హీనం దుఃఖపు బతుకులు మాకు? మీ రోగాలు తగ్గనీకి ఆ చెత్త కూడు మేమెందుకు తినాలి, మీ నమ్మకాలు నాశనంగాను. ఏడికి బోయినా బలిసినోని బలిమే., బాంచల ఎతలు, కతలే. మనసంతా మసి మసై బైలుదేరిన.
స్వరాజ్యం, మహిళా లీడర్లతోని సెలవు తీసుకొని.
