డూయార్స్‌లోని ఒక పుస్తకాల గది – సిమ్రన్‌ ఉరావ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
తరతరాలుగా జల్‌పాయ్‌గురిలోని ఒక తేయాకు తోటలో పనిచేస్తోన్న ఉరాఁవ్‌ ఆదివాసులకు ఇప్పుడు తమకంటూ ఒక సొంత చోటు లభించింది – అదే వారి సముదాయానికే చెందిన ఒక విద్యార్థి ఏర్పాటు చేసిన గ్రంథాలయం.
‘‘దీదీ (అక్కా), మేమిక్కడ నిజంగానే మన సొంత భాషను చదువుకోవచ్చా?’’ తన చేతుల్లో ఒక కుడుఖ్‌ పుస్తకాన్ని పట్టుకొని వున్న 15 ఏళ్ళ అంశ్‌ ఉరాఁవ్‌ నన్నడిగాడు.

మేమంతా పశ్చిమ బెంగాల్‌, జల్‌పాయగురిలోని తేయాకు తోటల్లో పనిచేసే శ్రామికుల పిల్లలు చదువుకునే ఒక బడిలో ఉన్నాం. అంశ్‌ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు పనిచేసే తోట లీశ్‌ నది పక్కనే ఉంది.
ఇక్కడి అనేక మంది శ్రామికుల కుటుంబాలకు లాగే మా కుటుంబాలు కూడా ఉరాఁవ్‌ తెగకు చెందినవి. మా పూర్వీకులు నాలుగు తరాల క్రితం ఛోటానాగపూర్‌ పీఠభూమి ప్రాంతం-ప్రస్తుత రaార్ఖండ్‌లోని రాఁచీ, గుమ్లా, సిమ్‌డేగా జిల్లాలు నుంచి వచ్చారు. మేం ఇప్పటికీ మా ఇళ్ళ వద్ద మా సముదాయపు భాష అయిన కుడుఖ్‌లోనే మాట్లాడుకుంటాం, కానీ బయట మాత్రం హిందీ, బెంగాలీ భాషల్లో మాట్లాడతాం. అందువలన, అంశ్‌ ఇంతకుముందెప్పుడూ మా మాతృభాషలో ఉన్న పుస్తకాన్ని చూడలేదు.
నేను ఇక్కడే, లీశ్‌ నది తేయాకు తోటల మధ్యనున్న పాతిబాడీలో పెరిగాను. జనాభా లెక్కల రికార్డులలో ఈ ప్రదేశాన్ని ‘లిశ్‌ నది’గా గుర్తించినప్పటికీ గ్రామస్తులు, స్థానిక పరిపాలనాధికారులు ఇప్పటికీ లీశ్‌ నది అనే స్పెల్లింగ్‌నే ఉపయోగిస్తున్నారు.
ప్రతి ఉదయం తేయాకును తెంపడానికి బుట్టలు తీసుకుని వెళ్ళే మహిళలను, కర్మాగారానికి నడిచి వెళుతున్న పురుషులను, తమ పాతబడిపోయిన నీలం, తెలుపు యూనిఫారాల్లో బడికి వెళుతోన్న పిల్లలను మనం చూడవచ్చు. నా తల్లిదండ్రులు తోటలో పని చేస్తారు, ఇక్కడ సీజన్‌ ప్రకారం పనులు తేయానుకు తెంపటం, పొదలను కత్తిరించడం, ఎరువులు చల్లడం, లేదా చెట్టూచేమలను తొలగించడం మారుతుంటాయి. రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే సుమారు రూ. 250 కూలీ వస్తుంది. ఇక్కడ మా నాన్న సర్దార్‌ లేదా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.
చిన్న పిల్లలు 1 నుండి 5వ తరగతి వరకు చదివేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాతిబాడీ ప్రాథమిక పాఠశాలకు హాజరవుతారు. ఉన్నత పాఠశాల కూడా అదే ఆవరణలో ఉంది.
నవంబర్‌ 30, 2024న నేను బడిలో ఉన్న ఒక ఖాళీ గదిలో గ్రంథాలయాన్ని ప్రారంభించాను. ఇది రోజుకు రెండుసార్లు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంటుంది.
మొదటి రోజున నేను దాదాజీ కా ఛతా అనే హిందీ కథను బిగ్గరగా చదివాను. తాతగారి గొడుగు వర్షం నుండి రక్షణనివ్వటమే కాకుండా ఆ గొడుగు వలన ఉండే అనేక ఉపయోగాల గురించి పండ్లు కోయడం వంటివి ఈ కథ చెప్పింది. తెలివిగా ఉపయోగించుకుంటే, ఒకే వస్తువు అనేక ప్రయోజనాలనిస్తుంది అనేది నీతి. చివర్లో, ‘‘మీరేం నేర్చుకున్నారు?’’ అని అడిగాను. ఒక చిన్న అమ్మాయి బొమ్మ వైపు చూపిస్తూ, ‘‘గురువు కంటే కోతి సరదాగా ఉంటుంది!’’ అని అరిచింది. గదిలో ఉన్న వారంతా నవ్వారు. ఆ నవ్వులు గ్రంథాలయానికి ప్రాణం పోశాయి.
పశ్చిమ డూయార్స్‌లో ఉన్న లీశ్‌ నదీ ప్రాంతం, ఉత్తర బెంగాల్‌లో మొట్టమొదటగా స్థాపించిన తోటలలో ఒకటి. పాతిబాడీ దాని మూడు విభాగాలలో ఒకటి లీశ్‌, హోప్‌లు మిగిలిన రెండు విభాగాలు. ఈ తేయాకు తోటకు ఈ పేరు ఇచ్చిన నది, కాలింపాంగ్‌ జిల్లాలో ఉద్భవించి, మూడు గ్రామాల గుండా ప్రవహించి, ఆ తర్వాత తీస్తా నదిలో కలుస్తుంది.
తేయాకు తోటలో రోజు చాలా త్వరగా మొదలవుతుంది. మహిళలు తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచి, సాధారణంగా అన్నం లేదా రోటీ, ఉప్పు, వీలైతే ఏదైనా కూరగాయతో భోజనం తయారుచేసుకుని, పనికి బయలుదేరతారు. ఉదయం ఆరు గంటలకల్లా, తమ భుజాలకు రెaాలా (గుడ్డ సంచులు) తగిలించుకున్న శ్రామికుల బృందాలు, తేయాకు పొదల వైపు నడుచుకుంటూ వెళ్ళడం కనిపిస్తుంది.
ఉదయం 10 గంటలకు బడి మొదలవుతుంది కాబట్టి, పిల్లలు తామే సొంతంగా సిద్ధపడి, బడికి బయలుదేరే ముందు ఇంటి పనులను కూడా చక్కబెడతారు. ప్రతి ఇంటికీ నీటి సౌకర్యం ఉండదు, దాంతో పొరుగువారి ఇంటి నుంచో లేదా ఊరి చేతిపంపు నుంచో నీటిని తీసుకురావడం పిల్లల బాధ్యతగా ఉంటుంది.
కొంతమంది పిల్లలు మధ్యాహ్న భోజనం కోసమే బడికి వస్తారు. ఎక్కువ మంది 8వ తరగతి తర్వాత చదువు మానేస్తారు, చాలామంది 12వ తరగతికి మించి చదవరు. వారు తేయాకు తోటలలో పనులు చేయటమో, లేదా రోజువారీ కూలీ పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళటమో చేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే కళాశాలకు వెళ్తారు.
నా బడి చదువు డార్జిలింగ్‌ జిల్లా, గయగంగాలోని సెయింట్‌ మేరీ బాలికల హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో జరిగింది. నేను బడికి వెళ్ళటం కోసం మా అమ్మ నన్ను అక్కడికి 72 కి.మీ దూరంలో ఉన్న హాఁస్‌కుయా తేయాకు తోటలోని మా అమ్మమ్మతో కలిసి ఉండటానికి పంపింది. మా బడిలో సరైన తరగతి గదులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, గ్రంథాలయం ఉన్నాయి. అయితే తేయాకు తోటల సముదాయాలకు చెందిన విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడే దాహార్‌ అనే సంస్థ వారానికి మూడుసార్లు నిర్వహించే గ్రూప్‌ స్టడీ సెషన్‌ల సమయంలో మాత్రమే నేను నిజంగా పుస్తకాలతో నిమగ్నమవ్వడం ప్రారంభించాను.
కళాశాలకు వెళ్ళాలనే కోరికతో, నా ఖర్చులు గడుపుకోవటం కోసం నేను 2021 ఆగస్ట్‌లో చిన్నపిల్లలకు ట్యూషన్‌ చెప్పటం మొదలుపెట్టాను. చాలామంది చదవలేరు, సరిగ్గా రాయలేరు. 2023 జూలైలో నేను డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ చేయటం కోసం బెంగళూరులోని అజిమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి వెళ్ళాను.
నేనొక కమ్యూనిటీ గ్రంథాలయాన్ని తెరవాలనుకున్నాను. పరీక్షల కోసం మాత్రమే కాదు, చదువుకోవడానికి, కథల కోసం, ఆనందం కోసం. పిల్లలు పుస్తకాలను ప్రేమించడం నేర్చుకోవాలని, వాటికి భయపడకూడదని నేను కోరుకున్నాను.
బడి ప్రాంగణంలో ప్రస్తుత భవనం కట్టినప్పటి నుండి ఉపయోగంలో లేని ఒక గది ఉండేది. ప్రధానోపాధ్యాయులైన సజన్‌ మోక్తాన్‌ చాలా సహాయకారిగా ఉండేవారు. ‘‘అవును, ఆ గదిని తీసుకోండి. అది పిల్లల కోసమైతే మంచిదే,’’ అని ఆయన అన్నారు. ఆ తర్వాత నేను ఇద్దరు పంచాయతీ సభ్యులను కలిశాను, వారు శ్రద్ధగా విని, ‘‘మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది,’’ అని చెప్పారు. వారి ప్రోత్సాహం విశాల సమాజం దృష్టిలో గ్రంథాలయానికి చట్టబద్ధతను కల్పించింది.
ఆ గది లోపల మద్యం సీసాలు, గ్లాసులతో చాలా మురికిగా ఉంది. బయటి ప్రాంతమంతా మొక్కలు బాగా పెరిగిపోయాయి. మేం దాన్ని శుభ్రం చేయటం మొదలెట్టాం. గ్రామంలోని బాలబాలికలు సహాయం చేసేందుకు వచ్చారు. రెండు వారాలపాటు మేం ఊడ్చాం, కడిగాం, రంగులు వేశాం, ఒక వెదురు కంచెను తయారుచేశాం, అల్మారాలు అమర్చాం.
అటుగా నడచివెళ్తోన్న ఒకాయన,’’మీరిక్కడేం తయారుచేస్తున్నారు?’’ అని అడిగారు. ‘‘ఒక గ్రంథాలయాన్ని,’’ అని నేను చెప్పాను. ఆయన నవ్వి, ‘‘చదవడానికి ఎవరొస్తారు?’’ అన్నారు.
శ్రామికులు తేయాకును తిరిగి తీసుకువచ్చే సాయంకాల వేళ నేను గోదాముకు వెళ్ళాను. అదంతా తాజా తేయాకు వాసనతో, మాటల శబ్దాలతో నిండిన ఒక విశాలమైన, రద్దీగా ఉండే ప్రదేశం. గ్రంథాలయం ఆలోచన గురించి, అది వారి పిల్లలకు ఎందుకు ముఖ్యమో నేను వారితో మాట్లాడాను.
వారి ప్రతిస్పందన ఉత్సాహపూరితంగా ఉంది. ‘‘బడి అయిపోయాక నా కూతురికి చదువుకోవడానికి ఒక చోటు దొరికితే నేను చాలా సంతోషిస్తాను,’’ అని ఒక మహిళ అన్నారు. ‘‘నువ్వు వెళ్ళిపోయాక దీనిని ఎవరు నడుపుతారు?’’ అని ఒకాయన అడిగారు. ‘‘మీరు పుస్తకాలు తెస్తే, నేను మీకొక కుర్చీ ఇస్తాను,’’ అని మరొకరు చమత్కరించారు. ప్రజలు సహాయం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది చిల్లర డబ్బులు, లేదా రూ. 20, రూ. 100 – ఇలా తమకు తోచినంత ఇచ్చారు. మేం సుమారు రూ. 6,000 సేకరించాం. కొంతమంది పాత పుస్తకాలు ఇచ్చారు. మరికొందరు ఆ స్థలాన్ని ఏర్పాటు చేయడంలో తమ సమయాన్ని కేటాయించి సహాయం చేశారు.
అల్మారాలను నింపడానికి, నేను అనేక పౌర సమాజ సంస్థలకు ఉత్తరాలు రాశాను. కొన్ని సంస్థలు కొన్ని పుస్తకాలను పంపాయి. జకరియాస్‌ బారా అనే స్థానిక యువకుడొకరు పుస్తకాలను, ఓపెన్‌ యూనివర్సిటీ మెటీరియల్‌ను, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఉపయోగపడే వనరులను విరాళంగా ఇచ్చారు. నా దగ్గర నా సొంత బడి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్‌, కుడుఖ్‌ భాషల పుస్తకాలున్నాయి.
కుడుఖ్‌ పుస్తకాన్ని చూడగానే అంశ్‌, ‘‘దీదీ (అక్కా), ఒక గ్రంథాలయంలో మన సొంత భాష పుస్తకం ఉందా?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు. ఉత్తర ద్రవిడ భాష అయిన కుడుఖ్‌, ఉరాఁవ్‌ సముదాయపు సంస్కృతి, జానపద గీతాలు, ఆచారాలతో ముడిపడి ఉన్న ఒక మౌఖిక సంప్రదాయం. ఇప్పుడిది రాతపూర్వకంగా కూడా ఉంది. భారతదేశంలో 20 లక్షల కంటే తక్కువమంది మాట్లాడే ఈ కుడుఖ్‌ భాషను అంతరించిపోతున్న భాషల అట్లాస్‌లో ప్రమాదంలో ఉన్న భాషగా యునెస్కో జాబితాచేసింది.
మేం సాంస్కృతిక సమావేశాలను కూడా నిర్వహించాం. ఒక సాయంత్రం మేం కోడా రాజి అనే సినిమాను చూపించాం. ఇది రaార్ఖండ్‌ నుండి పశ్చిమ బెంగాల్‌, అస్సామ్‌లలోని తేయాకు తోటలలో పనిచేయడానికి వలస వచ్చిన ఆదివాసీ ప్రజల గురించి తీసిన చిత్రం. ఇది వారి కష్టాలను, వారు తేయాకును కోసే విధానాన్ని, వారి కుటుంబాలు ఇక్కడ స్థిరపడిన విధానాన్ని ప్రతిబింబించింది. అందరూ నిశ్శబ్దంగా సినిమా చూశారు. సినిమా అయిపోయిన తర్వాత ఒక వృద్ధుడు లేచి, ‘‘ఇది మా కథ’’ అన్నారు.
మరొక సాయంత్రం, మేం జానపద గీతాలు పాడుతూ మందార్‌ డోలు వాయించాం. స్థూపాకారంలో ఉండి, కొయ్యతో చేసిన ఈ సంప్రదాయ ఆదివాసీ డోలుకు రెండు చివరలు తోలుతో కప్పబడి ఉంటాయి. దీనిని కర్రలతో, కొన్నిసార్లు చేతులతో వాయిస్తారు. ఆదివాసుల సమావేశాలలో, నృత్యాలలో మందార్‌ శబ్దం చాలా ముఖ్యమైనది. ఆ ప్రదేశం ఒక ఆఖడా పెద్దల నుండి యువతకు జ్ఞానాన్ని, కథలను, సంప్రదాయాలను అందించే ఒక సాంస్కృతిక సమావేశ స్థలం వలే అనిపించింది.
ఆ గ్రంథాలయం కేవలం ఒక పఠన మందిరంగా మాత్రమే పరిమితం కాకుండా, మనల్ని మనం ఆవిష్కరించుకునే చోటుగా కూడా మారిపోయింది.
బడి అయిపోయిన తర్వాత పిల్లలు చదువుకోడానికి, ట్యూషన్‌ తరగతులకు హాజరయ్యేందుకు గ్రంథాలయానికి రావడం మొదలుపెట్టారు. ప్రతి వారాంతంలో అక్కడ వారి కోసం కథలు చెప్పడం, పఠన బృందాలు, జానపద గీతాలు, సామూహిక అధ్యయనం వంటి కార్యకలాపాలు జరుగుతాయి. ‘‘ఈ గ్రంథాలయం మా విద్యార్థులను చదువుకునేలా ప్రేరణనిస్తుంది, వారికి సాధారణంగా అందుబాటులో ఉండని పుస్తకాలను అందుబాటులోకి తెస్తుంది,’’ అని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.
చాలా మంది తల్లిదండ్రులు తమ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ‘‘నా పిల్లలు బాగా చదువుకుని, నాకంటే మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను,’’ అని హేమలత టొప్పో అనే ఒక కూలీ చెప్పారు. ఉపాధ్యాయులు కూడా ఇందుకు సహాయసహకారాలను అందిస్తున్నారు. ‘‘మా పిల్లల్లో చాలామందికి ఇళ్ళ దగ్గర పుస్తకాలు లేవు. వారు గ్రంథాలయంలో సమయాన్ని గడపగలిగితే, అది వారి చదివే అలవాటును నిజంగా మెరుగుపరుస్తుంది,’’ అని ప్రమీలా టిర్కీ నాతో అన్నారు.
రెయిన్‌ రైడ్‌, చర్వాహా ఔర్‌ భేడియా, క్యారీ మీ, మమ్మా – అనేవి కొన్ని ప్రసిద్ధ పుస్తకాల పేర్లు. మొదట్లో నేను 100 పుస్తకాలతో ప్రారంభించాలని అనుకున్నాను, కానీ చివరికి ఈ గ్రంథాలయం 150 కంటే ఎక్కువ పుస్తకాలతో మొదలైంది. ఇప్పుడా సంఖ్య 300 కంటే ఎక్కువ పుస్తకాలకు పెరిగింది. నేను పాతిబాడి నుండి వచ్చేసిన తర్వాత, గ్రామానికి చెందిన యువత ఈ బాధ్యతను తీసుకుంది. వారు ప్రతిరోజూ గ్రంథాలయాన్ని తెరచి, పుస్తకాలను జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలు నిరంతరం వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ‘‘మా పిల్లలు ఇప్పుడు నిజంగా చదువుకుంటున్నారు,’’ అని తల్లిదండ్రులు నాతో చెబుతున్నారు.
ఈ గ్రంథాలయం చిన్నది. ఇది విరాళాలతోనూ, ప్రజల సమయం, సహాయాలతో నడుస్తోంది. కానీ ఇది ఇప్పటికే నేను ఆశించిన దానికంటే ఎంతో గొప్పగా మారింది. ఇది పిల్లలు నవ్వుకునే, మహిళలు ఒకచోటకు చేరే, మా సంస్కృతిని గుర్తుచేసుకునే ఒక ప్రదేశం. చుట్టూ వెదురు కంచె కట్టి, పుస్తకాలతో నిండివున్న ఆ చిన్న గది, చుట్టుపక్కల ప్రజలలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక్కడ పిల్లలు చదువుకోవటాన్ని, పాటలు పాడటాన్ని చూసిన ప్రతిసారీ మనం దీన్ని ఎందుకు నిర్మించామో నాకు గుర్తుకొస్తుంది. పుస్తకాలంటే కేవలం కాగితాలు మాత్రం కాదు. అవి తలుపులవంటివి. మొదటిసారిగా మాకూ అలాంటి ఒక ద్వారం లభించింది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.