ఏటికెదురీదిన ధిక్కార స్వరాలు !! తెలుగు మహిళావాద పత్రికలు !!!
సుమారు 160 ఏళ్ల క్రితం, 1862లో, సామినేని ముద్దు నరసింహం తెలుగులో ‘‘హితసూచిని’’ అనే తొలి వైజ్ఞానిక, హేతువాద గ్రంథం రచించి ప్రచురించాడు. అందులో మొదటి వాక్యం, ‘స్త్రీలకు విద్యలు సాధకములౌచున్నవి’ అదేదో ఊరికే రాసింది కాదు. అప్పుడప్పుడే స్త్రీలలో వికసిస్తున్న చైతన్యాన్ని దూరదృష్టితో మదింపు వేసిన ఒక ఆలోచనపరుడు, ఇంకా చెప్పాలంటే దార్శనికుడు, మాత్రమే ఊహించి రాయగల విలువైన మాటలవి.
‘విద్యలు’ అంటే అప్పటి వరకూ ఏవో ఇంటి పనులు, అల్లికలు, ముగ్గులు, వంటలు మాత్రమే అనుకునే సాంప్రదాయక పురుషాధిక్యతా భావనకు విరుద్ధంగా ఉనికి గురించిన చైతన్యం, సామాజిక స్పృహ వంటివి తెలుసు కుంటున్నారనే అర్థంతోనే ఆ మాట అనడం కనిపిస్తుంది. మారుతున్న కాలంలో మనిషిగా తనని తాను ఉన్నతీకరించునే ఆధునిక స్త్రీ, సకల సంకెళ్లను అధిగమిస్తుందనే ఆకాంక్షకు అక్షర రూపమే ఆనాటి వాక్యం. అందుకే గురజాడ ‘‘ఆధునిక మహిళ చరిత్ర తిరగ రాస్తుందని’’ ప్రకటించాడు.
అసలు ముద్రణా రంగంలోకి మహిళల ప్రవేశం ఎప్పుడు, ఎలా జరిగిందనేది ఆసక్తికరం. ముఖ్యంగా, స్త్రీల పట్ల అనేక వివక్షతలు నెలకొని ఉన్న దేశంలో మహిళల కోసం పత్రికలు ఎలా పుట్టి ఉంటాయి. సంఘ సంస్కరణలు మొదలుకుని స్వేచ్చా ఉద్యమాల వరకూ వివిధ స్రవంతుల్లో మహిళలు పోషించిన కీలక పాత్రపై స్త్రీవాద దృక్పథంతో. ‘జరిగిన శోధనలు ఎన్ని? దశాబ్దాలుగా తొలుస్తున్న ప్రశ్నలకి ఒకరకంగా సమగ్ర సమాధానమే, తెలుగులో మహిళా పత్రికల గురించి ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ మహబూబ్ భాషా గారు చేసిన విస్త్రుత శోధన గ్రంథం, ‘‘ూషతీఱజ్‌ూఱఅస్త్ర A చీవష Gవఅసవతీ ూశీశ్రీఱ్‌ఱష’’ (ువశ్రీబస్త్రబ ఔశీఎవఅం జీశీబతీఅaశ్రీం 1883 – 1960)’’. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు దేశంలోనూ, ముఖ్యంగా తెలుగులోనూ కొనసాగిన స్త్రీవాద పత్రికల నేపద్యం, చరిత్ర, వాటి క్రియాశీల ఆచరణపై శక్తివంతమైన మూల్యాంకనం ఈ మధ్యనే ప్రచురించిన ఆంగ్ల పరిశోధన గ్రంథం. ‘‘దేశానికి స్వరాజ్యం సిద్ధించాక జరగాల్సిన మొట్టమొదటి కార్యం, స్త్రీలకి స్వాతంత్య్రం లభించడం. స్త్రీలు సొంత వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మహిళలు మగాళ్ళ సొత్తు కారు… లింగ సమానతను సాధించిన దేశం మాత్రమే స్వాతంత్య్రం పొందగలదు…’’ 1936 నవంబర్ నాటి ‘గృహలక్ష్మి’ పత్రికలో మైదవోలు పద్మావతి దేవి రాసిన ‘‘స్త్రీ పురుష సమానత : అవసరమా? అనర్థదాయకమా? ‘‘అనే వ్యాసంలో వాక్యాలు ఇవి. ఇంకా వేదుల మీనాక్షీ దేవి, చెరుకూరి నాగభూషణమ్మ, నండూరి కామేశ్వరి వంటి ఎందరో స్త్రీ మూర్తులు ఆనాడే పేట్రేగుతున్న పురుషాధిక్యతను ఖండిరచారు. ఇంట్లోనూ, బయటా కొనసాగుతున్న పురుష పెత్తనం నుండి స్వాతంత్య్రం ఆశించారు. దాని తర్వాతే దేశ స్వాతంత్రం అంటూ నినదించారు. అందుకోసం కలం పట్టి శక్తివంతమైన సృజనాత్మక రచనలు చేసి పత్రికల్లో ప్రకటించారు. ఇదంతా మరుగుపడిన చరిత్ర. మగ దృష్టి మాత్రమే కలిగిన చరిత్ర కారులు మరుగుపరిచిన చరిత్ర.
అలా దాగిన ఎన్నో సత్యాల్ని వెలికితీస్తూ, సతీహిత బోధిని, తెలుగు జేనానా, హిందూ సుందరి, గృహలక్ష్మి, సావిత్రి, వివేకవతి, సుందరి, అనసూయ, స్త్రీ ధర్మ, సౌందర్య వల్లి, ఆంధ్ర లక్ష్మీ, హిందూ యువతి, భారత మహిళ, ఆంధ్ర మహిళ, వనిత… వంటి ఎన్నో పత్రికలు వాటి పుట్టు పూర్వోత్తరాల్ని తడుముతూ సాగింది. రచన సంఘసంస్కర్తలు చేపట్టిన పత్రికల వివరాలు చెబుతూనే, సంఘ వ్యతిరేక శక్తులు, స్త్రీ ద్వేషులు నడిపిన తిరోగామి పత్రికల పట్టిక కూడా అంతే వివరంగా ఇందులో ఇవ్వడం చూడవచ్చు. నిర్దిష్ట కాలంలో జరిగిన సంఘటనలు, ఆయా వ్యక్తుల పాత్రల్ని చరిత్ర నిక్కచ్చిగా నమోదు చేస్తుందనే దానికి ఈ పరిశోధన ఓ ఉత్తమమైన రూపం. అంతకంటే అపురూపమైన విషయం ఏమిటంటే, వలసవాద ఆంధ్ర రాష్ట్రంలో ముగ్గురు మహిళలు సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో చేసిన అసాధారణ కృషిని గుర్తించి ఆమేరకు గౌరవించడం. మాడభూషి చూడమ్మా, బత్తుల కామాక్షమ్మ, దువ్వూరి సుబ్బమ్మ వీళ్ళంతా బాల్యవివాహాలు, భర్తల మరణం, తదనంతరం ఎంతో ధైర్యంతో వారు పోషించిన అద్భుతమైన పాత్రల్ని ఇందులో చిత్రించిన తీరు ప్రశంసనీయం.
మహిళా పత్రికలనే కాదు, అసలు తెలుగులో పత్రికా చరిత్ర, జాతీయోద్యమ ప్రభావం, సంస్కరణాభిలాష , మహిళల సాంప్రదాయ ధిక్కారం, పత్రికల మధ్య పోటీతత్వం, మహిళా సంపాదకుల ఎంపిక, ఆత్మగౌరవ పోరాటం, రాజకీయార్థిక సమస్యలు… ఒకటా రెండా ఎన్నెన్ని అరుదైన విషయాలు పొందు పరిచారో. ఐదు విస్తారమైన విభాగాల్లో, ప్రతి అంశానికి సాధికారిక ఫుట్ నోట్, వివరణ ఇవ్వడం రచయిత అనుసరించిన శాస్త్రీయ వైఖరికి నిదర్శనం. అవడానికి అకాడమిక్ రీసెర్చ్ వర్క్ అయినా, రచయిత చేసిన కృషి, సేకరించిన విలువైన విషయాలు, పొందుపరిచిన పద్ధతి, అన్నింటికి మించి అనుసరించిన తాత్విక దృక్పథం ఈ శోధనకు కాలాతీత విశిష్టతను చేకూర్చింది. గాంధేయ వాదుల నుండి కమ్యూనిస్టుల వరకూ, వారు జీవించిన సమాజ గతినే మార్చగలిగిన ఎందరో అపురూపమైన తెలుగు మహిళల్ని ఇందులో పరిచయం చేయడం కనిపిస్తుంది. ఆధిపత్య వ్యవస్థ చాలా కాలం పాటు స్త్రీలకి అక్షరాన్ని దూరం చేసింది. స్వేచ్చా స్వాతంత్య్రాల్ని నిరాకరించింది. అస్తిత్వంపై ఆంక్షలు విధించింది. మహిళల అభివ్యక్తిని నిషేధించింది. అందుకే ఆరంభ సాహిత్యం అంతటా ఆ ఆక్రందనే కనబడుతుంది. అణిచి వేయబడ్డ గొంతుకల గుండె ఘోషే వినబడుతుంది. సాహిత్యం సంగతి సరే, పత్రికా రచనలో కూడా అదే వివక్ష నెలకొంది. అందుకు విరుద్ధంగా, నాడు ప్రత్యేకంగా స్త్రీలు స్థాపించిన సంఘాలు, వాటి కార్యకలాపాల పరిధిలో చేసిన లోతైన అధ్యయనం ఈ గ్రంథంలో ఉంది. విద్యార్థి సమాజము, ఆంధ్ర మహిళ సభ, శారదా నికేతన్, భారత మహిళ మండలి, స్త్రీ హితైషిని మండలి, స్త్రీ విద్యాభివృద్ధిని, బాల సరస్వతి సమాజం, భారత మహిళ శారద సమాజం… వంటి పదుల సంఖ్యలో మహిళా సంఘాలు దశాబ్దాల క్రితమే తెలుగు ప్రాంతంలో విస్తృత చైతన్యంతో ఎలా పనిచేశాయో సోదాహరణంగా ఈ పుస్తకం వివరిస్తుంది. ‘‘పత్రిక లేని ఉద్యమం రెక్కలు లేని పక్షి వంటిది’’ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకచోట. అలా, ప్రాధమిక భావ ప్రకటన స్వేచ్ఛ కోసం కూడా ఎన్నో పోరాటాలు చేసిన మహిళా పత్రికల చరిత్ర అంతా దారి పొడుగునా ధిక్కారమే. వేసిన ప్రతి అడుగూ, అక్షర నిరసన రూపమే. ఆ పయనంలో ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు. ఈరోజు గర్వంగా ఒక సుస్థిర భావజాలంగా స్త్రీవాదం, పురుషాధిక్యతలని వ్యతిరేకించే సమగ్ర సిద్ధాంతంగా ఏర్పడ్డానికి నేపథ్యం చరిత్ర పొడవునా జరిగిన అవిశ్రాంత సంఘర్షణలే. ఆ గాయాల చరిత్రకి చిరు ఛాయా రూపమే ఈ రచన. బహుశా అందుకే అకాల మరణం చెందిన కుమార్తె సీమాతభస్సుంస్మృతికి రచయిత ఈ కృతిని అంకితం చేశారు. ఓరియంట్ బ్లాక్ స్వాన్ దాదాపు 500 పుటల్లో ప్రచురించిన ఈ పుస్తకంలో అరుదైన ఫొటోలు, అనుబంధంగా ఇచ్చిన అలనాటి సంపాదకీయ వ్యాసాలు అదనపు ఆకర్షణ. ప్రఖ్యాత రచయిత, అంతర్జాతీయ చరిత్రకారిణి అయిన ‘‘మృణాళిని సిన్హా’’ గారు రాసిన ముందుమాట పుస్తక సారాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించింది. తెలుగు సాహిత్యంలో స్త్రీవాద కోణంలో వచ్చిన అరుదైన పరిశోధన గ్రంథం. ఆ దిశగా కృషి చేసే రాబోయే తరాలకు గొప్ప కరదీపిక. నూతన లింగ వివక్ష వ్యతిరేక రచనగా తెలుగులో కూడా త్వరలోనే రావాలని ఆశిద్దాం. అభిమానంగా పంపిన రచయితకి, ప్రచరణకర్తలకి అభినందనలు.
