వనమాల జీవన సంఘర్షణ – గిరిజ పైడిమర్రి

నేను చేస్తున్న ఇంటర్వ్యూల పరంపరలో భాగంగా వనమాలగారిని సంప్రదించినప్పుడు… ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నావు? ఈ సందర్భంలో ఇలా నన్ను అడిగిన మొదటి వ్యక్తి ఆమె. హరగోపాల్‌ గారి సహచరిగా కాకుండా మీ అస్తిత్వాన్ని మీరు నిలబెట్టుకున్న తీరు మహిళలను ప్రభావితం చేసే విధంగా ఉంటుందని, అది పాఠకులకు తెలియవలసిన అవసరం ఉందని భావించి వచ్చానని చెప్పాను.

ప్రాథమిక పాఠశాల కూడా లేని ఒక కుగ్రామం నుంచి అంత ర్జాతీయ పరిశోధకురాలి స్థాయి దాకా ఎదిగిన వనమాల జీవన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి దాయకం. 78 ఏళ్ళ వయసులో ఆమె ఇంకా సామాజిక ఉద్యమాలలో తనవంతు కృషిని కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆ తరానికి కొంచెం అటూ ఇటూగా మహిళలందరూ చదువుకోసం చేసిన పోరాటాన్ని ఆమె జీవితం ప్రతి బింబిస్తుంది. ఆ కాలంలోనే ఇంట్లో, బయటా ఆమె చదువుకొనడానికి చేసిన పోరాటం, గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఉద్యోగినిగా నిలదొక్కుకుని అంతర్జాతీయ పరిశోధకురాలుగా ఉద్యమకారిణిగా తనను తాను నిరూపించుకున్న క్రమాన్ని ఆమె మాటలలోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే అక్కా! బాగున్నారా?
జ. నమస్తే గిరిజా, బాగున్నాను.. రండి.. కూర్చోండి.
ప్ర. మీరు ఎప్పుడు పుట్టారు? బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నేను 04/02/1947 అంటే స్వాతంత్రం రాకముందే పుట్టాను. నా బాల్యం స్వేచ్ఛగా, ఆటపాటలతో ఆనందంగా గడిచింది. మా వూరు మల్కన్‌గిరి. డెబ్భై యిళ్లు మాత్రమే వున్న చిన్న పల్లెటూరు. ప్రాథమిక పాఠశాల కూడా లేకుండే. అందుకే నేను మా పెద్ద అక్క వూరు ముత్తంగిలో ఒకటో తరగతిలో చేరాను. ఆ తరువాత మా రెండో అక్క దగ్గర వుండి హైదరాబాదు బొగ్గులకుంటలో వున్న మనోరంజితం పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ఐదో తరగతిలో చేరిన. అప్పటిదాకా నాకు ఎ బి సి డి లు ఎట్లా ఉంటాయో తెలవదు. మొదటి నెల యూనిట్‌ టెస్టులో చివరి ర్యాంకు వచ్చింది. దానితో పట్టుదల పెరిగింది. ఇంటి దగ్గర ఇంగ్లీషు అక్షరాలను తెలుగులో రాసుకొని పలకడం చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఈ పోరాటం నాకు సంవత్సరం పరీక్షలో రెండో ర్యాంకు తెచ్చిపెట్టింది. దానితో చదువు పట్ల నాకున్న ఆసక్తి రెట్టింపు అయింది. మా రెండో అక్క వాళ్ళకు ఇబ్రహీం పట్నం బదిలీ అయింది. దాంతో నా చదువు కూడా బదిలీ అయి ఇబ్రహీం పట్నంలో తెలుగు మీడియం ఏడో తరగతిలో చేరాను. తర్వాత ఎనిమిదో తరగతి సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వోన్నత పాఠశాలలో చదివాను. హైదర్‌గూడాలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 9,10,11 తరగతులు చదివాను. ఈ రకంగా ఒకే పాఠశాలలో కాకుండా నా పాఠశాల విద్య అక్కడక్కడా పూర్తయింది. ఐదో తరగతి మినహా నా విద్యాభ్యాసం అంతా తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరిగింది.
ప్ర. ప్రభుత్వ బడుల్లో చదువుకొన్న మీకు ఉన్నత విద్యాభ్యాసంలో సమస్య రాలేదా?
జ. ఎలాంటి సమస్య రాలేదనే చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉండదనే అభిప్రాయం సరైంది కాదు. కానీ ఈ రోజుల్లో ప్రైవేట్‌ బడుల్లో తమ పిల్లలను చదివించడం ప్రిస్టేజిగా భావిస్తున్నారు తల్లి దండ్రులు. దిగువ మధ్యతరగతి వారు ఎంత కష్టమైనా తమ పిల్లలను ప్రైవేట్‌ బడులకే పంపిస్తున్నారు. దానికి ఉన్నత విద్యాభ్యాసమే నిదర్శనం.
ప్ర. బాల్యంలో మిమ్ములను ప్రభావితం చేసిన సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా? ఉంటే చెప్పండి.
జ. బాల్యమే భవిష్యత్తుకు పునాది కదా! అలాంటి రెండు మూడు సంఘటనలు పంచుకుంటాను. ఐదేళ్ళదాకా ఆటపాటలతో బాల్యం గడపడం ఒకటి. ఏబీసీడీలతో పరిచయం లేకుండా హైదరాబాదులో ఇంగ్లీషు మీడియం ఐదో తరగతిలో వార్షిక పరీక్షలో పట్టుదలతో రెండో ర్యాంకు సాధించడం నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది. అదే ఏడాది పాఠశాల వార్షికోత్సవంలో రవీంద్ర భారతిలో భక్త రామదాసు నాటకంలో రామదాసు భార్యగా నటించాను. రామదాసు జైలుకు పోయే సన్నివేశంలో ఏడుస్తూ నేను నటించిన తీరుకు మా సుశీల టీచర్‌ ఎత్తుకొని ముద్దు పెట్టుకున్న ఘటన మరొకటి. ఏడోతరగతిలో పాఠశాలకు అనుబంధంగా నడిచే బాలానందం కార్యక్రమంలో భాగంగా రేడియో స్టేషన్లో నేనొకసారి పాడిన జ్ఞాపకం వుంది. రైతన్న అనే గ్రూప్‌ డాన్స్‌లో రైతన్న వేషం వేసాను. రైతన్నగా ధోతీలో బాగా డాన్స్‌ చేసానని మా అక్క మెచ్చుకుంది. ఈ సంఘటనలన్నీ నేను దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని నాలో పెంచాయి.
ప్ర. మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. అమ్మ సీతమ్మ గృహిణి. నాన్న రాంచందర్‌ రావు. మాది వ్యవసాయ కుటుంబం. నాకు నలుగురు అక్కలు, ముగ్గురు అన్నలు, ఒక చెల్లెలు. అందరూ విద్యావంతులే..
ప్ర. మీ ఉన్నత విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నాకు డాక్టరు కావాలన్న కోరిక వుండేది. నా స్నేహితురాలికి మెడికల్‌ విద్యార్థి ట్యూషన్‌ చెప్పేవాడు. ఆ ట్యూషన్‌కు నేనూ వెళ్ళేదాన్ని. నన్ను చదువు ఆపేయమని చెప్పిన మా పెద్దన్న నాకు మంచి మార్కులు రావడం వలన మెడికల్‌ సీటు వస్తుందని చెప్పాడు. దానితో నాకు ఆత్మ విశ్వాసం పెరిగింది. ఒక మెడికల్‌ కాలేజీకే దరఖాస్తు చేశాను. మిగతా ఏ కాలేజీలకు చేయలేదు. అవకతవకలు జరిగాయని తరువాత తెలిసింది. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన నా స్నేహితురాలికి మినిష్టర్‌ కోటాలో సీటు వచ్చింది. కానీ నాకు రాలేదు.
ప్ర. మెడికల్‌ సీటు రానప్పుడు ఆ యేడు వృథా కాకుండా మీ చదువు ఎలా కొనసాగించారు?
జ. సైన్సు గ్రూప్‌ నుండి ఆర్ట్స్‌ గ్రూప్‌కు మారితే బిఏ ప్రైవేటుగా రాయొచ్చుననే విషయం తెలిసింది. ఒక విద్యా సంవత్సరం కోల్పోవడం ఇష్టం లేక అందులోకి మారి ట్యుటోరియల్‌ కాలేజీలో చేరాను. మొదటి ఏడాది బిఏ పరీక్ష ప్రైవేట్‌గా రాసి పాసయ్యాను. రెడ్డి కాలేజీలో బిఏ రెండో సంవత్సరంలో చేరాను. అలా డిగ్రీ పూర్తయింది. తర్వాత ఎంఏలో చేరడానికి కూడా సాహసం చేయాల్సి వచ్చింది. అడ్మిషన్‌ ఫీజు కట్టడానికి డబ్బుల కొరకు బాంబేలో పని చేస్తున్న శ్రీధరన్న దగ్గరికి వెళ్ళాను. ఆ రోజుల్లో ఒంటరిగా ఒక ఆడపిల్ల బాంబేదాకా రైలులో ప్రయాణించడం సాహసమే కదా.. చదువుపట్ల నాకున్న ఆసక్తి నా చేత ఆ పని చేయించింది. అలా ఎంఏ ఎకనామిక్స్‌లో యూనివర్సిటీలో చేరాను.
ప్ర. మీకు బోధించిన అధ్యాపకుల బృందం ప్రతిభావంతులని విన్నాను. వారి గురించి చెప్పండి.
జ. మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన ఫెమినిస్టు మేధావి వసంతా కన్నాభిరాన్‌ నాకు ఇంగ్లీషు బోధించారు. ఆ కాలంలోనే ఫ్రాన్సుకు వెళ్ళి పి.హెచ్‌డి చేసిన రమా మేల్కోటె నాకు రాజకీయ శాస్త్రం బోధించారు. ఆమె 1969 మొదటి తెలంగాణా ఉద్యమానికి సారథ్యం వహించిన కుటుంబం నుంచి వచ్చిన మేధావి. కమ్యూనిష్టు నాయకుడు రావి నారాయణ రెడ్డి కూతురు రావి భారతి నాకు తెలుగు బోధించారు. వాళ్ళ ప్రభావమే నన్ను ప్రజల పక్షం చేసి ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆ తరువాతి కాలంలో ప్రజా జీవితంలో వసంత నేను స్నేహితులమయ్యాము.
ప్ర. మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా?
జ. మా వివాహ ఘట్టం గురించి చెపుతాను. అది ఏ విధమైన వివాహమో మీరే నిర్ణయించుకొండి. నేను అప్పుడు సిద్ధిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థులకు అధ్యాపకురాలిగా వున్నాను. మా మేనత్త నాకు తోడుగా నాతోపాటే ఉండేది. ఆమెకు మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో చాలా మంది బంధువులు, ఆస్తులు ఉండేవి. అందుకని తరచుగా అక్కడికి వెళ్ళేది. ఒకసారి హరగోపాల్‌ వాళ్ళ అమ్మానాన్నలు తారసపడి పెళ్ళి సంబంధం గురించిన మాటల సందర్భంలో నా గురించి చెప్పింది. అప్పటికే స్వతంత్ర వ్యక్తిత్వం వున్న హరగోపాల్‌ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకొని తన మిత్రుడిని తీసుకొని సిద్ధిపేటకు వచ్చారు. నా గురించి తెలుసుకొని మా రూంకు వచ్చినప్పుడు నా రూమ్మెట్‌ విజయ తలుపు తీసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమని చెప్పడానికి వచ్చామని చెప్పారు. తాను నాకు చెపుతానని అంటున్నా వినిపించుకోకుండా నాతో ప్రత్యక్షంగా మాట్లాడాలని అన్నారు. నేను లోపలి నుంచి వచ్చాను. నా సహోద్యోగి నారాయణస్వామి ఇంట్లో మాట్లాడారు. అప్పుడు ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు. తరువాత కొన్ని రోజులకు వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు పెళ్ళిచూపులకు వచ్చారు. అప్పుడు ఆయనను అంతకు మునుపు చూసినట్టు ఉందనుకున్నాను. వరకట్నం లాంటివి లేకుండా మా శ్రీధరన్న పెళ్ళితోపాటే మా పెళ్ళి కూడా జరిగిపోయింది. పెళ్ళి జరిగాక హరగోపాల్‌ చెపితేనే ఈ విషయమంతా నాకు తెలిసింది.
ప్ర. మీ అత్తగారి కుటుంబం గురించి చెప్పండి.
జ. 21 ఫిబ్రవరిన 1973లో మా పెళ్ళి జరిగింది. అత్త అనసూయమ్మ. మామ భాస్కరరావు. పెద్ద కుటుంబం. మధ్యతరగతి కుటుంబం. హర గోపాల్‌ ఇంటికి పెద్ద కొడుకు. అప్పుడు ఆయన వరంగల్‌లో ఉద్యోగం చేసేవారు.
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. పెళ్ళైన ఏడాదిలోనే నాకు కవల మగ పిల్లలు పుట్టారు. నేనప్పుడు సిద్ధిపేటలోనే ఉద్యోగం చేస్తున్నాను. అజయ్‌, విజయ్‌లు వరంగల్‌లో కొంత కాలం చదువుకున్నారు. తర్వాత సెయింట్‌ క్జేవియర్‌ పాఠశాల లింగంపల్లిలో చదువుకున్నారు. పెద్ద కొడుకు అజయ్‌ డిగ్రీ నుంచి ఢల్లీిలో చదువుకుని అక్కడే జెఎన్‌యూలో పొలిటికల్‌ సైన్సు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. కోడలు అమెరికన్‌ బ్యాంక్‌ ఉద్యోగి. చిన్న కొడుకు విజయ్‌ ఆర్థికశాస్త్రంలో పిహెచ్‌డి చేసాడు. కొన్నాళ్ళు ఎపిఇలో, కొన్నాళ్ళు నల్సార్‌ యూనివర్శిటీలో పనిచేసాడు. ప్రస్తుతం హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కోడలు హెచ్‌సియులో లైఫ్‌ సైన్సు డిపార్ట్‌ మెంటులో పనిచేస్తోంది. వారికి ఇద్దరు అమ్మాయిలు. ఏడు, ఐదు తరగతుల్లో చదువు తున్నారు. చిన్న మనవరాలు జిమ్నాస్టిక్స్‌ కూడా నేర్చుకుంటుంది. మేమందరం కలిసి వుంటాము. మగపిల్లలు కావడం వల్ల ఇంటి పనులు చేయాలని వాళ్ళకు చిన్నప్పటి నుంచే చెప్పి చేయించేదాన్ని. ఈనాడు పెళ్ళిళ్ళై వాళ్ళు సంసారాల్లో స్థిరపడ్డా ఇద్దరూ ఇంటి పనులు బాధ్యతగా చేస్తారు. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తాను.
ప్ర. ఇద్దరు మగపిల్లలు అందులో కవలలు .. వాళ్ళను పెంచడంలో మీరు పడ్డ ఇబ్బందులు చెప్పండి.
జ. ఆ ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. మచ్చుకు ఒక సంఘటన చెప్తాను. ఒకసారి నేను స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ చేయడానికి హైదరాబాదుకు వచ్చాను. అప్పుడు పిల్లలు మూడేళ్ళ వయసు వారు. టూరిస్టు హోటల్‌ రూంలో ఉన్నాము. పిల్లలు పక్క రూముల్లోకి వెళ్ళి వాళ్ళ వస్తువులు తీసుకురావడం, పక్కగది తలుపులు కొట్టడం వంటి అల్లరి పనులు చేశారు. నేను స్పాట్‌కు వెళ్లిపోయాక వాళ్ళ అల్లరిని ఎలా అదుపు చేయాలో తెలియని హరగోపాల్‌ ఒక రిక్షా అతనిని పిలిచి రోజంతా పిల్లలను రిక్షాలో తిప్పాలని కాంట్రాక్టు మాట్లాడుకున్నారు. ఈ అనుభవాన్ని హరగోపాల్‌ స్వయంగా వసంత కన్నాభిరాన్‌తో పంచుకున్నారు. ఆమె ఆ విషయాన్ని తన రచనలో ప్రచురించి కొన్ని ప్రశ్నలు వేసారు. వనమాల అలాంటి అల్లరిని ఎన్ని రోజులు ఆ పిల్లలతో గడిపి వుంటుంది? ఆమె ఆరోగ్యం, ఆమె సమయం ఎంత ధారపోసి వుంటుంది? ఈ కర్తవ్యాలకు ఆమెకు ఏ గుర్తింపు వుంది? అనేవి ఆ ప్రశ్నలు. ఇవి పైకి నాకు సంబంధించిన ప్రశ్నలుగా కనిపించినా మన దేశంలో ఎందరో మహిళల మౌలికమైన ప్రశ్నలు.
ప్ర. మీ పరిశోధన గురించి చెప్పండి.
జ. దాదాపు ఏడేళ్లు నా కెరియర్‌లో ఎదుగుదల ఏమీ లేదు. ఉద్యోగం, ఇంటి బాధ్యతలతో కాలం గడిచిపోయింది. హరగోపాల్‌ తన విద్యార్థులకు చేస్తున్న సూచనలు చూస్తున్నప్పుడు నాకు కూడా పరిశోధన చేయాలని పించేది. లోపల దిగులుగా ఉండేది. ఆయన 1980లో సెస్‌ (సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌)లో పనిచేయడానికి వరంగల్‌ నుంచి వచ్చారు. అప్పుడు నన్ను కూడా ఐపి ఇ (ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ ప్ప్రైజెస్‌)కి బదిలీ చేసారు. అప్పటి వరకూ ఇంటర్‌ విద్యార్థులకు బోధించిన నాకు ఇక్కడ ఐపిఎస్‌, ఐఏ ఎస్‌లకు బోధించడం సవాలుగా మారింది. దానికి తోడు ‘‘కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ టు ది స్టేట్‌ ఎకానమీ’’ అనే అంశం పరిశోధనకై ప్రాజెక్టు ఇచ్చారు. అలా నా పరిశోధన మొదలైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘‘పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్ప్రైజెస్‌-ఎన్‌ ఎంక్వయిరీ ఇన్‌ టు ద కార్పొరేషన్‌ ఫర్‌ వీకర్‌ సిక్షన్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’’ అనే అంశం మీద 1985-89 వరకు పిహెచ్‌డీ పరిశోధన చేసాను. 1990 లో డాక్టరేట్‌ వచ్చింది.
ప్ర. మీ జాతీయ, అంతర్జాతీయ పరిశోధన గురించి చెప్పండి.
జ. ఇక్కడ నేను పరిశోధన అంతర్జాతీయ మేధావులను మెప్పించింది. అందువల్ల నాకు అమెరికా నుంచి సెమినార్‌లో పాల్గొనడానికి ఆహ్వానం వచ్చింది.’’ ఇన్‌ఫార్మ్‌లైజేషన్‌ అండ్‌ ఫెమినైజేషన్‌ ఆఫ్‌ ద ఫార్మల్‌ సెక్టార్‌ ఇండస్ట్రీ’’ ‘‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రయిలైజేషన్‌ ఆన్‌ వుమెన్‌,’’ స్టేటస్‌ ఆఫ్‌ ఇండియన్‌ వుమెన్‌’’ ‘‘వుమెన్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’’ అనేవి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నేను సమర్పించిన పరిశోధనా పత్రాలు.
ప్ర. ప్రచురించబడిన మీ పుస్తకాల గురించి చెప్పండి.
జ. రెండు పుస్తకాలు వచ్చాయి. ఒకటి. ప్రొడక్షన్‌ రిలేషన్స్‌. ఇది ఉత్పత్తి సంబంధాలు అనే పేరుతో తెలుగులోకి అనువాదమైంది. రెండు: ఫెమి నైజింగ్‌ లేబర్‌ రిలేషన్స్‌. ఇది శ్రమ సంబంధాల మహిళీకరణ అనే పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఉత్పత్తి ప్రక్రియలో మారుతున్న మహిళల పాత్రలపై అధ్యయనం ఈ పుస్తకం. ఈ రెండు పుస్తకాలను బి.అనురాధ అనువదించారు. ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి.
ప్ర. అవార్డుల గురించి చెప్పండి.
జ. ఐసిఎస్‌ఎస్‌ఆర్‌ డాక్టరోల్‌ మరియు పోస్ట్‌ డాక్టర్‌ రోల్‌ ఫెలోషిప్‌ వచ్చింది. ఐ సి ఎస్‌ ఎస్‌ ఆర్‌ ఫెలోషిప్‌ రెండుసార్లు రావడం చాలా ప్రతిష్ఠా త్మకమైంది. ఇండో – డచ్‌ ప్రోగ్రాం ఫర్‌ ఆల్టర్నేటివ్‌ డెవలప్‌ మెంట్‌ (ఐ డి పి ఎ డి) ఫెలోషిప్‌ కూడా వచ్చింది. 2004 లో బెస్ట్‌ స్టేట్‌ టీచర్‌ అవార్డు వచ్చింది.
ప్ర. మీ ఉద్యోగ ప్రస్థానం చెప్పండి.
జ. 1972లో ఎంఏ అయిపోతూనే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో జూనియర్‌ లెక్చరర్‌గా మొదటి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చింది. జూనియర్‌ లెక్చరర్‌నే అయినా బికాం డిగ్రీ క్లాసులు కూడా ఇచ్చారు. క్లాసులో అబ్బాయిలు వయసులో నాకన్నా పెద్దగా వున్నారు. తరువాత రెండేళ్ళకు వరంగల్‌లోని కృష్ణాకాలనీ జూనియర్‌ కాలేజీకి బదిలీ అయింది. మొదట కొన్నాళ్ళు బాగానే ఉన్నా దేవికారాణి ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తరువాత 1981లో హైదరాబాదులోని ఐ పిఇకి డిప్యుటేషన్‌ మీద బదిలీ అయింది. అక్కడ ఐపిఎస్‌, ఐఏఎస్‌లకు బోధన, పరిశోధన జరిగింది కాబట్టి ఆ కాలమంతా ఛాలెంజింగ్‌గా గడిచింది. అక్కడ దాదాపు తొమ్మిదేళ్ళు పని చేసాను. అక్కడి నుంచి బేగంపేట ప్రభుత్వ డిగ్రీకాలేజీకి బదిలీ అయింది. అది మహిళా కళాశాల. గ్రామాల నుంచి వచ్చిన ఆడపిల్లలు రాత్రి కాల్‌ సెంటర్స్‌లో ఉద్యోగం చేసి తరగతులకు ఆలస్యంగా వచ్చేవారు. విచారించగా విషయం తెలిసింది.
వాళ్ళు పొందే వేతనం కూడా చాలా తక్కువగా ఉండేది. కారణం సరైన సర్టిఫికేట్‌ లేకపోవడం. అందువల్ల నేను అదనపు గంటలు పనిచేసి సాయంత్రం వేళల్లో ఆయా నిపుణుల చేత వాళ్ళకు క్లాసులు ఇప్పించాను. లీగల్‌ ఎయిడ్‌, రిసెప్షనిస్ట్‌, ఎయిర్‌ టికెటింగ్‌ మొదలైన కోర్సులలో శిక్షణ పొందినవారికి సెట్విన్‌ శిక్షణ సర్టిఫికెట్లు వచ్చేలా చేసాను. అప్పట్లో సెట్విన్‌ శిక్షణ చాలా నాణ్యమైంది. అది వాళ్ళకు ఆనాడు సరైన ఆదాయ మార్గమైంది. అది నాకు చాలా తృప్తినిచ్చింది. నేను బేగంపేట వుమెన్స్‌ కాలేజీ నుంచే పదవీ విరమణ పొందాను.
ప్ర. ఇల్లాలి పాత్ర నుంచి ఇంటర్నేషనల్‌ పరిశోధకురాలుగా మీ ఎదుగుదల గురించి చెప్పండి.
జ. మొదటి నుంచీ నాది పోరాడి సాధించుకునే స్వభావం. ప్రతి మహిళ తన అస్తిత్వాన్ని అన్వేషించుకునే క్రమంలో పోరాటం తప్పనిసరి. పోరాడితే పోయేదేమీ లేదు. చిన్నప్పుడు చదువుకుంటానని గొడవ చేసి చదువుకున్నాను. మళ్ళీ ఆ చదువును కొనసాగించి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించుకునేందుకు మరో పోరాటం చేసాను. ఎలాగైతేనేం ఎంఏ, పి హెచ్‌ డి చేసి అధ్యాపకురాలిగా స్థిరపడ్డాను. పరిశోధన పట్ల నాకున్న ఆసక్తితో జాతీయ, అంతర్జాతీయ సెమినార్‌లలో పాల్గొన్నాను. ఇన్ని సాధించుకున్నా నా కుటుంబాన్ని, పిల్లలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. నేను ఎదగడంతో పాటు నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాను.
ప్ర. హరగోపాల్‌ గారు పౌరహక్కుల సంఘంలో క్రియాశీలకంగా తిరగడం వల్ల మీరు ఎదుర్కొన్న ఇబ్బందులేమైనా వున్నాయా?
జ. భయపడిన సంఘటనలు, ఏ క్షణం ఏం జరుగుతుందోనని కలవరపడిన క్షణాలు, నాకు నేనే సమాధాన పరుచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఏ సందర్భంలోనూ పిరికితనంతో బంధువుల ఇంటికో, పుట్టింటికో పారిపోలేదు. ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని ముందే తెలుసు. తెలిసే ఆ బాధ్యతలను తీసుకున్నారు. ఆ విషయంలో పరోక్షంగా నా ప్రోత్సాహం కూడా వుంది.
ప్ర. మీ ఉద్యమ నేపథ్యం చెప్పండి.
జ. మా పుట్టింట్లో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉండేది కాదు. రాజకీయాలంటే పురుషులకు సంబంధించినవి. వాటి గురించి ఆడపిల్లలు మాట్లాడకూడదనే పరిస్థితులే వుండేవి. నేను కూడా ఎంతసేపు నా చదువు కొనసాగించడానికి పోరాటం చేయడమే సరిపోయింది. హరగోపాల్‌తో సహ జీవనం మొదలైనాకనే ఉద్యమాలతోను, రాజకీయాలతోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. నా నేపథ్యంతో సంబంధం లేకుండా వసంత కన్నాభిరాన్‌ నన్ను ఇందిర కేసు నిజనిర్ధారణకు తీసుకుపోయారు. అరుణోదయ సంస్థలో బీడీ కార్మికులను చైతన్య పరిచే కార్యక్రమంలో పాల్గొన్నాను. చైతన్య మహిళా సంఘంతో కలిసి నందిగ్రాం నిజనిర్ధారణకు వెళ్ళాను. నందిగ్రాం ఉద్యమం రెండో జలియన్‌ వాలాబాగ్‌గా ప్రాచుర్యం పొందింది. పాల మూరు కరువు వ్యతిరేక పోరాట కమిటీలో పనిచేసాను.తెలంగాణ విద్యుత్‌ కార్మికుల ఉద్యమంలో పాల్గొన్నాను. విద్యా పరిరక్షణ కమిటీలో పని చేసాను. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అఖిల భారత విద్యా పోరాట యాత్రలో భాగంగా తెలంగాణలో హరగోపాల్‌తో కలిసి 2014లో డిసెంబర్‌ 2 నుండి 27 వరకు రాష్ట్రంలో దాదాపు వంద సదస్సులలో ప్రసంగించడం నాకొక గొప్ప జీవితానుభవం. అది నేను బ్రెయిన్‌ హామరేజ్‌ వచ్చి కోలుకున్నాక చేసిన యాత్ర. దాని వల్లనే నా ఆరోగ్యం కుదుటపడిరది.
ప్ర. ప్రస్తుతం మీరు చేస్తున్న కార్యక్రమాలేమిటి?
జ. ఎక్కడ ఏ చిన్న ఉద్యమం జరిగినా ప్రజల పక్షాన నా గొంతు వినిపిస్తున్నాను. నిన్న జరిగిన భారత్‌ జోడో యాత్రలో
వాళ్ళు నన్ను రేవంత్‌ రెడ్డి పాలన మీద మాట్లాడమని కోరారు. సెస్‌ రిపోర్టు ప్రకారం ఈ రాష్ట్రంలో విద్యకు కేటాయించిన బడ్జెట్‌ రెండు శాతం మాత్రమే. ఇది ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ. దీనివల్ల ముందు విద్యా హక్కును కోల్పోయేది స్త్రీలేనని సోదాహరణంగా వివరించాను. ఆదివాసీల ఉద్యమాలలో పాల్గొంటున్నాను. చెంచులను నిర్వాసితులను చేయడం పట్ల నా గళం విప్పాను. నేను ప్రజల పక్షం. స్త్రీల పక్షం. ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా బాధితుల పక్షాన నా గళం వినిపిస్తూనే వుంటాను.
ప్ర. హరగోపాల్‌ గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జ. హరగోపాల్‌ ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటే ఆయనలో ఉన్న తపన, కష్టపడే మనస్తత్వం, కృషి, పట్టుదలలే కారణం. సమా జం పట్ల ఆయన ఫీల్‌ అవుతున్న బాధ్యత ఎంతో గొప్పది. దానివల్ల మా ప్రైవేట్‌ లైఫ్‌కు కొంత ఇబ్బంది అయితే ఉండొచ్చుగాక. మాకు అందు లో ఒక సంతృప్తి ఉంది. సమాజం కోసం ఎంతో కొంత చేస్తున్నామనే సంతోషం ఉంది. ‘‘అయ్యో! అమ్మాయిని ఇతనికి కట్టబెట్టాం, కమ్యూనిస్టు అని తెలిసుంటే చేసేవాళ్ళం కాదని ‘‘మా పుట్టింటి వాళ్ళు అన్న సందర్భం ఉంది. కానీ నేనెప్పుడూ బాధ పడలేదు. గర్వంగా ఫీల్‌ అవుతాను.
ప్ర. చివరి ప్రశ్న, కారణాలు ఏమైనప్పటికీ నేటి యువజంటలు విడాకుల దిశగా ఎక్కువగా వెళుతున్నారు. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం చెప్పండి.
జ. ఇది చాలా సున్నితమైన అంశం. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవంచుకోవాలి. మహిళ తాను స్వతంత్రంగా బతకడానికి, తన ఆకాంక్షలను పూర్తి చేసుకోవడానికి సామాజిక సౌలభ్యాలను ఉపయోగించుకొని, తనకు కావలసిన జీవన నిర్మాణాన్ని ఏర్పరచుకోవాలి. ఇలాంటి ప్రయత్నమే నేను నా జీవితంలో చేసాను.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.