పదినేనేళ్ళ రవళికి లోకమంతా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తోంది. ధనుర్మాసపు మంచుతెరలు ప్రకృతికి వేసిన మేలిముసుగులా అనిపిస్తోంది. బంతి, చామంతి, ముళ్ళగోరింట, డిసెంబరు పూలు, అరవిచ్చిన గులాబీలు లేత ఎండలో సొగసులొలికిస్తున్నాయనిపిస్తోంది.
ముఖాన్ని తాకుతున్న తెలిమంచు చల్లదనం, చేతుల్లో గొబ్బిళ్ళ వెచ్చదనం, వాటిపై అలంకరించిన ఎర్రమందారాలు, వాటి పక్కనే తెల్ల గరుడవర్దనాలు, వాకిట్లో ఈ చివరినించి ఆ చివరి వరకు వేసిన సంక్రాంతి కర్రల ముగ్గు, చిడతలు వాయిస్తూ పాడుతున్న హరిదాసు… ఏది చూసినా ఆనందం రెట్టింపవుతోంది. పొంగే పరవశాన్ని దాచడం వశం కావట్లేదు. ఇదంతా కాలవగట్టున తనని పొదివిపట్టుకుని తన చెవిలో మానస్ రహస్యంగా చెప్పిన నాలుగు మాటలవల్లే అనిపిస్తోంది. ఇది ఎంతో బాగుంది…
పదిహేడేళ్ళు వస్తాయనగా శివ రహస్యంగా ఇచ్చిన ప్రేమలేఖ చదివి తనలో రేగిన మోహానికి అయోమయంలో పడిరది. మరి ఏడాది దాటినా పారవశ్యపు పులకరింత ఇంకా పచ్చిగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు తన చుట్టూ రంగురంగుల సీతాకోకచిలుకలు నాట్యం చేస్తున్నట్లుంది. కాలవగట్టున మొదలైన రంగులచాపానికి ఈ సీతాకోకచిలుకల నాట్యానికి తేడాలేదనిపిస్తోంది. ఇదెలా…
టీనేజి దాటుతుందనగా కాలేజి బస్సులో పక్కనే కూర్చుని చేతిలో చెయ్యేసి జాన్సన్ తన కోసమే పాడిన పాట లోలోన అలల అలజడి సృష్టించినప్పుడు కూడా అదే కంగారు. ఆ అలల అంచున వేలకోట్ల బుడగల్లో ప్రతిఫలిస్తున్న హరివిల్లు రంగులన్నీ తన పాదాలని తడపడానికే అనిపిస్తోంది. మరెలా… ఇరవయ్యోయేట పిక్నిక్కి వెళ్ళినప్పుడు కొండకొన వరకూ తనతో నడిచొచ్చి ఆ శిఖరాగ్రాన జలపాతపు ఒడిలో తన పాదాలు తాకి అయూబ్ చెప్పిన షాయరీతో తనలో రక్తపుప్రవాహం రేకెత్తించిన జడికి, కాలవగట్టున అలల అంచు బుడగల మీద సీతాకోకచిలుకల నాట్యానికీ సారూప్యమే కనిపించింది. ఎందుకిలా… మరో మూడేళ్ళకి గోస్తనీ ఒడ్డున ఆల్చిప్ప రెండు రెక్కలపైనా ఇద్దరి పేర్లూ నాజూగ్గా చెక్కి దోసిట్లో ఒంపిన జోగిది… కృష్ణానదిపై నావలో షికారుకెళ్ళినప్పుదు అందరిముందే తన ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ ఓ ప్రియ సందేశాన్ని గుండెల్లోకి సూటిగా పంపిన రాణాదీ… తన మెరుపు కలల రంగే! ఇంకెన్నిసార్లిలా…
పాతికేళ్ళు దాటాక చిక్కని అడవి నట్టనడిన నిటారుగా ఆకాశాన్నంటేలా సాగిన మద్దిచెట్టు నీడన కూర్చున్న తన ఒడిని రంగురంగుల అడవిపూలతో నింపి మంద్రంగా శశాంక్ పాడిన ఎంకిపాటకి మించిన వలపు వేడుక ఏముంటుందనిపించింది. ప్రకృతి వర్ణాలన్నీ వచ్చి తన ఒళ్ళో వాలినట్లనిపించింది. ఇప్పుడెలా… ముప్ఫైఏళ్ళు దాటినా రంగులు వరసలు మారుతూ… ఇంద్రధనస్సు మెరుపులు విరజిమ్ముతూనే ఉంది. రవళి అంతరాంతరాల్లో వలపు మురళి రవళిస్తూనే ఉంది. ఎన్నో రాగాలని ఆస్వాదిస్తూ తన్మయంతో నర్తిస్తూనే ఉంది.
ఓ రోజు ఈ ప్రపంచం రవళిని తట్టి లేపింది. ఇంద్రచాపంపై విహరిస్తున్న రవళిని దిగిరమ్మని గర్జించింది. నీ రంగేదో నిర్ణయించుకో అని ఉరిమింది. నువ్వేమీ తుమ్మెదవి కావు, నువ్వో ఆడపిల్లవి, నీ పయనం నిరంతరంగాదు, తుదిమజిలీ ఎంచుకో అంటూ నిర్దేశించింది.
అమ్మమ్మ ఎర్రరంగు కోరుకుంటే నీకు పచ్చరంగే నప్పుతుందని అంటగట్టింది ఈ ప్రపంచం. వాళ్ళమ్మ జాజిపూలు కావాలనుకుంటే గులాబీలదండ అలంకరించింది అదే ప్రపంచం. మా అమ్మ తూనీగ కావాలనుకుంటే ఆ ‘తూ’ తెంచేసి వంటింటి ఈగని చేసింది… నా అక్క సంద్రపు అల అవ్వాలనుకుంటే నువ్వలిసిపోతావు, అలల అలజడిలేని కుంట నీకు సరైనదని నిర్ణయించేసింది… నా చెల్లి ఆకాశపు అంచుల్లో విహరించాలని ఆశపడితే వెయ్యడుగుల అంతఃపురపు గుమ్మంలోంచే వినీలాకాశం చూపించింది ఇదే ప్రపంచం.
నా నేస్తాలు కోరుకున్న జలపాతాలు, నదీనదాలు, చిట్టడవులు, పచ్చిక బయళ్ళు, పర్వత శిఖరాలు, పూదోటలు, జానపద జావళీలు, ఆరుద్ర గమనాలు, తేనెపిట్టల గిరికీలు, నెమలి ఆటలు, మేఘమాలలు, వన్నెల మెరుపులు… ఇవన్నీ మీవి కాదు, మీకు కాదు, మీరు కాదు అంటూ దేనికీ కాకుండా చేసింది ఈ నాగరిక ప్రపంచం. సాలెగూడులోని అందం, అమరిక, మెరుపు మీదే, మీకే, మీవే, అచ్చంగా మీస్వంతం అంటూ అందులోకి విసిరేసింది! ఇవేవీ నాకొద్దు. నా దారి వేరు, నా గమ్యం వేరు, నా గమనం వేరు…
గిజిగానినుండి గూడల్లడం నేర్చుకుంటా. సెలయేరు నుండి కఠిన పయనం నేర్చుకుంటా. అలల నుండి క్రిందపడ్డా లేచి గెలవడం నేర్చుకుంటా. కొండకొనల నుండి నిఠారుగా నిలబడడం నేర్చుకుంటా. వసంతపు కోయిల నుండి కమ్మని పాటలు నేర్చుకుంటా. నత్తగుల్లల నుండి బరువులు మోస్తున్నా తలెత్తుకు తిరగడం నేర్చుకుంటా. గడ్డిపూల నుండి వికసించి నిలబడడం నేర్చుకుంటా. రాలిన పువ్వుగానైనా ధరణిని ముద్దాడడం నేర్చుకుంటా. ఎండగట్టినా విత్తనంలా మొలకెత్తి చిగురించడం నేర్చుకుంటా. కసిగా తొక్కుతున్నా నాలో ఇముడ్చుకోవడం నేర్చుకుంటా. మరణించినా చందనంలా సుగంధం వెదజల్లడం నేర్చుకుంటా.
వర్షచాపపు తీరాలన్నీ నావే… ఇంద్రచాపపు వర్ణాలన్నీ నాకే… వన్నెల రంగులన్నిటితో సంగమించి ధవళ వర్ణపు మెరుపునవుతా. నా ప్రియాతి ప్రియమైన అక్కాచెల్లెళ్ళని… ఆడపిల్లల్ని ఆ మెరుపు చేతులు చాచి పొదువుకుంటా. కోటానుకోట్ల మెరుపుల్లా ఎగజిమ్మడానికి వారి శక్తినవుతా… నాకత్యంత ప్రీతిపాత్రమైన అన్నదమ్ముల్ని… మగపిల్లల్ని మానవతా వాదులుగా, ప్రేమైక జీవులుగా రూపుదిద్దుతా… సమానత్వపు మరోలోకాన్ని నిర్మిస్తా… విశాల వికాస విదూష్య ధరిత్రీ పునాదినవుతా!
గాలితో జతకట్టి వచ్చిన మంచుతెర చల్లదనానికి మెలకువ వచ్చింది రవళికి. శీతాకాలపు ఉషోదయం, తెరలు తెరలుగా తరలెళ్ళిపోతున్న పొగమంచు, వెలుగు రేఖలు విచ్చుకుంటున్న తూరుపుదిక్కు, ఒక్కోపిట్టా గూళ్ళల్లోంచి కువకువరాగాలు మొదలెడుతున్నాయి. ఎంత చక్కటి మేల్కొలుపు. తన గమ్యం ఆవిష్కృతమైందని, తుది మజిలీ స్పష్టమైందని ఆనందంగా లేచి కొత్త సంవత్సరానికి ఆహ్వానంగా ఒళ్ళు విరుచుకుంది ఉన్మత్తంగా. ప్రకృతితో మంద్రంగా పలికింది ‘హ్యాపీ న్యూ ఇయర్!’
