తమిళ మూలం: భామ
అనువాదం: డా॥ జిల్లెళ్ళ మెర్సీ విజేత
సంక్రాంతి తర్వాత మరో సంక్రాంతి పండుగ వచ్చింది. ఏటేటా సంప్రదాయం ప్రకారం మదసామి, తన భూసామిని దర్శించుకొని తన సంపాదనలోంచి భూసామికి కొంత ఇచ్చి తన గౌరవాన్ని చూపేవాడు. ఈసారి కూడా సంక్రాంతి పండుగకు తనకు కలిగిన వాటిలో కొన్నిటిని సర్దుకొని భూసామి దగ్గరకి బయలుదేరాడు.
ఒక కోడి పుంజుని పట్టి, దాని కాళ్ళు దగ్గరగా కట్టి తలకిందులుగా వేలాడతీశాడు. అది గట్టి గట్టిగా అరుస్తూ, రెక్కలు ఆడిస్తూ, మరింత పెంట వేసింది. ‘నేను అయ్యగారింటికి బయలుదేరేటప్పుడే, ఈ పనికిమాలిన కోడి పెంట వెయ్యాలా!’ అనుకుంటూ పెద్ద గుమ్మడికాయను భుజానికి ఎత్తుకొని మరో చేత్తో కోడిని గట్టిగా పట్టుకున్నాడు.
‘‘రేయ్, ఇలవరసీ! నువ్వు ఆ రెండు చెరుకుగడలు తీసుకో, నీ తమ్ముడు ఆ పెద్ద అరటి గెల పట్టుకుంటాడు. మీ అమ్మ బియ్యం తెస్తుంది’’ అన్నాడు. మదసామికి దాదాపు యాభైయేళ్లు. చూడచక్కటి రూపం. అతని కాళ్ళు చాల పొడుగ్గా చూడడానికి బలమైన వెదురు బొంగుల్లా ఉంటాయి. అక్కడక్కడ తల నెరిసినా, ఒత్తైన రింగుల జుట్టు అతనిది.
ఏడెనిమిది మంది పిల్లలు. వాళ్లని పెంచడానికి అతను ఎన్నో అగచాట్లు పడ్డాడు. ఇరుగు పొరుగు వారు అతను చేయని పనే లేదంటారు. అప్పట్లో ఆయన వీధి చివరలో ఒక టీ అంగడి తెరిచాడు. కానీ, ఆ అంగడి సరిగ్గా జరగక మూసేసాడు. అతను వీధుల్లో తిరిగి పప్పులు, బఠాణీలు అమ్మేవాడు. అదీ కలిసి రాలేదు. కాలాన్ని బట్టి మామిడి, పనస తోటలను గుత్తకు తీసుకొని నష్టపోయాడు. ఇక ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలుగా రామసామి తీసుకున్న పొలంలో కూలికి పనిచేస్తున్నాడు.
నేను ఒకరోజు అతనితో ‘‘మామ, ఎందుకని నువ్వు ఏ పని మొదలు పెట్టినా, కలిసిరాలేదు?’’ అని అడిగా.
అతను కోపంతో ‘‘నువ్వేమో ఇట్లా అడుగుతున్నావు!’’ ఈ జనమేమో ఇతర కులపోళ్ళు ఏది అమ్మినా ఎగబడతారు. అదే నేను అమ్మబోతే మాతర్ర అది ‘పరయా టీ అంగడి’ అని ఇవి ‘పరయా పొంగనాలు’ అని ఏదీ కొనరు. అందుకే నేను బేరం మానుకోవాల్సి వచ్చిందని’’ చేదు నిజం చెప్పాడు. కొంతకాలం అతను నాటు సారా కూడా కాసి అమ్మేవాడని అంటారు. తాగటానికి గంజి కూడా లేని గడ్డు రోజులు గడిపాడు. ఊర్లోవాళ్ళు అందరూ మాంసం కొనుక్కుంటే, ఇతను చవకగా వస్తాయని పొట్ట పేగులు మాత్రమే కొనుక్కునేవాడు.
అతను తన పిల్లల్ని బడికి పంపలేదు. ‘కడుపు నిండా తిండి లేకపోతే ఎవరైనా ఎట్లా చదువుతారు?’ అని పిల్లలందరిని బడికి బదులు బీడీలు చుట్టడానికి పంపాడు. చిత్రంగా బుర్రలో ఏం మెదిలిందో ఏమో గాని రెండో కొడుకు, ఈసక్కిముత్తుని పనికి కాక బడికి పంపాడు. వాడు ఎలాగోలా పది చదివి, టీచర్ ట్రయినింగ్ చేశాడు. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. గత రెండు సంవత్సరాలుగా స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ రోజువారీ కూలీ కింద ఏ పని దొరికితే ఆ పనికి పోయేవాడు.
మదసామి తను సర్దుకున్న వస్తువులను తీసుకొని బయల్దేరాడు. పెళ్ళాం రక్కమ్మ, కొడుకు ఇలవరసు అతని వెంట నడిచారు. ఇవేవీ పట్టించుకోని ఈసక్కిముత్తు అరటిగెల ఎత్తుకోకుండా ఎక్కడివాడక్కడే ఉండిపోయాడు.
‘‘రేయ్, నువ్వు గెల తీసుకొనిరా, ఇప్పటికే ఆలస్యమవుతోంది’’ అని విసుక్కున్నాడు మదసామి.
‘‘ఇవన్నీ మనం భూసామికి ఎందుకివ్వాలి? వీటిని మనమే కూర వండుకుంటే ఒక్కసారి అయినా కడుపునిండా తినొచ్చు కదా’’ అన్నాడు ఇసక్కి. తాతల కాలం నుంచి వస్తున్న పద్ధతుల్ని మనం మార్చలేం. ఇవన్నీ తీసుకపోకపోతే భూసామి ఏమనుకుంటాడు? వాళ్ళకి తిండికేం తక్కువా? ‘సరే సరే, బయలుదేరుదాం పద’ అంటూ పైట కొంగు చుట్టకుదురులా చుట్టి మాడు మీద పెట్టుకొని బియ్యం మూట ఎత్తుకొంది. మదసామి ఆగి వెనక్కి చూసి ‘‘చెప్పేది అర్థం కావడం లేదా?… చదువుకున్నావ్ కదా! చిన్నిపిల్లోడిలాగా మాట్లాడుతున్నావ్! భూసామికి, మనం వీటిని ఊరకనే తీసుకొని పోవడం లేదు. ఆయన కూడా వీటికి బదులుగా మనకి ఏమన్నా ఇస్తాడు. సరే, వెంటనే వాటిని తీసుకుని పద’’ అన్నాడు. ఈసక్కిముత్తు కదల్లేదు. ‘‘బదులుగా భూసామి మనకి ఏమి ఇస్తాడో చూద్దాం’’ అన్నాడు.
‘‘వీడికి తలబిరుసు! ఇన్నేళ్ళు భూసామి ఇంటి నుండి పొంగలి తెస్తూ ఉన్నాం. నువ్వు తినలేదా? అప్పుడెందుకు అడగలేదు? నీ మెడలో వేసుకున్న తువాలు ఆయన ఇచ్చిందే. భూసామిని వీటన్నింటికి లెక్కలు అడుగుతామా? ఎంత తెలివి తక్కువోడివిరా!’’ అన్నాడు మదసామి. ‘‘రవంత పొంగలి, పది రూపాయల తువాలు కోసం మనం ఎంత పనికిమాలి నోళ్ళమయితే మాత్రం వాళ్ళకి డెబ్భై ఎనభై రూపాయలు ఖరీదు చేసే కోడిపుంజు, ఒక పెద్ద గుమ్మడికాయ, పదిరూపాయలు ఖరీదు చేసే చెరుకుగడలు, పెద్ద అరటి గెల, నాలుగు కుంచాల బియ్యం ఇవ్వాలా? వీటన్నిటిని మనమే వండుకుని తింటే నాలుగయిదు రోజులకు సరిపోదా ఏంటి?’’ అని గట్టిగా అన్నాడు ఈసక్కి. వెంటనే రక్కమ్మ ‘‘అట్లా అనొద్దు. భూసామికి ఏం తక్కువైందని మనం ఇవన్నీ ఇస్తున్నాం? మనం ఇవి ఇవ్వకపోతే ఆయన చస్తాడా! వాళ్ళకి మన చేతనయినది చేస్తున్నాం. అదీ ఏడాదికి ఒకసారే. ఆయనకి నాలుగు తరాలు కూర్చొని తినేంత ఉంది. తొందరగా రారా పనికిమాలినోడా!’’ అంది. ‘‘మనం సంక్రాంతి పండుగప్పుడు ఏదో ఒకటి తీసుకొని వాళ్ళ దగ్గరకు పోతుంటాం కదా మరి వాళ్ళు కూడా దీపావళికో కొత్త సంవత్సరానికో ఏదో ఒకటి తీసుకొని మన దగ్గరకు రావచ్చు కదా! అట్లా ఆయనెప్పుడైనా వచ్చాడా మరి? అన్నాడు ఈసక్కి.
‘‘వీడిట్లా తిక్క తిక్కగా వాగుతానే ఉంటాడు. రేయ్, ఇటు చూడరా భూసామి అంటే ఏమనుకుంటున్నావ్… ఆస్తిగలోడు, అంతస్తుగలోడు, పరువుగలోడు, కులంగలోడు! అట్లాంటి భూసామిని మనల్ని చూడ్డానికి మన పరయా వీధికి రమ్మనడానికి నీకెంత ధైర్యం! ఈ మాటలు గానీ భూసామికి తెలిస్తే ఇంకేమన్నా వుందా… మనల్ని ఇంకా ఇబ్బంది పెడ్తాడు… ఇంతకీ వస్తావా రావా?’’ అని మదసామి ఇసక్కిముత్తుని ఉరిమి చూశాడు.
‘‘నేను రాను. మీరు ఆత్మాభిమానం గాలికొదిలి సిగ్గులేకుండా పోయి ఆయన కాళ్ళమీద పడుతున్నారు. ఇదిగో మీ భూసామి ఇచ్చిన పనికిరాని తువాలు.’’ అని ఈసక్కి తువాలును మెడలోంచి తీసి నేల మీదికి విసరి, ఉమ్మేసి కోపంగా వెనక్కి తిరిగాడు. ‘‘వీడి వాలకం చూస్తుంటే, వీడు బాగుపడేలా లేడు. వీడు బతక నేర్చినోడు కాదు’’ అంటూ మదసామి అరటి గెల తీసుకొని ముందు నడుస్తుంటే రక్కమ్మ ఇలవరసి అతని వెంట నడిచారు. దారి పొడుగునా తన కొడుకు అనిన మాటలు గుర్తుచేసుకున్నాడు మదసామి. భూసామి ఇల్లు దగ్గర పడుతుండగా గౌరవార్థంగా తలకు చుట్టుకున్న తువాలు తీసి నడుముకి కట్టుకున్నాడు. ‘‘అయ్యా, మేము మీ ముందు తలవంచుకున్నాం’’ అన్నాడు మదసామి.
ఇదంతా మిద్దె మీద నుంచి చూసిన భూసామి కింది అంతస్తులో ఉన్న తన పెళ్ళాంని పిలిచి, ‘‘వసంతా, వాళ్ళు తెచ్చినవి తీసుకొని పంపు’’ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వసంత బయటకు వచ్చి మదసామితో ‘‘నీవు తెచ్చినవి గడప దగ్గర పెట్టి, దొడ్డి వాకిలికి రా. వస్తా వస్తా ఒక అరిటాకు తెచ్చుకో’’ అంది. ఆమె చెప్పినట్లుగా వాళ్ళు తెచ్చినవన్నీ గడప దగ్గర పెట్టాడు. పెరట్లోంచి అరిటాకు తీసుకొని వెనక ఉన్న పశువుల కొట్టం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు మదసామి. పొంగలి పెట్టిన అరిటాకును మడుస్తూ ఇంటి ముందుకి వచ్చాడు. రక్కమ్మ తను తెచ్చిన బియ్యాన్ని భూసామి పెళ్ళాం ఇచ్చిన గోతంలో పోసి మొగుడు తెచ్చిన పొంగలిని బద్రంగా మూట కట్టింది.
‘‘అయ్యా, మేం బయలుదేరుతున్నాం’’ అని వినయంగా చెప్పాడు మదసామి. అయ్య లోపలి నుంచే పొమ్మని చెప్పాడు. ఇంటికి వెళ్లే దారిలో ‘‘ఏమే రక్కమ్మా, భూసామి, ఇంతకు ముందులాగ ఈసారి మనకు తువాలు ఇవ్వలేదే?’’ అని బాధపడ్డాడు మదసామి. ‘‘నేనూ అదే అనుకుంటన్నాను. చూస్తూ ఉంటే ఈసక్కి అనిన మాటల్లో ఏదో అర్థం ఉందనిపిస్తంది’’ అంది రక్కమ్మ నడుస్తూ.
పొంగలిలో కొంత తీసి ఇలవరసికి పెట్టింది. వాడు దాన్ని తినేసి వేళ్ళు కూడా నాక్కున్నాడు. మదసామి తనలో తాను ‘వీడు పిల్లోడిలా వేళ్ళు కూడా నాక్కుంటున్నాడు, ఈసక్కిముత్తు మాత్రం దానిని తాకడానికి కూడా ఇష్టపడ్డం లేదు’ అనుకున్నాడు. ఇంటికి చేరాక ఈసక్కి అనిన మాటలను నెమరువేసుకున్నాడు మదసామి. ‘వాడు చెప్పింది నిజమే. నేను ఆయన దగ్గరకి వెళ్ళడం ఎందుకు? ఆయన్ని పనికిమాలినోడు అనడమెందుకు? ఆయన దగ్గరకి వెళ్ళొచ్చిన నేను కదా పనికిమాలినోడిని…?’ ఆలోచించే కొద్దీ తన మీద తనకి కోపం ఎక్కువైంది మదసామికి.
అప్పుడే ఇంటికి తిరిగివచ్చిన ఈసక్కిముత్తు నాయినకి తన మీద కోపం తగ్గలేదనుకొని పోయి, ఇంటి ముందు ఆరుబయటున్న రోటి మీద కూర్చున్నాడు. ఈసక్కిని చూసిన వెంటనే, మదసామికి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కొద్దిసేపటి తర్వాత అతను ‘‘రక్కూ విను, ఆ పొంగలి గొడ్ల కుడితి తొట్టిలో పడేసి రాగి సంగటి చెయ్. నేను వెళ్ళి ఎండి చేపలు తెస్తా. రాగి సంగటితో ఎండి చేపల కూర చాలా రుచిగా ఉంటుంది!’’ అంటూ లేచి ఎండి చేపలు తేవడానికి వెళ్ళిపోయాడు.
మదసామి మాటలు విన్న ఇసక్కిముత్తుకి పొంగలి తిన్నంత సంతోషంగా ఉంది. ఏం జరుగుతోందో అర్థం కాని రక్కమ్మ, పొయ్యి ముట్టించింది. ఇసక్కిముత్తు లేచి వెళ్ళి పొంగలిని కుడితి తొట్టిలో పడేశాడు. అదేమిటో అర్థం కాని గొడ్లు ఏదో కొత్త పదార్థమని, కుడితి నీరు మాత్రమే తాగి పొంగలి వదిలేసాయి.
