అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్‌ మందార

1985 జూన్‌ నాటికి మా ఐటీవీసీఎస్‌లో ఫుల్‌టైమర్ల సంఖ్య నాలుగుకు పెరిగింది. శంకరయ్య, బుగ్గయ్య, రాములు, నేను. మిగతా ముగ్గురికి సంఘం నెలకు రూ.450లు (వాటితో పాటు వాస్తవిక ప్రయాణ ఖర్చులు కూడా) చెల్లిస్తుండేది. నాకు నెలకు రూ.500ల ‘శృతి ఫెలోషిప్‌’ లభిస్తుండేది. శృతి అనేది 1983 నుంచి దిల్లీ కేంద్రంగా, లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ.

అది 25`35 సంవత్సరాల వయసున్న యువ కార్యకర్తలకు ఫెలోషిప్‌ ఇచ్చేది. నేను 1984`1998 మధ్య కాలంలో ఎప్పుడూ ఐటీవీసీఎస్‌ నుంచి గానీ, హెచ్‌బీటీ నుంచి గానీ డబ్బు తీసుకోలేదు. గుంగల్‌లో నా గది అద్దెను కూడా నేనే కట్టుకునేదాన్ని. మా సంఘం నెలసరి బడ్జెట్‌ రూ.2,000ల వరకు వుండేది. మేం ఎక్కువగా సైకిళ్ల మీదనో, కాలినడకనో తిరిగేవాళ్లం కాబట్టి మాకు ప్రయాణ ఖర్చులు లేవు. అలాగే ఆ గ్రామస్తులే మాకు అన్నం పెట్టే వాళ్లు కాబట్టి ఇతర ఖర్చులు కూడా ఏమీ వుండేవి కావు. 1988లో నేను అశోక ఫెలోషిప్‌కు ఎంపికయ్యాను. వాళ్లు నాకు 1988 నుంచి 1992 వరకు ప్రతి నెలా రూ.3000ల ఆకర్షణీయమైన మొత్తం అందించేవారు. స్వచ్ఛంద సంస్థల పరిభాషలో ‘సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ (సామాజిక సేవ)కు గాను ఆ ఫెలోషిప్‌ ఇచ్చేవారు.
పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. వేతనాలు పెరుగుతున్నాయి. ఆ అద్భుతమైన ఉద్యమంలో నేనూ ఒక భాగాన్ని. కానీ నా చేతుల్లో ఏమీ వుండేది కాదు. నేనొక ప్రతీకను, అంతే. జనం నన్ను ఒక సాధనంగా చూసేవారు. అలా చూడటమే నాకు ఆ తరువాత మేలయింది. నిర్ణయాధికారం నాకు ఇవ్వలేదు. అందువల్ల నేను నియంత్రించాల్సిన పనిలేదు. ఆ తరువాత రోజుల్లో నాకు ఆ భారం లేకుండా అయింది. మా కార్యక్రమాలను కొద్ది మంది ముఖ్యులు కూర్చుని రూపొందించేవారు కాదు. అన్ని నిర్ణయాలూ భారీస్థాయి గ్రామ సమావేశాల్లోనే తీసుకునేవారు. ఆ సమావేశాల్లో పేద జనమంతా పాల్గొనేవారు. తీవ్రస్థాయిలో వాదోపవాదాలూ, పోట్లాటలూ జరిగేవి. కొన్ని సమావేశాలు గంటల తరబడి కొనసాగేవి. సంబంధం లేని విషయాల గురించి కూడా చర్చలు జరుగుతుండేవి. కానీ, చివరికి విచిత్రంగా ఏ గందరగోళానికీ తావులేకుండా ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకునేవారు. అలా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామిని అయ్యేందుకు నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది. అప్పటివరకూ స్థానిక నాయకులు నన్ను ఆ సమావేశాల్లో మాట్లాడకుండా కూర్చోమనేవారు.
నేను అక్కడ వున్న కాలంలో నా పట్ల గ్రామస్తుల స్పందన ఎప్పుడూ బాధించలేదు. వాళ్లకి నేనంటే ఇష్టం. నాకు వాళ్లంటే ఇష్టం. భోజనం కోసం ఖర్చుపెట్టాల్సిన అవసరం నాకు ఏనాడూ రాలేదు. ప్రతి మాదిగ కుటుంబం నన్ను భోజనానికి రమ్మని పిలిచేది. కొన్ని సంవత్సరాలలో అక్కడ నేనొక ‘లీడర్‌’ని అయ్యాను. కొందరు మాదిగ నాయకులు ముఖ్యంగా మంచాల్‌కు చెందిన మంత్రి రాములు నేను నాయకురాలిలాగా, ఇందిరా గాంధీలాగా కనిపించేందుకు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పేవారు. కానీ, అలాంటి వాటికి నేను ఎప్పుడూ దూరంగానే వున్నాను. మొదట్లో సల్వార్‌ కమీజులనే వేసుకునేదాన్ని. పొడవాటి జడ, నుదుటి మీద చిన్న బొట్టు వుండేవి. ఎలాంటి నగలూ ధరించేదాన్ని కాదు. తహశీల్దారు, పోలీస్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ వంటి ఉన్నతాధికార్లతో నేను ఇంగ్లీష్‌లో సాధికారికంగా మాట్లాడటాన్ని జనం గమనిస్తుండేవారు. వాళ్లకంటే నేను భిన్నంగా ఏమీ లేను. నేనేదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చానని భావించేవారు. నేను వారిపట్ల సానుభూతిగా వుండటాన్ని, ప్రత్యేకించి మహిళలూ పిల్లల పట్ల ఆత్మీయంగా వుండటాన్ని వాళ్లు గుర్తించారు. వాళ్లతో పాటు నేలమీదే కూర్చునేదాన్ని తప్ప ఎప్పుడూ కుర్చీ మీద కూర్చునేదాన్ని కాదు. వాళ్ల ప్లేట్లలో లేని ఆహార పదార్థాలని ఎప్పుడూ తినేదాన్ని కాదు. చాలా విషయాల్లో వాళ్ల సలహాలనే పాటించేదాన్ని. ఎక్కువగా వాళ్లు చెప్పేది వినేదాన్ని, తెలియనివాటి గురించి అడుగుతుండేదాన్ని. వాళ్లు నన్ను తమ అక్కున చేర్చుకున్నారు. భారతదేశంలో స్త్రీని ఒక తల్లి లాగానూ, శృంగార దేవతలాగానూ రెండు రకాలుగా విభజించి చూస్తారు. క్రమ క్రమంగా నన్ను వాళ్లు ఒక తల్లి పాత్రలో చూడసాగారు.
మొదట్లో నేను మౌనంగా, ఒక వెనకుండి పనిచేసే వ్యక్తిగా వుంటూ వచ్చాను. ఉద్యమం చాలా విస్తరించింది. అనేక కొత్త గ్రామాలలో వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టం కింద పిటిషన్లను వేశారు. ఈ లోగా మేం కూడా వెట్టి కార్మికులను ఎంఆర్‌ఓ విముక్తుల్ని చేసేవరకూ ఎదురు చూస్తూ కూర్చోకుండా తమంతట తాముగా వెట్టి పనులను ఆపేలా ప్రోత్సహించాం. దాంతో భూస్వాములు రెచ్చిపోయి తమ దగ్గర తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వమంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. వెట్టి కార్మికులు కూడా చట్టంలో ఏముందో పేర్కొంటూ మేం మీ దగ్గర పనిచేయడానికి రామనీ, పాత బాకీలు కట్టబోమనీ పట్టుదలగా నిలబడ్డారు. కాకపోతే వాళ్లకి బయట సరిగా పని దొరికేది కాదు. కష్టపడి పనిచేసే భార్యల సహకారంతో వాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చారు. చాలామంది పని వెతుక్కుంటూ పొరుగు ఊళ్లకు వెళ్లాల్సివచ్చింది.
ఆ మధ్య కాలంలో మేం మండల స్థాయిలో, జిల్లా కలక్టర్‌ స్థాయిలో అనేక సమావేశాలనూ, ప్రదర్శనలనూ నిర్వహిస్తూ వచ్చాం. ఎంఆర్‌ఓలు ఒక్కో చోట ఒక్కో రకంగా స్పందించేవారు. చాలామందికి వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం గురించే సరిగా తెలియదు. అందువల్ల నేను వాటి ప్రింటవుట్లు తీసుకెళ్లి ఆయా ఎంఆర్‌ఓలకు అందజేసేదాన్ని. వాళ్లు తమకు ప్రభుత్వం ఇచ్చిన చట్టం ప్రతుల్లో ఏముందో వాటినే అమలు చేస్తాం అనేవారు. మరికొందరు ఆ కూలీలకు నెలనెలా వేతనాలు ఇస్తున్నారు కాబట్టి అసలు వాళ్లు వెట్టి చాకిరీ కార్మికుల కిందకే రారని వాదించేవారు. ఒక ఎంఆర్‌ఓ అయితే ఓ గ్రామానికి వెళ్లి పనిని బాయ్‌కాట్‌ చేసేవాళ్లని అరెస్టు చేయడానికి కూడా వెనుకాడనంటూ బెదిరించేవరకూ వెళ్లాడు.
ఆ మొండి వైఖరిని గమనించిన తరువాత సమస్యను అంతకంటే పై అధికార్ల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. వెట్టి చాకిరీ కార్మికులు సమర్పించిన పిటిషన్లపై సంబంధిత అధికార్లు సత్వరమే విచారణ జరిపేలా ఆదేశించవలసిందిగా కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్‌ను ఫైల్‌ చేశాం. దాంతో ప్రభుత్వ యంత్రాంగంలో మళ్లీ కదలిక మొదలయింది. పత్రికావిలేఖర్లు కూడా ఆ సమయంలో వివిధ సంఘటనలకు విస్తృత ప్రాచుర్యం కల్పించి మాకు ఎంతో సహాయం చేశారు.
ఇదిలా కొనసాగుతుండగానే మేం వెట్టి చాకిరీ కార్మికులను చైతన్యపరచి తమకు పాత తేదీనుంచి వేతనాలు ఇప్పించమని కోరుతూ డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌కు దరఖాస్తులు సమర్పించేలా చేశాం. వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టం వెట్టి కార్మికులకు పునరావాసం కల్పిస్తూ వారిని వెట్టి నుంచి విముక్తి చేయాలని చెప్తుంది. కనీస వేతనాల చట్టం కార్మికులకు చెల్లించిన వేతనం కనీస వేతనాల కంటే తక్కువగా వున్నట్టయితే ఆ మొత్తాన్ని వారికి చెల్లించాలంటుంది. కొంతమంది ఎంఆర్‌ఓలు అంతకు ముందు వెట్టి కార్మికులను విముక్తుల్ని చేస్తూ జారీ చేసిన ఆదేశాలు ఆ వెట్టి కార్మికులకు అప్పటివరకు కనీస వేతనాల కంటే తక్కువ వేతనాలు చెల్లించినట్టు రుజువు చేసేందుకు సాక్ష్యాలుగా ఉపయోగపడ్డాయి. దానివల్ల పాత వేతన బకాయీలు చెల్లించాలన్న డిమాండ్‌కు మరింత బలంవచ్చింది. ఊళ్లలోని భూస్వాముల ఇళ్లలో, ఇంటి దొడ్లలో నామ మాత్రపు కూలిడబ్బులకు చాకిరీ చేసే మహిళలకు కూడా మొదటినుంచీ న్యాయమైన వేతనాలు చెల్లించాలంటూ రికవరీ పిటిషన్లు సమర్పించేలా చైతన్యపరిచాం. వాళ్లకు వాస్తవంగా ఇచ్చిన కూలీ` వాళ్లు పనిచేసిన గంటల ప్రాతిపదికన వాళ్లకు రావలసిన వేతన బకాయీలను లెక్కగట్టాం. చట్టం ప్రకారం తన వద్ద పనిచేసేవారికి కనీస వేతనాలు చెల్లించినట్టు, అందుకు తగిన రిజిష్టర్లను నిర్వహించినట్టు రుజువు చేసుకునే బాధ్యత యజమాని మీదనే వుంటుంది. అలాంటి రికార్డులు లేదా వేతన రశీదులు అతను సమర్పించకపోతే తాను కనీస వేతనాల చట్టంలో పేర్కొన్న వేతనాల కంటే తక్కువ వేతనాలు చెల్లించినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడతను ఆరు నుంచి పన్నెండు నెలల వేతన బకాయీలను ఆ పనివాళ్లకి చెల్లించాల్సి వుంటుంది. ఈ విషయం స్పష్టమవడంతో అనేకమంది భూస్వాములు రాజీ బేరానికి వచ్చారు.
మా సంఘాన్ని ట్రేడ్‌ యూనియన్‌ చట్టం కింద రిజిస్టర్‌ చేయడం వల్ల లాయర్‌ మధ్యవర్తిత్వం లేకుండానే బాధిత కార్మికుడి ద్వారా లేదా సంఘం ద్వారా కేసును ఫైల్‌ చేసేందుకు వీలుకలిగింది. పట్టణప్రాంత ట్రేడ్‌ యూనియన్లు అన్నీ ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటుంటాయి. సంఘటిత ట్రేడ్‌ యూనియన్లు కార్మికులకు వారి హక్కులను ఇప్పించేందుకు ప్రయత్నించే క్రమంలో కార్మిక న్యాయస్థానాలను తులనాత్మకంగా జనానికి స్నేహపూర్వకంగా మార్చివేశాయి. కార్మిక న్యాయస్థానాల్లో కార్మికులూ, యజమానులూ కూర్చునేందుకు ఒకేరకమైన బెంచీలను ఏర్పాటు చేశారు. కార్మికులకూ, వారి ప్రతినిధులకూ ఆ కార్యాలయం పప్పుడూ తెరిచే వుంటుంది. ఆ సిబ్బంది కూడా కార్మికులపట్ల సుహృద్భావంగా వుంటారు. అక్కడ ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుందో లేదో నాకు తెలియదు.
కార్మిక న్యాయస్థానంలో మా కార్యకలాపాలు మొదట హైదరాబాద్‌లోనూ, ఆ తరువాత ఇబ్రహీంపట్నంలోనూ జోరుగా సాగాయి. సంఘం ప్రధాన కార్యదర్శిగా నాకు వాటిలో పాల్గొనే, కార్మికుల తరఫున న్యాయవాదిగా వ్యవహరించే అధికారం వుండేది. భూస్వాముల తరఫున సత్యవీరా రెడ్డి అనే ప్రఖ్యాత న్యాయవాది వాదించేవారు. కార్మిక న్యాయస్థానంలో వున్న బెంచీలన్నీ మా జనంతోనే నిండిపోయేవి. కూలీల పక్కన కూర్చునేందుకు భూస్వాములు ఇష్టపడకపోయేవారు. అందువల్ల గంటల తరబడి అయినా సరే కోర్టులో అలాగే నిలుచుండేవారు. భూస్వాముల తరఫు న్యాయవాదికి మా లాగా ప్రతి వాయిదాకు హాజరయ్యేందుకు వీలయ్యేది కాదు. ఆయనకు ఎక్కువ ఆదాయం వచ్చే ఇతర సివిల్‌, క్రిమినల్‌ కేసుల పని వుండేది. కూలీలు సులభంగా పాల్గొనేందుకు వీలుగా విచారణను ఇబ్రహీంపట్నం ఇన్స్‌పెక్షన్‌ బంగళాలో నిర్వహించాలని మేము సకాలంలో కోర్టువారిని అభ్యర్థించాం. అందుకు వారు అంగీకరించారు. ఇబ్రహీంపట్నంలో జరిగే కోర్టు విచారణకు వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వచ్చేవారు. దాంతో భూస్వాములు తమను హేళనచేసే స్త్రీ పురుషుల మధ్యలోంచి రావలసి వచ్చేది.
కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ఆ కూలీలు తమ దగ్గర పనిచేయలేదని రుజువు చేసేందుకు భూస్వాములు చాలాసార్లు ప్రయత్నించారు. మేం దానిని గట్టిగా ప్రతిఘటించాం. మీ దగ్గర ఎంత భూమి వుంది? అందులో ఎంత మంది కూలీలు పని చేస్తున్నారు? చట్టం ప్రకారం నిర్వహించాల్సిన ఆ కూలీల రిజిష్టర్‌ ఏదీ చూపించండి అంటూ నిలదీశాం. భూస్వాములు అంత భూమిని ఎలా సాగు చేస్తున్నారో, ఎంతమంది కూలీలు తమ దగ్గర పని చేస్తున్నారో చెప్పలేకపోయారు. కూలీల రిజిష్టర్‌ను చూపించలేకపోయారు. నాకు కోర్టు విచారణా పద్ధతులు సరిగా తెలియదు కాబట్టి స్వేచ్ఛగా వ్యవహరించేదాన్ని. నా ప్రశ్నలు భూస్వాముల న్యాయవాదులకు చికాకు, కోపం తెప్పించేవి. అయితే విచారణను నిర్వహించే డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రెడ్డి సౌమ్యులు. మా పట్ల కొంత సానుభూతి వున్నట్టు అనిపించేది. ఆయన మాకు ఏవైనా సూచనలు చేసేవారు తప్ప మందలించేవారు కాదు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరుగుతున్నప్పుడు నేను మరింత దూకుడుగా వ్యవహరించేదాన్ని. నిర్దిష్టమైన ప్రశ్నలతో భూస్వాముల్ని గందరగోళపరిచేదాన్ని.
ఎవిడెన్స్‌ చట్టం ప్రకారం పార్టీ తరపున ప్రవేశపెట్టబడ్డ సాక్షిని ప్రధాన విచారణాధికారి (ఎగ్జామినేషన్‌ ఇన్‌ చీఫ్‌) విచారిస్తారు (ఎగ్జామినేషన్‌), ఆ సాక్షిని ప్రత్యర్థి పక్షంవారు విచారించడాన్ని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అంటారు. తమను విచారిస్తున్నప్పుడు కూలీల మాటతీరు, ప్రవర్తనా సభ్యతగా వుండేవి కాదు. వాళ్లు మాటమాటకీ ‘దెంగడం’ అన్న పదాన్ని రకరకాలుగా, యధేచ్ఛగా వాడేస్తుండేవారు. ఆ మాటకి భూస్వామి తరఫు న్యాయవాది నిశ్చేష్టితుడయ్యేవాడు. న్యాయమూర్తి మధుసూదన్‌రెడ్డి సాక్షిని మందలించేవారు. అయినా సరే బాగా అలవాటైపోయినందువల్ల ఆ మాట వారి నోటి నుంచి పదేపదే వస్తుండేది. దాంతో ఇంక అందరూ పట్టించుకోవడం మానేశారు.
మా సాక్షులు ఆ భూస్వాముల వద్ద పనిచేసినట్టు తిరుగులేని రుజువులు చూపడంతో` భూస్వాముల బుకాయింపులు మోసపూరితమని అందరికీ అర్థమైపోయింది. రెడ్డి కులానికి చెందిన న్యాయవాదులకు అంతకు ముందెన్నడూ అటువంటి ముక్కుసూటి మాదిగలను ఎదుర్కోవలసిన పరిస్థితి రాలేదు. కొన్ని వాయిదాల అనంతరం ఈ నియంత్రణలేని అనాగరికులతో తాము వాదించలేమంటూ వారు భూస్వాముల తరఫు వకాలతు నుంచి తప్పుకున్నారు. తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి వాదించేందుకు వేరే లాయర్లెవరూ ముందుకు రాలేదు. దాంతో చాలామంది భూస్వాములు రాజీ బేరానికి రావడం మొదలయింది. కోర్టు వెలుపలి పరిష్కారానికి అంగీకరించని మిగతా కేసులన్నింటిలో కూడా తీర్పులు మాకే అనుకూలంగా వచ్చాయి. మొత్తం మీద అన్ని కేసుల్లోనూ విజయం మాకే లభించింది. మా వాళ్లకు వేలాది రూపాయల లబ్ధి చేకూరింది. ఆ తర్వాత పొలాల్లో, బావుల వద్దా పనిచేస్తూ పాము కాటుకు గురైన, భవనాలను నిర్మిస్తుండగా ప్రమాదాలకు గురైన వారి తరఫున వర్క్‌మెన్స్‌ కాంపెన్‌సేషన్‌ చట్టం కింద కేసులు ఫైల్‌ చేసి వాటిలో కూడా విజయం సాధించాం. 1923నాటి ఈ పనివారి నష్టపరిహార చట్టం కేసులను పరిష్కరించడంలో కార్మిక న్యాయస్థానం (లేబర్‌ కోర్టు) అద్భుతంగా పనిచేసింది.
వివిధ సంస్థలనూ, దుకాణాలనూ, ఇతర పని ప్రదేశాలనూ తరచూ తనిఖీ చేస్తూ అక్కడ పనిచేస్తున్న వారికి కనీస వేతనాలూ, సౌకర్యాలూ ఎలా వున్నాయో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం లేబర్‌ ఆఫీసర్ల ప్రధాన కర్తవ్యం. వారి చేత ఆ పని చేయించేందుకు మేము విశేషంగా కృషి చేశాం. ప్రతి అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ పరిధిలో మూడు మండలాలు వుంటాయి. కానీ వారికి సిబ్బందీ, స్టేషనరీ, రవాణా ఏర్పాట్లేమీ వుండేవికావు. చాలామంది లేబర్‌ ఆఫీసర్లు షాపుల వాళ్లు నెలనెలా ఇచ్చే ముడుపులు తీసుకుంటూ స్తబ్దుగా వుంటారు. కానీ కొంతమంది మాత్రం చురుకుగా వుండేవారు. మేము అలాంటి వారిచేత కనీస వేతనాల చట్టం కింద కేసులు ఫైలు చేయించేందుకు కృషి చేశాం. వారికి కావలసిన స్టేషనరీ, ప్రయాణ సదుపాయాలను మేమే కల్పించాం.
ఈనాటి ప్రమాణాలతో పరిశీలిస్తే మేం సాధించింది చాలా స్వల్పమేనని మీకు అనిపించవచ్చు. కానీ మాకు మాత్రం మా చుట్టూ వున్న ప్రపంచంలో మార్పు వస్తుందనడానికి ఇవి మంచి సంకేతాలు. 1985 జూన్‌ నుంచి మేం సాధించిన వాటి ఫలితాలు సంక్షిప్తంగా:
కార్మిక శాఖ ద్వారా వసూలైన వేతన బకాయీలు : రూ.17,880
-రద్దు చేయబడిన వెట్టి పనివారి రుణాలు : రూ.61,220
`ప్రభుత్వం విముక్తి చేసిన వెట్టి పనివారికి ఒక్కొక్కరికి రూ.500/`చొప్పున ఇచ్చిన నష్టపరిహారం మొత్తం : రూ.20,700
` పునరావాసం కింద ఒక్కొక్కరికి రూ.4,000/` చొప్పున
ఇచ్చిన మొత్తం : రూ.3,00,000

జీతగాళ్లలో, వ్యవసాయ కూలీలలో ఎక్కువ మంది మాదిగలే కావడం వల్ల ఇతర కింది కులాల మద్దతు అంతగా వుండేది కాదు. మేము భూస్వాములపై సాగిస్తున్న పోరాటాన్ని మెచ్చుకోలుగా చూసేవారు. భూస్వాములకు వ్యతిరేకంగా చేస్తున్న ఆ పోరాటంలో చివరికి ఎవరు గెలుస్తారు ` సంఘం మద్దతిస్తున్న మాదిగలా లేక రెడ్లా అని వాళ్లు ఆసక్తిగా గమనించేవారు.
మేము కేవలం సంక్షేమ చర్యలతో ఆగిపోకుండా, వెట్టి చాకిరీ కార్మికులను నియమించుకున్న భూస్వాములను చట్టం ప్రకారం ప్రాసిక్యూట్‌ చేయాలని రెవెన్యూ అధికార్లకూ, పోలీసులకూ పిటిషన్లు సమర్పించాం. అదేసమయంలో యాచారం, ఆ చుట్టుపక్కల గ్రామాల భూస్వాములు వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టంలోని సెక్షన్‌ 12ను సవాలు చేస్తూ 1985లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ను ఫైల్‌ చేశారు. ఆ సెక్షన్‌ వెట్టి చాకిరీ కార్మికులను కలిగివున్న భూస్వాములను ప్రాసిక్యూట్‌ చేయడానికి ఉద్దేశించినది. జస్టిస్‌ సర్దార్‌ అలీ ఖాన్‌ ఆ చట్టం కింద తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మేమా ఉత్తర్వులను తదనంతరం రద్దు చేయించాం. అదే సంవత్సరం జులై 25న ఇబ్రహీంపట్నం తాలూకా పంచాయితీ సమితి వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టం అమలు వల్ల జరుగుతున్న నష్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటీవీసీఎస్‌)ను దృష్టిలో పెట్టుకుని కొన్ని తీవ్రవాద శక్తులు రైతులనూ, కూలీలనూ విడదేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. వెట్టి చాకిరీ కార్మికుల వ్యవహారాన్ని ప్రభుత్వం గనక సమీక్షించకపోతే ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతింటుందనీ, ఇప్పటికే వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు లభించడం కష్టంగా వుందనీ ఆ తీర్మానం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పంచాయితీ సమితి అధ్యక్షుడు యాదగిరి రెడ్డి అయితే ఈ కేసుల్లో 90శాతం బోగస్‌వేనన్నాడు. యాదగిరి రెడ్డి నాయకత్వంలో భూస్వాములూ, జిల్లా మంత్రీ చిరిగిన దుస్తులు ధరించి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు వద్దకు వెళ్లి మా పని తీరుపై ఫిర్యాదు చేశారు. మామీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇక వ్యవసాయ పనులు చేయలేమని వాపోయారు. ఆ వార్తకు పత్రికల్లో విశేష ప్రాచుర్యం లభించింది. ఎన్‌.టి.ఆర్‌ హయాంలో ప్రభుత్వ పనితీరునూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పనితీరునూ సమీక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక మంత్రిని పర్యవేక్షకుడిగా నియమించారు. 1986లో ఈ జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రి పి.ఇంద్రా రెడ్డి చెర్లపటేల్‌గూడెంకు వచ్చారు. ఇంద్రా రెడ్డి 1973`1975 మధ్య పీడీఎస్‌యూలో చాలా చురుకుగా పనిచేసేవారు. అత్యవసర పరిస్థితి సమయంలో జైలుకు కూడా వెళ్లారు. ఆయన ఇక్కడి కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీది డ్రై ఏరియా కాబట్టి కనీస వేతనాలను అడగడానికి వీల్లేదు, కనీస వేతనాలనేవి కేవలం సాగునీటి సౌకర్యం వున్న ప్రాంతాలకే వర్తిస్తాయి’’ అని సెలవిచ్చారు.
ఇలాంటి మూర్ఖత్వం మధ్యనా నేను ఎప్పుడో ఒకసారి హైదరాబాద్‌కు వెళ్లివస్తూ నా సమయాన్నంతా వెచ్చించింది అనిపించింది. 1985లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు జరిగిన ఓ సంఘటన నా జీవితం మీద కొన్ని దశాబ్దాలపాటు తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. స్త్రీ శక్తి సంఘటన అనే స్త్రీవాద సంస్థ హైదరాబాద్‌లో 1970 చివర్లో ప్రారంభించబడి 1980ల చివరి వరకూ పనిచేసింది. ఆ తరువాత అది రెండు వేరు వేరు స్వచ్ఛంద సంస్థలుగా విడిపోయింది. ఒకటి ‘అన్వేషి రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్స్‌ స్టడీస్‌’ కాగా రెండవది ‘అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌’. నా ఆత్మీయ మిత్రుల్లో ఒకరైన లలితతో సహా ఆ రెండు సంస్థల్లో చాలామంది నాకు పరిచయస్తులే. లలిత నాకు యునివర్సిటీ రోజుల నుంచీ తెలుసు. ఆమే, నేనూ, సిరిల్‌ ముగ్గురం అత్యవసర పరిస్థితి సమయంలో కలిసివున్నాం. 1980లో ఘాజియాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసిన తరువాత కూడా మేం కలిసే వున్నాం. నాకు వాళ్ల రాజకీయాలతో ఏకీభావమూ, సంస్థ సభ్యుల్లో చాలామందితో సన్నిహిత పరిచయాలూ వున్నప్పటికీ ఆ ఫెమినిస్ట్‌ గ్రూపుతో రెండు కారణాల వల్ల అంటీముట్టనట్టుగా వుండేదాన్ని. ఒకటి నాకు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పని ఒత్తిడి ఎక్కువగా వుండటంÑ రెండు ఆ బృందంలో చర్చలన్నీ ఇంగ్లిషులోనే సాగాలన్న నియమం వుండటం… వాళ్లు కేవలం చదువుకున్న మహిళల సమస్యల మీదనే స్పందించడం. అయినా కూడా వారితో నా సంబంధాలు సుహృద్భావంగానే వుండేవి. 1984`1985లో స్త్రీల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ‘అవర్‌ బాడీస్‌ అవర్‌సెల్స్‌’ అన్న పుస్తకం తెలుగు అనువాదం ‘సవాలక్ష సందేహాలు’ ప్రచురణ సమయంలో వాళ్లూ నేనూ కలసి పనిచేశాం.
1985 సెప్టెంబర్‌లో లలిత నాకు ఫోన్‌ చేసి ‘రెండు విషయాలపై సిరిల్‌ వివరణ కావాలి, అందుకోసం మీ ఇంటికి వస్తున్నాను’ అని చెప్పింది. కానీ ఆరోజు ఒక్క విషయం మీద మాత్రమే చర్చ జరిగింది. స్త్రీ శక్తి సంఘటన ప్రచురిస్తున్న ‘వుయ్‌ వర్‌ మేకింగ్‌ హిస్టరీ: వుమెన్‌ అండ్‌ ది తెలంగాణా అప్‌రైజింగ్‌’ పుస్తకం తెలుగు అనువాదానికి (మనకు తెలియని మన చరిత్ర) ప్రముఖ స్త్రీవాద మార్క్సిస్ట్‌ రచయిత్రి రంగనాయకమ్మతో వాళ్లు ముందుమాట రాయించాలనుకున్నారు. అయితే ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌బిటి) గనక ప్రచురిస్తున్నట్టయితే తను రాయనని ఆమె అన్నారు. సిరిల్‌ అధ్వర్యంలోని జార్జి రెడ్డి బుక్‌ ట్రస్ట్‌ (జీఆర్‌బీటీ) మీద ఆమెకున్న కోపమే అందుకు కారణం. అంతకుముందు ఫ్రాన్స్‌ న్యూ లెఫ్ట్‌ వారి చార్లెస్‌ బెటిల్‌హామ్‌ రచన ‘చైనా సిన్స్‌ మావో’ పుస్తకాన్ని రంగనాయకమ్మ తెలుగులోకి (చైనాలో ఏం జరుగుతోంది) అనువదించారు. దానిని జీఆర్‌బీటీ ప్రచురించింది. రచయితలకు ఆరు కాపీలను ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. కాగా వాటిలో కొన్నింటిని విదేశాలలోని కొందరికి పంపించమని ఆమె సూచించారు. జార్జి రెడ్డి బుక్‌ ట్రస్ట్‌ బొటాబొటి బడ్జెట్‌తో నడుస్తున్న సంస్థ కాబట్టి పోస్టల్‌ ఖర్చులు మీరు భరిస్తేనే ఆ కాపీలను విదేశాలకు పంపగలమని సిరిల్‌ చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. సిరిల్‌ ఆ కాపీలను విదేశాలకు పంపించలేదు. ఆనాటి నుంచీ రంగనాయకమ్మకూ జార్జి రెడ్డి బుక్‌ ట్రస్ట్‌కూ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రంగనాయకమ్మ ఉద్దేశంలో నా నిర్వహణలో నడుస్తున్న హెచ్‌బీటీ, సిరిల్‌ నిర్వహణలో వున్న జీఆర్‌బీటీ రెండూ ఒక్కటే. అందుకే ఆమె ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకానికి ముందుమాట రాయనన్నారు. ఆ పాత గొడవలు ఇప్పుడు వారికొక సమస్యగా మారాయి. అందుకే దానిపై సిరిల్‌ వివరణను అడుగుతున్నారు.
మీరు దాని గురించి ఇప్పుడు వివరణ అడగకూడదు… అడిగినా సిరిల్‌ జవాబివ్వడు అని లలితకు చెప్పాను. అయినా సరే నేనైతే మీ ఇంటికి వస్తున్నాను అందామె. సిరిల్‌తో పాటు నేను కూడా ఇంట్లోనే వున్నాను. ఆ ఉదయం చింతలపూడి స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఇనంపూడి రాంబాబుతో మేం చర్చిస్తున్నాం. కోస్తా ఆంధ్ర సెట్లర్స్‌ నుంచి తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోరాడుతున్న ఆదివాసీల తరఫున రాంబాబు పనిచేస్తున్నారు. మరి కాసేపటికి లలిత మా ఇంటికి వచ్చింది. మొక్కుబడిగా నాలుగు మాటలు అవీ ఇవీ మాట్లాడిన తరువాత తను వచ్చిన పనిని ప్రస్తావిస్తూ సిరిల్‌ను ఆనాడు జరిగిన దాని గురించి వివరణ అడిగింది. సిరిల్‌ చెప్పిన సమాధానంతో ఆమె సంతృప్తిపడలేదు. పైగా సిరిల్‌ను ‘నువ్వేం మార్క్సిస్టువి?’ అంది. ‘నేను మార్క్సిస్టునని ఎక్కడా చెప్పుకోలేదు’ అన్నాడు సిరిల్‌. ఇద్దరి మధ్య వాడిగా మాటలు దొర్లాయి. లలిత చాలా ఆవేశంతో గొంతు పెంచి ‘నువ్వు నాకు జవాబు ఇవ్వాల్సిందే’ అంది. ‘నాకు ఇట్లాగే ఉపన్యాసాలిస్తానంటే ఇంట్లోంచి బయటికి వెళ్లు’ అన్నాడు సిరిల్‌. ‘ఇది గీతా ఇల్లు. నువ్వే బయటికి నడువ్‌’ అంటూ నా వైపునకు తిరిగి ‘ఇలాంటి జంతువుతో ఎలా కలిసివుంటున్నావు. ఇతణ్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి’ అంది. అంతే! సిరిల్‌ ఆమె హ్యాండ్‌ బాగ్‌ని ఆమె మీదకు విసిరేశాడు. లలిత అతణ్ని ‘బాస్టర్డ్‌’ అంటూ తిట్టింది. అందుకు ప్రతిగా అతను కూడా ఆమెను లంజా అన్నాడు. మేం కుర్చీల్లోంచి లేచి నిలబడ్డాం. రాంబాబూ, నేనూ సిరిల్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించాం. లలిత లేచి నిలబడి అతన్ని తిడుతూనే వుంది. సిరిల్‌ ఆమె మీదకు ఒక చెప్పును విసిరాడు. వాళ్లు పరస్పరం తిట్టుకుంటూండగానే సిరిల్‌ ఆమెను కాలుతో తన్నాడు.
రాంబాబు సిరిల్‌ని పక్క గదిలోకి లాక్కెళ్లాడు. నేను లలితను మరో గదిలోకి తీసుకెళ్లాను. మేమిద్దరం ఆ గదిలో దాదాపు ఇరవై నిమిషాలపాటు కూర్చున్నాం. ఆమెను ఓదార్చేందుకు నేను ప్రయత్నించాను. సిరిల్‌ విసిరిన వాటివల్ల దెబ్బలేమైనా తగిలాయా అని అడిగాను. లేదు అంది. సాయంత్రం పొద్దుపోయిన తరువాత కలుసుకుందాం అని పరస్పరం మాటిచ్చుకున్నాం. ఆ తర్వాత ఆమె వెళ్లిపోయింది.
మధ్యాహ్నం పూట మనసును తేలకపరచుకునేందుకు రాంబాబు, సిరిల్‌, నేనూ బయటికి వెళ్లాం. రాంబాబుకూ నాకూ వేరే పని వుండటం వల్ల సిరిల్‌ని ముందుగా ఇంటికి పంపించాం. సూర్యాస్తమయం అవుతున్న వేళకి సిరిల్‌ ఇంటికి చేరుకున్నాడు. మా ఇంటి బయటి తలుపు దగ్గర లలిత, మరో పదిమంది స్త్రీ శక్తి సంఘటన సభ్యులు కూర్చుని వున్నారట. సిరిల్‌ వాళ్లని లోపలికి రండి అని తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లాడు. వాళ్లు లోపల అడుగుపెడుతూనే మూకుమ్మడిగా సిరిల్‌ మీద దాడి చేశారు. కారం కలిపిన నీళ్లను సిరిల్‌ కళ్లల్లో చల్లారు. ఆ వెంటనే కర్రలతో, చీపురు కట్టలతో కొట్టారు. ఇంట్లోని బల్బుల్ని పగులగొట్టారు, ఆ గాజుముక్కలు అతడిని మరింత గాయపరిచాయి. ఇది జరుగుతున్నప్పుడే మేం ఇంటికి చేరుకున్నాం. స్త్రీ శక్తి సంఘటనకు చెందిన ఆ గుంపులో వసంత అనే ఆమె నా వైపు తిరిగి ‘ఇదిగో గీతా నీకోసం మరో దెబ్బ’ అంటూ సిరిల్‌ని కర్రతో బాదింది. వెళ్లిపోతూ వెళ్లిపోతూ వాళ్లంతా మా మోపెడ్‌ మీద విరుచుకుపడ్డారు. దాని హాండిల్‌ బార్‌ను విరగ్గొట్టారు, సీటుని కోసేశారు. అది నన్ను మరింత బాధించింది. వాళ్లలో చాలా మంది మంచి జీతభత్యాలు లభించే ఉద్యోగాలు చేస్తున్నవారు. సంపన్న భర్తలున్నవారు. సిరిల్‌ నేనూ ఆ మోపెడ్‌ మీదనే తిరిగేవాళ్లం. మేం కష్టపడి సంపాదించిన 4000 రూపాయలు పెట్టి కొన్న మోపెడ్‌ అది. ఆ రోజుల్లో అది మాకు చాలా పెద్ద మొత్తం.
వారం రోజులలో ఈ సంఘటన వక్రీకరించబడి సిరిల్‌ నన్ను కొట్టినట్టు… స్త్రీ శక్తి సంఘటన (ఎస్‌ఎస్‌ఎస్‌) వాళ్లు నన్నేదో ‘రక్షించినటు’్ట … ఒక అబద్ధపు వార్తగా ప్రచారం అయిపోయింది. ఆతరువాత కొన్నాళ్లకి మా ఉభయులకూ స్నేహితులైన కంచ ఐలయ్య, నరేంద్రనాథ్‌లు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో సలహా సభ్యుడు, న్యాయవాది మనోహర్‌ కూడా పాల్గొన్నాడు. వాళ్లు ఒక రాజీ ప్రతిపాదనను రూపొందించారు. ఆ తర్వాత ఐలయ్య, నరేన్‌లతో కలసి మొత్తం పదిమంది సభ్యులు ముందుగా అనుకున్న సమయానికి మా ఇంటికి వచ్చారు. అందరూ ఒక బెంచి మీద కూర్చున్నారు. ‘జరిగిన దానికి మేం చింతిస్తున్నాం’ అన్నారు. సిరిల్‌ కూడా ‘చేసిన దానికి నేనూ చింతిస్తున్నాను’ అన్నాడు. వాళ్లు చెప్పింది అంతే. ఆ వెనువెంటనే అందరూ వెళ్లిపోయారు. వాళ్లు కూర్చున్న గదిలోకి నేను వెళ్లలేదు. మరో గది తలుపు దగ్గర నిలబడ్డాను. ఆ గొడవలో నేను భాగం కాకూడదనుకున్నాను. లలిత నా సన్నిహిత మిత్రురాలు. కానీ ఆ సాయంత్రం తర్వాత మాత్రం కాదు. ఆమె నా భర్త మీద దాడి చేయడానికి, నా ఇంటిని ధ్వంసం చేయడానికి ఒక గుంపును వెంటబెట్టుకుని వచ్చింది. నా సొంత స్నేహితులే నా ఇంటికి వచ్చి ముందస్తు హెచ్చరికలేమీ లేకుండానే చెప్పుకోడానికి వీల్లేని పనులు చేశారు.
1985 నుంచి ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా రాజకీయంగా స్త్రీవాదులలో వస్తున్న మార్పులవల్ల మా చిరకాల మిత్రులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఎక్కువమంది స్త్రీ వాదులు లలితనే సమర్థించారు. సిరిల్‌ని ఒక విలన్‌లా, రాయి పట్టుకుని తిరిగే ఓ పిచ్చివాడిగా, నన్నో పనికిమాలిన దానిలా చిత్రించారు. మా పాత కామ్రేడ్లలో చాలామంది స్వచ్ఛంద సంస్థల్లో చేరారు. వారిలో చాలామందిని సంపన్నుడైన లలిత భర్త విఠల్‌ రాజన్‌ ప్రోత్సహించారు. ఎవరైనా దూర ప్రాంత మిత్రులు నగరానికి వచ్చినప్పుడు ఏర్పాటు చేసే సభలకు మమ్మల్ని పిలిచేవాళ్లు కాదు. చివరికి పెళ్లిల్లకు కూడా ఆహ్వానించేవారు కాదు. ఒకే ఒక్క రోజులో నా మిత్రులు నాకు దూరమైపోయారు. ఆ బాధను గుంగల్‌లో జరిగిన ఒక సమావేశంలో సంఘం మిత్రులతో, కొంతమంది గ్రామీణులతో పంచుకున్నాను. అసలు వాళ్ల అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలన్నది నా ఉద్దేశం. ఆ సమావేశానికి నా స్నేహితురాలు శాంతా సిన్హా కూడా వచ్చింది. అందరూ నాకు సానుభూతిని తెలిపారు. దాంతో నాకు కొంత ఉపశమనం లభించింది. కొన్ని సంవత్సరాల తరువాత ఆ స్త్రీవాదుల భర్తలు కొందరు నన్ను కలుసుకుని తమ భార్యల తరఫున క్షమాపణలు చెప్పారు. అది నన్ను అయోమయానికి గురిచేసింది. భార్యలు చేసిన తప్పుకి భర్తలు ఎలా బాధ్యులవుతారు? వాళ్లసలు ఎందుకు నాకు క్షమాపణలు చెబుతున్నట్టు?
ఆ సంఘటన మా వైవాహిక జీవితంపై అనేక విధాలుగా ప్రభావం చూపింది. సిరిల్‌ దారుణమైన అవమానానికి గురయ్యాడు. మారణాయుధాలతో ఎంతమంది ఏబీవీపీ కార్యకర్తలు మీదికొచ్చినా వారిని కత్తి పట్టుకుని ఒంటరిగా ఎదురించిన అతను నా స్నేహితురాళ్లు దాడి చేసినప్పుడు చేతులను కట్టేసుకున్నాడు. ఐదు సెకన్లలో ఎదురుదాడి చేసి వాళ్లని చిత్తు చేయగలిగేవాడే కానీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆగిపోయాడు. నేను ఆ తదనంతరం వాళ్లలో ఎవరినైనా పనిమీద వెళ్లి కలిస్తే సిరిల్‌ బాధ పడేవాడు. ‘‘నేనేదో శత్రువునైనట్టు వాళ్లు అంత నిర్దాక్షిణ్యంగా నా మీద దాడి చేశారు, అయినా నువ్వు వెళ్లి వారిని కలుస్తున్నావు’’ అనేవాడు. 1993లో మా ఏకైక పుత్రిక పుట్టినప్పుడు ఆ మిత్రుల్లో ఇద్దరు నన్ను కలవడానికి ఇంటికి వస్తామని చెప్పారు. సిరిల్‌ అందుకు ఒప్పుకున్నాడు. కానీ
వాళ్లు వచ్చే సమయానికి తను ఇంట్లోంచి మౌనంగా బయటికి వెళ్లిపోయాడు. వాళ్లు ఎందుకలా చేశారా అని సిరిల్‌ చనిపోయేంత వరకూ మథనపడుతూనే వున్నాడు. ‘సారీ’ అన్న ఒక్క మాటవల్ల సిరిల్‌ పడ్డ బాధకు, అవమానానికి ఉపశమనం లభించలేదు.
సిరిల్‌ బతికున్నంత కాలం ఆ సంఘటన నాకు ఇప్పటంత బాధ కలిగించలేదు. ఎందుకంటే అది ప్రధానంగా అతనికి సంబంధించిన విషయం. నిజమే, అతనికి ముక్కుమీదే కోపం వుండేది, ఒకోసారి మూర్ఖంగా వ్యవహరించేవాడు. లలితతో అతను ప్రవర్తించిన తీరు నిస్సందేహంగా తప్పే. కానీ, వాళ్లు నా ఇంటి మీద దాడి చేయడానికీ, ఆతరువాత నన్ను దూరం పెట్టడానికీ నేనేం తప్పు చేశాను? నా ఫెమినిస్టు స్నేహితురాళ్లు నా ఇంటికి వచ్చి నా జీవిత భాగస్వామి మీద అలా ఎలా దాడి చేస్తారు? నా సొంత స్త్రీవాదం నా చనిపోయిన భర్త మీద ఎంతటి భారం మోపి వుంటుంది? నా మిత్రులది ఏరకం స్నేహం? కొన్ని గంటల వ్యవధిలోనే నన్ను వదిలేసిన వాళ్లు ఎలాంటి మనుషులు? నిజానికి నాకు నా సొంత కుటుంబం లేదు. వాళ్లే నా కుటుంబమని భావించాను. అలాంటిది నాకే వాళ్లిలా చేశారు. ఈ అంశం నన్నింకా ఉక్కిరి బిక్కిరి చేస్తూనే వుంది. నేను ఈ పుస్తక రచనను మొదలుపెట్టినప్పుడు వాళ్లలో ఇద్దరి దృష్టికి తీసుకెళ్లాను. వాళ్లు క్షమాపణలు చెప్పారు కానీ దీని గురించి చర్చించేందుకు మాత్రం నిరాకరించారు.
విస్తృతమైన మా స్నేహ బృందం ఆ సంఘటన గురించి మా వద్ద ప్రస్తావించలేదు. క్రమంగా అది మరుగున పడిపోయింది. దాని గురించి సిరిల్‌గానీ, నేనుగానీ మా మిత్రబృందానికి ఎప్పుడూ సవివరంగా చెప్పలేదు. వాళ్లకు తెలిసిందల్లా సిరిల్‌ అకారణంగా లలిత మీద చేయి చేసుకున్నాడనే. ఆ స్త్రీవాద సంస్థ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌తో కలసి పనిచేసే క్రమంలో 1998 నుంచీ నేను మళ్లీ వాళ్లని కలుస్తూనే వున్నాను. నేను ప్రసవానంతర మానసిక సమస్య నుంచి బయటపడేందుకు వీణా శతృఘ్న నాకెంతో సహాయం చేసింది. అప్పటి నుంచీ ఆమె నాకు సన్నిహిత మిత్రురాలయింది. నేనా ఉదంతాన్ని క్రమంగా మరచిపోయాను. కానీ 2016లో సిరిల్‌ చనిపోయిన తరువాత నాలో ఆ పాత గాయం మళ్లీ రేగినట్టయింది. గతం మరచిపోయి ముందుకు సాగు అని నా స్నేహితులు సూచించారు. ఈ పుస్తకం మొదటి చిత్తుప్రతిలో నేనా చేదు జ్ఞాపకం గురించి రాయలేదు. దాని గురించి మాట్లాడకూడదనే అనుకున్నాను. కానీ, ఈ పుస్తకంలో మా అక్కయ్యను ఆమె భర్త కొట్టడం గురించీ, నేను ఏ నక్సలైట్‌ గ్రూపుకు చెందిన దాన్నో ఆ గ్రూపు గురించీ (అందులో నా సన్నిహిత మిత్రులు కొందరు ఇప్పటికీ పనిచేస్తున్నారు) చర్చించగలిగినప్పుడు నా జీవితంపై దారుణ ప్రభావం చూపిన హైదరాబాద్‌ ఫెమినిస్టుల చరిత్రలో దాగిన ఈ భాగాన్ని ప్రస్తావించకుండా నేనెందుకు మరుగున పెట్టాలి?

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.