ఇప్పుడంటే..
దగ్గినా తుమ్మినా దావఖాండ్లు డాక్టర్లు
అంటండ్రు గానీ,
మా సిన్నప్పుడైతే ఆకుపసర్లు
ఆయుర్వేద మూలికలతోనే జబ్బులు
నయం అయ్యేవి.
అంతెందుకు..
లక్షలకు లక్షలు గుమ్మరించి
నిట్టనిలువునా పొట్టలు చీరించుకుంటే తప్పా
ఇప్పుడు కాన్పులు కావంటే నమ్మండి..
అప్పుడాపని
గాట్లు, కోతలు లేకనే
మా ఊరి మంత్రసాని మంగల్లచ్చవ్వ
చేతులమీంచి..
బల్లున ఉదయించేది పొద్దుపొడుపు
పురుడు పొయ్యడమంటే
మాటలుకాదు..
అది..
నెలలు నిండిన ఆడిబిడ్డ ఆపతి
ఆకాశమంత నొప్పి
సముద్రమంత దుఃఖం
సావు బతుకులతో చెలగాటం
ఎంబడిస్తున్న యముడిని తరిమికొట్టి
ఉమ్మనీటి పిండాన్ని ప్రాణాలతో
పట్టుకొచ్చే మంగల్లచ్చవ్వే
మాకు ధన్వంతరీ మాత.
ఇచ్చెంత్రం.. గాక మరేంది.!?
ఆమె ఏ వైద్య విద్య మరే గైనిక్ కోర్సు
అభ్యసించలేదు..
ఒడుపుగా అందిపుచ్చుకున్న వారసత్వ
పురిటి ఇద్దె..
అరశతాబ్దానికి ఆవలి మాట
నేనూ..
అమ్మ కడుపు లోంచి
నేరుగా ఆమె చేతుల్లోనే జారిపడ్డాను..
మొట్ట మొదట..
ఆమె ముచ్చెమటల మోమునే
దర్శించా..!
బొడ్డు పేగును కత్తిరించి
అమ్మకు దూరం చేసిందనుకున్నాను గానీ,
నన్ను నన్నుగా నిలబెట్టేందుకే
ఆ తల్లి తాపత్రయమంతా..
గుడ్డు పెంకును ఒలిచి,
చంటి గుడ్డను ఆవిష్కరించిన జాడే కాక
బాలింతతే పాటు నెత్తుటిముద్దకు సుతారంగా
రాసి పూసి సమరంటి
కాళ్ళ మీద లాల పోసిన ఆమె తండ్లాట
ఇంకా కండ్ల ముంగటే..!
“పామోలె పాకులాడు,
కప్పోలె గంతులెయ్య” మంటూ
పురిటి మంచం చుట్టూ ఆడి పాడి
నవజాత శిశువును ఆశీర్వదించిన
నీ సంబురం నేనెట్లా మరుస్తాను..!?
నీల్లాటలు, ఇరుఒక్కదినాలు
గోర్లుతీసుడు, పురిటి తానాలు, ఆఖరిక్రతువులు
అన్నీ నీ చేతుల మీంచే..
లచ్చవ్వా.! నీ కడుపు సల్లంగుండ
నువ్వెక్కడున్నవో గానీ,
నా మాయిముంత తావు ఆగమైంది
దివారాత్రులూ దేవులాడుతన్న..
ఓ సారి ఒచ్చి సూపిచ్చి పోరాదూ
మా తల్లివి కదూ..!!
