‘నాన్నా! పేపరు వచ్చింది, ఇదిగో!’ అంటూ లీల నా మంచం దగ్గరికి వచ్చి ఇచ్చింది.
‘ఏమిటి లీలా అప్పుడే పేపర్ తెచ్చావా! ఇప్పుడే కదా లేస్తున్నా!’ అని పేపర్ తీసుకున్నా.
‘నేను స్కూలుకు రెడీ అవుతున్నాను నాన్నా! అందుకని నీకిచ్ఛేసి పోతున్నా!’ అంటూ పరిగెత్తింది.
లీల వచ్చినప్పటి నుండి మా దినచర్య మారిపోయింది. నాలుగు సంవత్సరాలయింది. ‘అప్పుడే నాలుగేళ్ళు గడిచినాయా!’ అనిపిస్తోంది నాకు.
సరళకు ముందు పిల్లలు పుట్టలేదు.
పిల్లలు కావాలని ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము!?
అందరి దగ్గరకు తిరిగి ‘ఇంక కాదు’ అని వదిలేశాము.
దిగులు మరచిపోయేందుకు, ఇద్దరం తరచూ టూర్లకు తిరూగుతున్నా, ఇంటికి రాగానే ఏదో వెలితిగా ఉండేది.
ఒకసారి దగ్గరి బంధువులు ఇంటికి, వేరే ఊరికి వెళ్లి ఇంటికి వస్తున్నాము. బస్ ఎక్కడానికి రోడ్డు మీదకు రావాలంటే ఊరి నుండి పొలం బాటలో రెండు మైళ్ళు నడవాలి.
ఒక పొలం పక్కన చిన్న గుడిసెలో నుండి చిన్న పాప ఏడుపు వినిపించింది.
పిల్లలు లేని మాకు పసిపిల్ల ఏడుపు వింటే మనసు గుంజుతుంది.
‘ఎవరో పాప’ అని మేము చూస్తామని వెళ్ళాము.
పక్కన పిల్లలు అమ్మాయిని ఓదారుస్తా చిన్న గ్లాసుతో నీళ్లు తాపుచున్నారు.
మేము దగ్గరకు వెళ్లి చూశాము.
అంతా చిన్న పిల్లలే.
‘మీ అమ్మ ఎక్కడ?’ అంటే ‘అదో అక్కడ తోటలో పనిచేస్తా ఉంది’ ఆని సమాధానం వచ్చింది.
ఇంతలోనే పాప అమ్మ, గుడిసె దగ్గర కొత్త మనుషులను చూసి పరుగు వంటి నడకతో వచ్చింది.
‘ఏమ్మా పాప ఏడుస్తూ ఉంటే నువ్వు చూసేది లేదా? అన్నాను.
‘ఇప్పుడే అన్నం వండిపెట్టి, చిన్నదానికి పాలు ఇచ్చి పోయాను. పాలు సరిపోవు సార్, ఏడుస్తోంది. అన్నం తినే వయసు కాదు. ఏమి చేసేది! రెక్కాడితే గానీ మాకు పూట గడవదు. మాది వేరే ఊరు. పనులకు వచ్చినాము. ఈ ద్రాక్ష తోట పని చేసుకుని పోతాము. నేను మా ఆయన ముగ్గురు పిల్లలు, అందరం ఈ గుడిసె కట్టుకొని రాత్రి పగలు ఇక్కడే ఉంటాము. ఈ తోట యజమాని వారానికొకసారి ఇద్దరి కూలీ ఇస్తాడు.’ అని ఏకరువు పెట్టింది, మాకేదో సంజాయిషీ ఇస్తున్నట్లు.
‘కూలి డబ్బులు సరిపోతాయా?’ అని అంటే, ‘ఎలాగో సరిపెట్టుకుంటాము’ అన్నది.
సరళ పాపను చేతుల్లోకి తీసుకుంది. పాప చక్కగా ఉంది పాలు సరిగా లేక పాలిపోయింది. అలసిపోయి అట్లానే పడుకుంది చేతుల్లో.
నేను ‘బస్సుకు టైం అవుతుందేమో వెళదాం!’ అన్నాను.
‘సరే’ అని పాపను వాళ్లకు ఇచ్చింది సరళ.
మేము ఇద్దరం గుడిసె దగ్గర నుంచి బాట మీదకు వచ్చి చిన్నగా నడుస్తా ఉన్నాం.
‘నాలుగేళ్ల పాపను చూసే శక్తి లేక బాగా అవస్థ పడుతున్నారు. మనం పెంచుకుంటే ఇస్తారేమో! అడుగుదామా’ అంది సరళ. ‘పోనీ ఇంటికి వెళ్లి ఆలోచించుకుని తర్వాత అడుగుదాము’ అంది మళ్ళీ తనే. నాకు తటపటాయింపుగా ఉంది. ఇబ్బందులు ఏమి రావా- అని ఆలోచిస్తున్నా.
‘వాళ్లు ఆ లోపల వెళ్ళిపోతే ఎక్కడని కనుక్కుంటాం!’ అంది మళ్ళీ తనే. సరళ మానసిక స్థితి నాకర్థమయింది.
సరే అని వెనక్కు వచ్చి ఆమెను కలిశాము.
మేము బిడ్డను అడుగుతానే, బిత్తర పోయింది.
తేరుకొని ‘కూర్చోండమ్మా!: అని చిన్న నులక మంచం చూపించింది.
మేము అడగగానే, భర్తని కేకేసి పిలిచింది ఆమె.
అతనొచ్చి విషయం విని, ‘మాకు బిడ్డను పెంచడం కష్టమే కానీ, పారేసుకుంటామా! నాలుగోసారి మగపిల్లాడు పుడతాడని ఆశపడ్డాము. కానీ మా రాత ఇంతే ఉంది. అయినా మీరు ఎవరో మాకు ఎట్లా తెలుస్తది. మొఖం తెలియని వాళ్ళకివ్వాలంటే భయమే కదా అమ్మా!’ అన్నారు ఇద్దరు.
‘మీకు ఆ భయం ఏమి అక్కర్లేదు. మేము మీ ఇద్దరినీ తీసుకెళ్లి మా ఊరు, మా ఇల్లు అన్ని చూపిస్తాము, అందరి సమక్షంలో మాట్లాడుదాం. సరేనా!’ అన్నాం.
‘మీరేమీ బాధ పడొద్దు. మీ అమ్మాయి మా దగ్గర లక్షణంగా ఉంటాది. మాకు పిల్లలు లేరు. మీరేమీ అనుమాన పడొద్దు. సరేనా!’ అన్నాము.
… … …
వాళ్లను మా ఇంటికి తీసుకొచ్చి చూపించాము.
మాకు తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్లి, అన్ని పరిష్కరించుకుని వాళ్ళ సంతకాలతో చట్టబద్ధంగా అన్నీ చేసి పాపను తీసుకున్నాం.
వాళ్ళ ముగ్గురి పిల్లలకు లక్ష రూపాయలు చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాము.
‘ఊరును కనుక్కుంటారు కదా, పాపను అప్పుడప్పుడు వచ్చి చూసుకోండి. అయితే మీరేమీ పాపకు చెప్పకండి. మా పాప లాగానే పెరుగుతుంది.’ అన్నాను.
‘సరే సార్! మా పాప సుఖం తప్ప ఏమి కావాలి! మేము ఈ ముగ్గురిని పెంచుకోవాలి కదా!’ అని వెళ్ళిపోయారు.
… … …
గతం గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో అనిపిస్తుంది.
పాపకు ‘సత్య లీల’ అని పేరు పెట్టాం. అంతా లీల.
మేము ట్రాన్స్‌ఫర్ మీద ఈ వూరొచ్చాక, చాలా మందికి పాప విషయం తెలియదు. ‘మా పాపే’ అనుకున్నారు.
సత్యం – ఈ లీల. మా వెలుగు.
సరళ వచ్చి, ‘ఏమి ఇంకా లేవలేదా? పాపను స్కూలుకు ఆటోలో పంపి వస్తున్నా. లేవండి త్వరగా. టైం అవుతుంది.’ అంది.
‘సరళా! ఇంకా పేపరు చూడలేదు. ఈరోజు సెలవు పెట్టాలనుకుంటూ ఉన్నా. నువ్వెళ్ళు. నేను పేపర్ చూసి, స్నానం చేసి కాఫీ పెట్టుకుని తాగుతాను’ అని పేపరు తీశాను.
సరళ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
పేపరు మొదటి పేజీలోనే ‘సరోగసి ముసుగులో శిశు విక్రయాలు’ అని వార్త.
చూడగానే ఏమీ దిక్కు తోచలేదు. విషయం అంతా చదివాను.
ఎందుకు విక్రయాలు జరుగుతున్నాయి!
తల్లికి తల్లి శాపమా!
నాలో ఆలోచనలు.
నా చిన్నతనంలో మా అమ్మ చెప్పిన ఒక ఉదంతం గుర్తుకొచ్చింది.
మా అమ్మ వాళ్ళ ఊర్లోనో, పక్క ఊర్లోనో నాకు అంతగా గుర్తు రాలేదు.
వాళ్ళు అమ్మ, కొడుకు, కోడలు. పల్లెటూరు కాబట్టి చాలా మటుకు వ్యవసాయం మీదనే ఆధారం.
చిన్న పెద్ద అందరూ బాగా కలివిడిగా ఉంటారు. కోడలుకు పిల్లలు కలగలేదు. పెళ్లై ఐదు సంవత్సరాలైనా పిల్లలు లేరు. తల్లి చాలా బాధ పడుతూ ఉండేది. కొన్ని రోజులు ఓపిక పట్టింది. కొడుకుకు మళ్లీ పెళ్లి చేస్తాను – అని చెప్పడం ప్రారంభించింది. డలుకు దిగులు పట్టుకుంది. అప్పుడు డాక్టర్లకు చూపించాలని ఆలోచన ఉండేది కాదేమో! బిడ్డలు అంతా దైవ సంకల్పం అని నమ్మేకాలం. కోడలుకు ‘నా గతి ఎట్లా! నన్ను చూస్తారో, లేదో! మోగుడికి మళ్ళీ పెళ్లి చేస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయో!’ అని దిగులుతో, ‘వచ్చే సవతి ఎట్లా చూస్తాదో’ అని ఆందోళన పడిందేమో!
ఒకరోజు ‘అత్తా! నాకు వాంతి వచ్చినట్లుంది’ అని మొదలు పెట్టింది.
అత్త ‘అవునా’ అని,
‘సొంటి తాగుతావా’, ‘కాసేపు పడుకో’ అని సపర్యాలు చేస్తూ,
‘బయట చేరావా’ అని ఆరా తీసింది.
‘రాలేదు అత్తా, ఈ నెల’ అంటానే, అత్త సంబరపడింది.
ఆ రోజు నుంచి గర్భమని చెప్పి కోడలు నాటకమాడుతూ గడుపుతా ఉంది.
చుట్టాలు, తల్లి అందరూ పరామర్శ చేయడం, వచ్చిపోయే వాళ్ళు… అత్త సంతోషంగా ఉంది.
కోడలుకు బాగా వండి పెట్టేది. భర్త బాగా చూసుకునేవాడు.
పక్కనే వున్న కోడలు పుట్టినూరు నుండి ఒకామె మంత్రసాని కోడలు దగ్గరకు వచ్చి పోయేది.
ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. నెలలు నిండాయి.
పొట్ట పెద్దగా కనపడలేదు. కొందరికి తొమ్మిది నెలలు నిండినా కడుపు కానరాదని మంత్రసాని అందరితో చెప్పేది. ఆ కాలంలో పొట్ట పైకి చీరలు కట్టేవాళ్ళు. ఆ చీర కింద గుడ్డలు పెట్ఠి, చిన్న కడుపు కనపడేలా చేసుకుంది.
ఒకరోజు నొప్పులు అని మొదలుపెట్టింది. మంత్రసాని వచ్చింది.
చీకటి పడింది.
ఈ మంత్రసాని ‘అప్పుడే కాన్పు కాదు. పోయి పడుకోండి’ అని చెప్పి, తనుంటానంది.
పల్లెటూరు వాళ్లకు ఏమీ తెలుస్తాది!
అంతా మంత్రసాని చూసుకుంటుంది, అవసరమైనప్పుడు మల్ల మమ్మల్ను పిలుస్తాదని వెళ్లి పడుకున్నారు.
మంత్రసాని వున్న ఊర్లో పేద ఇంటి వాళ్లొకరితో ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్ళింటో ఆడబిడ్డ కాన్పు అయితానే తనను పిలవాలని మంత్రసాని ఒప్పందం. ఆరోజు ఆ పేద ఇంటి ఆడబిడ్డకు నొప్పులు రాగానే, ఇక్కడ కోడలుకు నొప్పులొచ్చినాయి. అక్కడ పేదవాళ్ల పిల్ల కాన్పు అయితానే బొడ్డు కోయకుండా రక్తంతో తెచ్చి బిడ్డను ఈమె దగ్గర పడుకోబెట్టింది. వాళ్ళకు పెంచే స్తోమత లేకనే, ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు. మంత్రసాని గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా చేసింది. కోడలు తన బతుకు రక్షణ కోసం ఇదంతా చేసింది. డబ్బు ముందే చేతులు మారింది. కోడలుకు పుట్టింది పిల్లవాడు పుట్టాడని మంత్రసాని అరవగానే, అత్త నిద్ర నుండి లేచింది. బిడ్డ ఏడుపు వింటూనే అత్త పరిగెత్తుకుని వచ్చి – ‘ఏమి బిడ్డ?’ అని ఆదుర్దాగా అడిగింది. మగబిడ్డ అంటానే సంతోషానికి హద్దులు లేవు. తర్వాత స్నానాలు, ముద్దు ముచ్చట్లు అన్నీ బాగా జరిగాయి. మంత్రసానితో ఎంత డబ్బులకు మాట్లాడుకుందో అన్ని గుట్టుగా ఇచ్చింది. తల్లి, బిడ్డా… అందునా మగపిల్లాడు కదా, అత్త బాగా చూసుకుని వుంటుంది.
… … …
సరళ వచ్చి, ‘ఏమి ఆలోచిస్తా ఉన్నారు, లేవండి నేను వెళ్తున్నాను!’ అంది. ‘సరే’ అయితే!’ అన్నాను.
సమాజ పరిస్థితులు, పిల్లలు లేకపోతే సమాజం చూసే చిన్న చూపు, ఇంట్లో అత్తమామలు భర్తా వేధింపులు, వంశం కోసం పిల్లలు ఉండాలనే పాతుకుపోయిన నమ్మకం… వీటి వల్ల కదా, ఈ పిల్లల విక్రయాలు!
మా అమ్మ చెప్పిన పిల్లల సమస్య, మేము పెంచుకున్న పాప, సరోగసి పాపల విక్రయం… ముగ్గురు తల్లులకు ఏమి చెప్పాలి!… పేగు బంధమైనా, పెంచిన మమకారమైనా – తల్లి ప్రేమకు విలువ కట్టలేము!
