సామాజిక మాధ్యమాలు: ట్రాన్స్‌జెండర్ సముదాయానికి ప్రజాస్వామ్య వేదిక – అర్చనరావు మానుకొండ

భారతదేశంలో మారుతున్న సామాజిక-రాజకీయ పరిస్థితుల్లో, ట్రాన్స్‌జెండర్ సముదాయాలు చరిత్రపరంగా ప్రధాన మీడియా ద్వారా తప్పుగా చూపబడుతూ, అవమానించబడుతూ, నేరపూరితంగా, హేళనాత్మక హాస్యంతో చిత్రీకరించబడ్డాయి. ఈ చిత్రీకరణలు తరచుగా ట్రాన్స్ వ్యక్తులను సాధారణ జీవితాలు గల విభిన్న వ్యక్తులుగా కాకుండా, మోసపూరితులుగా, మానసికంగా అస్థిరులుగా లేదా సమాజానికి ముప్పుగా చూపిస్తుంటాయి.

ముఖ్యంగా జెండర్ గుర్తింపు, భిక్షాటన లేదా సెక్స్‌వర్క్ వంటి జీవనాధారాలు, అలాగే సామాజిక అపోహల కారణంగా ఈ సముదాయాలు తీవ్రమైన వివక్షత (స్టిగ్మా)కు గురయ్యాయి.
దీని ప్రభావం సాధారణ సమాజంపై తీవ్రంగా పడింది. ఫలితంగా ట్రాన్స్ వ్యక్తులను వెక్కిరించడం, అవమానకర పదాలతో పిలవడం, లేదా తక్కువగా చూడడం సాధారణంగా మారింది. ముఖ్యంగా కొన్ని సినిమాలలో “మాడ” అనే ఇంటి పేరుగల ఒక నటుడు పదే పదే ట్రాన్స్ పాత్రలు పోషించడం వల్ల, ఆ నటుడి పేరునే ట్రాన్స్ వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగించడం వరకు ఈ ప్రభావం వెళ్లింది. ఇది సినిమాలు సమాజ దృక్పథాలను ఎలా ఆకారమివ్వగలవో స్పష్టంగా చూపిస్తుంది.
సినిమాలలో ట్రాన్స్ వ్యక్తుల చిత్రీకరణ ఎలా ఉందో అదే విధంగా వార్తా మాధ్యమాలలో కూడా వారిని తరచూ ‘యాంటీ-సోషల్ ఎలిమెంట్స’, ‘సమాజ వ్యతిరేకులు’, ‘చెడపురుగులు’ లేదా ‘అనవసరమైన జీవులు’ అన్నట్టుగా ప్రదర్శించడం సర్వసాధారణమైంది. వారి వృత్తులు, జీవనోపాధి మార్గాలను అపహాస్యం చేస్తూ, సమాజానికి హానికరమైన వారిగా చూపించే నెగటివ్ కథనాలు ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తాయి.
అయితే కాలక్రమేణా, కొంతమంది కార్యకర్తలు, సామాజిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు మరియు ట్రాన్స్ కమ్యూనిటీ సభ్యులు ట్రాన్స్ వ్యక్తుల సాధికారత కోసం పనిచేయడం ప్రారంభించిన తర్వాత, మీడియాలో కొంత మార్పు కనిపించసాగింది. కొన్ని టెలివిజన్ చర్చల్లో వారితో ఇంటర్వ్యూలు జరపడం, కొంతమందికి యాంకరింగ్ అవకాశాలు ఇవ్వడం, అలాగే సినిమాలు మరియు ఇతర మీడియా రంగాలలో అవకాశాలు కల్పించడం మొదలైంది.
అయితే ఈ మార్పులు జరిగినప్పటికీ, ట్రాన్స్ వ్యక్తుల పట్ల ఉన్న వివక్షత గణనీయంగా తగ్గలేదని చెప్పవచ్చు. టెలివిజన్ రంగంలో పనిచేసిన కొంతమంది ట్రాన్స్ వ్యక్తులు తమకు ఎదురైన చెడు అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు. ఉదాహరణకు, ఒక ఛానెల్ ఒక ట్రాన్స్ వ్యక్తికి యాంకరింగ్ అవకాశం ఇచ్చినప్పటికీ, ఆ ఛానెల్‌లోని వెనుక పట్టా సిబ్బంది వారి శరీరం, అవయవాలు, భావోద్వేగాలు, లైంగిక జీవితం వంటి అత్యంత వ్యక్తిగతమైన మరియు అసహ్యకరమైన ప్రశ్నలు అడుగుతూ వారిని అవమానపరచిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధమైన ప్రవర్తనలో ట్రాన్స్ వ్యక్తులు లైంగిక వేధింపులకు కూడా గురయ్యారని అనేక సందర్భాలు సూచిస్తున్నాయి.
ట్రాన్స్ వ్యక్తులుగా ఉండటం లేదా స్వలింగ సంబంధాలు కలిగి ఉండటం ఒక నేరమని, అవి ప్రకృతి విరుద్ధమైనవని, ‘అబ్నార్మల’ అని భావించే దృక్పథాలు భారత సమాజంలో విస్తృతంగా కనిపిస్తాయి. ఈ రకమైన భావజాలం కారణంగా స్వలింగ సంబంధాలు కలిగిన వ్యక్తులను తప్పు చేస్తున్న వారిలా వెంటాడటం, వారి వ్యక్తిగత వివరాలు సేకరించడం, ఫోన్ కాల్స్ ద్వారా ఉచ్చు వేసి ‘స్టింగ్ ఆపరేషన’ల పేరుతో వారి లైంగిక గుర్తింపును బహిరంగంగా బయటపెట్టడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి.
ఇలాంటి ఒక ఘటనలో, ఒక ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ స్వలింగ సంపర్కుడున ఒక వ్యక్తి లైంగిక గుర్తింపును ప్రసారం చేయడం వల్ల అతను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై చివరకు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూడా నమోదైంది. ఇది మీడియా బాధ్యతారాహిత్యానికి మరియు లైంగిక మైనారిటీల పట్ల ఉన్న తీవ్రమైన వివక్షకు ఒక ఉదాహరణగా నిలిచింది.
ఈ సంఘటన తర్వాత ట్రాన్స్ మరియు స్వలింగ సంబంధాల కమ్యూనిటీలు ఒక్కటై ముందుకు వచ్చి నిరసనలు, ధర్నాలు నిర్వహించి ఈ చర్య తప్పు అని బలంగా ఖండించాయి. అదేవిధంగా, హెచఐవి నివారణ కార్యక్రమాల్లో భాగంగా పనిచేస్తున్న ట్రాన్స్ వ్యక్తులు మరియు స్వలింగ సంబంధాలు కలిగిన వ్యక్తులు కలిసి మీడియా సంస్థలు మరియు పోలీస్ విభాగాలతో అడ్వొకసీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో వారు ఎదుర్కొంటున్న వేధింపులు, వివక్ష, సామాజిక బహిష్కరణలను వివరించడంతో పాటు, ట్రాన్స్ గుర్తింపులు మరియు స్వలింగ సంబంధాలు ఎలాంటి వ్యాధి గానీ, జాడ్యం గానీ కాదని, అవి మానవ లైంగికతలో సహజమైన భాగమని స్పష్టంగా వివరించేందుకు గణనీయమైన కృషి చేశారు.
“సామాజిక మాధ్యమాలు – “పారడైమ్ షిఫ్ట”
(పారడైమ్ షిఫ్ట్ ప్రాథమిక ఆలోచనలు, దృక్పథాలు లేదా విధానాలలో పూర్తి, తీవ్రమైన మార్పు)
ఇప్పుడు ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి డిజిటల్ వేదికలు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు తమ కథలను తిరిగి తమ చేతుల్లోకి తీసుకుని, సానుకూలమైన స్వీయ ప్రతిబింబాలు ఎలా నిర్మించుకుంటున్నారు, తమ గుర్తింపును ఎలా ప్రదర్శిస్తూ, డిజిటల్ స్థలాల్లో బంధుత్వం, సమూహ భావనను ఎలా నిర్మించుకుంటున్నారో చూద్దాం. దృశ్య కథనం, అనుచరులతో పరస్పరం, అల్గోరిథమ్ ద్వారా విస్తరణ వంటి అవకాశాలు భాషా మరియు డిజిటల్ పరిమితులు ఉన్న సందర్భాల్లో కూడా గుర్తింపు నిర్మాణానికి మరియు ప్రజా భాగస్వామ్యానికి ఒక ప్రజాస్వామ్య వేదికను సృష్టిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
స్మార్ట్‌ఫోన్లు వాడుకలోకి రావడం, అలాగే ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో సామాజిక మాధ్యమాల వినియోగంలో పెద్డ మార్పు వచ్చింది. ఫేస్‌బుక్, జీ మెయిల్ వంటి అకౌంట్లు సులభంగా క్రియేట్ చేసుకోవడం, ఫోటోలు అప్లోడ్ చేయడం మొదలైనవి ఎలాంటి నియంత్రణలు, అభ్యంతరాలు లేదా బెదిరింపులు లేకుండా స్వేచ్ఛగా జరగడం ప్రారంభమైంది. ఫేస్‌బుక్‌లో ఏదైనా ఒక సందర్భానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేయడం, దానికి కొద్దిగా రాయడం లేదా రాయడం రాకపోతే కేవలం ఫోటో మాత్రమే పెట్టడం సాధారణంగా ఉండేది.
ఆ తర్వాత టిక్‌టాక్ అనే సామాజిక మాధ్యమం వచ్చిన తరువాత అది అత్యంత వేగంగా, విస్తృతంగా వ్యాపించి అందరూ వాడటం మొదలుపెట్టారు. అందులో పాటలు పాడటం, తమను తాము హీరోయిన్లుగా లేదా నటులుగా చూపించుకోవటం, అభినయం చేయటం, వంటలు చూపించటం వంటి వివిధ రకాల వీడియోలు చేయడం ప్రారంభమైంది. ప్రచార మాధ్యమాల్లో ట్రాన్స్ వ్యక్తులను ఇప్పటివరకు ఎలా నెగటివ్‌గా చూపించారో దానికి పూర్తిగా భిన్నంగా, తమకు నచ్చిన విధంగా, పాజిటివ్?గా తమను తాము ప్రదర్శించుకునే అవకాశాన్ని టిక్‌టాక్ అందించింది. దీంతో ట్రాన్స్ వ్యక్తులు తమ తమ ఐడీలను స్వయంగా క్రియేట్ చేసుకొని ఈ మాధ్యమాన్ని విస్తృతంగా ఉపయోగించడం మొదలుపెట్టారు.
ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొద్దో గొప్పో చదువు ఉండటం, కొంత టెక్నాలజీ అవగాహన కలగటం వల్ల వారు చాలా స్మార్ట్‌గా ఈ మాధ్యమాలను వినియోగించగలిగారు. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా వారి కంటెంట్ ఆకర్షణీయంగా మారింది. మొదట కొందరు వ్యతిరేకించినప్పటికీ, క్రమంగా పెద్డ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇంతవరకు ఒక పాయింట్ ఐదు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ట్రాన్స్ టిక్‌టాక్ క్రియేటర్లు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం తర్వాత మెల్లిమెల్లిగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల వినియోగం కూడా పెరిగింది.
టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన తర్వాత మన దేశంలో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వైపు మళ్లారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా “రీల్స” చేయడం ఒక పెద్డ ట్రెండ్‌గా మారింది. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే, ఎంతో మంది ట్రాన్స్ మహిళలు ఈ వేదికను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వారు చక్కగా దుస్తులు ధరించి, పాటలకు అభినయం చేయడం, సమాజానికి అవసరమైన సందేశాలను ఇవ్వడం, తమ ఇళ్లలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు లేదా సెలబ్రేషన్లను పోస్ట్ చేయడం, బర్త్‌డే విషెస్ షేర్ చేయడం మొదలైనవి చేస్తున్నారు.
అదే విధంగా, ట్రాన్స్ సముదాయాల్లో జరిగే కొందరికి మాత్రమే సంబంధించిన ఈవెంట్లకు సంబంధించిన ఫోటోలు, రీల్స్ తయారు చేయడం, హిజ్రా సంస్కృతిలో భాగంగా ఉన్న కొన్ని ఆచారాలు, కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం కూడా మొదలైంది. ఎవరికైనా ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు, సామాజిక అవగాహన కల్పించాలనుకున్నప్పుడు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా, ట్రాన్స్ వ్యక్తుల్లో కొంతమంది యాక్టివిస్టులుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న వారు, సమాజంలో ఎలాంటి మార్పు రావాలి, సమాజం నుంచి వారు ఏమి కోరుకుంటున్నారు, తమకు సంరక్షణ అవసరమైతే ఎవరి సహకారం ఉండాలి, అలాగే సంరక్షణకు సంబంధించిన హక్కులు, అవసరాలు వంటి అంశాలపై సమాచారాన్ని పంచేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక వేదికగా వినియోగిస్తున్నారు. ఈ విధంగా, ఇన్‌స్టాగ్రామ్ ట్రాన్స్ సముదాయానికి వ్యక్తీకరణకు మాత్రమే కాకుండా, హక్కులు మరియు సామాజిక మార్పు కోసం ఒక ముఖ్యమైన డిజిటల్ వేదికగా మారింది.
ఫేస్‌బుక్ మొదట్లో ఎంత విస్తృతంగా ఉపయోగించబడినప్పటికీ, క్రమంగా ఇన్‌స్టాగ్రామ్ ప్రభావం పెరగడంతో ట్రాన్స్ వ్యక్తులలో ఫేస్‌బుక్ వినియోగం కొంత తగ్గింది. అయినప్పటికీ, ఇంకా కొంతమంది ట్రాన్స్ వ్యక్తులు ఏదైనా విషయంపై రాయాలనుకున్నప్పుడు, సున్నితమైన అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తపరచాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఈవెంట్‌కు సంబంధించిన సమాచారం, అచీవ్‌మెంట్స్‌కు సంబంధించిన వివరాలు పంచుకోవాలనుకున్నప్పుడు ఫేస్‌బుక్‌ను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా, కొంతమేర ఇంటెలెక్టువల్ కంటెంట్, అధికారిక విషయాలు (ఆఫిషియల్ మ్యాటర్స్) చర్చించేందుకు ఫేస్‌బుక్ మరింత అనుకూలంగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ అయినా ఫేస్‌బుక్ అయినా ఈ రెండు సామాజిక మాధ్యమాలు ఒకే రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీ సభ్యులతో పరిచయం ఏర్పరచుకోవడానికి, నచ్చిన వారితో ఆన్లైన్ స్నేహాలు కొనసాగించడానికి సహకరించాయి. అలాగే, వేరే దేశాల్లో క్వియర్ సమస్యలు, ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించిన హక్కులు, సామాజిక సవాళ్లు, అక్కడి ఉద్యమాలు, అలాగే అవార్డులు, అచీవ్‌మెంట్స్ వంటి విషయాల గురించి తెలుసుకోవడం కూడా ఈ మాధ్యమాల ద్వారా సులభమైంది. ఈ విధంగా, ట్రాన్స్ సముదాయంలో నెట్వర్కింగ్ పెరగడానికి, పరస్పర అనుసంధానం బలపడడానికి ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ రెండు కూడా కీలక పాత్ర పోషించాయి.
తర్వాత ముఖ్యమైన మాధ్యమంగా వాట్సాప్ ప్రాధాన్యం పొందింది. ఎంత దూరంలో ఉన్న మిత్రులైనా, కుటుంబ సభ్యులైనా, లేదా సముదాయానికి చెందిన ఇతర వ్యక్తులైనా ఎవరితోనైనా సులభంగా కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ ఒక అత్యంత ఉపయోగకరమైన వేదికగా మారింది. మొబైల్ నంబర్లను షేర్ చేసుకోవడం, వీడియో కాల్స్ చేయడం, టైప్ చేయడం కష్టం అనిపించినప్పుడు ఆడియో మెసేజీలు పంపడం, అవసరమైతే వీడియో కాల్స్ లేదా గ్రూప్ వీడియో కాల్స్ చేయడం వంటి అంశాలు చాలా సహజంగా మారిపోయాయి.
వాట్సాప్ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి చదువుతో లేదా అక్షరాస్యతతో పెద్డగా సంబంధం ఉండదు. చదువు లేకపోయినా కూడా వాయిస్ మెసేజ్‌లు రికార్డ్ చేసి పంపడం ద్వారా సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ కారణంగా ట్రాన్స్ వ్యక్తులు మరియు ట్రాన్స్ సముదాయాలలో అనేక వాట్సాప్ గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ గ్రూపులు ఉద్యమాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి, సముదాయ సమస్యలను చర్చించడానికి, లేదా ట్రాన్స్ వ్యక్తులు పోలీసుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, లేదా భాగస్వాముల ద్వారా ఎదుర్కొనే హింసకు సంబంధించి సమాచారం ఇవ్వడానికి ముఖ్యమైన వేదికలుగా మారాయి.
అలాగే, ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర అవసరాలు ఉన్నప్పుడు, ఎక్కడైనా హింస జరుగుతున్న సందర్భాల్లో, ఎవరైనా క్రైసిస్‌లో ఉన్నప్పుడు, లేదా కుటుంబ సమస్యల వల్ల ఇబ్బందుల్లో
ఉన్నప్పుడు గ్రూపుల్లో వెంటనే సమాచారం పోస్ట్ చేయడం, దానికి క్షణాల్లోనే ఇతర సభ్యులు స్పందించి సహాయం అందించడం జరుగుతోంది. ఈ విధంగా, వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం చాలా వేగంగా సముదాయంలోకి చేరుతోంది. కొన్ని గ్రూపుల్లో వందల సంఖ్యలో సభ్యులు కూడా ఉన్నారు.
ఇంకా, ప్రాంతీయంగా మరియు గుర్తింపు ఆధారంగా కూడా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఉదాహరణకు, శివశక్తుల కోసం ప్రత్యేక గ్రూపులు, హైదరాబాద్‌లో ఉన్న ట్రాన్స్ వ్యక్తుల కోసం ఒక గ్రూపు, తెలంగాణ మొత్తానికి సంబంధించిన గ్రూపులు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన గ్రూపులు, అలాగే సంస్థల ఆధారంగా లేదా ఒక ఆఫీస్‌కు సంబంధించిన గ్రూపులు కూడా ఉన్నాయి. ఈ విధంగా, సముదాయ అవసరాలకు అనుగుణంగా విభిన్న స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు పనిచేస్తున్నాయి.
సామాజిక మాధ్యమాలు చదువు, అక్షరాస్యత, సామాజిక స్థాయి వంటి అంశాలకు అతీతంగా, చాలా సులభంగా ఉపయోగించుకోగల, ట్రాన్స్ సముదాయానికి సమాచార మార్పిడి, పరస్పర సహాయం, మరియు నెట్వర్కింగ్ కోసం అత్యంత కీలకమైన వేదికలుగా ఉపయోగపడుతున్నాయి.
సామాజిక మాధ్యమాల ద్వారా ట్రాన్స్ సముదాయం తమ గుర్తింపును స్వయంగా నిర్మించుకుంటూ, సానుకూల చిత్రణలను సృష్టిస్తూ, ఒక పారడైమ్ షిఫ్ట్‌ను సాధించింది. ఈ డిజిటల్ వేదికలు వారికి స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ, సమూహ బలం మరియు ఉద్యమ సాధనకు శక్తివంతమైన సాధనాలుగా మారాయి. ఫలితంగా, సాంప్రదాయ మీడియా వివక్షకు వ్యతిరేకంగా ట్రాన్స్ వ్యక్తులు తమ కథలను తామే చెప్పుకునే శక్తిని సంపాదించారు. ఈ మార్పు సమాజంలో సమానత్వం, గౌరవం కోసం కొనసాగుతున్న పోరాటానికి కొత్త ఆయుధంగా నిలుస్తోంది.

Share
This entry was posted in ప్రతిబింబం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.