ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి

వాళ్ళిద్దరివీ రెండు మార్గాలు. ఒకరు పౌరహక్కుల ఉద్యమానికి జీవితం అంకితం చేస్తే మరొకరు మహిళా హక్కుల కొరకు ఉద్యమించారు. వాళ్ళే వసంత, కన్నాబిరన్‌లు. పౌరహక్కుల నేతకు సహచరిగా, ఉద్యోగిగా, ముగ్గురు పిల్లలకు తల్లిగా, అన్నిటికీ మించి మహిళా హక్కుల కొరకు అహర్నిశలు పనిచేసిన మహిళగా, రచయిత్రిగా, అనువాదకురాలిగా పలు సవాళ్ళను వసంత తన జీవితంలో ఎదుర్కొన్న తీరు నాటి తరంలో నా లాంటి వాళ్ళకు ఎందరికో మార్గదర్శకమైంది.

ఆమె జీవితం సుదీర్ఘ ప్రయాణం. నేటి యువతరానికి కూడా అది మార్గదర్శకమవుతుంది. మరి ఆ విశేషాలన్నీ ఆమె మాటలలోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే మేడం! బాగున్నారా?
జ. బాగున్నాను. రండి కూర్చోండి.
ప్ర. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి
జ. మా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ముందు మీకు మా తాతల గురించి చెప్పాలి. పేరు రామస్వామి అయ్యంగార్. రైల్వేలో పనిచేసారు. చాలా లిబరల్‌గా ఉండేవారు. చిన్న తాత హార్బర్ వర్కర్స్‌తో పనిచేసారు. కమ్యూనిష్టు. అమ్మ పేరు చూడామణి. ఇంటి బాధ్యతలు చూసుకునేది. పెద్దగా చదువుకోలేదు. అయినా ఇంగ్లీషు పుస్తకాలు బాగా చదివేది. మా యింట్లో చాలా ఇంగ్లీష్ సాహిత్య పుస్తకాలు ఉండేవి. అలా మా అమ్మకు పుస్తక పఠనం వల్ల వచ్చిన జ్ఞానం చాలా ఉండేది. మా నాన్నపేరు రాఘవన్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మేము సికింద్రాబాద్‌లో ఉండేవాళ్ళం.
ప్ర. మీ సహోదరులు, బాల్యం గురించి చెప్పండి.
జ. మేము నలుగురం తోబుట్టువులం. నేను పెద్దదాన్ని. నా తర్వాత ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, మరో తమ్ముడు. ప్రస్తుతం మొదలు (నేను) చివరి తమ్ముడు జీవించి ఉన్నాం. మాది చాలా లిబరల్ కుటుంబం అని చెప్పాను. కదా .. అందువల్ల ఏ హద్దులు, ఆటంకాలు లేకుండా నా బాల్యం స్వేచ్ఛగా ఆనందంగా గడిచింది.
ప్ర. మీరు ఎప్పుడు జన్మించారు? ఎక్కడ చదువుకున్నారు?
జ. నేను 17 ఏప్రిల్ 1939లో పుట్టాను. కానీ పాఠశాలలో అది 1938గా రికార్డు అయింది. పుట్టిన నెల ఏప్రిల్ కావడం వల్ల అలా రికార్డు చేసి వుంటారు. నేను మొదట బ్రిగేడ్ అనే చిన్న పాఠశాలలో నాలుగో తరగతి దాకా చదివాను. ఆ తర్వాత సికింద్రాబాదు కీస్ హైస్కూల్‌లో చేరాను. అక్కడి నుంచే నా పాఠశాల విద్య పూర్తయింది. ఆ తర్వాత సికింద్రాబాదులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాను. దానిని ఆ తర్వాత కొంతకాలానికి మహబూబ్ కాలేజీగా పేరు మార్చారు. మా వాళ్ళకు నేను డాక్టర్ కావాలని ఉండేది. కానీ నాకు లిటరేచర్ అంటే ఆసక్తి ఉండేది. అందుకని నేను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసాను. డిగ్రీలో నేను తీసుకున్న సబ్జెక్ట్స్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఆనర్స్, అండ్ ఇంగ్లీష్ లిటరేచర్.
ప్ర. మీది ప్రేమ వివాహమా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా జరిగింది?
జ. రెండూను .. పెద్దలు చేసిన ప్రేమపెళ్ళి. కన్నాబిరన్ మాకు దూరపు బంధువు. మా పెళ్ళి 31 మే 1959లో, సికింద్రాబాదు మారేడుపల్లిలో సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
ప్ర. మీ సంతానం గురించి చెప్పండి.
జ. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. చిత్ర, కల్పన, అరవింద్ అందరూ ఉన్నత విద్యావంతులు. వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. చిత్ర ఈ మధ్యనే పదవీ విరమణ చేసింది. మనవలు, మనవరాళ్లు ఉన్నారు.
ప్ర. మీరు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఉంటే .. అవి చెప్పండి.
జ. ఎందుకు లేవు? ఉన్నాయి.. మధ్య తరగతి కుటుంబం. మా పెళ్ళైన కొత్తలో కన్నాబిరన్ సదరన్ రోడ్ వేస్ అనే ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు. టివియస్‌లో ఉన్నప్పుడు మాట పట్టింపులు వచ్చి తన ఆత్మగౌరవం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆ తర్వాత ప్రభుత్వ న్యాయవాది దగ్గర ట్రైనీగా పనిచేసేవాడు. ఆయన పెద్దగా డబ్బులు ఇచ్చేవాడు కాదు. కానీ ప్రభుత్వ న్యాయవాది కాబట్టి విభిన్నమైన కేసులు వచ్చేవి. వృత్తిపరంగా చాలా విషయాలు తెలుసుకోవడానికి వీలుండేది. అందుకే డబ్బులు రాకపోయినా కన్నాబిరన్ చాలా యిష్టంగా ఆ పని చేసేవాడు. అదే భవిష్యత్తులో ఆయన కెరియర్‌కు గొప్ప పునాది వేసింది. ఆర్థిక వెసలుబాటు కొరకు నేను ఉద్యోగం చేసాను.
ప్ర. మీ ఉద్యోగ వివరాలు చెప్పండి మేడం?
జ. బిఏ ఆనర్స్ డిగ్రీని ఒక ఏడాది తర్వాత ఎం ఏ డిగ్రీతో సమానంగా చూసే వాళ్ళు. కాబట్టి నేను ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళాను. కానీ ఆ ఉద్యోగం నాకు రాలేదు. తర్వాత 1961లో నేను రెడ్డి కాలేజీలో ఉద్యోగంలో చేరాను. 1985 వరకు ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాను. తెలంగాణ ప్రాంత గ్రామాల నుంచి హైదరాబాదుకు చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళకు నలభైశాతం కోటా ఉండేది. తెలుగు మీడియం పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు చెప్పేదాన్ని. విలియం షేక్స్ పియర్, చార్లెస్ డికెన్స్, జాన్ మిల్టన్ లాంటి రచయితల రచనలను వాళ్ళకు సులభంగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేసాను. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పిల్లలతో పోటీ పడి చదివేవారు. నా విద్యార్థులు నన్ను చాలా అభిమానించే వాళ్ళు. నాకు కూడా వాళ్ళంటే చాలా ప్రేమ. హరగోపాల్ సహచరి వనమాల, రెయిన్ బో పిల్లల హోమ్స్ డైరక్టర్ అంబిక, ఉద్యమకారిణి రత్నమాల, లలిత, విజయ, మృణాళిని లాంటి వాళ్ళు అప్పట్లో నా విద్యార్థులే.. ఈనాడు వేలాదిగా నా విద్యార్థులు దేశమంతటా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అది నాకు చాలా గర్వంగా ఉంటుంది. అక్కడ రమామేల్కోటే నా సహోద్యోగి.
ప్ర. మీరు హైదరాబాదు పాత బస్తీలో పనిచేశారు కదా.. ఆ వివరాలు చెప్పండి.
జ. అవును.. అప్పట్లో హైదరాబాదులో తరచుగా మతకలహాలు చెలరేగేవి. కేశవరావ్ జాదవ్, ఎం.టి ఖాన్, నేను మొదలైనవాళ్ళం కొందరం’ హైద్రాబాద్ ఏక్ తా ‘ పేరుతో పాత బస్తీలో శాంతి కొరకు పని చేసాం. కొన్ని సందర్భాలలో హిందువులను ముస్లిం కుటుంబాలు.. ముస్లింలను హిందూ కుటుంబాలు కాపాడినట్లు మా సర్వేలో గమనించాము. అవన్నీ రాజకీయ నాయకులు తమ తమ స్వలాభాపేక్షతో సృష్టించినవే.. రోడ్డు మీద నిలబడి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ముస్లిం మహిళలు ఇళ్ళ లోపల దర్వాజాల వెనకనుండే వినేవారు. పాత బస్తీ మతకలహాల మీద దీపాధనరాజ్ డాక్యుమెంటరీ తీసారు. దాని పేరు “క్యా హువా ఇస్ షహర్ కో”.
ప్ర. మీరు స్త్రీ వాద రాజకీయాల్లోకి రావడానికి నేపథ్యం ఏమైనా ఉందా?
జ. నాది చాలా లిబరల్ కుటుంబ నేపధ్యం. నా మీద ఎలాంటి పెత్తనాలు లేవు. వివక్ష అంటే ఏమిటో నాకు తెలియదు. ఇలా పని చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. పరిస్థితులే నేను ఈ వైపు పనిచేసేలా చేసాయి. నేను ఇంటర్మీడియట్‌లో చేరిన తొలిరోజులు అవి. అప్పుడు నా వయసు15 ఏళ్ళు ఉండొచ్చు. అది కో ఎడ్యుకేషన్ కాలేజ్. రెండో సంవత్సరంలో నలుగురు, మొదటి సంవత్సరంలో నలుగురు ఆడపిల్లలం ఉండేవాళ్ళం. విద్యార్థి ఎన్నికలు వచ్చాయి. ఆడపిల్లల నుంచి ఒకరిని మహిళా ప్రతినిధిగా నిలబడమన్నారు. అది నాకు నచ్చలేదు. ప్రెసిడెంట్‌గా ఎందుకు పోటీ చేయకూడదు? అనే ఆలోచన వచ్చింది. దీనికి నా కుటుంబ నేపథ్యం కారణం కావచ్చు. అంతే! నా స్నేహితురాలు పార్వతిని ప్రెసిడెంట్‌గా పోటీకి నిలబడమని అడిగాను. తను అంగీకరించింది. (ఆమె ఇప్పుడు సింగపూర్‌లో ఉంది.) అది అబ్బాయిలు జీర్ణించుకోలేకపోయారు. మా మీద కక్ష కట్టారు. బూతు బొమ్మలు వేసి, నేను మాటల్లో చెప్పలేని పదాలు రాసిన పేపర్లు రోజూ మా టేబుల్ డెస్క్‌లో పెట్టేవాళ్ళు. చాలా ఏడుపు, ఉక్రోషం కలిగాయి. వెంటనే ఆ విషయం ప్రిన్సిపల్‌కు కంప్లైంట్ చేశాం. కానీ ఆయన ఏమీ చేయలేక పోయాడు. అప్పుడు మేం అసలు ఆ డెస్కులు తెరిచే వాళ్ళమే కాదు. ఈలోగా ఫ్రెషర్స్ పార్టీ వచ్చింది. దానిని అమ్మాయిలం బాయికాట్ చేశాం. ఇది నా ఆలోచననే.. ఏ పార్టీ అయినా అమ్మాయిల జిలుగు సొగసులు లేకుండా విజయవంతం కాదు కదా.. నా ఆలోచన ఫలించింది. అబ్బాయిలు దారికి వచ్చారు. పిచ్చి రాతల కాగితాలు బందయ్యాయి. నవ్వులు, పలకరింపులు మొదలయ్యాయి. ఈ సంఘటనలే తర్వాత నేను మహిళా హక్కుల కొరకు ఉద్యమించిడానికి కారణమై ఉంటుందని ఇప్పుడు అనిపిస్తుంది.
ప్ర. స్త్రీ శక్తి సంఘటన గురించి చెప్పండి.
జ. మా స్నేహితులందరం తరచుగా ఎవరో ఒకరి ఇంట్లో కలిసేవాళ్ళం. మా చర్చలు మహిళా సమస్యల మీద కొనసాగేవి. అలాంటప్పుడు మహిళల కొరకు ఒక వేదిక ఉంటే బాగుంటుంది కదా.. అనిపించింది. అలా స్త్రీ శక్తి సంఘటన ఆవిర్భవించింది. సూజితారు, వీణా శతృఘ్న, విజయ, రమా మేల్కోటే, రత్నమాల లాంటి వాళ్ళు వామపక్ష రాజకీయాలలో ఉన్నారు. నాకు అవి అంతగా తెలిసేవి కాదు. సుజి, విజయ కేసు కొరకు కన్నాబిరన్ దగ్గరకు వచ్చేవాళ్ళు. క్రమేణా మేమిద్దరం స్నేహితులమయ్యాం. స్త్రీ శక్తి సంఘటనలో వాళ్ళు నన్ను భాగం చేసారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పురుషుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క మల్లు స్వరాజ్యం మినహా మిగతా స్త్రీలు ఎవరూ బయట ప్రపంచానికి తెలియదు. ఆ దిశగా పని చేయాలనుకున్నాం. ‘మనకు తెలియని మనచరిత్ర’ తీసుకు రావడానికి గ్రామాల్లోకి వెళ్ళి ఉద్యమంలో పని చేసిన మహిళలను కలవడం గొప్ప అనుభవం. అది నా జీవన దృక్పథాన్ని మార్చింది. ఆ రోజుల్లో వరకట్న మరణాలు చాలా ఉండేవి. అందుకొరకు “డౌరీ డెత్ ఇన్వెస్టిగేషన్ కమిటీ”ని ఏర్పాటు చేశాము. ప్రజలలో అవగాహన కల్పించడానికి వీధి నాటకాలు ప్రదర్శించే వాళ్ళం. బాదల్ సర్కార్ దగ్గర ఒక నెల రోజుల పాటు శిక్షణ తీసుకున్నాం. స్త్రీల కొరకు పనిచేస్తున్న ఆ క్రమంలోనే ‘అన్వేషి’ సంస్థను స్థాపించాము.
ప్ర. అన్వేషి వ్యవస్థాపక సభ్యులైవుండి అస్మితను స్థాపించడానికి గల కారణం ఏమిటి?
జ. అన్వేషి ప్రధానంగా వుమెన్ స్టడీస్, పరిశోధనపట్ల పని చేసింది. అంతకు ముందు కొంతకాలం డిడిఎస్‌తో కూడా పనిచేసాను. గ్రామ అభివృద్ధికి అది ఉపయోగపడింది. మహిళా సమస్యలు, హక్కుల పరంగా పని జరగలేదు. క్షేత్ర స్థాయిలో మహిళా సమస్యలు, హక్కుల గురించి పనిచేయడానికి మరో సంస్థ అవసరమైంది. అందుకే అస్మితను స్థాపించాము. మహిళా హక్కుల గురించి పనిచేయడానికి ఆఫీసు పెట్టుకుంటామంటే ఎవరూ గది అద్దెకు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. చాలా ఇబ్బందులు పడ్డాం. హివోస్ అనేది ఒక ఫండింగ్ ఏజన్సీ. ఆ ఫండింగ్‌తోనే అస్మిత కార్యక్రమాలు నిర్వహించాం. అంతేకాదు సొంత భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగాం. తర్వాత ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాము. అస్మిత కార్యక్రమాల్లో భాగంగా గ్రామ జాతరలను పెద్ద ఎత్తున నిర్వహించాం. అందులో భాగంగా మహిళలను ఎక్కువగా సమీకరించి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార దిశగా ఎలా పోరాటం చేయాలో శిక్షణ ఇచ్చేవాళ్ళం. మరోవైపు వాటికి సంబంధించిన పాటలు రాసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళం. స్త్రీ శక్తి సరిఘటన సమయంలో బాదల్ సర్కార్ దగ్గర తీసుకున్న శిక్షణ అస్మితలో యువతకు మేము కూడా శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడింది. అస్మితలో పనిచేసిన జమీల, సుమిత్ర, ఉషారాణి లాంటి వాళ్ళు స్వంత సంస్థలను స్థాపించి పని చేయడం గర్వంగా ఉంటుంది. ఆస్మిత నుంచి కొన్ని ప్రచురణలు కూడా తీసుకువచ్చాం.
ప్ర. నీలిమేఘాలు వచ్చిన ప్రత్యేక సందర్భం ఏమిటి?
జ. అప్పట్లో అమ్మాయిలు కథలు, కవిత్వం రాస్తున్నారు. అప్పుడప్పుడు పత్రికల్లో ప్రచురించబడేవి. ఒకసారి ఒక అమ్మాయి సెక్స్ గురించి కవిత రాసింది. అది చూసిన ఒక ప్రముఖ కవి “నీకు పెళ్ళి కాలేదు కదా.. ఎలా తెలుసు?” అని నీచంగా మాట్లాడాడు. ఆడవాళ్ళకు వాళ్ళ శరీరాల గురించి మాత్రమే తెలుసు. అంతకు మించి ఏమీ తెలియదు అనే ప్రచారం స్త్రీవాదుల పట్ల ముమ్మరం చేసారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం సంస్కారం కాదు. అలాంటి సందర్భంలో మేం స్త్రీలు రాసిన కవిసమ్మేళనం పెట్టాలని ప్రెస్ క్లబ్‌లో 3 అక్టోబర్ 1992లో ఒక సమావేశం ఏర్పాటు చేసాం. దానికి కాళోజీని పిలిచాం. స్త్రీవాదులందరూ తమ తమ కవిత్వాన్ని వినిపించారు. అలా నీలి మేఘాలు కవితా సంకలనం వచ్చింది. చేకూరి రామారావుగారు దానిపైన సానుకూలమైన విమర్శ చేసారు. ఆ తర్వాత ఆ కవయిత్రులలో కొందరు తమ కవితా సంపుటాలను తీసుకవచ్చి
స్త్రీవాద కవయిత్రులుగా మంచి పేరుపొందారు. వాళ్ళలో అనిశెట్టి రజిత, ఘంటసాల నిర్మల, కొండేపూడి నిర్మల మొదలైన వాళ్ళున్నారు.
ప్ర. సారా వ్యతిరేకోద్యమంలో భాగంగా అస్మిత తీసుకువచ్చిన సారాంశం రిపోర్టు గురించి చెప్పండి.
జ. తాగుడుకు బానిసలైన కుటుంబాలలోని స్త్రీలు చాలా కష్టాలు పడ్డారు. మా దృష్టిలోకి వచ్చిన ఒక సంఘటన చెపుతాను. ఆ మహిళకు ఒక చీర ఒంటిమీద ఉంటే రెండో చీర దండెం మీద ఉండే పరిస్థితి. అంటే అంత బీదరికం అన్నమాట. ఆమె స్నానం చేసి ఉతికి ఆరేసిన చీరను తీసుకుపోయి ఆమె భర్త దానిని తాగడానికి అమ్మేసాడు. ఇది ఒకటి మాత్రమే.. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ కోసం పనిచేయాలనుకున్నాం. హైదరాబాదులో మీటింగ్ పెట్టాం. మహిళలు వేలల్లో వస్తారకున్నాం. కానీ లక్షలాది స్త్రీలు తరలివచ్చారు. అది ఒక చారిత్రాత్మక సంఘటన.
ప్ర. మీ సహసంపాదకత్వంలో వచ్చిన పుస్తకాల గురించి చెప్పండి.
జ. అస్మిత నుంచి పుస్తకాలు ప్రచురించామని చెప్పాను కదా.. అవన్నీ సహసంపాదకత్వంలో వచ్చినవే.. పై రెండు పుస్తకాలు కూడా అలా వచ్చినవే. స్త్రీవాద సిద్ధాంతానికి సంబంధించి తెచ్చిన పుస్తకం ‘సరిహద్దులు లేని సంధ్యలు’. అది పెద్ద దుమారమే రేపింది. ‘ద వుమెన్ ఆఫ్ మహారాష్ట్ర’ అనే బుక్ చూసాము. మనం అలాంటి పుస్తకం తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మహిళావరణం’ తీసుకువచ్చాం.
ప్ర. మీ స్వతంత్ర రచనల గురించి చెప్పండి.
జ. కఠోర షడ్జమాలు, టేకెన్ ఇన్ టు ద ఫ్లడ్, సత్యవతి బయోగ్రఫీ, ఏ గ్రీఫ్ టు బర్రీ, పంకజం నవల. పురాణ స్త్రీ పాత్రలను ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ రాసిన ఐదు బ్యాలేలూ ఉన్నాయి. నేను అన్నీ ఇంగ్లీషులోనే రాసాను. కొన్ని తెలుగులోకి, ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి.
ప్ర. మీరు తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేసిన పుస్తకాలు ఏమిటి?
జ. నేను ప్రధానంగా అనువాదకురాలినే. తెలుగు పుస్తకాలను అనువాదం చేయడం వల్ల ఆ సాహిత్యం పట్ల కొంత అవగాహన పెరిగింది. డా. సి. నారాయణ రెడ్డి లాంటి టీచర్ల దగ్గర చదువుకున్న నేను తెలుగు సాహిత్యం పట్ల మరింత దృష్టి పెట్టి వుంటే బాగుండేది. ఓల్గా నవలను అనువాదం చేసాను. పేరు గుర్తులేదు. అక్కినేని కుటుంబరావు రాసిన ‘కొల్లేటి జాడలు’ నవలను అనువాదం చేసాను. ‘మై లైఫ్ ఈజ్ ఎ సాంగ’ పేరుతో గద్దర్ పాటలను కూడా అనువదించాను. ఇది కాకతాళీయంగా జరిగిన పని. ఎలాగంటే.. ఒక పాట కావాలని గద్దర్‌ను అడిగాను. ఆయన తన పాటల ఫైల్ మొత్తం తెచ్చి నాకిచ్చాడు. చాలా రోజులు నా దగ్గరే ఉంది. తీసుకపోలేదు.” దీనిని అనువాదం చేయమని ఉంచావా?” అని ఒకరోజు గద్దర్‌ను అడిగాను. దానికి ఆయన “చేయరాదా!దొరసానీ! వీలున్నప్పుడు.” అన్నాడు. ఆయన నన్ను సరదాగా దొరసాని అని పిలిచేవాడు. ఈ పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ పబ్లిషర్స్ ప్రచురించారు.
ప్ర. ఆ రోజుల్లో నాలాంటి యువతులను తీవ్రంగా ప్రభావితం చేసిన కఠోర షడ్జమాల గురించి చెప్పండి.
జ. అది ఆంధ్రజ్యోతి దినపత్రికలో కాలమ్‌గా రాసాను. నేను ఇంగ్లీషులో రాసి పంపిన దానిని ఆంధ్రజ్యోతి టీం మూలానికి ఎలాంటి మార్పులు లేకుండా చక్కగా తెలుగులోకి అనువాదం చేసేవారు. అప్పుడు ఆ పేరు లేదు. తర్వాత పర్స్పెక్టిన్ ఆర్ కె దానిని పుస్తకంగా ప్రచురించాడు. మల్లాది సుబ్బమ్మ గురించి ఎవరో రాసిన కవితలో ‘షడ్జమం’ అనే పదాన్ని వాడారు. అప్పుడు నాకది అర్థం కాలేదు. వి వి మా ఇంటికి వచ్చినప్పుడు అడిగాను. కోకిల పంచమంలో కూస్తుంది. నెమలి షడ్జమంలో కూస్తుంది. అని మొదటిది మృదు మధురమైన స్వరానికి (స్త్రీ స్వరానికి) రెండోది కఠిన స్వరానికి (పురుష స్వరానికి) సంకేతం అంటూ వివరించాడు. అంటే స్వరంలో కూడా లింగ వివక్ష అన్నమాట. అందుకని ఆ పుస్తకానికి ‘కఠోర షడ్జమాలు’ అనే పేరును నిర్ణయించాం. ఆ రోజుల్లో స్త్రీలు పనులు ముగించుకొని అందరూ ఒకచోట చేరి దానిని చదివి, చర్చించుకునేవాళ్ళు అని తెలిసినప్పుడు నేను చాలా సంతోషించాను. అంతకంటే ఒక రచనకు ఫలితం ఏముంటుంది? ఇటీవల లిఖిత ప్రెస్ నుంచి వొమ్మి రమేశ్, సజయలు దానిని మూడో ముద్రణగా తీసుకువచ్చారు.
ప్ర. మీరు రాసిన సత్యవతి జీవిత చరిత్ర గురించి చెప్పండి.
జ. సత్యవతి నా స్నేహితురాలు. మేం కొన్ని సార్లు కలిసి పనిచేశాం. ఒక సంస్థను నడుపుతున్న స్థాయి ఆమెది. దళిత స్త్రీగా ఆమె పడిన సంఘర్షణ నాకు తెలుసు. కానీ అస్మిత నుంచి వెళ్ళిన కొంతమంది అమ్మాయిలకు తెలియదు. అందుకే ఆమెతో కలిసిపనిచేయడంలో అంతరాలు ఏర్పడ్డాయి. అవి పోవాలంటే.. ఆమె గురించి అందరికీ పూర్తిగా తెలియవలసిన అవసరం చాలా ఉంది అనిపించింది. అందుకే ఆమె జీవిత చరిత్రను రాసాను. అది తెలుగులో కూడా వచ్చింది. దానిని ప్రచురించిన హైదరాబాదు బుక్ ట్రస్టు గీతారామస్వామి దానిని ఇంగ్లీషులో వచ్చిన మొదటి దళిత స్త్రీ జీవిత చరిత్రగా పేర్కొన్నది.
ప్ర. మీరు రాసిన ‘ఎ గ్రీఫ్ టూ బర్రీ’ అనే పుస్తకం ఒంటరి మహిళలకు సంబంధించిందా?
జ. అవును, అయితే అది ప్రత్యేకంగా భర్తను కోల్పోయిన స్త్రీలను ఇంటర్వ్యూ చేసి రాసాను. ఒక్క మాటలో చెప్పాలంటే విడో హుడ్ మీద రాసిన పుస్తకం. జీవితంలో ఒక వ్యక్తితో చాలా కాలం సహజీవనం చేసిన ఆ వ్యక్తి మరణించిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? అని తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ పుస్తకం రాసాను. అందులో నీలాదేశాయ్, లీలాభట్, శారదామణి, మీనాక్షి ముఖర్జీ, శాంతారామేశ్వరం, అబ్బూరి ఛాయాదేవి మొదలైన పది మంది కథనాలున్నాయి. మరో నలుగురి పేర్లు గుర్తు రావడం లేదు.
ప్ర. చివరి ప్రశ్న మేడం! కన్నాబిరన్ జీవన సహచరిగా మీ సాహచర్యం గురించి చెప్పండి.
జ. కన్నాబిరన్ పౌరహక్కుల ఉద్యమంలో, నేను మహిళా హక్కుల ఉద్యమంలో పనిచేశాం. ఈ క్రమంలో మా మధ్య ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా చర్చలు జరిగేది. ఎమర్జెన్సీ కాలం నుంచి ఆయనకు ముమ్మరంగా కేసులు వచ్చాయి. కావాలనుకుంటే లక్షలు సంపాదించే వాడు. కానీ ఆయన ప్రజా న్యాయవాదిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాను ఆర్థికంగా వెనకబడిన స్థాయి నుంచి వచ్చినవాడు. వాళ్ళ నాన్న ఐదుగురు పిల్లలు పుట్టిన తర్వాత మరో పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఒక్కతే ఐదుగురు పిల్లలను పెంచి పెద్ద చదువులు చదివించింది. ఆ విషయాన్ని ఆయన తన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకున్నాడు. అందుకే ఆయనకు మహిళలపట్ల చాలా గౌరవభావం ఉండేది. అది నా పనిని సులభతరం చేసింది. నేను ఉద్యోగిని కనుక చిన్నప్పుడు పిల్లల సంరక్షణలో భాగం పంచుకునేవాడు. అంటే పిల్లలను బడికి పంపించడానికి తయారు చేయడం లాంటివి. ఆయనకు వెల్లువలా కేసులు వచ్చిన ఎమర్జన్సీ కాలంలో నేను తనకు అసిస్టెంటుగా కూడా పనిచేయాల్సి వచ్చింది. పోలీసుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు నేను ఆందోళన పడిన మాట వాస్తవం. “టేకెన్ ఇన్ టు ది ఫ్లడ” అనే పుస్తకంలో చాలా వివరాలు రాసాను. ఆ పుస్తకం చదవండి. ప్రజల కొరకు పనిచేసిన మా జీవితాలలో నాకైతే సంతృప్తిగానే ఉంది.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.