అదిగో… ఎంతెంత భారీ భేరీ శబ్దాలు!
ఇదిగో..ఎన్నెన్ని యుద్ధ విమానాల స్వైర విహారాలు!!
హమ్మో.. ఇన్నిన్ని కళాత్మక హింసా విన్యాసాలు!!!
యుద్ధం ఏ రెండో, మూడో దూర దేశాల మధ్య,
ఎక్కడో సుదూర తీరాల అవతల జరుగుతుంటే.. నేనెటు వైపు నిలవాలనేది ఇప్పుడు చిక్కు ప్రశ్నే!
అయినా ఈ యుద్ధాన్ని ఒక క్రికెట్ మ్యాచ్‌తోను, ఒక ఎన్నికతోను, ఒక వినోద స్పర్ధతోను పోల్చుకుని,
ఏది ధర్మమో, ఏది అధర్మమో తేల్చుకోలేని స్థితిలో
ఏదో ఒక వైపు నన్ను నేను నిలుపుకోగలనా?
కేరింతల హోరింతలతో డ్రాయింగ్ రూమ్ లోనో,
రోడ్డు పక్కన చాయ్ దుకాణాల పక్కన దోస్తుల చిట్ చాట్ లోనో, పరోక్ష దగ్గరితనపు మొబైల్ చాటింగ్ లోనో.. హాయిగా విహరిస్తుంటే…
ఒక్క సారిగా పిడుగువంటి మిసైల్ ఎగిరెగిరి వచ్చి..
నా ఊర్లోకే, నా ఇంట్లోకే, నా వంటింట్లోకే, నా ఒంట్లోకే వెల్లువగా వచ్చి, మెరిసి భళ్ళున పగిలింది.
అప్పుడు గానీ నా స్థితి, గతి మారలేదు!
యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, నా కంట్లో, నా ఒంట్లో దాని ప్రతిబింబం ఇంత కంటగింపుగాను,
ప్రతిధ్వని ఇంత కర్ణ కఠోరంగాను ఉంటుందని ఊహించలేదు!
ప్రేక్షకుడి నుండి ఛీర్ లీడర్‌గా ముదిరిన నా వంటి పౌరులు, దేశాలన్నిటిదీ ఇదే వెత!
ఇక నేనూ పరిణతిస్తా!
నా మనసులోనే కాదు…
నా చుట్టూ ఉన్న మనుషులలోనే కాదు..
నా దేశం చుట్టూ ఉన్న దేశాలన్నింటిలోనూ…
ఇక యుద్ధమనేదే వద్దని;
ఒకవేళ అది తప్పనిసరైతే..
యుద్ధం పైనే యుద్ధం చేయాలని;
అలా..
ఈ యుద్ధం శాంతి కొరకేనని!!
కనుచూపు మేరలో..
చల్లని గులాబీ బాలలు,
హాయిగా తుళ్ళుతూ నవ్వుతున్న పసి మొగ్గలు,
చెంగున ఎగురుతున్న జింక పిల్లలు, ఆకాశ దీవుల్లో విహరించే పాలపిట్టలు ఉన్నాయి!
ఇక శాంతి బాకా ఊదేద్దామా!?
