వైద్యులు, దయ్యాలు, ప్రాణమిత్రుల చికిత్సలు – విద్యా కృష్ణన్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

గ్రామీణ మధ్యప్రదేశ్ ఏ విధంగా మానసిక ఆరోగ్య సంక్షోభంతో పీడించబడుతోందో బేతుల్ జిల్లాలో జరిగే భూతాన్ మేళా వంటి కార్యక్రమాల ద్వారా మనం గుర్తించవచ్చు. రాష్ట్రంలోని 54 జిల్లాల్లో దాదాపు సగం జిల్లాల్లో ఒక్క మానసిక ఆరోగ్య నిపుణుడు కూడా లేరు

గమనిక: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య స్థితిపై వస్తున్న సిరీస్‌లో ఇది మొదటిది.
మలాజ్‌పూర్ అనే చిన్న వ్యవసాయ గ్రామంలో 17 ఏళ్ళ సావి దుర్వే, 16 ఏళ్ళ ఆశా కొర్కు (పేర్లు మార్చబడ్డాయి) అనే ఇద్దరు బాలికలు ఒక అపూర్వమైన స్నేహాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇక్కడ జరిగిన ఆలయ ఉత్సవంలో వారు కలుసుకున్నారు. అక్కడ వారి ఇరువురి కుటుంబాలు వారిని స్థానిక భూతవైద్య కర్మకు తీసుకువచ్చాయి. ఆ బాలికలు, వారి కుటుంబాలు కూడా తాము ఒక దెయ్యం ప్రభావంలో ఉన్నామని నమ్ముతున్నారు.
“నేను గదిలో ఎవరో విసిరేసినట్టుగా చుట్టూ తిరిగిపోయి మూర్ఛపోయేదాన్ని. నొప్పితో వంకర్లు తిరిగిపోయేదాన్ని, మేల్కొన్నప్పుడు ఏమీ గుర్తుండేది కాదు,” సావి వివరిస్తున్నట్టుగా చెప్పింది. సావి తన వాక్యాన్ని ముగించటానికి ముందే ఆశా కూడా “నాకూ అంతే,” అంటూ ఏకీభవించింది. “నాక్కూడా ఏమీ గుర్తుండదు.”
కారణమేమీ లేకుండానే, లేదంటే ప్రతి విషయానికీ వారు ఒకరివైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇది టీనేజర్లలో సాధారణంగా కనిపించే సుపరిచితమైన ప్రాణస్నేహితుల మధ్య అకారణంగా ఉప్పొంగే ఒక యవ్వనశక్తి. ఈ ఇద్దరు అమ్మాయిలు దాదాపు ఒక నెల రోజులుగా ఆలయ ప్రాంగణంలోనే నివసిస్తున్నారు. ఈ సమయంలో వారు విడదీయరానంతగా కలిసిపోయారు – హారతి ఇచ్చే సమయంలో భుజం భుజం కలిపి కూర్చోవడం, గర్భగుడి లోపల దేవత చుట్టూ పరిక్రమ (ప్రదక్షిణ) చేసే సమయంలో ఒకరిమీదొకరు, అంతకు మించి కూడా గుసగుసగా పరిహాసాలతో మాట్లాడుకోవడం చేస్తారు.
ఆశ వైపు ప్రేమగా చూస్తూ, “ఆమె సులభంగా ప్రభావితమవుతుంది…” అంటుంది సావి.
“– నేను దాన్ని వివరించలేను –”
“– హారతి సమయంలో మీరే చూస్తారు –”
“– కానీ నేనిప్పుడు చాలా బాగున్నాను –” ఆలయంలో నెల రోజులు గడిపిన తర్వాత, తన పరిస్థితి మెరుగుపడిందని సూచిస్తూ ఆశా ముగించింది.
స్థానికంగా భూతోఁకా మేళా అని పిలిచే శతాబ్దాల నాటి ఈ మలాజ్‌పూర్ దెయ్యాల ఉత్సవం ఏటేటా జరిగే కార్యక్రమం. ఇది మాఘ పూర్ణిమ (జనవరి-ఫిబ్రవరి మాసాలలో వచ్చే పౌర్ణమి రోజు) నాడు ప్రారంభమై బసంత్ పంచమి (వసంతకాల ఆగమనం) నాడు ముగుస్తుంది. బేతుల్ జిల్లాలోని చిఁచోలి బ్లాక్‌లో జరిగే ఈ ఉత్సవం, గురుసాహబ్ బాబా లేదా దేవ్‌జీ మహారాజ్ అనే సాధువు సమాధి కేంద్రంగా జరుగుతుంది. ఆయనకు ఆత్మలు ‘పట్టిన’ వ్యక్తులకు నయంచేసే అతీంద్రియ శక్తులున్నాయని జనం నమ్మకం. ఆలయ ఆవరణలో ఉన్న మర్రి చెట్ల ఆకులలో దయ్యాల ఆత్మలు చిక్కుకుపోతాయని ఇక్కడి గ్రామస్తులు నమ్ముతారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుండే కాక పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ నుండి కూడా వేలాదిమంది యాత్రికులు, విశ్వాసులు వస్తారు.
భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన మధ్యప్రదేశ్ మూఢనమ్మకాలలో, మానసిక ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఆ రాష్ట్ర జనాభాలో 70 శాతం కంటే ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. “మీరు ఆలయంలో చూసినది పైకి కనిపించేది మాత్రమే,” అని బేతుల్ జిల్లా ఆసుపత్రిలోని మానసిక వైద్యుడు డాక్టర్ సంజయ్ ఖతేర్కర్ మాతో అన్నారు. “ఆసుపత్రులలో ఖాళీలను భర్తీ చేయలేదు. ఇన్-పేషెంట్ సంరక్షణ అవసరమైన వారిని కనిపెట్టి, శిబిరాలను నిర్వహించడానికి, ఆయా ప్రదేశాలకు వెళ్ళటానికి, రోగులను భోపాల్‌కు పంపించటానికి ప్రయత్నిస్తాం. కానీ ఇది, ఏదో కొన్నిసార్లు వెళ్ళివచ్చినంతనే పరిష్కరించలేనంత భారీ సంక్షోభం.”
సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమైన 2021 అధ్యయనం ప్రకారం, 1996లో ప్రారంభించిన జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద రాష్ట్రంలో కేవలం 13.7% ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేశారు. కేవలం 11.8% ఆసుపత్రులు మాత్రమే మానసిక ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి. రాష్ట్రంలో మానసిక వైద్యుల లభ్యత లక్ష మంది జనాభాకు 0.05గా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన కనీస పరిమితి 100,000 మందికి ముగ్గురు ఉండాలనే దానికంటే చాలా తక్కువగా ఉంది.
బేతుల్‌లోని జిల్లా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కానీ సిబ్బంది లేరని సివిల్ సర్జన్ డాక్టర్ జగదీశ్ ఘోర్ పేర్కొన్నారు. “మాకు ఎండోస్కోపీ, ఎకో కార్డియోగ్రామ్ సౌకర్యం ఉంటే, ఆ యంత్రాన్ని నడపడానికి తగిన సాంకేతిక నిపుణులు లేరు. మాకు కొత్త భవనాలు, మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కానీ ఈ ఆసుపత్రిలో ఉన్న 30 స్పెషలిస్ట్ పోస్టులకు గాను 11 మాత్రమే భర్తీ అయ్యాయి.”
మొత్తం మీద ఈ డేటా, రాష్ట్రంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారిలో ఎక్కువ మంది చికిత్స పొందలేకపోతోన్న భయంకర చిత్రాన్ని చూపిస్తోంది. సౌకర్యాలు లేకపోవటం కుటుంబాలు తక్కువ సంరక్షణను కోరుకునే స్థితికి దారితీసింది. సావి, ఆశా వంటి టీనేజర్లలో ఈ దుర్బలత్వం పెరుగుతోంది. “91% మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో మానసిక ఆరోగ్య సేవలకు సంబంధించిన చికిత్స అంతరం ఉన్నట్లు గమనించారు. సరైన వైద్య చికిత్స కోసం ఈ రోగులకు ఎటువంటి చికిత్స తీసుకోవాలనే కోరిక ఉండదు,” అని ఈ 2021 అధ్యయనం తేల్చింది. రాష్ట్రంలో ఆత్మహత్యల అంచనా ఒక మిలియన్ జనాభాకు 1.19 ఉండగా, ఈ రేటు 18-45 సంవత్సరాల వయస్సు గలవారిలో అత్యధికంగా ఉంది.
అక్టోబర్ 2025లో జరిగిన ఒక తాజా అధ్యయనంలో, మధ్యప్రదేశ్‌లోని మానసిక వైద్యులు కొన్ని పట్టణ కేంద్రాలలో, ప్రధానంగా ఇందౌర్, భోపాల్, గ్వాలియర్‌లలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నారని తేలింది. అదే సమయంలో, రాష్ట్రంలోని 54 జిల్లాల్లో దాదాపు సగం జిల్లాల్లో ఒక్క మానసిక ఆరోగ్య నిపుణుడు కూడా లేడు. “మన దగ్గర తగినంత మంది వైద్యులు ఉంటే, మలాజ్‌పూర్‌లో ఎక్కువగా మహిళలపై చేసే దయ్యం వదిలించటం వంటి పనులను మూర్ఛ, సైకోసిస్, ఆందోళన, ఇతర పరిస్థితులుగా నిర్ధారించి ఉండేవారు,” డాక్టర్ ఖతేర్కర్ చెప్పారు. అందుకు బదులుగా, ఇలాంటి ఆరోగ్య వసతులు లేని ఎడారిలో సావి, ఆశా వంటి యువతుల మానసిక బాధలను పవిత్రమైన, అతీంద్రియమైన వాటిగా చూస్తారు: రాక్షసులు, దేవతలు; సాధువులు, అవశేషాలు; దర్శనాలు, దైవఘటనలు వంటి మధ్యయుగ ప్రపంచాల తర్కాలు 21వ శతాబ్దం మధ్యభాగంలో ప్రతిధ్వనిస్తాయి. సావి, ఆశా వంటి యువతులకు “దయ్యం పట్టటం” వారి దైనందిన జీవితాల్లో అంతర్లీనంగా ఉండే సహజమైన గందరగోళాన్ని వ్యక్తీకరించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది.
“శారీరక సమస్యల కోసం ఆసుపత్రికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక సమస్యల కోసం ఇక్కడికి రావాలి,” సావి తల్లి సునీత అన్నారు. తన కుమార్తెకు ఎవరో శాపం పెట్టారని, అలాంటివి ఈ ఆలయంలో మాత్రమే పరిష్కారమవుతాయని ఆమె చెప్పారు.
“నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఏడ్చేదాన్ని. ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాను. తర్వాత ఆశాను కలిశాను… ఇప్పుడు ఈ ప్రదేశం బాగున్నట్టు అనిపిస్తోంది. నాకిక్కడ స్నేహితులున్నారు…” నెల రోజుల పాటు జరిగే దెయ్యాల ఉత్సవం బసంత్ పంచమి నాడు ముగిసినప్పుడు సావి నాతో చెప్పింది. “నేను రేపు సావి లేకుండా నా గ్రామానికి తిరిగి వెళ్తాను. ఏం చేయాలో నాకు తెలియటంలేదు,” ఆశా దాదాపు తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా చెప్పింది.
బాలికలు కోలుకోవడాన్ని వారి తల్లులు ఆధ్యాత్మిక స్వస్థతగా చిత్రీకరిస్తుండగా, అదే తుఫాను నుండి బయటపడిన సావి, ఆశాలు చికిత్స విలువను సరళమైన వారి స్నేహంలో కనుగొన్నారు. నెల చివరికి వచ్చేసరికి, ఇద్దరూ వచ్చే ఏడాది ఆలయంలో కలవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. “… మళ్ళీ తర్వాతి…” సావి చెప్పింది.
“… ఆ వచ్చే ఏడాది…” ఇద్దరూ ఒకేసారి నాతో చెప్పి, పగలబడి నవ్వారు.
బహుశా ఇక్కడేదో మాయాజాలం జరిగి ఉండవచ్చు.

(ఈ వ్యాసం https://ruralindiaonline.org/article/of-doctors-demons-and-best-friend-therapies-te) మార్చి 7, 2026 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.