అమెరికన్ బాంబులు ముస్లిం స్త్రీలని విముక్తి చేస్తాయా? – ఎ. సునీత

పెట్రోల్, అధికారం, ఖనిజాలు, తెల్ల జాత్యహంకార అవసరాల కోసం అనేక ఖండాల్లో అమెరికా ఏభై ఏళ్లుగా నిరంతరం చేస్తున్న యుద్ధాలు, షడ యంత్రాలకి ఆయా దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారనో, ప్రజాస్వామ్యం లేదనో, నిరసనని అణగదొక్కారనో వంటి మేధోపరమైన సమర్ధన కూడగట్టుకుంటుంది. వీటన్నింటిలో ఆ దేశంలో జెండర్ అసమానతలు, అణచివేతలు తీవ్రంగా వున్నాయని జరిగే ప్రచార ఉద్యమం ముఖ్యమైంది.

పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, అమెరికా కలిపి నిరంతరంగా చేసే దాడుల్లో ముస్లిం స్త్రీల అణచివేతని ఎత్తి చూపించటం అత్యంత సాధారణం. ఆయా స్త్రీల విముక్తి కోసమే యుద్ధాలు చెయ్యాలనే వాదన చాలా ప్రాచుర్యం పొంది, తెల్ల జాతి దేశాల్లో ఈపాటికి లోక జ్ఞానంగా స్థిర పడింది. ఈ ప్రచారోద్యమంలో పాశ్చాత్య స్త్రీవాదుల భాగస్వామ్యం కూడా కీలకమైంది.
2001లో తాలిబన్, అల్ ఖాయిదాలని నిర్మూలించాలని అమెరికా ఆఫ్గనిస్తాన్‌పై యుద్ధం మొదలు పెట్టినప్పుడు జార్జ్ బుష్, హిల్లరీ క్లింటన్‌లు యుద్ధానికి సమర్ధింపుగా ఈ పాట పాడారు. దాని గురించి ఆఫ్ఘన్ స్త్రీల అభిప్రాయాలు ఏమయినప్పటికీ, ఫెమినిస్టు మెజారిటీ వంటి సంస్థలు, ఫెమినిస్టు పత్రికలూ, బార్బరా ఐహన్రెయిక్ వంటి ప్రముఖ స్త్రీవాదులతో సహా అనేక మంది అమెరికన్ మీడియాలో పదుల కొద్దీ వ్యాసాలు రాశారు, కానీ అమెరికా ఆఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘన్ స్త్రీల పట్ల ఆసక్తి తగ్గి, ఇంకా చెప్పాలంటే మాయమయింది. 2002లో పాకిస్తానీ-అమెరికన్ స్త్రీవాది సబా మెహమూద్ రాశారు. (https://www.jstor.org/stable/3318265). అమెరికన్ బాంబుల దాడిలో ఆఫ్ఘనిస్తాన్‌కున్న పాలనా వ్యవస్థ, పౌరసేవా వ్యవస్థలూ నాశనమవటంతో పాటు రెండున్నర లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా మైన్లతో నిండిపోయింది. కాబూల్‌లో అమెరికన్ పాలనా, బయట అనేక మిలిటెంట్ గ్రూపుల పాలనా జరిగింది.
ఈ యుద్ధంలో చిక్కుకున్న ఆఫ్ఘన్ స్త్రీల సంక్లిష్ట పరిస్థితులని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించిన వాళ్ళు, పాశ్చాత్య స్త్రీవాదులతో సహా, తక్కువ. 2000లో 90% ఆడవాళ్ళూ, 60% మగవాళ్ళు నిరస్యరాసులు. 80% గ్రామీణులు. అమెరికా నియంత్రణలో వున్న ఆఫ్గనిస్తాన్‌లో 2020 వరకూ పరిస్థితి కొంత మారింది. స్కూళ్ల సంఖ్య, స్కూళ్ల కెళ్లే విద్యార్థినుల సంఖ్యా కూడా 30% వరకూ పెరిగాయి. అయితే ఈ మార్పు కాబూల్, ఇతర పట్టణ ప్రాంతాలకి మాత్రమే పరిమితమైంది. లక్షల్లో మగవాళ్ళు చచ్చిపోవటంతో, గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్ళ పరిస్థితులు ఇంకా హీనంగా మారాయి. అమెరికా సమర్ధించిన ప్రభుత్వం కాబూల్‌లో రాజ్యమేలుతున్న 20 ఏళ్ళల్లో కాబూల్ బయట గ్రామీణ ప్రాంతాల్లో అరాచకం రాజ్యమేలింది. దాన్ని తాలిబాన్ నియంత్రించినందువల్ల ఆయా ఆడవాళ్లు రోజువారీ లైంగిక దాడికి గురవకుండా కాస్తంత ప్రశాంతంగా బయట తిరగగలుగుతున్నామని 2020లో విలేఖర్లకు చెప్పారు. https://www.brookings.edu/articles/the-fate-of-womens-rights-in-afghanistan/ ఈ యుద్ధం తెచ్చిన విధ్వసం వల్ల దేశంలో అన్ని ప్రాంతాల్లో సంప్రదాయ భావాలు పెరిగాయి.
2021లో తాలిబన్ మీద యుద్ధం ఓడిపోయి అమెరికా మళ్ళా తాలిబన్‌కే అధికారం అప్పగించినప్పుడు, స్త్రీల పట్ల ఆంక్షల గురించి కొంత మేరకు ఆదేశించే ఆధిపత్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అమెరికా అవేం చెయ్యకుండా అన్ని బాధ్యతలని గాలి కొదిలేసి సైన్యాన్ని ఉపసంహరించుకుని వెళ్ళిపోయింది. కాబూల్‌లో అమెరికన్ సైన్యం నడిపిన స్కూళ్లలో పని చేసిన మహిళా టీచర్లని, అమెరికా ‘మీ చావు మీరు చావండని’ తాలిబన్ చేతుల్లో వదిలేస్తే, వారితో పని చేసిన పరిశోధకులు, ఎన్ జీ ఓలు వారిని ఎట్లాగయినా రక్షించటానికి నానా కష్టాలూ పడ్డామని ఒక జర్మన్ పరిశోధకురాలు నాతో చెప్పారు. మొన్నకి మొన్న తాలిబన్ నుండి పారిపోయి అమెరికాలో శరణార్థిగా వున్న ఒక ఆఫ్ఘన్ ఉద్యోగిని ట్రంప్ వదిలిన ఐస్ గూండాలు పట్టుకున్నారని వార్తలు వచ్చాయి.
ముస్లిం స్త్రీల అణచివేతని సామ్రాజ్యవాద ఎత్తుగడల్లో వనరుగా వాడుకోవటాన్ని విమర్శిస్తూ వచ్చిన అనేక రచనల్లో పాలస్తీనా స్త్రీవాది లైలా అబూ లూగోడ్ ముస్లిం స్త్రీలకి రక్షణ అవసరమా (2013)(https://www.hup.harvard.edu/books/9780674088269) అనే పుస్తకం ప్రధానమైంది. ముస్లిం స్త్రీలనందరినీ ఒకే గాటన కట్టి, చరిత్ర, రాజకీయాలు, ప్రాంతం నుండి వేరు చేసి, వాళ్లందరినీ ‘ఇస్లాం’ బాధితులుగా చూపించటం తప్పని వాదిస్తూ, అనేక పశ్చిమాసియా లేక ఆఫ్రికన్ ముస్లిం ప్రజలున్న దేశాల ప్రస్తుత పరిస్థితులకి పాశ్చాత్య వలస వాదం, యుద్ధ నీతులు, ఆధిపత్యం కారణమని ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. స్త్రీవాద ద్రుష్టి కోణం తప్పని సరిగా ఈ విస్తృత రాజకీయ నేపధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, లేకుంటే ఆయా దేశాల్లో, ప్రాంతాల్లో ముస్లిం స్త్రీలు తమ జీవితాలని బాగు చేసుకునే ప్రయత్నాలని పట్టించుకోకపోవటం జరుగుతోందని ఎత్తి చూపిస్తారు. అది ఆయా సమాజాల్లోని స్త్రీలని బయటి నుండి ఎవరన్నా వచ్చి తమని ఉద్ధరిస్తామని ఎదురు చూసే బాధితులుగా మాత్రమే చూడటానికి దారి తీస్తోందని కూడా చెప్తారు.
పాలస్తీనాలో క్వియర్ అస్తిత్వంతో వుండే వ్యక్తులని చంపేస్తారని, హమాస్ అధికారంలోకి వస్తే పాలస్తీనా స్త్రీలు ముసుగేసుకుని ఇంట్లో కూర్చుంటారని, అదొక అనాగరిక మత ఛాందస సమాజమని ఇజ్రాయెల్ ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేస్తోంది. హమాస్ పాలనలోని గాజా వంటి నిర్బంధ శిబిరంలో కూడా అనేక స్త్రీల, స్త్రీవాద సంస్థలు పని చేశాయి. అత్యంత విద్యాధికులయిన ఈ స్త్రీలు రచనల్లో, నిరసనల్లో, సంఘర్షణలో కీలక పాత్ర పోషించారు (జనెరల్ యూనియన్ అఫ్ పాలస్తీనా విమెన్, https://gupw.net/). శాంతి, సహజీవనం కోరుకునే యూదు స్త్రీలతో కలిసి శాంతి యాత్రలు చేశారు. అడ్డు గోడలని కూల్చే అనేక ప్రయత్నాలు చేశారు (విమెన్ వేజ్ పీస్, https://www.womenwagepeace.org.il/en/). ఇజ్రాయెల్ చేసే రాజ్యహింసతో పాటు కుటుంబ హింసకి వ్యతిరేకంగా పని చేశారు (విమెన్స్ సెంటర్ ఫర్ లీగల్ ఎయిడ్ అండ్ కౌన్సెలింగ్, https://www.wclac.org/en). హమాస్ కూడా క్రమంగా తన సాంప్రదాయ దృక్పధాన్ని మార్చుకుంది. హమాస్ అధికారులకి వారితో పని చెయ్యాల్సి వచ్చింది. రోజువారీ ఇజ్రాయెల్ నిర్బంధం, వున్నట్లుండి జరిగే మారణకాండ, 2023 నుండి జరిగిన మానవ హననం మధ్యలో కూడా కొనసాగిన ఈ స్త్రీవాద, మహిళా పోరాట వాస్తవాలని పరిగణనలోకి తీసుకోకపోతే హమాస్ ఒక ఇస్లామిక్ ఛాందస వాద సంస్థ కాబట్టి గాజాలో స్త్రీలకి ఊపిరి పీల్చుకునే అధికారం కూడా లేదని అనుకునే అటువంటి మూస అభిప్రాయానికి వచ్చే ప్రమాదం వుంది.
కొన్ని దశాబ్దాలుగా ఇరాన్లో స్త్రీల గురించి ఇజ్రాయెల్, అమెరికా, యూరోపు దేశాలు ఇదే రకమైన ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇరాన్‌లో ఎన్నికల ద్వారా ప్రతినిధులని ఎంచుకునే వ్యవస్థ వున్నా, ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించేది ముస్లిం మత గురువులన్న విషయం అందరికీ తెలిసిన సత్యమే. ఆస్తి, వివాహం, విడాకులతో పాటు ఆడవాళ్లపై చట్ట పరమైన ఆంక్షలు ఉన్నాయనేది కూడా అంతే నిజం. ఈ అన్యాయమయిన జెండర్ అంక్షలని వ్యతిరేకించిన ఆడవాళ్ళని జైళ్లల్లో పెట్టారని, హింసించారని, కొన్నిసార్లు చంపారన్నది కూడా నిజమే. వీటితో పాటు దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన అనేక మంది స్త్రీలు దేశం నుండి పారిపోవాల్సి వచ్చింది, లేదా దేశంలో రాజ్యహింసకి గురి కావాల్సి వచ్చింది.
అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్‌లోని పాలక వర్గం, మత గురువులు తాలిబన్‌లా ఆధునికతని, సైన్స్‌ని తిరస్కరించలేదు. బ్రిటిష్, అమెరికన్ సామ్రాజ్యవాదంతో 19వ శతాబ్దం నుండి తలపడటం వల్ల, ఆధునికతని అలవర్చుకుంది, ఇస్లాంతో కలిపి తిరగ రాసుకుంది. ఇప్పటి అధ్యక్షుడితో సహా అనేక మంది అనేక మంది పాశ్చాత్య జ్ఞాన రంగాల్లో నిపుణులు, డాక్టర్లు, సైంటిస్టులు, తత్వశాస్త్రం లోతుగా చదివిన వాళ్ళు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత ఆడవాళ్ళ అక్షరాస్యత 34% నుండి 95% కి పెరిగింది. వున్నత విద్యలో, ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథెమాటిక్స్)లో వారి శాతం దాదాపు 70% ఉంటుంది. ఇరాన్‌లో మహిళా కళాకారులు, ఆటగాళ్లు, రచయితలూ కోకొల్లలు. టాక్సీలు నడిపే వాళ్ళ నుండి బిజినెస్ చేసే వాళ్లు కూడా ఎక్కువే. ఇరాన్ జన జీవితంలో ఆడవాళ్ళ పాత్ర పెద్దది.
ఆంక్షలు, అంతరాలు, అసమానతలు, అణచివేతలు ఇరాన్ స్త్రీల పురోగతిని, నిరసనల్ని ఎప్పుడూ ఆపలేకపోయాయి. 20వ శతాబ్దపు మొదటి భాగంలో మన దేశ జాతీయోద్యమంలో పాల్గొన్నట్లే ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ పెట్రోలియం ప్రయోజనాలని కాపాడటానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని బ్రిటన్ పడగొట్టి మళ్ళా షాని అధికారంలో పెట్టినప్పుడు, 1970ల్లో రాచరిక వ్యతిరేక ఉద్యమంలో అన్ని వైపులా – లెఫ్టిస్టులు, ఉదారవాదులు, మత పరమైన ప్రతిఘటన ల్లోనూ పాల్గొని తీవ్రమైన హింసని ఎదుర్కొన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత కూడా జైళ్లలో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఎదుర్కున్న విపరీతమయిన ఆంక్షలు దాన్ని కఠినమయిన ఆత్మరక్షణ దృక్పధంలోకి నెట్టాయి. రిపబ్లిక్ ఏర్పడిన వెంటనే దానిపైన అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధించింది, తర్వాత సద్దాం హుస్సేన్‌ని ఇరాన్‌తో యుద్ధానికి ప్రోత్సహించి ఆయుధాలిచ్చింది. ఎనిమిదేళ్ల యుద్ధంలో ఇరువైపులా 10 లక్షల మందికి పైగా చనిపోయారు. యుద్ధం తర్వాత అత్యవసరమైన మందులు లేక అనేక మంది పిల్లలు చనిపోయారు. యుద్ధాన్ని, ఆంక్షలని తట్టుకున్న ఇరాన్ కఠినంగా తయారయింది. తనని తాను రక్షించుకోవటానికి పాలక వర్గం అంతర్గతంగా వచ్చిన నిరసనలని తొక్కేసింది, బయట హెజబీవుల్లా, హూతిలని తన రక్షణ కోసం తయారు చేసుకుంది. ఇజ్రాయెల్‌ని వ్యతిరేకించి, పాలస్తీనాని సమర్ధించి తన రాజకీయ పరపతిని పెంచుకుంది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించినప్పటికీ ఇరాన్ కున్న పెట్రోల్ నిల్వలు ఆర్ధికంగా దాన్ని నిలబెట్టాయి. కానీ నిరంతర ఆంక్షలు, అమెరికా, దాని సామంత రాజ్యాలయిన యూరోపు దేశాలు, చుట్టూ అమెరికన్ మిలిటరీ బేస్‌లు పెట్టిన గల్ఫ్ దేశాలు అన్నీ దేశ ఆర్ధిక అభివృద్ధిని కుంటుపరిచాయి.
అయితే ఇరాన్‌లో ప్రభుత్వ, మతాచారుల కఠినత్వాన్ని మార్చటానికి (అన్ని దేశాల్లో లాగే) మితవాదులు, సంస్కరణ వాదులు, దెబ్బలు, జైలు శిక్షలు అనుభవించి కూడా నిరంతరం పని చేశారు. వాళ్లలో తమని తాము ఇస్లామిక్ స్త్రీవాదులు అని వర్ణించుకున్న మహిళలు వున్నారు. ఖురాన్ గానీ, మత చట్టాలు గానీ స్త్రీల పట్ల వివక్ష చూపవనీ, వాటిని మగవాళ్ళు తమకి అనుకూలంగా వాడుకుంటున్నారని అంటూ, పితృస్వామిక ద్రుష్టి కోణాన్ని ప్రశ్నించి, కొత్త వ్యాఖ్యానాలని తీసుకొచ్చారు. కోర్టుల్లో షరియా చట్టాల అమలును ఆయా చట్టాలను అధ్యయనం చేసిన సాధారణ మహిళలు తమ కేసుల్ని తామే వాదించుకుని ఆ చట్టాల సాధికారతని ప్రశ్నించారు. లౌకిక స్త్రీవాదులు సాధ్యమయినన్ని సార్లు ఆయా చట్టాలని సవాలు చేశారు. వీళ్ళతో పాటు ఇస్లామిస్టు స్త్రీలు వ్యవస్థ లోపలి నుండి సంస్కరణల కోసం ప్రయత్నించారు. కొన్ని సార్లు అధికారంలోకి వచ్చిన సంస్కరణ వాదులు కొన్ని నియమాలని-హిజాబ్ వేసుకోవాలనే-చూసీ చూడనట్లు వదిలేశారు.
స్త్రీలు స్వేచ్ఛ, స్వాతంత్రాలకై చేసిన పోరాటాలకు, నిరసనలకు ఇరాన్‌లో విస్తృతమైన సమర్ధన లభిస్తూ వచ్చింది. స్త్రీలపై ఆంక్షలు శ్రామికులు, పేద ప్రజలు, జాతి పరమైన అల్ప సంఖ్యాకులు వీరందరి స్వేచ్చా, స్వాతంత్య్రాలతో ముడిపడి ఉంటుంది. 2022 లో కఠిన ప్రజా ప్రతినిధులు అధికారంలోకి వచ్చినప్పుడు, మెహసా అమీని కస్టోడియల్ మరణానికి వ్యతిరేకంగా (హిజాబ్ సరిగ్గా వేసుకెలేదనే కారణంతో నైతిక పోలీసులు అరెస్టు చేసి కొట్టటంతో ఆమె చనిపోయింది) జన్, జిందగీ, ఆజాది (మహిళలు, జీవితం, స్వేచ్ఛ) అని టెహ్రాన్‌తో పాటు అనేక పట్టణాల్లో స్త్రీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పుడు, వారితో పాటు అనేక మంది మగవాళ్ళు, ముఖ్యంగా యువకులు, కూడా పాల్గొన్నారు. మళ్ళా గత సంవత్సరం డిసెంబర్లో అమెరికా పధకం ప్రకారం సృష్టించిన ఆర్ధిక సంక్షోభం (https://www.youtube.com/shorts/Dx2Pg4bKNxw) వల్ల చిన్న దుకాణదారులతో సహా అనేక మంది రోడ్ల మీద కొచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. వాటిని మొస్సాద్ హింసాత్మకంగా మార్చటంతో ఆ అల్లర్లలో కొన్ని వేల మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ ఈ అల్లర్లతో ఇరాన్ ప్రభుత్వం పడిపోతుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు. https://www.nytimes.com/2026/03/22/us/politics/iran-israel-trump-netanyahu-mossad.html.
ట్రంప్ మొదటిసారి ఎన్నికయిన వెంటనే అమెరికా ఇరాన్‌ల మధ్య అణు ఒప్పందాన్ని రద్దు చేసాడు. దాని ప్రకారం ఇరాన్ బాంబులని తయారు చెయ్యనని, తన న్యూక్లియర్ ఏర్పాట్లని అంతర్జాతీయ అణు సంస్థ పర్యవేక్షించొచ్చని ఒప్పుకుంది. ఇప్పటి వరకూ ఆ సంస్థ ఇరాన్‌లో ఆయుధం తయారు చేసే అణు ఇంధనం కనుక్కోలేదు. కరెంటు, మెడికల్ అవసరాల కొరకు అణు ఇంధనాన్ని తయారు చేసుకోవటం సాధికారికమే. రెండోసారి ఎన్నికయినప్పటి నుండి ట్రంప్ యుద్ధానికి కాలు దువ్వుతూనే వున్నాడు. గతేడాది జూన్‌లో ఇరాన్, అమెరికా మధ్య ఖతార్ మరొక ఒప్పందం గురించి సంప్రదింపులు జరుగుతున్న సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన బాంబులేసి అన్ని న్యూక్లియర్ ప్లాంటులని నాశనం చేసేశామని చెప్పుకున్నాయి. అప్పుడు ఇరాన్ ఎక్కువ స్పందించలేదు. సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత, మళ్ళా అవే సంప్రదింపులు ఒమాన్ లో జరుగుతుంటే, అవి ఒక కొలిక్కి వస్తున్న సందర్భంలో (https://www.middleeasteye.net/news/war-not-their-making-omani-foreign-minister-says-iran) ఇజ్రాయెల్, అమెరికా మళ్ళా పెద్దగా ఏక పక్ష దాడుల్ని ప్రారంభించాయి. ఇరాన్ ప్రజలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటించమని, కూల్చేయమని పిలుపు నిచ్చాయి.
అయితే యుద్ధం ఇప్పుడు మిలిటరీ స్థావరాలపై జరగట్లేదు. ఇజ్రాయెల్ గాజాపై చేసిన యుద్ధం ద్వారా అంతర్జాతీయ నియమాలు, అడ్డూ, అదుపూ లేని ఆధునిక యుద్ధానికి తెర లేపింది. ఆస్పత్రులు, పౌర జీవనానికి అత్యవసరమైన నీళ్లు, కరెంటు, స్కూళ్ళు, యూనివర్సిటీలు, అన్నింటినీ నాశనం చేసి ఆ సమాజం మళ్ళా కోలుకోకుండా చెయ్యటమే ఈ యుద్ధ లక్ష్యం. గాజాలో జన హననం, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన, కొనసాగుతున్న కాన్సంట్రేషన్ క్యాంపు పరిస్థితుతులు, కొనసాగుతున్న హత్యలు, హమాస్‌తో సంబంధం లేని వెస్టు బ్యాంకులో గూండా సెటిలర్లు, పోలీసులు కలిసి పాలస్తీనీయులని వెళ్లగొట్టటం, చంపటం; లెబనాన్ ఆక్రమణ-పశ్చిమాసియాలో యుద్ధమంటే దేశాన్ని సర్వనాశనం చెయ్యటమనే అర్ధాన్ని తెచ్చాయి.
ఇరాన్‌లో అలసిపోయిన కొంత మంది నిరసన కారులతో పాటు, ఇతర దేశాల్లో వున్న ఇరానియన్లు మొదట్లో ఈ దాడుల్ని ఆహ్వానించారు. దాడులలో ఇస్లామిక్ రిపబ్లిక్ కూలిపోయి తాము స్వేచ్ఛగా ఇరాన్‌లో బ్రతకొచ్చు అనుకున్నారు. లోపలా, బయటా యుద్ధాన్ని వ్యతిరేకించిన ఇరానియన్లని మాకు మాత్రం దేశం మీద హక్కు లేదా అని సవాలు చేశారు. మరి కొంత మంది బయటి ఇరానీయన్లు తాము వ్యక్తిగతంగా యుద్ధాన్ని వ్యతిరేకించినా ఇరాన్‌లో ఉంటూ యుద్ధాన్ని ఆహ్వానిస్తున్న వారిని సమర్ధించాలని అనుకున్నారు. ఇద్దరిలో జరుగుతున్న సంఘర్షణని అర్ధం చేసుకునే రచనలు విషయ సంక్లిష్టతని అర్ధం చేయిస్తున్నాయి. (https://newlinesmag.com/argument/a-anguished-debate-among-iranians/ ఇరాన్‌లో అణచివేత నిజమే, కానీ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన జరుపుతున్న ఈ యుద్ధం ప్రజాస్వామ్యం, స్త్రీల విముక్తి ని తెస్తుందనుకోవటం ఒక భ్రమ అని అంటున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కలిపి ఇప్పటి వరకూ పశ్చిమాసియాలో, ఆసియాలో ప్రజాస్వామ్యం, స్త్రీల విముక్తి పేరుతో జరిపిన ఏ యుద్ధం కూడా ప్రజల కోసం జరగలేదని, పైగా అణచివేతని, అభద్రతని, అసురక్షిత పరిస్థితులని పెంచాయని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొదట్లో యుద్ధాన్ని సమర్ధించిన మసీహ్ అలినెజాద్ వంటి వాళ్ళు కూడా ట్రంప్ ఇరాన్‌లో పవర్ ఫెసిలిటీస్‌పై బాంబులు వేస్తామంటే అలా చెయ్యొద్దని అభ్యర్ధించారు.
ఖమేనీయి, లరిజాని వంటి లీడర్లని ఈ యుద్ధంలో చంపి ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌లో ప్రజాస్వామ్యం, స్త్రీల పరిస్థితులని, శ్రామికుల హక్కులని ఇంకా దిగజార్చాయి. వారి స్థానంలో వచ్చిన మోస్తాబ ఖమేనీయి వంటి హార్డ్ లైనర్లు హక్కులని, స్వేచ్చా స్వాతంత్య్రాల గురించి పట్టించుకునే అవకాశం కనిపించట్లేదు. సామ్రాజ్యవాద యుద్ధాలు ప్రజాస్వామ్యాన్ని, బాంబులు స్త్రీలకి విముక్తిని సాధించలేవు.

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.