అప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్, ఇప్పుడు హెచ్‌పివి టీకా.. – పి. ప్రశాంతి

జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ హాస్పిటల్‌లో జరుగుతున్న ఆ సమావేశం ప్రత్యేకమైనది. ఎందుకంటే, సరిగ్గా రెండు వారాల క్రితం ఇలాంటి సమావేశంలోనే హెచ్‌పివి టీకాకరణపై అవగాహన కల్పించడంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, జిల్లా సంక్షేమ అధికారి కలిసి దీనిని ఎలా అమలు చేయాలో ఒక నిర్దిష్ట కార్యాచరణను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో పాటు, విద్యాశాఖ అధికారులకు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లకు అందించారు.

రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉత్సాహంగా, జిల్లా అధికారులు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి తమతమ గ్రామాలకు వెళ్ళిన వీరందరికీ వారంలోపే ఎన్నో అనుభవాలు ఎదురైనాయి.
మొట్టమొదటిగా ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలకు వెళ్ళి అక్కడి టీచర్లకు టీకాకరణ సమాచారాన్ని ఇచ్చి, 14 నుండి 15 ఏళ్ళ అమ్మాయిలందరికీ టీకా వేయడానికి అనువుగా వారందరినీ పిహెచ్‌సికి పంపించమని చెప్పి వచ్చారు. అలాగే, పిహెచ్‌సిలు లేని గ్రామాల్లో డాక్టర్లు స్కూళ్ళకే వచ్చి టీకా వేస్తారని, అందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని టీచర్లకు చెప్పారు. తమ దృష్టిలో ఉన్నంత వరకు ఆయా గ్రామాల్లోని 14 నుండి 15 ఏళ్ళ వయసులో ఉండి, బడి మానేసిన అమ్మాయిలను కూడా ఆయా తేదీలలో సంబంధిత స్కూళ్ళకి రమ్మని చెప్పి వచ్చారు.
టీకాకరణ ప్రక్రియ మొదలైన మొదటి రెండు, మూడు రోజులు పరవాలేదు కానీ తర్వాత చాలా మంది అమ్మాయిలకి తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు, జ్వరం వంటివి రావడంతో కొన్నిచోట్ల తల్లిదండ్రులు స్కూళ్ళకి వచ్చి గొడవ చేశారు. కొన్నిచోట్ల అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి గొడవ చేశారు. ఈ సంఘటనలతో స్కూల్ టీచర్లు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు కూడా వెనకడుగు వేశారు, కొన్ని గ్రామాల్లో పనిచేస్తున్న యన్‌జివో కార్యకర్తలు ముందుగా బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం గురించి, వారి అంగీకారం తీసుకోవలసిన ఆవశ్యకత గురించి అప్పటికే వారితో మాట్లాడి ఉన్నారు. ఆ సందర్భంగా వారు 2009లో ఖమ్మం జిల్లాలో జరిగిన టీకాకరణ ప్రయత్నం, టీకా వేయించుకున్న అమ్మాయిల్లో కనబడిన తీవ్ర ప్రభావాలు, ముగ్గురు బాలికల మరణం గురించి కూడా గుర్తుచేశారు. ‘ఇవన్నీ అధికారులకి తెలియకుండానే ఉంటాయా, అప్పటికీ ఇప్పటికీ టీకాలో మార్పు చేసే ఉంటారులే, ఇది ప్రభుత్వ నిర్ణయం’ అని ఆరోగ్య శాఖ సిబ్బంది గట్టిగా మాట్లాడడంతో యన్‌జివో కార్యకర్తలు ‘సరే చూద్దాం, కానీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మీదే’ అని చెప్పడంతోపాటు, వారు కూడా జరుగుతున్న ప్రక్రియ మీద ఒక కన్ను వేసే ఉంచారు.
అయితే, టీకాకరణ ప్రారంభమైన తర్వాత బాలికల్లో వచ్చిన ఆరోగ్య ఇబ్బందులు, తల్లిదండ్రుల ఆందోళనతో పాటు, కొంతమంది ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలలోనూ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం, సరిగ్గా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యే సమయం కావడంతో టీచర్లు కూడా పదో తరగతి అమ్మాయిలని ఆపడంతో గ్రామాల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీన్ని మీడియా కూడా ఫోకస్ చేయడంతోపాటు, అసలు ఈ టీకా పూర్వాపరాలేంటి, ఏ దేశాలలో దీనిపై ఏమి జరుగుతోంది, మన దేశంలో అత్యవసరంగా అంత ఖరీదైన టీకాను ఉచితంగా వెయ్యాలని నిర్ణయించుకోడానికి వెనుక ఏముంది అంటూ ప్రశ్నలు లేవనెత్తడంతో అధికారులు అన్నిచోట్లా పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆ జిల్లా ఆసుపత్రిలో మొట్టమొదటి సమావేశం జరుగుతోంది. దీనికి కొంతమంది తల్లిదండ్రులు, యన్‌జివోల ప్రతినిధులు, బాలల హక్కుల కార్యకర్తలు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, మీడియా వారు కూడా వచ్చారు.
కార్యక్రమ ముఖ్య ఉద్దేశంతో పాటు, తల్లిదండ్రుల్ని ఆందోళన పరిచిన అంశాలు, మీడియా వారు లేవనెత్తిన ప్రశ్నలు అన్నిటినీ ప్రస్తావిస్తూ అధికారులు మాట్లాడారు. తర్వాత ఒక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ మాట్లాడుతూ ‘మీ అందరికీ తేలిగ్గా అర్ధం కావడానికి హెచ్‌పివి టీకా నేపధ్యం, చరిత్ర, అవసరం, దాని ప్రభావం వంటి అన్ని విషయాల గురించి ఈ మధ్యనే ఒక సీనియర్ డాక్టర్ రాసినది చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మీకు వచ్చే సందేహాలను, ప్రశ్నలను చర్చించుకుందాం, సరేనా?’ అని అడిగారు. దానికి అందరూ అంగీకారించడంతో ఇలా చెప్పడం మొదలు పెట్టారు. “డాక్టర్ నీరజా భాట్లా ఢిల్లీ AIIవీS లో ప్రసూతి మరియు స్త్రీల ఆరోగ్య విభాగాధిపతిగా పని చేసి రిటైర్ అయ్యారు, అలాగే ఝాజర్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా ఉన్నారు. హెచ్‌పివి టీకా గురించి ‘బాలికలకు ఒక చిన్న టీకా — గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలనకు ఒక మహత్తర అడుగు’ అంటూ ఆవిడ రాసిన వ్యాసపు శీర్షికే ఈ టీకా గురించి చెప్తుంది.
ఇక విషయానికి వస్తే, 2008లో ప్రొఫెసర్ హారాల్డ్ జూర్ హౌసెన్‌కు నోబెల్ బహుమతి లభించింది. ఆయన పరిశోధన ద్వారా హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పివి) యొక్క అధిక ప్రమాదకర రకాలు గర్భాశయ ముఖ క్యాన్సర్‌కు ప్రధాన కారణమని నిరూపితమైంది. ఈ ఆవిష్కరణ వల్ల నివారణాత్మక టీకాలు, నిర్ధారణ పరీక్షల అభివృద్ధికి మార్గం సుగమమైంది. 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔHO) గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2020 నవంబర్ 17న ఈ వ్యూహాన్ని 194 దేశాలు అధికారికంగా ఆమోదించాయి. మన భారతదేశం కూడా వాటిలో ఒకటి.
గర్భాశయ ముఖ క్యాన్సర్ మహిళలలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు లక్ష కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇది మహిళల ఆరోగ్యం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి ప్రత్యేకత ఏమిటంటే — ఇది నివారించగలిగిన క్యాన్సర్. 1940ల నుంచే పాప్ స్మియర్ పరీక్ష ద్వారా ప్రారంభ దశలోనే ప్రమాదకర మార్పులను గుర్తించడం సాధ్యమైంది. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభంగా చేయవచ్చు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్క్రీనింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది కొరత వల్ల ప్రతి మహిళకు సమయానుకూల పరీక్షలు అందడం కష్టమైంది. అయినప్పటికీ అవగాహన కార్యక్రమాలు, శిబిరాలు నిర్వహిస్తూ వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. హెచ్‌పివి టీకా 2006లో ప్రవేశపెట్టబడింది. మొదట మూడు డోసులుగా ఇచ్చినా, తరువాతి పరిశోధనల్లో రెండు డోసులు సరిపోతాయని, మరికొన్ని సందర్భాల్లో ఒక్క డోసే 85–90% రక్షణనిస్తుందని తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది డోసులు ఇవ్వబడిన తరువాత కూడా ఈ టీకా అత్యంత సురక్షితమని నిరూపితమైంది. సాధారణంగా తాత్కాలిక జ్వరం లేదా ఇంజెక్షన్ ఇచ్చిన చోట స్వల్ప నొప్పి వంటి చిన్న ప్రతిక్రియలు మాత్రమే కనిపిస్తాయి. సంతానోత్పత్తి, నెలసరి చక్రం లేదా మహిళల ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉన్నాయని ఎలాంటి ఆధారాలు లేవు.
హెచ్‌పివి టీకా ప్రభావం విశేషమైనది. ముఖ్యంగా హెచ్‌పివి 16 మరియు 18 రకాలకు ఇది దాదాపు సంపూర్ణ రక్షణనిస్తుంది. ఈ రెండు రకాలే ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం గర్భాశయ ముఖ క్యాన్సర్ కేసులకు కారణం అవుతున్నాయి. ఆస్ట్రేలియా, యుకే, స్వీడన్, డెన్మార్క్, కెనడా, అమెరికా వంటి దేశాల్లో హెచ్‌పివి టీకా ప్రవేశపెట్టిన తర్వాత గర్భాశయ ముఖ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఔHO లక్ష్యం ప్రకారం 2030 నాటికి: శ్రీ15 ఏళ్ల లోపు 90% బాలికలకు హెచ్‌పివి టీకా ఇవ్వాలి శ్రీ 35 మరియు 45 ఏళ్ల వయసులో 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలి శ్రీ గుర్తించిన కేసుల్లో 90% మందికి సరైన చికిత్స అందించాలి
భారతదేశంలో కూడా హెచ్‌పివి టీకాను యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చాలని వైద్య సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. 2026 ఫిబ్రవరి 28న జాతీయ హెచ్‌పివి టీకాకరణ కార్యక్రమం ప్రారంభం కావడం మహిళల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ముందడుగు.
ఇప్పుడు తల్లిదండ్రులు తమ 14 ఏళ్ల లోపు కుమార్తెలకు సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌పివి టీకా వేయించుకోవచ్చు. ఈ చిన్న టీకా మన బాలికల భవిష్యత్తును రక్షించడంలో, గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలన దిశగా భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఏళ్ళ అనుభవంతో, పరిశోధనలు కూడా చేసి, మనకొస్తున్న సందేహాల వంటివే ఇంకెందరికో వస్తుండడం వల్ల అందరికీ విషయం సులభంగా అర్ధం అవ్వడం కోసమే ఇది రాశానని డా. నీరజ అన్నారు. ఇప్పుడు మీ మనసుల్లో చెలరేగుతున్న ప్రశ్నలని చెప్పండి, అవసరమా మేరకు చర్చిద్దాం” అని ముగించారు. కొంత చర్చ, తర్జన భర్జనల తర్వాత అందరూ ఒక విషయంపై ఒకే మాట మీదకి వచ్చారు – టీకా ఇవ్వడానికంటే ముందే బాలికలకి, వారి తల్లిదండ్రులకి దాని అవసరం, ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పించి వారి పూర్తి అంగీకారంతో మాత్రమే టీకా వేయాలని, ఎవరైనా సంశయించినా, వద్దని అనుకున్నా వారికి మరింత అవగాహన కల్పించాలే కానీ టీకా తీసుకోవాలసిందే అని బలవంత పెట్టకూడదు అని.
ప్రజల సంరక్షణ, అభివృద్ధే తమ లక్ష్యం అని చాటింపేసుకునే ప్రభుత్వాలు, ప్రజలు వారి అవసరాలను అడగకుండానే తెలుసుకుని సేవ చేస్తామనే పార్టీలు, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాభివృధ్ధి అనే అధికారులు.. వీరెవ్వరూ ఇటువంటి అతి ముఖ్యమైన సందర్భాలలో విషయాలను తెలియచేస్తూ, అవగాహన కల్పిస్తూ, ప్రజల అంగీకారంతోనే అమలు చేయాలని మాత్రం ఆశించరు ఎందుకనో! మారుతున్న డిజిటల్ టెక్నాలజీని అడగకుండానే తమపై రుద్దుతున్నా, దాని ఫలితంగా తమ జీవితాలే మారిపోతున్నా, వాటి వైపరీత్యాలని కూడా ప్రశ్నించకుండానే భరిస్తున్న ప్రజలపై ఆధిపత్య ధోరణితో కాక ఇంకెలా ప్రవర్తిస్తాయి ప్రభుత్వాలు!! కానీ తమ శరీరాలపై జరిపే చర్యలకి తమ సమ్మతి ఉండాల్సిందే అని కోరడం ప్రతి ఒక్కరి మానవ హక్కు. అయితే ఇక్కడ ఆ అవకాశాలు ఏ కోశానా లేవు, అప్పడు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినప్పుడూ అంతే, ఇప్పుడు ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ ఇవ్వాలన్నప్పుడూ అంతే. మరీ ముఖ్యంగా, క్యాన్సర్ నిరోధక హెచ్‌పివి టీకా వంటి వాటి విషయంలో అది మైనర్ బాలికలకు ఉద్దేశించబడింది కనుక, వారికి, వారి తల్లిదండ్రులకి కూడా అవగాహన, విషయ పరిజ్ఞానం పెంచడంతో పాటు, వారి సమ్మతి తీసుకోవడం అత్యంత అవసరం.
ఇదే విషయం చర్చకి వచ్చినప్పుడు ఒక న్యాయాధికారి ‘పిల్లలు రాజ్యం సొత్తు, వారి సంరక్షణ రాజ్యం బాధ్యత, అందుకోసం ప్రభుత్వాలు ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవచ్చు’ అన్నారు. ఇది విషయాలని బట్టి, సందర్భాలని బట్టి మారుతూ ఉంటుందంటే నేనైతే నమ్మలేను! అందులోనూ పిల్లలు పుట్టిన కుటుంబాల నేపధ్యాన్ని బట్టి అది మారిపోతుందంటే అసలే ఒప్పుకోలేను!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.