అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార

తెలంగాణాలో రక్షిత కౌలుదార్లు అని వుండేవారు. (ఈ విలక్షణమైన చట్టం కేవలం తెలంగాణా ప్రాంతానికే పరిమితమైనది. తెలంగాణాలో కమÖ్యనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాటం జరిగిన తరువాత 1950లో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది).

ముఫ్పై ఏళ్ల క్రితం ఆ భూముల్లోంచి వెళ్లగొట్టబడ్డవారి వారసులు తమ తల్లిదండ్రుల భూమి తమకు దక్కుతుందన్న ఆశతో వుండేవారు. అలాగే మరో రకం సమస్యవుంది. ప్రభుత్వం పేదలకు భూములను కేటాయిస్తూ పత్రాలు ఇచ్చింది కానీ ఆ భూములు ఎక్కడున్నాయో చూపించలేదు. ఆ భూములు బడా భూస్వాముల పొలాల పక్కన వున్నాయనీ, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని భూస్వాములు చూస్తున్నారని ఆ పేదల అనుమానం. నిజానికి స్థానిక దేవాలయాలకు చెందిన సారవంతమైన భూములను సాగు చేసుకునేందుకు ప్రాధాన్యత ప్రకారం పేదలకు ఇవ్వాలి. కానీ వాటిమీద కూడా భూస్వాములే పెత్తనం చెలాయిస్తూ సాగు చేయించుకునేవారు. మరో సమస్య కూడా తెలంగాణాలో వుంది. 1952 నాటి భూదాన చట్టం ప్రకారం నిరుపేదలకు బహుమతిగా ఇచ్చిన భూములు కూడా ఇప్పటికీ భూస్వాముల గుప్పిట్లోనే వున్నాయి. ఇలాంటి సమస్యలు తెలంగాణాలో సర్వసాధారణం.
పేదల భూములను ఆక్రమించుకునేందుకు భూస్వాములు రకరకాల పద్ధతులను అనుసరించేవారు. 1948 నాటి తెలంగాణా ప్రాంత భయంకర పరిస్థితులవల్ల చాలామంది సంపన్న ముస్లింలు గ్రామాల నుంచి తమ భూములనూ, ఆస్తులనూ గాలికి వదిలేసి పారిపోయారు. సరైన యజమాని లేని అలాంటి భూములనన్నింటినీ భూస్వాములే ఆక్రమించుకున్నారు. ఆ భూముల గురించి భూరికార్డులలో ఎలాంటి వివరాలూ వుండేవి కావు. వాటిని ‘బేదాఖలా జమీన’ గా పరిగణించేవారు. వాటిని కూడా భూస్వాములే తీసుకునేవారు. మొత్తం మీద ఎక్కడ ఏ కాస్తంత భూమి కనిపించినా భూస్వాములు తమ ఖాతాలో జమచేసుకునేవారు. వాళ్ల దురాశకు అంతుండేది కాదు. ఈవిధంగానే వారి ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి.
పేదలు మా సంఘానికి అందజేసిన ఆ శిథిల భూ పత్రాలను చదివి అర్థం చేసుకునేందుకు సిరిల్ వాటితో అనేక రాత్రుళ్లు కుస్తీ పడుతూ కూర్చునేవాడు. తెల్లవారుతూనే వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను తయారుచేసి నా చేతికిచ్చి ఆ వివరాలు తీసుకురమ్మనేవాడు. నేను ఆయా ఊళ్లకూ, మండల కార్యాలయం, సీలింగ్ రికార్డుల కార్యాలయం, ఇబ్రహీంపట్నం కోర్టు వంటి వివిధ చోట్లకూ వెళ్లి ఆ వివరాలను సేకరించి సిరిల్‌కు అందించేదాన్ని. ఈ పనులన్నీ చాలావరకు నేను ఒక్కదాన్నే చేయాల్సి వచ్చేది. ఎందుకంటే మా సంఘంలో ఎవరికీ ఇంగ్లిషులో వున్న రికార్డులను చదవడం రాదు. పైగా వాళ్లు వెళితే ఆయా కార్యాలయాల తలుపులు అంత సులభంగా తెరుచుకునేవి కావు. ఈ పనులకు తోడు మా సంఘం ట్రేడ్ యÖనియన్ పనుల భారం కూడా నా మీద ఎక్కువగా వుండటం వల్ల నాకు ఒకోసారి విసుగొచ్చేది. అయితే అటు నిస్సహాయులైన పేదల పరిస్థితి, ఇటు ఆ వివరాలుంటేనే కేసును తయారుచేసేందుకు వీలవుతుంది అంటూ సిరిల్ పెట్టే ఒత్తిడి వల్ల ఎలాగోలా నేనే ఆ సమాచారాన్ని సేకరించి ఇచ్చేదాన్ని.
మా సంఘం (ఐటీవీసీఎస్) 1986లో తన మొట్టమొదటి భూ సంబంధ కేసును జబ్బార్‌గూడెంలో చేపట్టింది. ఆ ఊళ్లో 150 ఎకరాల ప్రభుత్వ భూమిని శక్తివంతుడైన భూస్వామి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కబ్జా చేసుకున్నాడనేది ఆ గ్రామస్తుల వాదన. ఆ ప్రాంతం నుంచి ఆయన మÖడు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జబ్బార్‌గూడెం` కందుకూరు మండలంలోని తిమ్మాపూరు గ్రామానికి అనుబంధంగా వుండే చిన్న పల్లె. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడుకు అది కేవలం ఒక కిలోమీటరు దూరంలో వుంటుంది. ఆ రెండు గ్రామాల మధ్య లావాదేవీలు, వివాహ సంబంధాలు వంటివి ఎక్కువ. జబ్బార్‌గూడెంలోని అత్యధిక భూములు ఎలిమినేడు రెడ్ల చేతుల్లో అందులోనూ మంచిరెడ్డి భూస్వాముల చేతుల్లో వుండేవి. అందువల్ల ఆ రెండు గ్రామాల మధ్య అనుబంధం ఎక్కువ. జబ్బార్‌గూడెంకు చెందిన నలుగురు మాదిగ వ్యక్తుల బృందం ఆ సంవత్సరమంతా మా మీటింగులన్నింటికీ వస్తూండటాన్ని నేను గమనించాను. వాళ్ల పేర్లు యాచారం బుడ్డజంగయ్య, యాచారం బుగ్గయ్య, యాచారం పుల్లయ్య, బైరూపుల జమ్మయ్య. బుడ్డజంగయ్య వారి నాయకుడు. మీటింగుల్లో వెనక వరుసలో మౌనంగా కూర్చుని, మీటింగ్ ముగిసిన తరువాత నన్ను కలసి అవీ ఇవీ మాట్లాడి వెళ్లిపోయేవారు.
‘మా మీటింగులకు ఎందుకు వస్తున్నారు’ అని ఒకసారి వాళ్లనడిగాను. ‘ఏంలేదమ్మా, మీరు కూలీల గురించీ, వేతనాల గురించీ మాట్లాడుతుంటరు కదా అందుకే..’ అన్నారు. ‘మా ఊళ్లో 150 ఎకరాల ప్రభుత్వ భూమి వుంది. అందులో మమ్మల్ని సాగు చేసుకోనివ్వడంలేదు. దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడండి’ అని చెప్పారు. ‘మేం తప్పకుండా సహాయం చేస్తాం’ అన్నాను. ‘కాదు స్వయంగా మీరే జోక్యం చేసుకోవాలి’ అన్నారు. మేం ఒప్పుకునేంత వరకూ వాళ్లు మÖడు నెలల పాటు ఇబ్రహీంపట్నం తాలూకాలో మా సమావేశాలు ఎక్కడ జరిగినా అక్కడికి వచ్చి చివరివరకూ కూర్చుని వెళ్తుండేవారు. నేను వారి అభ్యర్థనను అంగీకరించడానికి సమస్య గురించిన నా అవగాహనా రాహిత్యమే కారణం. ఎవరో అన్నట్టు దేవతలు నడిచేందుకు కూడా వెనుకాడే చోటుకి అజ్ఞానులు దూసుకు పోతారు. సంఘంలోని నా సహచరులకు భూసమస్యలోని లోతు పాతులు తెలుసు. అందుకే వాళ్లు నన్ను మౌనంగా గమనించేవారు తప్ప ఏవిధంగానూ ఒత్తిడి చేసేవారు కాదు.
జబ్బార్‌గూడెంలో పటేళ్లతో ఘర్షణ సమయంలో యాచారం బుడ్డజంగయ్య మాదిగల నాయకుడు. మెరిసే కళ్లు.. పదునైన మాటతీరు.. మనిషి పొట్టిగా వుండేవాడు. ఏమంత ధైర్యవంతుడు కాదు. సమావేశాల్లో తీవ్రమైన సంఘర్షణ జరుగుతున్న ప్రతిసారీ మనిషి పత్తాలేకుండా పోయేవాడు. జబ్బార్‌గూడెంలో ఏదో ఒక గుడిసెలో దాక్కునేవాడు. మేం అతని కోసం ఇల్లిల్లూ వెతకాల్సి వచ్చేది. అతడిని సమావేశానికి తిరిగి తీసుకువస్తుంటే నానా గొడవచేసేవాడు. మీరు ముందు నడవండి నేను వెనుకొస్తాననేవాడు. నాకు అతనేంటో ఏమీ అర్థమయ్యేది కాదు. ఇలాంటి వ్యక్తి ఆ గ్రామంలో నాయకుడెట్లా అయ్యాడా అని ఆశ్చర్యం వేసేది. కానీ అతను నోరు విప్పి మాట్లాడుతుంటే మాత్రం వినబుద్ధయ్యేది. రెవెన్యూ అధికారులతో మేం గొడవపడుతున్నప్పుడు వాళ్లంతా అవాక్కయ్యేలా వాదించేవాడు. అతని మాటల్లో నాటకీయమైన వేడుకోలు, విషాదం, కోపం కలగలిసి వుండేవి. నేను ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చేసిన చాలా ఏళ్లకు 2002లో బుడ్డజంగయ్యని మళ్లీ కలుసుకున్నాను. ‘మా ఊరి జాగీర్దార్లకు ఇరవై గుర్రాలుండేటియమ్మా. వాటికి దానా పెట్టడం మా పని. ఆ గుర్రం కొట్టాలు మా గుడిసెలెనకనే వుండేయి. జాగిర్దార్ కుటుంబం ఏ దసరాకో వచ్చి జబ్బార్‌గూడెంలో వారం దినాలుండి ఎల్లిపోతుండెటోళ్లు. అది సీతాఫల్కపండ్లు పండే కాలం. వాళ్లు తమ మోటర్‌కార్ల మంగల్‌పల్లి`పటేల్‌గూడెం రోడ్డుమీదకెల్లి వస్తుంటే మేం డప్పులు కొట్టేది. జీతం, బత్తెం ఏం లేకుంట ఆ దొరలకు ఎట్టికి సకల సేవలు చేస్తుండేది. వాళ్ల ఇండ్లకు, పొలాలకు నీళ్లు తోడేది, వాళ్ల బావులు తవ్వేది, వాళ్ల పొలా
లల్ల పల్లీలు నాటేది, చెరుకు పండించేది. వేరే కూలీలకు ఒక్కొక్కరికి వారానికి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల దాకా కూలీ ఇస్తుంటే మాకు మాత్రం వారానికి రెండు అణాలను ఇచ్చెటోడు. గదే మా భాగ్యం’ అంటూ చెప్పుకొచ్చాడు.
జబ్బార్‌గూడెంలోని ప్రధాన సమస్య ఏమిటంటే` మంచిరెడ్డి కిషన్ రెడ్డి తండ్రి భూపాల్ రెడ్డి 1953లో తిమ్మాపూర్ జాగిర్దార్ మహ్మద్ అబ్దుల్ సత్తార్ భార్య అజీజున్నీసా బేగం దగ్గర 107 ఎకరాల భూమిని కొన్నాడు. ఆ దస్తావేజు అతని దగ్గర వుంది. అయితే దాన్ని ఎరగా చూపించి అదే ఊరిలో వున్న మరో 107 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్నాడు. అంటే ఒకే పట్టాకు రెండు స్థలాలన్నమాట. ఊళ్లోని మాదిగలు కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో పంటలు పండించుకునేవారు. మిగతా భూమిలో పశువులను మేపుకునేవారు. ఆ అన్యాయాన్ని ఎత్తిచూపుతూ దళితులు సమర్పించిన పిటిషన్‌పై జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపాడు. ‘భూపాల్ రెడ్డి తిమ్మాపూర్ జాగిర్దార్ నుంచి 107 ఎకరాల స్థలం కొన్నాడనీ, కానీ అదే డాక్యుమెంటుతో రెండు వేరు వేరు చోట్లలో వున్న భూములు తనవే అని చూపిస్తున్నాడనీ, ప్రభుత్వ భూమి మీద అతనికి ఎలాంటి హక్కూ లేదని’ తేల్చి చెబుతూ ఆ రెండు భూములూ తనవే నన్న భూపాల్ రెడ్డి వాదనను ఆయన కొట్టివేశాడు.
భూపాల్ రెడ్డి అంతటితో ఆగిపోకుండా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన రూలింగ్స్‌కు వ్యతిరేకంగా 1969లో రెండు రిట్ పిటిషన్లను, 1971లో హైకోర్టులో మరో రిట్ అప్పీల్‌ను ఫైల్‌చేశాడు. అయితే ఆ రెండింటినీ హైకోర్టు 1971లో, 1974లో కొట్టేసింది. కావాలంటే ప్రభుత్వంపై సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చంటూ తేల్చిచెప్పింది. అయితే కేసు వేస్తే సివిల్ కోర్టులో కూడా గెలవలేనన్న భయంతో అతను కేసు వేయలేదు. దానికి బదులుగా ఒక సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. జబ్బార్‌గూడెంలోని బలహీనులైన 18 పేదకుటుంబాల మీద ఇబ్రహీంపట్నం మున్సిఫ్ కోర్టులో ఇంజంక్షన్ సూట్‌ను ఫైలు చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయడమనేది సంక్లిష్టమైన పని. నిరుపేద గ్రామీణుల వద్ద సరైన పత్రాలు లేకపోవచ్చు కానీ కానీ ప్రభుత్వం దగ్గర అన్నిరకాల పత్రాలూ వుంటాయి. అయితే పట్టుదల గల ప్రభుత్వ అధికారి లేదా ఇంఛార్జి కలెక్టర్ గనక వుంటే అక్కడ గెలవడం భూస్వాములకు కూడా కష్టం. అయితే ఇలాంటి చాలా కేసుల్లో bప్పుడూ పేదలే ఓడిపోతుంటారు. సరైన పత్రాలు లేకపోవడం, మంచి న్యాయవాదిని పెట్టుకోలేకపోవడం, కోర్టు వాయిదాలన్నింటికీ సరిగా హాజరు కాలేకపోవడం వంటి కారణాల వల్ల చివరికి వారికి ఓటమే bదురౌతుంటుంది. మొత్తం మీద 1975లో భూపాల్ రెడ్డి ఆ ఇంజంక్షన్ కేసులో గెలిచాడు. బుడ్డజంగయ్య ఆ కేసు గురించి చెబుతూ “గా పటేళ్లు తమ వకీలుకు మÖడు వేల రూపాయల ఫీజు ఇస్తే మేం మా వకీలుకు చచ్చీచెడీ ఇచ్చింది వంద రూపాయలేనాయె” అన్నాడు. అప్పటి తాశీల్‌దార్ సలీం గురించి చెప్తూ ‘ఈ కేసులో స్వయంగా భూమిని తనిఖీ చేసేందుకు జబ్బార్‌గూడెం వచ్చిండు. భూపాల్ రెడ్డి సోదరుడు రాములు పటేల్‌ను కలిసిండు. ఆయన కస్సుబుస్సు అనె వరకు భయపడి వచ్చిన దారిన్నే గప్‌చుప్‌గ ఎళ్లిపోయిండు’ అన్నాడు.
బుడ్డజంగయ్య దృష్టిలో సలీం మంచి అధికారే. ఎందుకంటే ఆయన వివాదాస్పద ప్రాంతానికి భూముల తనిఖీకోసం ధైర్యంగా వచ్చాడు కదా. అందుకే సలీంను కలుసుకునేందుకు ఒకసారి జంగయ్య హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లాడు. రోజూ ప్రొద్దున్నే సలీం ఇంట్లో పాలు పోసే తమ ఊరి కుర్రవాడు జంగయ్యకు బాగా తెలుసు. ఆరోజుల్లో చాలామంది గ్రామస్తులు హైదరాబాద్‌లోని సంపన్నుల, అధికారుల ఇళ్లకు పాలు సరఫరా చేసేవారు. తమ సైకిళ్లకు రెండు పెద్ద పాల క్యాన్లు కట్టుకుని ముఫ్పై నుంచి యాభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చి పాలు పోసి వెళ్లేవారు. అలా బుడ్డజంగయ్య తహశీల్దార్ సలీంను ఇంటివద్ద కలిశాడు. అప్పుడు సలీం ‘నువ్వేం బాధపడకు జంగయ్యా. వాళ్లకా భూమి చచ్చినా దక్కదు. కలెక్టర్ దగ్గరకు వెళ్లి నీ సమస్య చెప్పుకో. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలడు. నేను ప్రయత్నించినా నా మాట వినేదెవరు. నేను తహశీల్‌దార్‌నే కానీ నాతో ఏం లాభం లేదు. ఆ భూస్వామి దగ్గర కోట్ల రూపాయలున్నాయి. నాలాంటి వాళ్లకు వెయ్యి రూపాయలైనా ఇస్తాడు. నువ్వేం ఇవ్వగలవు చెప్పు? అందువల్ల ఒక మంచి వ్యక్తి సహాయం చేసేంతవరకు ఎదురుచూస్తా వుండు. అంతిమ విజయం మీదే’ అన్నాడట. సలీం మంచి అధికారే కానీ ధైర్యంలేనోడు. రెడ్లను ఎదుర్కోవాలంటే ఆయనకు తగని భయం.
దళితులు 1975లో హైకోర్టులోనూ, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులోనూ అప్పీళ్లను ఫైల్ చేశారు. కానీ వాటిలో కూడా ఓడిపోయారు. ఆ భూమిని సొంతం చేసుకునేందుకు భూపాల్ రెడ్డి ఎత్తులు వారికి అర్థమయ్యాయి. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం మౌనంగా వుండిపోయింది. ప్రత్యేకించి స్థానిక రెవెన్యూ యంత్రాంగం బలహీనంగా వున్నప్పుడు, అది భూస్వాములతో కుమ్మక్కైనప్పుడు ప్రభుత్వ భూములను కబ్జా చేసుకునేందుకు భూస్వాములు అనుసరించే పద్ధతి ఇదే. పాత స్టాంపు పేపర్లతో నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తారు. వాటి ఆధారంగా స్థానిక మున్సిఫ్ కోర్టులో మండల రెవెన్యూ అధికారిపై ఒక ఇంజంక్షన్ కేసును ఫైల్ చేస్తారు. ప్రభుత్వ వకీలు కోర్టుకు గైర్‌హాజర్ అయ్యేలా అతనికి డబ్బు ఎరవేస్తారు. భూ ఆక్రమణదారులు తమ కేసుకు బలంగా అసలు భూ యజమాని స్థానంలో మరో నకిలీ భూ యజమానిని ప్రవేశపెడతారు. ఆ తరువాత విడిగా ఇంకో కేసు వేస్తారు. ఆ కేసులో భూస్వామే గెలుస్తాడు. భూస్వామికి ప్రభుత్వ వ్యతిరేక కేసులో ఇంజంక్షన్ వచ్చిన తరువాత బినామీ పేరిట అతనికున్న హక్కు రుజువైనట్టే. స్థానిక పోలీసులకు, మీడియాకు ముడుపులు చెల్లించి భూస్వామి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాడు. ఆ ఇంజంక్షన్ ను శాశ్వతీకరించేలా స్థానిక మున్సిఫ్ మెజిస్టేట్ కోర్టు ద్వారా ముందుకెళ్తాడు.
జబ్బార్‌గూడెం దళితుల వద్ద ఎలాంటి అధికారిక, పనికొచ్చే పత్రాలు లేవు. ముక్కలు ముక్కలుగా వున్న కొన్ని కాగితాలను వాళ్లు 1986 మార్చిలో నా వద్దకు తీసుకుని వచ్చారు. అందులో స్టాంపు కాగితం మీద భూపాల్ రెడ్డికీ వారికీ మధ్య కుదిరిన ఒప్పంద పత్రంలోని మొదటి పేజీ మాత్రమే వుంది. భూపాల్ రెడ్డి వారికి ఆ పత్రం తాలూకు మొదటి, మÖడవ, ఐదవ పేజీలను ఇచ్చి రెండవ, నాలుగవ, ఆరవ పేజీలను తన దగ్గరే పెట్టుకున్నాడు. వాళ్ల దగ్గర ఒక సంవత్సర కాలానికి సంబంధించిన పహాణీలు కూడా వున్నాయి. వారిలోని పదిమంది హక్కుదార్ల పేర్లు అందులో పేర్కొనబడివున్నాయి. నాకా అంశం చాలా ఆసక్తిని కలిగించింది. ఆ పత్రాలను సిరిల్‌కు చూపించాను. మేం ఆ కేసును పునర్నిర్మించే పనిలో మునిగిపోయాం. సిరిల్ ఆ పత్రాలు క్షుణ్నంగా పరిశీలించి ఇంకా ఏయే పత్రాలు కావాలో సూచించి వాటిని వెతికి తీసుకురమ్మన్నాడు.
నేనా పనిని చాలా శ్రద్ధగా చేశాను. కందుకూరు మండల కార్యాలయంలో ఒక స్నేహపూర్వక వ్యక్తిని కనుగొన్నాను. ఆయన ఒంటరిగా వున్నప్పుడు కలుసుకుని నాకు అవసరమైన పత్రాల గురించి వివరించాను. వాటిని ఇచ్చేంత వరకూ నేను ఆయన వెంటపడుతూ వచ్చాను. అలాగే సంబంధిత అధికార్ల ఇళ్లకు ప్రొద్దున ఆరుగంటలకే వెళ్లి కలుస్తుండేదాన్ని. వారిని కలవాలంటే ఇంటిదగ్గర ఉదయం పూటే అనుకూలంగా వుంటుందని నాకు తెలుసు. ఆఫీసులో అయితే మన పట్ల సానుభూతి వున్న అధికారైనా సరే జంకుతుంటాడు. ఎందుకంటే ఎవరైనా వారిమీద భూస్వాములకు రకరకాల చాడీలు చెప్పే అవకాశం వుంటుంది. నేను అంత
ఉదయమే తమ ఇంటికి వస్తున్నందుకు ఆ అధికార్ల భార్యలు ఆసక్తిని కనబరిచేవారు. మండల కార్యాలయంలో నేను దాదాపు ప్రతి ఒక్కరితో కలసి మాట్లాడుతూ వారితో కలసి చాయ్‌లు తాగేదాన్ని. ముందు ఏదో ఒక కాగితం దొరికితే మరో కాగితం దొరకడం సులభం అవుతుంది. మొత్తం మీద ఆ విధంగా మÖడు నెలల పాటు శ్రమించి కావలసిన పత్రాలనన్నింటినీ సమీకరించాను. ఆ తరువాత సిరిల్ నేనూ కలసి కేసును పునర్నిర్మించే పనిలో పడ్డాం. జబ్బార్‌గూడెంలో ఆనాడు పోరాడిన వృద్ధులు చెప్పిన వివరాలు ఆ పత్రాలలోని వివరాలు సరిగ్గా సరిపోయాయి. పేద ప్రజలు నిజాయితీగా పోరాడుతున్నప్పుడు కేవలం నిజాలే చెప్తారన్న విషయం అర్థమైంది. అయితే వారి కథనం, భాష అందరికీ అర్థం కాకపోవచ్చు. ఆ నిజాలను అందరికీ అర్థమయ్యే భాషలో రెవెన్యూ పాలనా యంత్రాంగం, న్యాయ వ్యవస్థ మెచ్చే రీతిలో వ్యాఖ్యానించడమే మనం చేయాల్సిన పని.
ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటీవీసీఎస్) ఏర్పడకముందరి ఇక్కడి పోరాటాల చరిత్ర చాలా ఆసక్తికరంగా వుంటుంది. మంచిరెడ్డి కుటుంబానికీ జబ్బార్‌గూడెం పల్లెకూ మధ్య పింగ్ పాంగ్ ఆటలా సాగిన ఆ పోరాటంలో ఎప్పుడూ పంటల విధ్వంసమే చోటుచేసుకునేది. అనేకసార్లు అపజయం ఎదురైనా జబ్బార్‌గూడెం జనం తమ పోరాటాన్ని ఆపలేదు. ఆ పొలాల్లో భూస్వాములు విత్తనాలు నాటినప్పుడు గ్రామస్తులు ఆ పంటలను నాశనం చేసేవారు. గ్రామస్తులు విత్తనాలు నాటినప్పుడు వాటిని భూస్వాములు ధ్వంసం చేసేవారు. దాంతోపాటు పోలీసులను రప్పించి గ్రామస్తులపై దాడులు చేయించేవారు.
ఆ పల్లెలోని మాదిగలలో ఎక్కువ మంది రెడ్ల వద్ద వెట్టి చాకిరీ చేసే కూలీలే. అయినా సరే
వాళ్ళు ఏదో ఒక విధంగా తమ పోరాటాన్ని కొనసాగించేవారు. కోర్టు కేసులకు హాజరయ్యేందుకు బస్సు ఛార్జీలను ఆ రెడ్లనే అడిగి తీసుకునేవారు. 1978లో ఒక రాజీ సూత్రం ప్రకారం ఆ వివాదాస్పద భూమిలోంచి ఓ పది ఎకరాలలో ప్రభుత్వం కొంతమంది మాదిగలకు పట్టాలు ఇచ్చింది. అప్పుడు మంచి రెడ్డి కుటుంబం ఆ భూమిని రైతులతో కలసి సమంగా పంచుకునేందుకు అంగీకరించింది. కోర్టులో భూపాల్ రెడ్డిపై ప్రభుత్వం గెలిచిన తరువాత ఆ భూమిని ఎవరికైనా కేటాయించే హక్కు ప్రభుత్వానికి వుంది. అందుకే 1978 ప్రాంతంలో నిబద్ధులైన కొందరు ప్రభుత్వాధికారులు పది ఎకరాలను భూమిలేని నిరుపేద గ్రామస్తులకు పంచి పట్టాలు ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మిగతా భూమిలో ఆ పని చేయలేకపోయి వుంటారు. స్టాంపు కాగితాల మీద ఒప్పందం రాసుకున్న తరువాత రైతుల వద్ద ఆ ఒప్పందం తాలూకు రెండో పేజీ మాత్రమే వుండిపోయింది. 1979లో భూస్వాములు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. రైతుల వద్ద అసంపూర్తిగా వున్న ఒప్పందపత్రం పనికిరాకుండా పోయింది. ఆ తరువాత కొన్ని వర్గాలవారు పటేల్ శిబిరంలో చేరారు. వారిలో చాలామంది పటేళ్ల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లే. మరికొందరిని డబ్బు ఎరవేసి లోబరచుకున్నారు. వారి మధ్య తలెత్తిన అంతర్గత విభేదాల గురించి ఇంక చెప్పనవసరం లేదు. ఉదాహరణకి యాచారం బాలయ్య 1978 నుంచి 1988 వరకు భూపాల్ రెడ్డికి నమ్మిన బంటుగా సేవచేస్తూ వుండిపోయాడు.
శక్తివంతులైన భూస్వాములతో పోరాడాలంటే పేదలకు చాలా ఇబ్బందులుండేవి. సివిల్ కోర్టుల్లో న్యాయ వ్యవస్థ వారికి సానుకూలంగా వుండదు. వ్యతిరేకంగా వుంటుంది. ఇరుపక్షాల వకీళ్లు తమ వాదనలను తటస్థ వ్యక్తి అంటే జడ్జి ముందు పెడతారు. ఆయన తన ముందుంచిన పత్రాలపై ఆధారపడి తీర్పు చెప్తాడు. పేదల దగ్గర కావలసిన పత్రాలు వుండవు. వారికి మంచి వకీళ్లను పెట్టుకునే స్థోమత వుండదు. సాధారణంగా వకీళ్లంతా అగ్రకులస్తులే అయివుంటారు. వారితో పేదలకు ఎలాంటి సంబంధాలూ వుండవు. వకీళ్ల ఫీజును చెల్లించేందుకు వాళ్ల వద్ద డబ్బుండదు. వాళ్లకు కోర్టు పరిభాష ఏమాత్రం అర్థం కాదు. ఇక కోర్టులు కూడా పేదల పట్ల ఎప్పుడో తప్ప సానుభూతిని చూపవు. ఎందుకంటే కోర్టుల్లో వుండేవాళ్లంతా ఎక్కువగా ఆధిపత్య కులాలకు చెందినవాళ్లే.
మా వ్యూహాన్ని సిరిల్ చాలా పకడ్బందీగా, ద్విముఖంగా రూపొందించాడు. మేం ఈ సమస్యను రెవెన్యూ కోర్టుల వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అక్కడైతే అనుకూలమైన తీర్పులను ఆశించవచ్చు. మోసపూరిత పద్ధతులలో భూపాల్ రెడ్డి తనే గెలిచినట్టు చెప్పుకుంటున్నాడు. కానీ నిజానికి అతను ప్రభుత్వం మీద కోర్టులో విజయం సాధించలేదు. మేం ప్రభుత్వం వద్దకు వెళ్లి 1967లో జాయింట్ కలెక్టర్ ఇచ్చిన తీర్పు, అప్పటి ప్రభుత్వ తుదినిర్ణయం అమలు కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే గ్రామంలో పటిష్టమైన ఐకమత్యం వుండాలి. ఎందుకంటే అత్యంత బలవంతులైన భూస్వాములతో చేస్తున్న కీలకమైన పోరాటమది. అదేసమయంలో సివిల్ కోర్టులో డిఫెన్సివ్ చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఈవిధంగా మేము సివిల్, రెవెన్యూ రెండు కోర్టుల వివిధ అధికారాలనూ, అధికార పరిధులనూ ఉపయోగించుకోవచ్చు. హైకోర్టు స్థాయి వరకూ సివిల్ కోర్టులు ప్రజలకు వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆదేశాలను` సమర్థించాయి. కానీ, రెవెన్యూ కోర్టులు మాత్రం ప్రజల వాదనకే మద్దతు పలికాయి. దీనికి తోడు 1967లో జాయింట్ కలెక్టర్ ఈ కేసుపై విచారణ జరిపి ఇచ్చినప్పటి ఆదేశాలను ఇంతవరకూ bవరూ సవాలు చేయలేదు.
మేము 1986లో ఆ భూములను దున్ని సాగుచేసుకోండని జనాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాం. భూస్వాములు అప్పటికే ఆ పొలాల్లో ఆముదాలను నాటించారు. పంట పండించే వారికే ఆ భూమి మీద 99 శాతం యాజమాన్య హక్కు వుంటుందని సిరిల్ ఎప్ప్పుడూ చెప్పేవాడు. అందుకే జనాన్ని ఆ భూములను దున్ని సాగు చేసుకోండని చెప్పేవాళ్ళం. కానీ చెప్పినంత సులభం కాదు చేయడం. జబ్బార్‌గూడెం జనానికి భూములు కావాలి. కానీ భూపాల్ రెడ్డితో పోరాడటం మాత్రం వారికి ఇష్టంలేదు. ఎందుకంటే అప్పటికే అనేకసార్లు అతని క్రౌర్యాన్ని చవిచూసి వున్నారు. అందుకే మేం ఆ చుట్టు పక్కల గ్రామాల జనం మద్దతును సమీకరించాలనుకున్నాం. ఆమేరకు పిలుపునిచ్చాం. ఇరుగు పొరుగు గ్రామాల నుంచి అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది. జబ్బార్‌గూడెం భూపోరాట భారాన్ని ఎక్కువగా ఎలిమినేడు గ్రామస్తులు భరించారు. అయినా వాళ్లు ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. మద్దతుగా వచ్చిన జనంలో మాదిగలే ఎక్కువ. చుట్టుపక్కలి కప్పాడ్, చెర్లపటేల్‌గూడెం, మాదాపూర్ గ్రామాల నుంచే కాకుండా జబ్బార్‌గూడెంకు ఇరవై కిలోమీటర్ల దూరంలోని దండుమైలారం గ్రామం నుంచి కూడా జనం తరలి వచ్చారు. జబ్బార్‌గూడెం సోదరులకు సంపూర్ణంగా సంఘీభావాన్ని తెలిపారు. అవి జూన్ నెల తొలిరోజులు. మండే ఎండలు తగ్గిపోయాయి. మేమందరం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పొలాల్లోనే బైఠాయించేవాళ్లం. సాయంత్రం పూట పాటలే పాటలు! మా అందరి భోజనాల కోసం జబ్బార్‌గూడెం మహిళలే వంటలు చేసేవారు. పటేళ్లు నాటించిన ఆముదాలను పీకేసి జనం జొన్న పంట వేశారు. పటేళ్లు మమ్మల్ని భయపెట్టేందుకు హైదరాబాద్ నుంచి గూండాలను రప్పించారు. వాళ్లు పొýం గట్ల మీద మకాం వేశారు తప్ప మా దగ్గరకు వచ్చేందుకు సాహసించలేకపోయారు. అప్పటికే మేం చుట్టుపక్కలి గ్రామాల నుంచి దాదాపు వెయ్యిమందిని సమీకరించాం. గుండాలు తిరిగి వెళ్లిపోయేంత వరకు నాలుగు రోజులపాటు వాళ్లందరూ ఆ పొలాల్లో మాతోనే వున్నారు.
జబ్బార్‌గూడెం పరిస్థితులను ప్రభుత్వం గమనించింది. భూస్వాములకూ మాకూ మధ్య ఎక్కడ భారీస్థాయిలో ఘర్షణ జరుగుతుందో నన్న ఆందోళనకు గురైంది. హైదరాబాద్ (తూర్పు) ఆర్.డి.ఒ. ఆ భూమిలో 144 సెక్షన్‌ను విధించారు. అప్పటికే మేం అక్కడ జొన్న పంట వేసివున్నాం. 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 144వ సెక్షన్‌ను మెజిస్టేట్ స్థాయి అధికారి ఆ ప్రదేశంలో చట్ట వ్యతిరేకంగా నలుగురి కంటే ఎక్కువ మంది గుమి కూడకుండా నిషేధం విధించవచ్చు. ఆర్‌డీఓ జారీచేసిన ఆ ఉత్తర్వుల దెబ్బకి ఆ భూమి భూస్వాముల స్వాధీనంలో లేకుండా అయింది. జొన్న పంట కోతకు ఆర్‌డీఓనే ఒక కాంట్రాక్టర్‌ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులంతా ఆ కాంట్రాక్టర్ ఖర్చును భరించి ఆ తొలి పంటను సొంతం చేసుకున్నారు. అదొక మధురమైన విజయం. 1986 నుంచీ నేను ఇబ్రహీంపట్నంను వదిలి 1993లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేంత వరకూ జబ్బార్‌గూడెం పోరాటమే నా నిత్యకృత్యమైపోయింది. జబ్బార్‌గూడెంలోని ప్రతి ఒక్కరి పేరూ నాకు తెలుసు. ప్రతిరోజూ ప్రతి పరిణామాన్నీ శ్రద్ధగా గమనిస్తుండేదాన్ని. అదొక అతి ముఖ్యమైన పోరాటం. మేం అందులో తప్పక విజయం సాధించాలి. ఒక ఉదాహరణగా నిలవాలి. ఎందుకంటే మొత్తం ఇబ్రహీంపట్నం తాలూకాలోనే అత్యంత క్రూరుడూ, శక్తిమంతుడైన వ్యక్తి పెత్తనం కింద నలిగిపోతోందా ఊరు.
చివరికి ఆ భూముల్లోంచి రెడ్లను వెళ్లగొట్టగలిగాం. ఎంత చిన్నదైనా మొదటి విజయం తరువాత ముందుకు వెళ్లడం చాలా సులభమవుతుంది. మేం ఆ భూమిలో పంటలు పండించడాన్ని కొనసాగించాం. మరోపక్క కోర్టు కేసులు కూడా కొనసాగుతుండేవి. అయినాసరే ఇతర సమస్యలను చేపట్టేందుకు కూడా మాకు వీలయ్యేది. ఆ చిన్న విజయం ఆ ప్రాంతం మొత్తం మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. భూపాల్ రెడ్డినీ, అతని కుటుంబాన్నీ ఆ భూమిలోంచి బయటికి పంపించడమనేది అక్కడి జనానికి నమ్మ శక్యంగా అనిపించేది కాదు. వేరే ఊళ్లలో కూడా అలా అక్రమంగా ఆక్రమించుకున్న రెడ్లను ఆ భూముల్లోంచి తరిమేయడం అసాధ్యమేమీ కాదన్న నమ్మకం జనాలందరికీ ఏర్పడింది. నాలుగు మండలాల్లోని పేదలలో ఆత్మస్థైర్యం పెరిగింది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.