చిన్నప్పుడు లెక్కల మాస్టారు మెదడు మోకాల్లో ఉందంటే రోషం వచ్చేది కానీ
ఇప్పుడు నా మెదడు అంతా మోకాళ్ళే ఆక్రమించాయి
కలుక్ కలుక్కుమంటూ మొలకల మొదలై నా జీవనావరణం అంతా పాకి పందిరేసాయి !!
అన్నా !!
వయసు వయ్యారాలొలికే నాడెన్నడూ అడుగుల్లో హంసల్ని పిల్లి నడకలని అనుకరించిన పాపాన పోలేదు.
మరి ఇప్పుడెలా వచ్చి వాలాయో నడకల్లో ఈ వక్ర బాతులు
ఇష్హో హష్షు అంటూ ఎంత తోలినా పోవడమే లేదు.
ఆజానుబాహు గర్వం కాస్త
ఈ జానువుల దెబ్బకి కుప్పకూలిపోయాయి
కాల కృత్య భంగిమ కూడా కాలసర్పంగా భయపెడుతున్నాయి
వరమడిగెందుకో మొర పెట్టేందుకో గుడికి వెళ్తే మెట్టు మెట్టుకు తిట్ల పూజానాయే
అడుగుల్లో లెక్కించి మురిసిన ఇల్లు ఇవాళ అడుగుకి పడగ విప్పినట్లు బుసలు పోయే !!
ఇవన్నీ అటుంచి జుట్టుకి రంగేసి గుట్టుగా బుట్ట మూతేసిన వయసు కాస్త
మోకాళ్లు కన్నుగీటగా భళ్ళున బద్దలైన చింతొక్కటాయే
చెప్పొద్దు వయ్యారంగా నిలిచిన రవి వర్మ చిత్రంలోను వంకర పోయిన మోకాళ్ళే కనపడుతున్నాయి నాకు
మోహన రాగంలో కూడా మోకాళ్ళ గరగరలే వినిపిస్తున్నాయి నాకు.
ఆకాశమంత నిలిచిన బాహుబలి ప్రతిమ చూసినా కాళ్లు నెప్పిడతాయి బాబు కాసేపు కూర్చోమన బుద్ధి వేస్తుంది నాకు
క్షమించండి ఇప్పుడు బోడిగుండు నే కాదు బోధి వృక్షాన్ని సైతం మోకాళ్ళతోనే ముడిపెట్టి తీరతాను నేను
సాక్షాత్తు మన్మధుడే వచ్చి విహారానికి పిలిచిన మడతకురాని మోకాళ్ళని చూపెడతాను నేను
కావ్య సభ గౌరవాన్ని కాలదన్నానని మీరంతా అక్షేపించిన కందగడ్డల్లా వచ్చిన కాళ్ళ పద్యమే పాడుతాను
మనసు మంచు కొండల్లో విహరిద్దాం అంటున్నా మందు రాసిన కాళ్ళని మంచం కోళ్లకే కట్టేస్తాను.
అయినా నేనైనా మీరైనా మనం ఎవరైనా ఎదురు తిరిగే వరకు ఎవరిని గుర్తించం కదా
దేహానికి పునాదిరాళ్లు కదా మోకాళ్లు
తనువులతను నిలబెట్టే వేళ్ళు కదా మోకాళ్లు
జీవన వ్యవసాయానికి చాలు దున్నే నాగళ్ళు కదా మోకాళ్ళు
మరి తలనొక్క దాన్ని మోసే మెడకు తళుకులీనే హారాలు ఎన్నో వేసే మనం తనువంతామోసే మోకాళ్ళకి పాపం ఒక్క నగైనా వేసామా!!
నాతోపాటు నా బిడ్డల్ని మోసే పిచ్చి మోకాళ్ళమ్మా అని లాలించి ప్రేమించి ఒక్క ముద్దు అయినా పెట్టామా
మన కాళ్ళ మీద మనం నిలబడ్డామన్న ప్రశంసలు మోకాళ్ళని ఎప్పుడైనా తలచామా
అలగవా మరి అలిగి అలిగి అరగవా మరి
మోయంపో నిన్నిక అని గరగర మొరగవా మరి !!
అలా అరిగి అలిగి ఆశలన్నీ కరిగి ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అని
మోకాళ్ళు ఈడిస్తూ మొరెత్తి ఏడ్చాక
గుజ్జుపట్టే మాత్రల రజుసర్ప బ్రాంతి తీరాక
నిప్పు పెట్టే నొప్పి మాత్రలతో కడుపు పిడకల దాలిలాగా కాలాక
అప్పుడు మోకాళ్ళ మఠం మీద గురు స్థానం అలంకరించిన ఒకడు కత్తి రంపం పుచ్చుకుని ప్రత్యక్షమవుతాడు
ఈ మోకాళ్లు కూడా మగాళ్ళ వంటివేనని మాట వినకపోతే మార్చి వేయడమే మందని మోక్ష తీరం ప్రసాదిస్తాడు !!
( మోకాళ్ళ పీఠాధిపతి డా.గురవారెడ్డి గారికి …గౌరవంగా )
