చెట్టు ప్రసవ వేదన పడి
ఆకుకు జన్మనిచ్చింది…
చిగురాకును తొడిగిన ఆ క్షణం
చెట్టుకు కొత్త ఉత్సాహం కలిగింది,
సంబరంతో ఊగిపోయింది.
లేత పచ్చని నవ్వులతో కేరింతలు కొడుతూ,
కొమ్మల ఒడిలో ఆ ఆకు ఎదిగింది.
గాలిలో ఊగుతూ,
వానలో గెంతులు వేస్తూ,
ఎండను భరిస్తూ
రోజురోజుకీ పరిపక్వతను సంతరించుకుంది.
పువ్వుల పుట్టుకకు తోడై,
కాయల ఎదుగుదలకు నీడై,
పండ్ల పరిపక్వతకు కారణమై,
తన వంతు బాధ్యతను నెరవేర్చింది.
కాలం గడిచింది…
పచ్చదనం కాస్త మసకబారింది.
ఎన్నో ఋతువుల భారాన్ని మోసిన ఆ ఆకు
నెమ్మదిగా తన శక్తిని కోల్పోయింది.
ఒక రోజు…
గాలి తాకిడికి వణికింది.
ఇన్నాళ్లు అండగా నిలిచిన కొమ్మే
దాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసింది.
ఆసరా కోల్పోయిన ఆ పండుటాకు
బాధను గుండెలో దాచుకుని నేలను చేరింది.
ఆ ఆకు కథ
ప్రతి ఆడపిల్ల కథను తలపిస్తుంది…
పుట్టిన క్షణం నుంచి
ఇంటిల్లిపాదిని ఆనందంతో నింపి,
బాధ్యతల భారాన్ని మోస్తూ,
తన కలలను కన్నీటి చినుకుల్లో దాచుకుని,
తన కోరికలను మట్టిలో కలిపేసుకుని,
ఇతరుల సంతోషంలోనే
తన జీవిత సార్థకతను వెతుక్కునే,
ఆ పండుటాకు.
ఒక ఆడపిల్లే కదా!
చెట్టుకు ఆకు ఎంత అవసరమో,
కుటుంబానికి ఆడపిల్ల అంత అవసరం.
ఆకు రాలితే చెట్టు వెలితిగా మారినట్లు,
ఆడపిల్ల లేని ఇల్లు ఆనందాన్ని కోల్పోతుంది..
