నా చుట్టూ ఉన్న ప్రకృతిని వికృత పరిచి,
విధ్వంసపు అత్యాచారం చేసి వికటాట్టహాసం చేస్తుంటే..
నేను ర్యాంప్ వాక్ చేస్తా!
ఏమీ చేయలేని అశక్తతతో తృణప్రాయంగా ప్రాణాలొదిలిన వీరశూరుల స్పూర్తిని
అరచేతుల్లోంచి ఇసుకలా జారవిడుచుకుని..
నేను ర్యాంప్ వాక్ చేస్తా!
జీవచ్ఛవాల్లా బతికే ఉన్న
ఆ ఆశయాలను తుదికంటా తీసుకెళ్ళలేని నిస్సహాయతను వీపుపై మోసుకెళ్తూ..
నేను ర్యాంప్ వాక్ చేస్తా!
నా భాషను, నా యాసను,
నా మాటను, నా బాటను మార్చి;
నా దుస్తులనూ ఏ’మార్చిన’ వేళ..
ఇకనుంచి
కొత్త అవతారపు దుస్తులు తగిలించుకొని..
నా కళ్ళలో కారకుండా ఇంకిపోయిన రక్తాన్ని గడ్డ కట్టించుకొని..
నేను ర్యాంప్ వాక్ చేస్తా!
నా నడకే ఒక పదఘట్టనగా మారి,
నా నడతే ఒక దారిదీపంగా చేరి,
నా ఏడుపు ఒక రాగప్రవాహంగా జారి..
ఇకపై
ఒక్కో వికృత ఆలోచననూ సక్రమపరిచి,
ఒక్కో ద్వేష చర్యనూ ప్రేమైక భావనగా పరిణమింప జేసి..
నా గుండెలోని లయాత్మక నడక
లోకం మీది వేదనలకు
పరిష్కార బోధనలుగా మారేదాకా..
నేను ర్యాంప్ వాక్ చేస్తూనే ఉంటా!
