జర్నలిస్టులుగా సత్యాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి – విమల మోర్తల

స్త్రీలుగా మీ స్పేస్‌ను క్లైయిం చేయండి… జెండర్ గ్లాస్ సీలింగ్స్ బద్దలు కొట్టండి
సంగీత బరోహ్ 70 ఏళ్ల ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చరిత్రను తిరగరాసిన ప్రసిద్ధ సీనియర్ జర్నలిస్ట్. 2025-26 ఎన్నికల్లో పోటీపడి, వెయ్యికి పైగా ఓట్లతో అధ్యక్షురాలిగా గెలుపొందిన మొట్టమొదటి మహిళా జర్నలిస్ట్, నార్త్ ఈస్ట్ ప్రాంతమైన అస్సాం నుంచి తొలిసారిగా ఎన్నికైన మహిళ కూడా ఆమె.

ది వైర్ డిజిటల్ పబ్లికేషన్‌లో నేషనల్ ఎఫైర్స్ ఎడిటర్‌గా ఆమె పని చేసారు. అంతకన్నా ముందు హిందూ వార్తాపత్రికలో ప్రత్యేక కరస్పాండెంట్‌గా కూడా పనిచేశారు. 1995లో గౌహతి యూనివర్సిటీ నుండి జర్నలిజం పట్టాను పొందిన తరువాత, ఆమె యునైటెడ్ న్యూస్ అఫ్ ఇండియా (UNI)లో పనిచేయడంతో తన కెరియర్‌ను ప్రారంభించారు.
అస్సాం పరిస్థితి పైన, అక్కడ జరిగిన ఉద్యమాలు, ఒప్పందాల పైన లోతైన పరిశోధన చేసిన వ్యక్తి. అంతేకాదు “అస్సాం ఎకోర్డ్, డిస్కో ర్డ” అన్న ప్రసిద్ధ గ్రంథాన్ని ఆమె రాశారు. సంగీత సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఫెలోషిప్‌ని పొందారు. 2017 ఆమె రాసిన పరిశోధనాత్మక వార్త కథనాలకు గాను ‘రామ్‌నాథ్ గోయంక ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం’ అవార్డు పొందారు. హైదరాబాదులో జరిగిన ఒక సదస్సులో పాల్గొనడానికి సంగీత వచ్చినప్పుడు మన తెలంగాణ ప్రతినిధి విమల మోర్తల ఆమెను ఇంటర్వ్యూ చేశారు.
1. ముందుగా మీకు అభినందనలు. ఒక స్త్రీ ప్రెస్‌క్లబ్‌కి అధ్యక్షురాలు కావడానికి 70 ఏళ్ల కాలం పట్టింది కదా? పత్రికా రంగంలో ఇప్పుడు మహిళలు అనేక మంది పని చేస్తున్నప్పటికీ, సీనియర్స్ అయినా, ఎడిటర్స్‌గానో, ఎడిటోరియల్ పనుల్లో, ఇతర నాయకత్వ స్థానాల్లో వాళ్ళు ఎందుకు అతి తక్కువగా సంఖ్యలో ఉన్నారు? పత్రికారంగంలో లింగ వివక్ష ఇంకా ఉందా?
జవాబు: అవును జెండర్ వివక్షత జర్నలిజంలో ఎల్లవేళలా ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా ఉంది. అయితే స్త్రీలు దీనిని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంతకు ముందు క్రీడారంగం, బిజినెస్, డిఫెన్స్, పొలిటికల్ ఇలాంటి వాటిల్లో మహిళా రిపోర్టులు ఉండేవాళ్లు కాదు. మహిళలు ఎక్కువగా ఫీచర్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. 2001లో నేను హిందులో చేరినప్పుడు నాకన్నా ముందు చేరిన ఒక మహిళ నాతో ఇలా చెప్పింది. “సంగీత నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు అసలు ఇక్కడ మహిళలు ఎవరూ ఉండే వాళ్ళు కాదు. కనీసం ఉమెన్ టాయిలెట్ కూడా ఇక్కడ లేదు. దానితో నేను ఆఫీస్ పక్కన ఉన్న పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని” అని. ఇది హిందూ పేపర్‌లో అప్పటి పరిస్థితి. 1990ల మధ్యలో నేను యునైటెడ్ న్యూస్ అఫ్ ఇండియాలో చేరా. అప్పుడు అది భారతదేశంలోనే చాలా పెద్ద న్యూస్ ఏజెన్సీ.
నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి చేరిన మొట్టమొదటి న్యూస్ రిపోర్టర్‌ని నేనే. నిజానికి జర్నలిజంలోకి ప్రవేశించిన నేను, నా ముందు తరం, నా తర్వాతి తరపు స్త్రీలు అనేక మంది ఈ రంగంలో ఉన్న అనేకానేక జెండర్ గ్లాస్ సీలింగ్స్‌ను బద్దలు కొట్టాం.
అవును మీరన్నది పూర్తిగా నిజం. అతి తక్కువ మంది స్త్రీలు మాత్రమే సీనియర్ ఎడిటోరియల్, లీడర్షిప్ పొజిషన్స్‌లో ఉన్నారు. వాళ్ల సామర్థ్యం కూడా దానికి కారణం. కానీ మనం స్త్రీలుగా ఆ పొజిషన్స్‌ని క్లేమ్ చేయాలి. కేవలం జెండర్ కారణంగానే ప్రాధాన్యత లేదనుకోవడం కూడా అంత సరికాదు. నిజానికి మనం సామర్థ్యం ఉన్న వాళ్ళం కూడా. మనం మీడియా హౌసెస్‌ను నడపగల వాళ్ళం. నేను నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వచ్చాను. ఇక్కడ స్త్రీలు మార్కెట్ ప్లేసుల్లో దుకాణాలను నడుపుతారు. అలాంటి వాళ్లు జర్నలిజం ఎందుకు చేయలేరు? చేయగలరు. నాయకత్వ స్థానాల్లోకి స్త్రీలు వెళ్ళగలరు.
సీమా చిష్టి మాకు ఉమెన్ ఎడిటర్‌గా ఉంది. ఉదయపు వేళలో మేము ఎడిట్ మీటింగ్స్ జరిపే సమయంలో ఒకసారి తను హఠాత్తుగా ఆగండి, ఆగండి దీర్ఘ శ్వాస తీసుకుందాం అనింది. మేము ఎందుకట్లా అని అడిగాము. ఆ సమయంలో మేము చాలా సీరియసైన రాజకీయ విషయాలు, జాతీయ వార్తల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఏ విషయాలను మనం ఫాలో కావాలి అని చర్చిస్తూ ఉన్నాం. ఇంటా బయట పనిచేసే స్త్రీలు వత్తిడి నుండి రిలాక్స్ కావాలి. అక్కడ మేము అందరమూ మహిళలమే. ఒక్క పురుషుడు కూడా లేడు. నవ యువతులు, సీనియర్లు, ఎడిటర్, నేను బ్యూరో చీఫ్, నేషనల్ ఎఫైర్స్ ఎడిటర్‌ను, ఇలా అందరూ స్త్రీలే. చివరికి డెస్క్ వద్ద పనిచేసేవాళ్లు కూడా అక్కడ స్త్రీలే.
2. ప్రశ్న. బహుశా ఇది జాతీయ, లేదా ఇంగ్లీషు న్యూస్ పేపర్స్‌లో, చానల్స్‌లో ఉన్న పరిస్థితి కావచ్చు ఎక్కువగా. కానీ ప్రాంతీయ మీడియాలో బహుశా ఇట్లాంటి పరిస్థితి లేదనుకుంటాను?
జవాబు: అవును ప్రాంతీయ పరిస్థితి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంది. ఉదాహరణకి నార్త్ ఈస్ట్ ఇండియా లో ఇప్పటికే మహిళలా ఎడిటర్స్ ఉన్నారు. కొన్ని పత్రికలకి మహిళలే ఓనర్లుగా, ఎడిటర్ గా కూడా ఉన్నారు. అయితే ఇది పితృస్వామ్య సమాజం. మనం పితృస్వామ్యాన్ని కూడా ప్రశ్నించాలి, మనం యువతి, యువకులను పితృస్వామ్యాన్ని ప్రశ్నించే వాళ్ళుగా తయారు చేయాలి. పితృస్వామ్యం ఒక్క మహిళలకు మాత్రమే హాని చేసేది కాదు. అది మొత్తం సమాజానికి హాని చేసేది. ఎంతో శక్తి సామర్ధ్యాలు ఉన్నా కానీ సమాజం స్త్రీలను ఎదగనీయదు. ముందుకు రానీయదు. అది జర్నలిజం రంగానికి కూడా వర్తిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ అంటాను ఈ స్థితిని మనం ప్రశ్నించాలి, ఛాలెంజ్ చేయాలి. పరిస్థితుల్లో మార్పుకి చాలా దీర్ఘకాలం పట్టింది. కానీ అది మొదలైంది. మన ప్రెస్ క్లబ్ పరిస్థితి చూడండి. దేశంలోనే అతి పెద్ద ప్రెస్ క్లబ్‌కి నాకన్నా ముందు ఉమెన్ ప్రెసిడెంట్ ఎన్నడూ లేరు. ఆ పదవి ఎన్నిక ద్వారా వచ్చేదే. నాకన్నా ముందు కూడా పోటీ చేసిన స్త్రీలు ఉన్నారు. అయితే, దానికి ఎప్పుడూ మగవాళ్లే అధ్యక్షులుగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసినా, మహిళలకు మగవాళ్లు ఓట్లు వేయకపోవడం కూడా కారణం. ఈ ఏడాదే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి సారిగా ఒక మహిళ అధ్యక్షురాలు, మరో మహిళ ట్రెజరర్ ఎంపికయ్యారు.
3. మీ వృత్తి జీవితంలో భారతీయ పత్రికారంగంలో మీరు గమనించిన అతిపెద్ద మార్పులు ఏమిటి?
జవాబు: సుమారు 30 ఏళ్లుగా నేను జర్నలిస్టుగా పనిచేస్తూ ఉన్నాను. ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే నేను పనిచేయడం మొదలుపెట్టిన సమయం కన్నా ఇప్పుడు ఎక్కువ మంది స్త్రీలు ఈ రంగంలో ఉన్నారు. న్యూస్ రూమ్స్‌లో పనిచేస్తున్నారు. ఇంతకు మునుపు జర్నలిస్టులు ఎవరినైనా సరే ఒక ప్రశ్న అడిగినప్పుడు, వాళ్ళు దానికి తప్పకుండా సమాధానం చెప్పే వాళ్ళు. జర్నలిస్టులు కూడా అట్లా ధైర్యంగా అడగగలిగిన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, దేశ ప్రధానమంత్రి కూడా పత్రికా సమావేశాలను పెట్టడం లేదు. నేరుగా ప్రధానిని ప్రశ్నలు అడిగే పరిస్థితి జర్నలిస్టులకు లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన మన దేశంలో ఇప్పటి పరిస్థితి ఇది. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ఇక క్యాబినెట్ కూడా మాకు మాత్రం జవాబు దారితనం ఎందుకు? అనే కదా అనుకునునేది. ఇది ఒక అంశం అయితే, మరో అంశం అధికార యంత్రాంగం. వాళ్ల పైన కూడా చాలా నిఘా ఉంటుంది. అందువల్ల వాళ్లు కూడా మనం అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వరు. ఒక జర్నలిస్టుగా ఈ రెండు పక్షాల నుంచి సమాచారాన్ని సేకరించి ప్రజలకు ఇచ్చే పనిని జర్నలిస్టులు చేయలేకపోతారు. సమాచారం సెన్సార్‌కి, నియంత్రణకి, నిఘాకి గురైన తరువాత, వాస్తవ పరిస్థితి ఏమిటో మన ముందుకు రాకపోవడం వల్ల, అంతిమంగా ప్రజలు నష్టపోతారు. ఈ అన్ని కారణాల వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ప్రజాస్వామ్యం బలహీనపడటం వల్ల దేశ పౌరులు ప్రశ్నించే హక్కును కోల్పోతారు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు ప్రజాస్వామ్యం ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు, అది ఈ దేశ ప్రజల కోసం ఉండాలి అనేది.
4. ఈరోజు భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఎంత వరకు ఉంది, జర్నలిస్టులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి?
జవాబు: ఇవాళ మనదేశంలో ప్రెస్‌కి ఎటువంటి స్వేచ్ఛా లేదు. ప్రపంచ సూచికలో ఈ విషయంలో మన స్థానం ఎంతగానో కిందికి దిగజారింది. పత్రికా రంగంలో జర్నలిస్టులు ఒక మంచి వార్తని, ఒక కథనాన్ని రాస్తున్నప్పుడు, ఆ ఎడిటర్లు వాళ్లకి మద్దతుగా నిలబడాలి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు అది ఎడిటర్లు మరణించిన ఒక వ్యవస్థలా తయారైనది. ఇది అతి పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు యువ జర్నలిస్టులకు. అంతేకాదు న్యూస్ రూమ్స్‌లో ఇప్పుడు వాళ్ళకి మెంటర్స్ లేరు. “ఈ విషయాలు తెలుసుకో, పార్లమెంటును కవర్ చేసేటప్పుడు ఇవి కూడా నీకు తెలిసి ఉండాలి. మేం పని చేస్తున్నప్పుడు ఈ పని చేసాము. ఈ తప్పులు చేశాము. ఇది మీరు చేయకూడదు.” వంటివి చెప్పేవారు లేరు. ఒక రకంగా మేము అదృష్టవంతులం. మేము మా యవ్వన కాలంలో జర్నలిస్టులుగా పని చేయడం మొదలు పెట్టినప్పుడు అట్లా మమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు.
వార్త సేకరణకు వెళ్ళినప్పుడు ఎలా రిపోర్టింగ్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, జర్నలిస్ట్ ఎథిక్స్, ప్రోటోకాల్ అంటే ఏమిటి? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే వాళ్లు సీనియర్స్ నుంచి. ఇప్పుడు ఇలాంటివన్నీ లేకుండా పోయాయి. ఆ సీరియస్ ఎథిక్స్‌ను ఈ మీడియా హౌస్ ఈ కాలంలో సరిగ్గా అనుసరించకపోవడం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, మైక్ చేతిలోకి వచ్చాక, మనం చెప్పే వార్తలు అల్టిమేట్‌గా ప్రజల కోసం అనేది మర్చిపోవడం ఎక్కువైంది. అంతేకాదు మీడియా హౌస్ యాజమాన్యం ధనవంతులైన పెద్దవాళ్ల చేతులలోకి, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లడం అన్నది మరొక ముఖ్యమైన అంశం. ఎందుకు ఇలా మీడియా హౌస్‌లని సొంతం చేసుకోవడం జరుగుతుంది అనంటే, వాళ్ళకి తెలుసు మీడియా ఒకరకంగా సాఫ్ట్ పవర్ కలిగి ఉంది అని. ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతుంది అని. ప్రజలు కూడా ప్రశ్నించాలి. అర్థం చేసుకోవాలి. ఏది జర్నలిజం అని. వాళ్ళు వార్తలపై నమ్మకం పోతున్నది మాకు అనడం మాత్రమే కాకుండా. నిజానికి ఒక ఒంటరి జర్నలిస్టు ఏం చేయగలరు? ఏం చేయలేరు. సమాజం కూడా అడగాలి నిజమైన జర్నలిజం కోసం. అంతేకాదు. జర్నలిజాన్ని పరిరక్షించడం కోసం వాళ్లు కూడా ప్రయత్నం చేయాలి. ఇది ఒక సమిష్టి కృషి.
5. కొన్ని పెద్ద వార్త సంస్థలు మూతపడ్డాయి లేదా ఇతరుల ఆధీనంలోకి వెళ్ళాయి. ఎవరైతే పెట్టుబడి పెడతారో ఆ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఆధీనంలో వాళ్ళు చెప్పే దానికి అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది కదా. దీనికి ప్రత్యామ్నాయంగా బయట కూడా కొన్ని చిన్న చానల్స్, పత్రికలు సీరియస్‌గా నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి దాడులు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి కొన్ని. వీటిని ప్రత్యామ్నాయ జర్నలిజంగా అనుకోవచ్చా?
జవాబు: అవును. ఇలాంటి చానల్స్‌ని, వాటిల్లో వచ్చే వార్తల్ని ప్రజలు ఎంతగానో విశ్వసిస్తున్నారు. నిజానికి వాళ్లు తమని తాము నిజమైన, మెయిన్‌స్ట్రీమ్ వార్తల్ని అందించే జర్నలిజంగా చెబుతూ ఉన్నారు. ఇటీవల విద్యార్థుల ఆందోళనలో, కొన్ని చానల్స్‌ను లెగసీ మీడియా, మోడీ మీడియా అంటూ వాటిని నమ్మకపోవడం జరిగింది. విద్యార్థులు ఇలాంటి చిన్న, చిన్న మీడియా సంస్థలను ఆహ్వానించారు, వాటిని నమ్మారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక స్థాయి వరకు భయాన్ని సృష్టించ వచ్చునేమో కానీ, ఒక పాయింటు వద్ద అది దాటాక భయపెట్టలేరు. ప్రజలు నిలబడతారు. నిజమైన వార్తల కోసం వెతుకుతారు.
6. భారతీయ రాజకీయాలలో, పత్రికారంగంలో మీరు గమనించిన ప్రధాన మార్పులు ఏమిటి?
జవాబు: అప్పటికన్నా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మేము ప్రజలకు జవాబుదారులం కాము అనుకుంటున్నారు. అంతేకాదు తమ సొంత బృందాలను తయారు చేసుకుంటున్నారు. తమను తాము జర్నలిస్టులుగా అనుకునేవాళ్లు, ప్రజలు వాళ్ళని జర్నలిస్టులు అని నమ్మేలాగా చేసుకుంటున్న వాళ్ళు ఒక పర్టికులర్ రాజకీయ పార్టీ పొలిటికల్ నరేటివ్స్‌ని, ఒక పద్దతి ప్రకారం ముందుకు తెస్తూ ఉన్నారు. వీళ్లు, ఈ న్యూస్ ఛానల్స్, ఇంటర్నెట్, ద్వారా ప్రచారం చేస్తున్న వాళ్ల కన్నా పెద్దగా భిన్నమైన వాళ్ళు ఏమి కాదు. వీటిలో వచ్చే కధనాలనే ఈ పెద్ద జర్నలిస్టులు కూడా చెబుతూ ఉంటారు. వీళ్ళ పొలిటికల్ మాస్టర్స్ ఒకే రకమైన సమాచారాన్ని వాళ్ళతో పాటూ, వీళ్ళకి కూడా అందజేస్తున్నారు.
ప్రజలకు, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేదే జర్నలిజం నా దృష్టిలో. ప్రజాస్వామ్యంలో జర్నలిజం పబ్లిక్ ఇంట్రెస్ట్‌లకి ఉపయోగపడేదిగా ఉండాలి. పొలిటికల్ జర్నలిజంలో కూడా మనం అడిగే ప్రశ్నలకు ప్రాతిపదిక అదే అయి ఉండాలి. దేశంలో ప్రతి ఒక్కటి, ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలి. పార్లమెంటుతో సహా. జర్నలిస్టులుగా మనం మన బాధ్యత నుంచి పారిపోకూడదు. అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్న వాళ్లు ప్రజలకి జవాబుదారీలుగా ఉండాలి. జర్నలిస్టులుగా మనం చేయాల్సిన పని అది. దాన్ని మనం ఎలా చేస్తాం? సత్యం కోసం నిలబడటం. దాని కోసం అడగడం. సత్యం కోసం పరిశోధన చేయడం, దాన్ని కనుగొనడం. ఆ సత్యాన్ని ప్రజల్లోకి తీసుకురావడం. జర్నలిస్టులుగా మనం ఆ వాస్తవాలను ప్రజలకు అందించాలి. ప్రజలు నిశ్శబ్దంగా ఉంటారు. కానీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు అంతా.
7. ప్రజాస్వామిక పరిస్థితులు, అలాగే ప్రజాస్వామిక స్పేస్, జర్నలిస్టులుగా మనం అనుకున్న విషయాన్ని నిర్భయంగా రాయగలిగిన పరిస్థితి ఇప్పుడు ఉందని అనుకుంటున్నారా?
జవాబు: లేదు. అలాంటి పరిస్థితి లేదనే దాన్ని నేను తిరస్కరించడం లేదు అయితే మనం అలాంటి కొత్త రకపు చోటును సృష్టించుకోవాలి. పెద్ద స్పేస్ కుంచించుకుపోతున్నప్పుడల్లా, ప్రజలు చిన్న చిన్న జాగాలను ఏర్పాటు చేసుకుంటారు. అట్లాగే మానవ నాగరికత ముందుకు పోయింది.
8. పత్రికా రంగంలో కార్పొరేట్ యాజమాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ ఒత్తిడి, జర్నలిస్టులపై బెదిరింపులు, ప్రజాస్వామ్య చోటు తగ్గిపోతుందనే ఆందోళనల మధ్య, మీడియా తన స్వతంత్రతను ఎలా కాపాడుకుని, ‘ఫోర్త్ ఎస్టేట’గా కొనసాగగలదు?
జవాబు: మొట్టమొదటి విషయయం జర్నలిస్టులుగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జర్నలిజంకి మనకి మనం జవాబుదారీ తనంతో ఉండాలి. ఉదయం లేచి లేవగానే నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఒక జర్నలిస్టుగా నా మటుకు నేను ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జర్నలిజానికి జవాబుదారీగా ఉన్నానా, నేను జర్నలిజాన్నే చేస్తున్నానా అని. ఒకవేళ మనం జర్నలిజాన్ని గనక చేయకపోతే మనని మనం జర్నలిస్టులుగా పిలుచుకోవద్దు. మనం మరింకే పనినైనా చేయవచ్చు. ఏదైనా పబ్లిక్ రిలేషన్స్ ఫామ్‌లో జాయిన్ కావచ్చు. ఆ పేరుతో నిన్ను నువ్వు పిలుచుకోవచ్చు. అధికారంలో ఉన్న వారిని అసౌకర్యపరిచే ప్రశ్నల్ని వేయకుండా ఉంటే, దాన్ని జర్నలిజం అనేకంటే నువ్వు కేవలం పబ్లిక్ రిలేషన్స్ వారితో కొనసాగిస్తున్నావని అనుకో. నిజానికి నువ్వు చాలా గొప్పగా ప్రజా సంబంధాలను సాగిస్తూ వుండవచ్చు. అప్పుడు అలాంటి వృత్తిలోనే చేరు. దానిలో నువ్వు రాణించవచ్చు గొప్పగా. కానీ నువ్వు ఒక పనిలో కట్టుబడి ఉంటూ, దానికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటే దానిలో ఎందుకు ఉండాలి? ఎందుకట్లా మనల్ని విలేకరుల్లా పిలవాలి? జర్నలిస్టులుగా మనందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా మనం జర్నలిస్టులమా? మనం జవాబుదారీతనంగా ఉన్న వాళ్ళమా? మనందరం కూడా వేసుకోవాలి ఈ ప్రశ్నల్ని. అలాంటప్పుడు మాత్రమే నువ్వు ప్రభుత్వాల, బ్యూరోక్రసీ జవాబుదారీతనం గురించి ప్రశ్నించగలుగుతావు. మన పనిలో చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇతర ఉద్యోగాల వంటి పని కాదు జర్నలిజం అనేది. అందుకు మనం సిద్ధంగా ఉంటే ఈ పని చేయడానికి రావాలి. ప్రతి ఏడాది నీ జీతాలు పెరగాలి, పెద్ద కారులో తిరగాలి, అధునాతన అపార్ట్మెంట్లో ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటే దానికోసం జర్నలిజం వద్దు. అలా అయితే నువ్వు ఈ వృత్తిలో ఉండాల్సిన అవసరమే లేదు. ఇలాంటి కోరికలు తప్పేం కాదు. కానీ అలాంటి వాటి కోసం మరి ఏ ఇతర వృత్తిలోకైనా వెళ్ళు. వీటిని జర్నలిజం ద్వారానే సాధించుకుంటా అని మాత్రం అనుకోకు. అలా అయితే జర్నలిజం అనే వృత్తికి మనం అపకారం చేసిన వాళ్ళం అవుతాం.
9. ఆఖరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నా. యువ జర్నలిస్టులకి, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు ఈ రంగంలోనూ లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ ఉన్నారు. సెక్సువల్ హెరాస్మెంట్‌ని ఎదుర్కోవడానికి కమిటీ లాంటిది కూడా లేవు అనుకుంటాను. దాని గురించి ఏమైనా మాట్లాడతారా?
జవాబు: అవును అది చాలా పెద్ద సమస్య. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఈ సమస్యలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరు మహిళలని అడ్వర్టైజ్మెంట్లను తెమ్మని అడుగుతారని నేను విన్నాను. కొన్ని ప్రాంతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో, న్యూస్ రూములలో ఇలాంటి పరిస్థితి ఉండడం దురదృష్టకరం. నేను అనుకుంటాను. మనకి మనం మన అంతరాత్మని ప్రశ్నించుకోవాలి. అది స్పష్టంగా లేనప్పుడు అలాంటి పని చేయవద్దు. పని స్థలాల్లో లైంగిక వేధింపుల్ని ఆపేందుకు, వాటిని విచారించడానికి దాదాపు ఎలాంటి కమిటీలు లేవు. పాష్ కమిటీల దృష్టికి తీసుకెళ్లాలి. మేము ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి చేస్తున్నది ఏమిటంటే, మొదటిసారి మేము ఒక ఫౌండేషన్‌తో అనుసంధానం అయ్యాము. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మార్తా ఫారెల్ ఫౌండేషన్ దాని పేరు. చాలా పేరున్న ఒక ఎన్జీవోను నడిపిన వ్యక్తి మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబం, తన పేరుతో మార్తా ఫారెల్ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యూస్ రూమ్స్‌లో మహిళలు ఏ రకంగా చూడబడుతున్నారు అనే అంశం పైన పరిశోధన ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు మొదట హిందీ, ఉర్దూ పత్రికల్లో ఈ రీసెర్చ్‌ను ప్రారంభించారు. మెల్లిగా తెలంగాణతో సహా ఇది అన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. మొట్టమొదటి సారిగా మనకి డేటా వస్తుంది. ప్రశ్నించాలన్న, లీగల్ ప్రొటెక్షన్, న్యాయం కావాలి అన్న మనకి ఒక డేటా అవసరం. మనం వాదించాలంటే ఈ డేటా ఉండడం అవసరం. దానిని కలెక్ట్ చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. మన చేతికి ఆ వివరాలు అందుతాయి అని అనుకుంటున్నాను.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.