తెలంగాణా ఉద్యమకారిణి దేవకీదేవి – గిరిజ పైడిమర్రి

ఆమె ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తొలిదశ తెలంగాణ ఉద్యమ కెరటం. ఉద్యమానికి ఊపిరి. సీమాంధ్రుల అరాచకాలను తట్టుకొని నిలబడ్డ ధీరవనిత. ఆ కసితో మలిదశ తెలంగాణా ఉద్యమంలో అరవై ఏళ్ల వయసులో ఇరవ ఏళ్ల యువతరానికి దన్నుగా నిలబడ్డది. ఏ పని చేసినా మమేకమై చేయడం ఆమె నైజం.

అన్యాయాన్ని ప్రశ్నించడం ఆమె అలవాటు. తెలంగాణకే ప్రతిష్ఠాత్మకమైన బతుకమ్మ పాటలను ఊరూరా తిరిగి ఒక దగ్గరికి చేర్చిన పరిశోధకురాలు. విద్యార్థులకు ప్రియమైన అధ్యాపకురాలు. డెబ్భై ఐదేళ్ళ వయసులో కూడా తెలుగు సాహిత్య రంగంలో అవిరామ కృషి చేస్తున్న రచయిత్రి. ఆమె ఎవరో కాదు, తెలంగాణ ముద్దు బిడ్డ దేవకీదేవి. ఆమె భూమిక పాఠకుల కోసం పంచుకున్న అనేక అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే అక్కా! బాగున్నారా? ఆరోగ్యం ఎలా వుంది?
జ. నమస్తే గిరిజా! బాగున్నాను. రండి.. కూర్చోండి. ఆరోగ్యం ఫర్వాలేదు.. బాగానే ఉంది. అవసరమైనప్పుడు ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకుంటున్నాను.
ప్ర. భూమిక స్త్రీవాద పత్రికకు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను.
జ. భూమిక పాఠకుల కోసం నా అనుభవాలు పంచుకునే అవకాశం రావడం చాలా సంతోషం. సత్యవతిగారి ఆధ్వర్యంలో నేను టూర్‌లో పాల్గొన్నాను.
ప్ర. మీ తల్లిదండ్రులు, సహోదరుల గురించి చెప్పండి.
జ. బాపు పేరు నమ్మార్ళ్వార్. హుజూరాబాదు. ప్రస్తుతం జిల్లాగా వుంది కాని, తెలంగాణ రాష్ట్రం రాకముందు పాత కరీంనగర్ జిల్లాలో ఉండేది. నాన్న రెండో కొడుకు. ఆయన ఖానిగి బడిపంతులు. పిల్లలు రెండు నుంచి ఐదు రూపాయల వరకు ఫీజు ఇచ్చేది. దానిని రాబట్టుకోవడానికి ఆయన వాళ్ళిండ్లకు తిరుగుతుండేది. అమ్మ పేరు వెంకట నర్సమ్మ. చాలా అందంగా ఉండేది. ఆత్మాభిమానం ఉన్న మనిషి. ఆమెది హన్మకొండ. అంబర్ చర్ఖా. ట్రైనింగ్ చేసి ఇతర స్త్రీలకు రాట్నం వడుకుడు నేర్పించేది. నాకొక చెల్లెలు. పేరు కృష్ణకుమారి ఇప్పుడు లేదు.
ప్ర. మీరు ఎపుడు? ఎక్కడ పుట్టారు? మీ బాల్యం ఎలా గడిచింది?
జ. నేను 24 అక్టోబర్ 1951లో హుజూరాబాద్‌లో పుట్టిన. కానీ నా బాల్యం, యవ్వనం అంతా హన్మకొండలోని గుడిసెలో గడిచింది. బాల్యంలో అమ్మ దగ్గర పెరిగిన యాదులు తక్కువనే.. అమ్మ అంబర్ చర్ఖా ట్రైనింగ్ అని, వయోజన విద్య అని ఇంట్లో ఉండక పోయేది. మా అమ్మమ్మ దగ్గరనే పెరిగిన. ఛాయ్ నే మా బ్రేక్ ఫాస్ట్. అదీ ఏరోజుకారోజు పావలా శర్కర, పదిపైసల చాయ్ పత్తా పొట్లం బాపును గీమాలి ఉరికీ ఉరికీ కిరాణా షాపు నుంచి తెచ్చేదాన్ని. ఇక బియ్యం, పప్పు, కారం, కూరగాయలదీ ఇదే పరిస్థితి. పైసలకు చాలా కష్టంగా ఉంటుంది.
ప్ర. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. మూడోతరగతి దాకా బాపు ఖానిగి బడిలోనే చదువుకున్న. నాలుగో తరగతి నుంచి ఐదో తరగతి హన్మకొండ బెస్తవాడలోని మచిలీ బజార్ ప్రభుత్వబడిల చదువుకున్న. లష్కర్ బజార్ ప్రభుత్వ ఉన్నత బడిల చదువుతున్నప్పుడే నేను ఇంతకుముందు చదువుకున్న మచిలీబజార్ బడి ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ స్థాయికి అప్ గ్రేడ్ అయింది. అందుకని నేను మళ్ళీ నా పాత బడిలనే ఎనిమిదో తరగతి దాకా చదువుకున్న. ఆ తర్వాత మా పెద్ద మేనమామ టీచరుగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల జనగామలో పనిచేస్తుండే. తొమ్మిదో తరగతి నుంచి పదకొండో తరగతి దాకా ఆ బడిల చదువుకున్న. మేథమేటిక్స్ ఆప్షనల్‌గా 1967లో H.sc పాస్ అయిన. హన్మకొండలోని ఆ తర్వాత పింగళి మహిళా డిగ్రీ కాలేజీ నుంచి ప్రి డిగ్రీ కోర్సు (puc) సప్లమెంటరీలో పూర్తి చేసిన. నేను అప్పటి దాకా చదువుకున్నది తెలుగు మీడియంల. ఇంగ్లీషు మీడియం ఫాతిమా స్కూల్‌లో చదువుకొని వచ్చిన విద్యార్థులు నా తరగతిలో ఉండి, చక్కగా ఇంగ్లీషు మాట్లాడేటోళ్లు. అది నాకు ఆత్మన్యూనతగ ఉండేది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థంగాక ఫిజిక్స్‌లో ఫెయిల్ అయిన. తర్వాత ట్యుటోరియల్ కాలేజీల చదివి పాసైన. మహిళా కళాశాల నచ్చక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి స్పెషల్ మాథ్స్‌తో బియస్సీకి అడ్మిషన్ కొరకు దరఖాస్తు పెట్టుకున్న. నా ఒక్కటే దరఖాస్తు రావడం వల్ల ఆ శాఖను రద్దు చేసిన్రు. తెలుగు, చరిత్ర, సంస్కృతం ఆప్షనల్‌గా డిగ్రీల 1971ల చేరిన. 1973ల పూర్తయింది.
ప్ర. మీరు చిన్నప్పుడు చాలా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారని విన్నాను. ఆ విశేషాలు చెప్పండి.
జ. మీరు విన్నది నిజమే .. చిన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. తుపాకి రాముడు, సోది చెప్పే ఎరుకలసాని, కోయవేషాలతో ఏకపాత్రాభినయం చేసేదాన్ని. జనగామలో చదువుతున్నప్పుడు గంగు, దేశం కోసం మొదలైన నాటకాలు వేసిన. గంగు నాటకంల నాకు మొదటి బహుమతి వచ్చింది. దేశం కోసం నాటకంల రంగనాయకమ్మ డాంబికాలు పోయే పాత్ర. అలా ఉండడం మంచిది కాదు అనేది అందులోని మెసేజ్. దానికి నాకు జిల్లా స్థాయిల ఉత్తమ నటి ప్రైజ్, సర్టిఫికేట్ ఇచ్చారు. ఎనిమిదో తరగతిల ఉన్నప్పుడు ఒక పెళ్లి పత్రికలోని విషయాన్ని నాటకంగా మార్చి రాసిన. దానిని గణేశ్ ఉత్సవాలలో నా స్నేహితులతో కలిసి ప్రదర్శించినం. అది అందరి మన్ననలు పొందింది. ఇలాంటి చొరవనే తర్వాతి కాలంలో నేను తెలంగాణ ఉద్యమంల పాల్గొనేటట్లు చేసింది.
ప్ర. అన్నట్లు, మీరు తొలి తెలంగాణ ఉద్యమం లోకి వచ్చిన నేపథ్యం చెప్పండి.
జ. 1968లో పి యు సి ఫెయిల్ అయి ఖాళీగా ఉన్న సమయం. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను పొద్దున, సాయంత్రం హోం ట్యూషన్లు చెప్పేదాన్ని. పగటిపూట నలభై రూపాయలకు ఒక ప్రైవేట్ బడిల టీచర్‌గా పని చేసేదాన్ని. ఒకసారి హోం ట్యూషన్ చెప్పి ఇంటికి వస్తున్న క్రమంలో చాలా మంది ఒకచోట గుమికూడి మాట్లాడుకోవడం చూసి అక్కడికి పోయిన. వాళ్ళు తెలంగాణ కోసం చేస్తున్న ధర్నాలు, రాస్తారోకోల గురించి చెప్పిన్రు. అంతే! నేనెందుకు చేయొద్దు? అనుకొని అప్పటి నుంచి అండ్ల తిరుగుడు షురూ చేసిన. మా ఇంట్ల కూడా నన్ను ఏమి అనేటోళ్ళు కాదు. మా అమ్మ ఉండేది కాదు, అమ్మమ్మకు చూపు లేదు. బాపు నిస్సహాయతతో మా యింటి వాతావరణం కూడా అట్లనే ఉండేది. పైనుంచి నేను సంపాయిస్తున్న.
ప్ర. ఆ క్రమంలో మీ ఉద్యమ అనుభవాలు చెప్పండి.
జ. బడులు, కాలేజీలు మూసేయించడం, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేస్తుంటమి. జైల్ భరో కార్యక్రమంలో స్కూల్స్, కాలేజీలు అన్నీ జైల్స్ అయ్యాయి. ఆ క్రమంలో రెండుసార్లు అరెస్టయి ఒక్కొక్క రోజు జైల్ల ఉన్న. అప్పట్ల ఆడ పోలీసులు లేకుండిరి. ఒకసారి ఒక ఎస్సై నన్ను పోలీసు వ్యాన్లకు ఎక్కిస్తుంటే ఆయన గల్లా పట్టుకున్న. బాగా బూతులు తిట్టిన. ఈ సంఘటనలో నన్ను కోర్టుకు హాజరు పరిచిన్రు. అప్పుడు జడ్జి “అట్ల గల్ల పట్టుకొని తిట్టుడు తప్పు కదా.” అన్నడు. “మరి నన్ను మొగోడు ముట్టుకుంటే తిట్టిన.” అని చెప్పిన. దానికి ఆయన “నిన్ను జైలుకు పంపుత. ఏ జైలుకు పోతవు? రాజమండ్రికా? వరంగల్ జైలుకా?”అని అడిగిండు. “నేను తప్పు చేస్తే నన్ను జైలుకు పంపున్రి. వరంగల్ జైలుకి పోత. అయినా నేను మా ఉద్యోగాల కొరకు, నీళ్ళ కొరకు కొట్లాడుతున్న.” అన్న అందరు నా ధైర్యానికి ఆశ్చర్యపోయిన్రు. అయితే ఆ మాటలు ఆ వయసులో, ఆవేశంతో తెలియనితనంలో నుంచి వచ్చినయని ఇప్పుడనిపిస్తది. ఈ క్రమంల 1969లో హన్మకొండలో జీవన్ లాల్ గ్రౌండ్‌లో జరిగిన మహిళా సదస్సు నిర్వహించినం. ఆ సదస్సుకు సుమారు ఏడెనిమిది వందల మహిళలు వచ్చిన్రు. దానికి ముందు ఒకసారి ర్యాలీ తీయడానికి పోలీస్ అనుమతి నేనే తీసుకు వచ్చిన. తెల్లవారితే ర్యాలీ అనగా ముందురోజు రాత్రి కర్ఫ్యూ పెట్టిన్రు. అయినా వెనకకు పోకుండా ర్యాలీ తీసినం. ఆ మహిళా సదస్సుకు ఈశ్వరీబాయిని ముఖ్య అతిథిగా పిలిచినం. ఆమెనే అధ్యక్షురాలిగా ఉండమని అడిగిన. స్థానికులే అధ్యక్షులుగా ఉండాలని చెప్పి ఆమె నన్నే అధ్యక్షురాలిని చేసింది. అట్ల ఆ రోజు నేను సదస్సు అధ్యక్షురాలిగా తెలంగాణ ఉద్యమంల మొదటి ఉపన్యాసం ఇచ్చిన. అప్పుడు నా వయసు పద్ధెనిమిది యేళ్ళు. ఇట్ల చెప్పుకుంట పోతే మస్తున్నయి. ఆ రోజుల్ల ఏడ జూసిన ‘దేవకి’ పిల్లనే కనిపిస్తుండే..
ప్ర. తొలిదశ తెలంగాణ ఉద్యమం విఫలమవడానికి కారణం ఏమిటి?
జ. ఆ ఉద్యమంలో 1969 -70 విద్యా సంవత్సరం విద్యార్థులందరం నష్టపోయినం. అంతట్ల ఎన్నికలచ్చినయ్. ప్రత్యేక రాష్ట్రం రాజకీయంగా తేల్చుకోవలసిన అంశమని చెప్పి మర్రిచెన్నారెడ్డి “తెలంగాణ ప్రజా సమితి” పార్టీని స్థాపించిండు. వరంగల్ బయట జరిగిన ఆ మీటింగ్‌కు పోయిన. ఈశ్వరీబాయి నా ప్రసంగం కాగానే శాలువతో సత్కరించింది. ఇంటికి వచ్చేసరికి రాత్రి పన్నెండు దాటింది. అయినా మా యింట్లో నన్ను ఏమీ అనలేదు. ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా ఎన్నికల రోజు ఇంటింటికీ పోయి ఓటు వేసిన వాళ్ళను, వేయని వాళ్ళను ఓటర్ల జాబితాలో గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేటట్లు చూసిన. వరంగల్ నియోజకవర్గం నుంచి ఎస్ పి గిరి ఎంపీగా గెలిచిండు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పధ్నాలుగు సీట్లకు పదకొండు సీట్లు గెలిచింది. వాళ్ళు కృతజ్ఞతలు చెప్పడం మాట పక్కకు పెడితే వాళ్లెవరూ ఉద్యమకారులను పట్టించుకోలేదు. ఆ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నమ్మకద్రోహి మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఇందిరాగాంధి గవర్నర్ పదవిని కేటాయించగానే
ఉద్యమాన్ని నీరు కార్చిండు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయిన విషయం అందరికీ తెలిసిందే కదా..
ప్ర. మీరు నాస్తికవాదిగా మారడానికి నేపథ్యం ఉందా? ఉంటే చెప్పండి.
జ. అది అంచలంచెల ప్రయాణం. పద్మాక్షమ్మ గుడికి పోయే తోవలో ‘సత్సంగ’ అనే సంస్థ ఉండే.. వసంత పంచమి సందర్భంగా ‘ఫకీర్ చంద’ అనే గురువు అందరికీ సందేశం ఇస్తుండేది. దానికొరకు చాలా మంది వచ్చేటోళ్ళు. మా యింట్లో కూడా తెల్లారగట్లనే అందరం పోతుంటిమి. ఆ స్వామీజీ పక్క అర్రల ఉంటుండె. పొద్దుగాల ఆయనను కాలకృత్యాలకు కూడా పోనివ్వకుండా భక్తులు చుట్టు ముట్టేటోళ్ళు. ఇంత మూఢభక్తి ఏంటిది? అనే ఆలోచన ఆ సందర్భంలో నాలో మొదలైంది. అదంతా అశాస్త్రీయంగా అనిపించింది. ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఫకీర్ చంద్ తమ్ముడు సురేందర్ ఇంట్లో ఉండేది. ఆయనకు మా అమ్మ వంటచేసి పెట్టేది. నేను జూuc చదువుతున్నాను. ఆయన మా అమ్మపట్ల అనుచితంగా ప్రవర్తించాడట. ఇట్లాంటివి సంఘటనలు నా ఆలోచనలకు పదును పెట్టిన తర్వాత ఉద్యమం నన్ను మరింత హేతుబద్ధంగా మార్చింది.
ప్ర. స్త్రీవాదిగా మారడానికి ముందు కూడా ఏదైనా సంఘటన జరిగిందా?
జ. స్త్రీల కోణం నుంచి ఆలోచించడం మొదలుపెట్టింది మాత్రం ఈ సంఘటన జరిగిన తర్వాతనే.. 1970లో ఉద్యమం సమయంలో మహిళా సదస్సు జరపాలని ఆలోచన చేసాం. “వంటిల్లు వదలండి – వీధుల్లోకి రండి” అనే శీర్షికతో ఒక సార్ కరపత్రం రాసాడు. అవి చదివి అర్థం చేసుకునేటంత జ్ఞానం మాకు లేదు. ఉద్యమం ఆవేశంతో ఉన్నాం. కొంతమంది ఆడపిల్లలం. వాటిని తీసుకొని స్కూల్స్‌లో, కాలేజీల్లో పంచిపెట్టాం. అది చదివిన మహిళా అధ్యాపకులు అందులోని ఒక వాక్యం తీవ్రమైన వ్యతిరేకతను లేవనెత్తిన్రు. “శీలం పోకుండా ఎంత మంది మహిళలకు ఉద్యోగం వచ్చింది?” అనేది ఆ వాక్యం. “మానీళ్ళు, మా ఉద్యోగాలు మాకు కావాలి.” అని రాసే సందర్భంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన సమస్య. కావాలని రాయకపోయినా మహిళలను కించపరిచేటట్లుగా ఉంది కదా? ఒక మహిళ ఆ కరపత్రం రాసుంటే ఆ తప్పు దొర్లేది కాదు.
ప్ర. మీ ఉద్యోగ విశేషాలు చెప్పండి.
జ. చెప్పాను కదా.. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదువుకుంటున్నపుడే హోం ట్యూషన్లు చెప్పేదాన్ని. ఒకటి రెండు చిన్న ప్రవేటు బడులలో కూడా పని చేసిన. 1975లో పిజి సెంటర్ నుంచి ఎం ఏ తెలుగు పూర్తి చేసిన రెండు నెలలకు అంటే సెప్టెంబర్‌లో వికారాబాద్ ఎయిడెడ్ కాలేజీ నోటిఫికేషన్ వచ్చింది. అక్టోబర్ మొదటి వారంలో ఇంటర్వ్యూ అయింది. బిరుదురాజు రామరాజుగారు సబ్జెక్టు స్పెషలిస్టుగా వచ్చిన్రు. 17/10/1975లో ఆ ఉద్యోగంలో చేరాను. నా రోజువారీ తరగతులతోపాటు ఎన్నో అదనపు బాధ్యతలు నిర్వహించాను. అవి.. కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ బాధ్యత, పరీక్షల సమయంలో వేరు వేరు కళాశాలల్లో చీఫ్ సూపరిండెంట్ బాధ్యత, స్టాఫ్ రిప్రజెంటేటివ్, ఇంచార్జి ప్రిన్స్ పాల్, ప్రిన్సిపాల్.
ప్ర. మీది అభ్యుదయ వివాహమా? సంప్రదాయ వివాహమా? ఆ విశేషాలు చెప్పండి.
జ. ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకు అంటే 9/9/1977 నాడు నా పెళ్ళి జరిగింది. నా సహ అధ్యాపకుడు శంకరయ్యకు నేనే ముందుగా ప్రపోజ్ చేసిన. మా యిద్దరి భావాలు దాదాపు ఒకటిగానే ఉండేవి. పెద్దల అంగీకారంతో హన్మకొండలో మేం కిరాయికి ఉంటున్న ఇంటి ముందే పూల దండలు మార్చుకున్నం. ప్రమాణాలు గట్రా ఏమీ లేవు. వరవరరావు గారు, హరగోపాల్ గారు, టి.వి సుబ్బారావు గారు పెళ్ళి పెద్దలు. తాను పౌర హక్కుల సంఘంలో పని చేసేవాడు. వికారాబాదులో ఎవరికి ఏ సమస్య వచ్చినా శంకరయ్యనే సంప్రదించేవారు. ఆయన నిరంతరం ఆ పనులల్ల ఉండడంవల్ల వంటవార్పుల అరంగేట్రం, పిల్లల పెంపకం, ఉద్యోగ బాధ్యతతో కాలం వెళ్ళిపోయింది.
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. మాకు ఇద్దరు పిల్లలు. 14/8/1978లో బిడ్డ, అదే తేదీన 1982లో కొడుకు పుట్టిన్రు. బిడ్డపేరు నవత. ప్రస్తుతం Uఖలో
ఉంటోంది. కొడుకు పేరు రాహుల్ సాంకృత్యాయన్ అని పెట్టినం. కానీ బడిలో పలకడం చేతకాక రాహుల్ అని స్థిరపడింది. ఇప్పుడు నేను ఆయనతోనే హైదరాబాదు, బంజారాహిల్స్‌లో ఉంటున్న. ఆయనకు ఐదేళ్ళ ఒక కొడుకు ఉన్నడు.
ప్ర. ఇన్ని బాధ్యతల మధ్య పి హెచ్ డి, ఎలా చేయగలిగారు? ఆ వివరాలు చెప్పండి.
జ. మంచి అంశంపై పరిశోధన చేయాలనేది నా ఆకాంక్ష. దానికితోడు నా స్నేహితురాలు రుక్మిణి కోసం వాళ్ళింటికి పోయిన ప్రతిసారీ ఆమె నాన్నగారు బిరుదురాజు రామరాజుగారి ఒత్తిడి కూడా ఉండేది. నా బిడ్డ ఎం ఎస్ చేయడానికి అమెరికా పోవడం, కొడుకు పదోతరగతి అయిపోవడంతో కొన్ని పరిశోధక వ్యాసాలు రాసి, ఉస్మానియా యూనివర్శిటీకి పి హెచ్ డి కొరకు దరఖాస్తు చేసిన. అప్పుడు తెలుగు శాఖాధిపతిగా ఉన్న వెల్దండ రఘుమా రెడ్డి గారు బసవపురాణంపై పరిశోధన చేయమని నిర్ణయం చేసిన్రు. యాభై ఏండ్ల వయసులో ఏ విశ్వవిద్యాలయంలో ఉద్యోగానికి కాకుండా నా తృప్తి కోసం చేస్తున్న పరిశోధన. ఆ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయడం ఇష్టం లేక దానికి రిజైన్ చేసి, తెలుగు విశ్వవిద్యాలయంలో “తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం” అంశం పై దరఖాస్తు చేస్తే సీటు వచ్చింది. జయధీర్ తిరుమలరావుగారు నా మార్గదర్శకులు. ఉద్యోగం చేస్తూ పరిశోధన చేయడం కన్నా ఫ్యాకల్టీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాంలో చేరితే తరగతుల బాధ్యత ఉండదని దానికి దరఖాస్తు చేసిన. శాఖాధిపతిగా ఉన్న బేతవోలు రామబ్రహ్మం “రాజమండ్రి తెలుగు శాఖలో తరగతులు తీసుకుంటేనే ఆ అవకాశం.” అని నిక్కచ్చిగా తేల్చి పడేసిన్రు. ఈ విషయంలో అప్పుడు విసిగా ఉన్న యన్. గోపి, బిరుదురాజు రామ రాజుగారల మాటను కూడా ఆయన ఖాతరు చేయలేదు. (ఆంధ్రులు అభివృద్ధికి అడ్డం పడడంలో ఇది నా అనుభవం) ప్రతివారం రాజమండ్రి ప్రయాణం మరింత సమయాన్ని వృథా చేస్తుందని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న. మెడికల్ లీవులు, జీతం కోత సెలవులు అన్ని రకాలుగా సమయం వెచ్చించి 2004 డిసెంబర్‌లో పరిశోధక వ్యాసాన్ని సమర్పించినా 2005 జూన్‌లో వైవా జరిపి కొంత ఆలస్యంగా అయినా డాక్టరేట్ ఇచ్చారు. 2007లో పరిశోధక పుస్తక ప్రచురణ సందర్భంగా కూడా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఇబ్బందులు పెట్టిన్రు. 2007లో జరిగిన కాన్వకేషన్ నా పరిశోధనకు స్వర్ణ పథకాన్ని ప్రకటించింది.
ప్ర. యుజిసి మైనర్ రీసర్చ్ ప్రాజెక్ట్ కూడా చేసారు కదా? ఆ వివరాలు చెప్పండి.
జ. నా పి హెచ్ డికి స్వర్ణపథకం వచ్చిన ఉత్సాహంతో “బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు – పాటల పరిణామ క్రమం” అనే అంశానికి దరఖాస్తు చేసిన. డెబ్భైనేల ఆర్థిక సాయంతో అది సాంక్షన్ అయింది. ముందుగా నలభైఐదువేలు ఇచ్చారు. 2007లోనే హన్మకొండ, సిద్ధిపేట, బందారం, ప్రజ్ఞాపూర్, ఇబ్రహీం పట్నం, కరీంనగర్, హుజూరాబాద్, వికారాబాద్ మొదలైన ప్రాంతాలు పర్యటించి, అనేక పాటలను రికార్డు చేసుకొని, బతుకమ్మ పుస్తకాలను కూడా సేకరిస్తూ క్షేత్రపర్యటన పూర్తి చేసిన. 2008లో మనవరాలు పుట్టుక, ఉద్యోగ బాధ్యతలు పెరగడం, మా అమ్మ, సహచరుడి అనారోగ్యాలు, వాళ్ళ మరణాలు పరిశోధన వైపు నన్ను తొంగిచూడనివ్వలేదు. 2018లో చాలా ఆలస్యంగా ప్రాజెక్టు పూర్తి చేసినందుకు రావలసిన మిగతా ఇరవైయైదువేలు రాలేదు. పుస్తకం అచ్చువేయడానికే నాకు లక్షా పదివేల పైన ఖర్చయింది.
ప్ర. మీ ఇతర రచనల గురించి చెప్పండి.
జ. ఎనిమిదో తరగతిలోనే తొలి నాటక రచన చేసాను. కానీ పెళ్ళికి ముందు, తర్వాత ఉన్న బాధ్యతల మధ్య ఆ ఆసక్తి మరుగున పడిపోయింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొన్ని కవితలు రాశాను. “అరుదైన ఛాయా చిత్రం” పేరుతో పుస్తకంగా వచ్చింది. “పిడికిటి ఇసుక” పేరుతో కథాసంపుటి 2022లో తీసుకవచ్చాను. “కరోనా కాలం కథలు” పేరుతో శతాధిక రచయిత్రుల కథలు, కథనాలు పుస్తకానికి గౌరవ సంపాదకురాలిగా ఉన్నాను. “విశ్వనాథీయం” పేరుతో శంకరయ్య స్మృతిలో.. అని నా సహచరుడి స్మృతి సంచిక తీసుకువచ్చాను.
ప్ర. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటీ?
జ. మలిదశ ఉద్యమానికి నేపథ్యంగా పనిచేసిన జనసభలో సభ్యురాలిని. కనకాచారి, బెల్లి లలిత మొదలైన వాళ్ళతో కలిసి పనిచేసాను. తెలంగాణ జిల్లాలన్నీ తిరిగాను. తెలంగాణ మహిళా ఐక్య వేదికలో ఉన్నాను. ఆ సందర్భంలో మహిళలం చాలా కార్యక్రమాలు చేసినం.
ప్ర. తొలి, మలిదశ ఉద్యమకారిణిగా రెండింటి మధ్యలో ఉన్న తేడాలు చెప్పండి.
జ. తొలిదశ తెలంగాణ ఉద్యమం విద్యార్థులతో మొదలై రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయి విఫలమైంది. మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నిరాహార దీక్షతో మొదలై ఆ దీక్ష విఫలం కావడంతో ప్రజల్లోకి పోయింది. రాజకీయ నాయకుల ప్రమేయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రమాదం వాటిల్లినప్పుడల్లా ప్రజలు ఉద్యమంలోకి ఉప్పెనోలె ఉరికిన్రు. ఉద్యమం ఆగిపోకుండా విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, సబ్బండ వర్షాలతో ఉవ్వెత్తున ఎగిసిపడి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. మలిదశ ఉద్యమ సమయంలో తీసుకున్న సాగరహారం, ఓయూలో నిర్వహించిన విద్యార్థి గర్జన, వంటావార్పు, ఉద్యమ బతుకమ్మ లాంటి సృజనాత్మకమైన కార్యక్రమాలు రాష్ట్ర సాధనకు దోహదం చేసాయి.
ప్ర. మీకు వచ్చిన అవార్డుల గురించి చెప్పండి.
జ. తెలుగు విశ్వవిద్యాలయం 2007లో స్వర్ణపతకం, 2017లో కీర్తి పురస్కారం, తెలంగాణ రాష్ట్ర సమితి స్త్రీ విభాగం నుంచి స్త్రీ శక్తి పురస్కారం 2015లో వచ్చింది. వంశీవారి జీవన సాఫల్య పురస్కారం 2016లో ఇచ్చారు. 2017లో స్వరాజ్య లక్ష్మి పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారం, 2018లో అమృతలత అపురూప అవార్డులు వచ్చాయి. మొల్ల సాహిత్య పురస్కారం, వందనా టీవి మహిళా పురస్కారం వచ్చినయి. కానీ ఎప్పుడో గుర్తులేదు. 2016 నా సిద్ధాంత గ్రంధంలోని “జాతీయ ఉద్యమంలో స్త్రీలు” అనే భాగాన్ని ఇంటర్మీడియట్ విద్యా విభాగం ప్రణాళికలో చేర్చారు.
ప్ర. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు?
జ. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికకు 2026 ఫిబ్రవరి నుంచి జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నాను. ఆయా సందర్భాలలో రాసిన రాన్‌సాలను, సేకరించిన బతుకమ్మ పాటలను ప్రచురణ కొరకు సిద్ధం చేసుకుంటున్న.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.