నాశరీరం.. నా ఆరోగ్యం.. నా నిర్ణయం.. – పి. ప్రశాంతి

స్నేహితురాలి కోసం ఎదురు చూస్తూ గత పది నిమిషాల నుండి బస్స్టాప్‌లో నిలబడుంది కావేరీ. ఆ పదినిమిషాల్లో కనీసం పదిసార్లైనా తిట్టుకుని ఉంటుంది వాళ్ళ ఊరి సర్పంచిని, బస్టాప్‌లో కనీసం ఒక్క బెంచీ అయినా వేయించనందుకు. కాళ్ళు గుంజుతున్నాయి, నీరసం ఆవరిస్తోంది.

ఇప్పుడే బుక్కెడు అన్నం తినొచ్చినా పది నిమిషాలు నిలబడేసరికే నీరసం ముంచుకొస్తోంది. స్నేహితురాలి మీద, ఊరి సర్పంచ్ మీద, భర్త మీద, చివరికి తన మీద తనకే చాలా చిరాకేస్తోంది. ఎప్పుడూ చురుగ్గా ఉండే కావేరీకి కొంతకాలంగా తనిలా అయిపోవడం ఏమాత్రం నచ్చట్లేదు.
ముప్ఫై ఐదేళ్ళు కూడా నిండని కావేరీకి ఈ మధ్య ఈ పరిస్థితి చాలాసార్లు ఎదురయ్యింది. దిగులుగా అనిపిస్తోంది. కానీ తనకిలా ఎందుకవుతోందో అర్ధం కాక మరింత దిగాలు పడిపోయింది. కావేరీకి ఆప్తమిత్రురాలు అమల. ఇద్దరూ రోజుకి ఒక్కసారన్నా కలవకుండా ఉండరు. కలిసే పనికెళ్ళేవారు, సంతకెళ్ళాలన్నా, ఊర్లో జరిగే వేడుకలకి వెళ్ళాలన్నా, సంఘం సమావేశానికి, గుడికి, బడికి.. ఎక్కడికెళ్ళాలన్నా ఇద్దరూ కలిసే వెళ్తారు. ఏ విషయాలైనా దాపరికం లేకుండా మాట్లాడుకుంటారు, అన్నీ పంచుకుంటారు, ఒకరికొకరు అవసరమైన సలహాలిచ్చుకుంటారు. ఇప్పుడు కూడా తన సమస్యకు పరిష్కారం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మంచిదని, తను సాయం వస్తానని అమల మాటిచ్చినందుకే కావేరి బస్టాప్‌కి వచ్చి ఎదురు చూస్తోంది.
సరిగ్గా బస్ వచ్చే టైమ్‌కి ఆదరా బాదరా పరిగెత్తుకొచ్చింది అమల. బస్సెక్కి కూర్చున్నాక కోపంగా ఉన్న స్నేహితురాలికి సారీ చెప్పి, సరిగ్గా బయలుదేరినప్పుడే ఏడేళ్ళ తన చిన్న కొడుకు మెట్టు మీద నుండి పడి దెబ్బ తగిలించుకున్నాడని, ఏడుస్తుంటే ఊరుకోబెట్టి వచ్చేసరికి ఆలస్యం అయిందని చెప్పడంతో కావేరి కోపమంతా పోయి, చిన్నోడికి ఎలా ఉందని ఆతృతగా అడిగింది. చిన్న దెబ్బే అని తెలిసి కుదుటపడింది. అరగంటకి బస్ దిగి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు. ఆ డాక్టర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసి రిటైర్ అయిన మంచి పేరున్న గైనకాలజిస్ట్.
వీళ్ళని చూడగానే డాక్టర్ నవ్వుతూ, “రండి, రండి.. ఏంటి ఇలా వచ్చారు” అని అడిగింది. తను చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నానని, ఎప్పుడూ అలసటగా ఉంటుందని, కీళ్ళ నొప్పులు, నిద్రపట్టకపోవడం, తొందరగా చిరాకు రావడం.. అన్నీ చెప్పింది కావేరి. దాదాపు రెండేళ్ళుగా ఇలానే ఉందని, ఈ మధ్య ఎక్కువైనట్లు అనిపిస్తోందని కూడా చెప్పింది. అమల అందుకుని ‘ఆమెకింకా ముప్పైనాలుగేళ్ళే! ముసలిదానిలా మాట్లాడకు, నీకేమంత వయసైపోలేదు అని మేమందరం చెప్తూనే ఉంటాం’ అంది.
డాక్టర్ నవ్వి, ఏమీ పరవాలేదు, ఎందుకిలా అవుతోందో తెలుసుకుందాం అంటూ పిల్లలెంతమంది, నార్మల్ కాన్పులా, ఆపరేషన్ పడిందా, అంతకు ముందు, తర్వాత ఏమైనా సర్జరీలు జరిగాయా వంటి విషయాలన్నీ అడిగింది. కాన్పులు తేలిగ్గానే ఇంటి దగ్గరే అయ్యాయని, అయితే నాలుగేళ్ళ క్రితం ఋతుస్రావం బాగా ఎక్కువగా అవ్వడం, పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉన్నందుకు గర్భసంచి తీసేశారని చెప్పింది. ముప్పై ఏళ్ళకే హిస్టరెక్టమీనా అని డాక్టర్ ఆశ్చర్యపోయి, మీరు అడిగితే తీసేశారా, ఇంకేమైనా చికిత్స చేయొచ్చని చెప్పారా అని అడిగింది. ‘ఏమీ చెప్పలేదు, మూడు, నాలుగు సార్లుగా పరీక్షచేసి మాత్రలిచ్చారు, అయినా తగ్గకపోవడంతో ఆపరేషన్ చేసి గర్భసంచీ తీసేయాలని చెప్పారు. ‘డాక్టర్లు చెప్పాక చేయించుకోవాలసిందేగా’ అంది కావేరి.
‘తన సమస్యలన్నీటికీ గర్భసంచే కారణమవుతోందని, అది తీసేస్తే సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయని ఆ డాక్టరమ్మ చెప్పింది. అదే మంచిపనని మేమంతా అనుకున్నాం. మా చుట్టుపక్కల చాలా మంది ఇప్పటికే ఆపరేషన్ చేయించుకుని హాయిగా ఉన్నారు, అదంత పెద్ద విషయం ఏమీ కాదుగా’ ఇది చాలా మామూలే అన్నట్లు అనేసింది అమల. ‘ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్ అన్నాక మా చుట్టుపక్కల ఉన్న అందరూ అదే ఈ సమస్యకి సరైన పరిష్కారమని అనడంతో పాటు, నేను కూలికిపోలేకపోవడంతో ఆదాయం లేక ఇబ్బంది అవ్వడంతో నా భర్త కూడా తొందరగా ఈ సమస్య తీరిపోవాలని కోరుకున్నాడు. దీని కోసం మేము చాలా అప్పు కూడా చేయాల్సి వచ్చింది’ చెప్పింది కావేరి.
తర్వాత ఏమైంది మరి అని డాక్టర్ అడిగిన దానికి సమాధానంగా కావేరి తనకు మొదట్లో చాలా బాగా అనిపించిందని, ఋతుస్రావం ఆగిపోవడంతో చాలా హాయిగా ఉందని, ఇంటి పనులకి, కూలి పనులకి అడ్డం లేకపోవడంతో తన సమస్యలన్నీ తీరిపోయాయని అనుకుందని. ఊర్లో అందరూ మంచి పనిచేశావు అంటుంటే గొప్పగా ఉండేదని చెప్పుకొచ్చింది. కానీ ఒక సంవత్సరం తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయని, తను చాలా తేలిగ్గా అలసిపోతున్నానని, కొన్నిసార్లు అకస్మాత్తుగా ఒళ్ళంతా వేడెక్కిపోయిన అనుభూతితో పాటు విపరీతంగా చెమట పడుతోందని, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, మధ్యలో మెలకువ వచ్చేయడం, పనికి వెళ్ళొచ్చిన తర్వాత ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుందని, తన పరిస్థితి ముందుకన్నా ఘోరంగా తయారయిందని బాధపడింది. ఆమెని ఓదారుస్తూ ‘ఆ నొప్పులు తగ్గడానికి ఎప్పుడూ మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది, తన కూలి డబ్బులు సగం ఆ మాత్రలకే అయిపోతాయి’ అంది అమల.
‘చిన్నవయసులోనే గర్భసంచి తీసేస్తే దాని ప్రతికూల ప్రభావాలు కొంతమందికి జీవితకాలం ఉంటాయి’ అన్న డాక్టర్ మాటలకి ‘ఆపరేషన్ చేసిన డాక్టరమ్మకి ఈ విషయం తెలియదా, కనీసం మాట మాత్రంగానైనా చెప్పలేదు..’ అని అమల కోపంగా అంటుంటే, ‘ఋతుస్రావం ఆగిపోతుందనే విషయం తప్ప ఎవరూ ఇంకేమీ చెప్పలేదు’ అంది కావేరి. ‘అవును, ఏమీ చెప్పనందుకు చాలా కోపం వస్తోంది’ అంది అమల.
అమలని ఆపుతూ ‘నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్న విషయం ఏంటంటే, నాతోటి వాళ్ళు, నా వయసు స్నేహితులు చురుగ్గా, ఉత్సాహంగా కనిపిస్తారు, నేను వాళ్ళందరి కంటే చాలా పెద్దదానిలా కనిపిస్తాను, నాలోనే ఏదైనా సమస్య ఉందా అని ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను’ అంది కావేరి. ‘అవును, తన వయసుకన్నా ముందుగానే తను ముసలిదాన్ని అయిపోయానని ఎప్పుడూ అంటుంటుంది’ అని చెప్తున్న అమల మాటలకి ‘శారీరక మార్పులు భావోద్వేగాలని కూడా ప్రభావితం చేస్తాయి, అది చాలా సహజం’ అని తెలియచేసింది డాక్టర్.
వింటున్న కావేరి ‘నిజమే డాక్టరు గారూ, నాకు ఈ మధ్య చాలా సార్లు ఏ కారణం లేకుండానే ఆందోళనగా అనిపిస్తుంది, చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు వస్తోంది, దీంతో భర్త మీద అరుస్తున్నాను, పిల్లల్ని అనవసరంగా కొడుతున్నాను, ఒక్కొక్క రోజైతే దినమంతా దిగులుగా, నిరుత్సాహంగా అనిపిస్తుంది, బాగా ఏడుపొస్తుంది. అందరూ నేను అతిగా ఆలోచిస్తున్నానని అంటారు, కానీ నా లోపల నిజంగానే ఏదో జరుగుతోంది, అదే వాస్తవం, ఎవ్వరూ అర్ధంచేసుకోరు‘ అంటూ ఏడ్చేసింది.
డాక్టర్ ఆమెని ఓదారుస్తూ ‘మీరు చెప్పిందంతా తప్పకుండా నిజం, నేను నమ్ముతున్నాను. ఆరోగ్యం అంటే కేవలం శారీరకమైందే కాదు, మానసికమైంది, భావోద్వేగపరమైంది కూడా. మీ వయసులో ఉన్న మహిళలకి తమ శరీరంలో ఊహించని మార్పులను హఠాత్తుగా అనుభవించాల్సి వచ్చినప్పుడు, అది వారి విశ్వాసం, భావోద్వేగాలు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీనిని ఎవరూ చర్చించాల్సిన విషయంగా చూడరు కానీ, ఇది అర్ధం చేసుకోవడం చాలా అవసరం’ అంది.
అమల డాక్టర్ని చూస్తూ ‘ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకుండా చెప్పండి’ అంటూ, ‘కావేరికి ఇద్దరు పిల్లలు పుట్టాకే గర్భసంచి ఆపరేషన్ అయింది. అయినా పిల్లలు పుట్టడం గురించి ఎవరన్నా మాట్లాడుకుంటున్నా తను చాలా తొందరగా కలత చెందుతుంది. ఎందుకలా? దానికీ, దీనికీ ఏమైనా సంబంధం ఉందా?’ అని అడిగింది. కావేరి అందుకుని ‘నేను కూడా నాకలా అనిపిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆపరేషన్‌కి ముందు నాకు మళ్ళీ పిల్లలు కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ తర్వాత ఆ అవకాశం శాశ్వతంగా పోయిందని అర్ధం అయినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయాను’ అంటుంటే అడ్డు తగిలి ‘అంటే, అది కేవలం ఇంకో బిడ్డ కావాలనే కోరిక గురించి మాత్రమే కాదు అంటున్నావా?’ అని అడిగింది అమల. ‘సరిగ్గా అదే అంటున్నాను. కొన్నిసార్లు నా వయసు స్త్రీలను గర్భవతిగా చూసినప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురవుతాను. ఆ అనుభూతిని ఎలా వివరించాలో కూడా నాకు తెలియట్లేదు’ అంటూ తలవంచుకుంది కావేరి.
‘చాలా మంది మహిళలు వాళ్ళకి కూడా ఇలాంటి అనుభూతే కలిగిందని చెప్తారు. వారికి పిల్లలు పుట్టి కుటుంబం పూరయ్యిందని అనుకున్నా చిన్న వయసులోనే గర్భం ధరించే సామర్ధ్యాన్ని కోల్పోవడం భావోద్వేగపరమైన ప్రభావాలని కలిగిస్తుంది. మీకు కూడా అదే జరుగుతోంది’ అని వివరించింది డాక్టర్. ఆశ్చర్యంగా వింటున్న అమల ‘ఏదైనా ఒక ఎంపిక చేసుకునే అవకాశం పోగొట్టుకోవడం కూడా పెద్ద నష్టమే అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు’ అంటుంటే కావేరి తను కూడా గర్భసంచి తీయించుకోడానికి ముందు ఎప్పుడూ అలా ఆలోచించలేదని అంది. ఇంకా, ఈ విషయంలో అందరూ ఏదో ఒక సలహా ఇచ్చేవారని, తను జీవితాంతం బలహీనంగానే ఉండిపోతుందని కొందరంటే, పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీకి గర్భసంచి అవసరమే లేదని ఇంకొందరు అన్నారని కూడా చెప్పింది కావేరి.
వింటున్న అమల ‘గ్రామాల్లో జనం వాళ్ళకి అన్నీ తెలుసని, వాళ్ళకి తెలిసిందే రైటని అనుకుంటార’ని అంటుంటే, కావేరి కల్పించుకుని ‘ఇంట్లోనూ, కుటుంబంలోనూ వేడుకలప్పుడు, వచ్చిన ఆడోళ్ళునా ఆపరేషన్ గురించి అడిగేవారు. కొందరు నా వైపు సానుభూతితో జాలిగా చూసేవారు. ఇంకొందరు నేను చాలా సంతోషపడాలన్నట్లుగా వ్యవహరించేవారు. ఇంకొందరు తేలిగ్గా తీసిపారేసేవారు. ఇది నాకు చాలా గందరగోళంగా అనిపించేది. కొన్నిసార్లు, నా సమస్యల గురించి ఎవరూ సీరియస్‌గా మాట్లాడడానికి ఇష్టపడనప్పుడు, అసలు నేను అనవసరంగా సమస్యలని ఊహించుకుంటున్నానేమో అని కూడా అనిపించేది’ అని దుఃఖంతోనూ, బేలగానూ అంది.
స్నేహితురాలిని అలా చూస్తున్న అమలకి కూడా దుఃఖం వచ్చింది. ‘ఒకసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంటుంటే, మేమందరం ఆపరేషన్ మీద మాత్రమే దృష్టి పెట్టాం కానీ, ఆ తర్వాత ఆమె ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటోందో ఎప్పుడూ ఆడగలేదని ఇప్పుడు అనిపిస్తోంది’ అని విచారంగా అంటున్న అమలనిచూస్తూ ‘అది మామూలే, చాలాసార్లు అలాగే జరుగుతుంది’ అంటూ సముదాయించింది డాక్టర్. కావేరి వైపు తిరిగి ‘ఇంకా ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో చెప్పండి’ అంటూ అడిగింది.
దానికి జవాబుగా‘ ఆపరేషన్ కోసం చాలా డబ్బు ఖర్చు చేశాం. ఆ తర్వాత కొన్ని వారాల పాటు పనికి వెళ్లలేకపోయాను. రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి, ఇంట్లో ఉండిపోయిన ప్రతిరోజూ ఆదాయాన్ని కోల్పోయినట్లే. పిల్లల ఖర్చులు, అత్త మామల మందుల ఖర్చులు….’ చెప్పుకుపోతున్న కావేరి మాటలకు అడ్డం వస్తూ ‘ఈమెని చూసుకోడానికి, తోడుగా ఆసుపత్రికి వెళ్ళడానికి ఈమె భర్త కూడా పనికి వెళ్ళలేకపోయేవాడు. కొన్ని రోజులపాటు ఇద్దరికీ ఎలాంటి ఆదాయం ఉండేదికాదు’ అంటూ చెప్పుకొచ్చింది అమల. అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని, కొలుకోడానికి చాలాకాలం పట్టిందని కూడా చెప్పింది కావేరి. ‘ఇవన్నీ ఎవరూ దృష్టి పెట్టరు, చాలాసార్లు ఈ ఆర్ధిక పరిణామాలు, ఒత్తిళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. కానీ దీని ప్రభావం మొత్తం కుటుంబం మీద, జీవనవిధానం మీద నేరుగా పడుతుంది’ అంటున్న డాక్టర్ మాటల్ని వింటూ ‘ఇదంతా వింటుంటే అసలు కావేరికి ఆపరేషన్ నిజంగానే అవసరమైందా అన్నప్రశ్న నా బుర్రని తొలిచేస్తోంది. నన్ను నేనే ప్రశ్నించుకున్నా జవాబు దొరకదు, మీరేచెప్పండి’ అని అడిగింది అమల.
“పూర్తి వివరాలు తెలియకుండా వేరే చోట తీసుకున్న నిర్ణయాలపైన నేను మాట్లాడలేను. అయితే, అధిక రక్తస్రావానికి కారణమయ్యే అనేక పరిస్థితులకు గర్భసంచి తీసేయడమే కాకుండా రకరకాల చికిత్సా మార్గాలు ఉండొచ్చు అనిమాత్రం చెప్పగలను. ముఖ్యంగా ఇరవై, ముప్ఫై సంవత్సరాల వయసులో ఉన్న మహిళలు ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఆపరేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులు, ప్రత్యామ్నాయాలు, దీర్ఘకాలిక ప్రభావాలని, పరిణామాలను పూర్తిగా తెలుసుకోవాలి, అర్ధం చేసుకోవాలి. ప్రతి స్త్రీ ఒక తెలివైన, అనుకూలమైన మార్గాన్ని ఎంపిక చేసుకోడానికి అవసరమైనంత సమాచారానికి, విషయ పరిజ్ఞానానికి అర్హురాలు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరో డాక్టర్ని సంప్రదించి రెండో అభిప్రాయం తీసుకోవడం కూడా అవసరం” అంటూ వివరించింది డాక్టర్.
వింటున్న కావేరి, అమల ఇద్దరికీ ఇది కొత్తగా అనిపించింది. ‘దారుణం, ఇంత ముఖ్యమైన విషయాలు ఎవ్వరూ చెప్పలేదు, కనీసం మాట వరసకి కూడా అన్నట్లు గుర్తు లేదు. గర్భసంచి తీసేయండి, సమస్య అదృశ్యమైపోతుంది,ఇక ఇబ్బందులే ఉండవు అని మాత్రమే విన్నాము’ అన్నారు వాళ్ళిద్దరూ. ‘అప్పటికప్పుడు కలిగేప్రయోజనాలు, దీర్ఘకాలిక పరిణామాలు, ప్రభావాలు అన్నింటినీ ఎవరైనా వివరించి ఉంటే, నేను ఇంకా చాలా ప్రశ్నలు అడిగేదాన్ని’ స్వగతంలో అనుకుంటున్నట్లు అంది కావేరి. ‘మన సంఘాలలో ఉన్న మహిళలందరికీ ఈ విషయాలు చెప్పి వాళ్ళని ప్రశ్నలు అడగండని, ఎక్కువ సమాచారం కోరండని ప్రోత్సహించాలి. అంతేకాదు, తన శరీరానికి సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు తప్పని సరిగా ఇద్దరు, ముగ్గురు డాక్టర్లని సంప్రదించాలని కూడా చెప్పాలి’ అని ఒక ప్రణాళిక రచించేసుకుంది అమల.
ఇది కావేరి సమస్య మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అత్యధికంగా హిస్టరెక్టమీలు, అదీ చిన్న వయసులోనే జరుగుతున్నాయని ఈ మధ్యకాలంలో వస్తున్న నివేదికలు, పరిశోధనా ఫలితాలు తెలియచేస్తున్నాయి. దీనివల్ల రాబోయే కొన్ని సంవత్సరాలలో మన మహిళల్లో కనీసం మూడోవంతు మంది తమ వయసుకన్నా ముందే వృద్ధాప్యపు ఛాయాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల కుటుంబాలలోనే కాదు, మొత్తం ఆర్ధిక వ్యవస్థ మీదే ప్రతికూల ప్రభావం పడే రోజు దగ్గరలోనే ఉందనడంలో సందేహమే లేదు. ఈ పరిస్థితికి ప్రజల్లో అవగాహనా లోపంతో పాటు, ప్రజా వైద్య వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వాలకి ట్యూబెక్టమీపై ఉన్న శ్రద్ధ హిస్టరెక్టమీపై లేకపోవడం, ప్రైవేటు ఆసుపత్రుల వ్యాపార దృక్పధం, మెడికల్ ఎథిక్స్‌ని విస్మరిస్తున్న డాక్టర్లు, అసలు అతిముఖ్యమైన ఈ సామాజిక కోణాన్ని వైద్య విద్యలోనే బోధించాల్సిన అవసరాన్ని గుర్తించని విద్యా వ్యవస్థ.. ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి. కానీ చివరికి నిందించబడేది మాత్రం గర్భసంచిని పోగొట్టుకుని, శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా, సామాజికంగా, భావోద్వేగపరంగా పీడనకి గురవుతున్న ఆ మహిళలే….
డాక్టర్లను వేలెత్తిచూపడమో, వ్యవస్థలని నిందించడమో, మహిళలను భయపెట్టడమో దీని ఉద్దేశ్యం కాదు. ప్రతి మహిళా పూర్తి సమాచారం కలిగి ఉంటే, తనకున్న వివిధ అవకాశాలను, ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను, వాటి ప్రభావాలను అర్ధం చేసుకుని, ఒక స్పష్టమైన అవగాహనతో తనకు సరిపోయే సరైన నిర్ణయం తీసుకోగలదని చెప్పడమే దీని లక్ష్యం. తన శరీరంపై తన ప్రమేయం లేకుండానే జరుగుతున్న ఈ రాజకీయాన్ని తిప్పి కొట్టి, నా శరీరం.. నా ఆరోగ్యం.. నానిర్ణయం.. అని ధీమాగా చెప్పే రోజు కోసం అందరం కలిసి ప్రయత్నించాల్సిన సందర్భం ఇది. ఆరోగ్యవంతమైన మహిళా సమాజం కోసం కలిసి నడుద్దాం.

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.