ప్రపంచ ప్రజలువాతావరణాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే
పర్యావరణం ప్రశ్నార్ధకమవుతోంది
ఎల్ ని నో తో
విపత్తులు కళ్ళెదురుగా నృత్యం చేస్తోంటే
ప్రజలు భయాందోళనలో మునిగితేలుతున్నారు
సముద్ర ఉపరితల జలాలు వేడెక్కి
సముద్ర గర్భంలో ఉష్ణోగ్రతల పెరిగి
విపత్తులుగా మారి జనజీవనం అతలాకుతలం అవుతోంది
శాస్త్రవేత్తలు నయానా భయానా చెప్పినా,
పట్టించుకోని ప్రబుద్ధులం
ఋతువులు గతి తప్పినా, కాలం కన్నెర్ర చేసినా,
“ఇల్లు ఇటు కాలితే అటు” వెళ్దామనుకునే ప్రవర్తనకు నీళ్లొదిలి
నిప్పుల వానకు అడ్డుకట్టు వేసి అనర్ధాలను అడ్డుకోవాలి
మండే ఇంధనాలు,
విచ్చలవిడిగా పట్టణీకరణ,
హరితాన్ని అంతం చేస్తూ, కాలుష్యాన్ని పెంచుతూ,
ప్రకృతిని భావితరాలకు అందివ్వక విపత్తుల భారం మోపుతూ
భవితను మాయం చేస్తుంటే
మారుతున్న వాతావరణంతో విపరీతమైన వేడితో, చిన్న పెద్ద చికాకుల పాలవుతున్నారు
సంక్షోభాలకు స్వాతంత్య్రం ఇవ్వక,
ఇక్కట్లను పంచుకుంటూ
ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుందాం
“తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనకుండా”
కాలాన్ని బట్టి ప్రత్యమ్నాయ పంటలతో
వ్యవసాయం చేద్దాం
వృధాలను అరికడుతూ
భువిని పరిరక్షించుకుంటూ,
భావితరాలకు బతుకునిద్దాం
