నాయినమ్మా ఎక్కడున్నవే.!?
ఇయ్యాల కాసింత తీరిక
తాతల నాటి సందుగ ముంగటేసుకున్న
ఆ పురావస్తు తవ్వకాలల్ల
నీ షెక్కుడు సంచి బయల్పడిందే..!
ఒక్కసారిగా కండ్ల ముంగట నువ్వూ
నీ వక్కడ వక్కడ నవ్వు .!
నీకు పాయిరమైన ఈ సంచి
అప్పుడు మాకెవరికీ అందేది కాదు
కొంగుసాటున..
నీ బొడ్లే వొదిగి వొదిగి ఊరించేది..!
ఎండనక వాననక..
అరొక్క దినం షెల్కల ఊరవిస్కెవు
నీ రెక్కల కష్టాన్ని దాపెట్టి
నిన్ను తలెత్తుకునేలా చేసిన
నీ తిరిజోడే ఈ సంచి .!
అప్పుడెందుకో..
బండ పరిసిన మన పెద్దాకిలి నిండా ఎండుగలే
వాన మొగులయ్యిందంటే సాలు..
ఇగో పన్ కాయ్.. అగో పన్ కాయ్ అంటూ బతిమాలి
మాతో మోయించేదానివి
నీకెన్ని ఇకమతులే.!
యాడాదికోమల్క
కొత్తకొండ తీర్థం.. ఎల్లమ్మ జాతరకు బండి మొక్కు
అబ్బో.. గండ శిల్క వెయ్యిగండ్లకుండా
అదో పెద్ద పండుగ..
కొత్త రిబ్బన్లు లబ్బరు గాజులు
చిల్కల పేర్లు పిల్లన గొయ్యలు
గీ సంచీ గలగలల్లోంచే మాకు పంచేదానివి కదే
నాయనమ్మా..!
ఇప్పుడిది జెర్రంత పలుసవడి
ఎలిసినట్టుంది గానీ,
బాలనాగమ్మ రంగు బట్ట
మూరెడు పొడుగున సంచీ పాలపిట్ట అంచులు
గిజిగాని గూడోలె ముద్దుగుందే..
దీని ముందు..
వేలు పోసి కొన్న మా వానిటీ బ్యాగులు
ఎందుకూ అక్కెర్రావ్ ..
ముంగటి ఖానల పాత లోట్ల మడుతలు
ఎన్కేమో నషం డబ్బా, తాళాల గుత్తి
నడిమిట్ల శిల్లర పైకం..
ఈ సంచీ కుట్టిచ్చిన యెమునమ్మ
ఎప్పుడో కాలం చేసింది..!
అప్పటి మా బుజ్జి గౌన్లు ఆమె టకటకల్లోంచే..!
నాయనమ్మా..
సంచీ పాతబడిందే గానీ,
నీ యాది మాత్రం జెర్రనన్నా పాతబడలే..!
నీ చేతి వాసన పోయినా
నీ ప్రేమ వాసన మాత్రం పోనియ్యనే..!
