చాంద్ బీబీ: చరిత్ర మరుగున పడిన ముస్లిం మహిళల రాజకీయ ప్రతిఘటన – ది వైర్ టీం

2026 జూన్‌లో వెలువడిన సారా వహీద్ రచించిన ‘చాంద్ బీబీ: ది లైవ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ ఏ వారియర్ క్వీన’ పుస్తకం, పదహారో శతాబ్దపు దక్కన్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరైన చాంద్ బీబీ అసాధారణ జీవితాన్ని, ఆమె మరణానంతరం రూపుదిద్దుకున్న వివిధ కథనాలను మరోసారి పరిశీలిస్తుంది.

దక్షిణాసియా చరిత్రకారిణి, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సారా వహీద్ తన పరిశోధనలో సామ్రాజ్యవాదం, జాతీయవాదం, వలసవాదం, ఇస్లాం, లింగం, చారిత్రక జ్ఞాపకం వంటి అంశాలను లోతుగా పరిశీలించారు.
ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ విభజనకు ఇరువైపులా ఉన్న ముస్లిం సమాజాల చరిత్రపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ది డైలీ స్టార్‌కిచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆమె మొఘల్ సామ్రాజ్య విస్తరణకు చాంద్ బీబీ చూపిన ప్రతిఘటన, దక్కన్‌లో ముస్లిం మహిళలు వినియోగించిన రాజకీయ అధికార స్వరూపం, అలాగే ప్రాంతీయ చరిత్రలను వెలికితీయడం ద్వారా దక్షిణాసియా గతంలోని విభేదాలు, వివాదాలు, భిన్నమైన చారిత్రక జ్ఞాపకాలను ఎలా అర్థం చేసుకోవచ్చనే అంశాలపై చర్చించారు.
పుస్తకాల దుకాణంలో తొలి పరిచయం..
ది డైలీ స్టార్ (టీడీఎస్): చాంద్ బీబీ గురించి మీరు తొలిసారిగా ఎప్పుడు ఆసక్తి పెంచుకున్నారు? ఆమె కథ మిమ్మల్ని అంతగా ఆకర్షించడానికి కారణం ఏమిటి?
సారా వహీద్: చాంద్ బీబీ నాకు తొలిసారి పరిచయమైంది ఏడేళ్ల క్రితం జూన్ నెలలో ఒక రోజున అప్పటికి నేను మా పూర్వీకుల నగరమైన హైదరాబాద్‌కు తిరిగి వచ్చాను. చిన్ననాటి జ్ఞాపకాలు మిగిలిన పాత నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ దాదాపు అర్ధ శతాబ్దం నాటి ఓ పుస్తకాల దుకాణంలోకి అడుగుపెట్టాను. అక్కడ అనుకోకుండా నా దృష్టికి చాంద్ బీబీపై రాసిన పాత ఉర్దూ నాటకం ఒకటి వచ్చింది.
పుస్తకాల అరలో నుంచి దాన్ని యథాలాపంగా తీసి చూశాను. ముఖచిత్రంపై కనిపించిన దృశ్యం నన్ను వెంటనే ఆకట్టుకుంది- గుర్రంపై స్వారీ చేస్తున్న చాంద్ బీబీ ఆమె చేతిపై కూర్చోబెట్టుకున్న డేగ. ఆ చిత్రమే ఆమె కథ వైపు నన్ను తొలిసారిగా నడిపించింది. చాంద్ బీబీ గురించి ఎంత ఎక్కువగా చదువుతున్న కొద్దీ, ఆమె జ్ఞాపకం ఎంత విస్తృతంగా నిలిచిపోయిందో నాకు అంతగా అర్థమైంది.
పర్షియన్ చరిత్ర గ్రంథాల్లో, ఉర్దూ–మరాఠీ నాటకాల్లో, చిత్రకళలో, మౌఖిక సంప్రదాయాల్లో, స్థానిక గాథల్లో, ఆమెతో ముడిపడిన ప్రదేశాల్లో, మహిళల జ్ఞాపకాల్లోనూ ఆమె సజీవంగా కనిపించింది. అయినప్పటికీ దక్షిణాసియా చరిత్రను విస్తృతంగా చెప్పే ప్రధాన కథనాల్లో మాత్రం ఆమెకు దక్కాల్సిన స్థానం దక్కలేదు. ఆమె వైపు నన్ను మళ్లీ ఆకర్షించింది సరిగ్గా ఈ సంక్లిష్టమైన వైరుధ్యాలే. ఒక మహిళ కొన్ని ప్రాంతాల్లో ఇంత బలంగా, స్పష్టంగా జ్ఞాపకాల్లో నిలిచివుండి అదే సమయంలో మన ఆధునిక ప్రజా చరిత్రలోనూ, పండితుల చరిత్ర రచనలోనూ దాదాపు కనుమరుగైపోవడం ఎలా సాధ్యమైంది?
చాంద్ బీబీ ఎవరు అన్నది మాత్రమే కాదు— ఇన్ని కాలాల తర్వాత కూడా ఆమె జ్ఞాపకం ఎలా నిలిచి ఉండగలిగిందో తెలుసుకోవాలనుకున్నాను.
డేగతో వేటాడుతున్న చాంద్ బీబీ చిత్రాలు..
కళ నాకు అత్యంత మూలాధారమైన ఆధారాల్లో ఒకటి. ఒకదాని తర్వాత మరొక చిత్రాన్ని పరిశీలిస్తే చాంద్ బీబీ గుర్రంపై స్వారీ చేస్తూ, తన చేతిపై వేటపక్షి డేగను కూర్చోబెట్టుకుని వేట సాగిస్తున్న దృశ్యమే పదేపదే కనిపిస్తుంది. ఆధునిక యుగానికి పూర్వం దక్షిణాసియా చిత్రకళలో ఒక మహిళను ఇంత స్థిరంగా, పదేపదే ఈ రూపంలో చిత్రించిన ఉదాహరణ మరొకటి కనిపించదు.
పర్షియన్ సాంస్కృతిక ప్రపంచంలో గద్దలతో వేటాడటం అనేది కేవలం వినోదంగా మాత్రమే కాదు ఆదర్శ పాలకుడికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకునే సాధనంగా కూడా భావించేవారు. డేగకు ఉపయోగించే పర్షియన్ పదం షాహీన్ కూడా షాహ్ అంటే రాజు అనే పదం నుంచి ఉద్భవించింది. అయితే డేగలతో వేటాడటం ప్రధానంగా పురుషులకు సంబంధించిన కార్యకలాపంగానే ఉండేది.
మొఘల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పాలకుల ధిక్కారం..
లిఖిత చరిత్ర దాచిపెట్టిన ఒక విషయాన్ని ఈ చిత్రాలు మాత్రం గుర్తుచేశాయి. సార్వభౌమాధికారం ఒక శక్తివంతమైన మహిళ రూపంలోనూ వ్యక్తమవుతుందని.
పద్దెనిమిదో శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యపు పట్టు క్రమంగా సడలుతూ దాని నుంచి అనేక వారసత్వ రాజ్యాలు ఆవిర్భవిస్తున్న సమయంలో డేగను చేతిపై కూర్చోబెట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తున్న చాంద్ బీబీ చిత్రణ హిందుస్థాన్ అంతటా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. దక్కన్‌కు సార్వభౌమ పాలకురాలిగా చాంద్ బీబీని చిత్రించిన ఈ కళాఖండాలు మొఘల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన ప్రతిఘటన, ప్రాంతీయ స్వయంప్రతిపత్తికి సంబంధించిన శక్తివంతమైన చారిత్రక జ్ఞాపకంగా నిలిచాయి. ముఖ్యంగా మొఘల్ శక్తి క్షీణిస్తున్న తరుణంలో తమ స్వతంత్రతను చాటుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడిన ప్రాంతీయ వారసత్వ రాజ్యాలు ఈ చిత్రాలను ప్రత్యేకంగా నలుదిశలా వ్యాపింపజేశాయి. అందువల్ల చాంద్ బీబీ చిత్రాలు కేవలం ఒక చారిత్రక మహిళా పాలకురాలి జ్ఞాపకాన్ని మాత్రమే కాదు మొత్తం మొఘల్ ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ ప్రాంతీయ అధికారాలు, స్వయంప్రతిపత్తి తమను తాము ప్రకటించుకున్న రాజకీయ జ్ఞాపకాన్ని కూడా మోసుకొచ్చాయి.చాంద్ బీబీ
సార్వభౌమ రాజకీయ నాయకురాలిగా..
ది డైలీ స్టార్(టీడీఎస్): అసలు చాంద్ బీబీ ఎవరు? దక్కన్ సుల్తానతుల రాజకీయ ప్రపంచంలో ఆమెకు ఎలాంటి స్థానం, ప్రాధాన్యం ఉండేది? అహ్మద్‌నగర్‌లో ఆమె చేపట్టిన రాజప్రతినిధి పాలన నిజానికి ఎలా సాగింది?
సారా వహీద్: చాంద్ బీబీ తొలి ఆధునిక ప్రపంచంలోనే అత్యంత అసాధారణమైన రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆమె రాజకీయ పరిస్థితులను చాకచక్యంగా అర్థం చేసుకోగలిగినవారు, తెలివైనవారు, మత విశ్వాసాలు కలిగినవారు, అత్యంత విద్యావంతురాలైన ముస్లిం పాలకురాలు. ఆమెను దక్కన్ రాణి అని పిలిచేవారు. ఆమె ప్రభావం కేవలం అహ్మద్‌నగర్, బీజాపూర్‌లకే పరిమితం కాలేదు. ఈ రెండు సుల్తానతుల్లో ఆమె రాణి-రాజప్రతినిధిగా వ్యవహరించడంతో పాటు గోల్కొండతోనూ ముడిపడిన దక్కన్ రాజకీయ ప్రపంచంలో ఆమెకు విశేషమైన రాజకీయ ప్రాధాన్యం ఉండేది. ఒకానొక దశలో భారత ఉపఖండంలో దాదాపు ఐదో వంతు విస్తీర్ణాన్ని కలిగి ఉన్న దక్కన్ ప్రాంతాన్ని అక్బర్ పాలించిన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆమె కొంతకాలం ఏకం చేయగలిగారు.
బంధుత్వ సంబంధాల ద్వారా ఏర్పడిన రాజకీయ నెట్‌వర్క్‌లు, దౌత్యం, సైనిక నాయకత్వం-ఈ మూడింటినీ సమర్థంగా ఉపయోగించుకుంటూ ఆమె విస్తారమైన రాజకీయ రంగంలో తన పాత్రను పోషించారు. 1595లో మొఘల్ సామ్రాజ్య సైన్యాలను విజయవంతంగా ఎదుర్కొన్న చాంద్ బీబీ ప్రతిఘటనకు నాయకత్వం వహించారు. మొఘల్ సైన్యాధికారులతో చర్చలు జరిపారు, పొరుగు దక్కన్ పాలకుల మద్దతు కోరారు, మొఘలులకు వ్యతిరేకంగా ఏర్పడిన బలహీనమైన కూటమి విచ్ఛిన్నం కాకుండా నిలబెట్టేందుకు కృషి చేశారు. అయితే ఆమె పాలన సాగిన రాజకీయ పరిస్థితులు అంత సులభమైనవి కావు. ఒకవైపు సామ్రాజ్యాల ఒత్తిడి, మరోవైపు వాణిజ్య నౌకాశ్రయాలపై ఆధిపత్యం కోసం పోటీ, రాజదర్బారులోని పరస్పర విభేదాలు, అంతర్గత వర్గపోరాటాలు, దక్కన్ సుల్తానతుల మధ్య యుద్ధాలు-ఇలా అనేక రకాల ఒత్తిళ్ల మధ్యనే ఆమె అధికారాన్ని కొనసాగించాల్సి వచ్చింది. అందుకే నేను ఆమెను కేవలం అహ్మద్‌నగర్ రాణి-రాజప్రతినిధిగా మాత్రమే చూడను. దక్కన్ మొత్తానికీ ప్రతినిధిగా నిలిచిన సార్వభౌమ రాజకీయ నాయకురాలిగా ఆమెను చూస్తాను.
వ్యూహరచనలో ఆమెకు అసాధారణమైన నైపుణ్యం ఉంది. మేధోపరంగా ఎంతో బలమైన వ్యక్తి, రాజకీయంగా అత్యంత సాహసోపేతమైన నాయకురాలు. ఆమె ఒక సైనిక వ్యూహకర్త, సమర్థమైన దౌత్యవేత్త మాత్రమే కాదు-ప్రజోపయోగ నిర్మాణాలను ప్రోత్సహించిన పరిపాలకురాలు కూడా.
చెల్లాచెదురైన ఆధారాలు.. అలుపెరుగని అన్వేషణ..
ది డైలీ స్టార్ (టీడీఎస్): ఈ పుస్తకం రాసే క్రమంలో హైదరాబాద్, దక్కన్ ప్రాంతాల్లోని ఆర్కైవ్ పత్రాలు, మౌఖిక చరిత్రలు, చారిత్రక ప్రదేశాలు, వివిధ సంస్థల్లోని ఆధారాలను మీరు విస్తృతంగా పరిశీలించినట్టు చెబుతున్నారు. ఆ పరిశోధన ప్రక్రియ ఎలా సాగింది? ఎక్కువగా చెల్లాచెదురైన ఆధారాలు, పరస్పర విరుద్ధమైన కథనాల రూపంలో మాత్రమే మిగిలిపోయిన ఒక వ్యక్తి జీవితాన్ని పునర్నిర్మించడానికి ఎలాంటి అన్వేషణ చేయాల్సి వస్తుంది?
సారా వహీద్: చాంద్ బీబీ నన్ను ఎటు నడిపిస్తే అటు వెళ్లాను. దక్కన్‌లోని హైదరాబాద్, గుల్బర్గా, బీజాపూర్, అహ్మద్‌నగర్ వంటి అనేక నగరాల్లో పర్యటించాను. అక్కడి కోటలు, దర్గాలు, సమాధులు, గ్రంథాలయాలు, మ్యూజియంలలో తిరుగుతూ ఆమె జాడలను అన్వేషించాను. కనీసం పన్నెండు ఆర్కైవ్‌లను పూర్తిగా వెతికాను. ఒకే సమయంలో ఆమె జాడలు ప్రతిచోటా కనిపిస్తున్నట్టూ అలాగే ఎక్కడా పట్టుబడనట్టూ అనిపించింది. అలా కనిపించే ఆధారాల వెనుక దాగి ఉన్న ఆ మహిళా పాలకురాలి జీవితాన్ని ఒక్కో ముక్కగా వెతుక్కుంటూ వెళ్లాను.
ఈ పరిశోధన కేవలం ఆర్కైవ్‌లలో పాత పత్రాలను వెతకడంతోనే పరిమితం కాలేదు. అది క్షేత్రస్థాయిలో సాగిన అన్వేషణ, ఊహాశక్తి అవసరమైన ప్రక్రియ కూడా. పర్షియన్ చరిత్ర గ్రంథాలు, ఉర్దూ నాటకాలు, దక్కనీ చిత్రకళ, పురావస్తు నివేదికలు, మౌఖిక సంప్రదాయాలు, స్థానిక గాథలు-ఇవన్నింటినీ అనుసరిస్తూ చాంద్ బీబీ జాడలను వెతికాను.
ఆమె పాలించిన, జీవించిన ప్రదేశాల్లోని చారిత్రక కట్టడాల చుట్టుపక్కల నివసించే ప్రజలను కలుసుకుని తరతరాలుగా వారు చెప్పుకుంటూ వచ్చిన కథలను కూడా సేకరించాను. ఇలా పత్రాల్లో దొరికిన ఆధారాలతో పాటు ప్రదేశాలు, జ్ఞాపకాలు, స్థానిక కథనాలను ఒకదానితో ఒకటి కలుపుకుంటూ ఆమె జీవితాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశాను.
ఆర్కైవ్‌లుగా మారిపోయిన ప్రదేశాలు..
పర్షియన్‌లో ఒక పదబంధం ఉంది- “సర్-ఎ-నఖ”. పుస్తకంలో నేను ఈ పదాన్ని ఉపయోగించాను. అక్షరార్థంగా దీని అర్థం దారపు కొస కానీ భావంలో ఇది ఒక జాడ, ఒక కీలకమైన ఆధారం అని అర్థం. నేను కూడా ఒక్కో ఆధారాన్ని పట్టుకుని దాని వెనుక ఉన్న దారాన్ని అనుసరిస్తూ వెళ్లాను. ఆ దారి నన్ను చెల్లాచెదురైన ఆధారాల మధ్యకు, పరస్పర విరుద్ధమైన కథనాల మధ్యకు తీసుకెళ్లింది. ఈ అన్వేషణను ఇంత ఆసక్తికరంగా మార్చిన విషయం ఏమిటంటే ఆమె జీవించిన నేల, ఆ ప్రదేశాలే ఒక ఆర్కైవ్‌గా మారిపోయాయి.
ఉదాహరణకు గుల్బర్గాలో చాంద్ బీబీ సమాధి ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం నన్ను దక్కన్‌లోని మహాసూఫీ సంత్ ఖ్వాజా బందే నవాజ్ గెసు దరాజ్ దర్గాకు తీసుకెళ్లింది. అక్కడ ఒక ఖాళీ సమాధి కనిపించింది. అంతేకాదు ఇప్పటికీ ఆమెను చాంద్ సుల్తానాగా గుర్తు చేసుకునే స్థానికులను కూడా కలిశాను. అహ్మద్‌నగర్‌లో నాకు కోట శిథిలాలు, రాజభవనాల అవశేషాలు, ఒకప్పుడు జరిగిన ముట్టడి తాలూకు జ్ఞాపకాలు ఎదురయ్యాయి.
హైదరాబాద్‌లో మాత్రం కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న కథనాలు, దక్కనీ జ్ఞాపకాలు, అధికారిక ఆర్కైవ్‌లకు వెలుపల ముస్లిం మహిళల గురించి కొనసాగుతూ వచ్చిన చరిత్రలను ఆధారంగా చేసుకున్నాను.
ఈ అన్వేషణ అంటే అన్నింటికీ సమాధానం చెప్పగలిగే ఒకే ఒక్క కీలక పత్రాన్ని కనుగొనడం కాదు. చాంద్ బీబీ జీవితం మనకు చెల్లాచెదురైన ఆధారాలు, పరస్పర విరుద్ధమైన కథనాలు, కాలక్రమంలో ఆమెకు ఏర్పడిన భిన్నమైన రూపాల ద్వారా మాత్రమే మిగిలింది. అందుకే నేను ‘ఏం జరిగింది?’ అనే ప్రశ్నతో మాత్రమే ఆగిపోలేదు. ఆమెను ఇలా ఎందుకు గుర్తుంచుకున్నారు? ఆమె గురించి ఈ కథనాన్ని ఎవరు కాపాడారు? ఈ కథనం వెనుక ఎలాంటి భయాలు, ఆకాంక్షలు లేదా రాజకీయ హక్కుల వాదనలు దాగి ఉన్నాయి? అనే ప్రశ్నలను కూడా వేసుకున్నాను.
చాంద్ బీబీ మరణంపై పరస్పర విరుద్ధ కథనాలు..
ది డైలీ స్టార్ (టీడీఎస్): శతాబ్దాలుగా పరిష్కారం కాని ఒక ప్రశ్న చుట్టూనే మీ పుస్తకం ప్రధానంగా సాగుతుంది – చాంద్ బీబీ అసలు ఎలా మరణించారు? కొందరు చరిత్ర కథనాలు ఆమెను సొంత సైనికులే హతమార్చారని చెబుతాయి. మరికొన్ని శత్రువులకు చిక్కడం కంటే మరణాన్నే ఆమె ఎంచుకున్నారని అంటాయి. ఇంకొన్ని కథనాల ప్రకారం ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. ఇలా పరస్పర విరుద్ధమైన కథనాలు శతాబ్దాలుగా కొనసాగుతుండటం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. అధికారం, జ్ఞాపకం, లింగం-ఈ మూడు చరిత్రలో ఏది నమోదు కావాలి, ఏది మరుగునపడాలి అన్నదానిని ఎలా ప్రభావితం చేస్తాయి?
సారా వహీద్: చాంద్ బీబీ మరణం గురించి ఉన్న పరస్పర విరుద్ధమైన కథనాలే నా పుస్తకానికి కేంద్రబిందువు. ఆ కథనాలను నేను కేవలం ‘నిజం’ లేదా ‘అబద్ధం’ అని కొట్టి పారేయను. దానికి బదులుగా వాటిని చెప్పిన వ్యక్తులు, సమాజాల గురించి ఒక్కో కథనం ఏం చెబుతోందో పరిశీలిస్తాను. ఆమెను హత్య చేశారనే కథనం దక్కన్ రాజదర్బార్లలోని వర్గపోరాట రాజకీయాలను, వాటి వెనుక దాగి ఉన్న అనేక ద్రోహాలను ప్రతిబింబిస్తుంది. ఇక ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే కథనం ఒక మహిళకు సంబంధించిన లైంగిక గౌరవం, పరువు అనేవి మనుగడతో కాకుండా మరణంతోనే ముడిపడి ఉంటాయనే స్థానిక సామాజిక ఊహను ప్రతిబింబిస్తుంది.
ఈ రెండు కథనాలూ ఎక్కువగా ఉన్నతవర్గ, పితృస్వామ్య దృక్కోణాల నుంచే రూపుదిద్దుకున్నవి.
సామాన్యుల జ్ఞాపకాల్లో తప్పించుకున్న చాంద్ బీబీ..
చాంద్ బీబీ తప్పించుకున్నారనే కథనం మరింత ఆసక్తికరమైనది. ఎందుకంటే ఇది మిగతా కథనాలన్నింటికీ భిన్నంగా ఉంటుంది. ఈ కథనం అధికారిక రాజదర్బార్ల ఆర్కైవ్‌లకు వెలుపల ఉన్న మౌఖిక సంప్రదాయాలు, స్థానిక జ్ఞాపకాలు, ప్రజా సమాజాల నుంచి పుట్టుకొచ్చింది. శతాబ్దాల పాటు రైతులు, సామాన్య ప్రజలు ఈ కథను ఒకరి నుంచి మరొకరికి చెబుతూ వచ్చారు. అట్టడుగు ప్రజల జ్ఞాపకాల్లో చాంద్ బీబీ ఓటమిని అంగీకరించరు. అక్కడి నుంచి బయటపడేందుకు ఒక మార్గాన్ని కనుగొని తప్పించుకుంటారు. అయితే ఇలాంటి సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్న కథనాలను కొందరు సందేహవాదులు కేవలం చారిత్రక కథనాల్లో పదేపదే కనిపించే ఒక మూసగా కొట్టిపారేస్తారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనికి సంబంధించిన లిఖిత ఆధారాలు కూడా పదిహేడో శతాబ్దం ఆరంభం నుంచే కనిపిస్తున్నాయి. మరి ఒక కథనం లిఖిత రూపంలోకి వచ్చినంత మాత్రాన అది మరింత విశ్వసనీయంగా మారుతుందా?
చరిత్రకారులు ఆధారాలను విస్మరించకూడదన్నది స్పష్టమే. అయితే అదే సమయంలో కొన్ని రకాల జ్ఞాపకాలను మాత్రం గంభీరమైన చరిత్రగా పరిగణిస్తూ మరికొన్నింటిని కేవలం కల్పిత గాథలుగా ఎందుకు కొట్టిపారేస్తున్నాం? అనే ప్రశ్నను కూడా మనం వేసుకోవాలి. జానపద గాథలు చరిత్రకు వ్యతిరేకమైనవి కావు. ముఖ్యంగా చారిత్రక గ్రంథాల్లో తమ గొంతు నమోదు కాని అట్టడుగు, ఉన్నత వర్గాలకు చెందని ప్రజల విషయంలో ఆ గాథలు వేదనను, ఆకాంక్షను, ప్రతిఘటనను, రాజకీయ జ్ఞాపకాలను తరతరాలకు మోసుకెళ్తాయి. నా దృష్టిలో హత్య, ఆత్మహత్య, తప్పించుకోవడం-ఈ మూడు భిన్నమైన ముగింపులూ ఇప్పటికీ కొనసాగుతుండటం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది.
శక్తివంతమైన మహిళలను చరిత్ర తరచుగా అస్థిరమైన, మారుతూ ఉండే రూపాల్లోనే గుర్తుంచుకుంటుంది. వారిని అమరవీరులుగా, పవిత్ర వ్యక్తులుగా లేదా ఏదో ఒక ప్రతీకగా మలుస్తుంది. కానీ చరిత్రకు మరింత కష్టమైనది-ఒక మహిళను సార్వభౌమ పాలకురాలిగా చూడటం. అంటే ఆశయాలు, సంక్లిష్టతలు, వ్యూహాత్మక ఆలోచన, మేధస్సు, లోపాలు అన్నీ కలిగిన, పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా ఆమెను గుర్తించడం. చాంద్ బీబీని పూర్తి రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తిగా చరిత్ర అంగీకరించడమంటే మరింత కష్టం.
చరిత్రలో అంచులకు నెట్టివేయబడిన ముస్లిం మహిళలు..
ఈ పుస్తకాన్ని ముందుగా చదివినవారు, మీరు ముస్లిం మహిళల రాజకీయ అధికారాన్ని చరిత్రలో తిరిగి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు. ఒక సమీక్షలో చెప్పినట్లుగా ‘ముస్లిం మహిళా పాలకులను చరిత్ర అంచులకు నెట్టివేస్తున్న’ సమయంలో ఈ ప్రయత్నం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చాంద్ బీబీ కథకు మాత్రమే పరిమితం కాకుండా చూస్తే దక్షిణాసియా చారిత్రక జ్ఞాపకం నుంచి ముస్లిం మహిళల రాజకీయ అధికారాన్ని క్రమంగా ఎలా చెరిపివేశారో ఆమె కథ మనకు ఏం చెబుతుంది?
చాంద్ బీబీ కథ మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. దక్షిణాసియా చరిత్రలో ముస్లిం మహిళల రాజకీయ అధికారం లేనిది కాదు. దాన్ని మనకు కనిపించకుండా చేశారు. ఆమె రాజకీయ అధికారానికి దూరంగా ఉండటానికి కారణం ఆమె ధరించిన ముసుగు కాదు. ఆమెను చరిత్రలో ఎంతవరకు, ఏ రూపంలో చూడాలి అన్న పరిధిని కుదించి వేసిన చరిత్రకారులే ఆమెను కనిపించకుండా చేశారు. ముస్లిం మహిళలు అంతఃపురానికే పరిమితమై ఉండేవారని, రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం వారికి లేదనే ఓరియంటలిస్టు కల్పనను చాంద్ బీబీ కథ సవాలు చేస్తుంది. అది వాస్తవం కాదు.
దక్కన్‌లో ముస్లిం మహిళలు రాజప్రతినిధులుగా, కళలు-నిర్మాణాలకు ప్రోత్సాహకులుగా, సలహాదారులుగా, సైనిక వ్యవహారాల్లో కీలక పాత్రధారులుగా, నిర్మాణకర్తలుగా, విద్యావేత్తలుగా, రాజకీయ చర్చలు-చర్చోపచర్చలు సాగించే దౌత్యవేత్తలుగా వ్యవహరించారు. దక్కన్ పాలకులు ఒకేచోట స్థిరంగా ఉండే వారు కాదు. వారి రాజదర్బార్లు, రాజధానులు కూడా అవసరాన్ని బట్టి మారుతూ ఉండేవి. వారితో పాటు ఈ రాజకీయ ప్రపంచంలోని మహిళల జీవితం కూడా చలనశీలంగానే ఉండేది. అందువల్ల చాంద్ బీబీ అంతఃపురం కూడా గోడల మధ్య పూర్తిగా మూసుకుపోయిన ప్రదేశం కాదు. అది కూడా పాలకుల ప్రయాణాలతో పాటు కదులుతూ ఉండే వ్యవస్థలో భాగమే. అంతేకాదు చాంద్ బీబీ ఏకైక ఉదాహరణ కూడా కాదు. ఆమె ఆ ప్రాంతంలో అధికారాన్ని చలాయించిన బలమైన మహిళా పాలకుల సుదీర్ఘ పరంపరలో ఒక భాగం.
దక్కన్ చరిత్రలో మహిళా పాలకుల పరంపర..
వాస్తవానికి దక్షిణాసియాలోని మరే ప్రాంతంతో పోల్చినా దక్కన్‌లో మహిళా పాలకులు ఎక్కువగా ఉండి ఉండవచ్చు. చాంద్ బీబీకి ముందు, ఆ తర్వాత కూడా ముస్లిం మహిళలు పాలించారు, సైన్యాలకు నాయకత్వం వహించారు, పాలకులకు సలహాలు ఇచ్చారు, నగరాలను రక్షించారు, రాజవంశాల రాజకీయ అధికారాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. పదిహేనో శతాబ్దంలో బహమనీ సుల్తానత్‌ను దశాబ్దానికి పైగా పాలించిన ఆఘా నర్గిస్ బాను ఇందుకు ఒక ఉదాహరణ. సైనికాధికారులకు సలహాలు ఇస్తూ, బెలగావి సమీపంలోని ఒక సైనిక శిబిరంలోనే ఆమె మరణించారు.
చాంద్ బీబీ తల్లి ఖున్జా హుమాయూన్ కూడా అహ్మద్‌నగర్ రాణి-రాజప్రతినిధిగా వ్యవహరించారు. రాజదర్బారు వ్యవహారాలను పర్యవేక్షించడమే కాకుండా సైనిక యాత్రల్లోనూ ఆమె చురుకుగా పాల్గొన్నారు. అలాగే కుతుబ్‌షాహీ వంశానికి చెందిన హయాత్ బక్షీ బేగం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో రాజకీయ చర్చలు, దౌత్య వ్యవహారాలు నడిపారు.
ఆదిల్‌షాహీ వంశానికి చెందిన దిల్‌షాద్ ఆఘా తన సైనిక జోక్యంతో యుద్ధ గమనాన్నే మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. దక్కన్‌లో రాజకీయ రాజవంశాల నిర్మాణంలోనూ, వాటి మనుగడలోనూ మహిళలు కేంద్ర పాత్ర పోషించారు. అందువల్ల చాంద్ బీబీ ఆవిర్భవించింది మహిళలు రాజకీయ, సైనిక, సాంస్కృతిక, మతపరమైన అధికారాన్ని చలాయించగలిగిన, నిజంగానే చలాయించిన దక్కన్ ప్రపంచం నుంచి. సమస్య ఏమిటంటే ఆ తర్వాతి కాలంలో రాయబడిన చరిత్రలు-వలసవాద, జాతీయవాద, మతపరమైన విభజనలతో కూడిన చరిత్ర రచనలు—చాలాసార్లు ఈ మహిళల అధికారాన్ని, వారి రాజకీయ పాత్రను గుర్తించడంలో విఫలమయ్యాయి.
బ్రిటిష్ సామ్రాజ్యవాద చరిత్ర రచనలు ముస్లిం మహిళలను అంతఃపురానికే పరిమితమైన, రాజకీయంగా క్రియాశీలత లేని, పురుషుల లైంగిక దృష్టికి లోనయ్యే వ్యక్తులుగా చిత్రించాయి. భారతీయ జాతీయవాద చరిత్ర రచనలు కూడా చాలావరకు ఇదే దృక్కోణాలను వారసత్వంగా స్వీకరించాయి. ఫలితంగా ముస్లిం మహిళలు చరిత్రలోని అంచులకు నెట్టివేయబడ్డారు. మరోవైపు హిందూ జాతీయవాద చరిత్ర రచనలు ముస్లిం రాజకీయ అధికారాన్నే విదేశీదిగా, ముప్పుగా చిత్రించాయి.
ఇక ముస్లిం జాతీయవాద చరిత్ర రచనలు కూడా తరచుగా రాజులు, రాజవంశాలు, సామ్రాజ్యాలనే గుర్తుచేసుకున్నాయి; కానీ మహిళలు చలాయించిన సార్వభౌమ రాజకీయ అధికారాన్ని మాత్రం విస్మరించాయి. చాంద్ బీబీ కథ మాత్రం ఈ అన్ని చరిత్ర రచనల దృక్కోణాలనూ ధిక్కరిస్తుంది.
దక్కన్‌ను కేంద్రంగా ఉంచి చూస్తే..
ది డైలీ స్టార్ (టీడీఎస్): పదహారో శతాబ్దపు భారతదేశ చరిత్ర గురించి సాధారణంగా మనకు తెలిసిన కథనం ఎక్కువగా మొఘల్ కేంద్రంగానే ఉంటుంది. అయితే చాంద్ బీబీని, దక్కన్ సుల్తానతులను మొఘల్ సామ్రాజ్యానికి చివరికి లొంగిపోయిన సరిహద్దు ప్రాంతాలుగా కాకుండా ఆ కాలపు రాజకీయ చరిత్రలో కేంద్ర పాత్రధారులుగా చూస్తే ఆ నాటి దక్షిణాసియా రాజకీయ చరిత్రను మనం అర్థం చేసుకునే విధానంలో ఎలాంటి మార్పు వస్తుంది?
సారా వహీద్:చాంద్ బీబీని దక్కన్‌ను చరిత్రకు కేంద్రంగా ఉంచి చూస్తే పదహారో శతాబ్దపు దృశ్యం పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. దక్కన్ సుల్తానతులు మొఘల్ చరిత్రలో తమ వంతు కోసం ఎదురుచూస్తున్న చిన్నచిన్న రాజ్యాలు కావు. అవి ఉపఖండంలోని తూర్పు, పశ్చిమ తీరాల మధ్య విస్తరించిన దక్షిణ ద్వీపకల్పం లోతట్టు ప్రాంతాల వరకు విస్తరించిన విశాలమైన దక్షిణ-మధ్య భారత రాజకీయ ప్రపంచాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్న శక్తివంతమైన రాజ్యాలు. దక్కన్ ప్రాంతం భారతదేశ భూభాగంలో దాదాపు నాలుగో వంతు విస్తీర్ణాన్ని కలిగి ఉంది. దాని చుట్టూ మూడు ప్రధాన సామ్రాజ్య శక్తులు ఉన్నాయి-ఉత్తరాన మొఘల్ సామ్రాజ్యం, పశ్చిమ తీరంలో పోర్చుగీసులు, దక్షిణాన విజయనగర సామ్రాజ్యం. ఇక్కడ దక్కన్ సుల్తానతుల విస్తీర్ణం, ప్రాధాన్యం ఎంత పెద్దదో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆధునిక యుగానికి పూర్వం ప్రపంచంలోని ప్రధాన రాజకీయ కేంద్రాల్లో దక్కన్ సుల్తానతులు కూడా ఒకటి.
అహ్మద్‌నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరార్ సుల్తానతుల భూభాగాలు కలిపి చూస్తే అవి యూరప్‌లోని ఫ్రాన్స్ వంటి పెద్ద రాజ్యాల విస్తీర్ణానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్న విశాలమైన రాజకీయ ప్రపంచాన్ని ఏర్పరచాయి.
బహుళ సాంస్కృతిక ప్రాంతం దక్కన్..
దక్కన్ ఒక విశ్వనాగరిక, బహుళ సాంస్కృతిక ప్రాంతం. సముద్ర వాణిజ్యంతో ముడిపడి ఉన్న హిందూ మహాసముద్ర ప్రపంచంతో దానికి బలమైన సంబంధాలు ఉండేవి. భూభాగం ఆధారంగా విస్తరించిన మొఘల్ సామ్రాజ్యంతో పోలిస్తే దక్కన్ ప్రపంచం సముద్ర మార్గాలతో మరింతగా అనుసంధానమై ఉండేది. దక్కన్‌లోని రాజదర్బార్ల రాజకీయ, సాంస్కృతిక జీవనాన్ని పర్షియన్, దక్కనీ, మరాఠీ, తెలుగు, కన్నడ, అరబిక్, సంస్కృత సంప్రదాయాలతో పాటు ఆఫ్రికన్, అరబ్, తుర్కిక్, స్థానిక రాజకీయ సంస్కృతులు కూడా ప్రభావితం చేశాయి.
ఆఫ్రికన్ సైనిక ఉన్నతవర్గాలు, పర్షియా నుంచి వలస వచ్చినవారు, మరాఠా సామంత నాయకులు, సూఫీ సంప్రదాయాలు, దేవాలయాల నెట్‌వర్క్‌లు, వ్యాపారులు, కవులు, సైనికులు, రాజదర్బార్లలోని మహిళలు— వీళ్లందరూ కలిసి దక్కన్ రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దారు. అహ్మద్‌నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరార్ ఏ మాత్రం అంచున ఉన్న ప్రాంతాలు కావు. అవి వాస్తుశిల్పం, సాహిత్యం, సంగీతం, సైనిక శక్తి, దౌత్యం, మతపరమైన జీవితం వంటి అనేక రంగాలకు చైతన్యవంతమైన కేంద్రాలుగా విలసిల్లాయి.
చాంద్ బీబీ కథ మన చరిత్రను చూసే దృష్టికోణాన్నే మార్చాల్సిన అవసరాన్ని మన ముందుకు తెస్తుంది-విజయాలు, ఆక్రమణల చరిత్రగా కాకుండా, వాటికి ఎదురైన ప్రతిఘటన చరిత్రగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. 1595లో అక్బర్ సైన్యాలు అహ్మద్‌నగర్ వైపు దండెత్తినప్పుడు, చాంద్ బీబీ కేవలం ఒక కోటను మాత్రమే కాపాడలేదు. ఆమె మొఘల్ సార్వభౌమాధికారానికి గట్టి ప్రత్యర్థిగా కూడా నిలిచారు. మొఘల్ సైన్యాల దాడిని తిప్పికొట్టడమే కాకుండా సామ్రాజ్య సైన్యాన్ని చర్చలకు వచ్చేలా చేశారు. అలాగే మొఘల్ విస్తరణకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని ఇతర దక్కన్ పాలకులకు విజ్ఞప్తి చేశారు.
కొద్దికాలం మాత్రమే అయినా అత్యంత కీలకమైన ఆ సమయంలో తన నాయకత్వంలో దక్కన్ సుల్తానతులను ఒక ఉమ్మడి సామ్రాజ్యవ్యతిరేక పోరాటం కోసం ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక్కడ కూడా ఆ రాజకీయ ప్రపంచం ఎంత విస్తృతమైనదో ప్రత్యేకంగా గుర్తించాలి. 1600 నాటికి దక్కన్ సుల్తానతుల విస్తృత ప్రాంతీయ కూటమి మొత్తం దాదాపు 7 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇవి జనాభా అధికంగా ఉన్న, సంపన్నమైన, సైనికంగా శక్తివంతమైన రాజ్యాలు. అంతేకాదు హిందూ మహాసముద్ర వాణిజ్య ప్రపంచంతో, పర్షియన్ సాంస్కృతిక-రాజకీయ ప్రపంచంతో బలమైన సంబంధాలు కలిగిన స్వతంత్ర రాజ్యాలు.చాంద్ బీబీ
సార్వభౌమ పాలకురాలిగా చాంద్ బీబీ..
వారి సంపదకు ప్రధాన ఆధారాలు వ్యవసాయం, వస్త్ర ఉత్పత్తి, గుర్రాల వ్యాపారం, నౌకాశ్రయాలు-సముద్ర మార్గాలపై ఉన్న ప్రాప్యత. తూర్పు దక్కన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న వజ్రాల గనులు కూడా ఈ సంపదలో కీలక భాగం. ఈ వజ్రాల వ్యాపారం దక్కన్‌ను ప్రపంచవ్యాప్తంగా సాగిన వాణిజ్య, మార్పిడి వ్యవస్థలతో అనుసంధానించింది. అందుకే మొఘలులకు దక్కన్‌పై అంతటి ఆసక్తి ఉండేది. అహ్మద్‌నగర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అక్బర్ విపరీతమైన సైనిక, ఆర్థిక వనరులను వెచ్చించాడు.
చాంద్ బీబీ కూడా మొఘల్ సార్వభౌమాధికారానికి సవాలు విసిరిన విధానాల్లో ఒకటి ఆమె దౌత్య వ్యవహారాల్లో కనిపిస్తుంది. పోర్చుగీసు వైస్రాయ్‌కు రాసినప్పుడు తనను తాను ‘సుల్తాన’గా సంబోధించుకున్నారు. ఈ చర్య ద్వారా ఆమె తనను స్వతంత్ర సార్వభౌమ పాలకురాలిగా ప్రకటించుకున్నారు. అదే సమయంలో శక్తివంతమైన పోర్చుగీసు సముద్ర, సామ్రాజ్య శక్తులతో దౌత్య సంబంధాలు నడిపించే హక్కు మొఘల్ సామ్రాజ్యానికే ఉందనే దాని దౌత్యపరమైన ఏకాధిపత్యానికి ఆమె సవాలు విసిరారు. దాదాపు ఒక శతాబ్దం తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన జీవితంలోని చివరి ఇరవై ఆరు సంవత్సరాలను దక్కన్ యుద్ధాలలో గడిపాడు.
ఔరంగజేబు 1707లో అహ్మద్‌నగర్ సమీపంలోని భింగార్‌లో మరణించాడు. చాంద్ బీబీ ఊహాశక్తిని స్త్రీల మౌఖిక సంప్రదాయాల ద్వారా పోషించిన అదే భూభాగం దక్కన్‌లో మొఘల్ సామ్రాజ్య ఆశయం అలసిపోయి అంతమైన స్థలంగా మారింది. ఇవి ఆధునిక పూర్వ ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన, అత్యధిక జనాభా కలిగిన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలలో ఒకదానిపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలు. అందువల్ల చరిత్రను చూసే దృష్టి ‘మొఘలులు దక్షిణం వైపు తమ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు?’ అనే ప్రశ్న నుంచి ‘దక్కన్ తన స్వంత రాజకీయ నిబంధనలపై మొఘల్ విస్తరణను ఎలా ప్రతిఘటించింది, ఎలా చర్చలు జరిపింది, తన సార్వభౌమాధికారాన్ని ఎలా నిర్వచించుకుంది?’ అనే ప్రశ్న వైపు మారుతుంది. ఈ మార్పు ఎంతో కీలకమైనది. ఎందుకంటే దక్షిణాసియా చరిత్రను ఒకే సామ్రాజ్య కథనంగా కాకుండా పరస్పరం పోటీపడిన అనేక రాజకీయ ప్రపంచాల సమాహారంగా చూడటానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
అనేక ప్రాంతీయ రాజకీయ వ్యవస్థలే..
ది డైలీ స్టార్(టీడీఎస్): దక్షిణాసియా చరిత్ర రచనలో ప్రస్తుతం ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది-ఒకే జాతీయ కథనానికి పరిమితం కాకుండా ప్రాంతీయమైన, బహుళత్వంతో కూడిన గతాలను తిరిగి వెలుగులోకి తీసుకురావడం. ఈ మార్పులో మీ పుస్తకం ఎక్కడ నిలుస్తుంది? అలాగే బంగ్లాదేశ్ సహా దక్షిణాసియా పాఠకులు తమ చరిత్రలోని అనేక పొరలను, పరస్పర విభేదాలు, వివాదాలతో కూడిన గతాన్ని అర్థం చేసుకోవడంలో దక్కన్ చరిత్ర ప్రత్యేకంగా ఎందుకు ముఖ్యమైనది?
సారా వహీద్: సామ్రాజ్యవాద, అతిజాతీయవాద, మతపరమైన సంకుచిత భావజాలాలు దక్షిణాసియా సమాజాల సమిష్టి ఆలోచనా ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ సమయంలో ప్రాంతీయ చరిత్రలను తిరిగి వెలుగులోకి తీసుకురావాలనే విస్తృతమైన ప్రయత్నం కూడా సాగుతోంది. దక్షిణాసియా గతాన్ని ఎక్కువగా నిర్ణయించింది ఒక్కో సామ్రాజ్యం కాదు. ఒకదానితో ఒకటి ముడిపడుతూ పరస్పరం అతివ్యాప్తి చెందిన అనేక ప్రాంతీయ రాజకీయ వ్యవస్థలే. ఆ రాజకీయ వ్యవస్థలు నేటి దక్షిణాసియాలో మనం చూస్తున్న దేశాలు, సరిహద్దులు, రాజకీయ నిర్మాణాల కంటే పూర్తిగా భిన్నమైన రీతుల్లో తమ రాజకీయ ప్రపంచాలను ఊహించుకున్నాయి. ఆ గతాలను నేటి జాతీయ, సామ్రాజ్య, మతపరమైన విభజనల చట్రాల్లో ఇమడ్చడం సాధ్యం కాదు.
చాంద్ బీబీని ఎప్పుడూ ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అనే పరిమితుల్లో బంధించలేం. ఆమె జీవితం పర్షియన్, దక్కనీ, మరాఠీ, తెలుగు, కన్నడ, అరబిక్, ఇస్లామిక్, భారతీయ, షియా, సున్నీ, సూఫీ, ఆఫ్రికన్, అరబ్, తుర్కిక్ సంప్రదాయాలతో పాటు స్థానిక సంస్కృతులు ప్రభావితం చేసిన దక్కన్ ప్రపంచంలో సాగింది. అందువల్ల ఆమె జీవితాన్ని హిందూ–ముస్లిం అనే ద్వంద్వ విభజనలోనో, కేవలం మొఘల్ కథనంలోనో లేదా ఆధునిక జాతీయవాద కథనంలోనో ఇమడ్చలేం. అందుకే చాంద్ బీబీ మనకు అంత ముఖ్యమైన వ్యక్తి.
చరిత్రలో కొత్త విషయాలు వెలుగులోకి..
దక్కన్ అనేది అనేక భాషలు, ప్రజా సమూహాలు, రాజకీయ సంప్రదాయాలు పరస్పరం కలుసుకున్న ప్రాంతం. అక్కడ ముస్లిం రాజవంశాలు పాలించినప్పటికీ వారి పాలన అనేక సమాజాలు, విభిన్న మతపరమైన ప్రపంచాలు, ప్రాంతీయ సంస్కృతులతో కలిసి సాగింది. బంగ్లాదేశ్ పాఠకులకు ఈ విషయం ఎంతో లోతైన ప్రాధాన్యం కలిగి ఉందని నేను భావిస్తున్నాను. బౌద్ధ, హిందూ, ముస్లిం, పర్షియన్ సాంస్కృతిక ప్రభావాలు, బెంగాలీ సంప్రదాయాలు, వలసవాదం, జాతీయవాదం, ప్రాంతీయ, ప్రాంతాంతర పరిణామాలు- ఇలా అనేక పొరలతో కూడిన చరిత్ర బంగ్లాదేశ్‌కు కూడా ఉంది. దక్కన్‌ను ఒకే కథలో ఇమడ్చలేనట్టే, బెంగాల్ చరిత్రను కూడా ఒకే జాతీయ లేదా మతపరమైన కథనానికి పరిమితం చేయలేం.
చాంద్ బీబీని, దక్కన్ చరిత్రను తిరిగి వెలుగులోకి తీసుకురావడం ద్వారా దక్షిణాసియా చరిత్రను మరింత విస్తృతమైన దృక్కోణంతో అర్థం చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. అది ఒకే దేశం, ఒకే సామ్రాజ్యం లేదా ఒకే మతం చుట్టూ తిరిగిన చరిత్ర కాదు. పరస్పరం అనుసంధానమై, ఒకదానితో ఒకటి ముడిపడిన గతాలను మోస్తున్న అనేక ప్రాంతాల సమాహారంగా రూపుదిద్దుకున్న చరిత్ర.
ఈ పుస్తకం పాఠకులను మనకు అలవాటైన చరిత్ర కథనాలను దాటి చూడమని కోరుతుంది. ఇప్పటివరకు చరిత్రలో అంచులకు నెట్టివేయబడిన ప్రాంతాలు, వ్యక్తులను కేంద్రంగా చేసుకుని చరిత్రను చూడటం ప్రారంభిస్తే మనకు కనిపించకుండా పోయిన ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి? అనే ప్రశ్నను ఆలోచించమని ఆహ్వానిస్తుంది.
చాంద్ బీబీ కథ మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది. దక్షిణాసియా గతం ఎప్పుడూ అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక మతపరమైన పొరలతో కూడినదే. అదే సమయంలో అది ఎప్పుడూ రాజకీయంగా వివాదాస్పదమైన, పరస్పరం పోటీపడే శక్తులతో కూడిన ప్రపంచమే.
ది డైలీ స్టార్(టీడీఎస్): దక్షిణాసియాలో ముస్లిం గుర్తింపు, మహిళల ప్రజా రాజకీయ అధికారం చుట్టూ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పదహారో శతాబ్దపు చాంద్ బీబీ కథను నేటి పరిస్థితులకు సాధారణంగా అన్వయించే కథగా మార్చకుండా ఆమె కథ మన ప్రస్తుత కాలంతో ఎలా సంభాషిస్తుంది అని మీరు భావిస్తున్నారు?
సారా వహీద్: చాంద్ బీబీని నేటి కాలానికి సరళమైన ప్రతీకగా మార్చకుండా ఉండటంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.
పదహారో శతాబ్దం మనం జీవిస్తున్న నేటి ప్రపంచం కాదు. చాంద్ బీబీ జీవితం రాజవంశాలు, రాజదర్బార్లు, సైనిక శక్తి, పర్షియన్ సాంస్కృతిక-రాజకీయ సంప్రదాయాలు, భారతీయ రాజకీయ సంస్కృతులతో కూడిన ప్రపంచంలో సాగింది. అందువల్ల ఆమె జీవించిన ప్రపంచాన్ని ఆధునిక ప్రజాస్వామ్యం, జాతీయవాదం, స్త్రీవాదం లేదా మైనారిటీ రాజకీయాల వంటి నేటి భావనలకు పూర్తిగా కుదించలేం. కానీ చరిత్రకారులు గతం గురించి అడిగే ప్రశ్నలను వర్తమానమే ప్రభావితం చేస్తుంది. హిందూ జాతీయవాద రాజ్యం ముస్లింలను గతం నుంచే కాకుండా వర్తమానం నుంచే తుడిచివేయాలని చూస్తున్న సమయంలో నేను ఈ పుస్తకం రాశాను. భారతదేశంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిపై నిఘా పెడుతున్నారు. వారిని హింసిస్తున్నారు. వారి ఇళ్లను లాక్కుంటున్నారు. అంతేకాక రాజకీయ నాయకుల నుంచి వారిపై జాతి నిర్మూలనకు పిలుపులు పెరుగుతున్నాయని మనం వింటున్నాం.
భారతదేశంలో ముఖ్యంగా ముస్లిం మహిళలను చారిత్రక పాత్రధారులుగా అదృశ్యంగా ఉంచుతూనే వారిని తరచుగా అణచివేతకు, మతపరమైన వివాదాలకు, రక్షణకు, అనుమానానికి లేదా ద్వేషానికి ప్రతీకలుగా చిత్రీకరిస్తున్నారు. వారిని ప్రముఖంగా చూపినప్పుడు కూడా వారిని మినహాయింపులుగానే పరిగణిస్తున్నారు. అయితే చరిత్రను నిర్మించిన క్రియాశీలక వ్యక్తులుగా మాత్రం వారిని కనిపించకుండా చేస్తున్నారు. దక్షిణాసియాలోని ముస్లిం మహిళలు చరిత్రను భరించడమే కాకుండా చరిత్రను సృష్టించారని చాంద్ బీబీ కథ మనకు గుర్తు చేస్తుంది. వారు పాలించారు, సంప్రదింపులు జరిపారు, రక్షించారు, సలహాలిచ్చారు, నిర్మించారు, బోధించారు, జ్ఞాపకాలను భద్రపరిచారు, రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దారు.
షాహీన్ బాగ్ నిరసనలకు కేంద్రబిందువు..
2019-2020లో షాహీన్ బాగ్‌లో దీనికి మనం ఒక స్పష్టమైన ఉదాహరణను చూశాం. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ముస్లింల పట్ల వివక్ష చూపుతోందని, వారి పౌరసత్వ హక్కులకు ముప్పు కలిగిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో షాహీన్ బాగ్ వ్యతిరేక సీఏఏ నిరసనలకు కేంద్రబిందువుగా మారింది. దానికి ప్రతిస్పందనగా సాధారణ ముస్లిం మహిళలు షాహీన్ బాగ్‌లో అసాధారణమైన ఐక్యతా ప్రదర్శనకు శ్రీకారం చుట్టి శక్తివంతమైన ప్రజా రాజకీయ పాత్రధారులుగా ముందుకొచ్చారు. వారు పౌరసత్వం, రాజ్యాంగ హక్కులు, చారిత్రక జ్ఞాపకం, నైతిక అధికారాన్ని ఆధారంగా చేసుకున్న భాషలో తమ నిరసనను వ్యక్తం చేశారు. దక్షిణాసియాలో ముస్లిం మహిళల రాజకీయ ప్రతిఘటనకు చరిత్రలో ఎంతో లోతైన, సుదీర్ఘమైన మూలాలు ఉన్నాయని చాంద్ బీబీ కథ మనకు గుర్తు చేస్తుంది. ఆమె కథ చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఆయుధంగా మార్చుకుంటున్నామో కూడా ప్రశ్నిస్తుంది.
నేడు భారతదేశంలో మొఘల్ చరిత్రపై తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. దాన్ని కించపరచడం, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం కూడా కనిపిస్తోంది. అయితే మన దృష్టిని మొఘల్ చక్రవర్తుల నుంచి దక్కన్‌లో మొఘల్ విస్తరణను ప్రతిఘటించిన ఒక ముస్లిం మహిళ వైపు మళ్లిస్తే పరిస్థితి ఎలా మారుతుంది?
చాంద్ బీబీని ఏ ఒక్క సిద్ధాంతపరమైన కథనంలోనూ సులభంగా ఇమడ్చలేం. ఆమె ముస్లిం, కానీ మొఘల్ కాదు. ఆమె రాజవంశానికి చెందిన పాలకురాలు. కానీ సామ్రాజ్యవాద విస్తరణకు వ్యతిరేకంగా నిలిచారు. ఆ సంక్లిష్టత వల్లనే ఆమె ఇప్పుడు ముఖ్యమైనది. గతం ఎల్లప్పుడూ దానిని ఉపయోగించుకునే ఆధునిక రాజకీయ ప్రయోజనాల కంటే మరింత సంక్లిష్టమైనదని ఆమె మనకు నేర్పిస్తుంది. ఆమె కథ వర్తమానానికి ఒక సరళమైన పాఠాన్నే ఇవ్వదు బదులుగా అది మనకు మరింత సుసంపన్నమైన చారిత్రక ఊహాశక్తిని కూడా ఇస్తుంది. ఇది ముస్లిం స్త్రీలను దీర్ఘకాలంగా తెలివితేటలు, సార్వభౌమత్వం, ధైర్యం, శక్తిని ప్రదర్శించిన పూర్తిగా సంక్లిష్టమైన వ్యక్తులుగా గుర్తుంచుకోవాలని కోరుతుంది.
చరిత్ర కేవలం పాత పత్రాల్లో మాత్రమే ఉండదు..
ది డైలీ స్టార్ (టీడీఎస్): చాంద్ బీబీ గురించి ఇన్నేళ్లు పరిశోధించి, ఆమెతో మమేకమైన తర్వాత ఇప్పుడు మీరు ఏ అంశంపై పని చేస్తున్నారు?
సారా వహీద్: ఒక విధంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ చాంద్ బీబీతో కలిసి నడుస్తూనే ఉన్నాను. ఆమె నాకు అనేక విలువైన విషయాలను అందించారు. ముస్లిం స్త్రీల సార్వభౌమత్వం, దక్కన్, చారిత్రక జ్ఞాపకశక్తి, అధికారిక ఆర్కైవ్‌లకు వెలుపల కూడా మనుగడ సాగించే జ్ఞాన రూపాల గురించి మరిన్ని ప్రశ్నలను ఆమె నా ముందుంచారు. ప్రత్యేకంగా అనేక పొరలతో కూడిన సామూహిక జ్ఞాపకానికి దక్కన్ ఎలా ఒక సజీవ నిలయంగా మారిందో మరింతగా రాయాలనే ఆసక్తి నాకు ఉంది. అక్కడి దర్గాలు, చారిత్రక కట్టడాలు, మహిళల కథలు, కుటుంబ ఆర్కైవ్‌లు, మౌఖిక సంప్రదాయాలు, హైదరాబాద్ వంటి సంస్థాన రాజ్యాలు అంతరించిన తర్వాత కూడా మిగిలిపోయిన వాటి జ్ఞాపకాలు, ప్రభావాలు – ఇవన్నీ నాకు ఎంతో ఆసక్తికరమైన అంశాలు. కుటుంబాలు తరతరాలుగా దాచుకున్న కథలు, పాటల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు, భక్తి ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో సజీవంగా ఉన్న కథనాలు, మన కళ్లముందే కనిపించే స్థానిక భూదృశ్యాలు-ఇవన్నింటిలో దాగి ఉన్న చరిత్రను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అధికారిక ఆర్కైవ్‌లలో చోటు దక్కని ప్రజలు తమ గురించి తాము కాపాడుకున్న జ్ఞానాన్ని, జ్ఞాపకాలను కొట్టిపారేయకుండా అదే సమయంలో చరిత్ర రచనలోని కచ్చితత్వాన్ని, పరిశోధనా ప్రమాణాలను ఎలా నిలబెట్టుకోవాలి?
నాకు అనిపించేది ఏమిటంటే చరిత్ర కేవలం పాత పత్రాల్లో మాత్రమే ఉండదు. అది మనుషుల జ్ఞాపకాల్లో ఉంటుంది. వారు పాడుకునే పాటల్లో ఉంటుంది. వారు తరతరాలకు చెప్పుకునే కథల్లో ఉంటుంది. ఒక సమాధి దగ్గర మిగిలిన నిశ్శబ్దంలో ఉంటుంది. ఒక పాత కోట గోడల్లో, ఒక నగర వీధిలో, ఒక కుటుంబం దాచుకున్న పాత పత్రంలో కూడా ఉంటుంది. చరిత్ర నుంచి ఒకరిని చెరిపివేయడం అంటే వారి జ్ఞాపకాన్ని పూర్తిగా అంతం చేయడం కాదని చాంద్ బీబీ కథ నాకు నేర్పింది. కొన్నిసార్లు అధికారిక చరిత్ర తలుపులు మూసుకున్నా జ్ఞాపకం మరో దారి వెతుక్కుంటుంది. ఒక తరం చెప్పిన మాట మరో తరానికి చేరుతుంది. ఒక పాటలో ఒక పేరు మిగులుతుంది. ఒక ప్రదేశం ఒక కథను తనలో దాచుకుంటుంది. అలా మరుగునపడ్డ గతం మళ్లీ మన ముందుకు వస్తుంది. అందుకే నా తదుపరి రచన కూడా బహుశా ముస్లిం మహిళల కథలు, హైదరాబాద్, జ్ఞాపకం, అలాగే జాతీయవాద చరిత్రలోని చెరిపివేతకు సవాలు చేసే చరిత్రలను రాయడం వెనుక ఉన్న రాజకీయాల గురించే కొనసాగుతుంది. ఎందుకంటే చరిత్రలో కనిపించకుండా పోయిన స్వరాలను తిరిగి వినిపించడం అంటే గతాన్ని మాత్రమే తిరిగి పొందడం కాదు. ఎవరి జ్ఞాపకాలు చరిత్రగా పరిగణించబడాలి, ఎవరి కథలు మరుగునపడాలి అనే అధికారాన్ని కూడా ప్రశ్నించడం. చాంద్ బీబీ కథ నాకు మిగిల్చిన అతిపెద్ద ప్రశ్న అదే.
(ది వైర్ తెలుగు సౌజన్యంతో….)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.