సయ్యద్ ఖుర్షీద
భారత స్వాతంత్రోద్యమం… ప్రపంచ చరిత్రలో ఏ విముక్తి పోరాటాలకు తీసిపోని మహోద్యమం.‘రవి అస్తమించని’ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అవతలికి తరిమికొట్టిన అనేకానేక సంఘటనల, సంఘర్షణల సమాహారం. కుల, మత, లింగ, వర్ణ విచక్షణకు అతీతంగా ఎందరో ఈ పోరాటంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ధన, మాన ప్రాణాలను ఫణంగా పెట్టి అలుపెరుగని పోరాటాలు చేశారు. ఆ త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్నామంటున్న స్వాతంత్య్రం.
ఇంతటి చరిత్రగల పోరాటాల చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే… చరిత్ర రచన అంతా వక్రీకరణలతో… అసత్యాలతో…, అర్ధసత్యాలతో నిండి కన్పిస్తుంది. అంతా ఆధిపత్యవర్గాల, పాలకవర్గాల చరిత్రగానే కన్పిస్తుంది. చదువు-సంధ్యలు, అధికారం అవకాశాలు అన్నీ ఈ వర్గాల చేతుల్లో ఉండడమే యిందుకు ప్రధాన కారణం. ఈ వర్గాలే చరిత్ర రచనకు పూనుకున్న కారణంగా అట్టడుగు వర్గాలకు దక్కాల్సినంత స్థానం దేశచరిత్రల్లో దక్కలేదు. మహిళల విషయానికొస్తే… పరిస్థితి మరీ దారుణం. ముస్లిం మహిళల పరిస్థితైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ముస్లింల భాగస్వామ్యం మరుగున పడిపోవడానికి మరోకారణం ఆనాటి పాలకుల కుటిలనీతి. ‘విభజించు-పాలించు’ అన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆంగ్లేయ పాలకులు హిందూ-ముస్లింల మధ్యన దూరాన్ని పెంచడంలో పథకం ప్రకారంగా వ్యవహరించి సఫలీకృతులయ్యారు. హిందూ-ముస్లింలను వైరివర్గాలుగా యథాశక్తి తోడ్పడ్డారు. స్వాతంత్య్రానంతరం జరిగిన దేశ విభజన, పొరుగు దేశమైన పాకిస్థాన్‌తో సాగిన యుద్ధాలు హిందూ-ముస్లింల మధ్య దూరాన్ని కాస్తా అఘాతం చేశాయి. ఈ పరిణామాలన్నీ చరిత్ర రచనల్లోనూ చోటు చేసుకున్నాయి. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ముస్లింలు చేసిన పోరాటాలు, త్యాగాలు నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఈ చిన్నచూపు ప్రభావం ముస్లిం మహిళల మీద మరింతగా పడడంతో మహిళల సాహసోపేత త్యాగాలు సహజంగానే చరిత్రలో అట్టడగుకు చేరుకున్నాయి.
ఈ పరిస్థితులలో నిష్పక్షపాతంగా, చరిత్ర లోతుల్లోకి తొంగి చూసి, చారిత్రక వాస్తవాలను వెలికి తీసి చరిత్ర రచనకు పూనుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ బాధ్యత అస్తిత్వవాదులందరి పైనా ఉంది. ముస్లింల పక్షాన ఈ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు ప్రముఖ పాత్రికేయులు, న్యాయవాది, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్. నిరంతరం చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ, పర్యటిస్తూ, చరిత్రను అధ్యయనం చేస్తూ, పరిశోధిస్తూ స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను వెలికితీసే బృహత్తర ప్రయత్నానికి పూనుకున్నారు.
ఈ ప్రయత్నంలో ‘భారత స్వాతంత్రోద్య మంలో ముస్లింల పాత్ర’ ప్రధానాంశంగా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది గ్రంథాలను రచించి వెలువరింప చేశారు. ఈ తొమ్మిది గ్రంథాలలో ఒకటి ‘భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు’. ఈ గ్రంథాన్ని 1999లో తొలుత 30 పేజీలతో ప్రచురించారు. ఆ తరువాత గ్రంథాన్ని మరింత విస్తరింపచేసి 80 పేజీలతో 2003లో వెలువరించారు. ముచ్చటగా మూడోసారి ఈ అంశం మీద మరింత సమాచారం సేకరించి మూడు వందల పేజీల గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించారు. ఈ గ్రంథంలో మొత్తం 61 మంది ముస్లిం మహిళల పోరాటాల చరిత్ర ఉంది. ఈ మహిళలందరిలోనూ సామాజిక హోదాను బట్టి రకరకాల స్థాయీ భేదాలు ఉన్నప్పటికీ, ‘పరాయి పాలకులు నుండి మాతృభూమి విముక్తి’ అనే ఏకైక ఆకాంక్ష వీరందర్నీ ఒకచోటకు చేర్చింది, ఒక మార్గాన నడిపింది.
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకొని స్వాతంత్య్రం సిద్ధించేంత వరకు వివిధ స్థాయిలలో, వివిధ పోరాటాలలో ముస్లిం మహిళల త్యాగాలు ‘భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు’ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. జాతీయోద్యమంలో భాగంగా సాగిన అహింసాయుత ఉద్యమాలు, సాయుధ పోరాటాల్లో, గెరిల్లా తరహా దాడుల నిర్వహణలోనూ ఒకటేమిటి? అన్ని పోరాట రూపాల్లో ఎవ్వరికీ ఏమాత్రం తీసిపోకుండా ముస్లిం మహిళలు అందించిన సాహసోపేత భాగస్వామ్యం తీరుతెన్నులు ఈ గ్రంథంలోని ప్రతి పుటలో కన్పిస్తాయి.
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ఈస్ట్ ఇండియా కంపెనీ బలగాలతో పోరాడి ఆంగ్లేయాధికారులకు ముచ్చెమటలు పట్టించిన బేగం హాజరత్ మహాల్ గెరిల్లా పోరాటంలో బ్రిటిష్ దళాలను హడలెత్తించి, పేరుకైనా నోచుకోని ‘పచ్చదుస్తుల’ యోధురాలు నానా సాహెబ్ అండదండలుగా మగదుస్తులతో పోరాటాల్లో పాల్గొన్న బేగం అజీజున్ ఝాన్సీరాణి వెన్నంటి నిలచి ఆమెతోపాటుగా ప్రాణాలను అర్పించిన ముందర్ తిరుగుబాటు యోధులంతా తన బిడ్డలేనంటూ పోరాటవీరుల రహస్యాలను చెప్పడానికి నిరాకరించి శత్రువు చేతిలో సజీవ దహనానికి సిద్ధపడిన అస్గరీ బేగం ఉరిశిక్షలకు, ఫిరంగి పేల్చివేతలకు వెరవకుండా కత్తి బట్టి కదనరంగాన శత్రువును తునుమాడిన హబీబా, రహీమా బేగం లాంటి మహిళల సాహసోపేత పోరాట గాథలు చదువుతుంటే శరీరం గగుర్పాటుకు గురవుతుంది.
మహాత్మాగాంధీ పిలుపు మేరకే మహిళలు ఉద్యమించారన్న ప్రచారంలో ఉన్న పస ఏమిటో జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మహిళల పోరాట చరిత్రను పరిశీలిస్తే ఇట్టే తేలిపోతుంది. పైగా సహాయ నిరాకరణోద్యమంలో విద్యార్థుల్ని చదువులు వదిలి రమ్మన్న గాంధీజీ పిలుపును జాహిదా ఖాతూన్ షెర్వానియా ప్రశ్నించిన తీరు ఆలోచింపచేస్తుంది. ఆనాడు గాంధీజీ ఇచ్చిన పిలుపును ఊతంగా చేసుకున్న ఈనాటి నేతలు విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా ఆటలాడుకుంటున్నారో చూస్తుంటే జాహిదా ఖాతూన్ ముందుచూపుకు ముచ్చటేస్తుంది.
జాతీయోద్యమంలో భాగంగా, సమావేశాలు నిర్వహించడం, ప్రసంగాలు చేయడం, పికిటింగులు జరపడం, ఊరేగింపుల్లో పాల్గొనడం, ఉద్యమకారులు జైళ్ళకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాలను ఆదుకొనడం, ఉద్యమకారులకు ఆశ్రయం ఇవ్వడం, ఆహారపానీయాలు సరఫరా చేయడం, బ్రిటిష్ ప్రభుత్వ గూఢాచారుల కన్నుగప్పి రహస్య సమాచారాన్ని చేరవేయడం, ఉద్యమ కార్యక్రమాలలో భాగంగా జరుగు రహస్య సభలు, సమావేశాల సమాచారం కార్యకర్తలకు చేరవేయడం, ఉద్యమానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం కోసం ప్రచార కార్యక్రమాలను రహస్యంగా నిర్వహించడం, ప్రజలను కూడగట్టేందుకు పత్రికలు నడపడం, రచనలు చేయడం, చివరకు అవసరం వచ్చినప్పుడు ఆయుధాన్ని అందుకోవడం, అవసరమైతే ఆయుధంతో శత్రువు మీద దాడికి తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండడం… ఇలా ఒకటేమిటి అన్ని పనులలో మహిళలు భాగస్వాములు కావడం చూస్తుంటే ‘అసలు మహిళలు స్వాతంత్య్రోద్యమం పట్ల ఆసక్తి చూపకుంటే, భాగస్వామ్యం వహించకుంటే పరాయి పాలకుల నుండి మనకు విముక్తి లభించేదా? అనిపిస్తుంది.
ఈ గ్రంథంలో పేర్కొన్న ప్రతి ఉద్యమకారిణి తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తుంది. ‘మీరంతా మీ కుటుంబాల పాలకులు, శాసకులు, సంపూర్ణాధికారులైతే మీ కుటుంబాల్లోని మగవాళ్ళనందర్నీ ఉద్యమంలో నిష్ధగా పాల్గొనేలా ప్రోత్సహించాలి. అందుకు విరుద్దంగా వ్యవహరిస్తే సాంఘికంగా వార్ని బహిష్కరించాలి’ అని తన వేడివాడి ప్రసంగాలతో ప్రజలను ఉద్యమ దిశగా నడిపిన అక్బరీ బేగం ఉదంతం చదువుతుంటే ఒడలు పులకరిస్తాయి. ‘మాతృభూమి స్వేచ్ఛా-స్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత నా జాతి సొత్తు. ఆ తర్వాత మాత్రమే నాది, మరెవరిదైనా’ అని సగర్వంగా ప్రకటించిన బేగం మహ్మద్ ఆలం ఉదంతం చదువుతుంటే ఆశ్చర్యపోతాం. జాతీయోద్యమానికి సర్వసంపదలను వెచ్చించిన ఆమె ‘సమక్షాన శ్రద్ధాభావనతో నా శిరస్సు వంచి’ నమస్కరిస్తున్నానని గాంధీజీ గౌరవం పొందిన షంషున్నీసా అన్సారి, ‘భారత దేశంలోని కుక్కలు, పిల్లులు కూడా బానిసత్వపు సంకెళ్ళల్లో బందీలుగా ఉండరాదన్నది నా అభిమతం’ అని గర్జించిన ఎనభై ఏండ్ల ఆబాది బానోబేగం ‘ఈ దేశంలోని హిందూ-ముస్లిం-శిక్కు-ఈశాయి ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించనట్టయితే మన లక్ష్యం ఏనాటికి సిద్ధించజాలదని ప్రజల్ని హెచ్చరించడం చూస్తుంటే ఆమెలోని ఆచరణాత్మక ఆలోచనలు అబ్బురం అన్పిస్తాయి. బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఇండియా ప్రతినిధిగా పాల్గొన్న హజరా ఆపా, జైలుకి వెళ్ళకపోడం అవమానకరంగా భావించడమే కాకుండా, జామియా మిలియా ఇస్లామియా విద్యా కేంద్రం నిర్వహణతోపాటుగా ‘హింద్’ ఉర్దూ పత్రికను స్వయంగా నిర్వహించిన బేగం ఖుర్షీద్ ఖ్వాజా, సంపూర్ణ స్వరాజ్యం తప్ప మరొకటి తమకు అవసరం లేదన్న భర్త మౌలానా హసరత్ మోహానికి మద్దతుగా మహాత్మాగాంధీని కూడా విమర్శించిన సాహసి బేగం నిశాతున్నీసా బేగం, భారత విభజన కోరుతూ ఆరంభమైన వేర్పాటు ఉద్యమాన్ని ఎదుర్కొంటూ ‘మతం పేరిట విభజన అరిష్టదాయకం’ అని నినదించిన బేగం మజీదా బానోల బలమైన సైద్ధాంతిక దృష్టికోణం వారిలోని సామ్రాజ్యవాద- విభజన వ్యతిరేకతను సుస్పష్టం చేస్తుంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో సాగిన జాతీయోద్యమంలో తమదైన పాత్రను నిర్వహించిన తెలుగింటి ఆడపడుచులు పోరాట చరిత్రలు కూడా ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి. ఆంగ్లేయుల చర్యలకు వ్యతిరేకంగా ‘యద్ధం వద్దు వద్దు’ అంటూ నడివీధిలో పొలికేక వేసిన రబియాబీ సామాజిక బహిష్కరణకు వెరవకుండా ఉద్యమబాటలో సాగిన హాజరా బీబి ఇస్మాయిల్ కుటుంబం సంపదనంతా ఉద్యమ కార్యక్రమాల కోసం సంతోషంగా వ్యయం చేసిన మహమ్మద్ గౌస్ ఖాతూన్ జాతీయోద్యమంలో మాత్రమే కాదు ఆ తరువాత సాగిన ప్రజా ఉద్యమాలలో కూడా పాల్గొన్న సాహసికులైన అక్కాచెల్లెళ్ళు జమాలున్నీసా బాజీ, రజియా బేగం తెలంగాణా రైతాంగ పోరాటంలో స్వయంగా ఉద్యమకారులకు అన్నపానీయలను అందించడం మాత్రమే కాకుండా దండు రహస్యాలు చెప్పనిరాకరించిన సాహసి జైనాబీ లాంటి మహిలల అసమాన త్యాగాలను చదువుతుంటే మనసు ఉత్తేజపూరితం అవుతుంది.
స్వాతంత్య్రం సిద్ధించాక కూడా త్యాగమయ స్ఫూర్తిని విడిచిపెట్టని ఆ మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తుంటే త్యాగశీలతకు ప్రతిరూపాలుగా వారంతా మన ఎదుట సాక్షాత్కరిస్తారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు, సౌకర్యాలను నిరాకరిస్తూ ‘మాతృభూమి విముక్తి కోసం ఉద్యమించడం ధర్మం. ప్రతిఫలం స్వీకరించడం స్వంత తల్లికి అందించిన సేవలకు ఖరీదు కట్టడమే’ అని తిరస్కరించిన సఫియా అబ్దుల్ వాజిద్, ఫాతిమా తయ్యాబ్ అలీ, కుల్సుం సయానీ, జుబేదా బేగం దావూది లాంటి మహిళల ఉదంతాలు మనలో స్ఫూర్తిని నింపుతాయి. భారత విభజన సందర్భంగా స్వంతగడ్డ మీద ఎదురైన దుర్మార్గ వాతావరణాన్ని సహిస్తూ ‘పుట్టిన మట్టిలో కలసి పోవాల్సిందే తప్ప పుట్టిపెరిగిన గడ్డను వదిలి పెట్టే ప్రసక్తి లేదని’ చివరికంటా విభజన దారుణాలను ఎదుర్కొన షఫతున్నీసా బీబిల పోరాట చరిత్రలను రచయిత ఈ గ్రంథంలో దృశ్యీకరించారు. ‘వంటింటికి పరిమితం, పర్దా ఘోషాల్లోనే మగ్గుతుంటారు’ అనే అపప్రదను మోస్తున్న ముస్లిం మహిళల త్యాగాల చరిత్ర చదువుతుంటే… ముస్లిం స్త్రీ జీవితాల చుట్టూతా ఎన్ని అసత్యాలు, మరెన్ని అపోహలు-అపార్ధాలు కమ్ముకున్నాయో అవగతం అవుతుంది.
చరిత్ర గ్రంథాలలో తగినంత స్థానం పొందలేకపోయిన ఇలాంటి త్యాగధనుల జీవిత చరిత్రలను ఎంతో శ్రమకోర్చి వెలికి తీసి మన ముందుంచడం ద్వారా రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ చరిత్రను అదనపు సమాచారంతో పరిపుష్టం చేస్తున్నారు. ప్రముఖ చరిత్రకారులు శ్రీ వకుళాభరణం రామకృష్ణ వ్యాఖ్యానించినట్టు చరిత్ర ‘లోటును భర్తీ చేస్తున్నారు’ అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ‘సామాన్య ప్రజానీకానికి మాత్రమే కాకుండా, చరిత్రలో ప్రవేశమున్న వారికి సహితం తెలియని స్వాతంత్య్రసమరయోధుల జీవితాలను వారి జీవితాలలోని’ ప్రత్యేక చారిత్రక విశేషాంశాలను అందించడం మాత్రమే కాకుండా ఆ యోధురాండ్ర చిత్రాలను, ఫోటోలను సేకరించి ఆయా సంఘటనలకు ఆధారంగా సందర్భానుసారంగా జతచేయడం, ప్రతి సంఘటనకు చారిత్రక రుజువులు, ఆధారాలను రచయిత పొందుపర్చడం, పుస్తకానికి నిండుతనంతో పాటుగా ప్రామాణికతను తెచ్చిపెట్టింది. ఇది నిరంతర పర్యటన, అధ్యయనము, కృషి, శ్రమ చేస్తే తప్ప సాధ్యం కాదు, ఆయా అంశాల పట్ల రచయితలకు అమితాసక్తి ఉండాలి.
సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన గ్రంథాలలో ప్రామాణికత, పఠనశీలత పుష్కలంగా ఉండటం వలన ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్ర’ ప్రథానాంశంగా తీసుకుని రాసిన తొమ్మిది గ్రంథాలలో 5 గ్రంథాలు మూడుసార్లు, రెండు గ్రంథాలు రెండుసార్లు పూర్తిగా తిరగరాయబడి పునర్ముద్రణకు నోచుకున్నాయి. ఈ విధంగా పలుమార్లు పునర్ముద్రణ చేయడాన్ని చూస్తే ఈ అంశం పట్ల ఆయనకున్న శ్రద్ధాశక్తులు ఏమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆయా సంఘటనలలోని పాత్రధారులు, ఆ సంఘటనలు, జరిగిన ప్రదేశాల గురించి రాసే ముందుగా రచయిత ఆ ప్రాంతాలను సందర్శించి, విశేషాలు తెలుసుకుని ఆయా పాత్రల గురించి రాయడం వలన ఆయన రచనల్లో సహజత్వం ఉట్టిపడుతూ పాఠకుడ్ని కట్టిపడేస్తుంది.
అస్తిత్వాల పట్ల, అస్తిత్వ ఉద్యమాల పట్ల, జాతి జనులపట్ల శ్రద్ధాసక్తులతో కార్యాచరణకు పూనుకుంటున్న వారిలో ఇతర వర్గాల పట్ల, సమూహాల పట్ల అసూయా ద్వేషాలు, కోపతాపాలు ఎంతో కొంత ఉండడం సహజం. కానీ నశీర్ అహమ్మద్ రచనల్లో అటువంటి వాసనలు ఏ మాత్రం కన్పించవు. పైగా ఆయన రచనల్లో అద్యంతం జాతి సమైక్యత, సుృహృద్భావం ప్రతిపంక్తిలో కన్పిస్తుంటాయి. ‘ప్రముఖ విశ్వ విద్యాలయాల్లోని ప్రొఫెసర్లు సైతం చేయలేకపోయిన / పోతున్న పనిని నశీర్ అహమ్మద్ ఒక్కరుగా చేసుకరావడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు.’ అకాడమీలో, విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో చేయగల పనిని నశీర్ ఒంటి చేత్తో చేయడం అభినందనీయమైన, స్వాగతించదగిన మహత్తర కృషి. చరిత్ర అధ్యయనం అంటే ఒకింత అనాసక్తిని చూపే పాఠకులను సైతం అద్యంతం ఆసక్తికరంగా చదివించేలా రాయగలగడం సయ్యద్ నశీర్ అహమ్మద్ కలానికున్న బలాన్ని తెలియజేస్తుంది. చరిత్ర విద్యార్థి నుండి చరిత్ర పరిశోధకుడి వరకు, సామాన్య ప్రజల నుండి పండిత ప్రముఖుల వరకు అవశ్యం చదవదగిన పుస్తకమిది.
భారతదేశంలోని ‘విభిన్న సాంఘిక జనసముదాయాల మధ్య సంయమనం, సమన్వయం, సామరస్యం సాధించాలనుకున్న శక్తులు సకారాత్మక ధోరణిలో కృషి సాగించటం వాంఛనీయం. చరిత్రలోని వాస్తవికతను ప్రజల ముందుకు తెచ్చి ఉమ్మడి కృషి, త్యాగాలలో ఆయా సముదాయాల పాత్రను సవివరంగా, చారిత్రక ఆధారాలతో సహా ప్రజా బాహుళ్యానికి వెల్లడి చేయడం అభిలషణీయమైన చరిత్ర రచనా విధానం. చరిత్రలోని వాస్తవాలు తెలిసి త్యాగమయ పోరాటాలలో సాటి జనసమూహాల భాగస్వామ్యాన్ని తెలుసుకున్న సమకాలీన సమాజంలో సదవగాహన-సద్భావన వృద్ధిచెంది సమాజాన్ని అశాంతికి గురిచేసే ఘర్షణ వైఖరి స్థానంలో శాంతి-సామరస్యం-సౌభ్రాతృత్వ వాతావరణం మరింతగా పరిఢవిల్లుతుంది’ అంటూ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి లాంటి మేధావులు నశీర్ రచనలు సాధించగల ప్రయోజనం పట్ల వ్యక్తం చేస్తున్న అభిప్రాయంతో ఏకిభవిస్తూ ఆ దిశగా రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ మన దేశంలోని విభిన్న సాంఘిక జనసముదాయాల మధ్య సాధించదలకున్న సదవగాహన, సద్భావన, సహిష్ణుత, సామరస్యం కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags