శిలాలోలిత
స్త్రీల అంతర్గత చైతన్యానికి, భావోద్దీపనలకు ‘రచన’ కేంద్రకం. అందుకే ఎంతో అనుభవసారం, నిశిత పరిశీలనం, కలగలిసిన నేపథ్యం వున్నందువల్లే స్త్రీల రచనలలో భావగాఢత ఎక్కువగా వుంటుంది. అయితే కేవలం జీవితానుభవమే రచనకు సరిపోదు. విస్తృతమైన అధ్యయనం ఉండాలి. ప్రపంచాన్ని గమనిస్తున్నట్లే, జీవితాల్ని వింటున్నట్లే, పుస్తకాల్ని ఎక్కువగా చదువుతుండాలి. దేశకాలగమనాల్ని బట్టి, మారుతున్న రచనారీతుల్ని అవగాహన చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్తగా, విలక్షణంగా చెప్పడానికి యత్నిస్తుండాలి. నిజానికి నిత్యవిద్యార్థిలా ఉన్నప్పుడే రచనలు బాగా చేయగలం. ఈ అధ్యయనలోపం వల్ల, చదవడం అనేది చాలామంది తక్కువగా చేయడం వల్ల, కవిత్వపు చిక్కదనం తగ్గుతుందనిపిస్తుంది. ఈ చిన్న జాగ్రత్తను తీసుకుంటే మంచిమంచి రచనలు వెలుగుచూసే అవకాశముంటుంది.
‘తమ్మెర రాధిక’ – కవయిత్రి, కథకురాలు, వ్యాసకర్త్రి. తన కవిత్వాన్ని ‘మనోనేత్రం’ పేరిట మనముందుంచింది. ‘వరంగల్ సాహితీ సంస్థ’ 2010 మార్చిలోనే ప్రచురించింది. వరంగల్ జిల్లాలోని ‘తొర్రూర్’లో ప్రస్తుతం రాధిక నివసిస్తోంది. కొంతకాలం క్రితం రాసి, మధ్యలో ఆపేసి, మళ్ళీ ఇటీవలి కాలం నుంచి తిరిగి రాయడం మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో సాహిత్యాన్ని అధ్యయనం మాత్రమే చేసింది. మరింత లోతుగా పరిశీలనా దృక్పథంతో అధ్యయనం చేస్తే అది ఆమెకు బాగా ఉపకరిస్తుంది.
మనోనేత్రానికి ముందుమాట పొట్లపల్లి శ్రీనివాసరావు రాశారు. ‘కరిగిపోయిన బాల్యం, గ్రామీణ వాతావరణం, మానవ సంబంధాల స్త్రీల అస్తిత్వం, ప్రాంతీయ చైతన్యం గల కవితలు కనిపిస్తాయి’ అని అన్నారు. కవయిత్రి తానెందుకు కవిత్వం రాస్తోందో, రచనోద్దేశ్యం ఏమిటో, రచనపట్ల తన ఆకాంక్షలేమిటో తన ముందుమాటలో తెలియజేస్తే బాగుండేది. కానీ, స్త్రీలింకా మొహమాటపు అంచుల్లోనే వున్నారనుకోవడానికి, తన పరిచయం మానుకోవడం, తన స్వరూపాన్ని ఫొటో రూపంలో భద్రపరచడం చేయడం లేదు. చాలా విలువైన, స్పష్టమైన, బలమైన భావజాలం వున్న కవయిత్రి ఈమె. ఆమె ప్రాపంచిక అవగాహన, రాజకీయదృష్టి, స్త్రీలపట్ల చూపిన ఆర్ద్రత, కరుణ, దిశానిర్దేశం చేసిన ధైర్యం – విషయాన్ని అర్థం చేసుకొని, ప్రశ్నించిన సునిశిత దృష్టి, వస్తు వైవిధ్యం, ఇవన్నీ పుష్కలంగా ఈ కవిత్వం నిండా వున్నాయి. కానీ తన చుట్టూ తనకే తెలియకుండా గీసుకున్న పరిధుల వల్ల, వినయం వల్ల ఆమె పూర్తి స్వరూపాన్ని ఈ సంపుటి చూపించలేకపోయింది. వచ్చే సంపుటిలోనైనా ఆమె స్వేచ్ఛగా, కవిత్వపు చిక్కదనంతో మనముందుకు రావాలన్నదే నా అభిమతం.
‘కలం పట్టుకొన్నాను రాద్దామని
కానీ అక్షరాలు భయంతో ఎగిరిపోయాయి’
అంటూ ప్రారంభించిన కవిత, ‘బంజారా వైభవం’ కవితలో ‘గుడిసె గుడిసెను ములుగర్రలాంటి మనిషి’ కావాలనే ఆశావహ దృక్పథంతో ఈ కవిత్వ సంపుటికి తాత్కాలికపు చుక్కను పెట్టింది. స్త్రీల కన్నీళ్ళు, వేదనలు, రోదనలు, ఉద్యమ చైతన్యాలు, తిరుగుబాటు జెండాలు, స్త్రీలు మరిచిన స్త్రీశక్తుల కాగడాలు, పల్లెలు నిర్జీవమైన దృశ్యాలు, పేదరికంతో కులవృత్తులు అటకెక్కిన దృశ్యాలు, స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తుల జీవితాలు, వైవాహిక సమస్యలు, విద్యావిధాన లోపాలు, గిరిజనుల కడగండ్లు, దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల జీవితాలు, ఆధునీకరణ పేరుతో మరింత దోపిడీకి గురవుతున్న బడుగువర్గాల బతుకువెతలు, మట్టిమనుషుల బ్రతుకుపోరు, నీటిచుక్కకోసం పడుతున్న తండ్లాటలు, పల్లెకు తిరిగి రాలేకపోతున్న వైనాలు, జీవిత రహదార్లు, మీడియా జరదేఖో అని చేసిన హెచ్చరికలు, చిన్నప్పటి ఊర్ల సౌందర్యం, సంస్కృతి, మసకేస్తున్న ప్రస్థానాలు, చీకటికోణాల చిరునామాలు, ఎండమావుల వాస్తవరూపాలు, యివన్నీ రాధిక కవితా వస్తువులే.
ఈ కవిత్వం ఒక్క రాధిక మనోనేత్రమే కాదు. నేటి సామాజిక పోకడల నేత్రం కూడా అన్పించింది. తమ్మెర రాధిక సాహితీరంగ ప్రవేశానికి ఆహ్వానం పలుకుతూ విస్తృతంగా రాయాలని ఆకాంక్షిస్తున్నాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags