నేనందుకోగలను

వి.ప్రతిమ
రావలసినచోటుకి రావడానికి
జీవితకాలం జాగయిదని
రూఢి అయిపోయింది
ఉన్నతోన్నతమైన అంశాలకు
సామ్యం తెచ్చుకుంటాంగాని
నిజానికి కొండ తానంతతానుగా
అనుపమానమైనది
మాఘమాసపు సంధ్యాసమయాన
నీలి మేఘాల గుంపును నెత్తిన మోస్తూ
లోయనిండా కదిలే
వెలుతురు నీడలను వెదజల్లుతుంది
అప్పుడే విరబూసిన పద్యపాదంలా
నిటారుగా తలఎత్తి నిలబడ్డ కొండ
పగలంతా పచ్చదనాన్ని పలుకరిస్తూ
రాత్రి…గూడు కట్టుకున్న నలుపయి పరచుకుని
తెల్లవారుఝూముకి తెల్లటి
తుషార దుప్పటి కప్పుకుంటుంది
ఉదయ సూర్యుని రాకతో
ఒళ్ళు విరుచుకుంటూ
అవిరామపు సాగర ఘోషలో
పద్యం రాస్తోన్న కవి శిల్పంలా వుంటుంది
పాపం కలం కేం తెలుస్తుంది?
విరగబూసిన కలువ కొలనులై
పండుగ జేసుకుంటున్న నా కళ్ళనడుగు
వెన్నెల జలపాతాలయి వర్షిస్తాయి
సువాసనలు నింపుకున్న నా కంఠం
స్వరాలన్నీ విప్పి పురాగానాన్ని
పైకెగరవేస్తుంది…
అధిగమిస్తోన్న ఆనందపు బరువుని మోసి
తూగుతూ నావ తానై హృదయం
అలలమీద చెలరేగుతుంది
కొండను చూసినప్పుడల్లా
వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకుండాగానే
వేల ఏళ్ళు గడిచిపోయినట్టయింది
అనుకుంటాంగాని కొండ
తానంతటతానుగా అనుపమానమైనది
-2-
తరతరాల మానవ జాతి చరిత్రలో
ఎవరికీ తలవంచని యోధుడు కొండ
తటాలున కౌగిలించుకోవాలనిపిస్తుంది
కుప్పి గంతులేసయినా అందుకోవాలనిపిస్తుంది
సొంతం చేసుకోవాలని స్ఫురించిన
మెరుపులాంటి క్షణాలని ఒడిసి పట్టుకుని
ఏడేడు రంగులద్దిన కుంచెని
వేళ్ళకోసలకంటించి ప్రేమగా నిమురుతాను
తలఎంత పైకెత్తినా అందుకోజాలని
వికసించిన పద్యం
ఇప్పుడు నాకే సొంతం
మహిళాబిల్లు దిగులు
కోరు సుమతీ కిరణ్‌
ఎగువసభలో మహిళాబిల్లు పాసైతే
ఎక్కడలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను
అవమాన అణచివేతల ఆకలిదప్పికలు
కొంతవరకైనా తీరతాయని ఆశపడ్డాను
కానీ… దుష్టమేధావుల వితండవాద ప్రచండగాలులకు
వేసిన విస్తర్లు కొట్టుకుపోతాయేమోనని భయంగా వుంది
బిల్లుకు చట్టబద్ధత సమకూరితే
ఏ పార్టీ ప్రాచుర్యంతో లబ్ధ్ది పొందుతుందో
ఎవరి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమౌతుందోనని
ఆడవాళ్ళపాలిట అమృతభాండ బిల్లుకు
వీగుడు చిల్లు పెడతారేమోనని దిగులుగా వుంది
అధికారం రుచిమరిగినవారి నియోజకవర్గ కంచుకోటలు
మహిళాబిల్లుతో బీటలువారి
జాతకాలు తారుమారై అడ్రసులు గల్లంతౌతాయని
తినమరిగిన కోళ్ళు గతంలోలాగే హౌస్‌లో బల్లెక్కి కూసాయేమోనని బెంగగా వుంది
ఇప్పటిదాకా దండలతో పూజలందుకుంటున్నవారు
ఇక ఉత్సవ విగ్రహాలుగా మారిపోవాల్సి వస్తుందని
చొరవ సమీకరణ కృషితో నెలలు నిండిన బిల్లుకు
పురిటిలోనే సంధి కొట్టడానికి – సైంధవులై
శల్య సారధ్యం చేస్తారేమోనని చింతగా వుంది
అయినా… ఆశ మా శ్వాసగా – పోరాట స్ఫూర్తితో పయనిస్తాం
దిగువసభలోనూ బిల్లుకు ఆమోదం లభిస్తుందని
దింపుడు కళ్ళాం ఆశతో ఎదురుచూడాల్సి వచ్చినందుకు
సిగ్గుపడాల్సింది మేమేకాదు – జాతి యావత్తు సుమా!
(డోలాయమానంలో మహిళాబిల్లు వున్నందుకు దురపిల్లుతూ)

నూరవ మైలురాయి
కొలిపాక శోభారాణి
చెప్పుకుంటె పెద్దీర్కం కాదుగాని
చిన్నంగ… మెల్లెంగ… నూరు… ఎండ్లు… దగ్గరికచ్చినం
ఆకాశంలో… సగం…
సరే…
రిజర్వేషన్లల్లో… మాత్రం… ముప్పైమూడు శాతం
ఇచ్చుటానికి… పించుక… పించుక చస్తున్నరు
కేటాయింపుల్లోనే పక్షపాతం బర్‌పూర్‌గా
కనబడ్తనే… ఉన్నది…
ఇన్ని సంవత్సరాలు… నీల్గి… నీల్గి
ఇప్పటికైనా… వెలుగు… చూస్తుందన్న… సంబురానికి
ఎన్ని… తూట్లు…
ఎన్నికలల్ల…
సీట్లల్ల…
మొత్తానికి… మొత్తంగా వారే
ఓట్లేయించుకొనుడు… జనాభాలో
సగమైన నా అక్కాచెల్లెండ్లు… అనుడు
కానీ… రాజీర్కానికి వచ్చేవరకు
33% శాతం…
ఇవ్వి… ఒప్పుకొనేదానికి
ఎగిరి… ఎనగర్రను
దునికి… దూలాలందుకోబట్టిరి
కారాలు… మీరాలు… నూరుడే… నూరుడు
ఒగాయన… విసమే… తాగి… సత్తనంటడు
ఇంకోగాయన… ఎన్కబడ్డోల్లు… వండిపెట్టుకుంటుండక
ముందటికి వచ్చుడెంటికి
బిచ్చం వేసినట్టు… ఇస్తేగనుక
చట్టసభల్లోని… మహిళల్ని… జూసి… సీటీలు
గొడ్లరంటడు… ఓపేరెల్లిన… పెద్దమనిషి
మరి… గద్దెల మీదున్నప్పుడు… ఎటుబోయిందో ఈసోయి
మొదలే… మొతుకుకాదు… కొస్స… సండ్రయితదా
మరి… ఇన్నేండ్లు… గద్దెలిడువక గూసుంటే
అక్కటన్నమా… రెండన్నమా…
లోపల… లోపటంతా… అగులు… బుగులు
పార్తమెంటంలూ… దూం… దూం… చక్కర… చక్కర
ఏదేమైనా
చెప్పెటోల్లకు… సాలు… మూలు… లేదా!
సాలు… సాలైంది… మే… సహాయం… సహకారం
పెట్టి… పొయ్యినమ్మ… పెయ్యంతా పుణికి చూసినట్టు!!
పుట్కునుంచి… సచ్చేదాక
ఆడ… ఆసరా… తోడు… లేకుంట… వుండుడు… సాధ్యమా?
ఆ… బతుకు… జీవునం లేని… కట్టె… లెక్కనే గదా!
అయినా ఈ సృష్టి… మొత్తానికి… పాలిచ్చి పెంచింది… మేమే కదా!

శిలను కాను చైతన్య శీలను
ఎన్‌.నిర్మలాదేవి
ఉప్పొంగుతున్న కెరటాలు
కొలుకులు దాటవు
కనుగుంటల అగాధాల
ఏ కోతలలో జారుతున్నాయో
అజ్ఞాత జ్ఞాపకపు చిరునవ్వొకటి
తళుక్కున మెరసి
అధరాల దిగువన అణగారిపోతుంది
పుచ్చిన పుప్పొడికి ముకుళించిన
ఆకర్షణ పత్రాల్లా
అగమ్య గోచర మానసిక స్థితికి
అభినయ స్వరజతులు అపశృతులే
రహదారి హఠాత్సంఘటనలో
రక్తమడుగు ఆక్రందనలు
మామూలుగా గోడకు తగిలించిన
చిత్రపటంలా దృశ్య వీక్షణమే
కష్టాల తీరంలో కాలు మోపిన పాదం
అతి శీతల అలల స్పర్శకు
మొద్దు బారింది
మంచు తడిచిన పుష్పం
మలయా నిలయ సమీరం
మహాద్భుత ప్రదర్శనలేవీ నన్ను కదలించవే
సత్యబాషణ శృతులు
దైవ రహస్య సంగీత రాగాలు
ఏవీ నాలో చైతన్యం వెల్లివిరియవే
ఎందుకు?… ఎదుకిలా నేను?
నాకు నేనే బరువవుతున్న నేను…
నాలో ప్రాకృతిక రమణీయత
అదృశ్యమైందెలా
స్వీయ బంధువు అంతిమ యాత్రలో
యథాతథంగా సాగిపోతున్న నాది
స్థిత ప్రజ్ఞతా లేక కఠిన స్తబ్ధతా
నీ ఉగ్రకళ్ళ ఎర్రజీరల సాక్షిగా
నన్ను స్తబ్ధ్దురాలిగా తేల్చిన నివేదిక
వెన్ను తట్టిన క్షణం
బ్రతకాలి… బ్రతికాలనే బలమైన కోరిక
శిలను కాదు చైతన్య శీలిని కావాలనే తపన…..
అసంఖ్యాక మరణాలు చుట్టుముట్టి
హత్యగావించ బడిన నాకు
పునరుజ్జీవనము ఎలా?
ఉరికొయ్యలకు వ్రేళ్ళాడుతున్న కోరికలు, ఆశలు
నా అశక్తతను పరిహసిస్తున్నాయి.
ఉక్కు పిడికిట్లో బిగుసుకున్న
నా నీలికురుల తిరస్కారం
అణచివేతలో తల్లడిల్లిన
నా ఆధరాల వణుకు
అధికారంలో బిగిసిన నాదేహంలో
ప్రతీకార భావోద్వేగాల అంతర్వాహిని
నేను పాడిన మధుర భావ రాగాలను బంధించిన
సంకెళ్ళు
వేదనను శృతి చేసి ఆలాపించిన
మరో విముక్తి గీతం
నేను బ్రతికానంటుంది
నిశ్చయముగా నేను బ్రతికాను
నేను ఇప్పుడు
రాయిని కాను
ధిక్కార స్వరగీతిని.
ప్రియమైన శ్యామలకు…
ఆర్‌. శశికళ
దివిపై విరిసిన వెన్నెల
ప్రియమైన శ్యామల
నీలో ఉన్న భావనలు
నవ చైతన్య దీపికలు
కన్నీళ్ళు కష్టాలూ
దాటి వచ్చిన ఎన్నెన్నో అడ్డంకులు
దుష్ట సమాజపు దుర్నీతిలో
సమిధలు నీవు నీ తోటివాళ్ళు
మీ పూర్వులు
వాళ్ళ తరపున ఎలుగెత్తిన
నీ నినాదం మా గుండెల్లో
మార్మోగుతుంది కలకాలం
నీ ఆలాపన
నీ మమతాగానం
సంస్కారవంతుల మదిలో
కోయిల కుహూనాదం
నిన్నటి రోజెంతో చేదు ఫలం
పొందిన ఖండితవు
కానీ ఇవాళ నీవొక నిర్మితవు
అణగారిన వాళ్ళకు
అవమానింపబడిన వాళ్ళకు
గాయాల కోరల్లో విలవిల్లాడుతున్న వాళ్ళకు
నీ ధిక్కార స్వరం
నీ వాగ్దానం
ఓ మధుర స్వప్నం సాక్షాత్కారం
ఈ దుష్ట సమాజం
దుర్నీతిని కూల్చేందుకు
చరిత్ర నిర్దేశించిన
చెరిగిపోని సంతకం నీవు.
అందుకో నీకిదే నా వందనం!
(తెలుగు సమాజానికి పరిచయమై జోగినీ వ్యవస్థపై తన ధిక్కార స్వరాన్ని వినిపించిన శ్యామలకు ప్రేమతో…)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.