హిమజ
తెలంగాణ ప్రాంత ప్రజల అస్థిత్వ వేదనలకు, వ్యథలకు పోరాటాలకు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలంగాణా కవయిత్రుల కవితా సంకలనం ‘గాయాలే గేయాలై” పుస్తకావిష్కరణ కార్యక్రమం మే 8 వ తేదీ 2010న నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్‌లో ఎంతో ఆత్మీయంగా జరిగింది. 60 మంది తెలంగాణా ప్రాంత మహిళా కవయిత్రుల కలాల నుంచి జాలు వారిన కవితల సమాహారం ”గాయాలే గేయాలై” కవితా సంకలనాన్ని ప్రముఖ తెలంగాణా సీనియర్ రచయిత్రి, పరిశోధకురాలు ముదిగంటి సుజాతారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె, తెలంగాణాలోని మహిళాలోకంలో మంచి కవిత్యాంశ ఎంతో మంచి అభివ్యక్తి వున్నాయన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో తెలంగాణా మహిళలు లేరన్న అపోహ నెలకొన్న సమయంలో 60 మంది కవయిత్రుల కవితలతో ఈ సంకలనం రూపొందడం ఎంతో చారిత్రాత్మక సంబరం అని అన్నారు. బలమైన అభివ్యక్తి కల్గిన అనేక మంది కవయిత్రులు తెలంగాణాలో వున్నారని వారు తమలో దాగిన ప్రతిభను బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా వుందని సుజాతారెడ్డి ఉద్వేగంగా పలికారు.
ఈ సభలో గౌరవ అతిధిగా పాల్గొన్న ప్రముఖ కవి జింబో మాట్లాడుతూ ఈ కవితా సంకలనంలో తెలంగాణా ప్రజల ఆవేదన ఆక్రోశాలు కనిపిస్తున్నాయన్నారు. కొత్తవాళ్ళు రాసారా అని ఆశ్చర్యపోతాం. అలనాడు తెలంగాణాలో కవులు రచయితలు లేరన్న విమర్శకి జవాబుగా సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కండకవులు’ అని 432 మంది తెలంగాణా కవులతో రచయిలతో కూడిన జాబితా రూపొందించి చూపారు. కవయిత్రుల సంకలనాలలోను, ఇటీవల తెలంగాణ నుంచి వచ్చిన మరికొన్ని కవితా సంకలనాలలోను, తెలంగాణ కవయిత్రులకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు. వాటన్నింటికి సమాధానంగా ఈ సంకలనం నిలుస్తుందన్నారు. ఇలాంటి సంకలనాలు మరిన్ని రావాలని జింబో ఆకాంక్షించారు. కవయిత్రులు తమ కలాలను ఆయుధాలుగా మలచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మరో అతిధి, న్యాయవాది అమరావతి అన్నారు. తెగింపుతోనే బతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆమె అన్నారు. అనంతరం కవితా సంకలనానికి రచనలు అందించిన కవయిత్రులను సభకి పరిచయం చేస్తూ సత్కరించారు.
సభ ప్రారంభంలో కవితా దివాకర్ బృందపు ఉద్యమ గీతాలాపనకు సభికులు దరువేస్తూ వంత పాడటం అందర్నీ ఆకట్టుకుంది. సభ మధ్య మధ్యలో ‘జై తెలంగాణ..జై జై తెలంగాణ అంటూ చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ సభకి ప్రముఖ కవి ఏ. సూర్య ప్రకాశ్ అధ్యక్షత వహించగా మరో ప్రముఖ కవి వి.పి. చందన్‌రావు తన సమయోచిత వ్యాఖ్యానంతో సభ నిర్వహించారు.
ఈ తెలంగాణ కవయిత్రుల సంకలనంలో తెలంగాణేతర కవయిత్రుల కవితలు కూడా చోటు చేసుకున్నాయన్న వ్యాఖ్యలు సభలో అక్కడక్కడ విన్పించాయి. తెలంగానేతరులైనా ప్రత్యేక తెలంగాణ భావనకి తమ మద్ధు, సంఘీభావం ప్రకటించిన వారెవరైనా అక్కున చేర్చుకుంటామని, ముందునుంచీ అది తెలంగాణ ప్రజల స్వభావమని అన్నవారూ వున్నారు. అరాచకాలు అన్యాయాలు ఆర్తితో ఖండించే విషయంలో కవులకి దేశ భాష కుల మత ప్రాంతీయ భేదాలుండవు. ఉండకూడదు కూడా.
ఇంతకీ- ఇంత చరిత్రాత్మకతను సంతరించుకున్న ఈ సంకలనం వెనుక సంకల్ప శక్తి ప్రముఖ రచయిత్రి ‘రాజీవ’ గా పిలవబడే వై. లక్ష్మీవాసన్‌ది. ఏ చలనం లేకుండా మార్చి 8కి నూరేళ్ళు నిండాయన్న బాధ ఆమెలో ఈ సంకలనానికి శ్రీకారం చుట్టేలా చేసింది. ఆమె ఆలోచనని అంది పుచ్చుకున్న అమృతలత విజయ్ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు తన ఆర్ధిక హార్ధిక సహకారాన్ని సంపూర్ణంగా అందించి ఈ సంకలనం వెలువడటానికి కారకులయ్యారు. అమృతలత 70 వ దశకంలో విరివిగా రాసిన రచయిత్రి. ‘సృస్టిలో తీయనిది’ నవల, ఒక కథా సంపుటి, నాటికల సంపుటి వెలువరించారు. తాను నిర్వహించిన పత్రిక సంపాదకీయాలను అమృతవర్షిణి పేరుతో సంపుటంగా తెచ్చారు. ప్రముఖ కవయిత్రి జ్వలిత తన సహాయ సహకారాలనందించడంతో రాజీవ, జ్వలిత, అమృతలతల సంపాదకత్వంలో ఈ కవితా సంకలనం రూపు దిద్దుకుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో వున్న కవయిత్రులందర్నీ ఒక్క వేదికపైకి తీసుకు వచ్చేందుకు సంపాదకులు చేసిన కృషిి ఫలించింది.
ఆది నుంచీ ఎంతో ఉత్సాహంగా ఉద్విగ్నంగా సాగిన ఈ సభలో సీనియర్ కవులు సి.హెచ్.మధు, కందాళై, శంకర్, 60 మంది కవయిత్రుల్లో దాదాపు సగంమంది కవయిత్రులు పాల్గొన్నారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
తెలంగాణా కవయిత్రుల కవితా సంకలనం….
ఒక గొప్ప ముందడుగు..