డా|| అడువాల సుజాత
ఆచార్య పాకాల యశోదారెడ్డి గారు మహబూబ్‌నగర్‌జిల్లా బిజినేపల్లిలో జన్మించారు. ఆమె పుట్టిన ఊరిని అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను, భాషలోని మాధుర్యాన్ని సంఘజీవన విధానాన్ని చక్కగా తన కథలలో వివరించారు. ఈమె కథలు మూడు సంపుటాలుగా వచ్చాయి. అందులో ఒకటి ‘మా ఊరి ముచ్చట్లు’, రెండు ‘ఎచ్చమ్మ కతలు’, మూడు ‘ధర్మశాల’.
యశోదారెడ్డి కథలలో ముఖ్యంగా తెలంగాణా గ్రామీణ పరిసరాల అందం, ఆ పల్లెలలోని ఆహ్లాదకరమైన గాలి, కొండకోనలు, పశుపక్షులు, పంటచేలు, చెట్టుపుట్టలు చక్కగా వర్ణించింది రచయిత్రి. పల్లెలలోని ఆహారపు అలవాట్లు, ప్రేమానురాగాలు ముఖ్యంగా తెలంగాణా మాండలిక భాష, జాతీయాలు, పదబంధాలు, తెలుగు నుడికారాలు, సామెతలు, పలుకుబడులు, కన్నుల ముందు కదిలేటట్లుగా మరింత సొగసుగా, పొంకంగా వర్ణించారు.
ధర్మశాల కథలలోని సాంఘిక జీవనం, ఆచారాలు :
ధర్మశాల అనే కథల సంపుటిలో మా వూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కతలు ఈ రెండు సంపుటాలలో కంటే ఎక్కువ సామాజిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. గ్రామీణ వాతావరణం నుంచి అభివృద్ధి చెందిన పట్టణ వాతావరణం ఈ కథలలో కన్పిస్తుంది. ఉన్నత చదువులు, కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు, చదువుకున్న సంస్కృతీ సంప్రదా యాలు కాలానుగుణంగా మారుతూ వచ్చిన సామాజిక పరిణామాలు, సంస్కృతీ పరిణామాలు, భాషా పరిణామాలు మొదలైనవి ఈ కథలలో గమనించవచ్చు.
ధర్మశాల కథలో మనుషుల మన స్తత్వాలు కలిస్తే కులమతాలు, ఆచార సంప్రదా యాలు అనేవి అడ్డుగా నిలవవు. అవి తాత్కాలి కంగా ఉన్నా, శాశ్వతంగా అడ్డుగా నిలవలేవు అని తెలుస్తుంది.
దారా కథలో ప్రకృతి సహజమైన ప్రేమకు అంతరాలు లేవు. మనుషులకైనా, మూగజీవులకైనా ప్రేమలోని గొప్పదనం ఒకటే అని తెలుస్తుంది. దారా కథ ద్వారా ఆ కాలంలో దొరల ఇండ్లలో ఉండే పెంపుడు కుక్కలకు ఎలాంటి రాజభోగాలుండేవో గమనించవచ్చు. దారా ఒక కుక్క అయినా మనిషి కంటే ఎక్కువ జాగ్రత్తగా వేళ ప్రకారం దానికి పనివాళ్ళు సర్వోపచారాలు చేసేవారు. దారా అంటేనే ఒక ప్రిస్టేజి సింబల్ అని చెప్పటం ద్వారా పెంపుడు జంతువుల పట్ల ఆ కాలంలో ఉండే అభిమానం తెలుస్తుంది. ఇంకా పెంపుడు జంతువుల మనసు తెలుసుకొని నడిచే బుద్ధి శీలత (యజమానుల) కన్పిస్తుంది. ప్రేమానురాగాలు మనుషులకే కాదు జంతువులకూ ఉంటాయి. అవి వాటి కోరిక తీరనపుడు రోదిస్తాయి అనే విషయం ఈ కథలో చక్కగా వివరించటం జరిగింది.
నిప్పుతో చెలగాటం కథలో కథ నవనాగరికపు మోజులోపడి జీవితాలను బుగ్గిపాలు చేసుకునే అమ్మాలందరికీ (స్త్రీలకు) ఒక గుణపాఠం నేర్పుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. అలాగే జీవితం చేజారిన తర్వాత తిరిగి రాదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతలాగా ముందు జాగ్రత్తగా వ్యవహరించి మసలుకోవాలి. తొందరపాటు నిర్ణయాలను తీసుకొని తప్పులు చేయరాదు అనే నీతి తెలుస్తుంది.
ఈ కథ నాగరికత పేరుతో మోస పోయే ఆడవాళ్ళకు ఒక గుణపాఠం చెప్తుంది.
ఈ కథలో సంఘంలోని వ్యభిచార గృహాల దుస్థితి, అక్కడి స్త్రీల పైపై మెరుగుల జీవితం, ఆ ఏరియాకు ఉన్న విలువ, గౌరవం ఆ చుట్టుప్రక్కల మధ్యతరగతి కుటుంబీకులు జీవిస్తూ ఎదుర్కొనే ఇబ్బందులు, తెలిసీతెలియక మోసపోయే స్త్రీల దుస్థితి చక్కగా కళ్ళ ముందు కదలాడుతుంది.
రంగడు కథలోని రంగారావు గారాబంగా పెరిగి చెడిపోయిన వాడు. రంగడు తనకు తానుగా నేను గొప్పవాన్ని, అని గర్వంగా మురిసిపోయే మూర్ఖుడు. రంగడు లోక జ్ఞానం తెలియనివాడు, బాధ్యతలు తెలియనివాడు. కనుకనే పోలీసుల చేతుల్లో తన్నులు తిన్నా, అది గొప్ప అనే ఫీలింగుతో పొంగిపోయాడు. ఈ కథ పిల్లలను అతిగారాబంగా చూసే తల్లిదండ్రులకు, రంగని వంటి అమాయ కులకు, గడుసుతనం కలబోసిన మూర్ఖులకు కూడా తగిన విధంగా గుణపాఠం చెపుతుంది.
ప్రమీల కథలోని సీతాపతిరాజు నపుంసకుడైన దుర్మార్గుడు. తన లోపాన్ని కప్పిపుచ్చుకొని అందర్నీ మోసం చేసిన వంచకుడు. పాపం ప్రమీలను దారుణంగా హింసించి చంపిన హంతకుడు. ఆధారాలేమీ దొరకకుండా చేసిన మోసగాడు. అందర్ని మభ్యపెట్టి, మోసగించి, ఉత్తముడుగా, చాలా గొప్పగా చలామణీ అయిన దొంగ. సీతాపతిరాజు గురించి పూర్తిగా తెలిసిన శ్రీనివాస్, రాఘవలు పథకం ప్రకారం అల్లిన ఊబిలో దిగి చిక్కుకున్న అమాయకుడు. సంఘంలోని చీడపురుగు సీతాపతి, ఆ చీడ పురుగులను ఏరిపారేసే రాఘవ, శ్రీనివాస్ లాంటి ఆదర్శ యువకులు సమాజానికి ఎంతైనా అవసరం. పెద్దవాళ్ళు అమాయకంగా తెలియక పైపై మెరుగులను చూసి, డబ్బును చూసి, తమ ఆడపిల్లలను దుర్మార్గులకు ఇచ్చి మోసపోవద్దనే నీతి ఈ కథవల్ల తెలుస్తుంది.
దిబ్బరొట్టె కథలో ”తూర్పు తెలతెలవారకముందే ఉదయలక్ష్మి పురుడు పోసుకుంటున్న వార్తను లోకానికి చాటుతున్నట్లు కాకులు ‘కావ్, కావ్’ మంటూ విన్నపాలు ప్రారంభించాయి. కోళ్ళు కొక్కరకో అంటూ దండోరా చేస్తున్నాయి. రామనాథం విసుగ్గా పట్టెమంచం పైన ఈ పక్క నుండి ఆ పక్క తిరిగాడు. ఇంట్లో సందడి ప్రారంభమైంది. పాలు పితకడం, కుంపట్లు అంటించడం, చేత బావి దగ్గర వేన్నీళ్ళ కొప్పెర వేయడం, గచ్చులు కడగడం, కల్లాపి చల్లి ముగ్గులు వేయడం ప్రారంభమైంది. వెంకటరమణ అమ్మమ్మ స్నానం ముగించుకొని మేలుకొలుపు పాడుతుంది” అని చక్కగా వర్ణించారు రచయిత్రి.
రూం నంబర్ థ్రి కథలో తమ అవసరాల కోసం అందర్ని మోసం చేసి, వాళ్ళ పనులు వెళ్ళబుచ్చుకుంటారు కొందరు. కానీ, ఎత్తుకుపైఎత్తు వేసి వాళ్ళను పట్టించి, అసలు నిజం బయటపెట్టేవాళ్ళు కూడా ఉంటారు అనే విషయం ఈ కథ వల్ల తెలుస్తుంది. పవిత్రమైన వైద్యవృత్తి ముసుగులో చేస్తున్న మోసం, జరుగుతున్న అవినీతికి ప్రతినిధులుగా డాక్టర్, సిస్టర్‌లు కనబడతారు ఈ కథలో. కొత్తగా వచ్చిన డాక్టర్ ఈ విషయాన్ని పరిశీలించి ఆరాతీసి దయ్యం ముసుగును తొలగించి అసలు దోషులను పట్టుకున్న తెలివైనవాడు. మోసగాళ్ళు ప్రజలను గుడ్డిగా ఎలా నమ్మిస్తారో, ఆ నమ్మకాన్ని ఇంతింత చేసి, గొర్రెదాటుడుగా మలచి స్వప్రయోజనాలకోసం, ప్రజోపయోగంలో ఉండేవాటిని స్వార్థంగా వాడుకోవడం ఈ కథలో గమనించవచ్చు. సంఘంలో ఇలాంటి సన్నివేశాలూ మోసాలూ జరుగుతాయి అని తెలియచేసే కథ ఇది.
ఈ కథలో సంఘంలో పేదవాళ్ళు అనుభవించే కష్టాలు, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని మేకవన్నె పులుల లాగా నటించే దుర్మార్గుల అరాచకాలు, సంఘంలో స్త్రీలు అనుభవించే మానసిక, శారీరక హింసలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ప్రతిబింబం ఈ కథ.
సంది కథలో జమిందారుల ఇండ్లల్లో పనిచేసే ఆడపిల్లల దుస్థితి, వారి మానసిక విఘాతాలు, అనుక్షణం పనివాళ్ళు అనుభవించే కష్టాలు సంది పాత్ర ద్వారా ఈ కథలో చూడవచ్చు. గ్రామాలలో దొరల ఇండ్లల్లో ఉండే నీతి నియమాలు, కట్టుబాట్లు, సాంఘికాచారాలు, ఆడబాపల దుస్థితి ఈ కథలో గమనించవచ్చు.
సంకుదేముడు కథలో కొండ జాతి, కోయజాతి ప్రజల ఆచార సంప్రదాయాలు చక్కగా వివరించబడ్డాయి. జాతరలు, వాళ్ళ అలంకరణ, నగలు ‘థింసా’ నృత్యం, పెళ్ళికి జరిపించే తంతు, శోభనం ఏర్పాటు చేసే పద్ధతి, ‘వోలి’ (కన్యాశుల్కం లాంటిది) చెల్లించడం, మగనాళి సుంకం అంటే మారుమనుము పోయే ఆడపిల్ల మొదటి భర్త పంచాయితీ తెస్తే కుల పెద్దలు అతనికి నిర్ణయించి చెల్లించే రొక్కంను మగనాళి సుంకం అంటారు. అది ఈ కథలో చిత్రడు సుక్రి కోసం పండన్నకు చెల్లిస్తాడు.ఇటువంటి గిరిజన ప్రజల సాంఘికాచారాలు ఈ కథలో గమనించవచ్చు.
రాజుగారి ఒక్కనాటి ప్రయాణం కథలో రాజుగారికి ఏర్పాటు చేసిన రథం, అలంకారాలు, భోజనాది సౌకర్యాలు, అతని కీర్తిని చాటిచెప్పే హరికథలు, బుర్రథలు మొదలగు హడావిడి అంతా కనబడుతుంది. బహిరంగ ప్రదేశంలో బస ఏర్పాటు చేసిన తర్వాత, జంతువుల అరుపులు విని భయపడి గెస్ట్ హౌజ్‌కు వెళ్ళిపోయిన రాజుగారి పిరికితనం ఇందులో గమనించవచ్చు.
సౌభాగ్యవతి కథలో సనాతనంగా వస్తున్న హిందూ వివాహ సంప్రదాయం, స్త్రీలు భర్తలను గౌరవించి పూజించడం భర్త ఎలాంటి వాడైనా దైవంగా భావించడం భారతదేశంలోని పతివ్రతల లక్షణం. ఆ లక్షణాలన్నీ నర్సులో చూస్తాము. లక్ష్మినర్సు తల్లిదండ్రులు ఆలోచించకుండా, అబ్బాయి మంచీచెడులు చూడకుండా పెళ్ళి చేసి తప్పుచేశారు. వెంకటేశ్వర్రాయుడి తల్లి కొడుకు గురించి తెలిసి కూడా కొడుకుకు పెళ్ళి చేసి, కొడుకుతో పాటు కోడలి జీవితం బూదిపాలు చేసింది. తెలిసీ తెలియక పెద్దవాళ్ళు చేసిన తప్పుకు బలైపోయింది నర్సు జీవితం. లౌకికమైన సుఖాలకోసం కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకోకపోవడం కనిపిస్తుంది. ఈ కథలో నర్సు పుట్టుకతో అదృష్టవంతురాలే కావచ్చు. కానీ పెళ్ళితో ఆ సౌభాగ్యం మోడువారింది. కానీ ఆ విషయం తెలియని గుడ్డిలోకం నర్సు అదృష్టవంతురాలనీ పుణ్యస్త్రీ అనీ మంగళహారుతుల పట్టింది.
ఈ కథలో ఆలోచనలేని తల్లిదండ్రుల, పెద్దల నిర్ణయాలకు బలైపోయిన ఆడపిల్ల జీవితం కనబడుతుంది. ఆ కాలం తల్లిదండ్రులు చూపించిన వరుడి చేతనే తలవంచుకొని తాళి కట్టించుకోవటం అనే ఆచారం, సంప్రదాయం ఉండేది. ఆడపిల్లలకు పెళ్ళి విషయంలో స్వేచ్ఛ ఉండేది కాదు. తల్లిదండ్రులు ఏది చెప్పినా విని, ఎవరిని చూపించినా నమ్మి పెళ్ళి చేసుకునే వారు. అలా ఈ కథలో ఆచరించి మోసపోయిన స్త్రీ లక్ష్మినర్సు.
ఊరిఅవతలి బావి అనే కథలో అగ్రకూలాల (బ్రాహ్మణుల) వాళ్ళ పద్ధతులు మడీ, మైలా, నిత్యనైవేద్య, దీపధూపారాధనలూ, ఆచారాలు కన్పిస్తాయి. ముఖ్యంగా బ్రహ్మణులు తక్కువ కులాల వారిని దరి చేరనివ్వకుండా అస్పృశ్యతా భావంతో చీదరించుకోవడం, అవమానించడం, బావినీళ్లు ముడితే అవి అపవిత్రం అవుతాయనే గుడ్డి నమ్మకాలు, సాంఘికాచారాలు ఇందులో చూడవచ్చు.
అందిన కందిరీగ కథలో కూతురు భర్త చనిపోతే ఆమె పిల్లల పోషణను దృష్టిలో ఉంచుకొని తర్వాతి కూతుర్ని మొదటి అల్లునికే ఇచ్చి పెళ్ళి చేయటం అనేది చాలా కాలం నుంచి వస్తున్న ఆచారంగా చూడవచ్చు. అది కొన్ని చోట్ల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాంటి పెళ్ళిళ్ళలో కొంత మంది ఆడ పిల్లలు అదృష్టం కొద్ది అన్ని సర్దుకొని ఉండగలుగుతున్నారు. కానీ, ఇంకొందరి విషయంలో ఆ పెళ్ళిళ్ళు విషమించి ఆడపిల్లల జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతున్నాయి. ఆ పిల్లల భారం భరించరానిదిగా కొన్ని చోట్ల తయారవుతుంది. కొన్ని చోట్ల పిల్లలను గురుకులాలలో ఉంచవలసి వస్తుంది. ఇలా అనుకోని మలుపులు తిరిగిన ఒక ఆడపిల్ల జీవితమే ఈ కథలోని యమున పాత్ర.
ధర్మశాల కథలలోని సామాజిక పరిణామాలు, అభ్యున్నతి :
ధర్మశాల కథల సంపుటిలో తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రజలు, మధ్య తరగతి సాంతం గూడుకట్టుకుని స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. తెలంగాణలో ఎదుగుతున్న మధ్య తరగతి, పట్టణాల్లో స్థిరపడుతూ మధ్యతరగతిగా మారుతున్న క్రమం వారి జీవితాలు, ఆలోచనల్లో వస్తున్న మార్పులు, విద్య, సమాజంలో నిర్వహిస్తున్న పాత్ర మొదలైనవి 1980-1999 దశాబ్దాల్లో వచ్చిన సామాజిక పరిణామాలను చిత్రించాయి. వాటిని అనుసరించి రచయిత్రి కథా వస్తువును, శిల్పాన్ని చిత్రించిన తీరు ధర్మశాల కథల్లో చూడవచ్చు.
ధర్మశాల కథలో కులాంతర వివాహంతో ఒకటైన రెండు కుటుంబాల ద్వారా సమాజంలో ఉన్నత విద్యతో పాటు మారుతున్న సామాజిక పరిణామాలు గమనించవచ్చు. ఈ కథలో ఒకే ఇంటిలో నాలుగు వాటాలలో నాలుగు ప్రాంతాలకు చెందిన వాళ్ళు నివాసం ఉంటారు. వాళ్ళలో ఒకరు తమిళలు అయతే ఇంకొకరు బ్రాహ్మణులు, మరొకరు రైతులు, వేరొకరు ఉద్యోగ రీత్యా అక్కడి వచ్చి స్థిర పడ్డ వాళ్ళు. ఇందులో మొదట ఒకరినొకరు అర్థం చేసుకోక ఇక్కట్లు ఎదుర్కున్నా తర్వాత అందరూ కలిసి పోతారు. ఇక్కడ సంఘంలో మంచి చెడులే తప్ప కులమతాలు ప్రధానం కాదని తెలుస్తుంది. ఆ ధర్మశాలలోని చదువుకున్న ఆదర్శవంతులు కులమతాల పట్టింపు ఉన్నవారిని కూడా మార్చి కులాంతర వివాహానికి నాంది పలుకుతారు. ఇది ఆ కాలంలోని సామాజిక పరిణామంగా చెప్పుకోవచ్చు.
దారా కథలో కూడా గొప్పింట్లో పుట్టి పెరిగిన సుభద్ర, మామూలు కుటుంబంలోని శరత్‌ల ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం ఒక సాంఘిక, సామాజిక పరిణామంగా చెప్పుకోవచ్చు.
పట్టణాలలోని జీవితం, అక్కడి స్త్రీలు నాగరికంగా ఉంటారు అనుకునే గ్రామీణులకు, పట్టణాలలోనే, మోసం, కుట్ర, కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయని తెలియచేస్తుంది ఈ కథ. పల్లెటూళ్ళలో లాగా కల్మషం లేని ప్రేమ ఆప్యాయతలు, కట్టూ, బొట్టూ, పద్ధతులు, సంప్రదాయాలు ఇక్కడ ఉండవనే నిజం తెలుస్తుంది ఈ కథవల్ల. ఈ కథలో వ్యభిచార గృహాలు, వాటి దగ్గర జరిగే తతంగం, అక్కడ అమ్మే వస్తువులు అన్నీ కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు రచయిత్రి. జీవనోపాధి కరువై వ్యభిచారంతో జీవితం గడిపే దుర్భర వ్యవస్థకు ఒక తార్కాణం ఈ కథ.
గ్రామాలలో మగపెళ్ళి వాళ్ళ ఆస్తి, అంతస్తులు చూసి మోసపోయే తీరు, ఆడపిల్లలకు లోతుపాతులు చూడకుండా, ఆలోచించకుండా పెళ్ళిచేసి వారి జీవితాలను బూదిపాలు చేసిన తల్లిదండ్రులు ఎలా వుంటారో అనేదానికి ఉదాహరణ ఈ కథగ చెప్పవచ్చు. ఇంకా అది గొప్ప అంటూ మా అమ్మాయి సౌభాగ్యవతి అంటూ మురిసిపోయే అమాయకపు గ్రామీణ మనస్తత్వాలు ఇక్కడ గమనించవచ్చు.
సౌభాగ్యవతి కథలోని శ్రీనివాస్, రాఘవలు చదువుకున్న ఆదర్శంతులు. సమాజోద్ధ్దరణకు కంకణం కట్టుకొని పథకం ప్రకారం సంఘంలోని చీడ పురుగులను ఏరి వేసే దాకా నిద్రపోని కార్యదీక్షాపరులు. ఈ కథలో సీతాపతి రాజు లాంటి దుర్మార్గులను శిక్షించడం, వాని నాటకాన్ని బయటపెట్టి అమాయకుల కళ్ళు తెరిపించడం ఒక సామాజిక పరిణామం.
దిబ్బరొట్టె కథలో నగరజీవితంలోని సౌఖ్యాలకంటే పల్లెటూళ్ళలోని ప్రేమ ఆప్యాయతలు గొప్పవని నిరూపించబడుతుంది. నిజాయితీ, ప్రేమ, ఎద నిండిన మమతానురాగాల ముందు యాంత్రిక జీవితంలో దొరికే సుఖాలు ఓడిపోయాయి. అచ్చమైన ఆవు నెయ్యితో స్వచ్ఛమైన మనసుతో చేసే, పూర్వకాలపు వంటలన్నింటినీ (దిబ్బరొట్టె) రుచి చూసాక, ఇక్కడికి ఎందుకు వచ్చానా! అని అనుకున్న రామనాథంగారు ప్రతి యేటా ఇక్కడికి వద్దాంలే! అన్నాడు భార్యతో. ఈ నవీన యుగంలో దొరికే ఫాస్ట్‌ఫుడ్స్ అన్నీ, గ్రామాలలో చేసే సంప్రదాయ వంటల ముందు దిగదుడుపే అని తెలుస్తుంది ఈ కథలో.
బరిబత్తల బొమ్మ కథలో మహిళా సమాఖ్య సంఘాల ద్వారా స్త్రీల చైతన్యం ఆలోచనా శక్తిలో మార్పు కన్పిస్తుంది. అరాచకాలు, పల్లెటూళ్ళలోని జీవితాలు, అతని కొడుకు మార్గదర్శకత్త్వం ఇందులో చూడవచ్చు.
సంది కథలో దొరల ఇండ్లల్లో అరాచకానికి గురైన స్త్రీల దుస్థితి కన్పించినా, చివరికి దొర కొడుకు చదువుకున్న సంస్కారమున్న యువకుడు అయినందు వల్ల సందిని పెళ్ళి చేసుకుంటానని జీపు ఎక్కించుకుని తీసుకుపోవటం ఆదర్శానికి, సామాజిక అభివృద్ధికి నాందిగా చెప్పుకోవచ్చు.
సంకుదేముడు కథలో చిత్రడు గూడెంలో పుట్టి పెరిగినా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు. ఒకసారి పెళ్ళయిన సుక్రిని అనుమానించకుండా, ఆమె పవిత్రప్రేమను అర్థం చేసుకొని ఆదర్శంగా మగనాళిసుంకం చెల్లించి మరీ పెళ్ళి చేసుకున్నాడు. ఇది సమాజంలో ఆదర్శ వివాహం. గూడెం ప్రజల ఆచారాలు ఈ కథలో కనబడుతాయి.
ఊరి అవతలి బావికథలో కొండజాతి వాళ్ళ భాష, మాట్లాడే పద్ధతి చక్కగా వివరించారు రచయిత్రి. ఈ కథలో పోశాలు మాటల ద్వారా అంటరాని వాళ్ళు కూడా అగ్రవర్ణాల వారిని ఎదిరించి నిలవగలరు, వారికి జరిగే అన్యాయాన్ని మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీయగలరు అని తెలుస్తుంది. కాని చివరికి పోశాలు తన తప్పు తెలుసుకొని క్షమాపణ అడగడం అతని మానవత్వం. ‘నువ్వే నా కళ్ళు తెరిపించావురా’ అంటూ అతన్ని సమర్థించడం రాధాకృష్ణశర్మ ఆదర్శం. కులం, మతం, ఆచారం ఇవి కాదు మనిషిని మనిషిగా నిలిపేవి కేవలం మనిషి నడక, సత్ప్రవర్తన, నలుగురికీ సాయపడే గొప్ప గుణమే. ఆ గుణం వల్లనే పేద గొప్ప అనే బేధాలు ఏర్పడుతాయని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు.
డా|| నర్సింహరావు గారు కులబేధాల గురించి ”గ్రామములలో కుల విభేదాలు, వర్ణవివక్షతలు నిర్మూలించాలన్న దీక్షతో యువజన, మహిళా సంఘాల వారు పట్టుదలతో పనిచేసి సహపంక్తి భోజనాలు, అన్ని కులాల వారు కలిసి మెలిసి పాల్గొనే ఆటలు, పాటలు తదితర కార్యక్రమాల ద్వారా కృషిచేశారు. గాంధీజీ ప్రారంభించిన ఆస్పృశ్యతా నివారణ ఉద్యమాన్ని యువజన మహిళా సంఘాల వారు కొనసాగించారు. తమ యిళ్ళలోని హరిజనులను రానివ్వడం, వారు తెచ్చిన నీరు త్రాగటం, మున్నగు కార్యక్రమాల ద్వారా అస్పృశ్యతా నివారణకు పూనుకున్నారు. ఇందుకు ఎన్నో ఆటంకాలు, యిబ్బందులు ఎదురైనప్పటికీ అవన్నీ ఎదిరించి నిలబడ్డారు.” అని అన్నారు.
కలకల్ల కాలేదు కథలో ఏమైనా కొన్ని కలలు నిజమౌతాయని, అందుకు మన శాస్త్రజ్ఞులు, పురాణ, ఇతిహాసాలు గౌతమ బుద్ధుని కథ వివరణలు బాగున్నాయి. ఇళ్ళల్లో మన పెద్దవారు కూడా (విద్యాగంధంలేని వారు) తెల్లవారు ఝూమున వచ్చిన కలలు నిజమైతాయంటారు నమ్మక తప్పదు మరి. ఈ కథలో యువకుల స్ఫూర్తి, చైతన్యం, నవ నాగరికత సమైఖ్య సంఘాలు, యువత, పురోభివృద్ధితో చేపట్టే కార్యక్రమాలు, కలిసికట్టుగా ఉండి ఎంతటి జఠిలమైన సమస్యనైనా సాధించగలిగే తీరు కనబడతాయి. ఆదర్శ వివాహాలు, ప్రేమవివాహాలు ప్రోత్సహించబడడం అనే సామాజిక పరిణామాలు ఇందులో చూడవచ్చు.
యమున ఆత్మస్థైర్యంగల యువతి. పరిస్థితులను ఎదిరించి నిలిచే మనో నిబ్బరంగలది. ఆమె మనసులోని బాధ బయట పడకుండా మసలుకుంటూ, కాలేజీలో అందరికీ అందరాని కందిరీగలా ఉండేది. కానీ ఆమె మనసులో ఉన్న విషాదగాథ ఎవ్వరికీ చెప్పుకోలేదు. యమున సమయస్ఫూర్తిగల వనిత. ఆమె తగిన సమయంలో సునీల్‌కు తన గతం చెప్పింది. సునీల్ కూడా ఆదర్శంతుడైన యువకుడు. కాబట్టి ఆమె గతం విని తగిన నిర్ణయం తీసుకున్నాడు. అందరికీ అందరాని చందమామగా ఉన్న యముననుతన కైవసం చేసుకున్నాడు. యమున కథ ఒక అందమైన మలుపు తిరిగింది ఇందులో యమున, సునీల్‌ల వివాహము ఆదర్శమైంది. వీళ్ళు చదువుకున్న ఆదర్శవంతులు.
సీతమ్మగారి సీమ ప్రయాణం కథలో సీతమ్మగారి అమాయకత్వం, గడుసుదనం కలబోసి కనబడతాయి. సీతమ్మ పచ్చళ్ళు పెట్టడంలో చేతివాటం కలిగినది. ఇక్కడ ఆంధ్రుల ఆవకాయకు గల ప్రఖ్యాతి వెల్లడవుతుంది. ఈ పచ్చళ్ళలో మాత్రం చేయితిరిగినవాళ్ళు పెట్టినంత రుచి అందరికీ రాదు. సీతమ్మ ప్రయాణానికి రెండు వ్యాన్ల సామాను తయారుచేయడం ఆమెకు గల నిస్వార్థ ప్రేమ ఆప్యాయతలను తెలియజేస్తుంది. ఆమెను కలవడానికి వచ్చిన వాళ్లందరికీ కారప్పూస, టీ ఇవ్వడం అతిథి సత్కారాలను తెలియచేస్తుంది. సీతమ్మ గారు రెండు వ్యాన్ల సామానును చూస్తూ అంత పెద్ద విమానం ఈ మాత్రం బరువు మోయదా? ఏం అంతగా డబ్బుకు ఆశపడితే ఓ వంద రూపాయలు చేతిలో పెడితే పోలా! అనడంలో ఆమె అమాయకత్వం తెలియనితనం గడుసుతనం చక్కగా చిత్రించబడింది. ఆకాలం నుండీ వేళ్ళూనుకొనిపోయిన లంచగొండితనం కనబడుతుందిక్కడ. సీతమ్మ తమ్ముడు సర్దిచెప్పగానే ఊరుకున్న సీతమ్మ పసిపిల్ల మనస్తత్వం కలదిగా కనిపిస్తుంది. సీతమ్మ ఆకాశంలో ప్రయాణిస్తూ సముద్రంపై నడుస్తున్న విమానానికేమన్నా జరిగితే దిగడమెలా? అని అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్పే ఆనందరావు వ్యక్తిత్వం గొప్పది. ఆమెను పసిపిల్లలా లాలిస్తూ చక్కగా విడమరచి చెప్తాడు. అన్నీ మరచి ఆ వయసులో కూడా అరమరికలు లేని ప్రేమ ఆప్యాయతలతో కూడి ఉన్న ఆదర్శ దంపతులు వాళ్ళిద్దరూ అని అనిపిస్తుంది. హాయిగా భర్త భుజంపై వాలిపోతుంది సీతమ్మ. సీతలో చిలిపిగా ఉంటూనే తెల్లవాడిని పొగడడంలో మన తెలుగువారి నిజాయితీ కనిపిస్తుంది.
అధునాతన సమాజంలో మార్పు సహజమని, కాలంతో పాటు, పిల్లలతో పాటు పెద్దలు కూడా మారాలి, వారి పద్ధతులు అలవాట్లు మార్చుకోవాలి, దేశవిదేశాలలో ఉద్యోగ రీత్యా స్థిరపడ్డ పిల్లల వెంట పరుగులు పెట్టే తల్లిదండ్రుల కష్టాలు, ఆలోచనా విధానం, విదేశాలలో ఎదుర్కొనే సాధకబాధకాలను తలచుకుంటూ సాగే ఆలోచనలకు ప్రతిరూపమే ఈ కథ.
సంసార జీవితంలో చిరు కోపాలు తాపాలు ఉన్నా, అవి ఇద్దరూ సర్దుకు పోవాలని చందర్ మాధివిలు నిరూపిస్తారు. కోపంలో ఆలోచనా తీరు వేరుగా ఉంటుంది. తర్వాత నిదానంగా అలోచిస్తే ఆ సంఘటన వేరుగా తోస్తుంది. కాబట్టి ఏవిషయమైనా నిదానంగా ఆలోచించి నిర్ణయానికి రావాలి తప్ప కోపంగా ఉన్నప్పుడే తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. తొందరపాటువల్ల నష్టపోయేది మనమే అని ఈ కథవల్ల తెలుస్తుంది. ఈ కథ చదువుతుంటె వేమన పద్యం గుర్తుకు వస్తుంది. వినదగునెవ్వరు చెప్పిన అనే పద్యం లాగా మాధవీ చందర్ ఇద్దరూ వారివారి ఆలోచనలు తప్పు అని తెలుసుకొని ఒకటౌతారు. నిజంగా కూడా ప్రేమ, పెళ్ళి, అనేవి గొప్పవరాలు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోతే ఆ సంసారం నరకం. చిన్నచిన్న పొరపాట్లు వచ్చినా ఎవరో ఒకరు సర్దుకొని ఓపికగా వాటిని సవరించుకొని కలిసి సాగితేనే కాపురం. ఈ కథ కమ్మగా సాగిన మల్లె తీగలాగే ఉంది. మంచి సువాసనలనూ వెదజల్లింది.
యశోదారెడ్డి గారికి తెలంగాణ భాష తప్ప వేరొకటి రాదా అని పాఠకులు, తోటి రచయితలు అనుమానం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఆమె తెలంగాణ భాషలోని స్వచ్ఛమైన తెలుగు తియ్యదనాన్ని కాపాడాలని, దాని ఉనికిని నిలబెట్టాలని ఈ కథలు రాసినానని చెపుతూ, ధర్మశాల కథలలోని భాషను కొంత మార్చి పత్రికా భాషలో రాయడానికి సంసిద్ధమైందని అర్థం చేసుకోవచ్చు. ఇలా కాలానుగుణంగా యశోదారెడ్డి మారడంలో ఒక సామాజిక విషాదం కూడా దాగి వుంది. తెలంగాణ భాషకు, సంస్కృతికి, జీవితాలకు సరియైన స్థానం లేకపోగా వాటిని లోకువగా చూస్తూ భాష రాదని, అది వెనకబాటు తనమని కించరపచడాన్ని భరించలేక ప్రచార, ప్రసార సాధనాలు, పాఠ్యపుస్తకాలు ఆంధ్రప్రాంత ఆధిపత్యవాదం వేసిన ప్రభావాల వల్ల ఆంధ్రపాలక వర్గాల భాషను కూడా సొంతం చేసుకొని రాసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన పరిణామ క్రమంలోకి తెలంగాణ ప్రజలు మారిన క్రమానికి యశోదారెడ్డి ధర్మశాల కథల సంపుటి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. తెలంగాణ మధ్యతరగతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి ధర్మశాల కథల సంపుటి ఎంతగానో ఉపకరిస్తుంది.
ధర్మశాల కథలలో సంస్కృతి-సంప్రదాయాలు :
గుళ్ళో గంటలు కథలో గ్రామీణ వాతావరణాన్ని చెట్టు పుట్టలను, కొండ కోనలను చక్కగా వర్ణించడం జరిగింది. అక్కడ దొరకే గడ్డి, ఆకు, అలము, పువ్వు, పండు, అన్నీ అక్కడి ప్రజలకు జీవనాధారంగా కనబడుతుంది. పల్లెటూళ్ళలోని ప్రేమానురాగాలు, ఆత్మీయత అనుబంధాలు చక్కగా కనబడుతాయి. ఆ ఊరికి కొత్తగా వచ్చిన రఘును ఏ చుట్టరికం లేకపోయినా, ఆప్యాయంగా ఆదరించి తమ కుటుంబంలో ఒకనిగా చూసుకుంటారందరూ. పల్లెటూళ్ళలో దొరికే వనమూలికలతో చేసే వైద్యం, ఆంజనేయ స్వామి గుళ్ళో చేసే పూజా కార్యక్రమాలు, స్వామికి జరిగే వేడుకలూ, సంబరాలు, కార్తీకం కట్టడం మొదలగు సంప్రదాయాలు, పల్లెటూళ్ళలోని భక్తి భావం ఈ కథలో చక్కగా చిత్రించడం జరిగింది.
గరికెపాటి చంద్రశేఖర్ గారు ఆచార సంప్రదాయాల గురించి ”మానవుని జననం మొదలుకొని మరణం వరకు జరిపే సంస్కారాలని తంతులు లేక అచారాలు అంటారు. ఆచారం అంటే సంఘ పురోభివృద్ధికి తోడ్పటుతూ తరతరాలకు సంక్రమించే ఆచారమని చెప్పవచ్చు. సంప్రదాయ పద్ధతి అంటే గతంలో రూపకల్పన జరిగిన దానిని అనుసరిస్తూ వస్తున్న విధానం. వంశపారంపర్యంగా లభించిన జ్ఞానం లేదా పూర్వకాలం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్టమైన ఒక అలవాటే సంప్రదాయం.” అని అన్నారు.
”ఆనాడు ఆ వూరంతా కోలాహంగా ఉంది. ఆ వూరి పొలిమేర దేవత మల్లమ్మ బోనాలు జరుపుకుంటున్న సంబరపు వేళ. బోనాలు బొడ్రాయి దగ్గర నుండి ప్రారంభమవుతాయి. శోభయాత్రవెంట గండదీపం మోస్తున్న బాలామణికి శివం ఎత్తింది. ఆ వూపు ఘాటైన గుగ్గిలం పొగతోగాని శాంతించలేదు. వూరేగింపు వెంబడి పప్పు, ఫలహారం, కొబ్బరి ముక్కల గంపలతో కొందరు స్త్రీలు నడుస్తున్నారు. పిల్లలూ, పెద్దలూ అంతా గుంపులు కట్టిసాగుతున్నారు,” గుళ్ళో గంటలు కథలో ఈ సంస్కృతి గమనించవచ్చు.
ఇంకా ఈ కథలో గ్రామాలలో ఉండే సఖ్యత, కొత్తగా వచ్చిన వారి పట్ల ఉండే గౌరవం, ఆదరణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు జానకీరామయ్య పాత్ర ద్వారా కన్పిస్తాయి. గ్రామాలలో ఉండే పల్లీయులకు విశాలభావాలు ఈ కథలో కన్పిస్తాయి. కలుపుగోలుతనం, ఉదారత్వం అనేవి కనీస మానవ లక్షణాలు అవి అందరికుండాలి అనే భావం కూడా ఈ కథలోని పాత్రల ద్వారా తెలుస్తుంది. సంఘంలో జరిగే సంబరాలు పూజలు వేడుకలు సంప్రదాయాలు చక్కగా వివరించారు.
సంకుదేముడు కథలో నిర్మలమైన భక్తి ఒకటే ముఖ్యం, మడి ఆచారాలు కాదు అని తాయారమ్మనే నమ్మించింది సుక్రి. ఇందులో కొండ జాతి, కోయ జాతి ప్రజల ఆచార సంప్రదాయాలు చక్కగా వివరించబడ్డాయి. జాతరలు, వాళ్ళ అలంకరణ, నగలు ‘థింసా’ నృత్యం, పెళ్ళికి జరిపించే తంతు, శోభనం ఏర్పాటు చేసే పద్ధతి, ‘వోలి’ (కన్యాశుల్కం లాంటిది) చెల్లించడం, మగనాళి సుంకం అంటే మారుమనుము పోయే ఆడపిల్ల మొదటి భర్త పంచాయితీ తెస్తే కుల పెద్దలు అతనికి నిర్ణయించి చెల్లించే రొక్కంను మగనాళి సుంకం అంటారు. ఆసుంకాన్ని ఇందులో చిత్రడు సుక్రి కోసం పండన్నకు చెల్లిస్తాడు. గూడెంలో చైత్రమాసంలో ‘భోనం’ భువనం పండుగ, విత్తనాలు చల్లడం, బలులు మొదలగు కొండ జాతి ప్రజల ఆచార వ్యవహారాలు చక్కగా మన కళ్ళముందు కదులుతాయి.
ఈ కథ ద్వారా రచయిత్రి కులం, మతం, సంప్రదాయం అనే కట్టుబాట్లతో సంకుచిత భావాలు విడనాడి అందరూ కలిసి ప్రజోపయోగమైన పనులు చేస్తూ నలుగురికీ సాయపడాలని సూచిస్తారు. ఇందులో బ్రాహ్మణ కుల సంప్రదాయాలు, కట్టుబాట్లు, పూజ, భోజనాదులు చక్కగా వివరించారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
డా. అడువాల సుజాత గారి గురించి….
తెలియజేసినందుకు ధన్యవాదాలు…..
యశొదారెడ్డి గారి విధ్యార్ధిని నేను.ఆమె దగ్గర తెలంగాణా పదాలెన్నో తెలుసుకున్నాను…క్లాసులో పాఠం చెప్పేటప్పుడు మాతో చాలా సరదాగా ఉండేవారు.ఆమె కధా సంకలనాల కోసం అన్వేషిస్తుండగా ఈ వ్యాసం రావడం నాకు చాలా ఉపయోగపడింది.సుజాత గారు నాకు భూమిక ద్వారా ఈ సంకలనాలు ఇవ్వ గలిగితే పువ్వుల్లో పెట్తి వెనక్కిస్తానని అతిశయోక్తులు చెప్పను గానీ చిరగకుండా నల్గకుండా తప్పకుండా తిరిగి కురియర్లో పంపుతానని “సత్య” పెమాణికంగా చెబుతున్నాను
సత్యవతి
ఆచార్య యశోద గారి గురించి…. తెలియజేసినందుకు
ధన్యవాదాలు..
ఎడిటర్ గారికి,
పిల్లలతో సరదాగా ఉంటూ.. పాఠాలు చెప్పడం ఒక గొప్ప కళ….
ఆచార్య యశోద గారి.. బోధనా పద్ధతులపై…
మీరు…. ఒక వ్యాసం రాస్తే…. అది గురువులకు, తల్లిదంద్రులకు…
ఎంతగానో ఉపయోగపడుతుంది…