సత్యా,
నీతో మూడు రోజులు కలిసి గడపాలని నేను బయలు దేరితే, ఎంతో మంది స్నేహితులైనారు, హల్లోలతో, చిరునవ్వుల్తో, గులాబీల స్వాగతంతో, మొగిలిపూవు సువాసనలతో, పూతరేకుల తీయదనంతో మొదలైన తియ్యతియ్యటి మాటలు పాటలై ఆ పాటలు ఆటలై విరామం ఎరుగని రైలు ప్రయాణంలా సాగిపోయి నర్సాపూర్ వచ్చేసింది. రైలు దిగకుండానే పార్రంభమయిన మర్యాదల పర్వం మళ్ళీ రైలు ఎక్కిందాక కొనసాగింది. అదీ మొక్కుబడిగా ఇచ్చే మర్యాద కాక ఆత్మీయతతో కూడినది కావడం విశేషం. వై.ఎన్ కాలేజి ఆతిథ్యం, సత్య చదివిన కాలేజి వారి ఆదరణ, సీతారామపురంలోని స్వేచ్ఛతో కూడిన బాల్యస్మ్పుతుల నెమరివేత, లేసుపార్కులోని నర్సాపూర్ అల్లికల అందాలు, వాటిని సొంతం చేసుకోవాలనే ఆరాటాలు, అందుకు అదిలించే కాలం విలువ తెలిసిన బాధ్యతలు, సాహితీ స్త్రీమూర్తుల సదస్సులు, సెమినార్లు వీటన్నింటితో కలబోసే కబుర్లు, స్నేహాలు, పరిహాసాలతో రైలు, బస్సు, పంట్, లాంచిలలో ప్రయాణం నల్లేరుమీద నడకలా సాగుతూ మధురస్మ్పుతులను మిగిల్చింది. అసలు వర్షపు జల్లు పడ్తుందా లేక నవ్వులే కేరింతలయ్యాయో తెలీని స్థితిలో సముద్రపు అలలతో జతచేసిన స్నేహహస్తాలతో సాగిన నీటి ఆటలు ఎంతసేపయినా తనివితీరలేదు. వెంటనే మళ్ళీ గోదాట్లో దిగుదామా? అనే ప్రశ్నలు పంట్నెక్కించాయి. చిరుచిరు ముచ్చట్లతో చిన్నగా సాగిన నర్సాపూర్ పాదయాత్రలో నిమ్మకాయ గోలీ సోడాను గోలీ పడకుండా తాగి, మిఠాయిల దుకాణంపై ఆర్డర్ల దండయాత్ర చేసి అలసి పెళ్ళింట్లోలా పడకలు వేసి ముసుగుల్లో ముచ్చట్ల సరాగాలు ఆలపించడం ఓ హాయైన అనుభవం. ఇక పచ్చటి పాపికొండల మధ్య గోదావరిలో సాగిన పడవ ప్రయాణంలో అనుభవించిన ఉద్విగ్నత, ఆనందం, బాధ కలబోసిన అనుభూతులు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దానిపై దాడిచేస్తున్న పథకాలపై చర్చలు, తీర్మానాలు, కెమెరాల్లో బంధించి ఎక్కడైనా ఎప్పుడైనా చూసుకోవాలని, మరెందరికో ఆ అందాల్ని ఆస్వాదించేలా చేయాలనే తపనలు ఎన్నో ఎన్నెన్నో. అంతటి విశాల గోదారి ఒద్దికగా రెండు కొండలమధ్య ఒదిగిన తీరు తన ప్రయాణాన్ని ఎలాగయినా సాగించాలనే పట్టుదలగా కనిపిస్తూ చూడటానికి ఒళ్ళంత కళ్ళైతే బాగుండనిపించింది. ఇక నిశ్శబ్ద దేవాలయం, అందుకు గుర్తుగా వెదురు పువ్వుల వెలుగులతో తిరుగు ప్రయాణం. కాసేపటికే ప్రకాశవంతమైన ఎండ వెలుతురులో తళతళ లాడే గోదావరి, ఎన్నో సుడిగుండాలను తనలో ఇముడ్చుకొని పైకి నిమ్మళంగా వుండి మలుపులు తిరుగుతున్నపుడు ఒంపుసొంపులను మళ్ళీ మళ్ళీ చూడాలనే కోరికతో అలరించింది. ఇక రాజమండ్రిలోని స్నేహితుని ఆతిథ్యం అక్కడి సంస్కృతిని కళ్ళముందుంచింది. ఎన్నెన్నో మధురానుభూతుల్ని జీవితమంతా దాచుకునేలా చేసిన పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి ప్రయాణం ఓ మరుపురాని మధుర స్మ్పుతి. నీతో కలిసి ఈ అనుభూతిని పొందడం ఇంకా బావుంది.
-గీత, చెన్నరావుపేట