హాయ్ సత్యా!
ఎలా ఉన్నారు? పాపికొండల యాత్ర అలసటనుంచి(?) తేరుకుని భూమిక పనుల్లో పడిపోయారా? మీనుంచి వుత్తరం రాకముందే నేను రాయాలనుకున్నాను. కానీ రాగానే బ్యాంకు పనిలో పడిపోయా. దాంతో కుదర్లే.
పాపికొండల నడుమ పడవలో ప్రయాణించడమే అద్భుతం. అందులోనూ మబ్బులు, చిరుజల్లుల మధ్య మరీన్నూ. దీన్ని రచయిత్రులతో కలిసి అనుభూతి చెందడం మరీ మరీ బావుంది. ఇదంతా కుదిరేట్లు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ( ఇది మరీ చిన్న / సాధారణ పదమేమో!) ఉమ, నేను, కొంతమందిమి చాన్నాళ్ళనుంచీ పాపికొండల యాత్ర అనుకుంటుండినాము కానీ అది వాయిదా పడ్తూనే వుంది. ఇలా మీవల్ల నాకు మాత్రం కుదిరింది.
విహారయాత్రను కూడా మనందరం ఒక వేదిక ఏర్పాటుకు ఉపయోగించుకోవడం సంతోషం. రచయితుల్ర వేదిక గురించి మరింత చర్చ జరగటం అవసరమని నేను అనుకుంటున్నాను. హడావుడిగా, మొక్కుబడిగా కాదు కదా మనం అనుకుంటున్నది. రచయితుల్ర వేదికకు భూమిక చొరవ చేయటం చాలా బావుంది. అయితే పేరు భూమిక రచయితుల్ర వేదిక అని పెట్టడం దాని ప్రయోజనాలను పరిమితం చేస్తుందేమో ఆలోచించండి.
నేను ఆరోజు సమావేశంలో ఈ విషయం మీద మాట్లాడాను. స్పష్టంగానే తెలియజేసాననుకుంటాను. ఉత్తరం ద్వారా మరింత చెప్పొచ్చు కాబట్టి మళ్ళీ రాస్తున్నా. భూమిక చేయూత ( ఆఫీసులో సమావేశాలు ఏర్పాటు చేసుకోడానికి స్థలం యివ్వటం ఈ స్టేషనరీ సాయం చేయడం లాంటివైనా) తో వేదిక ఏర్పడుతున్నప్పటికీ పేరులో భూమిక వుండడం వలన అది కొద్దిమందికి పరిమితం అవుతుంది. అవుట్ ఆఫ్ భూమిక కూడా ఆందేశంలో మహిళా రచయితలున్నారు కదా. వాళ్ళు ఫెమినిస్ట్ ఓరియంటేషన్ లేదా మార్క్సిస్ట్ అవుట్లుక్ తో రాసేవాళ్ళు కూడా కావచ్చు. ఇతర పతిక్రలలో ( ఉదాః మహిళామార్గం, మాతృక, స్త్రీ విముక్తి) మహిళల సమస్యలగురించి రాసే రచయితుల్రున్నారు కదా! ఇది మీరు ఆలోచించారా? అందరం కలిస్తే రచయితుల్ర వేదిక మరింత బలోపేతం అవుతుందని నా అభిపాయ్రం.
వేదికకు ఒక ధృక్పథం వుంటుంది కదా! దాన్ని డ్రాఫ్ట్ ఫామ్లో చర్చకు పెట్టి మళ్ళీ ఒకసారి అందరం కలిసి నిర్ణయించుకుంటే మంచిదేమో ఒకసారి ఆలోచించండి. హైదరాబాదులో అయినా దీనికి సంబంధించి సమావేశం వుంటే తెలియచేయండి. రావడానికి ప్రయత్నిస్తాను.
నర్సాపూర్లో కాలేజీలకెళ్ళినపుడు నిజంగా నేను చదివిన స్కూలు, కాలేజీలు చాలా గుర్తుకొచ్చాయి. మళ్ళీ వెంటనే వెళ్ళాలనిపించింది. మీ అందర్నీ మావూరు తీసుకెళ్ళాలనిపించింది. ఈసారి మావూరు కాకపోయినా తిరుపతిలో అందరం కలుద్దాం. పాపికొండల యాత్రలో పడవమీద వెళ్తూ పోలవరం పాజ్రెక్టు గురించి చంద్రలత దగ్గర తెలుసుకోవడం బోల్డు నచ్చేసింది. కానీ తను చెప్పాల్సిందీ, మనం తెల్సుకోవాల్సిందీ, పంచుకోవాల్సిందీ యింకా వుంది కదూ? దీనికోసం యికొంచెం టైం కేటాయించుకోగలిగివుంటే బావుండేది.
శారదా శీన్రివాసన్గారి గొంతు రేడియోలో కాకుండా ప్రత్యక్షంగా వినడం నిజంగా అద్భుతం. ఆవిడ అంత బాగా పాడుతూ కూడా నాకు పెద్దగా పాడ్డం రాదు అంటుంటే కొంచెమే పాడ్డం వచ్చిన నాకు చాలా సిగ్గేసింది. జూపాస్టా, ఈడిపస్ నాటకం గురించి ఆవిడ చెప్తుంటే అప్పట్లో నాటకం వినలేకపోవటం దురదృష్టమే అనిపించింది.
బోల్డుమందిని పరిచయం చేశారు. పాతవాళ్ళతో సాన్నిహిత్యం పెరిగింది ఈ యాత్రలో.
-విష్ణుప్రియ, తిరుపతి