డియర్ సత్యా!
పేరుపాలెం నుంచి పేరంటపల్లి వరకు మనం అందరం కలిసి చేసిన సాహితీ ప్రయాణం ఒక గొప్ప అనుభవం. మంచి జ్ఞాపకం.
తోటకూర గారెలు, పూతరేకులు, మొగలిపూలు, అల్లికల సొగసులు, కొబ్బరాకు బూరలు, పిచ్చుకల గూళ్ళు, వరిపొలాలు, సోడాబుడ్లు… ఇలా…ఇలా… ఒకటా రెండా… హాయి హాయిగా… మా పసితనం పచ్చబడింది- ఒక్కసారిగా… గోదావరమ్మ ఒడిలో.
అంతర్వేది, అన్నాచెల్లెళ్ళ గట్టు నడుమ నయగారంగా అస్తమించిన సూరీడు నా కళ్ళల్లోనే కాదు మనసులోనే ముది్రంచుకుపోయాడు.
చల్లగాలులతో సరితూగుతూ అల్లన మెల్లన విచ్చిన శారదా శీన్రివాసన్ గారి మధుర గళసీమలో జాలువారిన ‘‘ శ్యామసుందరా…’’, ‘‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’’ ల లయవిన్యాసాలు కలకాలం నాకు కమ్మని జ్ఞాపకాలు.
నిలువెల్లా సుళ్ళు తిరుగుతున్నా ధీర గంభీరయై నిండారా పారుతున్న గోదావరమ్మపై నిశ్శబ్దంగా సాగుతుండగా… నా ఊహ నాకే సాదృశ్యమైనది. నా కల్పనలో నేనే ఒక అంతర్భాగమైపోయాను ఎప్పుడో నాకు తెలియకుండానే.
‘‘ ఇక్కడే ఒకప్పుడు పిల్లలు ఆడుకున్నారు. పిల్లల మారాం… తల్లుల గారాం…. కలగలసిన నవ్వులు ఇక్కడే వినిపిస్తూ వుండేవి. పెళ్ళిళ్ళు పేరంటాలు… పండుగలు పబ్బాలు… మంగళ వాయిద్యాలై ఇక్కడే ప్రతిధ్వనించేవి. పంటలు వంటలు.. సంతలు సంబరాలు… శోభాయమానంగా ఇక్కడే జరుగుతుండేవి.
ఇక్కడే… సరిగ్గా ఇక్కడే… మనుషులు జీవించేవారు.’’ ఈ కొన్ని వాక్యాలు ‘‘దృశ్యాదృశ్య’’ లో రాసినప్పటి ఉద్వేగం నన్ను మళ్ళీ కమ్మివేసింది. గొంతు పట్టేసింది. వాన చినుకులు, లాంచీ కుదుపులు, గోదావరి వడి, పదాల తడి… ఎంతటి ఆభరితమో… చాలా సేపటివరకూ… ఆ గాఢానుభూతి నన్ను ఆక్రమించేసింది.
నా ఉద్వేగాన్ని తమదిగా పంచుకున్న సాహితీ మితుల్రకు.. మీకు.. ధన్యవాదాలు. తన సృజనలో తానే జీవించగలిగే సందర్భం ఏ రచయితకైనా సంభ్రమమే కదా… అది మీరు నాకు ఇచ్చారు. ఒక జీవితకాల జ్ఞాపకం.. చాలా సంతోషం.
మమ్మల్ని తమ ఇంటి ఆడపడుచుల్లా ఆహ్వానించి, ఆదరించిన వై.ఎన్ మరియు బిజిబిఎస్ కళాశాలల అధ్యాపక,విద్యార్థి బృందాలకు, యాజమాన్యాలకు – కమ్మని భోజనంతో పాటు చీరెసారెలతో అద్దేపల్లి శీధ్రర్గారు ఇచ్చిన ఆత్మీయ ఆతిధ్యానికి – అనేక వందనాలు.
ఇవన్నీ ఒక ఎత్తయితే మరొక ఎత్తు- కొండవీటి సత్యవతిగారి ఇంటి గడపపై విరిసిన పూలు – సీతారామపురం చైతన్య కరదీపికలై నిలిచిన వికసిత స్త్రీలు – ముచ్చటగా పలకరించిన ముసిముసి నవ్వుల ముద్దుపిల్లలు – మీతో మాకేం పనంటూ ఒక్క ఉదటున ఎగిరి వెళ్ళిన గువ్వల గుంపులు-
ఏనాటికైనా ఎలా మరిచిపోగలను?
ఆటపాటల నడుమ జరిగిన చర్చలు, సంభాషణలు, ప్రతిపాదనలు, తీర్మానాలు ఒక కొత్త సాహితీ భవిష్యత్తును వాతావరణాన్ని ఆవిష్కరించుకునేందుకు పార్రంభం పలికాయి.
ఇలా గోదావరి తీరాన గడిపిన కొద్ది సమయంలో నాకు అనిపించింది – అచ్చం అలనాడు శీప్రాద గారికి లాగానే. కృష్ణా తుంగభద్రల నడిగడ్డలో పుట్టి – పెన్న వడ్డున మెట్టి – కురవల కోట గోకుంటల గట్టున సృజనాత్మకతను శోధిస్తున్న నేను – గౌతమిపై పయనించి, పాపికొండలను ముద్దాడి – శబరిని పలకరించి- ఈ గోదావరి తీరాన- ఇన్ని నదీ నదాల నాగరికత, సంస్కృతీ స్వభావం, సంస్కరణ వారసత్వం నిండారా నాలో నింపుకుని – నేనొక అసలు సిసలు తెలుగు వ్యక్తిగా మూర్తిమత్వం పొందానని!
ఇదెంత సంతోషం!
ఇక, రైతుబిడ్డనయిన నాకు… కనుచూపు మేరా విస్తరించిన పచ్చని పొలాల అంచున తలెత్తి ఆప్యాయంగా పలకరించిన కొబ్బరి తోపుల దాకా వెళ్ళిన నా దృష్టిని- మా బాటకు ఇరువైపులా తూటుకాడలతో, గుఱ్ఱపుడెక్కలతో, తుంగపూలతో నిండిన మురుగు కాలువలు దాటిపోలేదు.
వరికి పాణ్రం నీరంటారు. ఆ నీరే వరిని ఉక్కిరిబిక్కిరి చేయగలదు. నీటికత్తికి రెండు వైపులా పదునే కదా.
గోదావరి ఒక్క అడుగు పెరిగితే- ఇంతటి సుందర దృశ్యమూ నీట మునుగుతుందేమోనన్న నాలోలోని అనుమానం- నిజం కావడానికి రెణ్ణాళ్ళయినా పట్టలేదు.
లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. వరద నీరు పంటపొలాల మీదుగా సాగిపోవడానికి మురుగుకాలువలు మార్గం కాలేకపోవడం ఓ ముఖ్య కారణం కాదూ? అయ్యో! కొంత ముందు చూపు వుండి వుంటే- నోటి దగ్గరి కూడు నీటి పాలవకుండా కాపాడగలిగి వుండేవారు కదా.. అనిపించింది. దీర్ఘకాలిక ప్రణాళికలు ఎక్కడకు పోయాయో… తెలిసి తెలిసీ ప్రతి ఏటా లక్షలాది ఎకరాల పంట… దానిపై ఆధారపడిన అనేకానేకులు… ప్చ్… ఆ దుఃఖం నన్ను కలిచివేసింది.
ఇంతటి మనోహర దృశ్యమూ, ప్రకృతి సంపదా, పచ్చని సంస్కృతీ, జీవన చిత్రం… త్వరలో గొప్ప సందిగ్దావస్థలో పడబోతోందన్న వాస్తవం – గుండెను పట్టేసింది.
తెలియని ఆవేదనతో తిరుగు ప్రయాణం.
‘‘మీరజాలగలమా మీ యానతి వత్ర విధాన మహిమన్ సత్యావతీ….’’ అనుకుంటూ ప్రయాణం ప్రారంభించినా- సమయపాలన పట్టించుకోకుండా అల్లరి పనులు చేశామంటే- తప్పు మాది కాదు…
మమ్మల్ని పిల్లల్ని చేసిన గోదావరమ్మ గారాబానిది! పాపికొండల ఇంద్రజాలానిది!
కాదనగలరా ఎవరైనా?
అయినా, ఒక్కమారైనా చెవి నులిమించుకోనిదే, ఒక్క మొట్టికాయైనా తిననిదే మేం పిల్లలం ఎలా అవుతాం?
బోలెడంత స్నేహంతో-
-చంద్రలత, నెల్లూరు