హలో! ప్రియసఖీ ఎలా వున్నావు? చాలా రోజుల తర్వాత ఉత్తరం రాస్తున్నాను. ఈమధ్య మహిళా జర్నలిస్టులు, రచయితుల్రు కలిసి ఓ స్నేహయా చేశాం, ఆ హృదయోల్లాసం ఈలేఖ. “A day has twenty four hours… you deserve some happy hours of indulging and pampering”. Happy hour services… steal moments out of your busy schedule to pamper your self with NEW HAPPY HOUR SERVICES.
ఈ పదాలన్నీ ఏవో ప్రకటనలోలా అనిపిస్తున్నాయి కదూ! కావచ్చు. ప్రకటీకృతమైన మహిళల ప్రత్యేక వ్యక్తిత్వాలు, నిబిడీకృతమైన మనోభావాలు, ఉరుకుల పరుగుల కుటుంబ బంధనాలు, ఊపిరి సలపనివ్వని యాంతిక్ర జీవనగతుల నిత్య సంఘర్షణతో మనసు కాసేపు మురిపెంగా నవ్వుకోవాలనుకుంటుంది. సరదాగా స్నేహబాటలో ఆనందంగా గంతులు వేయాలని, కంఠంలో కట్టిపడేసిన కోయిలలకి గొంతునిచ్చి పెదవి విప్పి ‘ లాలలీ లాలలీ లాలల్లల్లాలలీ…’ అని పాడుకోవాలని, ఇష్టమైనట్లు ముస్తాబై అద్దంలోంచి ‘హాయ్’ అని పలకరిస్తూ సుందరంగా హొయలుపోయే పూలతోను గారంగా గౌరవిస్తూ షికార్లు తిప్పాలనుంటుంది. సరే, ఎంతసేపూ మనల్ని మనమేనా? మనల్ని ఎవరైనా గారం చేసి, కాలాన్ని మరిపిస్తూ! ఓ చెలీ, సఖీ అని పలకరిస్తూ సంతోషాన్ని పలవరింపజేసేలా చేసేవారుంటే ‘నీ బాటలోని అడుగులు నావి, నా పాటలోని మాటలు నీవి’ అని చేయి కలిపి చేలవెంట పరుగులిడాలనిపించదూ! అదిగో అచ్చంగా అలాంటి స్నేహ హస్తమే భూమిక, ఆ నెచ్చెలే కొండంత స్నేహాన్ని నిక్షిప్తం చేసిన ఆ వాటిక నిర్మాత మా ‘కొండవీటి’ సత్యవతి, అందుకే రోజుకి 24 గంటలుంటాయని, బిజీ షెడ్యూళ్ళు, సవాళ్ళు వుంటాయన్న సంగతే గుర్తుకురానంతగా మొదట్లో ప్రస్తావించిన ఇంగ్లీష్ అక్షరాలకు పాణ్రం పోసి ‘‘మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, పచ్చనీ పచ్చికపై మేనువాల్చాలి, పైరగాలి వచ్చి నన్ను పలకరించాలి’’ అన్న పాలగుమ్మి గారి పాట పల్లవిలా స్నేహయాత్ర నెరిపింది.
ఉభయ గోదావరుల యాసలు, ఊసులు – పరవశింపచేసే పాపికొండల అద్భుతాలు, ప్రకృతి సౌందర్యాలు, చిన్ననాటి స్నేహాలు, ఆత్మీయతలు వీడని కుటుంబ సంబంధాలు, వ్యక్తిత్వాలకి విలువనిచ్చి వెన్నుదన్నుగా నిలబడే సమకాలీన సామాజిక చైతన్య స్పూర్తులు, చవులూరించే వంటకాలు, అతిధి మర్యాదలు, అపురూప హస్తకళల గొప్పతనాలు, అంత్యాక్షరులు, హాస్యలహరులు, ప్రియమారా పలకరించి, తనివారా తడిపి ముద్దచేసిన వర్షాలు, చిలిపితనాలు, ఆర్ధ్రతతో ఉప్పొంగి ఆనందభాష్పాలు చిప్పితే అపూర్వానుభూతులు… ఓహ్! ‘ హృదయమా! ఓ బేల హృదయమా! ఒకేసారి నీకింత సంతోషమా…!’ అని ఇంకా ఇంకా పాడుకుంటూనే ఉన్నాను.
అవన్నీ ఇంతకుముందు తెలిసినవే, నేను చూసినవే, అయినా ఇంతమంది (29) స్నేహశీలురమధ్య గడిపిన ఈ గంటలు, నిముషాలు, క్షణాలు ఒకనాటి మధురానుభూతుల్ని జ్ఞాపకంచేస్తూ అనిర్వచనీయమైన స్నేహానందానుభూతిని అందించి మిగిల్చిన మహత్తర యాత్ర అది.
అది కొందరికి కలవరం, కొందరికి పలవరం, కొందరికి ‘కల’ వరం. ఎవరికేమైనా అందరికీ మనసానందనాట్యాలు చేసిన మైత్రీ వేదిక… సరాగాల సంపంగిమాలిక, ఎన్నెన్నో నిత్యనూతన శైలీ సంప్రదాయాల, అనుభవాల భూమిక.
కంప్యూటర్ మూషికం వచ్చి తోకలేని పిట్టల్ని ఎగరకొట్టడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్న హైటెక్ నేపథ్యంలో, మూషిక ప్రయత్నాన్ని విఫలం చేస్తూ నా ‘స్నేహనికుంజ్’ ముంగిట్లో తోకలేని పిట్టలు సేదతీరేలా ‘‘ఉత్తరాలతోట’’ని పెంచుతున్నాను. రంగురంగుల, రకరకాల పిట్టల్ని స్వాగతిస్తున్నాను.
నీ చేతుల్లోంచి ఎగిరొచ్చే పిట్టలకోసం ఎదురుచూస్తూ… వుండాలని లేదుగానీ, తప్పదుగా… శలవామరి!
-కె.బి. లక్ష్మి, హైదరాబాద్