ఎల్లి నవల-ఎరుకల జీవిత చితణ్ర

యు.ఝాన్సి

అరుణ రాసిన ‘ఎల్లి’ నవల ప్రధానంగా ఎరుకల జీవితానికి సంబంధించింది. ఎరుకల జీవన విధానం, వారి ఆచార వ్యవహారాలు, ట్టుబాట్లు, విశ్వాసాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎరుకల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక జీవిత చిత్రణే ‘ఎల్లి’ నవలఈ నవల రెండు భాగాలుగా వెలువడింది. మొదటిభాగం 1992లో, రెండవ భాగం 1996లో వెలువడింది.
ప్రధాన పాత్రలు :
ఎల్లి, ఎంకన్న-దురగ (ఎల్లి తల్లిదండ్రులు), పారోతి-బిచ్చాలు (ఎల్లి పిన్ని-చిన్నాన), మాలచ్చిమి (ఎల్లి నాయనమ్మ), నీలి, దువ్వ, జీవాలు, కత్రేణి, నెలబాలుడు మొదలైనవారు.
ఎల్లి నవల-వస్తువు :
ఎల్లి నవలలో వస్తువు కృష్ణా జిల్లాలో వన్నేటొడ్డున పందులు మేపుకుని బ్రతికే ఎరుకల కుటుంబాల గాథ. వారు ఆధునిక సమాజంలో ఉంటూ కూడా ఇంకా ‘ఆహార సేకరణే’ వారి జీవిత పరమావధిగా బ్రతకడం, వారి వెనుకబాటుతనం మొదలైన విషయాలు పాఠకుడిని ఆలోచింపజేస్తాయి.
ప్రధాన కథ :
ఈ నవలలో ‘ఎల్లి’ ప్రధాన పాత్ర. ఎల్లి ఎంకన్న దురగల కూతురు. ఆటపాటల్లో సాగిపోతున్న ఎల్లి బాల్యానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి 12 సంవత్సరంలోనే తండ్రి ఆమెకు పెళ్ళి చేస్తాడు. పెళ్ళినాటికి ఎల్లి ఇంకా ఈడేరనందువల్ల రెండు సంవత్సరాలు పుట్టింట్లో ఉంచి, తరువాత అత్తారింటికి పంపుతారు.
పుట్టింట్లో నుండి అత్తింట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి ఎల్లికి కష్టాలు ప్రారంభమవుతాయి. ఎల్లి భర్త ‘తిమ్మయ్య’. ఆయన తిరుగుబోతు, త్రాగుబోతు. అత్త మామలు పిసినారులు. ప్రతి చిన్న విషయం కూడా కొడుకుతో చెప్పి, ఎల్లిని కొట్టించేవారు.
ఒకరోజు ఎల్లి చెట్టుమీది చిగురు కోస్తుండగా, ఎల్లి చిన్ననాటి స్నేహితుడైన ‘దువ్వ’ అటువైపు వచ్చి ఎల్లి కష్టసుఖాలు తెలుసుకొని చాలా బాధపడతాడు. కొన్ని సమయాల్లో దువ్వ, జీవాలు ఇచ్చే ధైర్యం, పంచే ప్రేమతో ఎల్లి తన కష్టం మరిచిపోయేది.
ఒకసారి ఎల్లి తిమ్మయ్యతో కలిసి చేపలు పట్టడంలో సహాయం చెయ్యడానికి వెళ్తుంది. తిమ్మయ్య పట్టిన చేపను కాలువలోకి జారవిడిచిందని ఉగ్రుడై ఎల్లిని చావబాదుతుంటాడు. ఆ సమయంలో జీవాలు అక్కడికి వచ్చి ఎల్లిని భర్త చేతిలో నుండి విడిపించి, ఇంటికి తీసుకువెళ్తాడు. పుట్టింటికి వచ్చిన ఎల్లి, తిరిగి అత్తింటికి వెళ్ళడానికి ఇష్టపడదు. మరసటి ఉదయం ఎల్లి మామ వచ్చి ఎల్లి చెప్పకుండా వచ్చేసిందని చెప్పి చెయ్యరాని తప్పు చేసినట్లు మాట్లాడతాడు. వారి మధ్య మాట మాట పెరిగి చివరికి ‘పంచాయితీ’కి దారి తీస్తుంది.
ఎల్లి చేసిన తప్పుకి బూసియ్య తన వోలి తనకు కట్టమని, తిరిగి తన కొడుక్కి పెళ్ళి చేస్తానని మొండిపట్టు పడతాడు. ఎన్ని పంచాయితీలు జరిగినా, గొడవ ఒక కొలిక్కి రాదు. ఈ పంచాయితీల వల్ల ఇరుపక్షాల వారు ఆర్థికంగా బాగా దెబ్బతింటారు. ఎల్లి మామ (బూసియ్య) ఇక చేసేదిలేక తన వోలిలో సగం కట్టమని, లేదా ఎల్లిని తిరిగి పంపించమని అడుగుతాడు. వోలి తిరిగి చెల్లించలేని ఎంకన్న, తన కూతురిని అత్తవారింటికి పంపడం ఈ నవలలోని కథ.
ఎరుకల ఆర్థిక, సాంఘిక, రాజకీయ స్థితిగతులు :
1. ఆర్థిక స్థితి :
నవల ప్రథమాంకంలోనే రచయిత్రి వారి యొక్క ఆర్థిక స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఎంకన్న గుడిసెను వివరిస్తూ ”పైన తాటాకులు ఎండకు ఎండి వానకి తడిసి వుగిలిపోయి నట్టున్నాయ్‌. పొగబారిన వాసాలు పుచ్చి, బెజ్జాలు పడి పొడి రాలుతోంది. వొక మూల తుప్పు పట్టిన ట్రంకు పెట్టె. దాని మీద లుంగచుట్టి పడేసిన గుడ్డలు. కాలిరిగిన చెక్కపెట్టె. దాని పక్కగా యెలిక తవ్విన కలుగు. అలకటం చేతకాని వాళ్ళు అలికినట్టున్న ఆ నేలమీదే పిల్లలు చాపేసుకుని అడ్డదిడ్డంగా పడుకున్నారు. ఆ చాప మీదే మాలచ్చిమి లేచి కూచుని ఉంది. అక్కడే వోరగా కూచున్న ఎంకన్న చుట్ట తాగుతున్నాడు.” (ఎల్లి-5 పేజీ)
ఈ ఒక్క పేర ఎరుకల ఆర్థిక స్థితికి నిదర్శనం అని చెప్పవచ్చు. సాధారణంగా ఎరుకల ఆహారంలో భాగమైన ‘పులినీళ్ళు’ (గంజి) గురించి రచయిత్రి వివరిస్తూ … ఎల్లి తన చెల్లిని, తమ్ముడిని పులినీళ్ళు తాగడానికి పిలిచి, గిన్నెలో పోసి ఇస్తుంది. ఆ గంజి చూసి తమ్ముడు ‘కూసిని మెతుకులు కూడా లేవు. గంజి కూడా చిక్కగా లేదు. వుత్త నీళ్ళే” అని గొణుక్కుంటాడు. సర్వసాధారణంగా కుటుంబంలో ఉండే ఆర్థిక లేమి పిల్లలకు అంతగా తెలియదు. అయితే పై సందర్భంలో చిన్నపిల్లవాడు ఆ పులినీళ్ళ విషయంలో అక్కను ప్రశ్నించినట్లున్న తీరును బట్టి వారు ఎంతటి దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారో తెలుస్తోంది. ఆకలితో అరుస్తున్న పందుల్ని చూసేటప్పటికి ‘ఎంకన్నకి కడుపులో కెలికినట్టయ్యింది”… అంటూ రచయిత్రి వివరిస్తారు. దాన్ని బట్టి మనుష్యులే కాదు పందులు కూడా ఆకలితో అలమటిస్తున్నట్లు అర్థమౌతోంది.
2. రాజనీతి :
ఎరుకలకు కూడా ఒక కట్టు ఉంది. అదేమిటంటే కులపెద్దలతో కూడిన ‘పంచాయితీ’. వాళ్ళు ఏది చెబితే అదే చట్టం. వాళ్ళ మాటే వేదంగా అందరూ పాటిస్తారు. ఏదైనా తగాద ఏర్పడితే పెద్దమనుషులే తీర్పు చెప్తారు. ఆ పెద్ద మనుష్యుల ఖర్చంతా అంటే కల్లుపోయించడం, భోజనాలు, చుట్టలు మొదలైనవన్ని ఇరు వర్గాలవారు, వారివారి కులపెద్దల ఖర్చు భరించాలి. కొన్ని సందర్భాల్లో ఇరువర్గాల పెద్దలతో ఇద్దరు ముగ్గురు లాలూచీపడి, తగాదాను ఒక కొలిక్కి రానివ్వకుండా, కాలం సాగదీస్తూ లబ్ధిపొందే కుతంత్రం కూడా ఉంది.
ఎరుకల పంచాయితీని ధిక్కరించినవారిని వెలివేసే సంప్రదాయం కూడా ఉంది. అంతేకాక వెలివేసిన వారికి, ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే వారిని కూడా వెలివేస్తారు.
3. వివాహ వ్యవస్థ :
ఎరుకల వివాహ వ్యవస్థ మిగతా కులాల వివాహ వ్యవస్థకంటే భిన్నంగా ఉంటుంది. ఎరుకల కులంలో ‘ఓలి’ సంప్రదాయం ఉంది. ఓలి అంటే దాదాపు ‘కన్యాశుల్కం’ వంటిది అని చెప్పవచ్చు. అయితే ఓలికి, కన్యాశుల్కానికి మధ్య కొంత భేదం ఉంది. ఓలి తీసుకుని, పెళ్ళి చేసే తండ్రి లేదా అమ్ముకునే భర్త ఏదైనా కారణాలవల్ల అమ్మాయిని లేదా భార్యను తిరిగి తెచ్చేసుకోవాలనుకుంటే, ఆ వోలి తిరిగి చెల్లించి (అంటే ఎదుటి వ్యక్తి దగ్గర ఎంత ఓలి అయితే తీసుకుంటే అంత వోలి) తెచ్చుకోవచ్చు.
ఈ నవలలో వోలికి ఆశపడిన భర్తలు తమ భార్యలను అమ్ముకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాలచ్చిమి, పారోతి దీనికి నిదర్శనాలు. ఒక సందర్భంలో మాలచ్చిమి ”యేంబతుకురా నా బతుకు. పెంచుకున్నోడు అమ్ముకున్నాడు. కట్టుకున్నోడు అమ్ముకున్నాడు”… అని అంటుంది.
ఈ సందర్భాన్ని గమనించినట్టయితే స్త్రీని ఒక అంగడి వస్తువుగా ఆ సమాజం భావిస్తోందని తెలుస్తోంది.
ఎరుకల వివాహ వ్యవస్థలో బాల్య వివాహాలు ఉన్నాయి. 12 సంవత్సరాలు కూడా నిండకముందే, స్త్రీగా పుట్టినందుకు గృహిణిగా బాధ్యతలు మోయవలసి వస్తుంది. అప్పుడప్పుడే బాల్య ఛాయలు వీడుతున్న సమయంలో వివాహాలు చెయ్యడం వల్ల వారికి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తడంలో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. అంతేకాక సంతానం పట్ల అవగాహన లేనందువల్ల ఎక్కువ మంది పిల్లలను కని, అటు ఆర్థిక, ఇటు ఆరోగ్య లేమితో కొట్టుమిట్టాడడం సర్వసాధారణం.
సాంఘిక జీవనం :
ఎరుకలు ఎక్కడ జీవించినప్పటికి ఒంటరిగా జీవించరు. గుంపుగా జీవించడం వారి లక్షణం. సాధారణంగా ఒక గుంపులో 20 లేదా 30 కంటే ఎక్కువ కుటుంబాలు ఉండవు.
ఉదయం లేవగానే పులినీళ్ళు తాగడం, పందులను మేపడానికి తోలుకువెళ్ళడం, పందులను మేపుతూ కట్టెలు ఏరుకోవడం, చింత చిగురు కోయడం, కాలువల్లో చేపలు పట్టడం, బుట్టలల్లి అమ్ముకోవడం. ఇదే వారి జీవన విధానం. ఎన్నో యేళ్ళుగా వారు నాగరిక సమాజంలో జీవిస్తున్నప్పటికి వారి జీవలక్షణాల్ని మార్చుకోకుండా, వారి ప్రత్యేకతను కాపాడుకుంటూ అంటే ఆచారాలు, సంస్కృతిని కాపాడుకుంటూ జీవించడం గమనించదగ్గ అంశం. అంతేకాక వారి భాషను కూడా వారు కాపాడుకోవడం మరో విశేషం.
ఎరుకలపై ఉన్నత వర్గాల దౌర్జన్యం :
మానవ సమాజం దొంతర్ల సమాజం గనుక అట్టడుగున ఉన్నవారిని పై స్థాయిలో ఉన్నవారు ఎప్పుడూ దోచుకుంటూనే ఉంటారు. సమాజంలో జరుగుతున్న ఈ దోపిడీ, ఎరుకల జీవితాల్లో ఎలా జరుగుతుందో ఎల్లి నవలలో అరుణ చక్కగా చిత్రించారు. మచ్చుకు కొన్ని ః
జాజి కథ :
జాజి సుబ్బన్న, మాలచ్చిమిల కూతురు. జాజికి పెళ్ళి కుదురుతుంది. ఒకరోజు చిగురు కోసం వెళ్ళిన జాజిని ఉన్నత కులానికి చెందిన కుర్రోళ్ళు సామూహికంగా అత్యాచారం చేస్తారు. అప్పటి నుండి జాజి మగవాళ్ళంటే భయపడిపోయేది. పెళ్ళయిన తరువాత భర్తను కూడా దగ్గరకు రానిచ్చేది కాదు. చివరికి భర్త వదిలేస్తాడు. క్రమక్రమంగా జాజి మానసిక స్థిమితాన్ని కోల్పోతూ వస్తుంది. ఒకరోజు తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు కూర్చొని పేకాట ఆడుకుంటుంటారు. జాజి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, వారిలో ఒకడిపై కాండ్రించి ఉమ్మేస్తుంది. వాడికి కోపం వచ్చి జాజిని రక్తం వచ్చేటట్టు కొడతాడు. అప్పటినుండి జాజి పూర్తిగా పిచ్చిదై, చివరికి కాలువలో పడి మరణిస్తుంది. ఈ విధంగా ఉన్నత వర్గం వారు జాజి జీవితాన్ని బుగ్గిపాలు చేస్తారు.
దువ్వ :
ఒకరోజు ఎల్లి చెల్లి ‘సీత’ పుల్లలేరడానికి వెళ్ళి ఆసామి తోటలో కంపలేస్తుంది. అది చూసిన ఆసామి సీతను పాలేరుతో బాగా కొట్టిస్తాడు. అటుగా వచ్చిన ‘దువ్వ’ ఆ పాలేరును కొడతాడు. తనముందు తన పాలేరును కొట్టడం అవమానంగా భావించిన ఆసామి దువ్వను దెబ్బతీయడానికి అవకాశం కోసం కనిపెట్టసాగాడు. ఒరోజు దువ్వ చెరుకుతోటలగుండా వస్తుండగా ఆసామి దువ్వను కాళ్ళు చేతులు విరిగేటట్లుకొట్టిస్తాడు.
సుబ్బన్న :
ఒకసారి సుబ్బన్న పంది ఆసామి తోటలోకి వెళ్ళిందని, సుబ్బన్న కాలు నరికించేస్తాడు. ఆసామి దృష్టిలో ఒక చెట్టుకి ఉన్న విలువకూడా మనిషి ప్రాణానికి లేదని దీనిని బట్టి తెలుస్తోంది.
ఈ విధంగా ఎరుకల జీవితాలు ఉన్నత వర్గాల జీవితాల్లో ఛిద్రమైపోతున్నాయి. ఎరుకలకు చైతన్యం లేకపోవడం వల్ల వారు తమ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోలేక తరతరాలుగా ఉక్కు సంకెళ్ళలో నలిగిపోతున్నారు.
ఎల్లి – స్త్రీ జీవితం :
‘ఎల్లి’ నవలలో అరుణ ఎరుకల ‘స్త్రీ’ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. స్త్రీ జీవితాన్ని బాల్యం, యౌవనం, వృద్ధాప్యం అనే మూడు దశల్లో వివరించినప్పుడే వారి స్థితిని మనం సరిగా అర్థం చేసుకోవచ్చు.
1. ఎరుకల స్త్రీ – బాల్యం :
బాల్యం అనేది ప్రతి మనిషికి దైవమిచ్చిన వరం అని భావిస్తాం. అంతేకాక బాల్యం తియ్యని జ్ఞాపకాల నిధి. అయితే ఎరుకల స్త్రీ బాల్యం చేదు అనుభవాల, సంఘటనల కూర్పే, బాల్యం నుండి కూడా ఆర్థిక లేమి, ఆకలిదప్పుడు, అనారోగ్యం వెంటాడు తుంటాయి.
ఈ నవలలో ఎల్లి, తన తమ్ముడు, చెల్లి దారిద్య్రం అనే రాక్షసి చేతుల్లో నలిగిపోయారు. తాగడానికి కనీసం చిక్కటి గంజి అయినా లేని పరిస్థితి. చెల్లికి మూర్చరోగం. వీరిద్దరు ఎరుకల బాల్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.
ఆడే పాడే వయసులోనే తల్లి పాత్ర వహించే దయనీయ స్థితి వీరిది. ఎల్లియే దీనికి ఉదాహరణ. ఎల్లి, తల్లి చనిపోయిన తరువాత ఆమె, మిగిలిన పిల్లలకు తల్లిగా మారుతుంది.
ఎల్లి నవల కవర్‌పేజి చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. తల్లి దండ్రులు తమ పిల్లల్ని ఇంటిదగ్గర వదిలేసి, ఆహార సేకరణకని వెళ్ళిపోతే, ఇంటిదగ్గర ఉండే పదిపన్నెండు సంవత్సరాల పిల్లలు వారికి తల్లులుగా మారిపోతారు. ఆడుకోవాల్సిన వయసులో మరొకరిని ఆడించి, వారి ఆలన, పాలనా, చూసుకోవలసిన స్థితి ఏర్పడుతుంది.
బాల్యవివాహాలు చెయ్యడం వల్ల అటు కన్నవారి ప్రేమకు, అవగాహన లేని దాంపత్యం వల్ల కట్టుకున్నవాడి ప్రేమకు ఆమడ దూరాన ఉండి, ప్రేమరాహిత్య జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు.
2. వివాహ జీవితం :
స్త్రీ అన్ని దశల్లోకంటే వివాహ దశ లేదా వివాహ జీవితంలో ఎక్కువ కష్టాలు అనుభవిస్తుంది. భర పోరు, అత్తమామల ఆరళ్ళు, మరుదుల మోసాలు అన్ని భరించాలి. ఈ నవలలో కత్రేణి, పారోతి, నీలి, మాలచ్చిమి జీవితాలే సాక్ష్యం.
అ) కత్రేణి జీవితం :
కత్రేణి ‘సిలారు’ను ఇష్టపడి, అతనితో వెళ్ళిపోతుంది. కులాంతర వివాహం గనుక ఇరుకులస్థులు వారిని వెలేస్తారు. ఇద్దరు పిల్లలు పుట్టాక సిలారు కత్రేణిని విడిచి వెళ్ళిపోతానని అంటూ ఉండేవాడు. కత్రేణి ఏడ్చి, ఏదోలా ప్రయత్నించి అతన్ని వెళ్ళనివ్వకుండా చేస్తుంది. పూర్తిగా భార్య కష్టం మీదే బ్రతికే మనస్తత్వం సిలారుది. అయినా కత్రేణి మౌనంగా బ్రతుకుబండిని లాగుతుంది. తన కూతురు ఎవరితోనో లేచిపోయిందని తెలిసిన తరువాత సిలారు ఆత్మహత్య చేసుకుంటాడు. భర్త పిరికితనాన్ని గూర్చి కత్రేణి చెప్తూ ”పిరికినా కొడుకు. యెప్పుడన్నా నీకు ఇది కావాలా అని గాని తిన్నావాన అని గాని ఆ పిల్లని అడిగిన తండ్రేనా ఆడు. ఆడబిడ్డ కోసం జచ్చాడని లోకం అనుకోవాలని సచ్చాడు. లోకం అనుకుందా. అనుకోలా. శవం మీద కూడా వూసింది. యింత పిరికినా కొడుకులు ఎందుకు పుడతారు. యిన్నాళ్ళు అనుకోలా నేను. యిప్పుడనుకుంటున్నా. వీడినా నేను నమ్ముకొని వచ్చింది. నేనన్నానా బిడ్డలన్నా కొంచెమైనా బెమతలేకపోయిందే యీ మాత్రం బతుకు బతకడానికి మొగుడే గావాలా. బజాట్టోనుంచుని జూ అంటే రావూ కుక్కలు’ (పేజీ 208) అని అంటుంది.
ఈ మాటల్లో ఆమె వేదన, అక్కసు అన్ని వ్యక్తమౌతున్నాయి. ఒకడిని నమ్మి వెళ్ళినందుకు ఎంతగా హింస పొందిందో అర్థ మౌతుంది. అంతేకాక తల్లిదండ్రులకు తెలియకుండా పారిపోవడం లేదా లేచిపోవడంలో ఉన్న డొల్లును, తరువాత స్త్రీ అనుభవించే కష్టనష్టాలను కత్రేణి పాత్ర ద్వారా రచయిత్రి వివరించారు.
అంతేకాక ‘జీవితం’ ఎంత గొప్పది అనే విషయాన్ని కత్రేణి పాత్ర ద్వారా రచయిత్రి వివరించారు. కష్టాల్లో సొమ్మసిల్లిపోవద్దని స్త్రీలకు సందేశమిచ్చారు.
(అ) నీలి జీవితం :
ఎల్లి నవలలో నీలి కథ ఒక ఉపకథ. వివాహ జీవితంలో ఓడిపోయినా, ధైర్యంగా నిలబడి, జీవితాన్ని తిరిగి ఆనందమయంగా చేసుకున్న స్త్రీ నీలి. నీలికి పెళ్ళివుతుంది. భర్త నక్కోరోడు (నపుంసకుడు). ఇది తెలిసిన నీలి నా కర్మ అనుకుని మౌనంగా భరిస్తుంది. ఒక రోజు నీలి మరిది, ఆమె చెయ్యి పట్టుకుంటాడు. దాంతో నీలి పెద్ద గొడవ చేస్తుంది. ఆ తర్వాత నీలి భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటాడు. నీలి మామ నీలిని తీసుకొచ్చి, పుట్టింట్లో అప్పగించి వెళ్ళిపోతాడు.
నీలి, ఆమె తల్లి కోమలి ఏదోలా కాలం వెజునీజుబుచ్చు తుంటారు. నీలికి దువ్వ మీద ఇష్టం కలుగుతుంది. దువ్వ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నీలి దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. దువ్వ కోలుకున్న తరువాత నీలి, దువ్వ వేరే చోట కలిసి ఉండడం ప్రారంభించారు. నీలి మామ, తమ వోలి తనకు కట్టమని పంచాయితీ పెడతాడు. అప్పుడు నీలి లేచి ”యిక్కడ మొలతాడు గట్టిన మొగోళ్ళందరికి ఒక దణ్ణం మీ పంచాయితీకో దణ్ణం. థూ మీరు మగోళ్ళ, సారానీళ్ళకీ చీకు ముక్కలకి చొంగలు కార్చుకునే నా కొడుకులు పంచాయితీ జేత్తారు. యెవడి మీద మీ పంచాయితీ. ఆ సంగడి కొడుక్కి నేను ఏ వొక్కరోజు సంసారం చెయ్యల. నేను ఆడి కోడలినే కాదు. ఆ గుడిసెకి నాకు యేం సమ్మందం లేదు. ఆడు కొన్న వోలి కంటే ఎక్కువే సేసా” అని చెప్పి దువ్వ, నీలి ఆ పంచాయితీ నుండి వెళ్ళిపోతారు.
పంచాయితీలో ఉన్న లొల్లినంతటిని తన మాటల ద్వారా వ్యక్తం చేసిన స్త్రీ నీలి. వెలివేస్తారని తెలిసి కూడా ధైర్యంగా మాట్లాడడం ఆమె సాహసాన్ని తెలియజేస్తుంది. అంతేకాక ఈ నవలలో ఎరుకల సంఘాన్ని ఎదిరించిన మొట్టమొదటి స్త్రీగా నీలి కనిపిస్తుంది.
3. వృద్ధాప్యం :
వృద్ధాప్యంలో ఒక ఎరుకల స్త్రీ ఎంత దయనీయ స్థితి అనుభవిస్తుంది అనడానికి మాలచ్చిమి నిదర్శనం. మాలచ్చిమి మూడు తరాలకు ప్రతినిధిగా నిలబడింది. మాలచ్చిమి కూతురు ‘జాజి’, కొడుకు ‘ఎంకన్న’, ఎంకన్న కూతురు ‘ఎల్లి’.
మాలచ్చిమి తన జీవితాన్ని గురించి నెలబాలుడితో చెప్తూ మొదటి భర్త ఆమెను అమ్మేసిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ”గొడ్డులా మెడకి పొలుపేసి లాకొత్తంటే ఆళ్ళు అమ్మా అయ్యా అని కుచ్చిళ్ళలో మొహం దాచుకుని గగ్గోలుగా ఏడవడం యెట్టా మరుత్తా అని వొరే చాలా యెందుకురా నేనప్పుడే సావలేదు. నీ గుక్కెడి ప్రాణం యెందుకు బోలా. యెందుకు యింకా యెముకలరగ దీసుకుంటూ బతకుతున్నా. యేం బతుకురా నా బతుకు. బిడ్డ జచ్చింది కళ్ళ ముందే. వున్నోడు ముద్దెయ్యడు. బిచ్చపు బతుకు బతుకుతున్నా యేంగావాలని బతుకుతున్నా. యేం పొందాను నేను. యెప్పుడూ లోపల యెవరో నన్ను వాటేసుకుని యేడుస్తున్నట్టే వుంటుంది. నాలోపలంతా యేడుపే. నాకు బతకాలని లేదురా బాలా. నాకు సచ్చిపోవాలని వుందిరా. యెవరన్నా నా పీక నొక్కేస్తే యెంత బావుండును”. (పేజి 185) అని కంటనీరు పెట్టుకుంటుంది. ఈ పేరాలో వృద్ధాప్యంలో మాలచ్చిమి ఎంత బాధను దిగమింగుకుని బ్రతుకు వెళ్ళదీస్తుందో అర్థమవుతుంది.
బాల్యం, వివాహ జీవితం, వృద్ధాప్యం ఈ మూడు దశల్ని చూసినప్పుడు స్త్రీ జీవితం ఏమిటో అర్థమవుతుంది. ఎల్లి పాత్రలోని ప్రతి స్త్రీ సమస్య సముద్రమంత విస్తీర్ణంతో కూడి, ఆమె హృదయం సముద్రం అంతలోతుగా ఉంది. కొండంత దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుకుని, జీవితంలో ముందుకు సాగి పోయే తీరు పాఠకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.
ముగింపు :
ఇంత వరకు తెలుగు సాహిత్యంలో వచ్చిన నవలల్లో అట్టడుగున ఉన్న స్త్రీల జీవితాన్ని చిత్రించిన నవలలు అరుదు. ఉన్న నవలల్లో ఎరుకల జీవితాన్ని చిత్రించిన ఎల్లి నవల ఉన్నతమైంది. ఈ నవలలో ఎలాంటి చైతన్యం లేకుండా, ‘స్తబ్ధంగా ఉన్న జీవితాలను చాలా పదునైన భావజాలంతో అరుణ వ్యక్తం చేశారు.
ఎరుకలు తాము ఒక ప్రత్యేక సమాజం అని అనుకుంటూ వాళ్ళంతట వాళ్ళే జీవించినంత కాలం వాళ్ళ జీవితాలు మారి, వాళ్ళలో చైతన్యం రావడం అన్నది కొంత కష్టతరమైనదే. అయితే వాళ్ళు ప్రధాన జీవన స్రవంతిలో కలిసినపుడే వారి అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పవచ్చు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

One Response to ఎల్లి నవల-ఎరుకల జీవిత చితణ్ర

  1. hanu says:

    ఎల్లి నవల కావలి ఏల పొందలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.