సిహెచ్. మధు
ప్రపంచం చాలా మారిపోయింది. ఆధునికత పేరుతో విశృంఖలత్వం మొదలయ్యింది. ప్రపంచీకరణ పుణ్యమా అని కొత్త పేర్లతో, కొత్త రూపాలతో చిత్రహింసలు, అరాచకత్వం, దాడులు జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక నైపుణ్యం ఇంతకాలం దోపిడికి గురిఅవుతున్న వర్గం పట్ల, శ్రమజీవుల పట్ల నరకంగా తయారయ్యింది. మారిన కాలంలో స్త్రీవాద సాహిత్యం తన పరిధిని విస్తరించుకోవల్సిన అవసరముంది.
మొదటినుండి స్త్రీవాద సాహిత్యం కొంత గిరిగీసుకొని పనిచేసిందనే భావిస్తున్నాను. ఏ యుగంలోనైనా ముఖ్యంగా ప్రజాస్వామ్యయుగంలో మధ్యతరగతి మేధావివర్గం తాము అనుభవిస్తున్న సమస్యలే మొత్తం ప్రజలు అనుభవిస్తున్నారని భావిస్తారు. క్రింది తరగతి ప్రజలు ఇంతకంటే ఘోరంగా భయంకరంగా వున్నాయంటే అంగీకరించరు. అంగీకరించినా పట్టించుకోవటానికి నిరాకరిస్తారు. స్త్రీవాద సాహిత్యం కూడా విద్యాధికులకే పరిమితమయ్యింది. మేధావివర్గం చుట్టూ మాత్రమే తన ఆలోచనలను ప్రభావితం చేసింది. కొందరు అంగీకరించక పోవచ్చు. నామీద రాళ్లు విసురవచ్చు కానీ నిజం అదే. ఇప్పటిదాకా ‘స్త్రీవాద సాహిత్యం’ నూతిలో కప్పలా వుంది. రాళ్లు వేయటానికి రెడీగా వున్నారా? – పర్వాలేదు. కొంత చైతన్యపూరిత కదలిక అవసరం.
నా ఆలోచనను ఈ వ్యాసంలో సమర్ధించుకుంటాను. ఆ ఆత్మవిశ్వాసం నాకుంది. వాస్తవికదృష్టిగల మేధావి ఆత్మవిమర్శ అడుగడుగు చేసుకునే రచయిత తన ఆలోచనల మీద నిలబడి వుంటాడు. ఒంటికాలు మీద లేవాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రశ్న ఇప్పటిదాకా వచ్చిన స్త్రీవాద సాహిత్యం గ్రామీణ ప్రాంత మహిళల వైపు కన్నెత్తయినా చూచిందా? – ఈ ప్రశ్నకు జవాబు అవసరం! లేదా ఆత్మవిమర్శ చేసుకుందాం!
ఇప్పటివరకు స్త్రీవాద సాహిత్యం ఒక కోణంను మాత్రమే ఆవిష్కరించింది. చాలా ‘దిశల’ వైపు దృష్టి సారించలేదు. ఇప్పుడైతే ‘పరిస్థితి’ చాలా మారిపోయింది. ప్రజాస్వామ్యం అంటూ ప్రజలను దోచుక తినే వ్యవస్థలా – స్త్రీ స్వేచ్ఛ సమానత్వం ముసుగులో స్త్రీ అన్ని విధాల హింసకు గురి అవుతూ వుంది. కొత్తరకమైన సమస్యలతోపాటు కొత్త రకమైన ‘హింసలు’ కూడా వచ్చాయి. సమానత్వం ముసుగులో అరాచకత్వం, స్వేచ్ఛ ముసుగులో చిత్రహింసలు, ప్రేమ పేరుతో హత్యలు ఆత్మహత్యలు… ఇలా మనం గతంలో ఊహించనివి ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఊహించనివి భవిష్యత్తులో చూడబోతున్నాం.
స్త్రీవాద సాహిత్యం ఒకటే కాదు దళితవాద సాహిత్యం, బహుజన సాహిత్యం, మైనారిటీవాద సాహిత్యం అన్నీ కూడా ఒక కోణాన్ని మాత్రమే ఆవిష్కరించాయి. మధ్యతరగతి మేధావుల మనసులు మాత్రమే అందుకున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజల దుఃఖాన్ని, కన్నీళ్లను, సమస్యలను, పోరాటాలను, ఉద్యమాలను, ధిక్కరణను ఆవిష్కరించలేకపోయాయి. ఆ దృష్టి కూడా ఈ సాహిత్యంకు లేదు. దృష్టి కుంచించుకపోవటం కళ్లద్దాలు విశాలం కాకపోవటం ఒక కారణమైతే ‘రిస్కు’ తీసుకోవటానికి మనసు-కలం అంగీకరించకపోవటం మరో కారణం.
ఒక విషయాన్ని రచయితలు-రచయిత్రులు అంగీకరించాలి. మన భారతదేశం గ్రామాలు, పల్లెలు గలిగిన దేశం. దేశానికి గ్రామాలు, పల్లెలు మాత్రమే – మనసు, ప్రాణం. గ్రామంలో నివసించే ప్రజలు మాత్రమే సాహిత్యానికి గీటురాయి. వారి శ్రమ-చెమట, భాష, సంస్కృతి వారి ఆచారాలు జీవనం ఇవి మాత్రమే భారతదేశానికి ప్రతినిధి. పట్నం కంపు భారతావనికి ప్రతినిధి కాదు. పట్నం మోసం, దగాకోరుతనం, రాజకీయం సొంపు, సోయగం, కైపు, వాపు పట్నం జీవనం తలపై మొలిచిన యంత్రం ఇవేవీ భారతదేశానికి గీటురాయి కాదు. వ్యవసాయకదేశం కనుక పల్లె జీవనాడి పల్లెప్రజలు తూర్పునాడి.
పల్లెస్త్రీల అంతరంగాన్ని స్త్రీవాద సాహిత్యం సృష్టించిందా? – పల్లెస్త్రీల గుండె అంచులలోకి స్త్రీవాద సాహిత్యం తొంగిచూచిందా? పల్లెస్త్రీల నిరాశామయ అభద్రతా బ్రతుకులవైపు స్త్రీవాద సాహిత్యం దృష్టి సారించిందా? -ఏవో ప్రశ్నలు నాకు చాలా విషయాలు తెలియవు. ‘విమర్శ’ కొరకు ఈ వ్యాసం కాదు ‘ఆత్మవిమర్శ’ కొరకు ఈ వ్యాసం. స్త్రీవాద సాహిత్యం ఆకాశంలాంటిది. ఆకాశమంతా ఎలా తిరుగగలను? – అయినా భూమి మీద నిలకడగా వున్నవాణ్ణి.
ప్రపంచం క్షణక్షణం మారుతున్న రోజులివి. ఆలోచనలు, అలవాట్లు, ఆచరణలు అన్నీ మారిపోతున్న రోజులివి. ప్రపంచం మన గుప్పిట్లో వున్నట్టు అనిపించినా మనకందకుండా సామ్రాజ్యవాదుల గుప్పిట్లో వుంది. స్త్రీ ఆధునికత సంతరించుకున్నా, ఆఖరుకు ముస్లిం మైనారిటీ మహిళల పరదాలు తొలిగిపోతున్నా స్త్రీ స్వేచ్ఛగా కనిపిస్తున్నా స్త్రీ స్వేచ్ఛ కాదు. అభద్రత అడుగడుగూ ఆమెను వెంటాడుతూనే వుంది (స్త్రీవాద సాహిత్యం ఈవైపు దృష్టి సారించిందా) ప్రపంచం ఎంత మారినట్టుగా కనిపించినా – నిజానికి మారినా, క్షణక్షణం మారుతున్నా – సామ్రాజ్యవాదం రూపం మారలేదు దాని వాడి తగ్గలేదు. దాని పెత్తనం తగ్గలేదు.
ప్రపంచంలో అంతరాలు పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోని దోపిడి లక్షణాలు తగ్గలేదు. పైగా పెరుగుతున్నాయి. ఇవి అన్నీ పురుషాధిక్య వ్యవస్థను పటిష్టం చేసేవి. ఇవి అన్నీ తరతరాల పురుషాధిక్య సమాజాన్ని శక్తివంతం చేసేవి. పైకి అలా కనిపించటం లేదు కానీ లోనంతా స్త్రీని రకరకాల హింసించే క్రూర ఆధునికతే!
స్త్రీలు రాజ్యాలు ఏలవచ్చు. కార్పోరేట్ ప్రపంచానికి సామ్రాజ్ఞి కావచ్చు. రోదసీలో కాలుపెట్టవచ్చు. వీరంతా కోటి మహిళలలో ఒకశాతం మాత్రమే. మిగితా స్త్రీల పరిస్థితి ఏమిటీ? – ముఖ్యంగా పల్లెస్త్రీల పరిస్థితి ఏమిటీ? – విద్యాగంధం లేని మహిళల సంగతేమిటీ? –
సామ్రాజ్యాలు ఏలుతున్న కోటిలో ఒక శాతం మహిళల గూర్చే ఆలోచిద్దాం. వారు ఎంత ఎదిగినా – ”మాకంటే గొప్ప!” అని పురుషులు భావిస్తున్నారా? అన్ని రంగాలలో స్త్రీలు రాణిస్తున్నా ”మాతో సమానమని” పురుష ప్రపంచం భావిస్తుందా? – పురుషాధిక్య సమాజం ఆలోచనలలో మార్పు వచ్చిందా? – ‘స్త్రీ’ అంటే చిన్నచూపు ఆధునిక ప్రపంచంలో తగ్గిందా?
స్త్రీవాద సాహిత్యం ఈ లోతులలోకి వెళ్లాల్సిన అవసరం లేదా? – ఎంతో అభివృద్ధి చెందినదని భావిస్తున్న స్త్రీ స్వేచ్ఛగా నిర్భయంగా ఒంటరిగా జీవించే అవకాశాలున్నాయా? –
‘పల్లెలు-పల్లెమహిళలు’ స్త్రీవాద సాహిత్యం పట్టించు కోలేదనే విషయం చాలా దూరవిషయం. అది అలా వుంచుదాం! ‘వరకట్నం’ సంగతేమిటీ? ‘పది సంవత్సరాల క్రితానికి ‘వరకట్నం’ రేట్ బాగా పెరిగింది. అమ్మాయి బాగుందా? అనేది రెండో ప్రశ్నగా మారి ‘ఎంత యిస్తారు?’ అనేది మొదలు ప్రశ్నగా మారింది. ‘డబ్బు’ కీలకమైన ఈ వ్యవస్థలో ‘డబ్బు రావటం’ అనేది అవసరమని స్త్రీవాదులు భావిస్తున్నట్టున్నారు. ‘వరకట్నం’లోనే పురుషాధిక్య భావజాలం వుంది. వరకట్నంలోనే స్త్రీపట్ల చిన్నచూపు వుంది. వీటిని వ్యతిరేకంగా స్త్రీవాద సాహిత్యం ఎందుకు దండెత్తలేదు?
అసలు ఇప్పుడున్న వివాహ వ్యవస్థ, ఆచారంలోనే పురుషాధిక్యత వుంది. ఇంకాపోతే కులవ్యవస్థ పురుషాధిక్యత బీజాలపై నిలబడి వుంది. ఇంత లోతులలోకి స్త్రీవాద సాహిత్యం వెళ్లిందా? – ఇవన్నీ ‘ఆధునికత’ ప్రపంచమార్పు మూలంగా వచ్చిన కొత్త సంగతులు కావు పాత విషయాలే! – వరకట్నం మొదలు నుండి వున్నదే బాగా బలవడిపోయింది. ‘నా కూతురును నీవు భద్రంతా చూడు అందుకు నీకు లక్షల వరకట్నం ఇస్తున్నాను’ అనటంలోనే పురుషాధిక్య భావజాలముంది.
స్వేచ్ఛాయుత స్త్రీకి ‘విడాకులు’ ఒక వరమని భావించినా విడాకుల మూలంగా నష్టపోయేది ఎక్కువగా స్త్రీయే. ఆ విడాకులయినా స్వేచ్ఛగా లభిస్తున్నాయా? – సరే చదువుకొంటున్న స్త్రీ, ఉద్యోగం చేసుకొంటున్న స్త్రీ, ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడిన స్త్రీ తపనిసరి అయితే విడాకులు తీసుకుంటుంది. బ్రతుకుతుంది. ఆ అవకాశంలేని స్త్రీ – మగడు ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా పడివుండటం తప్పనిసరి అనుకొంటుంది. విడాకులు అడగటం లేదు. పైగా త్రాగివచ్చి భార్యను హింసించినా నోరుమూసుకొని పడి వుండాల్సిందే! ‘నీవు వద్దు పో’ అంటే ఎక్కడికి వెళ్లాలి? – ఏ చట్టం రక్షిస్తుంది? చట్టం సరే! – కొన్ని చట్టాలు స్త్రీలకు వరంగా వున్నాయి. ఏ చట్టమైన తప్పు చేసిన మగవాడికి శిక్ష వేస్తుంది తప్ప – స్త్రీకి ‘రక్షణ’ ఇస్తుందా? – ప్రతిదినం ఎన్నో మానభంగాలు. రేప్‌లు, వరకట్నం హత్యలు, ప్రేమ మరణాలు, యాసిడ్ దాడులు, ఎన్నో భయంకరాలు. ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీకి భద్రత యివ్వలేకపోయాయి. ”ఈ చట్టం వుంది పర్వాలేదు” అనే నమ్మకం యివ్వలేకపోతున్నాయి. ఈ లోతులలోకి స్త్రీవాద సాహిత్యం వెళ్లవల్సిన అవసరముంది.
ఇన్ని విషయా లెందుకూ? ఇప్పటికీ ”ఆడపిల్లలను ఎందు కిచ్చావురా?” అని బాధపడుతున్న సమాజమిది. ప్రపంచీకరణ పుణ్యమా అని కొడుకులు – మగ ప్రపంచం దురుసుగా, విశృంఖలత్వంగా, కరుణారహితంగా, స్వార్థంగా, దయాహీనంగా ప్రవర్తిస్తున్నా ఆడపిల్లలలో ప్రేమా-కరుణ కనిపిస్తున్నా – ఆడపిల్ల కలిగితే సంతోషించని వ్యవస్థ ఇది. లోపలి కన్నీళ్ల సంగతేమో కానీ పైపై కన్నీళ్లను కూడా స్త్రీవాద సాహిత్యం తుడువలేకపోయింది. ఒక వైరుధ్యం చూద్దాం! – స్త్రీవాద సాహిత్యం గమనించిందా? – స్త్రీ స్వేచ్ఛ – సమానత్వం ముసుగులోని ఢాంభికాన్ని గుర్తుపట్టారా? – ఎంత ఆధునిక యుగమైనా, సాంకేతికంగా ఎంత పరుగులు తీసినా ఒక వైరుధ్యాన్ని గమనించాలి. పిల్లలు గలిగిన తల్లితండ్రులు – ”నా కొడుకుకు మంచి భార్య దొరకాలని మంచి కోడలు రావాలని” ఏ తల్లి ఏ తండ్రి భగవంతుని ముందు ప్రార్థించరు. అసలు ఆ ఆలోచనే రాదు. కట్నం ఎంత ఎక్కువగా తెచ్చే అమ్మాయి దొరుకుతుంది అనే ఆలోచనే వస్తుంది. కాని ఆడపిల్లల తల్లితండ్రులు ”తన బిడ్డకు మంచి భర్త దొరకాలని కన్నుల్లో పెట్టుకునే భర్త దొరకాలని” కనబడిన భగవంతునెల్లా మొక్కుతారు. ఎందుకీ మొక్కులు? – పురుషాధిక్య సమాజానికి ఇది చిహ్నం కాదా? – ఏ స్వేచ్ఛ స్త్రీకి లభించినట్టు? ఏ సమానత్వం స్త్రీ పొందినట్టు? –
స్త్రీవాద సాహిత్యమా? – ఆత్మవిమర్శ అవసరం కదూ!
‘ప్రపంచీకరణ’ ప్రపంచ ప్రజల పట్ల శాపంగా మారింది ప్రపంచీకరణ పురుషాధిక్య వ్యవస్థను బలోపేతం చేసింది. ప్రపంచీకరణ స్త్రీని స్వేచ్ఛాయుత జీవిగా మార్చినట్టుగా కనిపించినా స్త్రీల కాళ్ల క్రింద మంట పెట్టింది. ప్రపంచీకరణ మగవాణ్ణి రాక్షసునిగా మార్చింది. స్త్రీవాద సాహిత్యం ప్రతిదినం జరుగుతున్న స్త్రీల మరణాల పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరముంది. యాసిడ్ దాడులు, వరకట్నం హత్యలు, చిత్రహింసలు, హత్యలు, భరించలేని ఆత్మహత్యలు ఇలాంటివెన్నో విషాదాలు, ఎన్నో భయంకరాలు, ఎన్నో దుర్మార్గాలు.
ప్రపంచీకరణ పల్లెలలోని స్త్రీల శ్రమైక జీవన సౌందర్యాన్ని దెబ్బతీసింది. పల్లెస్త్రీల అమృతమనసులలో విషపు చుక్కలు పోసింది. గ్రామీణ స్త్రీల భూమి కోల్పోయి ఉపాధి కోల్పోయి దిక్కు దివాణం లేక కొందరు స్త్రీలు అప్పులబాధ భరించలేని భర్తను కోల్పోయి ఏ స్వేచ్ఛకు సంకేతాలని భార్య చట్టబద్ధంగా లభించిన ప్రజాప్రతినిధికి పట్టాదారు అయితే – ఆ రాజ్యం భర్తదే! లేదా మామది, తండ్రిది, కొడుకుది? – ఏ సమానత్వానికి ప్రాతిపదిక ఇది?
స్త్రీవాద సాహిత్యం చాలా లోతులలోకి వెళ్లాల్సిన అవసరముంది.
ఏ సాహిత్యానికయినా నిండుతనం యిచ్చేది, జీవం పోసేది పోరాటం మాత్రమే. స్త్రీవాద సాహిత్యం ‘రాజీ’ ఎరుగని పోరాట సాహిత్యంగా ఎదగాలి. స్త్రీకి ఇప్పుడు మిగిలింది పోరాటమే.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags