వేములపల్లి సత్యవతి
భరతమాతను దాస్యశృంఖలాల బంధనాలనుంచి విముక్తి చేయటానికి బ్రిటిష్ పాలకుల వలస విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండ, స్త్రీ-పురుష లింగభేదం లేకుండ భారతీయులు ఏకత్రాటి మీద పోరాడారు. ఎంతోమంది యువకిశోరాలు బలిపీఠమెక్కి వురిత్రాళ్లను పూలమాలలవలె మెడలకు తగిలించుకున్నారు. కన్నవారిని జీవితాంతము దుఃఖాన్ని దహించివేసింది. కడుపుశోకంతో తల్లడిల్లారు. ఎంతోమంది దేశభక్తుల భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. పోలీసుల లాఠీదెబ్బలకు స్వతంత్ర సమరయోధుల తలలు తలపడ్డాయి. తుపాకి గుండ్లకు గుండెలు గురయ్యాయి. స్వతంత్ర సమరంలో పురుషులు జైళ్లకెళితే వారి భార్యల మీద సంసారభారం పడింది. అత్తమామల సంరక్షణ, పిల్లల పెంపకం అన్నీ వారి భార్యలే భరించారు. ఆర్థికస్తోమత లేనివారు పేదరికంతో అష్టకష్టాలు పడి భర్తలు వచ్చేవరకు కుటుంబాలను సాకారు. ఒకప్రక్క పోలీసుల జులుం, మరోప్రక్క గూఢచారుల నిఘా అన్నీ భరించారు. అదే స్వతంత్ర సంగ్రామంలో పురుషులవలె స్త్రీలు కూడ పాల్గొని జైళ్లకెళ్లినా, ప్రచారాలకు, సభలు-సమావేశాలకెళ్లినా వారి భర్తలు, స్త్రీలవలె అటువంటి బాధ్యతలను స్వీకరించటానికి సిద్ధపడలేదు. స్వాతంత్య్ర పోరాటంలోనూ పురుషాహంకారం గర్జించింది. పురుషాధిక్యతను చాటి చూపించారు. పురుషులకు ఏమాత్రము తీసిపోని త్యాగాలు చేశారు. మొక్కవోని ధైర్యసాహసాలతో వారికంటె మించి పనిచేశారు. అయినా మహిళలయినందున దుర్గాబాయమ్మగారు, సూర్యదేవర రాజ్యలక్ష్మి గారు వైవాహిక జీవితాలను వదులుకున్నారు.
రాజ్యలక్ష్మి గారి జీవితం వలె ఆమె పుట్టిన వీరులపాడు కూడ ప్రాచీన చరిత్ర గలిగిన గ్రామం. ఆ వూరిలోని ఒక్కొక్క యింటి తలుపు తట్టితే ఒక్కొక్క రకమైన వీరగాథ వినవస్తుంది. ఉన్నత రైతు కుటుంబంలో 1914 మే నెలలో జన్మించారు. రాజ్యలక్ష్మి గారికి ఇద్దరన్నలు, ఒక అక్క వున్నారు. జంగా హనుమయ్య చౌదరి గారి దగ్గర ఆ వూరి బాల-బాలికలతోపాటు చదువుకున్నారు. ఆయన చదువుతోపాటు జాతీయభావాలను కూడా పిల్లలకు నూరిపోసేవారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటం, అందులో ఆంగ్లేయ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన తాంతియాతోపే, బాబూరావు పీష్వా, ఝాన్సీలక్ష్మిబాయిల వీరగాథలు వినిపిస్తూ వుండేవారు. రాజ్యలక్ష్మిగారి పెద్దన్న మల్లికార్జునరావు గారు బి.ఏ. చదువుకు స్వస్తిచెప్పి జాతీయోద్యమం వైపు ఆకర్షితులై నాగపూరులో జరిగే కాంగ్రెస్ మహాసభలకెళ్లి వచ్చారు. తల్లితండ్రులు కన్నకలలు కల్లలయ్యాయి. తిరిగివచ్చి వ్యవసాయం చేయసాగారు. ఆ రోజుల్లో అందరిలాగానే రాజ్యలక్ష్మిగారికి బాల్యంలోనే వివాహం చేయతలపెట్టారు అమ్మ-నాన్నలు. ఆమెకు చదువుకోవాలని వున్నది. అన్న మల్లికార్జునరావు గారు కూడ ‘ఇప్పుడే దానికి పెండ్లేమిటి? చదువుకోనివ్వండి’ అన్నారట. నీవు చదివి నిర్వాకం చేసావు.చాలులే అన్నారట అమ్మానాన్నలు. అన్న చెల్లెండ్ర యిష్టానికి విరుద్ధంగా చేబ్రోలుకు చెందిన సూర్యదేవర నాగయ్య గారితో రాజ్యలక్ష్మి గారి వివాహం జరిగింది. నాగయ్య గారు సంపన్న రైతు కుటుంబీకులు. అన్న మల్లికార్జునరావుగారే కాకుండ వీరులపాడులో యింకా అనేకమంది జాతీయోద్యమాలలో పాల్గొన్నవారున్నారు.
రాజ్యలక్ష్మిగారు జాతీయ్యోదమంతో ప్రభావితు రాలయ్యారు. జాతీయభావాలకు అంకురార్పణ వీరులపాడులోనే జరిగింది. 11 ఏండ్ల వయసులో (1925) వివాహమయిన ఆమె 16 సంవత్సరాల వయసులో అత్తవారింట అడుగుపెట్టింది. జాతీయోద్యమాలకు వీరులపాడుకంటె ఏడాకులు ఎక్కువే చదివింది చేబ్రోలు. గుంటూరు జిల్లాలో వున్నది. చేబ్రోలులో పురుషులకంటె స్త్రీలలోనే జాతీయభావాలు వెల్లివిరిసినవి. రాజకీయచైతన్యం కలిగిన మహిళలుండటం రాజ్యలక్ష్మిగారికెంతగానో తోడ్పడింది. వాసిరెడ్డి హనుమాయమ్మగారు, వాసిరెడ్డి పార్వతమ్మ గారు, సూర్యదేవర హైమవతి గారు, పాటిబండ్ల అన్నపూర్ణమ్మ గారు, వాసిరెడ్డి రాజ్యలక్ష్మి, వాసిరెడ్డి అఖిలాండేశ్వరి, దేశభక్తుని సీతారావమ్మ, వాసిరెడ్డి నాగమ్మ, పాటిబండ్ల రత్నమ్మ, రావెళ్ల వెంకాయమ్మ మొదలగు స్త్రీలెందరో స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారు. వారందరిని చూచి రాజ్యలక్ష్మిగారు వుత్తేజితులయ్యేవారు. 16 సంవత్సరాల రాజ్యలక్ష్మమ్మగారు వారితోపాటు సత్యాగ్రహం చేయాలని వుబలాటపడ్డారు. జైలుకెళ్లటానికి సిద్ధమయ్యారు. మైనర్లను సత్యాగ్రహం చేయటానికి మహాత్ముడు ఒప్పుకోరని నచ్చచెప్పి మాన్పించారు. 40 సంవత్సరాల గొళ్లమూడి రత్నమ్మగారు (విధవ) 1928లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభకు వెళ్లివచ్చింది. రత్నమ్మగారు పదిమందిని కూడగట్టటంలో కడు సమర్థురాలు. అనర్గళంగా వుపన్యసించేవారు. శ్రోతలను తన భాషణతో ఆకట్టుకునేవారు. మహిళలను కూడకట్టుకొని విదేశీబట్టల దుకాణాలముందు పికెటింగు చేసేవారు. రత్నమ్మగారి మీద రకరకాల నేరాలు మోపి బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారి అరెస్టుచేసి జైలుకు పంపింది. నాగయ్యగారి మీద వుద్యమ ప్రభావం పడలేదు. రాజ్యలక్ష్మి గారు కాంగ్రెస్ మహిళల వెంట తిరగటం పెద్ద తప్పుగా అనిపించలేదు మొదట. స్వంత వూరిలో తమకంటె వున్నత కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు, వయసులో రాజ్యలక్ష్మి గారి కంటె పెద్దవారు వుద్యమంలో పనిచేస్తూ వుండటం చూస్తూనే వున్నారు గనుక అభ్యంతరం పెట్టలేదు. ప్రోత్సాహము యివ్వలేదు.
గొళ్లమూడి రత్నమ్మగారి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు నిర్వహింపబడేవి. వీరులపాడు నుండి సూర్యదేవర వారి కోడలుగా, వరుసకు అక్క, తోడికోడలు తనకంటె పది సంవత్సరాలు పెద్దదయిన అన్నపూర్ణమ్మగారితో కలిసి 1932లో సత్యాగ్రహంలో పాల్గొన్నారు రాజ్యలక్ష్మి గారు. అప్పటికి 18 సంవత్సరాలు నిండి మేజరయ్యారు. రత్నమ్మగారు, అన్నపూర్ణమ్మగారు, రాజ్యలక్ష్మిగారు చేపట్టిన సత్యాగ్రహాన్ని తిలకించటానికి చుట్టుప్రక్కల గ్రామాలనుంచి ప్రజలు తరలివచ్చారు చేబ్రోలుకు. ఆ రోజుల్లో మహిళలు అలా చేయటం వింతగాను, ఆశ్చర్యంగాను వుండేది. ముగ్గుర్ని పొన్నూరు జైలుకు తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ ముగ్గురికి కఠినశిక్ష విధించారు. ఇంటికి వెళ్లిన మెజిస్ట్రేట్ గారి మీద ఆయన భార్య వత్తిడి ఎక్కువయింది. పాపం! ఆడపిల్లలకు కఠినశిక్ష వేయటమేమిటని గోలపెట్టిందట. అందుచేత సాధారణ శిక్షగా మార్పుచేసి ముగ్గురిని రాయవేలూరు జైలుకు పంపారు. అక్కడ అంతకుముందునుంచే గుమ్మిడిదల దుర్గాబాయమ్మ గారు, వారి అమ్మ కృష్ణవేణమ్మ గారు వున్నారు. పొన్నూరు జైలులో వున్న మూడురోజులు వారికి యిండ్లనుంచే భోజనం వచ్చేది. రాయవేలూరులో జైలు భోజనం మొదలయింది. మానవమాత్రులు తినతగినది కాదని వారికి తెలిసిపోయింది. కృష్ణవేణమ్మగారి దగ్గర జైలులోని సత్యాగ్రహ స్త్రీలు హిందీ నేర్చుకునే వారు. వారితోపాటు రాజ్యలక్ష్మి గారు కూడ హిందీ చదువుకున్నారు. సంవత్సరం రాయవేలూరులో వున్న తర్వాత మద్రాసు జైలుకు పంపారు. ఆరుమాసాల తర్వాత 1933లో విడుదలయి వచ్చారు.
హిందీ అని వాడుకగా అందరూ అంటున్న ఆ భాషను గాంధీజీ ‘హిందూస్తానీ’ అనేవారు. ‘హిందూస్తాన్’ మనదేశం పేరుగావున ఆ దేశ ప్రజలందరి సమైక్యభాష అవాలని బాపూజీ ఆశించారు. హిందూస్తానీ భాషలో ఉర్దూ, ఫారసీ, అరబ్బీ భాషాపదాలతోపాటు అన్ని భారతీయ ప్రాంతాల భాషా పదాలను చేర్చి అన్ని విధాల ‘హిందూస్తానీ’ని పరిపుష్టం చేయాలనుకున్నారు. మద్రాసులో ‘దక్షిణ భారత హిందూస్తానీ’ కార్యాలయాన్ని తెరిచారు. ఆ భాషాభివృద్ధి కొఱకు దక్షిణాది కార్యకర్త మోటూరి సత్య నారాయణగారినే కార్యదర్శిగా నియమించారు. సత్యనారాయణగారు ఆ భాషకు అపారమైన సేవలందించారు. హిందీభాషా ప్రచారం వూపందుకుంది. జాతీయవాదులైన కొంతమంది హిందీపండితులు దక్షిణాదికి వచ్చారు. వారు పొట్ట పోసుకోవటానికి వచ్చినవారు కాదు. మహాత్ముని పిలుపునందుకొని ఆ భాష ప్రచారానికి, బోధించటానికి వచ్చిన దేశభక్తులు. వారిలో వ్రజనంద శర్మ, తేజనారాయణశాస్త్రి, పండిట్ రామానందశర్మ, కృష్ణదేవ్గారు ముఖ్యులు. వీరు గ్రామాలలో కూడ హిందీ నేర్పేవారు. చేబ్రోలులో కృష్ణదేవ్గారి దగ్గర రాష్ట్రభాష, తెనాలిలో వ్రజనందశర్మ గారి దగ్గర విశారద చదివి రాజ్యలక్ష్మిగారు ఉత్తీర్ణులయ్యారు. గొళ్లమూడి రత్నమ్మగారి సహాయ-సహకారాలు అన్నివేళలా రాజ్యలక్ష్మిగారికి అందుతూ వుండేవి. ఇరువురూ కలసి చేబ్రోలులో హిందీ పాఠశాలను ప్రారంభించారు. లోకనాయక్ అవార్డు గ్రహీత, ఆంధ్రదేశంలో పేరుప్రతిష్ఠలు పొందిన ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవిగారు ఆ పాఠశాల విద్యార్థినియే. నూలు వడకటం కూడ నేర్పించేవారు. చేబ్రోలులో వెఱ్ఱెమాంబ పేరుతో మహిళా గ్రంథాలయం స్థాపించి రత్నమ్మగారు అధ్యక్షులుగాను, రాజ్యలక్ష్మిగారు కార్యదర్శిగాను పనిచేశారు. వీరులపాడులో ఆమె రెండవ అన్నగారు రాఘవయ్య – వారి సతీమణి విశాలాక్షమ్మగారు కూడ జాతీయోద్యమములోనికి అడుగుపెట్టారు. ఆ దంపతులు ఆ రోజుల్లో చేపట్టిన అస్పృశ్యతనివారణ అత్యంత శ్లాఘనీయమైనది. వారి యింటి మంచినీళ్ల బావినుంచి హరిజనులను నీళ్లు తోడుకోనిచ్చారు. వారి ఇంటిలో జరిగే ఉత్సవాలకు స్వకులంవారితో పాటు హరిజన స్త్రీలను కూడ పేరంటానికి పిలిచి అందరితోపాటు వారి కాళ్లకు కూడ విశాలాక్షమ్మగారు పసుపు పూసేవారు. రాజ్యలక్ష్మిగారు బొట్టు, గంధం, పూలు, పండ్లు పంచేవారు. అందుకు స్వకులంవారినుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. అయినా ఆ దంపతులు జంకలేదు. వెనుకడుగువేయలేదు.
1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమయింది. బ్రిటిష్ పాలకులు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మనదేశాన్ని యుద్ధరంగంలోనికి దింపింది. కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి వ్యతిరేకంగా 1941లో గాంధీజీ వ్యష్టి సత్యాగ్రహం చేపట్టారు. మొట్టమొదటి వ్యష్టి సత్యాగ్రహిగా వినోబాభావేని బాపూజీ నిర్ణయించారు. దేశమంతటా వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొనేవారిని జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. గుంటూరు జిల్లాలో మహిళల్లో మొట్టమొదటి వ్యక్తిగా రాజ్యలక్ష్మిగారు ఎన్నికయ్యారు. 25 సంవత్సరాల పిన్నవయసులోనే రాజ్యలక్ష్మిగారికి ఆ గౌరవం దక్కటం ఆమెచేసిన త్యాగాలకు, సేవలకు ప్రతీక అని చెప్పవచ్చు. జనవరి 30, 1941న బ్రాహ్మణకోడూరులో రాజ్యలక్ష్మిగారు వ్యష్టి సత్యాగ్రహం చేస్తారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆమె సత్యాగ్రహపత్రం చదువుచుండగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్టు చేసి ఆ రాత్రి ఒంగోలు జైలుకు తీసికెళ్లారు. ఈసారి రెండు మాసాల శిక్ష నూరు రూపాయల జరిమానా విధించి ‘ఎ’ క్లాసు యిచ్చి రాయవేలూరు జైలుకు పంపారు.
అక్కడ భారతీదేవి రంగా, ఆచంట రుక్మిణమ్మ, రాధాబాయి సుబ్బరామన్, కుట్టిఅమ్మాళ్ మొదలయినవారున్నారు. జైలులో రాజ్యలక్ష్మిగారు మహిళా సత్యాగ్రహీకులకు హిందీ నేర్పుతూ, తాను రాధాబాయి సుబ్బరామన్‌గారి దగ్గర ఇంగ్లీషు నేర్చుకోవటం మొదలుపెట్టారు. రాధాబాయిగారు శకుంతల నాటకం ఖైదీలచేత ప్రాక్టీస్ చేయించి ప్రదర్శింపజేశారు. రాజ్యలక్ష్మిగారు దుష్యంతుని పాత్ర ధరించారు. ముల్చూరి చుక్కమ్మగారు విడుదలయి మద్రాసు వెళ్లేప్పుడు ఆంధ్రమహిళాసభలో బెనారస్ మెట్రిక్ చదవటానికి వస్తానని దుర్గాబాయమ్మగారికి వర్తమానం పంపారు. జైలునుండి విడుదలయి మద్రాసు స్టేషన్లో దిగిన రాజ్యలక్ష్మిగారిని దుర్గాబాయమ్మగారు స్టేషన్‌కి వచ్చి ఆంధ్రమహిళాసభకి తీసికెళ్లారు. ఆమె కోరిక ప్రకారం అక్కడ వుండి చదువుకోవటం సాధ్యపడలేదు. స్త్రీవిద్యావశ్యకతను గుర్తించి యెంత ప్రయత్నించినా కుటుంబపరంగా ఆర్థికసహాయం అందకుండపోయింది. పట్టువదలని రాజ్యలక్ష్మిగారు మద్రాసునుంచి తెనాలి వచ్చి బెనారస్ మెట్రిక్ చదివి కృతార్థుల య్యారు. 1921 నుండి 1942 వరకు జరిగిన అన్ని స్వాతంత్య్ర వుద్యమాలలో పురుషులతోపాటు స్త్రీల భాగస్వామ్యం కూడ ఎక్కువయింది. చేబ్రోలు పట్టణ కాంగ్రెస్ కమిటీకి రాజ్యలక్ష్మిగారు అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డారు. పట్టణంలో కొమ్ములు తిరిగిన హేమాహేమీలైన అనేకమంది పురుషపుంగవులుండగా ఒక స్త్రీ ఎన్నికవటం పురుషులకు మింగుడుపడలేదు. వారి పురుషాహంకారం దెబ్బతిన్నది. కార్యదర్శిగా వుండటానికి ఎవరూ ముందుకు రాలేదు. సీతారావమ్మగారనే కార్యకర్తను కార్యదర్శిగా నియమించుకొని పట్టణంలో పార్టీ పటిష్ఠత కొరకు రాజ్యలక్ష్మిగారు నడుం బిగించి ముందుకు సాగారు. పనిచేయటానికి, త్యాగాలు చేయటంలోను పురుషులకు ఏమాత్రము తీసిపోకుండ అగ్రశ్రేణిలో నిలబడినప్పటికి పదవులు చేపట్టవలసి వచ్చినపుడు ఎంత పోటీ వుంటుందో అప్పుడేగాక స్వాతంత్య్ర తదనంతరం కూడ రాజ్యలక్ష్మిగారికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. ఆంధ్రరాష్ట్రంలో జె.పి. వుద్యమ నిర్వహణకు అయిదుగురు సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసారు. అందులో ఒక సభ్యురాలు రాజ్యలక్ష్మిగారు. శాసనోల్లంఘన కార్యక్రమానికి సారథ్యం వహించారు. 1942 నాటి ఆగష్టు విప్లవోద్యమంలో రహస్య జీవితంలోనికి వెళ్లిపోయి తిరుగుబాటుకు నిండు యౌవ్వనంలో వున్న యువతి నాయకత్వం వహించటం చరిత్రలో ఒక అపూర్వఘటన.
అరెస్టు వారంటు జారీ అయింది. అది పట్టుకొని పోలీసులు అన్వేషణ మొదలెట్టారు. పోలీసులకు అంతుదొరకకుండ అనేక రకాల మారువేషాలతో జిల్లాలలో పర్యటిస్తూ ప్రభుత్యంపై తిరుగుబాటును పురికొల్పుతూ గడిపారు. ”ఆగష్టు విప్లవోద్యమంతో అరుణా అసఫాలీలాగ అజ్ఞాతజీవితం గడుపుతున్నారని” ఎవరైనా అంటే ”అంత పెద్ద మహనీయురాలుతో తనను పోల్చవద్దని” సవినయంగా జవాబు చెప్పేవారు. ఆమె పురుషవేషం ధరిస్తే ఆమెను ఎరిగివున్నవారు కూడ గుర్తించలేకపోయేవారు. రాజ్యలక్ష్మిగారి అమ్మగారు అనారోగ్యం పాలయ్యారు. అవసానదశలోవున్న అమ్మను చూడటానికి తప్పక వస్తారని పోలీసులు వీరులపాడులో మకాంవేసి అన్నివైపులా కాపలా కాస్తున్నారు. అయినా వారి కళ్లుగప్పి ఏదో విధంగా మామూలు వేషంలోనే తల్లి మంచం దగ్గరకు చేరారు. మంచంలో కూర్చుని తల్లితో మాట్లాడసాగారు. బయట కిటికీలోనుంచి చూచిన పోలీసులు మంచం ప్రక్కన మరో మనిషి వున్నట్లు గ్రహించారు. ఆమె తప్పక రాజ్యలక్ష్మిగారేనని తలచారు. వారికన్న ముందే పోలీసుల వాసన పసిగట్టిన రాజ్యలక్ష్మిగారు క్షణంలో అక్కడనుంచి తప్పించుకున్నారు. దొడ్డి దోవకుండ ఒక యింటిలోనుంచి మరోయింటిలోనికి ప్రవేశిస్తూ నాలుగైదు యిళ్ల తర్వాత ఒకరి యింటిలో అటకపైకి ఎక్కి దాక్కున్నారు. ఆ రాత్రంతా అటకపైనే వున్నారు. పోలీసులు ఆ రాత్రంతా వూరిలోనుంచి ఎవ్వరిని బయటకెళ్లకుండ కాపలా కాసారు. ఎవరినడిగినా కొత్తవారెవరూ రాలేదని, తాము చూడలేదని చెప్పారు. సాధారణంగా రైతులు- కూలీలు వ్యవసాయ పనులకు తెల్లవారుఝామునే బయలుదేరి పొలాలకు వెళతారు. నాగళ్లు కొటేరు వేసుకొని, పలుగులు, పాఱలు, కొడవళ్లు పుచ్చుకుని బయలుదేరుతారు. వ్యవసాయ కూలీలు ఆడవారు కూడ తట్టా-బుట్టా పట్టుకొని, చెంబులతో నీళ్లు తీసుకొని పొలాలదిక్కు వెళతారు. రాజ్యలక్ష్మిగారు కూడ మహిళాకూలీగా వేషం వేసుకొని, తట్టా-బుట్టా చెంబు తీసుకొని ఆడకూలీలలో కలసి బయటకు వెళ్లిపోయారు. దాగుడుమూతలాడుతున్న రాజ్యలక్ష్మిగారిని అరెస్టు చేయడం పోలీసులకు సాధ్యమవలేదు. 1945లో రెండవ ప్రపంచ మహాయుద్ధం ముగిసింది. నాయకులంతా జైళ్లనుంచి విడుదలయి బయటకొచ్చారు. రాజ్యలక్ష్మిగారు కూడ రహస్య జీవితం నుంచి బయటపడ్డారు. రాజ్యలక్ష్మిగారి వివాహం జరిగి 20 సంవత్సరాలయింది. ”ఆమె యిష్టమొచ్చినట్లు ఆమెను చేసుకోనియ్” అని మొదట్లో చెప్పిన నాగయ్యగారిని నలుగురూ నాలుగు విధాలుగా ఎక్కదోయటం మొదలయింది. ”ఏం చెయ్యమంటారు? వూళ్లోవాళ్లు అందరూ జైజైలు కొట్టి నెత్తినెక్కించుకొని వూరేగుతూంటే” అని జవాబు చెప్పే నాగయ్యగారు మిత్రుల పితూరీలకు చెవియొగ్గారు. ”వూళ్లోవాళ్ల సంగతి నీకెందుకు? నీ సంగతి నీవు చూచుకో. నష్టమెవరికి” అని చెవిని యిల్లు కట్టుకొని పోరు మొదలుపెట్టారు. వారి మాటలు నాగయ్యగారి మీద పనిచేసినయ్. అయినా ముభావంగా వుండసాగారు. 1945 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు, భారతీదేవి రంగా, గొళ్లమూడి రత్నమ్మగార్ల సహాయంతో చేబ్రోలులో ఆంధ్రరాష్ట్ర మహిళా రాజకీయ పాఠశాలను రాజ్యలక్ష్మిగారు ఏర్పాటుచేశారు. ముందుగానే కల్లూరి చంద్రమౌళి గారితో సంప్రదించారు. చంద్రమౌళిగారు జైలులోవున్న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంగారిని కలిసి రాజకీయ పాఠశాలను గురించి నచ్చచెప్పారు. విడుదలయి వచ్చిన ప్రకాశంగారిని చూడటానికి గొళ్లమూడి రత్నమ్మగారిని తీసుకొని వెళ్లింది. ప్రకాశంగారు పాఠశాల నిర్వహణకు వెయ్యిరూపాయలు విరాళమిచ్చారు.
వాస్తవానికి ఆమె విరాళం కొరకు వెళ్లలేదు. రాజకీయ పాఠశాలకు ప్రకాశంగారిని ఆహ్వానించటానికి వెళ్లారు. అదే సంగతి వారికి చెప్పి పాఠశాలకొచ్చే వాగ్దానం పొంది తిరిగొచ్చారు. కళా వెంకట్రావుగారు పాఠశాలను ప్రారంభించారు. కల్లూరి చంద్రమౌళిగారు, మానికొండ సత్యనారాయణగారు మొదలగు నాయకులంతా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 45 రోజులు రాజకీయ పాఠశాల దిగ్విజయంగా నడిచింది. అన్ని జిల్లాలనుండి 75 మంది విద్యార్థి-విద్యార్థినులు వచ్చారు. అన్నాప్రగడ కామేశ్వరరావుగారు మహిళా విద్యార్థినులకు డ్రిల్ నేర్పుతూ పురవీధులలో వారిచేత కవాత్ చేయించేవారు. యస్.కె. పాటిల్, కమలాదేవి చటోపాధ్యాయలాంటివారు వచ్చి వుపన్యాసాలు యిచ్చేవారు. అన్నమాట ప్రకారం ప్రకాశం పంతులుగారు పాఠశాలను దర్శించారు. పాఠశాల నిర్వహణ పూర్తయింది. 1946లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ప్రకటించబడ్డాయి. కాంగ్రెస్ టికెట్ ఎవరికివ్వాలని చర్చించటానికి వెంకటప్పయ్య (కొండా) పంతులు గారితో కలసి వల్లభాయ్ దగ్గరకు ఢిల్లీ వెళ్లారు రాజ్యలక్ష్మిగారు. మహిళా అభ్యర్ధిగా వల్లభనేని సీతామహాలక్ష్మమ్మగార్కి టికెట్ యివ్వటం జరిగింది. రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి. సేవ చేయటానికి త్యాగగుణం కలిగివుండాలి. అధికారం కోసం ప్రాకులాడటానికి స్వార్ధం వుంటే మాత్రం చాలు. రాజ్యలక్ష్మిగారి రాజకీయ ఎదుగుదలను ఓర్చలేనివారు నాగయ్యగారికి ఆమెపై చాడీలు చెప్పటం ఎక్కువ చేశారు. ఎలాగైనా ఆమెను కట్టడి చేయాలనుకున్నారు. వారి మాటలకు నాగయ్యగారు ప్రభావితులయ్యారు. తండ్రి మరణవార్త విని రాజ్యలక్ష్మిగారు వీరులపాడు వెళ్లారు. నాగయ్యగారు వెళ్లలేదు. తిరిగి చేబ్రోలు వచ్చారు రాజ్యలక్ష్మిగారు. ఇంటికి తాళం దర్శనమిచ్చింది. తాడో-పేడో తేల్చుకోవటానికి తాళం వేసారు నాగయ్యగారు. విషయం అర్థమయింది రాజ్యలక్ష్మిగారికి. వెనుతిరిగి ఆ వూరిలోనే వున్న పినతల్లి యింటికి వెళ్లింది. ఉద్యమాలనుంచి వెనుదిరుగలేదు. మడమతిప్పని మహిళాయోధురాలుగా రాటుతేలింది. వీరులపాడు నుంచి అన్న రాఘవయ్యగారు పరుగెత్తుకుంటూ వచ్చారు. పెద్దలు, బంధువులు అంతా చేరారు. ఎంత ఆలోచించినా దాంపత్య జీవితం తన బాటకు ప్రతిబంధకంగానే తోచింది ఆమెకు. బంధుజనుల నుద్దేశించి ”మీరంతా కలసి ఏం తేలుస్తారో తేల్చండి” అన్నారు. ”ఏం తేల్చమంటావమ్మా – దంపతులను విడదీసి పాపాన్ని మూటకట్టుకోమా? అన్నారు పెద్దలు. ”అది పాపం కాదు – మా యిద్దరికి మేలు చేసిన పుణ్యమే మీకు దక్కుతుంది. బిడ్డాపాపలతో ముచ్చట తీరక ఆయన, బిడ్డాపాపలే జీవితలక్ష్యం కాదనుకొనే నేను ఎవరి లక్ష్యం నెరవేరని మా బ్రతుకులు యిట్లా కొనసాగటానికి యిక వీలులేదు” అని గట్టిగా చెప్పారు రాజ్యలక్ష్మిగారు.
ఆమె పుట్టినింటి నుంచి తెచ్చిన ఆస్తి చాలా వుంది కనుక సగం పంచమన్నారు కొందరు. అదేలా సాధ్యం? కాపురాన్ని ఆమె వద్దనుకుంది గనుక భరణం మాత్రమే యివ్వాలన్నారు కొందరు. చివరకు భర్త ఆస్తిలో మూడవవంతు యిచ్చేలాగ వొప్పందం కుదిరింది. దంపతులు విడిపోయారు. ఆమె వైవాహిక జీవితం ఆ విధంగా ముగిసింది. తిరిగి వీరులపాడు అన్నగారి యింటికొచ్చారు. సంపూర్ణ ఆదరణ లభించింది. వీరులపాడు మహిళలు సాదర స్వాగతం పలికారు. ఆ సంవత్సరం జరిగిన స్వాతంత్య్ర వుత్సవాలలో సంతోషంగా పాల్గొనలేకపోయారు రాజ్యలక్ష్మిగారు. వివాహ విచ్ఛిత్తి మనసులో ఒక మూల ముల్లులాగ గుచ్చుకుంటూనే వుంది. ఆమె సమ్మతితోనే జరిగినా కాని. ఇది గ్రహించిన వీరులపాడు మహిళలు రాజ్యలక్ష్మిగారిలో వుత్సాహం కలిగించటానికి మద్రాసులో జరిగే ఆంధ్రరాష్ట్ర రాజకీయ మహాసభలకు రాజ్యలక్ష్మిగారితో కలిసి వెళ్లారు. రాజ్యలక్ష్మిగారి వెంట వదిన విశాలాక్షమ్మ గారు కూడ వెళ్లారు. వారందరిని దుర్గాబాయమ్మగారు ఆహ్వానించి విందుచేసి సత్కరించారు. ఆ మహిళలంతా దుర్గాబాయమ్మగారు నడుపుతున్న ఆంధ్రమహిళాసభను చూచి అత్యంత ఆనందభరితులయ్యారు. ఆ సభలను తిలకించిన రాజ్యలక్ష్మిగారికి తాను చేయవలసినదేమిటో అవగతమయింది. వివిధ రాష్ట్రాలలో చెల్లాచెదురైవున్న తెలుగు వారందరిని ఒకేచోటుకు చేర్చే భాషారాష్ట్ర నిర్మాణావశ్యకతకు సంకల్పం చేకూర్చుకొని తిరిగి వుత్సాహాన్ని నింపుకొని ముందడుగు వేశారు రాజ్యలక్ష్మిగారు. వీరులపాడునుంచి వచ్చిన మహిళలందరిని యిళ్లకు పంపి తాను ఒక్కరే విజయవాడలో దిగబడిపోయారు. ఆ రోజుల్లో విజయవాడలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యాలయం ఒకటి వుండేది. రాజ్యలక్ష్మిగారు ఆ కార్యాలయానికి వెళ్లారు.
1947 ఆగష్టు 15న దేశం స్వతంత్రమయింది. అదేరోజు దేశం రెండు ముక్కలయి పాకిస్తాన్ ఏర్పడింది. దేశంలోని స్వదేశీ సంస్థానాలన్ని భారత యూనియన్‌లో కలసిపోయాయి. కాని హైదరాబాద్ సంస్థాన నవాబు, కాశ్మీర్ రాజు తాము స్వతంత్రులమని భారత యూనియన్‌లో కలవమని భీష్మించుకొని కూర్చున్నారు. కాశ్మీర్ ప్రజల తరపున షేక్ అబ్దుల్లా, హైదరాబాద్ సంస్థాన ప్రజల తరపున స్వామీ రామనంద తీర్థ సంస్థానాల విలీనానికి తీవ్రమైన కృషి చేశారు. స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు ప్రాంతీయ కార్యాలయాలు సరిహద్దు ప్రాంతాలలో ఏర్పడినవి. తెలంగాణా ప్రాంతీయ కార్యాలయం విజయవాడలోను, మహారాష్ట్ర కార్యాలయం బొంబాయిలోను, కర్నాటక ప్రాంతీయ కార్యాలయం గడగులోను ఏర్పడినవి. ఆంధ్రప్రాంతంనుంచి ఆచార్య రంగాగారు, అయ్యదేవర కాళేశ్వరరావుగారు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయానికి ఇతోధిక సహాయ-సహకారాలు అందించారు. విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయం వి.బి.రాజుగారు, హయగ్రీవాచారిగారు, మాడపాటి రామచంద్రరావుగారు నడిపేవారు. రాజ్యలక్ష్మిగారు ప్రాంతీయ కార్యాలయానికెళ్లినపుడు స్టేట్ కాంగ్రెస్ నాయకులెంతో సంతోషించారు. తెలంగాణా జిల్లాల సరిహద్దులలో గల కర్నూలు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలో రాజ్యలక్ష్మిగారు సంస్థాన ప్రజల పోరాటాన్ని గురించి ప్రచారం చేసి, సభలు-సమావేశాలు ఏర్పాటుచేసి విరాళాలు వసూలుచేసి విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో యిచ్చేవారు. ఆ రోజుల్లో ప్రసిద్ధ గాయకురాలుగా తెలుగునాట పేరుప్రఖ్యాతుల నార్జించిన టంగుటూరి సూర్యకుమారిగారి గానకచేరీలను రాజ్యలక్ష్మిగారు ఏర్పాటుచేసి వచ్చిన ధనాన్ని ప్రాంతీయ కార్యాలయంలో విరాళంగా యిచ్చేవారు. ఆంధ్రప్రాంతం నుండి మొట్టమొదట నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన హైదరాబాద్ విముక్తి పోరాటానికి సహాయ-సహకారాలందించి చేయూత నిచ్చిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాజ్యలక్ష్మిగారే! ”మన పోరాటపు అంతిమలక్ష్యం తెలుగువారందరితో కలసిన ప్రజాప్రభుత్వం యేర్పడటం గనుక దానిని ప్రజలలో ప్రచారం చేయటానికి ఒక వారపత్రికన్నా అవసరం” అని విజయవాడలో వున్న తెలంగాణా కాంగ్రెస్ నాయకుల దగ్గర రాజ్యలక్ష్మిగారు తన అభిప్రాయం వెలిబుచ్చారు. ”విజయవాడ నుంచి మీరా పనివెంటనే మొదలుపెడితే సంస్థాన ప్రజల తరపున సంపూర్ణ సహాయమందిస్తాం” అని వి.బి.రాజు, మాడపాటి రామచంద్ర రావుగారు మాట యిచ్చారు. 1948 జూన్ 8న ‘తెలుగుదేశం’ పేరుతో వారపత్రిక మొదటి సంచిక వెలువడింది. దాని తర్వాత దాదాపు 35 సంవత్సరాల తర్వాత యన్.టి.రామారావుగారు అదే పేరుతో పార్టీ స్థాపించి రాజకీయరంగప్రవేశం చేశారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమయింది. రాజ్యలక్ష్మిగారు తన కార్యక్రమాలను హైదరాబాద్‌కు మార్చారు. పత్రికను అక్కడనుంచే నడపటం మొదలుపెట్టారు. ఆంధ్రప్రాంతంలో ఏ సేవాదృష్టితో పనిచేశారో అదే సేవాభావంతో అంకితమయి హైదరాబాద్ ప్రాంతంలో కూడ స్టేట్ కాంగ్రెస్‌లో పనిచేశారు. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థాన గ్రామీణ ప్రజలు, భూమిలేనివారు భుక్తికోసం భూపోరాటం చేపట్టారు. అది దేశ ప్రజలందరి సానుభూతిని పొందింది. ఆ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. స్టేట్ కాంగ్రెస్‌లోని ఒక వర్గం భూపోరాటానికి వ్యతిరేకంగా, దేశ్‌ముఖుల, జాగీర్దార్ల, భూస్వాముల కొమ్ముకాసింది. మరో వర్గం పేదరైతులు భుక్తికోసం జరిపే భూపోరాటపు ఆవశ్యకతను గుర్తించి దానిని పరిష్కరించాలనుకుంది. వారికి స్వామి రామానంద తీర్థ నాయకత్వం వహించారు. చిత్తశుద్ధితో పరిష్కారానికి పూనుకున్నారు. సమస్యలకు మూలకారణాలేమిటో తెలిసి కూడ ప్రభుత్వపరంగా ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం కావటంలేదో నెహ్రూకి విశదీకరించి చెప్పారు. ఫలితంగా నెహ్రూజీ హైదరాబాద్ వచ్చినపుడు కమ్యూనిస్టులు పంపకం చేసిన భూముల విషయంలో తొందరపడి ఆ భూముల్ని తిరిగి దేశముఖ్‌లకు, జాగీర్దార్లకు స్వాధీనం చేయవద్దని చెప్పారు. కాని పండిట్జీ చెప్పిన మాటలు నెరవేరలేదు. నెహ్రూలాంటి నాయకుడే సమాజంలో మార్పును వ్యతిరేకించే అభివృద్ధి నిరోధక శక్తులకు లొంగటం ఆశ్చర్యంగా వుందని రామానందతీర్థ పేర్కొన్నారు. 1950లో హైదరాబాద్ నుంచి ‘తెలుగుదేశం’ పత్రిక ప్రారంభమయింది. ప్రకాశం పంతులుగారు పత్రిక ప్రారంభోత్సవం చేశారు. ‘తెలుగుదేశం’ పత్రికాధిపతిగా జాతీయోద్యమములో పాల్గొన్న మహిళయే కాకుండ రాజ్యలక్ష్మిగారు కాంగ్రెస్‌పార్టీకి చెందినామె. భూపోరాటానికి మద్దతు పలికితే కమ్యూనిస్టులను బలపరచటమవు తుంది. కాంగ్రెస్వాదియై ఆ వార్తలను ప్రచురించటం ఏమిటన్న ప్రశ్నను స్వంతపార్టీ నుంచి ఎదుర్కోవలసి వచ్చింది. చివరకామె భూమికోసం పోరాడేవారి పక్షానికి చెందిన వార్తలు ప్రచురించటం ప్రారంభించింది. పత్రిక తెలుగువారందరూ కలసిన ‘తెలుగుదేశం’ యేర్పడవలసిన ఆవశ్యకతను తెలియజేసే వ్యాసాలతో వెలువడసాగింది. త్రిపురనేని గోపీచంద్‌గారు వారం వారం దేశరాజకీయాలను ఒక పేజీనిండా రాసేశారు. అజంతా, రాంభట్ల కృష్ణమూర్తిగారు ప్రముఖ రచయితలెందరో ఈ పత్రికలో పనిచేశారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags